వంట వాడైన వంగూరి

నమ్మండి, నమ్మక పొండి. రోజుకి ఒక పూట కూడా భోజనం ఉండేది కాదు. ఉన్నా దాన్ని భోజనం అని అనడానికి లేదు. కేవలం రెండు గట్టి బ్రెడ్ ముక్కలు మాత్రమే.

చాలామంది లాగా నేను నా జీవితంలో జరిగిన ప్రతీ చిన్న విషయానికీ తేదీలూ, ఘడియలూ, విఘడియలతో గుర్తుంచుకోను కానీ 1967 సెప్టెంబర్ నెల మటుకు బాగా గుర్తుంది. అప్పుడు నాకేం కొంప ములగ లేదు కానీ అక్కడ సిక్కిం దగ్గర నాథులా, చోలా భారత భూభాగం లోకి చైనా వాళ్ళు దూసుకొచ్చారు. అవి ఇందిరా గాంధీ ప్రధాన మంత్రి అయి ఏడాదిన్నర అయింది. అంతకు రెండేళ్ళ ముందు జరిగిన పాకిస్తాన్ తో యుద్దం, తాష్కెంట్ లో లాల్ బహదూర్ శాస్త్రి గుండె పోటుతో మరణం, ఆయన ఇచ్చిన జై జవాన్, జై కిసాన్ నినాదం వాటి దేశవ్యాప్త పరిణామాల ప్రభావం ఇంకా వ్యాపించే ఉన్న వాతావరణం.  పాకిస్తాన్ తో యుద్ధం అంటే ఎవరూ కంగారు పడ లేదు కానీ చైనా అనగానే భయం వేసింది. ఎందుకంటే అంతకు ఐదేళ్ళ ముందు “హిందీ – చీనీ భాయీ భాయ్” అనే నెహ్రూ గారి స్నేహ హస్తానికి వెన్నుపోటు పొడిచి, దురాక్రమణ చేసి , మన కంటే అనేక రెట్లు ఎక్కువ ఉన్న సైన్యంతో మన దేశాన్ని చిత్తు చేసి ఆ కారణంగా నెహ్రూ గారి మరణానికి దారి తీసింది చైనా.

చైనాతో యుద్దం ప్రారంభం అవగానే అసలే అంత గొప్ప నీతి పరులు కాని మన ఆహార పదార్ధాల వ్యాపారులు దేశం అంతటా రెచ్చిపోయి బియ్యం, గోధుమలు, కూరగాయలు, పంచదార…మొత్తం తినుబండారాలన్నీ దాచేశారు. పైకి చెప్పిన కారణం మటుకు యుద్దంలో సైనికులకి పంపించేశాం అని. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ అంతా కరువే. అన్నింటికీ కరువే! అయితే అన్నీ నల్ల బజార్ లో కొనుక్కోవచ్చును.  “యావత్ ప్రపంచంలో ఆహార పదార్ధాలని లాభాలకోసం కలుషితం చేసేది ఒక్క భారత దేశంలోనే” అని నేను ఎక్కడో చదివాను.

ఇక బొంబాయి ఐ.ఐ.టి. లో హాస్టల్ 1 లో ఉన్న మా 100 మంది విద్యార్హుల గతీ అధోగతే. నమ్మండి, నమ్మక పొండి. రోజుకి ఒక పూట కూడా భోజనం ఉండేది కాదు. ఉన్నా దాన్ని భోజనం అని అనడానికి లేదు. కేవలం రెండు గట్టి బ్రెడ్ ముక్కలు మాత్రమే. వాటిది నాచు వాసన. ఒకటా, రెండా..మూడు నెలలు. పోనీ కేంపస్ లో ఉన్న సంసారుల ఇళ్ళలో వారాలు చెప్పుకుందామా అనుకుంటే వాళ్ళ పరిస్టితి మా కంటే అన్యాయంగా ఉంది.

