మాకాడేముంది సామి?

సందేలకి అరమడి ఊడ్పుసెక్క
కుర్దలా వొదిలేసిన పాపానికి
కొవ్వెక్కిపోయిన కామందు
కులం పేర అమ్మానాన్నల
బత్తెం గింజల్లో కోతేసి
వాకిలి బయటికి తోసేత్తే
నా కడజాతి గుండెనెవరో
కొక్కుళ్ళు అరిగిపోయి
తుప్పట్టిన అరకొడవలితో
రొప్పుకుంటా కోసేసి
పచ్చి నెత్తురు సిమ్మకుండా
కిత్తనారతో బిగుతుగా కట్టేసి
నిప్పుల పాతరేసినంతగా
పేణం సలుపెక్కిపోతుంది
పెద్దజాతి మైల కుక్కలన్నీ
ఎక్కడ పడితే అక్కడ
అరేయ్ ఒసేయ్ పిలుపులతో
పాయికానా పనులు సెప్తా
ఊరిసివర మర్రిసెట్టుకి కట్టేసిన
మావి సంచుల్లెక్క
వాడ కొసన ఇసిరేసి
అంటు ముల్లకంపలతో
మా బానిస బతుకుల్ని
ఈనాతి ఈనంగా రక్కుతుంటే
జీవముండగానే
బొంతకాకి గుంపులన్నీ
నా పుర్రెకు బొర్రులెట్టి
కూతంతైనా దేబెట్టకుండా
తిరుగుబాటు మెదడునంతా
పడి పడి పోటీ పడి
పొడుసుకు తినేసినంతగా
జీవం కొట్టుమిట్టాడిపోతుంది
ఆనవాయిగా మా జాతిని
మీ కులకావరపు ఊతకర్రల్తో
కుతతీరా కుళ్ళబొడవడానికి
మాకాడేముంది సామి
ఏళ్లకేళ్ళు ఊడిగం సేసి సేసి
వొంగిపోయిన ముసలి నడాలు
నిట్రాట ఇరిగి ఒరిగిపోయిన
సివుకు సిల్లుకుండల్లాటి గుడిసెలు
ఏరోజూ కడుపునిండా ఉడకని
అర్థాకలి సత్తు డేక్షాలు తప్ప
ఈపాలి మాత్రం
మీ దెబ్బపడ్డ పెతీసారీ
మా ఎన్నులు మూకుమ్మడిగా
రొమ్ములిరుసుకు నించుని
పోరుకత్తులకు పదునెడతాయేమో
జర జాగ్రత్త సుమీ.!!
*

పుట్టిల్లు

సిన్న దీపంబుడ్డి సిమ్మే
తోలెమంత ఎలుగు
సీకటేల గుడిసెకి
కాపలా కాయాలని
ఎన్ని దీపాలెలిగిత్తున్నా
సీకటి పుడతానే ఉంటాది
ఎంత దైర్నం లేకపోతే
ఇంట్లోని సీకటంతా
ఎల్తురుకి దొరక్కుండా
దీపం ముడ్డికిందే
నీడల్లే ఆడుకుంటాది సెప్పు
దీప్మోడిపోయాక
కల్లకడ్డడుతున్న సీకటి
నల్ల తాసుపాములా
పడగిప్పాడతానే ఉంటాది
ఆ సిమ్మసీకట్లోనే
ఆకాసం కంబల్ని కప్పుకుంటానా
సుక్కలు సెంద్రుడే కాదు
కునుకు కూడ్తా రాదు
ఎన్ని రేత్రుల్ని బేబేగా
కంటిమడిలో ఊడుత్తున్నా
కలలపంట మాత్రం
ఇయ్యాలకీ పండక
బతుకంతా
కన్నీల్లనే సేపుతున్న కల్లని
ముంజికాయల్లా సెలిపేయాలని
ఒక్కోపాలి
సేనా కుతగా ఉంటాది
సీకటికి పుట్టిల్లైన మాకల్లు
కలల్నాపేత్తాయేమో గానీ
కన్నీల్లని మాత్రం కాదనే
ఇవరం తెలిసొచ్చినాక
కుల్లంతసేపుకి
ఆ సీకటి ఎనకమాలే
నేను కూడా  తెల్లారిపోతాను
*
నా పేరు మిరప మహేష్. ఊరు జగ్గంపేట. కవిత్వమంటే నా దృష్టిలో రాసే వారికి,  చదివే వారికీ రెండు పార్శ్వాల మానసిక స్పందనలు కలిగించేది. సామాజిక బాధ్యత దాని అంతిమ లక్ష్యం కావాలని నమ్ముతాను. అలాంటి కవిత్వం రాయటానికి, చదవటానికి ఇష్టపడతాను. మానవ వికాసం,స్వేచ్చ నా ఆకాంక్ష.
ఇప్పటి వరకూ సుమారు మూడు వందల వరకూ కవితలు రాశాను.కొన్ని కవితలు ఆంధ్రజ్యోతి,సాక్షి, ప్రజాశక్తి, నవ తెలంగాణ దినపత్రికల్లోనూ,, నవ మల్లెతీగ, సాహిత్య ప్రస్థానం,పాలపిట్ట మొదలైన పత్రికల్లోనూ ప్రచురణ అయ్యాయి.
2021 లో ” బువ్వకుండ ” అనే కవితా సంపుటి ప్రచురించాను.
*

మిరప మహేష్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మట్టి భాషకు మల్లె పరిమళం అద్దిన కవిత్వం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు