రచయిత రాజకీయాలకు ఎంతదూరంగా వుంటే అంత మంచిది అనే మాట సాహిత్యలోకంలో వినబడుతుంటుంది. ఈ విషయంపై చర్చ జరుగుతూనే వుంటుంది.
మరి రచయితలైన జర్నలిస్టుల సంగతేంటి అని ఆలోచించినపుడు మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి రచయితలైన జర్నలిస్టులు సాహిత్యరంగంలో తమదైన పాత్రను నిర్వర్తిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో వర్తమాన సాహిత్యంలో రచయితలైన జర్నలిస్ట్‌లు రాయలసీమ నుండి అనూహ్యమైన కృషిచేయడం గమనించవచ్చు.
అయితే జర్నలిస్ట్ రచయితకు మార్క్సిస్ట్ అవగాహన వుంటే జీవితాలను సమగ్రంగా అర్థం చేసుకునే వీలుంటుంది. జీవితాన్ని అన్ని దృక్కోణాల నుంచీ పరిశీలన చేసే అవకాశం వుంటుంది.
చిత్తూరు జిల్లాకు చెందిన ప్రసిద్ధ కథారచయిత కె.సభా దేవదత్తం అనే పక్ష పత్రికను కొన్నాళ్లు నడిపి సంపాదకత్వం వహించారు. విద్వాన్ కె. జయరాం పద్యకవిగా రాణించి తొలకరి అనే పక్ష పత్రికను నడిపి సంపాదకత్వం వహించారు. ఎం.ఆర్. చంద్ర ఓ నీతీ ఉరేసుకో కవితాసంపుటిని వెలువరించిన కవి. పల్లెసీమ అనే వార పత్రికను నడిపారు. ప్రసిద్ధి మాండలిక కథారచయిత నామిని సుబ్రమణ్యం నాయుడు ఆంధ్రజ్యోతి పత్రికలో సంపాదక విభాగంలో పనిచేశారు.ప్రసిద్ద రచయితలు కె.ఎస్వీ, మేర్లపాక మురళి, ఆంధ్రజ్యోతి సంపాదక విభాగంలో పనిచేశారు.
ప్రముఖనవలా రచయిత శైల కుమార్ సప్తగిరి మాసపత్రిక ప్రధాన సంపాదకునిగా వ్యవహరించారు. ప్రముఖకథారచయిత ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు ఆంధ్రజ్యోతి అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆంధ్రజ్యోతి సంపాదక విభాగంలో పనిచేసిన కొత్వాలు అమరేంద్ర కవిత్వం, విమర్శ సీరియస్‌గా రాస్తుండటం గమనార్హం. ప్రపంచీకరణ పరిణామాల్ని అన్నంగుడ్డపేరుతో కథ రాసిన సుంకోజి దేవేంద్రాచారి ఆంధ్రజ్యోతి కడప జిల్లా డెస్క్‌లో పనిచేస్త్తున్నారు. ప్రముఖ ప్రగతిశీల సాహితీవేత్త ఆలూరి రాఘవశర్మ ఆంధ్రజ్యోతి, సాక్షి దినపత్రికల్లో సంపాదక విభాగంలో పనిచేశారు. కథా రచయిత ముని సురేష్ పిళ్లై జర్నిలిస్టుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
కడప జిల్లానుండి సీనియర్ జర్నలిస్ట్‌గానే కాక తెలుగు కథాసాహిత్యంలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి వివిధ పత్రికల్లో పనిచేశారు. ఇదే జిల్లా నుండి కేంద్రసాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత ప్రముఖరచయిత వేంపల్లి షరీఫ్ జర్నలిస్ట్ గా అందరికీ సుపరిచితులే. జర్నలిస్ట్‌గా పనిచేసి ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తవ్వాఓబుల్ రెడ్డి కడుపాత్రం కథలు రాశారు. జర్నలిస్ట్ నూకా రాంప్రసాద్ రెడ్డి పబ్లిషర్‌గా అనేక పుస్తకాలు తీసుకొచ్చారు. సాక్షిలో సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న షబ్బీర్ కథాసాహిత్యంలో ప్రవేశించి రాయలసీమ జీవితాలకు అద్దంపట్టే కథాసంపుటి తీసుకొచ్చారు.
ప్రొదుటూరుకు చెందిన జర్నలిస్ట్ రవి, కడపకు చెందిన బత్తుల ప్రసాద్‌లు విరివిగా రాయడం గమనార్హం. ఇదే జిల్లాకు చెందిన బిజివేముల రమణారెడ్డి సగిలేటి జేడలు పేరుతో కథాసంపుటి తీసుకొచ్చారు. ఈయన ప్రస్తుతం విరివిగా కథలు రాస్తూ కర్నూలు జిల్లా సాక్షి బ్యూరోగా ఉన్నారు.
అనంతపురం జిల్లాలో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేస్తూనే అద్భుతమైన కవిత్వంతో తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేసిన అస్తమించిన సూర్యుడు కెరె జగదీష్. వర్తమానంలో జర్నలిస్టులు సింగనమలకు చెందిన అసాది లక్ష్మీనారాయణ, అనంతపురం సాక్షి కల్చరల్ జర్నలిస్ట్ మురళీ వివిధ సాహిత్యప్రక్రియల్లో విరివిగా రాస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన కవి చౌశా ప్రపంచవ్యాప్త పరిణామాలపై విరివిగా కవిత్వం రాస్తున్నారు.








Add comment