మా అమ్మ సెమత్కారం  

  మా అమ్మంటే నాకిష్టమని చెప్పానుగదా! చిన్నప్పుడు ఎప్పూడూ అమ్మతోనే ఉండీ వాడిని. ఒక్క బడిలో ఉన్నప్పుడు తప్ప. ఎక్కడికి వెళ్లినా ఎప్పూడూ మా అమ్మ చెయ్యి పట్టుకునే నడిచే వాడిని. అది చూసి మా మేనత్త బుచ్చెమ్మ చాలాసార్లు నాతో హాస్యమాడేది.

బుచ్చెమ్మ మా అయ్యకు పిన్నమ్మకూతురు. మా అమ్మకు మరో మేనత్త కూతురున్నూ. ఊరిలోనే గోర్జ అప్పలస్వామికి ఇచ్చారు.

ఎప్పుడైనా కళ్లానికి వెళ్లినప్పుడైనా లేదా ఏదో పొలంలో కనపడినా

“అవున్రా..కుష్ణా! మీయమ్మ నిన్నొగ్గీసి ఎక్కడకైనా ఎలిపోతాదని బయ్యమేట్రా! నేప్పోతే మీయమ్మని మెమెవులుమైనా ఎత్తుకు పోతామని బెంగా!?” అని నా బుగ్గలు చీరీది.

అలాంటప్పుడు “ఆ…వ్వెవ్వె” అని వెక్కిరించీవాన్ని తప్ప ఏమీ మాట్లాడేవాన్ని కాదు.

ఒకసారి మేము కోమటిపల్లి గుడ్డెలమీదికి సెలక్కాయలు ఏరడానికి వెళ్లాము. నేను అప్పటికి నాలుగో ఐదో చదువుతున్నాను.

సహజంగా సెనక్కాయలు మెట్టుభూమి మీదనే పండించేవారు. అది మెట్టుపంట. వైశాఖ జ్యేష్ఠ మాసాలలో వర్షాలు పడితే మెట్టుమీద వేసేవాళ్లు. అది ఆరుమాసాలపంట. ఒక్కోసారి దసరావరకూ కాయలు ఏరడము ఉండేది. అటువంటప్పుడు దసరా సెలవుల్లో నేనూ మా సీతప్ప సెనక్కాయలు ఏరడానికి వెళ్లేవాళ్లము.

మేమెక్కువగా మా పెద్దమ్మగారి గుడ్డిమీద,మాపొరుగు కొల్లోలు (ఉప్పోలంతారు)  పడుకు గుడ్డెల మీదా ఏరడానికి వెళ్లేము.

మాకైతే ఒక ముప్పై సెంట్లే మెట్టుభూమి వుండేది. నిజానికి మా వూరికే మెట్టు భూమి తక్కువ. పల్లపుభూమి ఎక్కువ. అందులోన జనపనారకు ధరవుందంటే జనువులె చల్లేసేవాళ్ళు. దాంతో వేరుసెనక్కాయలు, తినడానికి కూడా మాకు దొరికేవికావు.

అందుకని మా అమ్మ..అలాగే మరి కొందరు, ఆడవాళ్లంతా జట్టు అయి పక్కవూర్లలో- కుమందాన పేట, కోమటిపల్లి,మొదలయిన ఊర్లలో శనక్కాయలు ఏరడానికి వెళ్లేవారు. ముఖ్యంగా ఉత్తరానున్న కోమటిపల్లి వారు ఎక్కువ వేరుసెనగ పంట వేసేవారు.

ఒకటి రెండేళ్లు ‘ఆకులకట్ట ‘ గ్రామము వరకూ వెళ్లారు. ఆకులకట్ట మావూరికి దక్షిణం వైపు సుమారు పది పన్నెండు కిలోమీటర్ల దూరముంటుంది. ఆ ఊర్లవారికి మెట్టు భూములు ఎక్కువ.

సెలవులైతే మమ్మల్ని తీసుకెల్లేది మా అమ్మ కాయలు ఏరడానికి.ఉదయాన్నే చీకటి తోటి బయల్దేరి వెళ్లేవాళ్లము, మధ్యాన్నానికి గంజన్నము లేదా అంబలైనా పట్టుకొనేవారు.

ఆవూరి గుడ్డెలమీద పడి తిరిగేవాళ్లం. ఏ రైతైనా పిలిస్తే వాళ్ల చేనులోకి దిగి కాయలు ఏరేవాళ్లము. ఎనిమిదికుంచాలు ఏరితే కుంచెడుకాయలు కూలి. అంటే తొమ్మిది కుంచాలకు ఏరితేగాని కుంచెడు కాయలురావు.పెద్దవాళ్ళు సాయంత్రానికి అలాగ తొమ్మిది పది కుంచాలవరకు ఏరేసేవాళ్లు.

