భారత దేశంలోని ముస్లింల జీవన సరళికి తెలుగు ముస్లిం వాద సాహిత్యం నిలువుటద్దంగా నిలిచింది. హైద్రాబాద్‌లోని కోఠీలో కృష్ణదేవరాయ తెలుగు భాషానిలయంలో సెప్టెంబర్ 19, 20 తేదీలలో జరిగిన ముస్లిం వాద సాహిత్య సదస్సులో ముస్లిం కవులు, రచయితలు, ముస్లిమేతర కవులు, కథకులు, విమర్శకులు పాల్గొన్నారు. సభలో జరిగిన ముస్లిం వాద సాహితీ సెషన్లలో పాల్గొన్న మేధావులు, రచయితలు, ముస్లిం వాద సాహిత్యం భారత దేశంలో ముస్లింలు అనుభవిస్తున్న వివక్ష, అణచివేత, ఆందోళన గురించిన సజీవ దృశ్యాన్ని చూపిస్తుందన్నారు.
ప్రారంభ సదస్సులో హర్యాలీ ముస్లిం రచయితల వేదిక కన్వీనర్ స్కైబాబా గత పాతికేళ్ళుగా ముస్లిం వాద సాహిత్యం తెలుగు సాహిత్యంలో ఒక కీలక పాత్ర పోషిస్తూ వస్తుందని, బాబ్రీ విద్వంసానంతరం ముస్లింలపై జరుగుతున్న దాడులు, సాగుతున్న ద్వేషపూరిత వివక్ష, ముస్లిం కుటుంబాలలోని వెనుకబాటుతనం, గురించిన కవిత్వం, కథలు, వ్యాసాలు విస్తృతంగా రావడం అభిలషనీయమన్నారు. ఈ ప్రయాణపు కొనసాగింపుగానే హర్యాలీ ఈ రెండు రోజుల సదస్సును నిర్వహిస్తోందని చెప్పారు. ఖాదర్ మొహియుద్దీన్ ప్రారంభోపన్యాసంలో కొన్ని దశాబ్దాల క్రితం తన మెదడులో మొలిచిన ముస్లిం ఆత్మ గౌరవ ఘోషకు ప్రతీకయే తాను రచించిన సుదీర్ఘ కవిత పుట్టుమచ్చ అన్నారు.
ప్రముఖ కవి, విమర్శకుడు అంబటి సురేంద్రరాజు మాట్లాడుతూ ముస్లిం వాదంలోని సూఫీతత్వం భిన్నత్వాన్ని కాపాడుకుంటూనే ఏకత్వాన్ని ఆశిస్తుందన్నారు. ముస్లిం రాజులలో కుతుబ్‌షాల కాలం నుండి సాగిన ప్రజాస్వామిక పాలన మత విద్వేషాలకు, వివక్షలకు, అసహనానికి అతీతంగా సాగిందన్నారు. అలనాటి యోగులు, సాధువులు, సంతులందరూ దేశంలో సామరస్య జీవన ఆవశ్యకతను చాటి చెప్పారన్నారు.
జూపాక సుభద్ర మాట్లాడుతూ ముస్లిం సమాజంలో తరతరాలుగా వివక్షను, అణచివేతను ఎదుర్కొంటున్న ముస్లిం స్త్రీల బందీఖానా బతుకులను చిత్రించి ముస్లిం స్త్రీల హక్కులకు ముస్లిం వాద సాహిత్యం వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. తాను బాల్యం నుండీ ముస్లింలు, దూదేకులతో చాలా ఆప్యాయంగా కలసి జీవనం సాగించానన్నారు. ముస్లిం స్త్రీల జీవితాలను తాను చాలా దగ్గర నుండి పరిశీలిస్తూ ఆవేదన చెందానన్నారు. తాను ఇస్మత్‌చుగ్తాయి, జమీలాబానో, జమీలానిషాత్, నస్రీన్ పర్వీన్, షాజహానా కవిత్వంతో ప్రభావితమయ్యానన్నారు.
తెలుగు భాషా చైతన్య సమితి కన్వీనర్, ముస్లిం వాద సాహితీ సదస్సు కో ఆర్డినేటర్ బడేసాహెబ్ మాట్లాడుతూ ముస్లిం సమాజంలో దూదేకుల వెనుకబాటుతనం, వివక్షలను గురించిన జీవితాలకు ముస్లిం వాద సాహిత్యం దర్పణం పట్టిందన్నారు. దూదేకుల కుటుంబాలలో ఇప్పుడిప్పుడే సామాజిక స్పృహ, చైతన్యం పెరుగుతున్నాయన్నారు.
సుంకిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ హిందూత్వ వాదం ఎంతగా ఘనీభవించిందో బాబ్రీ మసీదు విధ్వంసం ద్వారా ప్రపంచానికి తెలిసి వచ్చిందన్నారు. స్కైబాబా రాసిన నేను కాఫిర్‌ని కవితలో ఇస్లాం పరలోక చింతన తప్ప లౌకిక విషయాలను చర్చించడం లేదన్నారు. ముస్లింల ఆధునీకరణకు మదరసాలే అడ్డుపడుతున్నాయన్నారు. ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న వివక్షను, విధ్వంసాన్ని ప్రశ్నించాల్సిన అవసరముందన్నారు. పాచికలు రచించిన షేక్ హుశేన్ సత్యాగ్ని ముస్లిం వాదానికి చక్కని ప్రేరణగా, దిక్సూచిలా నిలిచారన్నారు. 1994లో వచ్చిన చిక్క నవుతున్న పాటలో ముస్లిం కవిత్వాన్ని ప్రచురించి పదునెక్కిన ముస్లిం సాహితీ సృజనా పటిమ ఎంతో సాహితీ లోకానికి చాటి చెప్పామన్నారు. దాని తర్వాత వచ్చిన పదునెక్కిన పాటలోనూ 35 ముస్లిం కవుల కవిత్వాన్ని ప్రచురించి ముస్లింవాద సాహిత్యం లేవనెత్తిన దీటైన ప్రశ్నలను సమాజానికి తెలియజెప్పామన్నారు. దాదాహయాత్, రహమతుల్లా, ఇనాయతుల్లా, వేంపల్లి షరీఫ్ కథల్లో ముస్లిం జీవన సంఘర్షణ బాగా చిత్రించారన్నారు. వెండిమేఘం, మేరాజహా నవలల్లో సలీం షాజహానాలు ముస్లిం జీవితాల్లోని ఆర్తిని ఆవేదనను చిత్రించారన్నారు. డ్యానీ బుజ్జిమేక పిల్ల, ఖదీర్‌బాబు ఢాకన్, ఢక్క, అఫ్సర్ సాహిల్ వస్తాడు కథల్లో ముస్లిం జీవన సంక్లిష్టతలను వ్యక్తీకరించారన్నారు.
మనుబంధాలే కాని అనుబంధాలెక్కడ….
ప్రస్తుత సమాజంలో మనుబంధాలే కాని అనుబంధాలకు చోటు లేకుండా పోయిందని, ఎక్కడ చూసినా కుల ప్రశ్నలే వినిపిస్తున్నాయి కాని కుశల ప్రశ్నల ప్రస్తావనే లేకుండా పోయిందని లక్ష్మీనరసయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో ముస్లిం వాద సాహిత్యం అందరూ గర్వపడే స్థాయికి ఎదిగిందన్నారు. తెలుగు సాహిత్యంలోని కవిత్వం, కథ, నవలిక, నవల అన్ని ప్రక్రియలలో ముస్లిం వాద సాహిత్యం ముస్లిం జీవితాలను చిత్రిస్తోందన్నారు.
యాకూబ్ మాట్లాడుతూ ముస్లిం వాద కవులు 1992లో కంజిర, 1995లో జీహాద్, జిల్‌జలా, ఫత్వా, 2004లో వతన్ కథల సంపుటి.. ఇవన్నీ ముస్లిం జీవితాలలోని వివిధ సంఘర్షణలను వెలికి తీశాయన్నారు. కోయి కోటేశ్వరరావు ముస్లిం వాద సాహిత్యం తెలుగు సాహిత్యానికి ప్రాణపదం వంటిదన్నారు. 1936లో కుసుమధర్మన్న కవి దళితులు ముస్లిములను కలుపుకొని ఉద్యమించాలని తెలిపారన్నారు. ఏ దేశ ప్రజలైనా మేం దేశభక్తులమే నని నిరూపించుకోవలసిన పరిస్థితి రావడం అత్యంత బాధాకరమని బాలగోపాల్ తెలిపారన్నారు.
స్వప్న కొండమడుగు, మెర్సీ మార్గరెట్ మాట్లాడుతూ ముస్లిం స్త్రీల రోజువారీ జీవితంలోని సంక్లిష్టతను వ్యక్తీకరిస్తూ ముస్లిం వాద కవులు రచించిన కవిత్వం తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిందన్నారు.
ఆ రోజు సాయంత్రం ముస్లిం సంఘీభావ కవిసమ్మేళనం డాక్టర్ పసునూరి రవీందర్ అధ్యక్షతన జరిగింది. రచయిత ఇనాయతుల్లా నిర్వహణలో జరిగిన ఈ కవి సంగమంలో తగుళ్ళగోపాల్, ఏకు అశోక్, జాబెర్‌బాష, సలీం కందికొండ, సాత్విక ద్యాగలి, రచనసాకు, షేక్ కరీమా పేర్లరాము తమ కవితలు వినిపించారు. జాబెర్‌బాష, సలీం కందికొండ, కరీమాల కవిత్వంలోని పదునైన భావం స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
ముస్లిం వాద సాహిత్యం ప్రారంభమైన 1990 సంవత్సరం నుండి ఇప్పటి దాకా దాదాపు మÖడున్నర దశాబ్దాలుగా ముస్లిం వాద విమర్శ కొనసాగుతోందన్నారు షమీవుల్లా. కవిత్వం, కథ, నవల, పాట వంటి ప్రక్రియలలో ముస్లిం వాద రచయితలు చేసిన కృషి వల్ల తెలుగు సాహిత్యంలో ఒక కొత్త పార్శ్వం ఆవిష్కరించడం జరిగిందన్నారు. తెలుగు, ఉర్దూ, పార్శీల సమ్మిళితమైన ఒక కొత్త పదబంధాలను ముస్లిం వాద సాహిత్యం తెలుగు సాహితీ లోకానికి అందించిందన్నారు. ముస్లిం వాద సాహిత్యం అంతర్ బహిర్ సంఘర్షణలను ఎదుర్కుంటూనే ఒక గణనీయమైన సామాజిక ప్రయోజనాన్ని సాధించిందని షమీవుల్లా పలు ముస్లిం కవుల, రచయితల కవిత్వాన్ని కథలను ప్రస్తావించారు.
ఎ.కె.ప్రభాకర్ మాట్లాడుతూ జిహాద్, కంజిర, జల్‌జలా, కవితా సంకలనాలు ముస్లిం జీవితాల పట్ల, ప్రధానంగా నానాటికీ పెరిగిపోతున్న అభద్రతా భావం పట్ల ముస్లిం కవులకున్న ఆవేదనను ప్రకటించాయన్నారు. షేక్ హుశేన్ సత్యాగ్ని పాచికలు, స్కైబాబా వెలువరించిన వతన్ కథలపై వచ్చిన విమర్శ ముస్లింవాద సాహిత్యానికి వెన్నుదన్నుగా నిలిచిందన్నారు.
రెండో రోజున జరిగిన 5వ సెషన్‌కు వేంపల్లి షరీప్ అధ్యక్షత వహించారు. రచయితలు దాదాహయాత్ వెంకటకృష్ణ, రహ్మతుల్లా, షాజహానా పాల్గొన్నారు. వేంపల్లి షరీఫ్ మాట్లాడుతూ రాయలసీమ ముస్లింల జీవితల వైవిధ్యాన్ని, వెనుకబాటు తనాన్ని చాటి చెప్పేందుకు తాను ఖదీర్‌బాబు కలిసి చోంగా రోటి కథా సంకలనం ప్రచురించామన్నారు. దాదాహయాత్ తాను మశీదు పావురం కథ రాసిన తర్వాత విరామం తీసుకోవలసి వచ్చిందన్నారు. బాబ్రీ గుజరాత్ పరిణామాలు, ఇటీవలి పెరిగిన విద్వేష పూరిత వాతావరణం తనను పూర్తి ఆందోళనకు గురి చేస్తోందన్నారు.
వెంకటకృష్ణ మాట్లాడుతూ ముస్లింవాద సాహిత్యంలో కథ చాలా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. వతన్‌లోని అనేక కథల్లో ముస్లింల పేదరికం నిరక్షరాస్యత, చైతన్యలేమి, వీటన్నింటి గురించి బాగా చర్చించాయన్నారు. ఈ పరిస్థితి ఒక చిన్న దీవి మహా సముద్రంతో తన ఘోష వినిపిస్తున్నట్లుగా అనిపిస్తోందన్నారు. ముస్లింలకు ఈ దేశంలో చోటు లేకుండా చేయడం, ఒక్కొక్కటిగా వాళ్ళ హక్కులనుండి వాళ్ళను దూరం చేయడం లాంటి పరిస్థితులను ముస్లిం కథకులు కళ్ళకు కట్టినట్లు చిత్రించారన్నారు. ఇనాయతుల్లా వతన్‌లోని తన ఘోస్లా కథలో బేల్దారి పని చేసుకుంటూ ఎన్నో ఇళ్ళు భవనాలు కట్టిన ముస్లింకు చివరికి సొంత ఇల్లు లేని పరిస్థితిని వివరించాడు.
రెండో రోజు సాయంత్రం 6 గంటలకు ముగింపు సభ జరిగింది. వలీ హుశేల్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ సాహితీ విమర్శకులు, విశ్లేషకులు ఖాన్ యాజ్దానీ, డాక్టర్ జిలుకర శ్రీనివాస్, కాసుల ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణా సాహిత్య అకాడమి, తెలుగు భాషా చైతన్య సమితి ఆర్థిక సహకారంతో హర్యాలీ ఆధ్వర్యంలో జరిగిన ముస్లిం వాద సాహిత్య 2 రోజుల సదస్సు విజయవంతంగా ముగిసింది.
*








Add comment