మూడు, నాలుగు వారాల తరవాత మేం ముగ్గురం “ఇక లాభం లేదు గురూ” అనేసుకున్నాం. అంటే ఆ వెధవ మెస్ లో అడ్డమైన గడ్డీ కొరికే బదులు మన వంట మనమే చేసేసుకుందాం అనే నిర్ణయానికి వచ్చేశాం. అది పూర్తిగా హాస్టల్ నిబంధనలకి విరుద్ధం అని తెలిసినా ముందు బతకాలిగా, ఆ సంగతి తరవాత చూద్దాం లే అనేసుకున్నాం. ముగ్గురం తలో పది, పదిహేను రూపాయలూ వేసుకుని ఒక ఒక కిరసనాయిల్ కుంపటి, ఎందుకైనా మంచిదని ఒక బొగ్గుల కుంపటి.. .అప్పటికి ఇప్పటి గేస్ స్టవ్ లు…వగైరాలు లేవు….ఒక్కొక్క అట్లకాడ, పెద్దా చిన్నా  గరిటెలు కొన్ని, పళ్ళాలు, మూకుడు, పులుసు గిన్నె…ఇలా సరంజామా అంతా రహస్యంగా కొనుక్కొచ్కాం. నా గదే అందరికే వంటిల్లు. అంటే నా మంచం, పుస్తకాల బల్ల..అన్నీ ఓ మూల, ఈ వంట సామగ్రి ఒక మూల. ఇక మనం తిన్నగా తినలేని పోపు సామానులు ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు వై పాయింట్ దగ్గర మురుగన్ కొట్లో దొరికేవి కానీ వండుకోడానికి కావలిసిన బియ్యం, కూరలు వగైరాలు విక్రోలి రైల్వే స్టేషన్ పట్టాల వెనకాల ఉండే …స్లమ్స్…లో రహస్యంగా బ్లాక్ మార్కెట్ లో కొనుక్కోవాలి. మొదటి రోజు సరిగ్గా ఆ పనే చేసి, నా పుస్తకాల బల్ల మీద ఉన్నవన్నీ మంచం కిందకి తోసేసి, ఆ వంట సరంజామా అంతా దాని మీద జాగ్రత్తగా దేవుడి గుడిలో విగ్రహాలలాగా పెట్టుకుని దణ్ణం పెట్టుకున్నాం.

క్వీన్ ఆఫ్ ది కేంపస్..

ఇహ అసలు సమస్య ఇక్కడే మొదలయింది. విషయం ఏమిటంటే మా ముగ్గురికీ అప్పటి వరకూ అమ్మో, వదినో, వంటావిడో వంట చేస్తుంటే చూడడం వచ్చును కానీ చెయ్యడం రాదు. ఇప్పుడు సమస్య  అలా చూసిన విషయాలు జ్ఞాపకం తెచ్సుకుని ఇప్పుడు ఆచరణలో పెట్టడంలో కొట్టుకు చచ్చిపోయాం..అంతా సరదాగానే! మా ముగ్గురిలో సహజ గుణం ఆ సరదాయే!

మొదటి రోజు అన్నం సరిగ్గా వండడం దగ్గర నానా అవస్తా పడి, అది ఎంత జిగురుగా, బంకగా వచ్చినా ఇంటి నుంచి తెచ్చుకున్న ఆవకాయ వేసుకుని కడుపు నిండా తిన్నాం. అప్పటికి నాలుగు వారాలు ఆ బ్రెడ్ మీద ఆవకాయ వ్రాసుకుని కాలం గడిపిన మాకు అదే పరమాన్నం. ఆఖరికి “ఆ ఏముందీ, కాస్త గోధుమ పిండి నీళ్ళతో తడిపి, ఉండలు చేసి, గుండ్రంగా వత్తేసి పెనం మీద కాల్చేయ్యడమే గా” అనుకున్న మాకు చపాతీలు చెయ్యడం కూడా అంత వీజీ కాదు అని తెలిసిపోయింది. ఎంత ప్రయత్నించినా అవి ముక్కలు, ముక్కలుగానో, పిండి, పిండిగానో వచ్చి చచ్చేవి. ఇక వంకాయ వేపుడు కి తొక్క తియ్యాలా, అక్కర లేదా అని పెద్ద డిబేటు. ఏమైతేనేం ఒక వారం రోజులలో బంగాళా దుంపల వేపుడు, చారు లాంటి వాటి నుంచి పులుసు దాకా వచ్చాం. కొబ్బరి పచ్చడి లాంటివి చెయ్యాలంటే రుబ్బు రోలు లేదు మరి. అది కొందాం అనే లోపుగా మాకు మిత్ర ద్రోహం జరిగింది.