పిల్లలము ఎవరిమైనా నాలుగైదు కుంచాలకంటె ఎక్కువ ఏరలేక పోయేవాళ్లము.

ఆ సంవత్సరం నాకు రెండుసార్లు రొండడ్లు (రెండు అడ్డలు) చొప్పున కూలి కాయలు వచ్చాయి కోమటిపల్లిలో.

సాయంత్రము వరకు ఏరి, కాయలు ఒప్పజెప్పి, మా కూలికాయలు తీసుకొని వచ్చే వాళ్లము.

ఒకరోజు సాయంత్రం అలాగే కోమటిపల్లినుంచి తిరిగి వస్తున్నాము. కుమందానపేట దాటి మావూరి గుడ్డెల మీదికి వచ్చేసరికి పొద్దు ములిగిపోయింది. చుట్టూ జనపగుడ్డెలు. మేము తప్ప పిట్టమనిసి అలికిరి నేడు. ఉన్నవాళ్లంతా పాతికమంది వరకూ ఆడవాళ్లు. అందరూ పెద్దవాళ్లే. అందులో నేనొక్కడినే చిన్నపిల్లాడిని.

నడదారి సన్ననిది. ఒకరు మాత్రమే నడవగలరు. అందరం వరసగా నడుస్తున్నాము. బుచ్చప్ప ముందు నడుస్తోంది వెనక మా అమ్మ, నేను. మా అమ్మచెయ్యి పట్టుకోవడానికి కుదరలేదు.నన్ను ముందు నడవమంది మా అమ్మ. నేనప్పుడు బుచ్చప్పకి మా అమ్మకి మధ్యలో నడుస్తున్నాను.

ఎప్పూడులాగే మామేనత్త బుచ్చెప్ప హాస్యమాడింది నాతో. ఎలాగంటే నడుస్తూ నడుస్తూ ఒకమాటంది.

“అవునర్రా! సీకటి పడిపోతంది కదా! యిప్పుడు గనక ఏదొంగోడో వొచ్చి దారి అడ్డగిస్తే ఏటిసేత్తామూ!” అని

“దొంగోడొచ్చి పట్టుకుపోడానికి ఏటుంది మందగ్గిర!? పట్టుకుపోతే కుంచెడేసి రొండడ్లేసి కూలికి తెచ్చుకున్న సెనక్కాయిలున్నాయి. అవే పట్టుకుపోతాడు” అన్నారెవులో మా వెనకనుంచి.

“ఎవుడే దొంగోడు రానియ్యె.” అన్నారు మరొకలు. మన జనసంఖ్య ఎక్కువన్న ధీమాతో.

“ఒకాలొత్తే ఏటిసెత్తామమ్మా!? ఆడు మొగోడమ్మ! మనమెంత మందుండేట్నాబ మమ్మా! అందరమూ ఆడోలము గదా!” అంది కొల్లోలి ఎరకమ్మ.

“ఓలెరకప్పా! నీకేల బయ్యం మందగ్గిర మాత్రం మొగోడునేడేటే? యిడేటి పెద్ద మొగోడు, మా మేనల్లుడున్నాడ్నేయే” అంది. నాబుగ్గని తనచెయ్యితో పట్టుకు లాగుతూ.

నాకు  కోపమొచ్చింది. నేనాలూసు పట్టకపోయినా, నా వూసుతెత్తారు. అనుకుంటూ నడుస్తు న్నాను.

అక్కడ దారి కొంచెం వెడల్పుకాగానే నేను మళ్లీ మాఅమ్మ చెయ్యిపట్టుకున్నాను ఎప్పటిలాగే.

“ఓ..ఓ.. మొగోడు! పెద్దమొగోడేనప్పా! ఎప్పుడూ అమ్మసెయ్యి పట్టుకొనొగ్గడు గానీ” అంది. మా పారమ్మత్త, బుచ్చెమ్మత్త సెల్లెలే ఈ పారమ్మత్త.

“అవున్రా! ఆ సెయ్యొగ్గరాదురా! మీయమ్మనెవులుం ఎత్తుకు పోమునేరా!” అంది మళ్లీ బుచ్చెమ్మత్త.

నేను లోపల ఉడికిపోతున్నాను చివరికి ఉండలేక అనేసాను.

“ఎమో! ఎత్తుకు పోతారేమో!? ఎవలికి తెలుసు!”

ఆ మాటకు బుచ్చప్ప ఒక్కసారిగా పకపకా నవ్వింది.

“ఆ..మీయమ్మ బంగారమూ! నీకే వుంది అమ్మ..మాకెవులికి అమ్మల్లేరు..మాకు పిల్లలేరు..మరీ!”అంది.

“మాయమ్మ బంగారమే” ధృడంగా నమ్మకమంగా అన్నాను, గొప్ప ఉక్రోషముతో.

