మానవ దేహానికి మూడో ఎన్నో చర్మాలున్నాయని చిన్నప్పుడు చదువుకున్నాం.
ఎవడికయినా బుద్ధి రాలేదు అని చెప్పాలంటే ‘వాడి చర్మం మొద్దుబారిపోయింది’ అని చెబుతాం .
ఇప్పుడు వరస వరస అవమానాలతో ఈ దేశ పౌరుడి చర్మ౦ మొద్దుబారిపోయింది.
లేకపోతే ఏమిటిది ?
బూత్ బుల్లీయింగ్ చూశాం, బూత్ బ్లాక్ మెయిల్ చూశాం, బూత్ క్యాప్చరింగ్ చూశాం . బూత్ రిగ్గింగ్ చూశాం, బూత్ పెగ్గింగ్ చూశాం . బూత్ ర్యాగింగ్ చూశాం . బూత్ ప్యాకింగ్ చూశాం . బూతుల్లో జరిగే ఇవియం గారడీ చూశాం.. బూతా బూతున్నరా ? ఎన్ని చూళ్ళేదని .. ?
ఒక పాలనలో విసిగి, ఇంకో పాలన కోసం అయిదేళ్ళూ ఎదురుచూసి, మన ప్రజా క౦ట కుడిని మనమే ఎంచుకోవాలనే వెర్రి తాపత్రయంతో ఓటు కోసం క్యూలో నుంచున్నప్పుడల్లా ఇన్ని బూతులూ చూస్తున్నాం కళ్లున్నపాపానికి చూడకూడనివన్నీ చూశాం .
కనీసం ఇలా అయినా బత కనివ్వకుండా ఇప్పుడు నువ్వు ఒక ఓటరూ కాదు . నీదొక ఓటూ కాదంటే ..? ఏమిటి దాని అర్ధం ? భూములు కబ్జా చేసినంత తేలిగ్గా మన పుట్టుకలు కూడా కబ్జా చేస్తుంటే ఏ ఠాణాకి పరిగెత్తాలి ? ఎక్కడ , ఏమి నిరూపించుకోవాలి ?
ఎంత పరిహాసం ? ఎంత పరితాపం ? ఔరా ఇది కదా మన పుణ్య భూమి అని పగలబడి నవ్వొస్తోంది .
ఇన్ని దశాబ్దాలపాటు మనం పోలింగ్ కేంద్రానికే వెళ్లామా లేక పౌరుడిగా మన ఆత్మగౌరవాన్ని చెరిపేసుకోవడానికి వెళ్లామా ?
వరుడు అనుకుని వైరస్ ని పెళ్ళాడిన కొత్త పెళ్లి కూతురిలా వుంది పరిస్థితి.
అక్కడ కుర్చీలో కూచున్నవాడు దిగకుండా వుండటానికే కదా ఇన్ని ఎత్తులు, కుయుక్తులు!
ఎంత సిగ్గులేనితనం ? ఎవడిని చూసినా ఇదే మాట . ఇరవై యేళ్లు కూచు౦టా , యాభై ఏళ్లు కూచుంటా అంటూ ఎంత లేకి మాటలు ?
చివరికి జనం ఈ అసహ్యా న్ని కూడా జయించేశారు ? ప్రజాస్వామిక దేశంలో అదెలా సాధ్యం అని కూడా పేచీ పెట్టుకోవడం లేదు . నెత్తి మీద పిట్ట రెట్ట పడినట్టు తుడుచుకుని పోతున్నారు. దరిమిలా నేరం పార్టీ నినాదం అయి కూచుంది.
కుర్చీ అనేది భూమికంటే గొప్ప అయస్కాంత క్షేత్రం . ఒకసారి కూచుంటే ఇక లేవరు . లేస్తే కుర్చీ కిందికి నెట్టేసిన అవినీతి మురికి కంట పడుతుంది . దాన్ని తొక్కిపట్టి మన కళ్ళు కప్పాలంటే లేవకూడదు . కావాలంటే కుర్చీలో కూచునే చచ్చిపోతానంటారు . దానికున్న నాలుగు కాళ్ళ ఊతం తో నాయకుడికే కాదు ఆ చుట్టూ పాకుతున్న మనుషులకి కూడా నాలబై నాలుకలు మొలుస్తాయి.
ఆరడుగులు పట్టనివాడికి అఖండ భూభాగమంత దురాశ.
ఈ నేపధ్య౦ లో మనమిప్పుడు దిగజారిన విలువల్ని గురించి బెంగెట్టుకోవాలా? తలకాయ ఎక్కడుందో వెతుక్కోవాలా ? అనేది శేష ప్రశ్న .
దేశంలో తొంభై శాతం తలకాయలు ఏలిన దొరలు చేసిన అప్పులకోసం తాకట్టులోనే వున్నాయి .
ప్రప౦చ నాగరిక దేశాల సాక్షిగా మన రాజ్యాధినేత నీ తలకాయ పుట్టిందెక్కడ ? అని గర్జించినప్పుడు లెక్క ప్రకారం మనమంతా ఏ ఆఫ్రికా చీకటి అడవుల్లోకో వలస పోవాలి కదా | వెడుతూ వెడుతూ అడిగినవాడ్ని కూడా తట్టలో వేసుకుని పోవాలి కదా.