మా వంట స్థాయి పెరగడంతో దాని తాలూకు సువాసనలు కూడా మా హాస్టల్ ..ముఖ్యంగా మా వింగ్ లో అందరికీ వెదజల్లి మా రహస్యం బయట పడిపోయింది. వాళ్ళలో కొందరు మలయాళీలు, తమిళులు అయితే మహానంద పడి, మమల్ని బతిమాలి సాంబారు తాగేసి, అన్నంలో కలిపి జుర్రేసుకుని సంతోషించేవారు కానీ కొందరు పంజాబీ, సింధీ వెధవలు మా మీద అసూయాగ్రస్తులయి మా వార్డెన్ గోవింద రాజన్ గారికి ఫిర్యాదు చేశారు. ఆయనేమో ఇది వినగానే ముందు చాలా సంతోషించాడు. ఎందుకంటే ఆయన తమిళ తెలుగు వాడే కాక మాకు అప్పటికే నాటకాలు వెయ్యడానికి సాయం చేసి మా మీద బాగా ఇష్టం ఉన్న వాడు. మన మెస్ లో పాపం తిండి దొరక్క వాళ్ళ వంట వాళ్ళే చేసుకుంటున్నారు అనీ సంతోష పడ్డాడు ముందు. కానీ ఇది మరీ నిబంధనలకి విరుద్దం, పైగా ఫిర్యాదు వచ్చింది కాబట్టి మమ్మల్ని పిలిచి చిన్న చివాట్లు వేశాడు పాపం.

సుమారు మూడు నెలలు సాగి, యుద్దం అయిపోయి అన్నీ సద్దుమణిగాక నా గదిలో వంటిల్లు మూతపడింది. ఆ మూడు నెలలుగా చెప్పొద్దూ, జోకులే జోకులు. ఉదాహరణకి రెండు నెలల తర్వాత మా ముగ్గురిలో ఎవరికో గారెలు చేసుకుని తినాలని వెధవ గొంతెమ్మ కోరిక పుట్టింది. అవి ఎలా చెయ్యాలో అని కేంపస్ లో ఉన్న సంసారులని అడిగి సంబారాలు పోగేసి, మా దగ్గర రుబ్బు రోలు లేదు కాబట్టి ఆ మినప్పప్పు వాళ్ళింట్లోనే రుబ్బించుకుని…. మా సాముహిక వంటింట్లో గారెలు వేశాం. మొదటి వాయ నా మొహం లా అస్సలు గారె గారి వాలకం ఏ కోశాన్నా లేకుండా ముక్కలు, ముక్కలుగా వచ్చాయి. రుచి పరవా లేదు కానీ ఆకారం భీకరంగా ఉండడంతో మాలో ఒకడు “ఉరేకా” అన్నాడు. “ఏమిటి రా నీ తలకాయ ఉరేకా” అని నేను తలకాయ పట్టుకున్నాను. “అదే గురూ, అరిటాకు మీద నూనె రాసి వేస్తేగానీ గారెలు సరిగ్గా రావు” అని వాడు చిన్నప్పుడు చూసిన బామ్మ ని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అప్పటికే మా ప్రయోగాలతో మాడిపోయిన సంగం పిండి చూసి, కదా అనుకుని కేంపస్ లో వెతికి పవయ్ లేక్ పక్కని ఒ అరటి మొక్క ఆకులు కోసి పట్టుకొచ్చి చాలా జాగ్రత్తగా గారె వెయ్యగానే భలే వచ్చింది. ఇంకేముంది ఇక రెచ్చి పోయి మిగిలిన పిండి అంతా గారెలు వేసేస్తూ ఉండగా కిషోర్ గాడు వచ్చాడు. కిశోరే కాదు, చాలా మంది సరిగ్గా మేము వంటింట్లోంచి..అంటే నా గది లోంచి వంట సువాసనలు వచ్చినప్పుడే ఏదో పెద్ద పని ఉన్నట్టు వచ్చేసే వారు. కిషోర్ గాడికి రెండే రెండు గారెలు వేసి పెట్టగానే వాడు ఆవురావురుమని తినేసి “గురూ, గారె రుచి గొప్పగా ఉంది కానీ మధ్య కన్నం లేకుండా వేశావు. దాంతో సంగం రుచి గోవిందా” అన్నాడు. నా జన్మలో అంత కోపం ఎప్పుడూ రాలేదు.”వెధవాయ్. పొద్దున్న ఎనిమిది నించి ఇప్పుడు మధ్యాహ్నం రెండు దాకా చచ్చీ చెడీ మొత్తానికి ఆరు గారెలు సరిగ్గా వేస్తే, మధ్యలో కన్నం లేదని వెధవ కంప్లైంట్ చేస్తావా?” అని వాణ్ణి నడ్డి మీద చంపేశాం. ఇప్పుడు ఎప్పుడు గారెలు చూసినా నాకు అదే గుర్తుకొచ్చి భలే నవ్వొస్తుంది.