“ఆహా! అలాగా!.. అయితే  రేపుట్నించి పెట్టిలపెట్టి తాళామేసీరా మీయమ్మనీ! బయటికొత్తే ఎవులైనా ఎత్తుకు పోతారు. బంగారమంటే మాటలా!..ఎవలికొద్దు!?” అంది బుచ్చెమ్మత్త నవ్వుతూనే.

“నువ్వేమి సెప్పక్కర్లేదునే” అన్నాను. దాంతో అందరూ నవ్వుకున్నారు. ఇంక నన్ను ఉడికించడం ఎక్కువచేసేరు.

“మీ ఇంట్లో పెద్దపెట్టి ఉందో లేదో! సిన్నొదినీ!.. మా యింటికి రమ్మీ! మాయింట్ల పెద్ద బోసానం పెట్టుంది, అందులో పెట్టి తాలామెసేస్తాము. అదైతే సరిగ్గా పడతాది. దొంగోడు మరి తియ్యనేడు.” అని మా అమ్మని అవతలవైపు చెయ్యి పట్టుకులాగింది పారమ్మత్త వెనకనుంచి.

మా అమ్మ నవ్వుతూనే

“నేనంత బోసానాన్నికాన్నే” అంది. నేనంత లావుగా ఏమీలేనులే, అన్న ఉద్దేశంతో

“మీయన్న నాకేమీ రోజూ సేపలు..మాంసాలూ గట్ట పెట్టీనేదు,లావెక్కిపోడానికి” అంది తనేమళ్లీ

అయినా పారమ్మత్త వెనకనుంచి లాగుతోంది.

“హె!ఎల్లూ” అని గసిరేసి చేత్తోని తోసేసాను పారమ్మత్తని. అందరూ నవ్వేరు.

మా అమ్మకూడా నవ్వింది.

“ఆలలాగ అనుకోనీ, నీకెందుకూ! నువ్వేటి మాట్లాడక పల్లక పదా..అనుకోనీ…అనుకోని ఆలే పల్లకుంతారు” అంది. కానీ నాకుమాత్రం కోపం తగ్గడంలేదు.

అదిచూసి మా పారప్ప మళ్లీ మా అమ్మచెయ్యి పట్టుకు లాగింది.

“రా వొదిని..నిన్నెవులైనా ఎత్తుకుపోతే మాయన్నకి పెళ్లాముండదమ్మ! రా..రా!” అంది.

దాంతో మాఅమ్మ అంది.

“మీయన్నకి పెళ్లామెందుకుండదమ్మా!? నేనుపోతే మరొకర్తొత్తాది. పోతే ఈడికే అమ్ముండదు గానీ.” అని

అలా మాట్లాడుకుంటుండగానే వూరొచ్చీసింది. వీధుల్లో కరెంటు బుడ్డీలెలిగి పోయాయి. తెల్లారి కోడిగూసిన జామప్పుడు ఎల్లినవాళ్ళము యిప్పటికి వూర్లోకొచ్చాము గదా!.. అనుకున్నాను.

ఊర్లోకి రాగానే ఎటువాళ్లు అటు చెదిరిపోయారు.

ముందు బుచ్చమ్మత్త, ఆ తర్వాత పారమ్మత్త, వాళ్ల ఇల్లు రాగానే తిరిగిపోయారు. మా ఇంటికి మేం యింకా ముందుకు వెళ్లాలి.

బుచ్చమ్మత్త ఎల్తూ ఎల్తూ ఓమాటన్నాది

“ఒరే కుష్ణా! మరిసిపోకురోయ్! యింటికెల్లగానే పెట్టిలో పెట్టీరోయ్ మీ అమ్మని. ఒకేల పెట్టి కాళీ లేప్పోతే కోలగూడేసి మూసీమీ, నేప్పోతే ఏ పిల్లి అయినా…ఎత్తుకు పోగలదు” అంది.

“వ్..వ్వ్..వ్వ్..వ్వ్” అని వెక్కిరించాను నేను. నాకేమి చెప్పాలో తెలియక

మా అమ్మ నెమ్మదిగా కోప్పడింది నన్ను

“తప్పమ్మా! ఉడుక్కోకూడదు.పెద్దోళ్లని అలాగ ఎక్కిరించకూడదు, మాటకు మాట,  మాటల్తోనే సమాధానం చెప్పాలి” అని చెప్పి

మా యమ్మమాటకేం గానీ..అప్పా! నేనొచ్చానంతే మాత్రం, మీ అమ్మి నెత్తుకు పోగల్ను సుమా! అనురా!” అని గట్టిగా వాళ్లకు వినపడేటట్టుగా చెప్పింది మా అమ్మ.

బుచ్చప్పకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు. ముగ్గురూ నాకంటే చిన్నవాళ్లే.

***

రెడ్డి రామకృష్ణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు