ఓర్హాన్ పాముక్ (1952- ) సాహిత్యంలో 2006 లో నోబెల్ బహుమతి గ్రహీత. తను 1952లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో జన్మించాడు. తన విఖ్యాత రచనల్లో- “ది వైట్ కాజిల్,” “ది బ్లాక్ బుక్, ది న్యూ లైఫ్,” “మై నేమ్ ఈజ్ రెడ్,” “స్నో,” “ఇస్తాంబుల్: మెమోరీస్ ఆఫ్ ది సిటీ,” “ది మ్యూజియం ఆఫ్ ఇన్నోసెన్స్” ఉన్నాయి. విమర్శకుడు ఊల్కెర్ గ్యుక్-బైర్క్ చెప్పినట్లు పాముక్ రచనలలో ప్రధాన వస్తువుగా తూర్పు-పడమరల, దాని ఒట్టోమన్ గతం- పాశ్చాత్య తరహా వర్తమానాల మధ్య , విశ్వాసం- మతయేతర జీవన విధానాల మధ్య తలెత్తే ఘర్షణలు ఉన్నాయి.
ఓర్హాన్ పాముక్ నవల “స్నో” లో నాయకుడు కా లేక కరీం అలక సోగ్లు ఒక కవి. జర్మనీ లో ఫ్రాంక్ఫర్ట్ లో రాజకీయ ప్రవాసంలో ఉంటూ టర్కీ- ఆర్మేనియా సరిహద్దు వద్ద ఉన్న కార్స్ అనే చిన్న నగరానికి వస్తాడు. అక్కడ అటాతుర్క్ రాజ్య ఒత్తిడికి లొంగి తమ బురఖాలు తీయటానికి ఇష్టపడని బాలికల ఆత్మహత్యల పరంపర గురించి చేసుకుంటుంటారు.సత్యాన్ని తెలుసుకుని ఒక వ్యాసం రాయాలని అనుకుంటాడు. దానితో పాటు తను కోల్పోయిన కవితా స్వర్గాన్ని, తన ఒక నాటి ప్రేయసి, విడాకులు తీసుకుని ఉన్న ఇపెక్ హృదయాన్ని తిరిగి గెలుచుకోవాలని తపన అతడిలో ఉంది.
టర్కీ ప్రభుత్వం రాజ్యం ఆధునికీకరణ, పాశ్చాత్య కూటమి అహంకారాన్ని ఎదు ర్కొంటున్న రాజకీయ ఇస్లామిస్టులను అణచివేతకు సిద్ధమవుతుంది.కా తన నగర పర్యటనలో ఇస్లాం వాదులు ,తీవ్రవాదులు , కుర్దిష్ జాతీయవాదులు ,నటులు ఆత్మహత్య చేసుకున్న బాధితుల చుట్టాలను ,పోలీసు అధికారులు, చిన్నస్థాయి వార్తాపత్రిక సంపాదకులను కలుసుకుంటాడు.
కా తన్నుతాను పాశ్చాత్య ప్రపంచానికి, తిరుగుబాటుతో బాధపడుతున్న టర్కీ కి మధ్యవర్తిగా చూస్తాడు . చిరకాల ఏకాంత రాజకీయ ప్రవాసం తర్వాత దుస్సాహస రాజకీయాలు, మత పిడివాదానికన్నా సంతోషమే మిన్న అని తెలుసుకున్నాడు. అయితే కార్స్ నగరం కా ను ఒక కవిగా మాత్రమే ఆహ్వానిస్తుంది. వాస్తవానికి కా యొక్క మిశ్రమ అస్తిత్వం ఒకవైపు హేతువాదిగా, వ్యక్తి వాదిగా చేస్తే, మరోవైపు అతనిలోని మూలాలు తన బాల్యం కోసం, స్వదేశీయులను అర్థం చేసుకోవడం, ఇపెక్ ప్రేమ కోసం తపించేలా చేస్తాయి.
అతడికి తర్వాత ఇపెక్ కు గతంల్ బ్లూ అనే తీవ్రవాది పట్ల కల భావోద్వేగం గురించి తెలిసి బాధ కలుగుతుంది. ఆమెను ప్రశ్నించగా ఇపెక్ అతడి అసూయ ను విమర్శిస్తుంది. అయితే ఫ్రాంక్ఫర్ట్ లో తన ప్రేమ వ్యవహారాలు గురించి కా బయటకు చెప్పడు. స్కార్ఫ్ బాలికల నాయకురాలి సోదరి కాడిఫ్ తో కా అబద్ధాలు చెప్పి నగరంలో చిల్లర రాజకీయాలకు అదే విరుగుడు అనుకుంటాడు. తర్వాత బ్లూ నుంచి ఒక ఉత్తరం తెచ్చి కాడిఫ్ రంగ స్థలం పై తన బురఖా తీసివేత యత్నం నుంచి తప్పించాలని ప్రయత్నిస్తాడు.
కా, ఇపెక్ తండ్రి టర్గాట్ బే, బ్లూ ల మధ్య ఒక మీటింగ్ జరుగుతుంది. బ్లూ మాటాడుతూ మతం అనేది జీవితం యొక్క అర్థం, మరణాంతర జీవితం గూర్చి కుతూహల ఫలితం అంటాడు. పాశ్చాత్యులు తనకు భీమా రూపంలోని ప్రజాస్వామ్యాన్ని భరించగలరా అని ప్రశ్నిస్తాడు. 1970 లలో చిలీ, 1980 లలో నికరాగువాలలో అమెరికా జోక్యం ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఇదిలా ఉండగా కా ద్వంద్వ వైఖరి – మానవ హక్కులు అంటూ తీవ్రవాద నేతలతో ఒప్పందం, స్త్రీ వాదం అని చెబుతూ స్త్రీ ల తలలపై బురఖాలు సమర్థించడం _ గురించి తిరుగుబాటు నేత జడ్ డిమిర్కల్ విమర్శిస్తాడు. కా తపన మాత్రం అటు పాశ్చాత్య వ్యతిరేక ఇస్లాం వాదులను , పాశ్చాత్య టర్కిష్ ప్రతినిధి అయిన తన్ను తాను అర్థం చేసుకోవడం కోసమే.నెసిప్ అనే యువ ఇస్లాంవాది తాను సైన్స్ ఫిక్షన్ రచయిత కావాలని కోరిక వెలిబుచ్చుతూ కా నాస్తిక వాదం పట్ల అపనమ్మకం చూపిస్తాడు.
ఒక రోజు కా నగరంలో కురిసే మంచును చూసి తన కవితా సృజనాత్మకత, దేవుడు, స్వర్గం పట్ల నమ్మకాన్ని తిరిగి పొందుతాడు. మంచును, దాని మార్మిక అందాన్ని, ఆనందాన్ని, సృష్టికర్త పట్ల ఆశ్చర్యం ప్రకటిస్తాడు.ఇదిలా ఉండగా బ్లూ పట్ల కా ద్రోహం తెలిసి ఇపెక్ అతడ్ని తిరస్కరిస్తుంది. కా చింతన లో మునిగి ప్రతివానికి సొంత మంచు శకలం ఉంటుంది అని , వ్యక్తిగత జీవితాలు దూరం నుంచి ఒకేలా కనిపించినా స్వీయ అపూర్వత ను అర్థం చేసుకోవడానికి తనదైన మంచు శకలం గమనాన్ని చూడాలంటాడు.పాఠకుడికి నవల చివరలో కా మృతి గురించి తెలుస్తుంది. అయితే దానికి కారణం ఇస్లామిస్టులు, టర్కీ రహస్య పోలీసులు, ఆర్మేనియన్లు, జర్మన్ స్కిన్హెడ్ లు లేదా కుర్దిష్/ టర్కిష్ జాతీయవాదులు అనేది తెలియదు.
లౌకిక వాదులుగా ఉన్న కా, కుష్వంత్ సింగ్ ప్రఖ్యాత నవల ట్రైన్ టు పాకిస్తాన్ లో ఇక్బాల్ పాత్ర ఇద్దరూ రాజ్య హింస విషయంలో రాజీ, సందిగ్ధతలు చూపిస్తారు. స్నో నవలలోని బ్లూ, కుష్వంత్ సింగ్ సృజించిన జగ్గుత్ సింగ్ లు ఇద్దరూ అమరవీరులు గా కనిపిస్తారు. మనోమజ్ర కు వెళ్ళిన ఇక్బాల్ తన్ను తాను ఒక సంస్కర్త గా , లెఫ్టిస్ట్ గా చెప్పుకున్నా మత కలహాలు నుంచి ముస్లిం లను రక్షించక అనామక త్యాగం వ్యర్థం అని తన పిరికి తనాన్ని సమర్థించుకుంటాడు. నేరస్తుడుగా ఉన్న జగ్గుత్ సింగ్ తన ప్రేయసి నూరాన్, ఇతర ప్రయాణీకులు పాకిస్తాన్ కు సురక్షితంగా వెళ్ళేటట్లు చేసే యత్నంలో ప్రాణాలు కోల్పోతాడు. కార్స్, మనోమజ్ర రెండూ హేతువు -మతాల మధ్య చిక్కుకున్నాయి. ఇక్కడి లౌకిక వాదులు సైతం మతోన్మాదాన్ని, రాజ్య హింసను, అగ్ర రాజ్య ఉగ్ర వాదాన్ని ఎదుర్కోవాలి. సృజనాత్మకంగా ఆలోచించి, కరుణతో ఆచరించి, మానవ హక్కుల పట్ల శ్రద్ధను నిర్భయంగా ప్రకటించాలి.
*








Add comment