హాస్టల్ ఎంట్రన్సు

అలాంటి గడ్డు రోజులు గడిపినది కొన్నాళ్ళే అయినా ఆ అనుభవం నాకు రెండు విషయాలు నేర్పింది. ఒకటి ఆహారాన్ని గౌరవిస్తూ ఆరగించడం. ఈ రోజుల్లో నేను ఎప్పుడు, ఎక్కడైనా, ఎవరైనా పళ్ళెంలో అన్నం, కూరలు వగైరాలు పెట్టుకుని, అవి సగం, సగం తిని నిర్లక్ష్యంగా గార్బేజ్ లో పారేసి…అంత కంటే అన్యాయంగా మళ్ళీ వెళ్లి మరి కొన్ని వంటకాలు, స్వీట్స్ తెచ్చుకుని కులాసాగా తినడం చూసినప్పుడు, ఎవరైనా ఒక్క మెతుకు అన్నం సింక్ లో పారేసినప్పుడు నాకు కడుపులో తిప్పుతుంది. మా పిల్లలు ఒక చిన్న పిజ్జా ముక్క పారేసినా నా ప్రాణం విలవిలాడిపోతుంది. ఎందుకంటే నేను ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం గడిపిన ఆ గడ్డు రోజులు గుర్తుకొస్తాయి. మన పవిత్ర భారత దేశంలో ఇప్పటికీ అలాంటి పరిస్తితులు కొనసాగుతూ ఉండడడమే మన దౌర్భాగ్యం. అదే మన వేల సంవత్సరాల  సాంస్కృతిక ఘోర వైఫల్యం.

రెండోది నాకు వంట చెయ్యడంలో ఆసక్తి కలిగించడం. ఇప్పటికీ నేను ప్రతీ రోజూ ఏదో ఒకటి పొయ్యి మీద వండితే కాని నాకు రోజు పూర్తి అవదు. అలా అని చాలా కష్టమైనవి, క్లిష్టమైనవి చెయ్య లేను కానీ ఉన్నంతలో పరవా లేదు.

నా పరోక్ష కారణంగా 1967 లో జరిగిన మరొక విషయం కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి నా జూనియర్లు కొంత మంది బొంబాయి ఐఐటి లో చేరడం. నాకు తెలిసీ అటు ఎక్కడో తూర్పు తీరంలో ఉన్న కాకినాడ నుంచి పశ్చిమ తీరంలో ఉన్న బొంబాయి ఐ ఐ టి లో చేరిన వాళ్ళలో నేనే మొదటి వాడిని అనుకుంటాను. అంచేత తరవాత ఏడాదిలో కాకినాడలో నాకు ఒక సంవత్సరం జూనియర్స్ అయిన చెల్లూరి శివరామ్, మోక్షగుండం విశ్వేశ్వర రావు, తణుకు సుబ్బరాయ శర్మ, అనంతపురం నుంచి మల్లవరపు రామ్ కుమార్, ఇతర ప్రాంతాల నుంచి రాంభట్ల సీతారామ్, పి.వి.ఎల్.ఎన్. శర్మ, పాలంకి బాల కృష్ణ…ఇంకా చాలా మంది వాళ్ళు ఐ ఐ టి లో చేరడంతో మా తెలుగు బలం పెరిగింది.  వీళ్ళలో శివరామ్ నాకు పియుసి లో సహాధ్యాయి కానీ ఎందుకో ఒక ఏడు వెనక పడ్డాడు. నేను ఐఐటి లో ఉన్నన్నాళ్లే కాక, అమెరికా వచ్చాక కూడా నా అత్యంత ఆప్త మిత్రులలో అతను ఒకడు. మాకు సీనియర్లలో చంద్రుపట్ల తిరుపతి రెడ్డి ఇప్పుడు న్యూజెర్సీ లో ప్రొఫెసర్. మంచి కవి. మంచి స్నేహితుడు. అతని అప్పటి ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. అప్పుడు మా డిపార్ట్ మెంట్ లోనే ఉండే అతని బావ ప్రభాకర రెడ్డి కూడా అమెరికాలోనే ఉన్నాడు.

ఇక ఐఐటి వాళ్ళు కాకపోయినా  ఆ రోజుల్లోనే పరిచయం అయిన ఆప్త మిత్రులు ఆచంట శేషగిరి రావు, ఏ.వి. హనుమంత రావు, మల్లాది  సాయిదాస్ మొదలైన వాళ్ళు. వీళ్ళలో నేనూ సాయిదాసూ ఇప్పటికీ పలకరించుకుంటూనే ఉంటాం. ఇతని జీవిత కథ చాలా ఆసక్తికరమైన విజయ గాధ. ఇక రామ్ కుమార్ నన్ను కోరిన ఒక చిన్న కోరిక నా జీవితాన్నే ఒక పెద్ద మలుపు తిప్పేసింది. ఆ వివరాలు వచ్చే సంచికలలో…..

 

*

 

 

వంగూరి చిట్టెన్ రాజు

వంగూరి చిట్టెన్ రాజు

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • చిట్టెన్రాజుగోరండీ! ఎనకా ముందూ సూసుకోకుండా సత్య అరిచండ్రుడిలా అన్నీ నిజాలే చెపుతారడండీ; 1967లో జరిగిన విషయం అవటా అంటూ. ( దీన్ని ఆసరాగా పుచ్చికుని ఇప్పుడు మన వైసు ఇంతా అని లెక్కలెయ్యరటండి?! ). బొంబాయి కాలేజీలో మీకు జూనియర్ మోక్షగుండం విశ్వేశ్వర రావు గారా లేక పుణెలో ఇంజనీరింగు చేసిన మైసూరు రాష్ట్ర మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారా? హేవిటో అన్ని డౌట్లూ ఒకేసారి యెటాక్ చేస్తున్నాయి.

  “ ఇప్పటికీ నేను ప్రతీ రోజూ ఏదో ఒకటి పొయ్యి మీద వండితే కాని నాకు రోజు పూర్తి అవదు “ అన్నారు సరే, మరి ఆ సింకు లోని వాటికి మెరుగులు దిద్దే మొనగాడెవ్వడో సిన్నపాటి క్లూ కూడా ఇవ్వలేదు సుమండీ.

  • మంచి తప్పే పట్టేశారు, రామయ్య గారు. అతని పేరు M. విశ్వేశ్వర రావు…మేము సరదా కి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని పిలిచే వాళ్ళం కానీ అసలు ఇంటి పేరు మర్చి పోయి అలా వ్రాసేశాను.
   మీ స్పందనకి ధన్యవాదాలు…