కలిసిన చేతుల్ని విడదీయ్యడానికి పెద్ద పధకం ఏమి అక్కర్లేదు . క్రికెట్ చాలు, కోవా బన్ మీద చేసిన కుట్ర చాలు.
ఇది ప్రజలు లేని ప్రజాస్వామ్యం . ఇక్కడ ఎవరికీ చూపుడు వేళ్ళు వుండకూడదు .
నడుస్తున్నది దుశ్శాసన నీతి . మన వలువలు మనమే విప్పి చూపించాలి .
ఓటరు చీటీ అడుగుతారు – బతికుండగానే చచ్చిన వాళ్ళతో జమ అయిపోయిన మొహం చూపించాలి .
పాన్ చీటీ అడుగుతారు – సర్కారు ఇచ్చిన గారడీ ఇల్లు కూలిపోతే, కేర్ ఆఫ్ రోడ్డు అయిపోయిన మొహం చూపించాలి .
ఆధార్ చీటీ అడుగుతారు – ఆదాయం పన్ను కట్టలేక దిగాలుపడ్డ మొహం చూపించాలి
వీసా చీటీ అడుగుతారు – వున్న చోట బతక లేక వలసకి సిద్ధమైన మొహం చూపించాలి.
వయసెంతో అడుగుతారు – శతాబ్దికి దగ్గరవుతున్న సువిశాల స్వతంత్ర భారతంలో స్వేచ్ఛ ఏరంగులో వుంటుందో తెలియని మన నిర్భాగ్య పుట్టుక తేదీ చెప్పాలి.
జనన ఆస్పత్రి పేరు అడుగుతారు – అడిగినంత లంచం ఇవ్వనందుకు గేటుముందే ముందే నిలబెట్టిన ఆ దివ్య భవనం పేరు చెప్పాలి.
కాన్పు చేసిన నర్సు బయోడేటా అడుగుతారు . కాన్పు సమయంలో ఆమె ఎలాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడలేదని రుజువు చూపాలి.
నీ ఇంటికి ఆ రంగు ఎందుకు వేశావని అడుగుతారు .
చూరు మీద వాలిన పిట్ట ఎవరని అడుగుతారు .
పిట్ట ఎగిరొచ్చిన దేశం పేరు అడుగుతారు .
పిట్ట వేసిన రెట్ట పేరు అడుగుతారు .
ఇన్ని అడిగాక మనిషన్నవాడికి ఒలిచి చూపించడానికి చర్మం తప్ప ఇంకేమీ మిగలదు కదా .
అయినా సరే చూపాలి . చూపాలి . ఏలినవారు ఏది అడిగితే అది చూపాలి . కాదంటే దేశ ద్రోహం .
మన మొహం మన మొహమే కాదు అని తేల్చడానికి ఏ వంక దొరుకుతుందో అన్ని వంకలకీ వెయ్యి
జీహుజూర్ల తో విన్నపం చేసు కోవాలి .
పట్టుమని పది పధకాలు కూడా దేశంలో ఒక పౌరుడు తన మెడమీద వున్నది తన తలకాయేన ని రుజువు చేయడానికి వంద చెరువుల నీళ్లు తాగాలి .
అన్ని చీటీల్లోనూ అదే మొహాన్ని చూపించి చూపించి, చూపించి అద్దం ముందు నుంచుంటే మెడమీద పగులుబారిన బండరాయి కనిపిస్తోంది . తప్పదు . కళ్ళు తుడుచుకోవాలి.
ఇంతకు మించిన కొమ్ములూ కోరలూ వున్న ఎన్ని మతాలు, రాజులు కాలగర్భంలో కలిసిపోలేదు? అనే ధైర్యం కూడగట్టుకోవాలి .
చరిత్ర అంతా రాజులు చెక్కిన రాళ్ళ ముచ్చటే అని తెలుసు కాని, తాను చెప్పిన రాయితోనే సర్వజనులూ తల బాదుకోవాలని చెప్పిన రారాజు ఇతడేనేమో, రాయిని పగలదీయడమే తెలిసిన చెమట సూర్యుడికి
ఇప్పుడు రాజు బుర్రలో ఏ రాయి వుంటే దానికి మొక్కాల్సిన పని పడింది.
రాజ్యాంగం రాసుకున్న ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా పౌరుడి ప్రమేయం లేని రాజ్యాంగం ఒకటి బతికే వుంటుందని నాగరిక దేశాలన్నీటికి అర్ధం అవడం ఎంత గొప్ప ఘనత!
దేశంలో కలపంతా జైళ్లకే పోతోందని అప్పట్లో కలవరపడ్డారు. దేశంలో కలపంతా కుర్చీలకే సరిపోతోందని ఇప్పటికీ గొడవ పడుతున్నా౦ . నా ఉద్దేశ౦ ప్రకారం దేశంలో వున్న కలప, ఇనుము కూడా భజన చిడతలకి పోతున్నాయనిపిస్తోంది . మొహాన ఒక బొట్టేట్టి , నిర్విరామంగా ఏదో ఒక చానల్ ముందు భజన చిడత వాయిస్తే చాలు నువ్వు మనిషి వే కానవసరం లేదు . ఈగ కి దోమకి అయినా ఈ దేశ సార్వభౌమత్వం దక్కుతుంది . దీనికోసం చాలమంది క్యూలో వున్నారు . ఆలసించిన ఓటు భంగం.
*








చీల్చి చెండాడారు
thank you sir