1
మీకిప్పుడు స్వార్థం తెలియాలి
తను అత్తిపత్తి పువ్వై ముడుచుకుంటుంది
నీటి చర్మంపై కష్టాల పురుగులను మోసుకుంటుంది.
పుస్తకాలాన్నీ అది తన్యత సిద్ధాంతమని ప్రకటిస్తాయి కానీ
ఎవరికి తెలుసు
అది మన అవ్వల కన్నీటి సిద్ధాంతమని
మనం రోజూ పాటించే అన్యతల వేదాంతమని
నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి
నా గొంతు పుడిగెకున్న నిశ్శబ్ద దారాలను నిదానంగా విప్పాలనిపించేది.
ఈ అవ్వలందరి తలపై
అసెయ్ ఒసేయ్ అనే మాటల మోపునెవరు కట్టారో అడగాలనిపించేది.
అమ్మంటే వంటింటి గోడలపై
పొగజూరిన సంతకం కాదు
ప్రతి ఉదయం నలిగిన తన నిదుర కాగితంపై
చేయాల్సిన పని పట్టికలు గీసుకునే
ఇంటి గుమస్తా అంతకన్నా కాదు.
సుక్క పొద్దు పొడవడమే ఆలస్యం
అవ్వలంతా సెకండ్ల ముళ్లై
ఏదో పని సుట్టూ తిరుగుతూనే ఉన్నా
అంతా గంటల ముళ్ళై వెనకనుండి పరీక్షిస్తూనే ఉంటారు.
అయినా నాకప్పుడప్పుడు సందేహమేస్తుంది
వాళ్ళు దోపుకున్న ఆ బొడ్లె సంచిలోనే
చెక్కుడు గుత్తిని ఊహించుకుంటున్నారా?
ఆ బోసి మెడకున్న సెమటబిళ్ళల్లోనే
కాసుల పేరుని తెలుసుకుంటున్నారా అని.
అయినా కోరికలపోపులను గుండె డబ్బాలో మడతబెట్టి
ఇంటి వృక్షం కింద జ్ఞానబోధ చేసే ఈ అవ్వలందరు
ఎప్పుడో పెండ్లప్పగింతలల్లో
కుటుంబాన్ని బుద్ధుడిలా వదిలినోళ్ళే కదా
అవును
వాళ్ళు కొడుకుల జీవితం కోసం
బాధ్యతల రంపంపై నుజ్జు నుజ్జుగా నలిగిన వాళ్లే.
అంతమాత్రాన
వాళ్లని త్యాగాలకు ప్రతీకలని
ఆశలు లేని ఆడ బుద్ధుళ్ళని
మీ చాదస్తపు క్యాలెండర్లను తగిలించి
తమను తాము మర్చిపోయేలా చేస్తారా?
తల్లులారా మీకిప్పుడు స్వార్ధం తెలియాలి
బంధాల బాట్లను తక్కెడలా మోయటమే కాదు
మీకూ స్వేచ్ఛ ఉంటుందని తూకమేసి చూపించాలి
అచ్చం న్యాయ దేవతలా కనిపించాలి.
*
2
ఇప్పటి మన ఉగాది
ఇప్పటి మన ఉగాది
వసంత సుందరిలా కాదు
నిలువెత్తు వర్ణ సుందరిలా కనిపిస్తుంది
పచ్చి నెత్తుటి కోసం పాకులాడుతుందేమో అనిపిస్తుంది
ఇదిగో , ఈ హరితాలయాల ముందు
శిగమెక్కిన అగ్గి పూలన్నీ
పోతురాజుల్లా ఊగుతున్నాయనో
ఈ వసంత పరిమళాలన్నీ
నిన్ను సుగంధభరితుణ్ణి చేస్తాయనో సంబరపడుతున్నావ్ కదూ,
మిత్రమా అది వసంత సౌరభం కాదు
లేత శవాలకు పూసే సుగంధలేపనం.
అదిగో ఇప్పటి మన ఉగాది
పీనుగుల జంబుఖానా మీద
ఆకుపచ్చ పొద్దై ఎలా నడుస్తుందో చూసావా?
కళ్ళలో కోరికల చొంగ దాచిపెట్టుకొని
పచ్చకోక లేని నగ్నభూమి కావాలనొకడు
తనతో ఆదాయ వ్యయాలు చెప్పించుకొని మురిసిపోవాలనొకడు
కంటి కాగడాలు వెలిగించి ఎలా నడిపిస్తున్నారో కదా!
వేదికమీద తను యుద్ధబూడిద పూసుకొని
నెత్తుటి కొంగుని ఎగరవేస్తూ
అలా పిల్లిమొగ్గలతో ప్రదర్శన చేస్తుంది
ప్రశ్నల పరంపర కవి సమ్మేళనమై సాగుతున్నప్పుడు
తాను నిషిద్ధాక్షరిలో రానించి
పసి పూలను రాలుస్తానని గొప్పల చిట్టా విప్పుతుంది
చివరి ప్రశ్నలో శాంతి పట్ల అభిప్రాయమడిగితే
వర్ణ కోయిలై ఈ సంవత్సరపు పీనుగుల పూతను
పంచాంగ శ్రవణంలా పాడుతుంది.
అంతా చప్పట్ల చినుకులు కురిపించి
వర్ణ సుందరిని తడిపేస్తుంటే
గడిచిన ఉగాది ఇప్పటి కొత్త సంవత్సరపు చెయ్యి పట్టుకొని
అప్పుల సింహాసనం మీద అభిషేకిస్తుంది
ఎముకల కిరీటం పెట్టి
ఈ సంవత్సరపు ఉగాదిని ప్రకటిస్తుంది
ఇక మనుచిలుకలు ఆహా ఓహోలను చప్పరిస్తుంటే
మా బస్తీ రైతులు కొమ్మలకు క్యాలెండర్లా వేలాడుతూ
ఋతువుల మార్పుల్లో రుణాల తేదీలను లెక్కలేస్తున్నారు
తమ బిడ్డల కొసం
ఒక అంటరాని వసంతాన్ని అక్షరాల్లో కలగంటున్నారు.
*








Add comment