వీరేశలింగం-నాగరత్నం-దేవదాస్యం

మీరే వాదననైనా తీసుకోవచ్చు గానీ దిక్కుమాలిన కుల ఆధారిత మైన పాత వ్యవస్థ గొప్పదని కీర్తించకూడదు.

నాగరత్నం అనే స్కేల్ తో వీరేశలింగాన్ని కొలిచే ప్రయత్నం చేశాడు మిత్రుడు ఉమ. నైతిక స్కేల్ తో తీసిపడేశారు రంగనాయకమ్మగారు. చరిత్ర 360 డిగ్రీస్ లో మనముందు పరచుకుని ఉంటుంది కాబట్టి సందర్భాన్ని బట్టి ఏదో ఒక స్కేల్ బయటకు తీసి కొలుస్తూ ఉంటాం. కాకపోతే చరిత్ర, అందులోని వ్యక్తుల మూర్తిమత్వం మన స్కేలుకు భిన్నంగా ఉండే అవకాశముంది.

ఫలానా విషయంలో మన స్కేలుకు తూగలేదు కాబట్టి మొత్తంగా కాంట్రిబ్యూషన్ ను తుడిచేస్తామంటే కుదరదు. ఉమా వీరేశలింగం మీద ఎంత తీవ్రమైన విమర్శలు పెట్టినా ఆ టోన్ లో డీసెన్సీ మెయిన్ టెయిన్ చేశారు. చర్చల పేరుతో ఫేస్బుక్లో సాగే కొన్ని గిల్లులాటల్లో ఉండే వెకిలితనం లేదు. కాకపోతే ఎందుకైతే ఇవాళ వీరేశలింగాన్ని గుర్తుచేసుకుంటున్నామో ఆ కృషి మీదే కొన్ని వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఆయన సంస్కరణలను తప్పుపట్టారు. ‘‘తుపాకులతో ఈ దేశపు నేలను గెలవగలం కానీ, ఇక్కడి ప్రజలను గెలవలేమని అర్థమయ్యాక తెల్లదొరలు చేసిన ఆలోచనల్లోంచి పుట్టిన ‘సంస్కరణ’కు మీరే ఆయుధాలయ్యారేమో!’’ అని వ్యాఖ్యానం చేశారు. ఈ వ్యాఖ్య గురించి ఈ ధోరణి గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. రంగనాయకమ్మ గారి వ్యాసం గురించి కొత్తగా చర్చించుకోవడానికేమీ లేదు. వీరేశలింగాన్నిమించిన కసితో ఆమె వేశ్యావృత్తినే కాకుండా మొత్తంగా ఆవృత్తిలో ఉన్నవారిని కూడా చీదరించుకుంటూ రాసి ఉన్నారు. అందులో భాగంగా కామం చుట్టూ అల్లిన సాహిత్యాన్ని కూడా చీదరించుకుంటూ రాశారు. వీరేశలింగం తాత లాగే ఆమె కూడాను.

నేను నవనాగరికుడను అని ప్రకటించుకున్న వీరేశలింగం పంతులు రచనల్లో అంత నాగరికం అనిపించని దుష్టాంతాలున్నాయి. భౌతిక వాదిని హేతు దౌర్భల్యాలకు వ్యతిరేకిని అంటూనే దయ్యాలు భూతాలపై వెటకారాలాడుతూనే ఏకేశ్వరోపాసన చేసే వైరుధ్యమున్నది. స్ర్తీల విద్య కోసం వితంతు వివాహం కోసం అంత కృషి
చేసిన మనిషి, స్ర్తీల స్వేచ్ఛ విషయంలో సమానత్వం విషయంలో వెనుకబాటు అభిప్రాయాలు కలిగిఉండడమనే ప్రధానమైన వైరుధ్యం కనిపిస్తుంది. అయితే ఆ వైరుధ్యాలు పరిమితులు ఆయన కాంట్రిబ్యూషన్ ను మింగేయలేవు. మూర్ఖపు మందలతోని ఆయన చేసిన పోరాటమూ జీవితాంతం అదే ఆశయంగా చేసిన కృషి మాసిపోవు. వైరుధ్యాలు వాస్తవమే, కృషీ వాస్తవమే. కృషి తాలూకు చైతన్యం తర్వాతి తరాలకు ఆయుధంగా అందివస్తుంది. ఆ పునాదిగా వారు మరింత ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ఆ మనిషిని గుర్తుచేసుకున్నపుడు కాంట్రిబ్యూషనే ప్రధానాస్ర్తంగా ముందుకొస్తుంది.

ఆయన స్ర్తీల కోసం చేసిన కృషి సమానత్వం, స్వేచ్ఛ అనే తలంలో చేసినది కాదు. వారిలో కనిపించే వెనుకబాటు ధోరణికి చదువు లేకపోవడమే కారణం అని భావించి చేసిన పని. అలాగే వితంతు విహహాల గురించిన పట్టింపులో తన తల్లిని గురించిన ఆలోచన అంతర్గతంగా పనిచేసిందేమో అనిపిస్తుంది. చిన్న నాటే భర్తను కోల్పోయి బావ ఇంట ఉండగా పెత్తల్లికి తల్లికి మధ్య తరచుగా జరిగిన ఘర్షణలను గూర్చి వీరేశలింగం రాసి ఉన్నారు. తల్లి గురించి రాస్తున్నపుడు కూడా స్ర్తీల పట్ల ఆయన కున్న పలుచని దృష్టికోణం స్పష్టంగానే బయటపడుతుంది.

‘‘నా పెండ్లి అయిన తరువాత నా పెదతండ్రి గారి భార్యకును నా తల్లికిను తగువులాటలారంభమయినవి. ఇరువురకును మనస్తాపములావర(ఆయన బండి ర రాశారు కానీ ఇపుడు ఆ అక్షరాన్ని వెతికే అక్కర ఓపిక రెండూ లేవు)కే యుండినను నా వివాహానంతరము గానీ ప్రజ్వరిల్లి ప్రకాశము కాలేదు. ఒక యింట నూరు జుట్లిడుమును కానీ రెండు కొప్పులిముడవన్న సామెతనందరూ ఎరిగినదే కదా, ఇద్దరాడువారొక్క చోట చ చేరినచో పనిలేను పాటగానేదో నేదో యొక విషయముగ శుష్కకలహములు పొడచూపక మానవు. ఇప్పటి మనదేశపు స్ర్తీలలో గానబడుచున్న ఈ కలహప్రియత్వమునకు బ్రధానకారణము స్వప్రయోజనత్వము చేత దూరాలోచన మట్టుబడిన వారు తమ తరుణీమణులను విద్యాగ్రంధ విహీనురాండ్రను చేయుట వలన వారినాశ్రయించి యున్న మౌఢ్యభూతావేశదోషమే గానీ సహజమైన స్ర్తీ కోమల స్వభావము గాదు’’

ఇదన్నమాట ఆయన స్ర్తీ విద్యకు కారణం. విద్యతో ఎట్టెట్టా ఈ మౌఢ్యభూతావశేషాన్ని పారద్రోలొచ్చే ఆయన వివరంగానే రాసియున్నారు. పెద్దాయన తన దృక్పథం విషయంలో మరొకరు పొరబడే అవకావమునివ్వజాలక స్పష్టరూపుడైయున్నారు. మౌఢ్యాన్ని పారద్రోలి స్ర్తీ ‘‘సహజమైన’’ కోమలత్వాన్ని ప్రాదుకొల్పడం ఆయన లక్ష్యం. అందుకే ఆయన్ని సంస్కర్త అనే పిలుస్తున్నాం. విప్లవకారుడు అనట్లే. మార్పు పైనుంచి కిందకి ఉంది. కిందినుంచి పైకి లేదు. సంస్కర్త అయినా కాలానుకుణంగా వారి కృషి కొంత విప్లవకర పాత్రను పోషించే అవకాశాలు ఉంటాయి. ఒక చారిత్రక సందర్భంలో జరిగే మార్పులు అనేక పెనుమార్పులకు దారితీయొచ్చు. ఫలితం అన్నివేళలా నీ ఉద్దేశ్యాల పరిధిలోనే ఉండకపోవచ్చు. ఉదాహరణకు బ్రిటీషర్లు తెచ్చిన రైత్వారీ పన్ను విధానం లక్ష్యం ఏదైనా ఉండోచ్చు. కానీ అది భారతదేశంలో అప్పటివరకూ పాదుకుపోయి ఉన్న వ్యవప్థ కూకటివేళ్లను పెకలించడానికి ఉపయోగపడింది. మార్కెట్ వ్యవస్థను పోటీ లక్షణాన్ని భారతీయ సమాజంలోకి తీసుకురావడానికి బీజంగా పనిచేసింది. వాస్తవానికి వీరేశలింగం స్ర్తీ విద్యకు కూడా దారి అక్కడినుంచి వచ్చిందే. ఆయన కారణాలు ఏమైనా ఉండొచ్చును. కానీ ఒక్కసారి మార్కెట్టూ పోటీ ఎంటరయ్యాక అవి వాటికి అడ్డంకిగా ఉన్న మౌడ్యాలను నరుక్కుంటూ పోతాయి. తొక్కేసుకుంటూ పోతాయి. అందులో భాగంగా ఏదో ఒక మలుపులో ఎవరో ఒకరు చోదకశక్తి పాత్ర పోషిస్తారు. ఆ పాత్ర పోషించడానికి వారికారణాలు వారేమైనా చెప్పుకోవచ్చు, తెలీకుండా పనిచేసే శక్తి మార్కెట్. అందులో ఆవి బీజప్రాయపు రోజులు.‘‘ whatever may have been the crimes of England she was the unconscious tool of history in bringing about that revolution’’.

ఇక తుపాకులతో ప్రజలను గెలవలేని బ్రిటీష్ వారి చేతిలో ఆయుధం అయ్యారనే ఆరోపణ గురించి. చలనం లేకపడి ఉన్న భారతీయ సమాజంలో మార్పుల కోసం ప్రయత్నించిన వారు బ్రిటీషువారి సాయంగా తీసుకున్నారు. వారి అవసరాలు వారివి. వీరి అవసరాలు వీరివి. ఓ వైపు జాతీయోద్యమం నడుస్తున్నపుడు అందులో పాల్గొనకుండా వారి మద్దతు తీసుకోవడం వారికి మద్దతుగా నిలవడం అనేదాన్ని విమర్శించొచ్చు. కానీ ఆ సమయంలో తాము అనుకున్న సామాజిక లక్ష్యాలను చేరడానికి లేదా తమ సమూహాలకు మేలు చేయడానికి వారి మద్దతు తీసుకోవడం అసవరం అని భావించిన వారున్నారు. అందులో బ్రిటీషు వారిని పొగడ్డం దగ్గర్నుంచి వారికి వ్యతిరేకపోరాటంలో అంతగా గొంతు కలపకపోవడం దాకా రకరకాల షేడ్స్ లో చాలా మందే కనిపిస్తారు.రాజకీయ లక్ష్యాలకంటే సామాజిక లక్ష్యాలు మిన్న అనుకున్నవాళ్లలో కనిపిస్తారు. కొన్ని సందర్భాల్లో అంబేద్కర్లోనూ ఈ ఛాయలు కనిపిస్తాయి. ఆ మాటకొస్తే బీమా కోరేగావ్ ఉదంతంలోనే సంక్లిష్టమైన అంశాలున్నాయి. వాటిని వేరే తలంలో చర్చించుకోవచ్చు గానీ బ్రిటిష్ను గీటురాయిగా తీసుకుని వీరేశలింగం మూర్తిమత్వాన్ని డిస్మిస్ చేయలేము అని మాత్రం ప్రస్తుతానికి చెప్పుకోవచ్చు.

ఏ నాగరత్నం కోసం వీరేశలింగాన్ని బోనులో పెట్టారో ఆ నాగరత్నం ఏం చేశారు?

హా! మా హైందవరాజ్యలక్ష్మి యిదె నీ హస్తాబ్జమందుంచుచు

న్నామన్నా! యెటులేలుకుందొ? దొరమిన్నా జార్జిభూపాలకా!

………….

అంచితమౌ భవత్కులము నందలి జార్జిపదమ్ము వారిలో

పంచమజార్జి వంచునిను వాడుక చేసిన జేయ నిమ్ము మ

మ్మంచిత రీతి నేల సమయం బొనరించినవాడ వౌటచే

బంచమ లోకపాలునిగ బావన సేయుదుమయ్య యెప్పుడున్

…………..

జార్జి పట్టాభిషేక సందర్భంగా నాగరత్నం రాసిన ‘‘జార్జి సార్వభౌమ ప్రస్తుతి’’ పద్యాలివి. జార్జికి సుంకం చెల్లించే రాజుల ఆశ్రయంలో ఉన్నందుకే ఆమె భక్తిప్రపత్తులుచెల్లిస్తే తన జీవిత లక్ష్యానికి సహాయకారిగా ఉన్నవారి పట్ల వీరేశలింగం ఆదరణచూపించడంలో ఆశ్చర్యమేమున్నది. ఇద్దరూ ఒకేకాలమున తమ తమ కారణాలతో తెల్లవాండ్ల శరణు జొచ్చినారు. కాబట్టి ఈ విషయంలో నాగరత్నాన్ని స్కేలుగా తీసుకుని ఆమెను వీరేశలింగం కంటే పైన కూర్చోబెట్టడం కుదరదు.

వీరేశలింగం చిన్నప్పటి నుంచి తన చుట్టుపక్కల చూసిన అధికారులు, పండితులు, లాయర్లు, వగైరాల వలన, వారి అబద్ధపుజీవితం వలన, వారి వేశ్యాసాంగత్యము వలన దేశీయులంటే విపరీతమైన చిన్నచూపు ఏర్పడింది,. ఎక్కడో ఏ ప్రభావమో కానీ అనైతికత అనేది పెద్ద భూతంగా మారింది. తెల్లోళ్లంటే మాత్రం మక్కువ. పలానా సంస్కరణగట్టిగా అమలు కావాలంటే గట్టి అధికారులు కావాలని చెపుతూ కూడా అది దేశీయుడైతే కష్టం అంటారు. అంత అనుమానం దేశీయులంటే. ఆ ధేశీయులంటే ఎవరు? ప్రధానంగా సాటి బ్రాహ్మలే. నాడు అధికార యంత్రాంగమున వారు గాక ఇంకెవరున్నారని. అలా అని దీని ఆధారంగా ఆయనకు బ్రాహ్మలంటే పడదు, క్రైస్తవులంటే మక్కువ అని తీర్మానం చేయగలమా! చేయడానికి లేదు. ఆయన స్పర్థ, ఇచ్ఛ రెండూ విషయప్రధానమైనవి. ఆయన కులం విషయంలో తిరుగుబాటుదారుడేం కాదు. సంప్రదాయవాదులకు దగ్గరగానేకనిపిస్తారు. అంతంత భయానకంగా పోట్లాడుకున్నప్పటికీ కొక్కొండ వెంకటరత్నం గురించి రాసినపుడు బ్రహ్మశ్రీ అని గౌరవ సూచకం వాడతారు. తాను చీట్లపేక ఆడడానికి పోయినపుడు మంచి తావు చూపిస్తమని మిత్రులు ఒక ‘బోగమువాని’ ఇంటికితీసుకుపోయిరని రాస్తారు. పైగా ఆ బోగమువాడు తన కూతురుని తెచ్చి చీట్లపేకలో కూర్చుండపెట్టారని ముక్క చీవాట్లుపెడతాడు. ‘ఎవర్ని ఎక్కడుంచాలో అక్కడుంచాలి’ అనే సామాజిక సంప్రదాయపద్దతులను సంభోధనలో కూడా పాటించిన పండితులు వీరేశలింగం.

వేశ్యావృత్తి అంటే విపరీతమైన ద్వేషముతో దాన్ని తుదముట్టించడమే లక్ష్యంగా వీలైనన్ని రీతుల పోరాటం చేసినవాడు వీరేశలింగం. ఇలాంటి సంస్కరణల వల్ల తమ వృత్తి దెబ్బతినకుండా ఉండేలా విఫల పోరాటం చేసిన దేవదాసీ ప్రముఖురాలు నాగరత్నం.

‘‘మరి లంజెలు లేనివారు పెద్ద మనుష్యులే గారని గణింపబడుతున్నారు. మీదు మిక్కిలి ఏకపత్నీ వ్రతులు పురుషులేకారనియు, నపుంసకులనియు పరిహిసింపబడుతున్నారు…. ఈ వ్రాత ఇపుడు కొందరి కతిశయోక్తిగా తోచవచ్చునేమో గానీ యప్పటికది మా రాజమహేంద్ర వర విషయమున స్వభావోక్తి యనుటకు అణుమాత్రము సందేహము లేదు….ప్రభు సమ్మానముచే ధనార్జన చేయనపేక్షించిన న్యాయవాదలనేకురు వేశ్యలను చేరదీయవలసినవారయిరి. కొన్ని సమయంబులందీ యధికారులే ఒక్కొక్క వేశ్యనొక్కొక్క న్యాయవాదికి అనుగ్రహించుచువచ్చిరి. అందుచేత మా రాజమహేంద్రవరములో వేశ్యలు సరిపోక పోగా పడపు పడతులకయి ప్రసిద్ధి పొందిన రామచంద్రపురము మొదలైన గ్రామములనుండి క్రొత్త వేశ్యలు రప్పింపబడిరి. ఆ కాలమునందు రాజమహేంద్రవరమున పాఠశాల యనగా వేశ్యలచదువుకూటమనియే అర్థం. వేశ్యల నృత్యగీతాదులకై పెట్టింపబడిన పాఠశాలెన్నియో యా పురమునందుండినవి. వేద పాఠశాలలకు శాస్ర్త పాఠశాలలకు చిల్లిగవ్వయియ్యనొల్లని శుధ్ద శ్రోత్రియులు సహితమధికారుల మెప్పునకయి యీ వేశ్యపాఠశాలలకు నెలకయిదులు పదులు రూపాయిలు చందాలిచ్చుచుండిరి…’’

ఇదిగో ఇదన్నమాట వృత్తాంతము. పండితులవారికి వేశ్యావృత్తి యందు వైరభక్తి యున్నదేమో యని సందియము గలిగిన యది నా యపరాధమనరాదు. వైరభక్తి యని ఎందుకు అనాల్సి వస్తుందంటే అబ్సెషన్ అనే స్థాయిలో ఆయన కోపంగా పలవరిస్తూ ఉంటారు. వేశ్యాంగనల ప్రస్తావన లేకుండా పేజీలు తిరగవు. దేశీయులు మూర్ఖులు, లంచగొండులు, వేశ్యాంగనపరాయణులు, తెల్లవాళ్లు ఆ మూర్ఖత్వాన్ని పారదోలగలిగిన వారు అనేది సారాంశము. వాళ్ల కారణాలేమున్నా కొన్ని విషయాల్లో మనమూర్ఖపు ఆలోచనలను పారద్రోలడానికి అవసరమైన ఆయుధసంపత్తి బ్రిటీష్ వారు అందించిన మాట వాస్తవం. వాళ్లు మన దేశాన్ని పీల్చిపిప్పి చేశారు అనేది కూడా వాస్తవమే. రెండూ వాస్తవాలే కానీ వీరేశలింగం విషయంలో ఆయన కోరుకున్న దానికి వారికి లంకె కుదిరింది. ఆయన కులంలో ఆయన చేసుకున్నసంస్కరణ అని కొందరు తేలిగ్గా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఆయన జ్వోతిరావు పూలే కాని మాట వాస్తవమే. కానీ సంస్కరణ కూడా ఒక్క కులానికే పరిమితమై ఉండదు. బ్రాహ్మణాధిపత్యకాలంలో జరిగినవి కాబట్టి విద్యలో అన్నిసామాజిక రంగాల్లోనూ వారే పీఠాలను ఆక్రమించి ఉన్న కాలం కాబట్టి అన్నింటా వారే ప్రదానంగా కనిపిస్తారు. అటుసంప్రదాయాల్లోనూ ఇటు సంస్కరణల్లోనూ. అటు ప్రయోగాల్లోనూ వాటిలో ఉపయోగించిన శాంపిళ్లలోనూ. అక్కడ మొదలయిన సంస్కరణ అక్కడే ఆగిపోదు. విస్తరిస్తుంది. ఇవాల్టి కళ్లతో అన్నింటిని చూసి అంచనా వేస్తామంటే కుదరదు. స్థలకాలాలకు అతీతంగా ఏదీ ఉండదు. పైగా చదువు బ్రాహ్మలను దాటుకుని మిగిలిన వారికి విస్తరించబోతున్న కాలం కదా! ఏ సంస్కరణలు లేకుండానే ఎవ్వరి కృషి లేకుండానే మనం ఇవాళ ఇక్కడిదాకా ప్రయాణించలేదు. రెక్కలు కట్టుకుని విమానం ఎగరడానికి ముందు అనేకానేక ప్రయత్నాలుంటాయి.

అంతెందుకు, వీరేశలింగం స్ర్తీల విషయంలో తిరుగుబాటుదారుడేమీ కాదు. ఒక కోణంలో మాత్రమే సంస్కరణలు కోరుకున్నారు. ప్రయత్నించారు. కానీ అది అక్కడ ఆగుతుందా, సామాజిక రంగంలో మీ కృషి ఫలితం మీ ఉద్దేశ్యం మీద మాత్రమే ఆధారపడిఉండదు. ఇల్లాళ్లను మసిబారిన వంటగదులనుంచి పెంటగదుల నుంచి బయటకు తెచ్చాక విద్య నేర్పాక ఆ నిప్పురవ్వ అక్కడే ఆగుతుందా, ఎక్సేంజి వాల్యూలేని మసిబారిన చాకిరీని వదిలించుకుని సామాజిక ఉత్పత్తిలో భాగం కావాలనే ఆరాటం జనియించదా. ఒక్కసారి బందిఖానాల్లోంచి బయటపడి ప్రపంచం చూశాక స్వేచ్ఛ రుచి తెలిశాక అది పరిగెడుతూనే ఉండదా. ఇవాళ మనం చూడడం లేదా!

ఈ విషయంలోనూ నాగరత్నాన్ని ఆయన కంటే పైన కూర్చోబెట్టాలంటే కుదరదు. ఆమేమీ ఫెమినిజం విషయంలో కత్తియుద్ధం కాంతారాణి కాదు. శ్రీమతి వి సరస్వతి గారికి నాగరత్నము రాసిన ఈ లేఖను పరికించుడీ.

‘‘తాము గృహలక్ష్మి దసరా సంచికలో స్ర్తీ స్వాతంత్ర్యము అను శీర్షికతో వ్రాసిన వ్యాసమును తిలకించితిని…

భారత పురుషుడు స్వార్థపరుడు అని వ్రాసితిరి. భారత పురుషుడు తన కాంతను అర్థాంగిగా మన్నించినవాడు. మన్నించుచున్నాడు. మన్నించగలడు. వేని వాక్యములను తులసీదలముల వలె నాతడు తలదాల్చునో అట్టి పురాణములు ఆతనికి ఇట్లే నడువవలెనని శాసించుచున్నవి. కుటుంబపోషణమునకు ఆశ్రయింపరాని వారినాశ్రయించి కొలువరాని వారిని కొలిచి ధనమార్జించి యింటిని వస్తుసముదాయముతో నిండించుచుండ స్ర్తీ ఆ యింట రాణివలె పరిపాలించుచున్నది కదా! ఇక భారతపురుషఉడు స్ర్తీకి చేసిన లోటేమిటి? ’’

అదన్నమాట.

పురాణములు శాసించినటుల నడువవలెనన్న సూత్రమిందు గాన్పించుచున్నది. స్ర్తీ స్వేచ్ఛ సమానత్వం లాంటివేమీ లేవు. అలా అని ఆమె స్ర్తీల కోసం ముఖ్యంగా దేవదాసీల కోసం చేసిన కృషి ఏమీ మాసిపోవు. ముందు చెప్పుకున్నది ఆమె పరిమితి. ఆమెను వీరేశలింగంకంటే పైన కూర్చోబెట్టడానికి స్ర్తీల విషయంలో వైఖరి అనే స్కేలు సరిపోదని చెప్పడానికి మాత్రమే ఈ ఉదాహారణ.

ఇద్దరూ కొన్ని విషయాల్లో ముక్కిపోయిన పౌరాణిక భావాలు గలవారే. నాగరత్నం తన వృత్తి చీత్కారాలు ఎదుర్కొంటున్న వేళ దానికి గౌరవం ఆపాదించుకోవడానికి సంగీతసాహిత్యాలను ఆశ్రయించి అందులో పండితుల చేత ఔరా అనిపించుకున్న విదుషీమణి. వీరేశలింగం విద్య వలన స్ర్తీలలోనూ మొత్తంగా సమాజంలోనూ మౌఢ్యాన్ని పారద్రోలాలని నిశ్చయించుకుని అందుకోసం జీవితాంతం కృషి చేసిన మనిషి. తేడా ఉంది.

కొన్ని విషయాల్లో వీరేశలింగం వాడే పదజాలం దాని వెనుక పనిచేసే భావజాలం చూసినపుడు చిరాకు వేయొచ్చు. కానీ మరోకొసకు వెళ్లి దేవదాసీ వృత్తిని గొప్పగా చూపే పరిస్థితికి వెళ్లకూడదు. సబాల్టర్న్, పోస్ట్ మాడర్న్ లాంటి పదజాలాలతో ప్రచారమైన అంశాల్లో ఈ రకమైన రోమాంటిసిజమ్ కనిపిస్తుంది.

తనకు తెలిసిన ప్రపంచంలో తాను చూసిన దేవదాసీలు వృత్తిలో వైభవంగా బ్రతికారని ఆ వృత్తిని నిషేధించాక దాని వికృతరూపాన్ని తన వూళ్లో చూశానని ఉమా వేరొక సందర్భంలో రాశాడు.

‘‘నిలువెత్తు నగలతో ఆటాపాటలతో అలరారిన ఇళ్లలో ఆకలొక్కటే ఎందుకు మిగిలింది?’’ అని ప్రశ్నించాడు. అసలు సమస్య అక్కడ ఉంది. ఉమా పేర్కొన్న ప్రత్యేక సందర్భం సంగతి చెప్పలేం. మొత్తంగా దేవదాసీ వృత్తి వైభవోపేతమైనది అంటే ఒప్పుకోలేం. దేవదాసీ జోగిని లాంటి వృత్తుల్లో కునారిల్లుతున్న వారి కోసం జీవితాంతం పనిచేసిన ముత్తులక్ష్మీ రెడ్డి, లవణం లాంటివారిని అడిగితే చెపుతారు అవెంత వైభవమో. ఆధునిక చరిత్ర మనముందే ఉన్నది. సెక్స్ అంతర్భాగంగా ఉన్న ఏ వృత్తి అయినా ఎపుడైనా వైభవంగా గౌరవంగా ఉందా! ఉండగలదా!అంతెందుకు, నాగరత్నం తల్లి పుట్టలక్షమ్మనే తీసుకుందాం. 30ల్లో క్షయ వ్యాధితో చనిపోయింది. పేదరికంతో పాటు అనేక చీత్కారాలు ఎదుర్కొన్నది.

మచ్చుకు కొన్ని…

‘‘లోకవాడుక ననుసరించి ఆమె ధనసంపాదన మొనర్చుటలేదని ఆమెను పెంచి పెద్దచేసిన వారికి కంటకమైనది. వారామెకు శ్రీ సుబ్బారావుగాకి ఆశ్రయమును తప్పించిరి. ఆ పోషకులు కోపించి పిల్లను తల్లిని నిలువుదోపు గావించి చింక పేలికలతో వీధిలోనికి నడిపించిరి’’

మామూలు తెలుగులో చెప్పుకుంటూ ఎడాపెడా పడుకుని డబ్బులు సంపాదించడం లేదని ఆమె పెద్దలు అప్పుడు ఎవరి ప్రాపకంలో ఉండిందో ఆయన నుంచి దూరం చేసి రోడ్డున పడేశారన్నమాట. ఆ తర్వాత తమ్మయ్య శాస్ర్తి అనే పంచన చేరితే ఆయనేం చేశాడు.

‘‘నీ బిడ్డ మైసూరున పేడకడలెత్తును పో! అని శపించి పల్కుచు వీధిలోనికంపిరి’’

అటు పిమ్మట ఏమి జరిగెను. కుమార్తెకు విద్యాబుద్దులనేర్ప కడు కష్టములోర్చుతూ ఒక క్షత్రియోత్తముని ఆశ్రయము పొందెను కదా. అక్కడేమి జరిగెను.

‘‘పిదపకాలమున పుట్టలక్ష్మమ్మకాశ్రయమిచ్చిన క్షత్రియోత్తమునకు రూపసుందరియు, విద్యాసుందరియునైన శ్రీమతి నాగరత్నముగారియందు మనస్సు భ్రమింపనారంభించెను’’.

మామూలు తెలుగులో చెప్పుకుండే తల్లితోనూ, కూతురితోనూ! ఇక చాలనుకుంటాను ఉదాహరణలు. ఇవ్వన్నీ నాగరత్నమునందు భక్తిప్రపత్తులతోటి వ్రాసిన వారి వ్యాసముల నుంచి ఉదహరించుచున్నవేనని మనవి.

అప్పటికి అంటే రాజులు, జమీందారులు, భోగములు అని పిలుచుకునే భూములు, పోషించు బ్రాహ్మణోత్తములు, క్షత్రియరత్నాలు ఉన్నపుడు వారు పొందిన వైభోగం అదీ! తర్వాత్తర్వాత ఈ వైభోగం ఇంకా ఏ స్థాయికి వెళ్లిందో ఆధునిక చరిత్రతో పరిచయమున్నవారందరికీ తెలుసు. ముత్తులక్ష్మీరెడ్డి నుంచి లవణం కుటుంబం దాకా చాలా రికార్డు చేసే ఉన్నారు.

‘‘వ్యభిచారం పేరుతో ఒక వ్యవస్థ మీద దాడి చేసి చట్టం చేసి అణచివేశారు. సమాజం నుంచి వ్యభిచారాన్ని మాత్రం అణచివేయలేకపాయారు’’

అని ఉమా గతంలో రాసి ఉన్నాడు. అణచివేయగలిగారా లేదా అనేది ఆ ప్రయత్నాన్ని అంచనావేయడానికి స్కేల్ కాకూడదు. వ్యభిచారాన్ని పూర్తిగా అణచివేయడం సాధ్యం కాకపోవచ్చు. పెళ్లి అనేది ఉన్నంత వరకూ అది కూడా కొనసాగొచ్చు. కానీ వ్యభిచారం అంతర్భాగంగా ఉన్న ఏ వృత్తిని గ్లామరైజ్ చేయకూడదు. ఏసోబు ఎంతో నైపుణ్యంతో కళగా గొడ్డు చర్మం వలుత్తాడండీ, వద్దంటారేండీ! ఆశీర్వాదం ఎంతో కళగా తప్పెట కొడతాడండీ తప్పేటండీ వృత్తిలో! బాగోవు. నాగయ్య ఎంతో శ్రద్దగా మానవమలమూత్రాలను గుంతలోంచి తోడిపోత్తారండీ అనకూడదు. వ్యవస్థ అలవాటు చేయడం వల్ల దిక్కులేక చేసే పనులను గ్లామరైజ్ చేయకూడదు. అందులో కళ ఉండొచ్చు. మనిషి క్రియేటివ్ కాబట్టి ఒకేపని అదే పనిగా చేయాల్సి వచ్చినపుడు కొన్ని కళాత్మక సొగసులను అద్దుతారు. అంతమాత్రాన కళ మాత్రమే చూస్తామంటే కుదరదు. అంతగొప్ప కళలే అయితే ఆయా కుల వృత్తుల్లో అంత అందమే ఉంటే పండితోత్తములు, ఆధునిక ఎలీట్ ఎందుకు చేయరు ఈ పనులను? లేబర్ మనది, విలాసం వారిది కాబట్టి వారికి వాటిని పొగడ్డంలో వారికి ఆనందం ఉంటది. సోషల్ మార్కర్స్ తో వచ్చే ఆధిపత్యం తగ్గుతున్నది కాబట్టి అంటే పుట్టుకతో వచ్చే ఆధిపత్యం తగ్గిపోతున్నది కాబట్టి కాబట్టి కోల్పోయిన వాటిపట్ల వారికి పలవరింత ఉంటది. వర్కింగ్ క్లాస్ ఆ దరిద్రాన్ని నెత్తికెత్తుకోకూడదు.

ఆధునికత అది తెచ్చిన చట్టాలు కనీసం అందులోని సోషల్ యాంగిల్ ను తీసేశాయి. ఒళ్లమ్ముకోవడం, ఇతర లేబర్తో కూడిన కులవృత్తులు అంత అందమైన అవసరమయైన కళే అయితే కలిగినోళ్లు –కులం కలిగినోళ్లు,డబ్బు కలిగినోళ్లు, బలం కలిగినోళ్లు, నోరుగల్లోళ్లు ఎపుడో దాన్ని మోనోపొలైజ్ చేసి ఉందురు- వ్యాపారాన్ని రాజకీయాలను చేసినట్టు. కానీ ఇక్కడ శ్రమ ఒకరిది. విలాసం మరొకరిది.

దేవదాసీల్లో ప్రబలంగా ఉన్న కన్నెరికం అనే ఆచారమే చూడండి…

‘‘వేశ్యల కుటుంబాల్లో ఆడపిల్లలకు తగిన వయస్సు వచ్చిన తరువాత వర్చస్వి, తేజస్వి, సంపూరక్ణ యౌవ్వనవంతుడు, దృఢగాత్రుడు, విద్యావంతుడు, వాగ్మి అయిన ఒక బ్రాహ్మణుడితో-దరిద్రుడైనా పర్వాలేదు-కలయిక ఏర్పాటు చేస్తారు. ఆ పిల్లకు గర్భచిహ్నాలు పొడసూపేదాకా ఈ సంబంధం కొనసాగుతుంది. అంతర్వత్ని అయ్యాక సదక్షిణాకంగా ఆ బ్రాహ్మణుని పంపేస్తారు.’’

ఈ వృత్తి పోయినందుకు బాధపడాలా. ఈ ఆచారం పోయినందుకు బాధపడాలా. ఆధునికత పడుపు వృత్తిని సెక్స్ వర్క్ గా మారుస్తుంది. వేశ్యలు సెక్స్ వర్కర్లవుతారు. కులానికి ఉన్న సంబంధం పోయి క్లాస్ యాంగిల్ వస్తుంది. ఒళ్లమ్ముకోవడం అనేది మనిషి గౌరవాన్ని దిగజార్చేది కాబట్టి మొత్తంగానే తీసేయాలి అనేది ఒక వాదన, ఎలాగూ తీసేయలేం కాబట్టి దాన్ని గుర్తించి వారికి కనీస హక్కులు కల్పించాలి అనేది ఇంకో వాదన. మీరే వాదనైనా తీసుకోవచ్చు గానీ దిక్కుమాలిన కుల ఆధారిత మైన పాత వ్యవస్థ గొప్పదని కీర్తించకూడదు.

సోకాల్డ్ నైతికత విషయంలో వీరేశలింగంలో ఇబ్బందికకరమన వైఖరులు ఉన్నాయి. కులపరమైన పరిమితులు కూడా ఉన్నాయి. అవి చూపించి ఆయన్ను ఆయన కృషిని పూర్తిగా తీసేస్తామంటే కుదరదు. అలాగే నాగరత్నం పట్టుదల, సంగీత సాహిత్యాలలో ఆమె కృషి ఎన్నదగినవి. కానీ అది చూపించి దేవదాసీ వృత్తిని నెత్తికెత్తుకోవడం తగని పని. వర్కింగ్ క్లాస్ పనైతే కాదు.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

జీ.ఎస్. రామ్మోహన్

జీ.ఎస్. రామ్మోహన్

16 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • Highly intellectual piece of work.
  The writer must have referred matter minimum Ten times more than the above article.

 • టైటానిక్ సురేష్ ‘ఇంటరెస్టింగ్ ఆర్టికల్’ అని పంపించిన మెసేజ్ చూసి ఇపుడే చదివాను. దాదాపు అంతరించి పోతున్న ‘చారిత్రిక దృష్టికోణ’ పద్దతిలో రాసిన లోతయిన వ్యాఖ్య. కొత్తగా రాసేవాటిలో రెఫెరెన్సులు ఇస్తారని ఆశిస్తూ.

 • మొత్తంగా వీరేశ లింగం నూతన మానవుణ్ణి కలగన్న గొప్ప దార్శనికుడు, నాగరత్నమ్మ కొంచం తక్కువ దార్శనికు రాలు. అటు విరసం స్కూల్ అశ్శరభ శరభ పూనకాలు, గురజాడ, వీరేశలింగం లను ఆధునికతకు మూలవిరాట్ చేసి నిలబెట్టి నాగరత్నమ్మ త్యాగాలను సాకబోసే ఒక మూస ఆలోచన ఇన్నాళ్ళూ మా మెదళ్ళలో తిష్టవేసాయి. ఆనాడు కొన్ని పుస్తకాలు నిషేధం గురి అవడం అవకపోవడం వెనక క్విడ్ ప్రో కో ఎలా ఉండేవో ఉమా మహేశ్వర్ అన్న ఒక పాత్రికేయుడు అయిఉండి ఒక చారిత్రక దోషాన్ని నిలబెట్టే క్రమం లో ఆయన లేవనెత్తిన ఒక బలమైన సబాల్త్రెన్ ఆర్గుమెంట్ ను బలహీనపరిచే లిటిగెంట్ వ్యాసం. ఒకప్పుడు రామ్మోహన్ అన్న వ్యాసాల లో ఇంత చికాకు ఉండేది కాదు. తెలుగు లో మంచి వచనం రాసే నలుగురు ఐదుగురు లో అతను ఒకడు కనుక ఆ ఇష్టం తో ఈమాట రాస్తున్నా.. బహుశా ఇప్పుడు ఒక అంతర్జాతీయ సంస్థ లో పనిచేస్తున్నాడు కదా యూరోసెంట్రిక్ అకడమిక్ ట్రైనింగ్ ఇలానే ఒక పెద్దమనిషి తరహా ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా రాసే ఒరవడి అలవాటు చేసుకుంటున్నాడు అని ఈవ్యాసం ద్వారా నాకు అనిపించింది(నాకు మాత్రమే సుమ). రాసే ఆయన హక్కుని గౌరవిస్తూనే. అసందర్భం అయినా ఒక మాట చెప్పాలి. చరిత్ర కొండగుర్తులు అప్పుడప్పుడూ చెరిగి పోతాయి. తెలంగాణ సాహితీ మిత్రులు తెలుగులో మొదటి కథానిక(కథ) దిద్దుబాటు కాదు బండారు అచ్చబాంబ రాసిన ‘ధన త్రయోదశి’ అనే అంశాన్ని దాని ప్రాధాన్యత ను తగ్గించే క్రమం లో ‘దిద్దుబాటు’ కన్నా ముందు ఉన్న పేరు తెలియని కొన్ని సేకరించి 92 కథలు తానా వాళ్ళు ప్రచురించారు.ఆ ప్రయత్నాన్ని స్వాగతిస్తూ నే తెలంగాణ సాహిత్య పునర్నిర్మాణ దశలో ఈ పుస్తకం తేవడం వెనక గిరజాడ వారసుల పరంపర మాకు మాత్రమే ఉంది. మీకు కేవలం బండారు అచ్చమాంబ ఇంకా సూటిగా చెప్పాలి అంటే ఆమె మాఇంటి ఆడబిడ్డ కేవలం మహారాష్ట్ర లో చదువుకుని దక్కన్ లో స్థిరపడ్డ మీ ఊరి కోడలు మాత్రమే అని చెప్పడం అన్నమాట. ఇలా చరిత్రలో స్థిరపడ్డ మూల విరాట్ రూపాల కు ఏమాత్రం మైల పడ్డా తిది వార నక్షత్రాలు చూసుకొని సంప్రోక్షణ చేసి దళిత గోవిందం లో తరించే లా ఒక మెకానిజం తయారు చేసుకోవడం లో ఆదిపత్య సంస్కృతి జాగురూకత తో ఉంటది . జాగ్రత్త అని హెచ్చరిస్తూ…

  • విదేశీ ఆక్రమణ వల్ల ప్రధాన ఫలితం: హిందూ సమాజానికి బ్రాహ్మణులు తిరుగులేని నాయకులు, ధర్మ శాస్త్ర పాలకులైపోయారు.
   -స్వామి ధర్మ తీర్థ.(హిందూ సామ్రాజ్య వాద చరిత్ర,)

  • గిరీశ్ కర్నాడ్, వీరేశలింగం గురించి వ్యాసాలు : ఒక స్పందన

   గిరీశ్ కర్నాడ్ గురించి డా. గుర్రం సీతారాములు సామాజిక, చారిత్రక కోణాలనుంచి రాసారు (జూన్ 1 సంచిక). బాగానే వుంది. కొన్ని మంచి అంశాలున్నాయి. అయినా కొన్ని గమనించాల్సిన సూచనలున్నాయి.
   “ఉత్తమ స్థాయి సాహిత్యాన్ని ప్రచురించడం” సారంగ ముఖ్య లక్ష్యం. “పంపేముందు ఒకటికి రెండుసార్లు ఎడిట్ చేసుకోండి. అక్షరదోషాలు లేకుండా చూసుకోండి. ఫార్మాటింగ్ చేయాల్సిన రచనలను ఖచ్చితంగా తిరస్కరిస్తాము” అని పత్రిక సూచనల్లో రాశారు. రచయితలు వీటిని పాటించి, శక్తి మేరకు సహకరించాలి.
   కానీ ఈ సూచనలన్నిటినీ బేఖాతరు చేసిన రచన ఇది.
   వాక్యనిర్మాణంలో అశ్రధ్ధ, అస్పష్టత…అచ్చుతప్పులూ పుష్కలంగా వున్నాయి. పదాల స్పెల్లింగుల్లో అస్పష్టతకు తావునిచ్చేరీతిలో దోషాలున్నాయి. ఉదా: ఆసక్తికి బదులు ‘ఆశక్తి’ అని – రెండు సార్లు – రాసారు; అర్థాన్ని మార్చే దోషం ఇది. సాహిత్య పత్రికలలో ఇన్ని, ఇలాటి తప్పులుంటే బాగుండదు. ఇలాటి రచనల ప్రచురణకు ముందు ఎడిటింగ్ సహాయం అవసరం.
   తొందర్లో రాసారో, అలాగే తొందర్లోనే ఎడిట్ చేయకుండా ప్రచురించారో…రాళ్ళు ఏరకుండా అన్నం వండి విందిచ్చినట్టుంది.
   రచయిత ప్రస్తావించిన కర్నాడ్ నాటకం పేరు ‘తిలదండ’ కాదు, తలె దండ. తలకు దండన – శిరచ్ఛేదం – ఉరిశిక్ష దాని అర్థం. ఆయనది కేవలం అచ్చుతప్పు కాదనిపిస్తుంది. ఎందుకంటే అది చాలా ప్రసిద్ధ నాటకం. ఇలాంటి లోపాలు లేకుండా, ఇలాటి విద్యావంతులైన యువ రచయితలు, డాక్టరేట్ ఉన్నవారు ఇంకొంత శ్రద్ధ తీసుకొని రాయాలి. ఎడిటింగ్ లోనైనా దీన్ని సరిచేయాల్సింది.
   ఈ లోపాలను చూడకుండా, చెప్పకుండా చాలామంది (ఆ రచయిత అభిమానులు?) మెచ్చుకుంటూ రాసారు! ఈ పధ్ధతి ఆయనకు మేలు చేయదు. లోపాలున్నా మెచ్చుకునే మిత్రులకన్నా, ఎత్తిచూపే విమర్శకుల వల్ల మేలు జరుగుతుంది.
   దాదాపు పదిరోజుల తర్వాత తహిరొ అనుమానం, పదిమంది కామెంట్స్ తర్వాత, కె కె రామయ్య తలెదండని సరిచేసి, వివరించారు కాబట్టి సరిపోయింది. రచయిత కూడా ఆ తర్వాత, ఆలస్యంగానైనా, మార్చుకున్నారు, మంచిదే. ఎంతమంది ఈ కామెంట్స్ అన్నిటినీ చూస్తారు? వారికి తప్పు సమాచారమే మిగులుతుంది కదా? ఈ తప్పు అసలు ఎలా జరిగింది? అని రచయిత ఆలోచించుకోవాలి.
   “బెంగుళూరు నాగరత్నమ్మ సానిబ్రతుకు”ని …అన్న రచయిత దాన్నే ధిక్కారంగా భావించి, ప్రశంసించటానికి మధ్యలో కందుకూరిని ఈసడించటం ఎందుకు? ఇది తగదు. గిరీశ్ కర్నాడుని సంస్మరిస్తూ ఇలా రాయటం చాలా అసందర్భం. వీరేశలింగం తనకాలంలోనే ఎలాంటి సామాజిక, సాంస్కృతిక ధిక్కారం చేశారో గమనించి చూస్తే, ఇలాంటి వ్యాఖ్య చేయటం అపచారంకూడా. ఎందుకంటే బ్రాహ్మణుడిగా పుట్టి బ్రాహ్మణుల మోసాల్ని, దురాచారాలని సవాలు చేయటంలో గిరీశ్ కర్నాడ్ వీరేశలింగంకి వారసుడేనని గమనించాలి. అలాగే పురాణాలను ఇద్దరూ వ్యంగీకరించారు. కందుకూరి గురించి సారంగలోనే ఏకే ప్రభాకర్ వ్యాసం, దానిపై రామారావు (జూన్ 15 సంచిక) స్పందన, దాన్ని ఆహ్వానిస్తూ ప్రభాకర్ మాటలు, ఆరోగ్యకరమైన చర్చ అని శైలజగారి వ్యాఖ్య…సీతారాములు గారు వీటిని చూస్తే బాగుంటుంది. చూసాక కూడా అలాగే రాసేవాడిని అంటే వారిష్టం.
   ఎందుకంటే ఆ తర్వాత జూలై 1 సంచికలో జీయస్ రామ్ మోహన్ వీరేశలింగం గురించి చక్కగా, చారిత్రక దృష్టితో రాస్తే దాన్ని సీతారాములు ‘లిటిగెంట్ వ్యాసం’ అని తప్పు పట్టారు. యూరోసెంట్రిక్ అకడెమిక్ ట్రైనింగ్ ఫలితం అన్నారు. ఏం మీ సబ్ ఆల్ట్రన్ వాదనే సరైందని అంగీకరించాలా? ’యూరోసెంట్రిక్ అకడెమిక్ ట్రైనింగ్’ తర్వాత కూడా ఆయన అలా రాసారంటే కొంచెం ఆలోచించాలి కదా? మీ వాదానికి వాస్తవాలతో, వీరేశలింగం చారిత్రిక కాలంతో, నేపధ్యంతో పని లేదా?
   నాగరత్నమ్మగారి పుస్తక నిషేధం గురించి క్విడ్ ప్రోకో ఉందని రాసారని పేర్కొన్నారు. ఆమె పుస్తకం 1911లో నిషేధించబడింది. కందుకూరి 1919లోనే చనిపోయినా, నిషేధం 1947 దాకా కొనసాగింది. నిషేధం గురించి క్విడ్ ప్రోకో ఉందని కందుకూరిని నిందించటంలో అర్థం లేదు. నిజానికి అదే కాదు. దానితోపాటు మరో ఏడెనిమిది పుస్తకాలూ నిషేధించబడినాయి. అప్పటిలో అలాటి చట్టం ఉండేది. రాధికా సాంత్వనం కేవలం శృంగారకావ్యం కాదు, రతిశృంగారకావ్యం. చైల్డ్ సెక్స్ తో సహా ఉన్న కావ్యం. ఇప్పటికీ అలాటి పుస్తకాలను నిషేధించాలని కోరేవారు, అలాటి చట్టాలు ఉన్నాయి. లేడీ చాట్టర్లీస్ లవర్ పుస్తకం 1959 దాకా అమెరికా, ఇంగ్లాండ్ లలో సైతం నిషేధించబడింది. ఆమె పుస్తకం 1911లో నిషేధించబడింది. నిషేధం గురించి ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా, కందుకూరిని నిందించటంలో అర్థం లేదు. మీ సబ్ ఆల్ట్రన్ వాదన పేరిట ఇతరులు రాసిన దాన్ని అచారిత్రకంగా ‘లిటిగెంట్ వ్యాసం’ అని కొట్టి పారేయటం చెల్లదు.
   అందుకే మరోసారి ప్రభాకర్, రామారావుల వ్యాసాలు చదవండి అనటం. రామ్ మోహన్ వ్యాసంలో లోపాలు లేవని కాదు, నిజానికి ఆయన కూడా పైవ్యాసాలని మరోసారి పరిశీలించటం అవసరం.
   సీతారాములు కర్నాడ్ తీసిన వంశవృక్ష సినిమాను ప్రస్తావించారు. దీనికి ఆధారమైన ప్రఖ్యాత నవల వంశవృక్ష రచయిత భైరప్ప. సీతారాములు మెచ్చుకున్న అభ్యుదయ కర్నాటక ప్రపంచంలో భైరప్ప అభివృద్ధినిరోధకుడుగా, హిందుత్వవాదిగా పేరుబడ్డారు. ఆయనని గిరీశ్ కర్నాడ్ కూడా నిశితంగా విమర్శించారు. ఈవిషయం గమనార్హం. దాన్నికూడా రచయిత పరిగణన లోకి తీసుకుంటే బాగుండేది. ఇది సందర్భోచితంగా ఉండేది.
   ఏమైనా ఆలోచించాల్సిన చర్చలకు తావిచ్చిన, ఇస్తున్న సారంగకు అభినందనలు, కృతజ్ఞతలు.

   కలిదిండి జగన్నాధ రామారావు

   • ధన్యవాదాలు రామారావు గారు మీ సూచనలు మంచివే, నిజానికి గిరీష్ కర్నాడ్ వ్యాసం తప్పులు చూసుకోకుండా పంపాను.అది ఏస్థితిలో పంపానో ఎడిటర్ గారికి తెలుసు. ‘తలె దండ’అనువాదం చేసిన భార్గవి పి.రావు గారు నిజాం కళాశాల లో అధ్యాపకురాలు. వ్యక్తిగత పరిచయం కూడా. ‘మీరు చెప్పిన వ్యాసాలు నేను చదివాను,అయినా రామ్మోహన్ గారి వ్యాసం మీద నా అభిప్రాయం మార్చుకోను.మీరన్న గిరీషకర్నాడ్ వంశ వృక్షం, అది రాసిన భైరప్ప అభివృద్ధి నిరోధక ప్రస్తావన ఆమాట కొస్తే కర్నాడ్ కూడా తన సాహిత్య ప్రపంచం మినహా రాజ్యం నుండి రావాల్సిన సకల వెసులుబాట్లూ అనుభవించాడు. ఒక నివాళి లో వ్యక్తిత్వ హననం చేయాలి అనిపించలేదు. అయినా గౌరీ లంకేష్ మృతి తర్వాత తన భావాల లో తీవ్రత,అభిప్రాయాలను ప్రజానుకూలంగా మార్చుకున్నాడు. అందుకే ఆయన మీద గౌరవం. మళ్ళీ చెబుతున్నా “సబ్ ఆల్ట్రన్ వాదనే సరైందని అంగీకరించాలా?” అంగీకరించమని నేను ఎవరినీ ప్రాధేయపడలేదు బెదిరించలేదు. సబ్ ఆల్ట్రన్ వాదం గొప్పది అనే బ్రమలూ నాకు లేవు. పాక్షికంగా అయినా విస్మ్రుతుల గొంతు విన్నది. చరిత్ర రచన నిర్మాణానికి ఒక ప్రత్యామ్నాయ దారి వేసింది.నాడు బ్రిటిష్ వాళ్ళు నిషేదించిన పుస్తకాల జాబితా తయారు చేసింది ఎవరు? స్థానిక అధికారులు ఎవరు? రాగద్వేషాలకు అతీతంగా నిషేధం జరిగిందా చర్చ జరగాల్సి ఉంది

 • ఆవేశ కావేశాలకు, వ్యక్తిత్వ హననంకు లోనుకాకుండా, విషయాన్ని సోదాహరణంగా చర్చించిన వ్యాసం. చాలా రోజుల తరువాత ఒక మంచి వ్యాసం చదివిన అనుభూతిని మిగిల్చింది.

 • “యురొ సెంట్రిజం ” అనే పదం ఈ దేశపు సనాతన,సంప్రదాయవాదులు మాట్లాడితే బాగుంటుంది కానీ తమని తాము అభ్యుదయవాదులనుకునేవాళ్ళు మాటాడనే కూడదు. ఈ విషయం పూలే ,అంబేద్కర్ల ఆచరణ అడుగడుగునా రుజువు చేసింది.

 • తెలుగునాట వీరేశలింగం పంతులుని ఒక సంస్కర్తగా ప్రతిష్టించారు. నిజానికి వీరేశలింగం గారి సంస్కరణలను ఎదురీది స్త్రీలు వివాహబంధానికి దూరంగా బతకడమే శ్రేయస్కరం అని ఎదురు తిరిగిన స్త్రీలు ఉన్నారు. అలాగే దేవదాసి వ్యవస్థ రద్దు ఒక సామాజిక వర్గం సాంసృతిక ఆర్ధిక హక్కులకి భంగకరం అని ఎదురు తిరిగిన బెంగుళూరు నాగరత్నమ్మ ఉన్నారు . సాహిత్యరంగంలో వీరేశలింగం లౌక్యాన్ని నిలదీసిన ఆదిభట్ల నారాయణ దాసు ఉన్నారు .అలాగే వైదిక సంస్కృతిని గౌరవిస్తూనే స్త్రీ పునర్వివాహాన్ని సమర్ధించిన బంకుపల్లి మల్లయ్య శాస్త్రి వంటి సంప్రదాయ సంస్కర్తలు ఉన్నారు.కానీ పాశ్చాత్య మార్గంలో నడిచిన కందుకూరిని సంస్కర్త హోదాలో విగ్రహంగా నిలిపారు

  బహుముఖమైన పరిణామాన్ని ప్రాసెస్ ని అధః కరించి వొక వ్యక్తిని విగ్రహంగా నిలపడమే జాతీయతా వాదం . దానికి అనుగుణంగా పాఠ్యగ్రంథాలు చరిత్రా రచింపబడతాయి .[రామాయణ నీతికి సమాధి-rani siva samkara sarma. saranga]

   • రాగద్వేషాలకు అతీతమైన మర్యాదస్తుల భాషలో జిఎస్ రామ్మోహన్ ఈవ్యాసం రాసి మెప్పించారు కానీ కొండను బాగానే తవ్వారు ఎలకనే పట్టలేకపోయారు.
    అసలు విషయం ఏది మంచి ఏది చెడు అనే జడ్జిమెంట్లు కాదు. అసలు కొందరు సంస్కర్తలుగా పురోగాములుగా గుర్తింపు పొంది మరి కొందరు మరుగునపడిపోవడం నిందకు గురికావడం ఎందుకు జరిగింది?
    వీరేశలింగం సంగతి సరే విరసం కెవి ఆర్ కూడా ‘ ముద్దుపళని మగవాళ్ళని మించి బరి తెగించి రాసింది ‘ అని ఎలా అనగలిగారు? అందులోనూ వీరేశలింగం చనిపోయిన ఎన్నో ఎల్లా తర్వాత, ముద్దుపళని రాధికాసాంత్వనం ప్రచురణ కోసం బెంగుళూరు నా గరత్నమ్మ వీరేశలింగం కి వ్యతిరేకంగా పోరాడిన ఎన్నో దశాబ్దాల తర్వాత. నాకు తెలిసి అస్తిత్వ ఉద్యమాలు వచ్చాకే ప్రగతిశీల మర్యాదస్తుల బరితెగింపు తగ్గి నాగరత్నమ్మ గురించి చర్చ మొదలయింది.ఇది దృక్పధంలో మార్పు
    టీవీలు వార్తాపత్రికలు వచ్చాకే ప్రపంచం మొదలయింది అనుకొంటే చాల సంగతులు అర్థంకావు. నిజానికి శృ 0గార రచనలు భారత ఖండంలో నిషిధ్ధంగా ఎప్పుడు భావింపబడ్డాయి? పాస్చాత్యులు భారతీయులని ఎరోటిక్ అని, అది వాళ్ళు ఎమోషనల్ మాత్రమే కానీ హేతుబద్ధత లేనివాళ్ళని నిరూపిస్తున్నాయి అనివాదించారు.హెగెల్ కూడా అలాగే వాదించారు.పాస్చాత్య భాషలలోకి అనువాదం చేస్తున్నపుడు అభిజ్ఞాన శాకుంతలం , జయదేవుని అష్టపదులు లాంటి గ్రంధాలలో చాల శృ 0గారాన్ని వడిగట్టారు కూడా. ఈవిక్టోరియన్ నీతి ఈనాటికి మనని హిందుత్వ దాడులరూపంలో వెంటాడుతొంది.
    బెంగుళూరు నా గరత్నమ్మ మాత్రమే కాదు ఆదిభట్ల నారాయణ దాసుకూడా దొరసానినో దొరనో కీర్తించారు. అది కాదు విషయం. వాళ్ళు సర్వాత్మనా ఇంగ్లీషు సంస్కృతిని వంట బట్టించుకోలేదు. అందుకే మనకి కూడా ఫ్యూడల్ వాసన వేస్తున్నారు.కానీ గురజాడ ,వీరేశలింగం లు బేపన వాసన కాక మార్కెట్ వాసన కొడ్తున్నారు.
    బెంగుళూరు నాగరత్నమ్మ తిరుగు బాటులో కన్నా వీరేశలింగంలో పురోగతి ఎక్కువ కనబడుతొంది మనకి.
    ఎందుకంటే జిఎస్ రామ్మోహన్ లాంటి పెద్ద మనుషులు ప్రగతిశీలత -సంప్రదాయం ,గతం-వర్తమానం ఇలా స్పష్టమైన విభజన చేసి జడ్జిమెంటు యివ్వాలని చూస్తారు. అప్పుడు మొదట ఆధునికతని అందుకొన్న బ్రాహ్మలు తరువాత వారి అడుగుజాడలలో నడిచి మధ్యతరగతిగాఎదిగిన కొద్దిమంది మిగులుతారు.
    మిగిలినవాళ్లు అందరూ తిరోగాములే మరి. ఇదే యూరో సెంట్రిజం అంటే.
    ఈ తిరోగామి పురోగామిలాంటి పదాలతో ఈజీగా జడ్జిమెంటు చేసిపారెయ్యచ్చును. కాంగ్రెస్సా బిజెపియా అన్నంత సులువుగా. ఇందాకే ఒక పెద్దమనిషి బైరప్ప తిరోగామి కదా అనేశాడు. అంతటితో చాప్టర్ క్లోజ్ అన్నట్లు . బైరప్ప రాసిన గృహభంగ ప్లేగు నేపధ్యంగా ఎంత గొప్పగా రాయబడింది!
    ఎందుకంటే తాత్విక శు న్యతతో బాధపడే తెలుగువాళ్లు మంచి చెడులు పురోగమన తిరోగమనాలు ఇలా అన్నిటిని కొన్ని సెకన్లలో తీర్పులిచ్చేస్తారు.
    మరొకాయన అంటున్నాడు. యురోసెంట్రిజం అనే కాన్సెప్ట్ సనాతనదృక్పధం అట. మరి మూవింగ్ ది సెంటర్ ,డీకాలోనైజింగ్ మైండ్ రాసిన నల్లజాతి రచయిత గూగీ ని ఎలా వర్గీకరిస్తారు?

 • నేనింకా వ్యాసం చదవలేదు కానీ ముందురాసిన మాటల గురించే సందేహం మొదలైంది. ‘దిక్కుమాలిన కుల ఆధారిత వ్యవస్థ గొప్పదని కీర్తించ కూడదు’. ఇంతకూ మనకి కొట్టొచ్చినట్లు ప్రస్తుతం కనబడుతున్నదేమిటి. కులవ్యవస్థ దిక్కుమాలిపోయి బేలచూపులు చూస్తోందా. కులరాహిత్యం గురించి సర్వత్రా ప్రస్తావన జరుగుతోందా? కనీసం గణనీయమైన రీతిలో దాన్ని విని, దానిగురించే చిన్తించే సమూహం వున్నదా. గొప్ప సంస్కర్తలుగా కీర్తించబడే వారిలో ఎందరు కులాన్ని త్యజించాలని వాదించారు? సరేజేసి అలా అందరూ అంగీకరించారనుకున్నా గతంలోకంటే ఇప్పుడు కులం సంగతి అటుంచి, కులవారీ ముందడుగు, వెనుకంజల మీదనే సర్వత్రా తర్జనభర్జనలెందుకు జరుగుతున్నాయి, నిమ్నకులాలనుకునే వారితో సహా? ఇలా లోపల్నించి తన్నుకొచ్చే ప్రశ్నలు కేవలం నా అభివృద్ధినిరోధక భావజాలం నించి మాత్రమే పుట్టుకొస్తున్నాయని నాకనిపించడం లేదు. విజ్ఞులైన పాఠక మిత్రులు ఎవరైనా సమాధాన పరిస్తే నేను మొత్తంవ్యాసం చదివి ఒక అవగాహనకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే నేల విడిచి సాము తెలుగునాట అతికి పోతోందనే భయం కలుగుతోంది.

 • విశ్లేషణ చాలా చక్కగా ఆలోచింపజేసే విధంగా ఉంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు