One Hundred Years of Solitude

ఎప్పుడో 45 ఏళ్లకు పైమాటే – బ్రహ్మం మామయ్య దగ్గరకి వెళ్లాను ఓ రోజు. ఆ రోజు ఆదివారం, అందుకే పిల్లల సందడి లేదు. నేను వెళ్లేటప్పటికి ఆయన ధ్యానంలో ఉన్నాడు.

ఆదిలోనే ఇంత అబద్ధమా? హేతువాది, రాడికల్ హ్యూమనిస్టు, రాయిస్టు, నాస్తిక తాత్వికుడు నాసిన వీరబ్రహ్మం గారు ధ్యానంలో ఉన్నారా? భావ -భౌతిక మార్గాల, వ్యష్టి- సమష్టి భేదాల, వ్యక్తిగత – ప్రాపంచిక దృక్పథాల ద్వంద్వాన్ని తన జీవితంలో ఆద్యంతం రద్దుచేసుకున్న బ్రహ్మం గారి మీద, అదీనూ తన కార్యాచరణని ఆశయసాధననీ తరువాత తరాలకి పాఠశాలని ఒక ప్రథాన  మాధ్యమంగా అందించే మహోద్యమం  చేస్తున్న కీలకమైన 1970వ దశకంలో- ఆయన భజన చేస్తున్నారు, నమక చమకం పఠిస్తున్నారు అని అవాకులు చవాకులు రాస్తావా? – అని నా మీద ఆగ్రహించొద్దు. పదాల లేమి, భాషాదారిద్ర్యం వల్ల ‘ధ్యానం’ అని రాశాను, ఇప్పుడు సరిచేస్తాను: ధ్యాసని తదేకం చేసి, తన్మయులై ఆయన ఏకాంత దీప సన్నిధిలోకి వెళ్లే సన్నాహంలో ఉన్నాడు.

– అంటే అగరొత్తులు వెలిగించి, సాంబ్రాణిధూపమేసి, నువ్వులనూనెతో దీపమెలిగించి లక్ష ఒత్తుల నోముకి సిద్ధమయ్యారా?

క్షమించండి, పదాల పోహళింపు కోసం మరిక కసరత్తు చేయను; బ్రహ్మం మామయ్య అప్పుడు చుట్ట  తాగడానికి సమాయత్తమయ్యాడు.

వెయ్యి ప్రభాతాల బంగారు ధూళి ఎంత తాకినా ఏ నడమంత్రమూ లేని నాపరాయి గచ్చు మీద వాలుకుర్చీలో ఎండిన పొగాకు కాడ ముడతలు సరిచేసి, శరదృతువులో జీరాడే మంచుపరదా జ్ఞాపకాల సోమరితనంతో ఈనెలు తీసి, తన తొడ మీద రుద్ది సమంచేసి, మట్టిని కుండగా మలిచే కుమ్మరి వేళ్ల లాఘవంతో పొగాకుని సుతారంగా చుట్టి, చివర్లు కొరికి, అగ్గిపుల్లతో వెలిగించి, పెదాల మధ్య గుప్పుగుప్పున రాజేసి సాలోచనగా కళ్లు సగం మూసుకున్నాడు, నేను రావడాన్ని గమనించకుండా.

తెల్లని అడ్డపంచె, జుబ్బాచేతుల ముతక బనీను. ముడతలు పడేంత ముసలితనం లేదు గానీ, జ్ఞానవృద్ధుడు కావడం వల్ల మీసాలబ్రాకెట్లలా లోతైన లలాట రేఖలు. చాట చెవుల మీద వెంట్రుకలు గాలి గుసగుసల్ని వడిసిపడుతున్నట్టున్నాయి. దట్టమైన పొదల్లాంటి కనుబొమ్మల కింద సగం రెప్పలు మూసి చుట్ట తాగుతూ బ్రహ్మం మామయ్య యోగముద్రలో ఉన్నాడు; ఆయన పక్కనే యాగం తాలూకూ ఆనవాళ్లు – ముక్కాలిపీట- క్లిప్ బోర్డుకి తెల్లకాగితాలు, పాళి చివర నీలం ఇంకుమరక, పేపర్ వెయిట్ కింద ముత్యాలు పేర్చినట్టు కొట్టివేతల్లేని మామయ్య దస్తూరి!

ఏం రాస్తున్నాడా అని ఆసక్తిగా చూశాను, అది రచన కాదు, ఎవరో పేషెంట్ కేసు రికార్డు, ఎంత అనామకుడిది అయినా, జీవిత చరిత్ర రాసినంత శ్రద్ధగా రాస్తాడు బ్రహ్మం మామయ్య. పక్కనే చెక్కపెట్టెలో హోమియో చక్కెర గోలీ సీసాలు.

హోమియో వైద్యం కూడా ఆయన మానవశోధనలో భాగమే, రాడికల్ హ్యూమనిజం నిజాన్వేషణలో పార్శ్వమే.  ‘Argentum nitricum గాడివిరా నువ్వు’, అనేవాడు మామయ్య నన్ను. దాని అర్థం అప్పట్లో తెలీదు, అదేదో జోక్ అనుకొని నవ్వేవాడిని. కానీ మనిషి లోలోతుల్లోకి ఆయన చేస్తున్న నిరంతరాన్వేషణలో భాగమే ఆ వ్యాఖ్యలు అని తర్వాత బోధపడింది. Human అంటే కామన్, కాంక్రీట్, కౌంటబుల్, జెండర్ న్యూట్రల్ నామవాచకం కాదు ఆయనకి. ప్రతి మనిషీ ప్రత్యేకమే. ఎం ఎన్ రాయ్ – రాడికల్ హ్యూమనిజంతో ఆయన విభేదించింది కూడా అక్కడే. మనిషిని దైవికమైన పంజరాల్లో ధార్మిక వాదం బంధిస్తే, సామ్యవాదం మనిషిని ఆర్థిక పంజరాల్లో ఉంచింది; వాటి కొనసాగింపుగా ఎం ఎన్ రాయ్ మనిషిని ప్రకృతి బద్ధం చేశారని బ్రహ్మం గారి వాదన. మనిషిని మనిషిపరంగానే తెలుసుకునే అన్వేషణే ఆయన జీవితసారాంశం. Enigmatic మానవ స్వభావాన్ని తరచి తవ్వితీసి రోగమూలాల్ని తుడిచేసే హోమియో వైద్యాన్ని వృత్తిగా ఎంచుకున్నది అందుకే.

ఇంతలో కళ్లు తెరిచాడు మామయ్య, ‘ఏంట్రా ఇకిలిస్తున్నావ్?’ అన్నాడు.

ఏమీ లేదన్నట్టు తలవూపుతూనే అడిగాను, “ మామయ్యా, మీరీ మధ్య పొట్ట మీద రుద్దుకోవడం లేదే”

పొత్తికడుపు దగ్గర ఆయన గోక్కోవడం చూశాను చాలాసార్లు. పైన అంగీ ఆచ్ఛాదన లేకుండా ఉన్న ఒక అరుదైన సందర్భంలో చూశాను, పొట్ట దగ్గర, బొడ్డు చుట్టూ ఏదో చర్మసమస్య ఉందని అర్థమయ్యింది. వీరయ్య గారితో చెబుతున్నప్పుడు విన్నాను కూడా. వీరయ్య గారు మంచి పేరున్న  హోమియో డాక్టర్. నేను చూసేటప్పటికే వృద్ధులు, ఉబ్బసంతో ఆయాసపడుతుండేవారు, దర్బార్ రోడ్డు పెంకుటిల్లు క్లినిక్కులో పేషెంట్స్ తో  మాట్లాడుతూనే మధ్యమధ్యలో పెరట్లోకి వెళ్లి ఊసి వస్తుండేవారు. ‘డాక్టర్లకి కూడా జబ్బులేమిటా’ అని ఆశ్చర్యపోతుండేవాడిని; రోగులకే గానీ వాళ్లకి పనిచేయవేమో ఆ మందులు అనుకునేవాడిని. బ్రహ్మం మామయ్య విషయంలో కూడా – భరించలేని దురదతో ఆయన బాధపడుతున్నప్పుడు అదే అనుకునేవాడిని. అనుకోవడమే కాదు, అనేశాను కూడా ఓ సారి.

దాన్నే గుర్తుచేస్తూ అన్నాడు – “మా మందులు మాకు పనిచేయవా అని అడిగావు కదరా. పనిచేసింది, పూర్తిగా పోయింది”.

“లైక్ క్యూర్స్ లైక్ – కదా మామయ్య”, అన్నాను, ఆయన ఆ మధ్య ఓ పత్రికకి రాసిన వ్యాసం నేను చదివానని చెప్పకనే చెప్పటానికి. ‘Similia Similibus Curentur’ –  ఇది హోమియోపతికి మూల సూత్రమని, ఆరోగ్యవంతుడిలో ఏ పదార్థమైతే రోగ లక్షణాల్ని రేపుతుందో అదే పదార్థం అలాంటి symptoms తో బాధపడుతున్న రోగిని నయం చేస్తుందని రాశాడాయన ఆ వ్యాసంలో. హోమియోపతి అశాస్త్రీయమని, ఆ డాక్టర్లు భూతవైద్యుల లాంటి వారని పిడివాదాలు చేస్తున్న sciencism బాధితులకి బదులు చెబుతూ ఎన్నో వ్యాసాలు రాశాడు మామయ్య.

‘లైక్ క్యూర్స్ లైక్’ అన్నానని మెచ్చుకోలుగా భుజం మీద తడుతూ, “Prima Aggravatio” అన్నాడు.

ప్రిమా అగ్రావేషియో అనే లాటిన్ పదబంధాన్ని హోమియోపతిక్ అగ్రావేషన్ అంటారట; హోమియోపతి మందు ప్రభావం వల్ల తాత్కాలికంగా లక్షణాలు పెరగడం, నయం కావడానికి ముందు ప్రారంభంలో వ్యాధి కాస్త తీవ్రం కావడం. ఆ దశలో బ్రహ్మం మామయ్యని చూసి “మీ మందులు బైటవాళ్లకే గానీ, మీకు పనిచేయవా…” అని వెటకారం చేశాను, నా వయసు, తాహతు చూసుకోకుండా.

తెలుగు మేధోక్షేత్రంలో ఆ తరం ప్రత్యామ్నాయ సంస్కృతి సారథులు – కమ్యూనిస్టుల్లో గానీ, రాడికల్ హ్యూమనిస్టుల్లో గానీ తీవ్రమైన నియంతృత్వ ధోరణి ఉండేది. ఏ రోజు అయినా ఎవరూ ప్రతిస్పందించకపోతే, తనని ఎవరూ ప్రశ్నించకపోతే నిరుత్సాహపడిపోయే ప్రజాస్వామిక స్వభావం  ఎం ఎన్ రాయ్ గారిది అని చదివాను. కానీ, ఆయన అనుయాయులైన రాడికల్ హ్యూమనిస్టుల్లో ఆవుల సాంబశివరావు, రావిపూడి వెంకటాద్రి గార్ల వంటి వారు ఎవరైనా తమ వంతు మాట్లాడటానికి, లేదా అడగటానికి ప్రయత్నిస్తే గద్దించి నోరు మూయించడం నేను ప్రత్యక్షంగా చూశాను అప్పట్లో. అలాంటి హడలగొట్టేవాళ్ల మధ్య అచ్చమైన ప్రజాస్వామ్యవాది, నిజమైన మానవతావాది బ్రహ్మంగారే.

ఎంత డెమోక్రటిక్ అయినా, ఆడవాళ్లు, పిల్లల విషయంలో మాత్రం ఆధిక్యత చూపించడం, అధికారం చలాయించడం సర్వసాధారణం ఆ తరానికి. కానీ, బ్రహ్మం గారు అందుకు కూడా మినహాయింపే. స్త్రీలతోనే కాదు, పిల్లలతో కూడా ఆయన ఏనాడూ పరుషంగా  మాట్లాడింది లేదు, కఠినంగా వ్యవరించిందీ లేదు; అది కూడా ఒక పెద్ద స్కూలుని నడిపి కూడా. ఆనాటి గురుశిష్యసంబంధం అంటే బెత్తం, పెత్తనం అంతే. గుంజిళ్లు తీయించడం, గోడకుర్చీ వేయించడం వగైరాల నుంచి, కోదండంపట్టించడం వరకూ ఎంత హింస ఉంటే అంత గొప్ప క్రమశిక్ష(ణ)! అటువంటి శిక్షాస్మృతి అమలవుతున్న రోజుల్లో కూడా బ్రహ్మం గారు పిల్లల్ని గద్దించి కూడా ఎరగరు. ఆయన వరకే కాదు, ఆయన ఆదర్శాల మేరకు నడిచిన స్కూలులో కూడా అదలింపు, విదిలింపు విద్యావిధానం ఏ కోశానా లేదు. సబ్ జూనియర్, జూనియర్ మెట్రిక్యులేషన్ (ఏడు, ఎనిమిది తరగతులు) చదువుతున్న నా బోటి కుర్రకుంకలు – చనువిచ్చారు కదా అని చంకనెక్కినట్టు ఏవైనా అవాకులు, చవాకులూ కూసినా ఆయన కోప్పడేవారు కాదు. ఒక సమవుజ్జీతో మాట్లాడినట్టు చర్చించేవారు.

మందు పనిచేయదనో, లేదా వికటిస్తుందనో తెలిసీ తెలియకుండా మాట్లాడాడులెమ్మని పట్టించుకోకుండా నన్ను వదిలేయలేదాయన; పోనీ పనిగట్టుకొని నన్ను పట్టుకొని, ఇదిగో నయమైపోయిందని నిరూపణలకి దిగలేదు. కానీ, సందర్భం వచ్చినప్పుడు ఒక సైద్ధాంతికవేత్తకి ఎంత శ్రద్ధగా విన్నవిస్తారో, అంతే శ్రద్ధగా నాకు విశదీకరించారు: స్టిమ్యులేషన్ ఆఫ్ వైటల్ ఫోర్స్ గురించి,  హెరింగ్స్ (Dr. Constantine Hering) లా ఆఫ్ క్యూర్ గురించి నాకు సులభసుబోధకంగా వివరించారాయన. సమస్యని సమూలంగా తొలగించాలంటే, దాని మూలాల్ని తెలుసుకోవాలి. రాడికల్ అంటేనే మూలమైన, మొదటి, ఆదిమ అని అర్థం; బ్రహ్మ మామయ్య – నిజమైన రాడికల్ హ్యూమనిస్టు, రాడికల్ రాయిస్ట్!

ఆ రోజుల్ని తలుచుకుంటుంటే ఇప్పుడలా అనిపిస్తోంది గానీ, అప్పుడలా తీర్మానించుకోగలిగేంత తెలివిడి, జ్ఞానం లేవు. బ్రహ్మం గారు మా నాన్నగారి సన్నిహితుడు కావడం వల్ల – మామయ్య, మనీషా విద్యావిహార్ ఫౌండర్ ప్రిన్సిపాల్ కాబట్టి – గురువు – అంతే. అంతకుమించి తెలీదు. నా ఈడు వాళ్లతో పోల్చితే బహుశా ఆయనలో మరి కొన్ని పార్శ్వాలు నాకు తెలిసి ఉంటాయని చెప్పొచ్చు – రాడికల్ హ్యూమనిస్టు ఆవిర్భావ సదస్సులో పాలుపంచుకున్నారని విన్నందున మానవేంద్రనాథ్ రాయ్- అంతేవాసి, ఇంటా బయిటా తన సహచర ఉద్యమనేతల్లో లేని సహనం, సమభావం చూపిస్తారు కనుక – సాత్వికుడైన మానవతావాది, భౌతిక కార్యాచరణ కోసం భావుక సౌకుమార్యాన్ని దాచుకున్నందు చేత – హృదయంలో కవి!

అలా నా తోటివాళ్ల కంటే నాల్గు ఆకులు (నిజంగానే ఆకులు – ఆయన చదివించిన తాళపత్రాలు) ఎక్కువ చదవడానికి కారణం – నేను పుట్టు జ్ఞానినో, స్వయంభూనో కావడం కాదు; దానికి కూడా బ్రహ్మం మామయ్య – తన బడిలో ఆదర్శవంతమైన బోధనా పద్ధతుల్ని ఆచరణలో పెట్టడమే కారణం. ఆయన స్కూలు (మనీషా విద్యా విహార్)లో యూనిఫామ్ ఉండేది కాదు, ఆడపిల్లలు- మగపిల్లలు అనే విభజన రేఖలు లేవు. పాఠ్యపుస్తకాలకి, మార్కులకి మాత్రమే పరిమితం కాలేదు మా చదువు. బహుముఖీన భావనల అధ్యయనం – అక్కడ మా సిలబస్. శనివారం మధ్యాహ్నం వచ్చిందంటే చాలు… అదో విజ్ఞాన సభ. రకరకాల అంశాలపై వాదప్రతివాదనలు, చర్చోపచర్చలు. అప్పుడప్పుడూ మేధావులు, వక్తలు, రంగస్థల కళాకారులు వచ్చేవారు — ఆ హేతువాది నడిపే బడిలో ప్రసంగాల పక్కనే ప్రదర్శనలకూ సమాన పీట: జిజ్ఞాసతోపాటు రసపిపాసకూ చోటివ్వాలన్న ఆయన సిద్ధాంతం – అక్కడ మా టైమ్ టేబుల్ లో భాగం! ప్రసంగమో ప్రదర్శనో ముగిశాక వేదిక మాదే — ప్రశ్నలు, జవాబులు, అభిప్రాయాలు. ఆ సభల్లో బ్రహ్మం మాష్టారి స్థానం? విద్యార్థుల మధ్య ఒక సహాధ్యాయి; వక్తల మధ్య ఒక ప్రసంగీకుడు. అందరూ సమానులే అక్కడ; ఆయన first among equals — అదీ సభ నిర్వాహకుడు కావడం వల్ల మాత్రమే, అంతకుమించి కాదు. ‘కొందరు ఎక్కువ సమానులు’ అన్న ఆర్వెల్ వ్యంగ్యంతో నవ్యమానవ మహోద్యమాన్ని నిలదీసిన ఆ విప్లవవాది, తన బడిలో తన ‘ఎక్కువ సమానత్వాన్ని’ కుర్చీలు వేయించే బాధ్యతకు కుదించుకున్నాడు.

అలా ఆయనతో ఉన్న చనువుని granted గా తీసుకున్నానేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి, మీ హోమియో మందులు మీకు పనిచేయవా – వంటి తాహతుకి మించినవి మాట్లాడినప్పుడు. అయితే, ఆ ఆదివారం ఆయనని కలిసింది అటువంటి మిడిమాలపు ఉద్దేశాలతో కాదు; ఆత్మకథ రాయమని బ్రహ్మం మామయ్యని అడగిన మొట్టమొదటి సందర్భమది. దాని కోసమే ఆ రోజు పనిగట్టుకొని మరీ వెళ్లాను.

నా మాటని అంత సీరియస్ గా పట్టించుకోలేదు బ్రహ్మం గారు. అప్పుడు ఆయనకి ఒక పద్యం అప్పజెప్పాను – జీవులకు జీవనంబైన జీవనంబు

నెంకగా చేయుటందున నినుడు ఘనుడు!

పేదవాని నయన వారిపూరమ్ముల

నింకించగలుగునా యినుని శక్తుల్?

బ్రహ్మం మామయ్య అప్పుడప్పుడూ నాతో ఏదో ఓ పద్యం వల్లెవేయించడం, అది గుర్తుందో లేదో అని అప్పుడప్పుడూ దాన్ని అప్పజెప్పమనడం, నన్ను ఏకసంథాగ్రాహి అని మెచ్చుకోవడం పరిపాటే. కానీ, ఆ రోజు నేను చెప్పిన పద్యం – ఆయన నాతో కంఠస్థం చేయించింది కాదు; ఆ  మధ్య ఓ సారి తన ఆత్మీయులు గవిని వెంకటస్వామి, సూర్యకుమారి గార్లతో తన చిన్ననాటి ముచ్చట్లు పంచుకుంటూ చెప్పిన తన సొంత రచన. హైస్కూలు చదువుకి ముందే ఛందోబద్ధమైన కవిత్వం రాశారట బ్రహ్మం గారు. ఆ దశలో రాసిన పద్యమే అది (నిజానికి అది verbatim కాదు, అప్పుడు జ్ఞాపకం ఉంది గానీ, 45 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మననం చేసుకుంటుంటే గుర్తుకురావడం లేదు – ఆటవెలదిలో రాసిన పద్యం. “జీవాధారమైన నీటిని ఇంకించడంలో సూర్యుడు మొనగాడే కావొచ్చు గానీ, పేదవాని కంటి బావులలో  నిత్యం ఊరే (క)న్నీళ్లని ఇంకించగలడా…” అని అర్థమొచ్చే అభ్యుదయ పద్యం).

వెంకటస్వామి దంపతులతో తన బాల్య స్మృతులు నెమరేసుకుంటూ, మైళ్ల దూరాన ఉన్న హైస్కూలులో చదువు కోసం ఆయన పడిన ఆరాటం, చేసిన పోరాటం చెబుతూ, కొందరు గురువులు తనని ఎలా ప్రోత్సహించారు, ఎన్నో ప్రతికూల శక్తుల్ని తాను ఎలా ఎదుర్కొన్నాడు – చెప్పుకొచ్చారాయన.

అప్పుడు మాటల మధ్య విన్న ఆయన పద్యాన్ని నేను అప్పచెప్పడం బ్రహ్మం మామయ్యని ఎంతో ఆనందాన్నిచ్చిందనడానికి గుర్తు, మురిపెంగా నన్ను వంగదీసి పిడికిలితో గుద్దినట్టు అభినయించడం!

**     **

ఆ తర్వాత ఎన్నో సార్లు బ్రహ్మం మాష్టారిని అడుగుతూనే ఉన్నాను, ఆత్మకథ గురించి. ఎప్పటికప్పుడు ఆయన వాయిదా వేస్తూనే ఉన్నారు. బహుశా కొత్త శతాబ్ది (సహస్రాబ్ది) తొలి నాళ్లలో అనుకుంటా, ఆయన రాయడం మొదలు పెట్టారు. తొలి అధ్యాయం చదివి వినిపించారు కూడా ఓ సారి. ఆ తర్వాత ఏమయ్యిందో తెలీదు. రాసినంత వరకూ అయినా ఆ అధ్యాయాలు కూడా దొరికినట్టు లేవు.

ఈనాడు వెనక్కి తిరిగి చూస్తే అనిపిస్తుంది — బ్రహ్మం మామయ్య ఎప్పుడూ తన కాలాలకి ఎంతో ముందున్నాడని. మహాకథనాల (Grand Narratives/ Meta Narratives) మీద అపనమ్మకమే postmodern లక్షణమని Jean-François Lyotard (La Condition postmoderne, 1979)  నిర్వచించడానికి పదిహేనేళ్ల ముందే, ఇనుప పంజరాల మతం, వెండి బోనుల మార్క్సిజం, బంగారు సంకెళ్ల రాడికల్ హ్యూమనిజం – మహాకథనాల్ని ఖండించి, విమర్శించిన తాత్వికుడాయన. శాస్త్రం ఒక సంప్రదాయం మాత్రమేననీ శాస్త్ర సంస్థ కూడా మఠంలా ప్రవర్తించగలదనీ Paul Feyerabend తన ‘Against Method’  (1975) గ్రంథంతో పశ్చిమాన్ని కలవరపెట్టడానికి మూడు దశకాల ముందు నాగండ్లలో అదే వాదన వినిపించిన క్రాంతదర్శి; కళ-శాస్త్రం, భావం-భౌతికం, ఆస్తికం-నాస్తికం అనే ప్రతి ద్వంద్వాన్నీ ‘ఒకే నాణెం బొమ్మ-బొరుసులు’ అని తేల్చిన వివేకి. ఆ మేరకు ఆయన స్వభావరీత్యా postmodern చింతనాశీలే — in the making. కానీ ఒకే ఒక్క చోట ఆయన ఆ ఒరవడికి పూర్తిగా ఎదురు నిలిచాడు: పశ్చిమపు వినిర్మాణం చివరికి మనిషినే రద్దు చేస్తే, ఆయన ప్రతి పునాదినీ పెకలించి, ఒకే ఒక్క కేంద్రాన్ని — జ్ఞాత, కర్త, ప్రమాత అయిన మనిషిని — చివరిదాకా నిలబెట్టాడు. అన్ని మహాకథనాల మీదా అపనమ్మకం; ఒకే ఒక్క చిన్న కథ మీద చెక్కుచెదరని నమ్మకం — అది ప్రతి మనిషి కథ. అనేకాంత సత్యదర్శనమనే ప్రాచీన భారతీయ పాయా, ఆధునికతపై నవీన పాశ్చాత్య విమర్శా కలిసే సంగమస్థానంలో — ఒంటరిగా, తెలుగులో, పంజరాలన్నీ కరిగించి పక్షిని మాత్రం దక్కించుకున్న మనీషిగా — నిలబడ్డాడు బ్రహ్మం మామయ్య.  ఆయన మూర్తిమత్వానికి, తత్వానికి తగ్గ పేరు పెట్టవలసి వస్తే, బహుశా అది – ఇది కావొచ్చు:

Postmodernism with a human face!

**     **

 

గొనసపూడి నుంచి డెహ్రాడూన్ దాకా (1926–1946)

నాకు ఊహ తెలిసిన నాటికి బ్రహ్మం మామయ్యగా చేరువైన ఆయన గురించి చెప్పడానికి గొనసపూడి నుంచి మొదలుపెట్టడం నా పరిధికి మించిన పని. కానీ, ఆయన ఆత్మకథ తొలి అధ్యాయాలు వినడం వలన, ఆయన పుస్తకాలు చదవడం చేత రేఖామాత్రంగా అయినా జీవనరేఖలు గురించి చెప్పొచ్చు.

1926 ఏప్రిల్‌లో, ప్రకాశం జిల్లా పరుచూరు దగ్గరి గొనసపూడిలో, హనుమాయమ్మ–వెంకటస్వామి అనే పేద దంపతులకు నాసిన వీరబ్రహ్మం పుట్టారు. వెనకబడిన — మరింత నిక్కచ్చిగా చెప్పాలంటే సామాజికంగా  వెనకకు నెట్టివేయబడ్డ — కులం; ఇల్లు గడవడమే ఒక పోరాటం అయిన బాల్యం. మైళ్లకొద్దీ నడిచి కొన్నేళ్లు, సైకిలు మీద మరికొన్నేళ్లూ చదువుకున్నాడాయన. అయితే ఆ తొలినాళ్ళ నడకల్లోనే ఒక అసాధారణత మొగ్గ తొడిగింది: హైస్కూలు చదువులకు వెళ్లేనాటికే ఆ పిల్లవాడు పద్యకవి. ఒట్టి ఛందోబద్ధంగా మాత్రమే కాదు — భావస్ఫోరకంగా, అనర్గళంగా పద్యాలు అల్లగల కవి. గురువులు ఆ ప్రతిభని గుండెలకు హత్తుకున్నారు. ఆ ఆదరణే ఆ నిరుపేద బిడ్డని పై చదువులకి నడిపించింది.

గుంటూరులో ఆ కుర్రవాడికి తగిలిన మెరుపు — ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి చౌదరి. సూతపురాణము, శంబుకవధ, ఖూనీ వంటి కవిరాజు రచనలు ఆ యువ మనస్సులో నాస్తిక దృష్టినీ హేతువాద దృక్పథాన్నీ నాటాయి. సూతాశ్రమ గీతాలు, ధూర్త మానవ శతకం ఆయనకు కంఠోపాఠాలు. గమనించదగ్గది — బ్రహ్మం గారు హేతువాదంలోకి ప్రవేశించింది తర్కశాస్త్ర పాఠం ద్వారా కాదు; కవిత్వం ద్వారా. పురాణాల్ని ప్రశ్నించడం ఆయనకు మొదట ఒక కావ్యానుభవంగా అబ్బింది. ఈ చిన్న వాస్తవం ఆయన జీవితమంతటికీ తాళంచెవి: కళ ద్వారా హేతువాదాన్ని చేరుకున్న మనిషి, హేతువాదం పేరుతో కళను ఈసడించే వాదానికి ఎన్నటికీ లొంగలేడనుకుంటా.

కానీ పేదరికం తన లెక్క తాను చెప్పింది. ఇంటర్‌ (బహుశా  అప్పట్లో పీయూసీ కావొచ్చు) తో చదువు ఆగిపోయింది. ఇరవై ఏళ్ల వయసులో బతుకుతెరువు కోసం మద్రాసు చేరి, కొత్తగా ప్రారంభమైన ‘విజయప్రభ’ దినపత్రికలో ఉపసంపాదకుడిగా జీవితం మొదలుపెట్టారు బ్రహ్మం. కొద్దికాలానికే ఆ పత్రిక మూతపడింది. సరిగ్గా ఆ దశలోనే — 1946లో — ఆయన జీవితాన్ని శాశ్వతంగా మలుపు తిప్పిన రెండు ఘటనలు జరిగాయి. రెండూ ఒకే సంవత్సరంలో; రెండూ ఒకదానికొకటి అద్దం పట్టేవి.

మొదటిది — డెహ్రాడూన్. ఎం.ఎన్. రాయ్ నిర్వహించిన చరిత్రాత్మక అఖిల భారత అధ్యయన శిబిరం. నవ్యమానవవాదమనే కొత్త తత్వశాస్త్రం రూపుదిద్దుకున్నది ఆ శిబిరంలోనే. హాజరైన కొద్దిమంది జిజ్ఞాసువుల్లో ఇరవై ఏళ్ల బ్రహ్మం ఒకరు. రాయ్‌ని ప్రత్యక్షంగా చూడటం, వినడం — జాతీయవాదపు సంకుచితత్వం, మార్క్సిజపు అసంపూర్ణత, వాటికి ప్రత్యామ్నాయంగా వ్యక్తిస్వేచ్ఛను కేంద్రం చేసుకున్న మూడో మార్గం — ఇవన్నీ అప్పటిదాకా పురాణ విమర్శకే పరిమితమైన ఆయన నాస్తిక–హేతువాద దృష్టికి ఒక తాత్విక భూమికను సమకూర్చాయి. ఆ కనువిప్పుకి ఆయన చెల్లించిన మూల్యం మాత్రం చిన్నది కాదు: స్వతంత్ర కవితా వ్యాసంగానికి పూర్తిగా వీడ్కోలు చెప్పారు. ఉద్యమం ఆయనకు తత్వాన్నిచ్చి, కవిని తీసేసుకుంది. ఆ లావాదేవీ లాభనష్టాల చిట్టా చివరిదాకా తేలకపోవచ్చు — కానీ ఇక్కడే, 1946లోనే, ఆ ఖాతా తెరుచుకుంది- అదే రెండో ఘటన.

రెండోది — నాగండ్ల. రావిపూడి వెంకటాద్రి స్వగ్రామంలో ‘కవిరాజాశ్రమం’ వెలిగిపోతున్న రోజులవి. వెంకటాద్రి, బ్రహ్మం, అన్నం గోవర్ధనరావు — ముగ్గురూ ముమ్మూర్తుల్లా భావవిప్లవ ప్రచారంలో మునిగి తేలుతున్న కాలం. సొంత ఊరు గొనసపూడి అయినా, “మాది నాగండ్ల” అని గర్వంగా చెప్పుకున్న రోజులవి అని బ్రహ్మం గారే రాసుకున్నారు. ఆశ్రమ విద్యార్థుల మనోవికాసం కోసం చర్చలు జరిపించేవారు; చర్చాంశాల నిర్ణయాధికారం వెంకటాద్రిది; ఇద్దరు మిత్రులూ వాదన కోసమే చెరో పక్షం చేపట్టేవారు — ఆ పక్షాలపై ప్రత్యేకాభిమానం వల్ల కాదు. 1946లో ఒకసారి చర్చాంశం: ‘కళా? శాస్త్రమూ? ఏది ప్రయోజనకారి?’ యథాప్రకారం చీటీలు పడ్డాయి — కళ వైపు బ్రహ్మం; శాస్త్రం వైపు వెంకటాద్రి. చర్చ ముగిశాక బ్రహ్మం ఒక్క మాట అన్నాడు: ‘కళ పట్ల అంత దురుసుగా మాట్లాడకుంటే బాగుండేది.’ వెంకటాద్రి జవాబు: ‘వంద పర్సెంట్ కరెక్ట్.’ ఆనాటి మూసల్లోంచి వెంకటాద్రి జీవితాంతం బయటపడలేదు; ఆవుల గోపాలకృష్ణమూర్తి గారు మందలించి ఆపకపోతే ఆ ధోరణిలో అప్పుడే బ్రహ్మం నుంచి ఒక పెద్ద ఇంగ్లీషు వ్యాసమూ వెలువడేది. ఒక విద్యార్థి చర్చ కోసం వేసిన చీటీ, నలభై ఏళ్ల యుద్ధానికి తెర తీసింది.

ఈ ఘటనని నలభై ఏళ్ల తర్వాత తలచుకుంటూ బ్రహ్మం గారు రాసిన వాక్యం ఆయన మేధో నిజాయితీకి కొలబద్ద: ‘ఆనాడు నేను సైన్స్ వైపు కాచివుంటే బహుశా ఇందుకు విపర్యయంగా జరిగి వుండేదేమో!’ తన జీవితకాల వైఖరి కూడా ఒక చీటీ యాదృచ్ఛికత కావొచ్చునని ఒప్పుకోగల ధీరత — ప్రత్యర్థిపై పుస్తకం రాస్తూ కూడా! ఉద్యమం మొత్తం నలభై ఏళ్లలో ప్రదర్శించలేకపోయిన ఆత్మవిమర్శ, ఆ ఒక్క వాక్యంలో ఉంది. 1946 నాటికి బ్రహ్మం చేతిలో ఉన్నవి: ఒక తత్వం, ఒక వీడ్కోలు చెప్పిన కవిత్వం, ఒక మొదలైన వివాదం. వాటి మధ్యనే మిగతా జీవితమంతా నడిచింది.

**     **

బైబిలు బండారం — సిలువ, సమాధి, పునరుత్థానం (1956–1962)

నా చిన్నతనంలో ‘బైబిలు బండారం’ అనే పదబంధం – బ్రహ్మం మాష్టారు రాసిన పుస్తకంగా కంటే ఆయనకి సంబంధించిన చారిత్రక, లేదా ఇతిహాస గాథ(legend) గానే తెలుసు. పానిపట్టు యుద్ధము, ఫ్రెంచ్ విప్లవమూ – అన్న కోవలో ‘బైబిలు బండారం’ అనే వీరబ్రహ్మం వీరగాథ! దాని చుట్టూతా ఏవేవో ఉపకథలు – అనేకానేక శాఖోపశాఖల మతమౌఢ్యం నిలువెత్తు మర్రిమానుగా ఏకమై వెర్రిగా ఊడలు చాచి బ్రహ్మం గారి మీద దాడి చేసిందని, రాజ్యం వత్తాసు పలికి ఏవో నిషేదాజ్ఞలు జారీ చేసిందని! మా ఇంటికి వచ్చి అమ్మ చేతి కాఫీ తాగి వెళ్లినది ఆ యోధుడే అని తొలినాళ్లలో కలిగిన స్పృహ. అయితే, అదొక రచన అని, అసహన సమాజం, అప్రజాస్వామిక ప్రభుత్వం ఆయన జీవితంలో అతి విలువైన ఎనిమిదేళ్ళ కాలాన్ని వృధా చేశాయని ఆలస్యంగా తెలిసింది నాకు.

నిజానికి ఆ గ్రంథరచన బ్రహ్మంగారి ప్రణాళికలో లేనిది. నాకు అర్థమైనదాని ప్రకారం అప్పటికి బ్రహ్మం గారి వయసు నిండా ముప్పై ఏళ్లు కూడా లేవు. ఒక సభలో మతగ్రంథాల్లో — ముఖ్యంగా వేదాలు, హిందూ పురాణాల్లో — ప్రక్షిప్తాలుగా వచ్చి చేరిన చవకబారుతనాన్ని ఎత్తిచూపి ఎండగడుతున్నప్పుడు, ప్రేక్షకుల్లోంచి లేచిన ఓ క్రైస్తవ ప్రచారకుడు ఆధ్యాత్మిక ఆగ్రహంతో బుసలు కొడుతూ, తమ బైబిలు అటువంటి అవకతవకలకు తావే లేని, అచ్చుతప్పులసలే లేని స్వాతిముత్యమని ప్రకటించాడు. తర్కం, హేతువులే కొత్తగా మొలిచిన రెక్కలై ఉత్సాహాలు పరవళ్లు తొక్కించే కుర్రతనంలో ఉన్న యువకుడికి అది కవ్వింపు కాక మరేమవుతుంది? అందుకే బైబిలు మీద దృష్టి పెట్టాల్సివచ్చింది బ్రహ్మంగారికి. మూలాల్ని తవ్వి తీసే స్వభావం కాబట్టి, ఆయన చేసిన విస్తృత అధ్యయన ఫలితమే ఆ బైబిలు డిసెక్షన్ — ‘బైబిలు బండారం’. రచనాకాలం 1956; ‘అవతారిక’, ‘అసంబద్ధాలు’, ‘అసంగతాలు’ — ఇలా అధ్యాయాలుగా విభజించబడిన నిర్మాణం. ఆ గ్రంథం – భాగాలుగా 1957–58లో అచ్చయినప్పుడు వాటిపై ప్రచురణ సంస్థగా ముద్రించుకున్న పేరు గమనార్హం: ‘కవిరాజాశ్రమం, నాగండ్ల’. త్రిపురనేని వారసత్వానికి తాను రాసుకున్న రుణపత్రం అది.

పుస్తకపు పద్ధతి ఏమిటో ఆయన ప్రశ్నల శీర్షికలే చెబుతాయి — పద్యకవి పదును పోగొట్టుకోని ప్రశ్నార్థక శిల్పం: “జంతువులదా మనుష్యులదా? ఎవరి సృష్టి ముందు?”; “కొడుకా? మనుమడా?”; “75 లేక కనీసం 135 — ఏది ఖాయం?”; “యేసు బానిసలను విడిపిస్తాడా? జడిపిస్తాడా?”; “దాసులారా! వళ్ళు దగ్గరుంచుకొని దాస్యం చేయండి!” వాక్యానికి వాక్యం, వచనానికి వచనం ఎదురు నిలబెట్టి, తెలుగు బైబిలును తెలుగు బైబిలుతోనే నిలదీసిన పుస్తకం అది. యేసు వంశావళిపై ఆయన తీర్పు వినండి — ఆ శైలిలో చాటుపద్యాల చురుకుదనం కనిపించి, వినిపిస్తుంది:

“క్రొత్త నిబంధనలో యేసు వంశావళి కొండవీటి చేంతాడంత ఉంది. అంతమాత్రాన దానికి లేని ఘనతా రాదు; అది నిజచరిత్ర అని భ్రమింపజేస్తే నమ్మాల్సిన అవసరమూ లేదు. పరస్పర విరుద్ధ విషయాల్లో ఏది సత్యమవుతుంది?”

కానీ పుస్తకపు అసలు పదును తర్కదోషాల లెక్కింపులో కాదు — నైతిక విమర్శలో ఉంది. బానిసత్వంపై బైబిలు వైఖరిని నిలదీసిన ఈ వాక్యాలు చూడండి:

“యేసు దాసులను విముక్తం చేయటానికి పుట్టాడని హెబ్రీ 2:15లో చెప్పబడింది… కానీ, ఆచరణలో ఒక్క దాసుణ్ణి అయినా దాస్యం నుంచి విడిపించలేదు. ఆయన సమాజంలో వర్గభేదాలు యథాతథంగా ఉండాలని చెప్పటమే కాదు, దాసులు భయభక్తులతో స్వాములకు సేవ చేసి తరించాలని చెప్పాడు.”

అరవై ఏళ్ల తర్వాత కూడా ఆయన ప్రత్యర్థులు ఈ విమర్శకు ఇచ్చిన జవాబు – ‘అది ఆధ్యాత్మిక దాస్యం గురించి’ అనే భాష్యమే తప్ప, పద్దెనిమిది శతాబ్దాల బానిస చరిత్రలో ఆ వచనాలు పోషించిన పాత్రకు జవాబు కాదు. మతవిద్వేషాన్ని బోధించే ద్వితీయోపదేశకాండ వచనాన్ని ఆయన ఎత్తిచూపితే, ప్రత్యర్థులు దాన్ని ‘నాటి మతరాజ్యంలో అది దేశద్రోహ నేరం’ అని సమర్థించారు — అంటే, బ్రహ్మం చేసిన ఆరోపణనే ఒప్పుకుని, దాన్ని విలోమ స్వరంలో మెచ్చుకోలుగా తిరిగి చెప్పారు.

‘బైబిలు బండారం’ మలి ముద్రణ ప్రకటన ఇలా ఉంటుంది:

“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే సిలువ వేయబడి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సమాధి చేయబడి, సుప్రీం కోర్టులో పునరుత్థానం పొందిన — బైబిలు బండారం.”

1958 మార్చి 22న ప్రభుత్వం G.O. Ms. No. 501 ద్వారా, సిఆర్పీసి 99-A సెక్షన్ కింద, పుస్తకాన్ని జప్తు చేసింది; ఏప్రిల్ 10న గెజిట్‌లో ప్రచురించారు. బ్రహ్మం గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రెండు పిటిషన్లు వేశారు — జప్తుని సవాలు చేస్తూ ఒకటి, సెక్షన్ 99-A రాజ్యాంగబద్ధతనే ప్రశ్నిస్తూ మరొకటి. 1959 మార్చి 12న ముగ్గురు న్యాయమూర్తుల ప్రత్యేక ధర్మాసనం తీర్పు వెలువరించింది. మెజారిటీ (ప్రధాన న్యాయమూర్తి పి. చంద్రారెడ్డి, న్యాయమూర్తి శ్రీనివాసాచారి) పిటిషన్లను తిరస్కరించి, జప్తుని సమర్థించారు — ఖర్చులతో సహా; బ్రహ్మం గారి తరఫు న్యాయవాదికి ప్రభుత్వానికి రూ. 200 చెల్లించాలని ఆదేశించారు. 1959లో బ్రహ్మం గారు హైకోర్టులో ఓడిపోయారు.

కానీ ఆ ఓటమిలోనే చరిత్రలో నిలిచిపోయిన ఒక స్వరం మిగిలింది — మరో న్యాయమూర్తి భీమశంకరం గారి సానుకూల తీర్పు. పుస్తకాన్ని (ప్రభుత్వం ఆంగ్ల అనువాదం సమర్పించని కారణాన)  ఆద్యంతం తెలుగులోనే చదివిన ఆ న్యాయమూర్తి, బ్రహ్మం గారి అత్యంత వివాదాస్పద వాక్యం — యేసు జననంపై వ్యాఖ్య — జర్మన్ జీవశాస్త్రవేత్త Ernst Haeckel ప్రసిద్ధ గ్రంథం ‘The Riddle of the Universe’ నుంచి తీసుకున్నదని, ఇంగర్‌సాల్, రస్సెల్, అనటోల్ ఫ్రాన్స్ వంటి పాశ్చాత్య రచయితల రచనల సరసన నిలిచేదేనని రుజువు చేశారు. ఆయన తుది తీర్పు వాక్యాలు భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైనవి:

“Curbs on freedom of expression are a greater evil than any consequences that may follow the exercise of such freedom… one must not be afraid of error so long as truth is free to combat it.”

బ్రహ్మంగారి గురించి భీమశంకరం గారు ఇచ్చిన వర్డిక్ట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది:

“ఏ మతానికైనా లేదా సిద్ధాంతానికైనా కొత్తగా మారిన కన్వర్ట్స్ లాగే, రేషనలిజంలోకి కొత్తగా వచ్చినవారు కూడా కొంత తీవ్రమైన భావజాలంతో ఉండే అవకాశం ఉంది. పిటిషనర్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. అయితే, ఈ తీవ్ర భావజాలం ఎంతున్నా.. అది ఎంత ఖండించదగినదైనా, దానిని ‘ద్వేషం’ అని మాత్రం అనలేం.”

బ్రహ్మం గారికి  ‘దురుద్దేశం లేదు’ అని నిర్దోషిగా ప్రకటించిన ఆ న్యాయమూర్తి, పుస్తకపు రెండో భాగం గురించి మరో అన్యాయాన్నీ బయటపెట్టారు: “ప్రభుత్వం ఆ భాగంలో ఒక్క వాక్యాన్నీ ఉదహరించలేదు; రెండో సంపుటి ఉందని తమకు తెలియదని కోర్టు ముందు ఒప్పుకుంది — అయినా మెజారిటీ రెండు భాగాలనూ ‘ఒకే పుస్తకం’గా జప్తు చేసింది.”

మెజారిటీ బెంచ్ ముందు ఆ న్యాయమూర్తి ఒంటరి వాక్కు ఓడిపోయినప్పటికీ, భారతీయ చట్టంలో మతపరమైన విమర్శకు, ఉద్దేశపూర్వకమైన నిందకు మధ్య స్పష్టమైన రేషనల్ సరిహద్దును గీసిన ల్యాండ్‌మార్క్ తీర్పుల్లో ఒకటిగా అది నిలిచిపోయింది.

అటుపై మూడేళ్లు మళ్లీ న్యాయపోరాటం. ప్రముఖ న్యాయవాది జె.పి. చౌదరి గారు సుప్రీం కోర్టులో ఉచితంగా వాదించి, 1962లో నిషేధాన్ని ఎత్తించేశారు. భారతీయ సర్వోన్నత న్యాయస్థానం – సుప్రీం కోర్టు బ్రహ్మం గారిని నిర్దోషిగా పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, హైకోర్టు వైఖరిని తప్పుబట్టింది. సాంస్కృతికంగా వెనుకబడిన భారత సమాజంలో ఇటువంటి విమర్శ ఒక చారిత్రక అవసరం అని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించిందని ఉద్యమ చరిత్రకారులు నమోదు చేశారు — మతాన్ని విమర్శించే ప్రాథమిక హక్కుకు ఆ తీర్పు ఒక మైలురాయి. చీరాల ఉపాధ్యాయుడి ఆరు రూపాయల పుస్తకం భారత రాజ్యాంగ చరిత్రలో ఒక అధస్సూచిక అయ్యింది. గెలుపు మాత్రం చేదుగా ముగిసింది: జప్తయిన పుస్తకాలన్నీ ప్రభుత్వ గోడౌన్‌లో ఎలుకలు కొట్టేశాయనీ చెదలు తినేశాయనీ అధికారులు సాకులు చెప్పి, ఒక్క ప్రతిని కూడా రచయితకు తిరిగి అప్పజెప్పలేదు.

“ప్రభుత్వం వారి చెదలు, ఎలుకలకైనా నా పుస్తకం రుచించడం చాలా బాగుంది” అని చురకవేశారు బ్రహ్మం గారు.  ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే సిలువ వేయబడి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సమాధి చేయబడి, సుప్రీం కోర్టులో పునరుత్థానం పొందిన — బైబిలు బండారం’ – మలి ముద్రణకి వెళ్లాల్సి వచ్చింది.

ఏడెనిమిదేళ్ల పాటు వృథా అయిన కాలం, కోర్టు ఖర్చులు, ఒంటరితనం! ఆ చేదును బ్రహ్మం గారు ఎలా అంగీకరించారో చూస్తే ఆయన మూర్తిమత్వం అర్థమవుతుంది. క్షమించనిదేదీ లేదు; అధిగమించనిదీ లేదు — ఆ ఒక్క ప్రకటనలో ఆ మనిషి మొత్తం ఉన్నాడు. నిషేధానంతరం పుస్తకం ‘బైబిలే పలుకుతోంది’ అనే కొత్త పేరుతో పునర్ముద్రణ పొందింది. దాని జీవితం ఇప్పటికీ ఆగలేదు: రచన వెలువడిన ఈ ఆరున్నర దశాబ్దాలలో ఇప్పటికి కూడా తెలుగు క్రైస్తవ సంఘాలు వందల పేజీల ఖండన గ్రంథాలు ప్రచురిస్తూనే ఉన్నాయి; ఆయన మరణానంతరం వెలువడిన మరో ఖండన — ఆ పుస్తకపు వేడి చల్లారలేదని నిరూపించింది.  చెదలు, ఎలుకలు కూడబలుక్కొని తినేసిన ‘బైబిల్ బండారం’ గ్రంథం  నేటికీ బతికి ఉన్నది ఎక్కడో కాదు — ఆయన ప్రత్యర్థుల ఉల్లేఖనల్లోనే. ఖండించడం కోసం వారు ఆయన ప్రతి ప్రశ్ననూ యథాతథంగా ఎత్తి రాశారు; ప్రభుత్వం ధ్వంసం చేసిన పుస్తకాన్ని ఆ ప్రత్యర్థులు భద్రపరిచారు, ప్రజల్లోకి ఎక్కువగా తీసికెళ్ళారు.

అయితే నా మాట —  పదేళ్ళ క్రితం నా సంస్మరణలో రాసుకున్నదే — ఇక్కడ మళ్లీ రాయాలి: నిశితమైన ఆయన పరిశీలనకూ పదునైన ఆయన విమర్శకూ ‘బైబిల్ బండారం’ గొప్ప రుజువే అయినా, ఆ రచనకు ప్రేరణ మాత్రం ఒక impulsive క్షణం. దాని ఫలితం — ఏడెనిమిదేళ్ల కాలం వృథా; కోర్టులు, కేసులు; అన్నింటికీ మించి — ఒంటరితనం! అదే బ్రహ్మం గారికి జీవితాంతం మిగిలిన తోడు.

**     **

బ్రహ్మం గారి బడి

బ్రహ్మం గారి బడి – ‘మనీషా విద్యా విహార్’ లోంచి రెండు సార్లు బైటకి వచ్చాను; అంటే దానర్థం బ్రహ్మం మాష్టారు బడిలో రెండు దశల్లో చదువుకున్నాను. రెండు, మూడు తరగతులు – బహుశా ముంతావారి సెంటర్ నుంచి గవర్నమెంట్ హైస్కూలుకి వెళ్లే దారిలో ఉండేది. తర్వాత స్కూలు మార్చారు మా నాన్నగారు- నాలుగు, ఐదవ తరగతులు దర్బార్ రోడ్డులో శ్రీమన్నారాయణ గారి శాంతా కాన్వెంటులో చదివాను. ఆరవ తరగతికి మళ్లీ మనీషా విద్యా విహార్ (బెస్తపాలెం)కి వచ్చాను. “టీచర్స్ కే పాఠాలు చెప్పేస్తున్నాడు వీడు, మెట్రిక్యులేషన్ పరీక్షలు కూడా రాసేలా ఉన్నాడు…” అంటూ  ఒక నెల తిరగకుండానే నన్ను సబ్ జూనియర్ మెట్రిక్యులేషన్ (అంటే ఏడవ తరగతి)కి ప్రమోట్ చేశారు బ్రహ్మం మాష్టారు. అక్కడ ప్రీ మెట్రిక్ వరకూ చదివి, మెట్రిక్యులేషన్ కి విఠల్ మాష్టారి వెంకటేశ్వర టుటోరియల్ కాలేజ్ కి వచ్చేశాను. అయితే, నా బాల మేధావితనాన్ని ప్రదర్శించడానికి, స్వకీయ పురాణాన్ని విప్పడానికి కాదు- ఇదంతా రాయడం; కీలకమైన నా primitive దశలో, తర్వాత మరింత ముఖ్యమైన formative దశలో నేను బ్రహ్మం మాష్టారి బడిలో చదువుకున్నానని, మధ్యలో వేరే స్కూళ్లలో చదవడం వల్ల బ్రహ్మం గారి బడి- ఒక ప్రత్యామ్నాయ విద్యా వ్యవస్థ అని బోధపడిందని చెప్పడానికే.

‘బైబిలు బండారం’ ఉదంతం గెలుపు- ఓటమిలకు ఆవల ఆయనకి మిగిల్చిన ఒంటరితనం – బ్రహ్మం గారిని మరింత స్వతంత్రుడ్ని చేసి ఒక బడి లోగిలిలోకి నడిపించిందని — ఆయన సంస్మరణ వ్యాసం (2015)లో రాశాను. అంటే, బడి స్థాపన ఆయనకి పలాయనం వంటి విడుదల భావం అని, లేదా ఆలోచనల మళ్లింపు అని గానీ నా ఉద్దేశం కాదు; బడి ఆయన ఆదర్శం. భుక్తి కోసం ఎంచుకున్న వృత్తి అయితే, ఆయన స్కూలు – రొడ్డకొట్టుడు కాన్వెంట్ల తామరతంపరలో ఒకటిగా మిగిలేది. కవి ఇస్మాయిల్ గారు అన్నట్టు ‘కిలకిలమంటూ బడిలో పిల్లలు/ పిట్టలన్నిటికీ ఒకే పాట నేర్పాలని/ పట్టు పట్టిన మేష్టారు…’ టైపు బడితెపూజల బెత్తం మాష్టారు అవతారం ఎత్తి బాగా డబ్బు చేసుకోవాలని అనుకోలేదాయన.

అసలు ‘బైబిల్ బండారం’ రచన పూర్వాపరాలకి, బ్రహ్మంగారి బడికి ముడిపెట్టడం కూడా అర్ధసత్యమే అనవచ్చు. ఆ రచన వెలువడింది – 1956 నవంబరులో. పుస్తకాల్ని ప్రభుత్వం అదరగణ్ణంతో లాక్కున్నది – 1958 మార్చి 22న; దానికి హైకోర్టు వత్తాసు పలికింది 1959 మార్చి 12న. బ్రహ్మం గారు ఈ వ్యవహారంలో తలమునకలై ఉండి కూడా సమాంతరంగా ఒక బడిని స్థాపించారు – 1958లోనే. చిలకలూరిపేటలో నెలకొల్పిన ఆ పాఠశాల పేరు – ‘కవిరాజు ట్యుటోరియల్ ఇనిస్టిట్యూట్’. స్కూలు పేరులోనే ఆయన ఆశించిన ఆదర్శం ఉంది: రేపటి ఆశాజ్యోతుల్ని సరికొత్త ఆలోచనల చమురు పోసి వెలిగించడం. ఆ తర్వాత కార్యక్షేత్రం చీరాలకి మారింది. మనీష – తన బిడ్డ పేరు కాబట్టి స్కూలు పేరు ‘మనీషా విద్యా విహార్’ అని పెట్టలేదు.

మనీష (బుద్ధి/ ప్రజ్ఞ) కావాలంటే, జిగీష (జయించాలన్న సంకల్పం) ఉండాలి, దానికి గవేషణ (అన్వేషణ) సాగాలి – అనే జీవనసత్యాన్ని, సత్యాన్వేషణ ఆదర్శాన్ని ప్రతిఫలించేలా ‘మనీషా విద్యా విహార్’ అని పేరు ఖాయం చేశారు. తన పిల్లలకి మనీష, జిగీష్, గవేష్ అని పేర్లు పెట్టుకోవడం కూడా ఆ జీవితాదర్శ ప్రకటనలో భాగమే.

తన బడిలో బ్రహ్మం గారు తొలి ఉపాధ్యాయుడే కాదు, తొలి విద్యార్థి కూడా. ఆయన ఆదిమధ్యాంతర జీవన దశలన్నింటిలో నిలిచింది నిశ్చలమైన నిత్యవిద్యార్థిత్వం. ఆ నేర్చుకునే తత్వం ఎన్ని తరాల తర్వాత కూడా సజీవంగా ఉందో ఒక ఉదాహరణ:

మూడేళ్ల జీవన్ (బ్రహ్మం గారి మనవడు-  మనీష కొడుకు) తాతతో ఆడుకుంటున్నాడు. ఆటలో భాగంగా భాగంగా అడిగారాయన మనవడిని: “పలక మీద కాకిబొమ్మ వేసిచ్చేదా?”

వేసియ్యమన్నాడు మనవడు.

తాత వేసిన బొమ్మని చెరిపేశాడు జీవన్. “అట్టా కాదు, ఇట్టా…” అంటూ పలక మీద కొన్ని పిచ్చిగీతలు గీశాడు.

“.. తన సృజనలో తన ఆనందం… తమ కల్పనాభివ్యక్తిలోనే తమ రసానందం తలదాచుకొని వుంటుంది. కళాపిపాస మానవస్వభావమనటానికి ఇంతకన్నా నిదర్శనమేమి కావాలి?” అని రాస్తారు బ్రహ్మం గారు.

అంతే కాదు, సత్యం సాపేక్షమని, అందరికీ ఒకే పారమార్థిక సత్యం ఉండదనీ స్ఫురిస్తుంది ఆయనకి ఆ సందర్భంలో. తాత గీసిన బొమ్మ వాస్తవమని, మనవడివి పిచ్చిగీతలనీ నిర్థారిస్తుంది తన సత్యం; మనవడి కోణంలోంచి చూస్తే ఆ సత్యం తిరగబడి ఉంటుంది. పెద్దరికం, పెత్తనాల వల్ల ఒకరిది సత్యమని చెలామణి అవుతుంది, ఆ అజమాయిషి లేకపోవడం వల్ల మరొకరిది అసత్యమని అణిగిపోతుంది. అధికారం అర్హతగా, హోదా గీటురాయిగా ఉన్న వ్యవస్థలో సత్యం,  ధర్మం, న్యాయం వంటి విలువలన్నీ ఒట్టి డొల్ల అని తేటతెల్లమవుతుంది.

బ్రహ్మం గారి నిత్య అధ్యయనశీలతే ఇంగ్లీషు, సంస్కృతం, తెలుగు భాషల్లో ఆయన పాండిత్యానికి కారణం. వ్యావహారికానికి కావల్సింది జ్ఞానం కాదు కాబట్టి, సర్టిఫికెట్ సాక్ష్యాలు కనుక బి.ఎ. డిగ్రి, హోమియో వైద్యంలో పట్టా కూడా తీసుకున్నారు. కానీ, ఆ సర్టిఫికెట్ల వల్ల ఆయనకి కొత్తగా ఒరిగిందేమీ లేదు. భిన్నమైన వాతావరణంలో, విభిన్నమైన పద్ధతిలో బోధన జరగాలని మొదటి నుంచీ ఆయన పడిన తపనకి వెనక ఏ డిగ్రీ పట్టాల ప్రోద్బలాలో, చేసిన ప్రయత్నాలకి ప్రేరణగా ఏ మార్గదర్శకాలో లేవు. ఆ బడిని విడిచిపెట్టాక, మరికొన్ని కొత్త ప్రదేశాల్లోకి నేను ప్రవేశించాక, కొన్ని కొత్త తలుపులు తెరుచుకున్నాక – బ్రహ్మం గారి విశ్వకవి విశ్వభారతి, మహాత్ముడి నయ్ తాలిమ్, అరవిందుడి ‘Integral Education’, జిడ్డు కృష్ణమూర్తి ఋషీవ్యాలీ వంటి ప్రత్యామ్నాయ విద్యావిధానాల గురించి తెలుసుకున్నాక, బ్రహ్మం గారికి, ‘బాల్ మందిర్’ సారథి గిజుభాయికీ చాలా పోలికలు తోచాయి  నాకు. ప్రాథమిక విద్యారంగంలో మౌలికమైన మార్పులెన్నో ప్రవేశపెట్టడమే కాకుండా, వాటిని తాను ఆచరించి రుజువుచేసిన గిజుభాయి (గిరిజాశంకర్ భగవాన్ జీ బధేకా)తో బ్రహ్మం మాష్టారిని పోల్చడం సమంజసం కాదేమో. 1885–1939 మధ్య కేవలం 54 ఏళ్లు మాత్రమే జీవించిన గిజుభాయి –  హైకోర్టు న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి 1920లో భావ్ నగర్లో ‘బాల్ మందిర్’ స్థాపించాడు. మాంటిస్సోరీ పద్ధతిని దిగుమతి చేసుకోకుండా, ఖరీదైన విదేశీ ఉపకరణాలకు బదులు జానపద కథలు, పాటలు, ప్రకృతి పరిశీలనలతో దేశీయం చేసిన ఉపాధ్యాయుడాయన. భయమూ శిక్షా లేని బోధనను వాదిస్తూ 1931లో రాసిన ‘దివాస్వప్న’ (పగటికల) నేటికీ ప్రత్యామ్నాయ విద్యాశాస్త్రానికి పునాది గ్రంథం. ఉపాధ్యాయుడు అధికారి కాదు, అనునయించే ‘అమ్మ’ — అన్నది ఆయన సూత్రం (పెద్ద మీసాలు ఉండే గిజుభాయిని ‘ముచ్ఛాలీ మా(మీసాలున్న అమ్మ)’ అని ఆప్యాయంగా పిలిచేవారు చిన్నా, పెద్దా అందరూ.

వైవిధ్యమైన బ్రహ్మం గారి జీవనపార్శ్వాలలో ‘అధ్యాపకత్వం’- ఒకానొకటి; కానీ, గిజుభాయి జీవన కార్యక్షేత్రం – బడి. ‘స్పర్థయా వర్ధతే విద్య’ అనే పాతచింతకాయ పచ్చడి భావనతో స్పర్థ – ఈర్ష్య- ద్వేషం- అశాంతి- అసంతృప్తి ప్రాతిపదికగా చదువు అనేది ఒక పోటీగా అదుపుతప్పిన విద్యావిధానాన్ని సంస్కరించడానికే తన జీవితమంతా వెచ్చించాడు గిజుభాయి. ఆయన గురించి, ఆయన కన్న ‘పగటి కల’ గురించి బ్రహ్మం గారు విని కూడా ఉండలేదు.  బ్రహ్మం గారు రూపొందించిన ‘బడి’కి ప్రేరణలు, ఉత్ప్రేరణలూ ఏమీ లేవు అన్నది అందుకే. తన సహజ జ్ఞానం, అంతర్దృష్టి ఆధారంగానే – బడి, బోధనా పద్ధతులు రూపొందించారాయన. గిజుభాయి ‘భయరహిత బోధన’ను సిద్ధాంతీకరిస్తే, అటువంటి సిద్ధాంతం ప్రసక్తి లేకుండానే ఆచరణే సిద్ధాంతమైంది బ్రహ్మం గారి బడిలో. మాంటిస్సోరీని జానపద కథలతో గిజుభాయి స్థానీయం చేస్తే, నాగండ్ల ఆశ్రమపు చర్చావేదిక రూపంలోంచి అధికారాన్ని రద్దుచేసి ప్రజాస్వామ్యబద్ధం చేశారు బ్రహ్మం గారు. ఇద్దరూ ‘ఉపాధ్యాయుణ్ణి’ అధికారం నుంచి తప్పించారు, బడి గిజుభాయికి అమ్మ, బ్రహ్మం గారికి అది ‘సహాధ్యాయి’. మాటలు వేరు, అంతరార్థం ఒక్కటే. కథాకథనాన్నీ నాటకాన్నీ అభిజ్ఞాన వికాసానికి కేంద్ర సాధనాలుగా గిజుభాయి నిలబెడితే, బ్రహ్మం గారి శనివారం సభల్లో ప్రసంగాల పక్కనే ప్రదర్శనలకీ చోటిచ్చారు. గిజుభాయికి ‘కథ’ ఒక బోధనా పద్ధతి అయితే, బ్రహ్మం గారి బోధనలో తర్కం, రసం కలగలిసి ఉన్నాయి.

శనివారం మధ్యాహ్నం నుంచి మా మనీషా విద్యావిహార్ ఒక విజ్ఞానవేదిక అని చెప్పాను కదా. ఓ సారి  చర్చకి ఎంపిక చేసిన టాపిక్ – ‘మనిషి సంఘజీవి’; ఆ అంశం – అప్పటి మా స్థాయికి చాలా ఎక్కువ. అందుకే అప్పుడు మాది ప్రేక్షక పాత్ర. బైట నుంచి వచ్చిన అతిథులు కొందరు మాట్లాడారు. బహుశా సంఘం, సమసమాజం ప్రాతిపదిక అయిన సిద్ధాంతాల్ని జెండాలుగా, నినాదాలుగా మోస్తున్న భావజాలాల ప్రతినిధులు వాళ్ళు. “Anthropos physei politikon zoon (Man is a social animal)”  అనే ప్రసిద్ధ వాక్యాన్ని తొలిసారిగా ప్రతిపాదించింది ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ (Aristotle) అట. ఆయన తన ‘పాలిటిక్స్’ (Politics) గ్రంథంలో ఆ భావనని బలంగా చాటుతూ, సమాజానికి దూరంగా ఒంటరిగా జీవించేవాడు దేవుడైనా అయివుండాలి, లేదా క్రూర మృగమైనా అయివుండాలి అని వ్యాఖ్యానించాడని వక్తలు చెప్పుకొచ్చారు. బ్రహ్మం మాష్టారు వాదన దానికి పూర్తి వ్యతిరేకంగా సాగింది. గుంపులుగా జీవించడం అనేది కేవలం జంతువుల నుండి మానవుడికి సంక్రమించిన ఒక ప్రాథమిక నైజం మాత్రమే తప్ప, అది మనిషి ప్రత్యేకత కాదన్నారాయన. ఆ రోజు చర్చోపచర్చల్లో ఆయన చెప్పిన కొన్ని విషయాలు మాలో (విద్యార్థుల్లో) బాగా నాటుకుపోయాయి. మనిషి ఆవిర్భవించడానికి కోట్లాది సంవత్సరాల ముందే చీమలు, తేనెటీగలు, తోడేళ్లు, ఏనుగులు, ఇంకా కోతులు తమ రక్షణ కోసం, ఆహారం కోసం గుంపులుగా జీవించేవి- అదే Herd/Pack behavior – అంటే గుంపు ప్రవర్తన. Territorial instinct, మనుషుల్లో ఉండే తెగల పిచ్చి (tribalism), “మన వాళ్లు / పరాయి వాళ్లు” అనే భేదభావం, ప్రాంతీయపరమైన పట్టింపులు- అన్నీ మనిషికి సంక్రమించిన జంతు ప్రవర్తనలే. వ్యష్టి- సమష్టి చర్చలో మనిషికి మనిషికి మధ్య ఉండవల్సింది సహకారతత్వమే గానీ, వ్యక్తి స్వేచ్ఛని హరించే సమష్టితత్వం కాదని బ్రహ్మం గారు వాదించారు. అదే మాకు బోధించారు.

‘ఐకమత్యమే బలం’- ఇది ఒక సందర్భంలో నిర్ణయించబడ్డ చర్చనీయాంశం. దానికి అనుకూలంగా,  ప్రతికూలంగా కూడా ఎవ్వరైనా మాట్లాడొచ్చు. అయితే, ‘కలిసి ఉంటే కలదు సుఖం’, ‘పదిమంది కలిస్తే పండగ’, ‘కలిసి పనిచేస్తే కొండలనైనా పిండి చేయవచ్చు’, ‘ఒంటరి బాటకంటే ఉమ్మడి ప్రయాణం మేలు’ – వంటి పరమ పాజిటివ్ ‘సత్యాల్ని’ ఎవరు మాత్రం ఖండిస్తారు?! కాబట్టి చర్చలో పాల్గొన్న అందరం మా స్థాయి కొద్ది మంచి ఉదాహరణలతో బలపరిచాము, ‘ఐకమత్యమే బలం’ అని. ఒంటరి గడ్డిపోచ దేనికీ పనికిరాదు కానీ, అవన్నీ కలిపి తాడల్లే పేనితే ఏనుగును కూడా కట్టేయొచ్చు అనో; ఒక్క పుల్లను చేతితో విరిచేయొచ్చు కానీ, ఇరవై పుల్లల కట్టను విరవడం ఎవరి తరమూ కాదనో; ఒంటరిగా అణచివేత వ్యవస్థపై పోరాడలేము కానీ, సంఘంగా ఏర్పడితే ఆ వ్యవస్థనే లొంగదీసుకోవచ్చనో… ఇలాంటి సంప్రదాయ ఉదాహరణలే గుప్పించాము.

చెప్పాను కదా, బ్రహ్మం మాష్టారు మా విద్యార్థుల్లో ఒకరని! ఆ జిజ్ఞాసతోనే తనదైన తర్కాన్ని ముందుకుతెచ్చి కొన్ని కొత్త కోణాలు ఆవిష్కరించేవారాయన.

“ఐకమత్యమే బలం అని నిరూపించే ఏ ఉదాహరణనైనా చూడండి… ప్రతిదీ ఘర్షణను, పోరాటాన్ని, హింసను లేదా ప్రతిహింసను మాత్రమే సమర్థిస్తుంది. ఈ పోరాట ధోరణి, దాడి చేసే నైజం లేని… కేవలం సానుకూలమైన, నిర్మాణాత్మకమైన ఒక్క ఉదాహరణనైనా చెప్పగలరా?” అని అడిగారు మమ్మల్ని.

సమావేశ వేదిక నిశ్శబ్దమైంది. ఆ నిశ్శబ్దమే బ్రహ్మం గారి బోధన — జవాబు ఇవ్వకుండా, ప్రశ్నను నాటి వెళ్లిపోవడం!  సుమారు యాభై ఏళ్ల తర్వాత, ఆనాటి హోమ్ వర్క్ ఇప్పుడు సమర్పిస్తున్నాను, ఆలస్యానికి క్షమాపణలతో: ఘర్షణ లేని ఐకమత్యానికి ఉదాహరణ — మనీషా విద్యా విహార్ లో ఆ శనివారపు సభలే. యూనిఫామ్ లేని, ఆడ-మగ గీతలు లేని, బెత్తం లేని ఆ బడే. గడ్డిపోచల్లా, కట్టలోని పుల్లల్లా ఒకరిలో ఒకరు కలిసిపోకుండా — ఎవరి గొంతు వారిదిగా నిలిచే బృందగానంలా, దేనికీ వ్యతిరేకంగా కాక, దేనికోసమో కలిసిన కూటమి. ఆ ఉదాహరణ మా కళ్లముందే ఉందని అప్పుడు తెలియలేదు; అదే బ్రహ్మం గారి బడి!

**      **

 

కళ-శాస్త్ర వివాదం

వివాదపు నేపథ్యాన్ని బ్రహ్మం గారి వాక్యాల్లోనే వినడం ఉత్తమం — ఎందుకంటే ఆ ఒక్క వాక్యంలో ఆయన కథన శిల్పమూ, రస సిద్ధాంత పరిహాసమూ, పత్రికా చరిత్రా అన్నీ ఇమిడి ఉన్నాయి:

“కళా–శాస్త్ర చర్చ 1983 సెప్టెంబరు ‘హేతువాది‘లో శ్రీమతి ఎస్.ఎస్. లక్ష్మి రాసిన ‘ఆధునిక జీవితంలో రసదృష్టి‘తో రసోత్పత్తిని పొంది, 1984 ఫిబ్రవరిలో డాక్టర్ సూర్యకుమారి ప్రమేయంతో రసావేశాన్ని అందుకొని, 1984 మేలో డాక్టర్ సంజీవదేవ్ జోక్యంతో రసకందాయంలో పడి, 1984 డిసెంబరు నుండి వరుసగా మూడు సంచికల్లో సూర్యకుమారిపై రావిపూడి వెంకటాద్రి జరిపిన అనుచిత దండయాత్రతో రసాభాసమయింది.”

ఒక పత్రికా వివాద చరిత్రను రససిద్ధాంత పరిభాషలో నాలుగు దశలుగా చెప్పగల చమత్కారం — కవిత్వానికి వీడ్కోలు చెప్పిన మనిషిలో కవి సజీవంగా ఉన్నాడనడానికి ఇంతకన్నా సాక్ష్యం అక్కర్లేదు. వివాదం సారాంశం: హేతువాద పత్రిక సంపాదకుడు, ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘ అధ్యక్షుడు అయిన రావిపూడి వెంకటాద్రి కళను దూషించి శాస్త్రాన్ని తలకెత్తుకున్నారు; సున్నితంగా విభేదించిన డాక్టర్ సూర్యకుమారిపై మూడు సంచికలపాటు వ్యక్తిగత దాడికి దిగారు; తానే మే నెలలో ఆహ్వానించిన చర్చను తానే తుంచివేసి పత్రికాధిపత్యాన్ని ప్రదర్శించారు. అప్పుడు రంగంలోకి వచ్చింది బ్రహ్మం గారి పుస్తకం — పేరులోనే శస్త్రచికిత్స చేసిన పుస్తకం: కళ-శాస్త్ర వివాదంలో ‘హేతువాది’ హేతివాదం!  హేతువు అంటే కారణం; హేతి అంటే ఆయుధం. హేతువాదం కాస్తా హేతివాదంగా — వాదన కాస్తా వేటుగా — మారిన వైనాన్ని ఒకే అక్షర మార్పుతో పట్టుకున్న శీర్షిక. వలపక్షం, పూర్వపక్షం, ప్రతిపక్షం, ఉత్తరపక్షం — ప్రాచీన భారతీయ తర్కసంప్రదాయపు నాలుగు పక్షాలుగా పుస్తక నిర్మాణం జరిగింది.

కానీ పుస్తకం వ్యక్తిగత ప్రతీకారం కాదు — దాని పునాది ఒక నిర్వచనం. హేతువాదమంటే ఏమిటో బ్రహ్మం గారు ఇచ్చిన నిర్వచనం తెలుగు హేతువాద సాహిత్యంలోనే అత్యంత ప్రామాణికమైనదని నా విశ్వాసం:

“ఒక అభిప్రాయం యొక్క బాగోగులను, ఒక విశ్వాసం యొక్క బాగోగులను, ఒక ప్రవర్తన యొక్క బాగోగులను నిర్ణయించటంలో వివేకాన్ని పరమ ప్రమాణంగా పరిగణించే పద్ధతిని హేతువాదమందాం. కాబట్టి అది ఒక్క ఆలోచనా పద్ధతే కాదు, ఆచరణ పద్ధతి కూడా… ఒకడు హేతువాది అవునా కాదా అనేది నిర్ణయించాల్సింది అతని ఆలోచనా పద్ధతిని బట్టి కాదు, ఆచరణ పద్ధతిని బట్టి. హేతువాదమన్నది కేవలం ఆలోచించేది కాదు; అది జీవించేది… హేతువాదులుగా చలామణి కావటం వేరు; హేతువాదులు కావటం వేరు.”

శాస్త్రీయతకూ శాస్త్రజ్ఞతకూ మధ్య విభజన గురించి ఇలా అంటారు బ్రహ్మం గారు:

“శాస్త్రీయత వేరు; శాస్త్రజ్ఞత వేరు… శాస్త్రజ్ఞత కేవలం ఆర్జిత లక్షణం కనుక ఎవరైనా ఎప్పుడైనా కొద్దిపాటి శ్రమతో శాస్త్రజ్ఞానం సముపార్జించవచ్చు, గ్రంథరచన చేయవచ్చు, శాస్త్రజ్ఞుడనిపించుకోవచ్చు. కాని శాస్త్రీయత మానసిక వైఖరి; విచారణ పద్ధతి. ఇది అతి కష్టసాధ్యం… ఆలోచనలో శాస్త్రీయత అందిరానివారు తమ శాస్త్రజ్ఞతనే శాస్త్రీయతగా భ్రమిస్తూ ఆత్మవంచన చేసుకొంటూ వుంటారు.”

ఆ నిర్వచనం వెంకటాద్రి గారిని ఉద్దేశించినదే. కళల గురించి “నేనెప్పుడూ సీరియస్‌గా ఆలోచించలేదు, అధ్యయనం అంతకన్నా లేదు“ అని వెంకటాద్రి స్వయంగా ఒప్పుకున్నారు — ఒప్పుకుని, కళపై వరుస వ్యాసాలు రాయడం ఒక వైరుధ్యం. దాని మీద బ్రహ్మం గారు ఇలా అంటారు:

“కళల్ని గురించి ఎప్పుడూ సీరియస్‌గా ఆలోచించలేదనీ అధ్యయనం అంతకన్నా లేదనీ ఒకసారి ఒప్పేసుకున్న తర్వాత ఇక వెంకటాద్రి ఏమి రాసుకుంటే ఏముంది? ఎంత రాసుకొంటే ఏముంది? అది ఏమైనా కావచ్చు కాని హేతువాదం మటుకు కాజాలదు; కళావిమర్శ అంతకన్నా కాజాలదు… ఆలోచన, అధ్యయనం లేకుండా ఎన్ని పేజీలైనా ఆశువులాగా రాసేయటం అసాధారణ విషయమే. అది వెంకటాద్రి రచనలోని కళావైదగ్ధ్యం.”

అధ్యయనం చేయని విషయంపై గ్రంథాలు రాయడం — తాను రక్షిస్తున్నానన్న శాస్త్రీయ పద్ధతికే విద్రోహమన్న ఈ నిర్ధారణ దూషణ కాదు; రోగనిర్ధారణ. అలాగే స్వోత్కర్షపై ఆయన చేసిన వ్యాఖ్య, సోక్రటీసునీ భర్తృహరినీ సాక్షులుగా నిలబెట్టిన తీరు: “ఏమైనా ఇలాంటి వాక్యాలు అహంకార ద్యోతకాలు. ఆత్మోత్కర్ష జ్ఞాన లక్షణం కాదు; సరికదా హేతువాద లక్షణమంతకన్నా కారాదు… మనిషి తనకు తెలిసింది స్వల్పాతిస్వల్పమని తెలుసుకోవటమే ఉత్తమ జ్ఞానం.”

ఖండన నుంచి ప్రతిపాదనకు వచ్చేసరికి పుస్తకం తాత్విక శిఖరాలు అధిరోహించింది. కళ-శాస్త్రాల మధ్య వైరం లేదన్నదే మూల ప్రతిపాదన: “ప్రధానంగా కళ అంతరంగ ప్రకృతినీ, శాస్త్రం బహిరంగ ప్రకృతినీ అభివ్యక్తం చేస్తుంటాయి. అయితే యీ విభిన్న ప్రకృతుల మధ్య విరోధభావం లేదు కనుక కళా–శాస్త్రాల మధ్య కార్పణ్యం లేదు. లేని కార్పణ్యాన్ని కల్పించటం కేవలం కృతక పాండితీ ప్రకర్షమే.” శాస్త్రం సర్వసత్యాలు చెబుతుందన్న అహంకారానికి ఆయన జవాబు — ఇంద్రియ పరిమితుల నుంచి కొలతల తత్వం దాకా సాగిన సుదీర్ఘ విచారణ సారాంశం: “సత్యం మారనిది; జ్ఞానం మారేది… శాస్త్రం తెలుసుకొనేది సత్యాలు కావు, కేవలం సత్యశకలాలైన జ్ఞానాంశాలు… కనుక శాస్త్ర సత్యం కూడా సాపేక్షమే.”

శాస్త్రలుబ్ధుల చేతిలో ఐన్‌స్టీన్ ఉన్నాడనుకున్నవారికి ఆయన చూపిన ఐన్‌స్టీన్ మాటలు — పుస్తకంలోని బ్రహ్మాస్త్రం: “మనం అనుభవించగల వాటిలో అత్యంత సుందర వస్తువు మార్మికతే. అసలైన కళలకూ శాస్త్రాలకూ అన్నిటికీ మూలమదే… ఈ అర్థంలో, ఈ అర్థంలో మాత్రమే, నేను మతతత్పరుల కోవకు చెందుతాను.” శాస్త్రవాదులకు శాస్త్రలోకపు అత్యున్నత సాక్షితోనే జవాబు!

**

మనిషి స్వభావంలో జిజ్ఞాస కన్నా రసపిపాస ముందుదని వాదిస్తూ ఆయన చూపిన సాక్ష్యాలు గ్రంథాలయాల్లోవి కావు — ఇంటి అరుగుల మీదివి:

“రంగుల బంతిని, సాదా బంతిని శిశువుకు సమీపంలో కాస్త ఎడంగా వుంచితే ఆ శిశువు కేరింతలు కొడుతూ, దోగాడుతూ రంగుల బంతి వైపే చెంగలిస్తాడు. ఈ వర్ణాకర్షణ ఏమి సూచిస్తుంది? రసపిపాస మానవ స్వభావమని సూచించటం లేదా?”

అదే ఈ పుస్తకపు అత్యంత మౌలిక వాదన — నా దృష్టిలో తెలుగు తాత్విక సాహిత్యానికి బ్రహ్మం గారి సొంత చేర్పు. ఈ ముగింపు వాక్యాలు చూడండి:

“జిజ్ఞాసకు ఆధారాలు బాల్యంలో కనిపిస్తే రసపిపాసకు నిదర్శనాలు శైశవంలోనే వ్యక్తమవుతాయి… జిజ్ఞాసకు నిలయమైన చేతన ఇటీవల మానవునితోనే ఆరంభమయింది; రసపిపాసకు నిలయమైన అధశ్చేతన జీవపరిణామంలో అతిపురాతనమైనది… అలాంటి రసపిపాసను వెనకకు పెట్టి జిజ్ఞాసను ముందు నిలబెట్టటమంటే బండిని గుర్రం ముందు కట్టడమన్నమాటే. ఇక రసపిపాసను గొంతు నులిమివేయాలనటం గుర్రాన్ని కూల్చివేయాలనటమే. కనుక శాస్త్రతత్వం లేని కళాతత్వాన్ని ఊహించటం సాధ్యమవుతుంది కాని, కళాతత్వాన్ని కలుపుకోని శాస్త్రతత్వాన్ని ఊహించటం అసాధ్యం.”

రాయ్ మాటిమాటికీ అనే “It is human nature to enquire”ని ఆయన కాదనలేదు — దాని ముందు మరో వాక్యం రాశారు: ఆనందించడమూ మానవ స్వభావమే; పైగా పురాతనమైనది. చివరగా, ముగింపు — గెలుపు ప్రకటన కాదు; ఆరోగ్య సూత్రం: “కళాతత్వం, మానవ(త)త్వం కుడిమెదడుకూ, శాస్త్రతత్వం, హేతు(త)త్వం ఎడమ మెదడుకూ చెందినవనీ, యీ రెండింటి మధ్య సమస్థితియే ఆరోగ్యమూ ఆనందమూ అనీ… పాఠకులు గుర్తిస్తే నా యీ రచన ఫలప్రదమైనట్లే.”

‘హేతువాది హేతివాదం’ పుస్తకం చివరి పేజీలో మరో ఖాళీ కూడా మిగిలింది — వెన్నుదన్నుగా రానున్నదని బ్రహ్మంగారు  ప్రకటించిన నిర్మాణాత్మక గ్రంథం: “కళా–శాస్త్రాల సముచిత స్థానాలకు దర్పణం పట్టటానికి తెలుగులో తొలి వెలుగురేకగా వెలువడుతున్న ఈ సహేతుక రచన కై ఎదురు చూడండి — కళాతత్వం–శాస్త్రతత్వం.” ఆ ఎదురుచూపు తీరిందా? ఆ గ్రంథం వెలువడిందా?

నాకు తెలిసినంత వరకూ ఆ గ్రంథం రాలేదు. 1985లో అచ్చులో వాగ్దానం చేసిన మహాగ్రంథాన్ని రాయమని నవ్యమానవ ఉద్యమం ఆయన్ని ఎన్నడూ అడగలేదు.

చివరిగా — పుస్తకంలో ఉద్యమం గురించి ఆయన రాసిన అత్యంత చేదు నిజం, ఆర్వెల్ సాక్షిగా:

“ఆ జంతుసంఘం మీద పెత్తనం దొరికిన తర్వాత పందులు ఒక అమూల్యమైన సూత్రాన్ని ప్రతిపాదిస్తాయి: ‘అందరూ సమానులే; కాని కొందరు మిగిలినవారికంటే ఎక్కువ సమానులు.’ ఇది అన్ని సంస్థలనూ పాలించే సూత్రం. రాడికల్ హ్యూమనిస్టు సంఘం కూడా యీ సూత్రానికి మినహాయింపు కాదన్నది నా అనుభవంలో నేర్చుకొన్న పాఠం. ఈ సంఘంలో భావస్వేచ్ఛ వుండరాదు; వున్నా ప్రకటించరాదు; ప్రకటించినా ప్రముఖుల భావాలను గాయపరచరాదు. గాయపరిస్తే మాత్సర్యం పడగవిప్పుతుంది. ఈ ‘వైజ్ఞానిక‘ సంప్రదాయంలో కాటు వేయబడ్డ వాళ్ళలో డాక్టర్ సూర్యకుమారి ఒకరు.”

నిజానికి కాటు వేయబడ్డవారి జాబితాలో మరో పేరు ఎప్పుడో చేరి ఉంది — నాసిన వీరబ్రహ్మం. ఆ కాటు కథ చెప్పే పుస్తకం పేరు: ‘కలలో దేవుడు’.

**      **

 

 

‘కలలో దేవుడు’

బ్రహ్మం మాష్టారి పుస్తకాల గురించి ఉద్యమ పెద్దలు మాట్లాడేటప్పుడు ఒక తేడా వినిపించేది. ‘బైబిలు బండారం‘ అనగానే అతిశయం; ‘హోమియో‘ అనగానే విసుర్లు; ‘కలలో దేవుడు‘ ప్రస్తావన వస్తే  — conspiracy of Silience. క్షణం మౌనం, వెంటనే మాట మార్పు. పెద్దయ్యాక అర్థమైంది: మొదటిది శత్రువుపై దాడి; రెండోది సరిహద్దు తగాదా; మూడోది — ఇంటి తగాదా. కాబట్టి  క్షమించరానిది అదొక్కటే.

‘బైబిలు బండారం’తో బ్రహ్మం గారు శత్రుశిబిరపు గ్రంథాన్ని ఏకారు; ‘హేతివాదం’తో సొంత శిబిరపు శాస్త్రలుబ్ధతను బట్టబయిలు చేశారు. కానీ మూలాల దాకా వెళ్లే మనిషికి అంతిమ పరీక్ష — తన సొంత మూలాన్ని తవ్వగలడా అన్నదే. ఆ పరీక్షకు నిలబడిన గ్రంథమే ‘కలలో దేవుడు — రాయిస్టు దర్శనం’ (సుమారు 1964). నా దృష్టిలో అది ఆయన magnum opus; కారణం పాండిత్యం కాదు — సాహసం. బైబిలును తూర్పార పట్టినందుకు ‘నిషేధం’ జరిమానా; వెంకటాద్రి గారిని నిలదీసినందుకు ఏకాకితనమే బ్రహ్మం గారికి  నజరానా; కానీ, ఎం ఎన్ రాయ్ ని దేవుడి స్థానంలో కూర్చొండబెట్టిన నవ్యమానవ సిద్ధాంతపు మూలాల్నే ప్రశ్నించిన పర్యవసానం – వరద ఏటికి ఎడతెగని ఎదురీత.

దేవుళ్లను జీవితాంతం తిరస్కరించిన హేతువాదికి ఏ వైరుధ్యం లేకుండా దేవుడు ఎదురుపడగల ఏకైక క్షేత్రం: కల. కలగన్నవాడు రాడికల్ హ్యూమనిస్టు; ప్రత్యక్షమైన దేవుడు — రాయిస్టు. తలకిందుల చిత్రం: మామూలు కథనంలో దేవుడు సిద్ధాంతం, ప్రశ్నించేవాడు స్వేచ్ఛాజీవి; ఈ కలలో పార్టీ సభ్యుడే బోనులో ఉన్నవాడు, ప్రత్యక్షమైన ఆత్మే స్వేచ్ఛ. దేవుళ్లను వెళ్లగొట్టిన హేతువాదులు తమకో దేవుణ్ణి తయారుచేసుకున్నారన్న వెటకారం రూపకల్పనలోనే ఉంది — వాళ్ల కలల దేవుడిగా రాయ్‌నే రంగంమీదికి తెచ్చి, వాళ్ల విగ్రహారాధనను బ్రహ్మం గారు ఎండగట్టారు. కలలో దేవుడు రచనకి సంవాద రూపాన్ని ఎంపిక చేయడం యాదృచ్ఛికం కాదు: ఎవ్వరికీ చివరిమాట దక్కని ప్రక్రియ అది — రాయ్ చింతనలో కూడా ఎవరికీ, రాయ్‌కి సైతం, చివరిమాట ఉండకూడదని వాదించడానికి సరైన వాహిక.

రాయిజం, రాడికల్ హ్యూమనిజం ఒకటి కాదు; పర్యాయపదాలు అసలే కాదు. విద్యార్థి దశలో తీవ్రవాదం; చైనా–మెక్సికోల్లో విప్లవవాదం; లెనిన్, ట్రాట్‌స్కీ, స్టాలిన్‌ల సాహచర్యంలో సామ్యవాదం; కాంగ్రెసులో జాతీయవాదం; తాత్వికుడిగా నవ్యమానవవాదం — ఇవన్నీ నిత్య మేధో చైతన్యమనే రాయిజం దారంలో పూసలు. రాయ్ బతికి ఉంటే, స్వేచ్ఛకై అన్వేషించిన ఆ ‘సంతప్తాంతరంగం’ మరే దారుల్లో తన గవేషణ కొనసాగించేదో! చరిత్రే ఈ ప్రతిపాదనకు పెద్ద సాక్షి: దాదాపు ప్రతి దశాబ్దానికీ దారి మార్చిన ఆ మనిషి తన చివరి సంస్థాగత చర్యగా చేసింది 1948లో సొంత పార్టీ రద్దు; తన చివరి మజిలీలో అడుగుపెట్టిన ఆరేళ్లకే, 1954లో, కన్నుమూత. ఆ చివరి మజిలీని శాశ్వత గమ్యంగా ప్రకటించి 22 సూత్రాల రాజ్యాంగంగా బిగించి శిబిరాల్లో వల్లె వేయించడం — బ్రహ్మం గారి దృష్టిలో రాయ్ భక్తి కాదు; taxidermy. చలనమే ప్రాణమైనవాణ్ణి నిశ్చలం చేసి పూజించడం.

అంతకన్నా లోతైన విమర్శ — పంజరాల లోహకత్వం. ధార్మికవాదపు నియతి పంజరాలు ఇనుపవి; మార్క్సిస్టుల ఆర్థిక బోనులు వెండివి; రాయ్ ప్రకృతిబద్ధతా బోనులు — బంగారువి. మెరుపులో తేడా; బంధించడంలో లేదు. మనిషిని మనిషి పరంగానే స్వతంత్రంగా నిర్వచించాల్సింది పోయి, కొన్ని సూత్రాలు ప్రతిపాదించి, ఆ సూత్రాలతో మనిషిని శృంఖలాబద్ధుణ్ణి చేసి, దాన్ని రాడికల్ హ్యూమనిజమనడం రాయ్ సైద్ధాంతిక లోపమనీ, కారణం ఆయన పూర్వాశ్రయపు మార్క్సిస్టు మూసలేననీ బ్రహ్మం గారి నిర్ధారణ. అదే 1964లో మరో వ్యాసం — ‘నవ్యమానవవాదం-మానవ విలువలు’ — రాయ్ తత్వం సత్యానికీ శివానికీ ఇచ్చిన ప్రాధాన్యం సుందరానికి ఇవ్వలేదనీ, ఆ మేరకు అది అసమగ్రమనీ ప్రతిపాదించింది.

ఉద్యమం నుంచి జవాబు ఏమిటి? అవనిగడ్డ శిబిరంలో ఆయన అనుభవ ప్రమాణ వాదానికి ఎదురైనదేమిటో ఆయన మాటల్లోనే:

“‘నా అనుభవంలోకి వచ్చిన ప్రపంచం మాత్రమే నాకు యధార్థం‘ అని నేనంటే, దాన్ని పూర్వపక్షం చేయలేక ‘బ్రహ్మం భావవాదంలో పడిపోయాడు‘ అని నా పరోక్షంలో తీర్మానించుకొన్నారు కొందరు పెద్దలు.“

వాదాన్ని ఖండించలేక వాదిపై ముద్ర — ఆయన పరోక్షంలో. ప్రఖ్యాత సెక్యులర్ మేధావి ఎ.బి. షా ఆ శిబిరంలోనే బ్రహ్మం ప్రతిపాదనలను ప్రశంసాత్మకంగా సమర్థించారని గవిని వెంకటస్వామి గారు నమోదు చేశారు; తీర్పు మారలేదు. చరిత్ర తన పద్ధతిలో మార్చింది: పదిహేనేళ్ల తర్వాత, 1979లో, అంతర్జాతీయ రాయిస్టు అగ్రమేధావి శిబ్‌నారాయణ్ రే — రాయ్ హ్యూమనిజంలో రామణీయకతకు స్థానం లేకపోవడం విచారణీయమని ఒక ప్రధాన వ్యాసంలో రాశారు. చీరాల ‘భావవాది’ 1964లో చెప్పింది కలకత్తా మేధావి 1979లో ఒప్పుకున్నాడు. క్షమాపణ మాత్రం ఎవరూ చెప్పలేదు. ఆ క్షమాపణ కోసం కాక, ఆ వాదం కోసం — ముప్పై ఏళ్ల తర్వాత ఆయన మరోసారి కలం పట్టారు. ఆ పత్రం పేరు: ‘నిర్ణయవాదం-మానవవాదం’.

**      **

 

నిర్ణయవాదం – మానవవాదం: నాలుగో ప్రతిపాదనపై అప్పీలు (1993)

ఈ వ్యాసం నా చేతికి వచ్చినప్పుడు, మొట్టమొదట నన్ను ఆకర్షించింది వాదన కాదు — దాని రచనాకాలం: 1993. అవనిగడ్డ ముద్ర పడిన మూడు దశాబ్దాలకి, అరవై ఏడేళ్ల వయసులో రాసిందది. మడిమ తిప్పని ఆ మహాయోధుడు, తనను వెలివేసిన కూటమి సిద్ధాంతానికే సవరణ అవసరమని చాటుతూ, తన మేజా బల్ల దగ్గర కూర్చుని ఆ ముసాయిదా రాస్తున్నప్పుడు — ఓటమిని అంగీకరించకపోవడానికి ఆయనకు ఎన్నడూ ఏ కారణమూ ఎందుకు దొరకలేదో ఈ వ్యాసమే వివరిస్తుంది.

‘మిసిమి’లో వెలువడిన ‘నిర్ణయవాదం – మానవవాదం’ — ‘కలలో దేవుడు’ కన్న కల ఏమిటో వాంగ్మూలం ఇచ్చిన ఒక అద్భుతమైన కోర్టు డాక్యుమెంట్! ఇది దోస్తోయెవ్‌స్కీ వాక్యంతో ప్రారంభమవుతుంది:

“మనిషి ఒక నిగూఢమైన రహస్యం; ఈ చిక్కుముడి విప్పబడాలి… నేను కూడా సరిగ్గా ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నాను; ఎందుకంటే — నేను మనిషినై ఉండాలనుకుంటున్నాను.”

ఆపై, కేవలం రెండు వాక్యాల్లో, లౌకిక-పారమార్ధిక దర్శనాల సారాంశాన్ని సమగ్రంగా ఆవిష్కరిస్తూ, తత్త్వశాస్త్ర మొత్తం చరిత్రను రెండు శిబిరాలుగా విడదీసే ఒక అద్భుతమైన ఆరంభం:

“‘దేవుడు మనిషిని తన స్వంత ప్రతిరూపంలో సృష్టించాడు’ అంటుంది మతవిశ్వాసం. ‘మనిషే దేవుడిని తన స్వంత ప్రతిరూపంలో సృష్టించుకున్నాడు’ అంటుంది తాత్త్విక వివేచనా దృష్టి. మొదటి ప్రకటన సర్వాధికారత్వాన్ని (అధికారవాదాన్ని) పోషిస్తుంది. రెండవది మానవవాదానికి పునాది అవుతుంది… మానవవాదంలో, మనిషి తన ప్రపంచానికి తానే కేంద్రం; తానే జ్ఞాతగా, కర్తగా, ప్రమాణకర్తగా మారి, సకల అధికారాలకూ తానే మూలాధారమవుతాడు.”

ర్యాడికల్ హ్యూమనిజం మనిషికి ఈ ఉన్నత పీఠాన్ని కల్పిస్తుందా? ఒక సామాజిక తత్త్వశాస్త్రంగా అది కల్పిస్తుందని ఆయన అంగీకరిస్తారు — 22 ప్రతిపాదనలలో మొదటిది “సమాజానికి మనిషే కొలమానం“ అని ప్రారంభమవుతుంది. “అయితే, ర్యాడికల్ హ్యూమనిజం తనపై నిర్ణయవాదపు (డిటర్మినిజం) ముద్ర వేసుకున్నప్పుడే అసలు చిక్కు వచ్చిపడుతుంది.” ఇక ఇక్కడ, ఆ మెటలర్జీని ఇలా వివరిస్తారు బ్రహ్మం గారు:

“స్వయం-నిర్ణయాధికారం (Self-determination) తప్ప మిగిలిన ప్రతి నిర్ణయవాదమూ — అది కర్మ-నిర్ణయవాదం కావచ్చు, ఆర్థిక-నిర్ణయవాదం కావచ్చు, లేదా భౌతిక-నిర్ణయవాదం కావచ్చు — మనిషిని బోనులో బంధించే సాధనమే. ఆ బోను ఇనుపది కావచ్చు, వెండిది కావచ్చు, లేదా బంగారానిది కావచ్చు. తేడా అల్లా దాని లోహంలోనే ఉంది. నాస్తిక ముసుగు తొడుక్కున్న ఇతర ఏ రకమైన నిర్ణయవాదం కన్నా, దైవభావనతో కూడిన కర్మ-నిర్ణయవాదమే ప్రమాదకరమైనదని భావించాల్సిన పనిలేదు.”

దేవుడనే భావన ఎందుకు ప్రమాదకరమో, ఆయన నాటకరంగ పరిభాషలో వివరించారు: “విశ్వనాటకంలో దేవుడు సూత్రధారుడి అత్యున్నత పీఠాన్ని అధిరోహిస్తాడు; మనిషి మాత్రం నాటకరంగంపై ఒక చిన్న పాత్ర పోషించే నిస్సహాయ స్థితికి దిగజారిపోతాడు.” ఆ దర్శకత్వం వహించేది దేవుడైనా, చరిత్రైనా, లేదా ప్రకృతే అయినా — చివరికి చిన్న పాత్రగా దిగజార్చబడేది మాత్రం ఎప్పుడూ మనిషే.

ఆపై బ్రహ్మం గారు ప్రయోగించింది అసలైన బ్రహ్మాస్త్రం! రాయ్ ప్రతిపాదించిన నాలుగో ప్రతిపాదన, మనిషి యొక్క బుద్ధికుశలతను (హేతుబద్ధతను) ప్రకృతి యొక్క నియమబద్ధత నుండి ఉద్భవింపజేస్తుంది. బ్రహ్మం గారి ఎదురుప్రశ్న — అసలు ఆ నియమబద్ధతకు సాక్షి ఎవరు?

“అసలు ప్రకృతిలోని నియమబద్ధతను కనుగొనడం మనిషికి ఎలా సాధ్యమైంది?… ఒకవేళ మనిషే హేతుబద్ధుడై ఉండకపోతే, భౌతిక ప్రపంచం నియమానుసారమైనదని ఎప్పటికీ వ్యక్తమై ఉండేది కాదు. జంతువుకు ప్రకృతి నియమబద్ధమైనది కాదని మనమందరం వాదిస్తాం. ఎందుకు? ఎందుకంటే చైతన్య ఫలమైన హేతుబుద్ధి జంతువుకు ప్రసాదించబడలేదు కాబట్టి.”

దీని నుంచే, వివాదాన్నంతటినీ ఒక దిక్సూచి సూదివలె కుదించిన ఆ మహత్తర సూత్రీకరణ ఆవిర్భవించింది:

“ప్రకృతి నుంచి మనిషి వైపు సాగే ప్రయాణం ‘నైసర్గికవాదం’ (Naturalism); మనిషి నుంచి ప్రకృతి వైపు సాగే ప్రయాణం ‘మానవవాదం’ (Humanism). ‘మానవవాదం’ అనే పదాన్ని ఎంచుకునేవారు మనిషిని తమ తత్త్వశాస్త్ర కేంద్రంలో పీఠాధిపతిగా నిలబెట్టాలి; అక్కడి నుంచి వారిష్టమొచ్చిన చుట్టుపక్కల ప్రకృతి వైపు ప్రయాణించవచ్చు.”

ఆ తర్వాత వ్యాసంలో కనిపించే అత్యంత మేధోవంతమైన వ్యూహం — రాయ్ స్వయంగా ప్రతిపాదించిన కార్యాకరణ సంబంధ (Causation) సిద్ధాంతాన్ని రాయ్‌పైకే తిప్పడం! ఒక కార్యానికి ప్రధాన కారణం దాని అంతర్గతంగానే ఉంటుందనేది రాయ్ సూత్రం: “మట్టికుండకు మట్టి, చెక్కకుర్చీకి చెక్క, గాజు పగలడానికి దాని గుల్లదనమే… ప్రధాన కారణాలు అవుతాయి. కాబట్టి, ర్యాడికల్ హ్యూమనిస్ట్ తత్త్వశాస్త్రం ప్రకారమే, మనిషి హేతుబద్ధతకు ప్రధాన కారణం మనిషి అంతరంగంలోనే ఉండాలి. మనిషి బుద్ధికుశలతకు మూలకారణాన్ని ప్రకృతి నియమబద్ధతలో — అంటే మనిషి పరిధికి వెలుపల — వెతకడం రాయ్ సొంత కారణతా సిద్ధాంతానికే విరుద్ధం. ఈ విధంగా నాలుగో ప్రతిపాదన, ర్యాడికల్ హ్యూమనిజం అంతర్భాగంలోనే కారణతా ఘర్షణను రగిలిస్తూ, తత్త్వశాస్త్రం లోపల ఒక ఆమోదయోగ్యం కాని విరుద్ధతను సృష్టిస్తోంది.”

ఇందులో సాక్షుల జాబితా అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తుంది. హ్యూమ్-కాంట్ వివాదం నుండి క్వాంటమ్ భౌతికశాస్త్రం వరకు సాగిన ఈ శోధనలో:

  • రస్సెల్ వాంగ్మూలం: కార్యాకరణ నియమం (Law of causality) అనేది “గతించిన కాలపు అవశేషం; అది కేవలం ఎటువంటి హానీ చేయదనే అపోహ వల్లనే రాజరికం లాగా ఇంకా మనుగడ సాగిస్తోంది.”
  • పాపర్ ప్రకటన: “హేతువాద సంప్రదాయంలో నిర్ణయవాద మూలకాన్ని తొలగించడం మనకు అత్యంత ముఖ్యం.”
  • నీల్స్ బోర్‌ వాదన: భౌతికశాస్త్ర బాధ్యత ప్రకృతి ఎలా ఉందో కనుగొనడం కాదు; దాని పరిధి “ప్రకృతి గురించి మనం ఏమి చెప్పగలమో“ దానికే పరిమితం.

పదార్థమే నిష్పదార్థమైపోయిన నూతన భౌతికశాస్త్రంపై ఆయన విసిరిన చమత్కారం — ఆంగ్ల శ్లేషను తెలుగులోకి మలచిన తీరు: “‘దినుసూ లేదు — మనసూ లేదు’ (‘No Matter’ — ‘Never Mind’)” అనేది ఆధునిక నినాదం కావచ్చు.

అయితే అత్యంత పదునైన సాక్ష్యం చరిత్ర నుంచే వచ్చింది: “నిర్ణయవాది అయిన రాయ్ లాగే, అనిర్ణయవాది అయిన రస్సెల్ కూడా రాజీపడని మానవవాది, ప్రజాస్వామ్యవాది. స్పినోజా మతాన్ని విశ్వసించిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, మానవవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో ఎన్నడూ వెనుకాడలేదు.” తాత్త్విక ఆలోచనలు వేరైనా నైతిక విలువలు ఏకీభవించినప్పుడు, ఒక సామాజిక తత్త్వశాస్త్రాన్ని భౌతిక నిర్ణయవాదానికి తాకట్టు పెట్టడం వల్ల ఒరిగేదేమిటి? ‘బియాండ్ కమ్యూనిజం‘ గ్రంథంలో రాయ్ స్వయంగా కొండపై ప్రసంగాన్ని (Sermon on the Mount) అనుసరించే క్రైస్తవులను స్వాగతించారు!

అంతేకాదు, నిర్ణయవాద చట్రం వల్ల జరిగిన అసలైన నష్టాన్ని ఆయన నమోదు చేశారు — 1964 నాటి తన ‘సౌందర్య రాహిత్య’ వాదనకు ముప్పై ఏళ్ల తర్వాత దొరికిన కారణమిది: “ర్యాడికల్ హ్యూమనిజం తన 22 ప్రతిపాదనల ప్రాథమిక ప్రకటనలోకి సౌందర్యశాస్త్రాన్ని (Aesthetics) రాకుండా ఉద్దేశపూర్వకంగానే నిరోధించిందని నా నమ్మకం. ఎందుకంటే సౌందర్యశాస్త్రం దాని నిర్ణయవాద చట్రంలోకి ఇమడదు.”

బ్రహ్మం గారు కేవలం ఖండనతోనే ఆగిపోయి ఉంటే అది విమర్శగా మిగిలిపోయేది; కానీ ఆయన ఆగలేదు — ఒక సవరణ బిల్లునే దాఖలు చేశారు! నాలుగో ప్రతిపాదనను తొలగించండి, లేదా ఈ విధంగా సవరించండి అని ముసాయిదాను జతచేశారు:

“ప్రకృతి సర్వసృష్టికారిణి, సర్వజ్ఞురాలు. అది స్వయం-నిర్ణయాధికారంలో నిరంతరం వ్యక్తమవుతుంది. ఈ పరిణామ క్రమంలో మనిషి ఆత్మచైతన్యమున్న, సృజనాత్మక ఆలోచనాపరుడిగా ఆవిర్భవించాడు…”

— తీర్పు లాంటి ఆఖరి వాక్యంతో ముగిస్తూ: “ప్రకృతి నియమబద్ధంగా ఉన్నందున మనిషి హేతుబద్ధుడు కాలేదు; మనిషి హేతుబద్ధుడై ఉన్నందుకే ప్రకృతి అతనికి నియమబద్ధంగా కనిపిస్తోంది.”

ఆ బిల్లుతో పాటు ఒక ఆశ కూడా వ్యక్తమైంది: “రాయ్ ఒక వైజ్ఞానిక తత్త్వవేత్త… ఆయన గనక నేడు జీవించి ఉంటే, నా హృదయపూర్వక సందేహాలను, విభేదాలను పరిగణనలోకి తీసుకోవడానికి… తత్త్వశాస్త్రాన్ని పునఃసమీక్షించి సంస్కరించడానికి తగిన చర్యలు తీసుకోవడానికి ఎన్నడూ సంకోచించేవారు కాదని నేను నమ్ముతున్నాను.” వ్యాసం యొక్క అంతస్సారం — ఏడు మాటల్లో ఆయన సమగ్ర జీవితం: “రాయ్ అక్షరాల కన్నా రాయ్ ఆంతర్యం మిన్నగా ప్రకాశించుగాక!”

అయితే ఇక్కడ బ్రహ్మం గారి నిష్పాక్షికమైన సమీక్షను వదిలివేయలేమనిపిస్తోంది.  ప్రకృతి నియమబద్ధతకు ఒక ప్రామాణికమైన వివేచనాత్మక సాక్షి అవసరమనే ఆ ‘బ్రహ్మాస్త్రం’ కాంట్ తాత్త్విక విప్లవానికి చెందినది; కానీ అదే వ్యాసంలో ఆయన కాంట్‌ను నిర్ణయవాదానికి పితామహుడిగా నిందించారు. కాబట్టి, తాను ప్రయోగించిన ఖడ్గం ఎక్కడ తయారయ్యిందో ఆ కొలిమి వివరాల్ని ఎక్కడా బ్రహ్మంగారు బైటపెట్టలేదు. తన ముసాయిదాలో ప్రకృతికి ఆపాదించిన ‘సర్వజ్ఞురాలు’ అనే విశేషణ: స్వయం-నిర్ణయాధికారం గల ప్రకృతి సమర్థనీయమైన నైసర్గికవాదమే; కానీ సర్వజ్ఞురాలైన ప్రకృతి — స్పినోజా ప్రతిపాదించిన Deus sive Natura (దేవుడే ప్రకృతి) — తనను అవనిగడ్డలో నిలదీసిన, తనమీద ముద్ర వేసిన ప్రత్యర్థులకి  తనే స్వయంగా అందించిన సాక్ష్యం లాంటిది. ఇక అదే వ్యాసంలో — పరమార్ధ వస్తువును (Thing-in-itself) వేదాంతి చెప్పే ‘సత్’ లేదా ‘బ్రహ్మము’తో పోల్చేవారిని తాను పరిహసించలేనని చెప్పిన వాక్యం ఒక విషయాన్నే స్పష్టం చేస్తోంది: ఈ సరిహద్దు దాటడం అజ్ఞానంతో జరిగింది కాదు; పక్కా ప్రణాళికతోనే జరిగింది. హేతువాద ఉద్యమం లోపల ఐన్‌స్టీన్ తరహా ‘విశ్వ రసజ్ఞత’ (Cosmic mystic) కలిగిన ఒక వ్యక్తి జీవితాంతం సగం ముసుగులోనే నడిచాడు; ఈ వ్యాసంలో ఆ ముసుగు తొలగిపోయింది. దానికి మరో నిదర్శనం –  స్థూల ప్రపంచ నియమాలు సూక్ష్మ ప్రపంచాన్ని శాసించవనే సరైన వాదనకు ఉదాహరణగా, ఆయన తన హోమియోపతిలోని ‘ Ipecacuanha’ మోతాదు సూత్రాన్ని చేర్చడం — గురుత్వాకర్షణ వర్సెస్ క్వాంటమ్ ఉదాహరణ సరిపోయే చోట, కావాలని తన వైద్య విజ్ఞానాన్ని వ్యాసంలోకి తెచ్చి, విమర్శకులకు ఒక కవ్వింపు సవాలు విసిరారు బ్రహ్మం గారు.  ఈ వ్యాసం ఏ కీలకమైన శైలిలో ప్రారంభమైందో, సరిగ్గా దాంతోనే — దోస్తోయెవ్‌స్కీ దృక్పథంతో, బ్రహ్మం గారి స్వంత సంతకంతో ముగుస్తుంది:

“మనిషిలో అధోపాతాళ నరకానికి దిగిపోయే లోతులున్నాయి; అత్యున్నత స్వర్గాన్ని అధిరోహించే ఎత్తులూ ఉన్నాయి. ఎందుకు? ఎందుకంటే స్వర్గమూ నరకమూ రెండూ మనిషి స్వయంగా నిర్మించుకున్నవే. మనిషి ఎల్లప్పుడూ ఒక అద్భుతమైన సంఘటన! లోతుపాతులు అందని అనంత నిగూఢ రహస్యం!”

పంతొమ్మిదవ శతాబ్దంలో హేతుబద్ధ నిర్ణయవాదంపై అత్యంత తీవ్రమైన దాడి చేసిన నవలాకారుడి మాటలతో ఒక హేతువాది నిర్ణయవాద వ్యాసాన్ని ప్రారంభించి ముగించడం ద్వారా హృదయంలో కవి బ్రహం గారు, చివరి నిమిషం వరకు తన ప్రతిపాదనను రూప (Form) సారాల ప్రాతిపదికనే వాదిస్తున్నారని నిరూపిస్తుంది.

**      **

 

ఎడతెగని ఏకాకి ప్రయాణాలు

 

బెస్తవారిపేట ఇంట్లోని ఒక అలమరాలో, పుస్తకాల పక్కనే బుల్లి బుల్లి సీసాల వరుసలు అమర్చి ఉండేవి — తెల్లటి పంచదార మాత్రల గుళికల సీసాలు! ఎవరైనా ఉద్యమ పెద్ద ఒకరు ఆ సీసాలను చూసి పెదవి విరిచిన సంఘటన నాకు అస్పష్టంగా గుర్తు. పుస్తకాల పక్కన సీసాలు ఉంటే తప్పేమిటో అప్పట్లో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతోంది: బ్రహం గారి దృష్టిలో ఆ అలమరాలో ఉన్నవి రెండూ ఒక్కటే — వేరొకరు గీసిన గీతను దాటి, తన మటుకు తాను స్వయంగా పరీక్షించి స్థిరపరుచుకున్న ముగింపులు. అయితే, ఆ పెదవి విరిచేవారి దృష్టిలో మొదటివి కీర్తికి సంకేతమైతే, రెండవవి అపకీర్తికి ప్రతీకలు!

 

మహా నిఘంటుకర్తలు “Radical” కు ఇచ్చిన అర్థం: మూల, ఆదిమ — అంటే వేళ్లకు, మూలాలకి సంబంధించినది.

 

ఆ వెలుగులో చూస్తే, ‘రాడికల్ హ్యూమనిజం’ ను తెలుగులోకి ‘నవ్య మానవవాదం’ అని అనువదించడమే ఒక అనువాద పొరపాటు: “రాడికల్” లోని మూలాల వేట (Root-seeking) ఆ అనువాదంలో కొట్టుకుపోయి, “నవ్య” లోని ఆధునిక ఫ్యాషన్ మాత్రమే మిగిలిపోయింది. ఆ దిగుమతి చేసుకున్న పదజాలం ఎంత సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, బ్రహ్మం గారిని మాత్రం ఆ చట్రంలో ఇమడ్చలేము. ఆయన నిజమైన ‘రాడికల్’ మానవవాదుల్లో అత్యంత అరుదైన వ్యక్తి — వేళ్ల వరకు వెళ్లేవారు, పునాదులని తుదివరకు శోధించేవారు. కానీ, మూలాల వరకు పయనించే వ్యక్తికి ఈ ప్రపంచం విధించే శిక్ష ఒక్కటే: ఏకాకిగా మిగిలిపోవడం!

**

 

ఆయనకు ఇంగ్లీషు, సంస్కృతం, తెలుగు భాషల్లో అపారమైన ప్రావీణ్యం ఉన్నప్పటికీ, విశ్వవిద్యాలయ డిగ్రీల అండదండలు ఉండాలనే ఉద్దేశంతో బి.ఏ. చేశారు — దాంతో పాటు హోమియోపతి వైద్యంలో డిప్లొమా కూడా పొందారు. గవిని వెంకటస్వామి గారు నమోదు చేసిన కాలక్రమం ఇక్కడ అత్యంత కీలకమైనది:

“హోమియోపతి వైద్యం శాస్త్రీయమైనదని తనను తాను సంతృప్తి పరుచుకున్న తర్వాతనే ఆయన ఉపాధ్యాయ వృత్తిని వదిలి హోమియో ప్రాక్టీస్ ప్రారంభించారు.”

మొదట పరిశీలన, తర్వాత నిర్ధారణ, ఆపై ఆచరణ — ఈ పద్ధతి పూర్తిగా ఆయన స్వంతం; కానీ ఆ నిర్ధారణే వివాదాస్పదమైంది. ఆయన హేతువాద సహచరులు హోమియోపతిని అశాస్త్రీయమైనదని ఖండించినప్పుడు, ఆయన దానికి సమాధానంగా రాసిన పుస్తకం దాని శీర్షికలోనే సవాలును మోసుకొచ్చింది: “వివేకం ఉన్నవారు హోమియోపతిని తిరస్కరించగలరా?”

 

గవిని గారి వాంగ్మూలం ప్రకారం:

“హోమియోపతి సమర్థనలో ఆయన ఈ పుస్తకంలో చేసిన వాదనను ఈనాటికీ ఎవరూ ఖండించిన దాఖలాలు లేవు.”

 

దాన్ని ఎవరూ ఖండించలేదనేది నిజమే కావచ్చు — కానీ ఖండించడానికి పూనుకోకపోవడం కూడా ఒక రకమైన సమాధానమేనని ఈ పుస్తకం నమోదు చేయాలి. ఆ వైద్య ప్రవృత్తి చివరి వరకు కొనసాగింది: 2014లో — అప్పటికి ఆయన వయస్సు 88 ఏళ్లు — ఆయన ‘సారూప్య వైద్య దర్శనం’ ప్రచురించారు. ఆయన మరణానికి ఒక సంవత్సరం ముందు కూడా ఆ కలం ఆగలేదు.

 

ఇక్కడ ఈ పుస్తకం యొక్క నిష్పాక్షిక ఒప్పందాన్ని ఎలాంటి మినహాయింపులు లేకుండా అమలు చేయాల్సిందే. హోమియోపతి చికిత్సా సూత్రానికి వ్యతిరేకంగా ప్రధాన స్రవంతి వైద్యశాస్త్రపు ప్రస్తుత ఆధార సహిత తీర్పు నిలబడింది — ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు; అది వైజ్ఞానిక రంగ అనుభవం చేసిన నమోదు. అయితే బ్రహ్మం గారి వైపున కూడా నమోదు చేయాల్సిన వాస్తవాలు ఉన్నాయి. ఆయన హోమియోపతిని ఒక విశ్వాసంగా స్వీకరించలేదు — దాన్ని ఒక తాత్త్విక వాదనగా సమర్పించారు; హ్యూమనిజంతో పాటు హోమియోపతిని విశ్లేషిస్తూ తెలుగులోనూ, తార్కుండే సంపాదకత్వం వహించిన ఆంగ్ల పత్రిక ‘ది రాడికల్ హ్యూమనిస్ట్’ లోనూ వ్యాసాలు రాశారు.

 

సమాధానం చెప్పడానికి వీలైన అన్ని వేదికలపైనా తన ప్రశ్నను ఉంచిన ఒక వ్యక్తిని సులభంగా ‘అమాయకుడు’ అనడం తేలికే; కానీ ఆయన పద్ధతిలోనే ఆయనని ఓడించడం — అదెవరూ చేయలేదు. పైగా, హోమియోపతిని తిరస్కరించడం పట్ల ఆయనకు ఎన్నడూ అభ్యంతరం లేదు — తిరస్కరించిన పద్ధతి పైనే ఆయన అభ్యంతరం. పరిశీలించకుండా, ప్రయోగాలు చేయకుండా — ‘సైన్స్’ పేరిట ముందే తీర్పులు ప్రకటించడం అనేది, ఆయన ‘హేతువాదం’లో స్పష్టంగా నిర్వచించిన ‘సైన్స్-జ్ఞానానికి’, ‘శాస్త్రీయ దృక్పథానికి’ నడుమ ఉన్న వ్యత్యాసానికి మరో సమరక్షేత్రం మాత్రమే!

 

కాబట్టి ఈ పుస్తకపు తీర్పు ఇలా ఉండాలి: హోమియోపతి విషయంలో ఆయన పొరపాటుపడి ఉండవచ్చు — కానీ పొరపాటు పడినా, ఆయన తన జీవితకాల స్థిరమైన పద్ధతిలోనే పొరపాటు పడ్డారు: శాస్త్రీయ ఆర్థడాక్సీ యొక్క సామాజిక రూపంతో సహా ఏ సంప్రదాయ సిద్ధాంతమూ ఏ ప్రశ్ననూ హుకుం ద్వారా ముగించకూడదనే పద్ధతి అది! సైన్స్ పేరిట ‘సైంటిజం’ లో మునిగిపోతూ, కేవలం పట్టుదలతో వాదించిన సహచరుల నుండి దూరంగా జరగడం — ఒక హోమియోపత్‌గా ఆయన చివరివరకు సాగించిన మరొక దీర్ఘ ఏకాంత ప్రయాణం.

**

రెండవ ప్రయాణం: జడభరతుల మధ్య- విషాదమేమిటంటే, ఆయనకు ఆ ఏకాంతాన్ని ప్రసాదించింది శత్రువులు కాదు, కనుపాపల వంటి సహచరులే! వారి గురించి ఆయన  రాసిన వాక్యాల్ని మళ్లీ ప్రస్తావించుకుంటే – “అందరూ సమానులే; కానీ కొందరు ఎక్కువ సమానులు… రాడికల్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ కూడా ఈ సూత్రానికి మినహాయింపు కాదని నా స్వంత అనుభవం ద్వారా నేర్చుకున్న పాఠం.”

 

అదే పుస్తకంలో, ఆ పాఠం కేవలం వ్యక్తిగత ద్వేషం కాదని నిరూపించే మరొక వాక్యం ఉంది — అది తనను తాను కూడా మినహాయించుకోని వాక్యం:

“ఒక మనిషిని నిజమైన హేతువాదిగా మార్చేది ఇతరుల విమర్శ కంటే ఆత్మవిమర్శే. అధ్యయనమూ ఆలోచనా లేకపోతే ఆత్మవిమర్శకు మేత దొరకదు… ఉదాహరణకు, నేను నా రాతల్లో, ఉపన్యాసాల్లో హేతువాదాన్ని గుప్పించి, మానవతా మంత్రాలు వల్లించి — నా చేతల్లో మాత్రం కులతత్వవాదిగా, అవినీతిపరుడిగా వ్యవహరించాననుకోండి. నా హేతువాదం, నా మానవవాదం బూడిదలో పోసిన పన్నీరు కాదా? విషం నింపిన పాలపాత్రలు, తేనె పూసిన కత్తులు ఆచరణలోనే బయటపడతాయి — ఆలోచనల్లో ఎప్పటికీ దొరకవు!”

 

ఉద్యమంపై తన నిందారోపణను “నేను” అనే పదంతో ప్రారంభించే విమర్శకుడు — ఆ ఒక్క ఎంపికే బ్రహ్మం గారిని జడభరతుల నుండి వేరుచేసి నిలబెడుతుంది. మరి ఆ జడభరతులు ఎలా సమాధానమిచ్చారు?

  • బ్రహ్మం గారి మొదటి వర్ధంతి సందర్భంగా గవిని గారి నివాళిని ప్రచురిస్తూ, దానికి ముందుమాటగా రాయబడిన ఎడిటోరియల్ నోట్ ఇలా ఉంది: “భావాల విషయంలో కొందరితో విభేదించినప్పటికీ, ఉద్యమ చరిత్రలో అటువంటి వారు పోషించిన పాత్రలోని వాస్తవాలను గుర్తించడానికి, అంగీకరించడానికి మండలి ఎటువంటి అహంకారం లేకుండా సిద్ధంగా ఉంది.” ఒక మరణించిన వ్యక్తిని గౌరవించడానికి ముందు కూడా, “గుర్తుంచుకోండి, మేము ఆయనతో విభేదించాము” అని రికార్డు చేయాల్సి రావడం — ఆ Disclaimer లేనిదే స్మరించుకోవడం కూడా సాధ్యపడని ఒక సంస్కృతి!

 

అయితే అస్మదీయులదైనా, తస్మదీయులదైనా జడత్వం మీద బ్రహ్మం గారు చెప్పిన చివరి మాటలో కోపం లేదు — అదొక ఆశ్చర్యకరమైన సమతుల్యత (Equipoise)! కళా-ద్వేషాన్ని ఖండించిన అదే కలంతో ఆయన సైన్స్-ద్వేషాన్ని కూడా ఖండించారు. నాస్తిక ఉద్యమ పితామహుడైన గోరా శాస్త్ర సాంకేతికతల పురోగతిని ఎలా వ్యతిరేకించారో గుర్తుచేసుకుంటూ, బ్రహ్మంగారు ఇలా రాశారు:

 

“ఈ ఆవేదన అర్థం లేనిది కాదు… ఆ విధంగా గోరా విజ్ఞానశాస్త్రానికి, లలితకళలకూ రెండింటికీ వ్యతిరేకి. ఆ ఆలోచన సరిగ్గా లేకపోయినా, దానికో సమతుల్యత ఉంది. కానీ వెంకటాద్రి వాదనలో ఆ సమతుల్యత లేదు. గోరా ఏ ప్రయోజనతా దృష్టితో శాస్త్రాలను నిరోధించారో, అదే దృష్టితో వెంకటాద్రి సైన్స్‌ను పూజిస్తూ కళలను అడ్డుకుంటున్నారు. ఇది అపహాస్యం కాదా?”

 

పొరపాటైన వాదనకు కూడా దాని అంతర్గత స్థిరత్వాన్ని బట్టి తగిన గౌరవాన్ని ఇవ్వగల విమర్శకుడు — ఈ సమవర్తి తరహా స్వభావం, తన ప్రత్యర్థుల మధ్య వ్యత్యాసాన్ని వివేచించగల ఈ సామర్థ్యమే ఆయనను కేవలం కసితో ఉన్న వ్యక్తుల నుండి వేరు చేస్తుంది; అంతేకాదు, ఆయన ఏకాంతాన్ని మరింత సమాధానం లేని ప్రశ్నగా మారుస్తుంది.

 

ఎందుకంటే ఆయన తొంబై ఏళ్ల ప్రయాణంలో ప్రతి ప్రయాణపు టికెట్ ధర ఒక్కటే:

  • బైబిల్‌ను విమర్శించినందుకు — నిషేధం;
  • రాయ్‌ను విమర్శించినందుకు — ‘భావవాది’ అనే ముద్ర;
  • కళల పక్షం వహించినందుకు — వెలివేత మౌనం;
  • హోమియోపతిని నమ్మినందుకు — పరిహాసం!

రూపాలు మారాయి తప్ప శిక్ష ఎన్నడూ మారలేదు. ఏ రూపంలోనైనా ఒంటరితనమే తన శాశ్వత సహచరి. అయితే, ఏకాకితనమనే తన సహచరి విషయంలో ఆయనకి ఎన్నడూ  ఒక్క ఫిర్యాదు కూడా లేదు. పర్యవసానాల చింత లేకుండానే సత్యమార్గంలో ప్రయాణం కొనసాగించారు బ్రహ్మం గారు.

 

ఇక మిగిలింది ఒకే ఒక ప్రశ్న — వందేళ్ల ప్రయాణం తర్వాత, ఈ సంస్మరణ సందర్భంలో ఆ సుదీర్ఘ పథికుడికి మన నివాళి ఏమిటి?

**     **

 

“చదవండి! చదివించండి!”

 

‘చదవండి… చదివించండి’

బ్రహ్మం మామయ్యతో నా అనుబంధాన్ని, అనుభవాన్నీ తలుచుకుంటున్న ఈ సంస్మరణ సందర్భంలో నాకు పైన రెండు మాటలే పదే పదే గుర్తొచ్చాయి. ‘కళ- శాస్త్ర వివాదంలో హేతువాది హేతివాదం’ పుస్తకపు చివరన ‘బైబిల్ బండారం‘ మూడవ ముద్రణ ప్రకటన ముక్తాయింపు అది.

 

చదవండి… చదివించండి – అని ప్రతి రచయితా ఆశిస్తాడు. అందులో విశేషం ఏమీ లేదు. అయితే, ఆరు రూపాయల పుస్తకం కోసం, వెయ్యి ప్రతుల ఆశతో నలభై ఏళ్ల క్రితం ఆయన ఆ రెండు మాటల్లో చేసిన విజ్ఞప్తి — నేడు ఆయన శతాబ్ది వేళ కేవలం ఒక విజ్ఞప్తిగా నాకు స్ఫురించడం లేదు, అదొక ఆదేశంగా వినిపిస్తోంది!

శతాబ్ది ఉత్సవాలకు ఒక అలవాటైన వ్యాకరణం ఉంటుంది — విగ్రహం చెక్కించడం, పూలదండలు వేయడం, సభలు పెట్టడం, గొప్పతనాన్ని శ్లాఘించడం! ఆ రొడ్డకొట్టుడు ఆనవాయితీని బ్రహ్మం గారికి కూడా అన్వయించడం కంటే మరొక పెద్ద అపచారం ఉండబోదు. విగ్రహాలంటే ఏమిటో నిజమైన iconoclast అయిన బ్రహ్మం గారి జీవితమంతా చాటిచెప్పింది: చలనం ఆగిపోయిన చోట ప్రారంభమయ్యే ఆరాధనకి గుర్తు విగ్రహం! ‘కలలో దేవుడు’లో ఎం.ఎన్. రాయ్‌ను 22 ప్రతిపాదనల్లో బంధించినందుకు శిష్యులను నిలదీసిన ఆ చైతన్యశీలిని తీసుకువెళ్లి రాయిలో బంధిస్తే, లేదా అటువంటి జడత్వపు నివాళికి పూనుకుంటే ఆ విడ్డూరానికి మొదట నవ్వేది ఆయనే; ఆ నవ్వు మనల్ని ఎప్పటికీ క్షమించదు.

 

ఆత్మప్రశంసను, అంధభక్తిని ఈసడించుకున్న బ్రహ్మంగారికి మనం ఇవ్వగలిగిన ఏకైక నివాళి — ఆయన మనకు వదిలివెళ్లిన పనిని పూర్తిచేయడమే! ఆ పని జాబితా చిన్నదే; కానీ అందులోని ప్రతి అంశమూ ఒక ప్రతీకార రహిత బాధ్యత.

  1. పునర్ముద్రణ: గోడౌన్ ఎలుకలు తినివేసిన పుస్తకం, శత్రువుల ఉల్లేఖనాల్లో మాత్రమే బతికి ఉండిపోయింది. ఈ అవమానం ఆయన శతాబ్ది సంవత్సరంలోకి కూడా కొనసాగడం మన తరపు పరాజయం. సుప్రీంకోర్టు చరిత్ర కలిగిన ‘బైబిల్ బండారం‘, ‘కలలో దేవుడు — రాయ్ వాద దర్శనం‘, ‘హేతువాది హేతువాదం‘, మరియు కళ-సైన్స్ వివాదంలో ఆయన వాగ్దానం చేసిన సాహిత్యంలో మిగిలి ఉన్నదేదైనా — ఇవన్నీ పాఠకుడికి అందుబాటులో లేకుండా పోయిన ప్రతి ఏటా, నిషేధం వేరొక రూపంలో కొనసాగుతున్నట్లే! ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది; కానీ మన ఉపేక్ష వల్ల ఏర్పడిన నిషేధాన్ని ఎత్తివేయాల్సింది మనం.
  2. అన్వేషణ: 1985లోనే అచ్చులో వస్తుందని వాగ్దానం చేసిన ‘కళాతత్త్వం–శాస్త్రతత్త్వం‘ హస్తప్రతి ఏమైంది? సెప్టెంబర్ 1992 ‘ది ర్యాడికల్ హ్యూమనిస్ట్’ పత్రికలో వచ్చిన “Aesthetics and Radical Humanism” (సౌందర్యశాస్త్రం మరియు ర్యాడికల్ హ్యూమనిజం) అనే వ్యాసం — ఆయన స్వంత ఉల్లేఖన ప్రకారం ఆయన తాత్త్విక ఆలోచనకు ఇంగ్లీషు ప్రవేశద్వారం — దాన్ని గ్రంథాలయాల కబోర్డుల నుండి బయటకు తీయాలి. ‘సమీక్ష’లోనూ, వివిధ హేతువాద పత్రికల్లోనూ చెల్లాచెదరుగా ఉన్న ఆయన వ్యాసాలన్నింటినీ ఒక సంకలనంగా తీసుకురావాలి. చీరాల ఇంట్లోనూ, పిల్లల వద్ద, శిష్యుల వద్ద మిగిలి ఉన్న ప్రతి కాగితమూ ఇప్పుడు మనకొక అపూర్వ ప్రాచ్యసంపద (Archive).
  3. అనువాదం: రాయ్ సిద్ధాంతంపై తెలుగులో వచ్చిన అత్యంత లోతైన అంతర్గత విమర్శ తెలుగు సరిహద్దులు దాటకపోవడం వల్ల, భారతీయ హేతువాద చరిత్ర ఒక అసంపూర్ణ కథగానే మిగిలిపోతోంది. నాలుగో సూత్రం మీద ఆయన రాసిన సవరణ బిల్లు కనీసం ఇంగ్లీషులోకి వెళ్లాలి — తీర్పు కోసం కాదు; కనీసం ఒక విచారణ (Hearing) కోసం!

ఈ జాబితాను మనం అమలు చేస్తే ఏమవుతుంది? ఆయనకు ఒరిగేదేమీ లేదు — సమస్తమూ మనకే! ఎందుకంటే ఆయన వదిలివెళ్లిన అసలైన ఆస్తి పుస్తకాలు కాదు; అదొక పద్ధతి (Method)! ఈ పుస్తకపు ప్రతి అధ్యాయంలోనూ మనం ఆ పద్ధతినే చూశాం — బైబిల్‌పై, వెంకటాద్రిపై, రాయ్‌పై, ఆఖరికి తనపై కూడా ప్రయోగించిన ఒకే రకమైన శస్త్రచికిత్స:

మూలాల వరకు వెళ్లడం; వెళ్లినందుకు మూల్యం చెల్లించడం; ఆ మూల్యాన్ని ఎలాంటి ఫిర్యాదు లేకుండా చెల్లించి, మడమ తిప్పని స్థైర్యంతో మళ్లీ  ప్రయాణం కొనసాగించడం!

 

1946లో రాసిన ఒక కాగితపు ముక్క తన జీవితకాలపు నిలకడనంతటినీ నిర్ణయించి ఉండవచ్చని అంగీకరించిన ఆ నిజాయితీ; నా ప్రవర్తన సరైనది కాకపోతే నా హేతువాదం బూడిదలో పోసిన పన్నీరు కాదా అని తనను తానే మొదటి ముద్దాయిగా నిలబెట్టుకున్న ఆత్మవిమర్శ; పొరపాటైన వాదనలో కూడా సమతుల్యతను గుర్తించి గౌరవించగలిగిన ఆ వివేచన; అరవై ఏడేళ్ల వయసులో, తనను వెలివేసిన కూటమికే సవరణ బిల్లును దాఖలు చేయగలిగిన ఆ ఆత్మస్థైర్యం… దాన్ని మనం ఏమని పిలవాలి?

 

అది ఆశావాదం (Optimism) కాదు — ఆయనకు ఎలాంటి భ్రమలూ లేవు. అది విధేయత (Loyalty) కాదు — ఆయన ఎవరికీ తలవంచలేదు. బహుశా దానికి సరైన పేరు ఆయన వ్యాసపు చివరి వాక్యంలో ఉంది: అక్షరాల కంటే ఆశయ భావనయే మిన్నగా ప్రకాశించాలనే ఆ సంకల్పం! సంస్థలు అక్షరాలను పరిరక్షిస్తాయి; కానీ ఆశయ భావనను ఎల్లప్పుడూ ఏకాకులే కాపాడుతారు. అందుకే ఆయన ఏకాకి అయ్యాడు; అందుకే ఆ ఏకాంతం ఓటమి కాదు — అదొక బాధ్యతాయుతమైన కర్తవ్యం!

ఆ కర్తవ్యానికి జీతం ఉండదు; వారసత్వం మాత్రమే ఉంటుంది. ఆ వారసత్వం ఎక్కడ బతుకుతుందో ఈ పుస్తకం చూపించింది — కేవలం పుస్తకాల రూపంలోనే కాదు:

  • తన తాతగారి కాకి బొమ్మను చెరిపేసి తన స్వంత గీతను గీసుకున్న ఒక మనవడి పలకలో…
  • చిన్నపిల్లల పిచ్చి గీతల్లో తాత్త్విక ఆధారాలను చూడగలిగిన ఒక విద్యాబోధనలో…
  • ఎవరినీ తీర్పు తీర్చని ఒక అరుగు భావనలో…
  • ‘మనీష’, ‘జిగీష్’, ‘గవేష్’ అనే మూడు పేర్లలో!

 

చరిత్రలో పంజరాల్ని, బోనులను విమర్శించిన తత్త్వవేత్తలు చాలామంది ఉన్నారు; కానీ బోను లేని ఇంటిని నిర్మించి చూపించినవారు చాలా అరుదు. ఆయన ఆ రెండూ చేశారు!

 

పదేళ్ల క్రితం, ఆయన మరణవార్త విన్న రోజున, నేను నా సంస్మరణను ఒక సందేహంతో ముగించాను: తొంబై ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఏకాంతమే తన శాశ్వత సహచరుడిగా జీవించిన ఎన్.వి. బ్రహ్మం గారి చివరి నిద్ర — నన్ను దుఃఖానికి మించి కలచివేయడం అసంగతంగా ఏమీ అనిపించలేదని!

 

పదేళ్ల తర్వాత, ఈ నివాళి వ్యాసం ఆఖరి పుట దగ్గర నిలబడి, ఆయన నేర్పిన పద్ధతిలోనే పాత ముగింపును నూతన శోధనకు సమర్పిస్తూ ఆ వాక్యాన్ని సవరిస్తున్నాను: ఆ వేదన అసంగతమైనది కాదు; అదొక అసంపూర్ణమైన వేదన!

దుఃఖం ప్రశ్నను మాత్రమే అడుగుతుంది; అది సమాధానం ఇవ్వదు. సమాధానం ఆ రెండు మాటల్లో ఉంది — నలభై ఏళ్ల క్రితం ఆరు రూపాయల పుస్తకం వెనుక ముద్రించబడి, నేడు మన ముందు ఒక ఆదేశమై నిలబడిన ఆ రెండు మాటలు:

“చదవండి! చదివించండి!”

*

Naresh Nunna

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.