 • మీ వంట కబుర్లు చదువుతూ గారెల దగ్గరికి రాగానే “గారె వేగక ముందు పెట్టినా, వేగాక పెట్టినా చిల్లు చిల్లే – అనే ఒక కొత్త సిద్ధాంతం ప్రతిపాదించి రుబ్బిన పిండంతా ఒక పాతిక చిల్లుల్లేని గారెలు చేసి మా ముగ్గురి అక్కచెల్లెళ్ళ చేతికీ మూడు చిన్న, పెద్దా – వంటింట్లో వున్న అట్లకాడలన్నీ వెతికి ఇచ్చి దగ్గరుండి చూపించి మరీ చిల్లులు పెట్టించి మా నాన్న చేసిన పాకం-గారెలు గుర్తుకొచ్చాయి 🙂

  ~లల్లి

  • చిల్లు చిల్లే ..కదా!…ఇలా మీ నాన్న గారు గుర్తుకు రావడం సంతోషం, లల్లీ..

 • ఈ వ్యాసంలో మా వార్డెన్ పేరు సుందర రాజన్ గారు. పొరపాటున గోవింద రాజన్ అని వ్రాశాను. ఇది కనిపెట్టి, సరి చేసిన వాడు..ఇంకెవరూ?..అలనాటి మా బి.వై. మూర్తి మహాశయుడే.
  అతనే ఇంకో విషయం కూడా జ్ఞాపకం చేశాడు. అదేమిటంటే ఆ సుందర రాజన్ గారు మమ్మల్ని సంజాయిషీ ఇమ్మని అడగడానికి పిలిస్తే “మాకు J.R.D. టాటా గారితో అప్పాయింట్ మెంట్ ఉంది. రాలేం” అని మొదటి సారి తప్పించుకున్నాం..ఆ JRD టాటా గారు ఎవరో కాదు. మూర్తి తాత గారైన జనస్వామి రంగావధాన్లు తాత –శాంతాక్రూజ్ లో ఉండేవారు.. మా సాకు చదివి సుందర రాజన్ నవ్వుకున్నారు. చెప్పానుగా .ఆయనకి మేమంటే చాలా అభిమానం.

 • అబ్బా సెగట్రీ! యీ చిట్టెన్ రాజుగోరు సిన్నప్పుడు కూడా ఇప్పటిలా అమాయకంగా ఉన్నారేటి !?

  ఎప్పుడూ బిగినెస్ పనులంటూ ఐ.ఐ.టి., పొవాయ్, విఖ్రోలి ఇండస్త్రియల్ ఏరియా ల్లోనే తిరిగితే యేటి పయోజనం? కాసింత కళాపోసన చేద్దారి అనుకుంటూ చెంబూరులోని రాజ్ కపూర్ వాళ్ల R.K. స్టుడియో లోకి ( నర్గిస్ నో, పద్మినినో చూడటానికైనా ) అడుగెట్టారా నేదా ? పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చుకుందామని సెప్పి జూహూ బీచికి వెళ్లారా నేదా ? ఆదీ గోద్రేజ్ కలక్ట్ చేసిన M.F. హుస్సైన్ గుర్రాల పెయింటింగ్స్ ను జూసారా?

  పోనీ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ట్రాంబే కి వెళ్లి న్యూక్లియర్ టెక్నాలజీ కోసం అయ్యోపాపం కట్టపడుతున్నారని జాలిపడి ఆ విక్రం సారాబాయికో, హోమీ బాబాకో తమిళనాడు శివకాసి కుటీర పరిశ్రమల్లో చేసే సీవటపాకాల్లో నుంచి కూడా మనం కొంత టెక్నాలజీ తీసుకోవచ్చు అని సలా ఇచ్చారా నేదా ?

  ఇవన్నీ రాజుగోరి అపిమానులు కోరుతున్న సిన్నసిన్న కోరికలని వారికి విన్నవించు సెగట్రీ.

  • భలే వారే..అనీ చూశాం, చాలా చేశాం…చూస్తారుగా…

 • తింటే గారులే తినాలి. చదివితే మీ భారతమే చదవాలి. మీ పోస్ట్ లో యుద్ధసమయంలో ఆహారపదార్ధాలు బ్లాక్ మార్కెట్ చేసే నైచ్యం భారత్ లోనే చూడడం…… మన ధౌర్భాగ్యమండి. అన్నీ అమూల్యమైన జ్ఞాపకాలే!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు