ఈ లోలోపలి ఉక్కపోత నుండి
ఈ ఊపిరి సలుపనితనం నుండి
ఎక్కడికో పారిపోవాలని
మనసు పదే పదే
ఒక పగటి కలను కంటు
తనను తానే బుజ్జగించుకుంటుంది!
ఈ మహానగరంలో
దిగ్గొట్టుకున్న కాళ్లు
నిన్ను ఎక్కడికీ కదలనివ్వవు!
కుటుంబసభ్యులే
తలా ఒక బంధంతో
నిన్ను కట్టిపడేస్తారు!
నేటిని రేపటికి వాయిదా వేస్తూ
నీకు నువ్వే మాయమాటలు చెప్పుకొని
ఈ రోజును గడిపేస్తుంటావు
మోసం చేసేది నువ్వే !
మోసపోతున్నది నువ్వే !!
నిత్యం ట్రాఫిక్ నదిలో చిక్కుకున్నప్పుడల్లా
నీ పుట్టినూరిని తలచుకుంటావు
పచ్చిక బయళ్లను ఊహల్లోనే కౌగిళించుకొని
పంటచేల మీద
తగని మమకారాన్ని పెంచుకుంటూ
నిమ్మలపడుతుంటావు
నగరంలో నాలుగు అడుగులు దాటడానికే
నువ్వొక యుద్ధసైనికుడివై పోతావు
బాల్యం గుర్తుకొచ్చి
గాలిపటమై ఎగరాలని
ఈ కాస్మోపాలిటన్ నగరం మీద
తీరని కలను కంటుటావు
నీ రెక్కల్ని విరిచిన నగర జీవితం
నీకు ఇన్ స్టాంట్ గుణపాఠం
జూమ్ మీట్ పెట్టకుండానే నేర్పుతుంది!
ఈ నగరంలో నువ్వు ఏమయ్యావు?
కేవలం ఒడవని ఈఎంఐవి అయ్యావు
చిధ్రమైపోతున్నది కాలం కాదని
నువ్వే నీ నుండి దూరమవుతున్నావని
కనుగొని, రోజూ కలవర పడుతుంటావు
వల విసిరినోడు భద్రం… !
అమాయకంగా
నూకలకు ఆశపడి
చిక్కుకుని నువ్వు మాత్రమే చిధ్రం!!
నగరీకుడా ఎందుకీ వలపోత
ఈ నరకం నువ్వు కొనుక్కున్నదే కదా!
*








Add comment