ఆ ప్రయాణమే ఒక యుద్ధం!

నూట పదహారేళ్లకి పైగా వయసున్న ఈ కథ ఇప్పటికీ అత్యుత్తమ అమెరికన్ కథా సంకలనాల్లో కనిపిస్తూనే ఉంటుంది.

కేవలం ఒక్క పాత్రతో కథని అత్యంతాసక్తికరంగా నడిపించడం సాధ్యమే నంటాడు జాక్ లండన్ “టు బిల్డ్ ఎ ఫైర్” https://americanenglish.state.gov/files/ae/resource_files/to-build-a-fire.pdf అన్న కథ ద్వారా. నీరు ఘనీభవించే ఉష్ణోగ్రతకి అరవై డిగ్రీలు (సెంటిగ్రేడ్) తక్కువగా ఉండి, కాలినడకన మాత్రమే వెళ్లే మార్గం అడుగుల మందాన మంచుతో కప్పబడిపోయి, దారిలో కొన్ని చోట్ల ఆ మంచుకీ దాని కింద ప్రవహించే నీళ్లకీ మధ్య మనిషి బరువు నాపలేక పగిలిపోయి, ఆ అతి చల్లటి నీటిలో ముంచి అతి వేగంగా వేరే లోకాలకి తీసుకుపోగలిగే ఒక సన్నని మంచు గడ్డ పొర ఉన్న ప్రకృతితో ఒక మానవమాత్రుడు చేసే యుధ్ధం ఈ కథకు వస్తువు. తెలిసిన ప్రదేశమూ, మార్గమూ కాకపోయినా, అతనికి ఆ ప్రదేశంలో అది మొదటి చలికాల మయినా తన ప్రయాణం ఒక యుద్ధ మవుతుందని అతడు అనుకోలేదు. ఇంత చలిలో తోడు లేకుండా వెళ్లకు అని ఒకతను ఇచ్చిన సలహాని “ముసలాడు!” అని తోసిపుచ్చి ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆ మనిషికి తోడు ఒక కుక్క మాత్రమే!

పొద్దున్న తొమ్మిది గంటలకి యూకాన్ ట్రెయిల్ నించీ పక్కకు సన్నదారిలోకి అతను మళ్లినప్పుడు మొదలవుతుంది కథ. సాయంత్రం ఆరు గంటలకల్లా గమ్యాన్ని చేరతానని అతని నమ్మకం. గంటకి నాలుగు మైళ్ల వేగంతో నడుస్తున్నాడు కూడాను. దారిలో తినడానికి శాండ్‌విచ్ తెచ్చుకున్నాడు. బయట వుంటే ఆ చలికి బ్రెడ్డు గడ్డకడుతుందని దాన్ని గుడ్డలో చుట్టి, వేడి కోసం శరీరానికి అంటుకుని వుండేలా కోటు లోపల వున్న చొక్కా కింద పెట్టుకున్నాడు. అతను నడుస్తున్న దారిలో మామూలుగా అయితే డాగ్ స్లెడ్లు వెళ్లిన గుర్తులు కనిపించేవి గానీ, కొత్తగా ఆరేడంగుళాల మందాన మంచు పడడంవల్ల ట్రెయిల్ గుర్తులు కనిపించడంలేదు. దానికి తోడు, అతను అనుకున్నదానికన్నా ఉష్ణోగ్రత పది డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువ ఉన్నదన్న సంగతి అతనికి తెలియదు గానీ అతని కుక్క ప్రమాదాన్ని గ్రహించింది.

మార్గమధ్యంలో చితుకులతో మంట రాజెయ్యవలసిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. అగ్గిపుల్ల లున్నాయి గానీ చితుకులు మాత్రం వెంట తెచ్చుకున్నవి కాదు. వాటిని అక్కడ పోగుచెయ్యాలి. చుట్టుపక్కల అంతా మంచుతో నిండిపోయి, వేడి సెగ తగిలితే నీరయే చోట ఆ మంటని రాజెయ్యడం అంత తేలి కయిన పని కాదు. పైగా, చేతులకి గ్లవ్స్ ఉన్నప్పుడు వేళ్ల మధ్యలో పట్టుకుని అగ్గిపుల్లని వెలిగించడం సాధ్యంకాదు. పొరబాటున మంట రాజుకున్నా అది ఆ తొడుగులని దహించివేస్తుంది.  అయినా ఆ పుల్ల నొకదాన్ని ముందు పెట్టెలోంచి తియ్యాలి గదా! దాని కయినా తొడుగు తియ్యాల్సిందే. కానీ, ఆ తొడుగులని తియ్యగానే చలి వేళ్లని కొంకర్లు పోగొట్టి పట్టుచిక్కకుండా చేస్తుంది. ఎంత త్వరగా ఆ పుల్లతో మంట వెలిగించి మళ్లీ గ్లవ్స్ ని వేసుకున్నా గానీ రక్తప్రసరణ కాలివేళ్లకీ, చేతివేళ్లకీ అంత త్వరగా చేరదు గనుక ఫ్రాస్ట్ బైట్ వల్ల ఆ వేళ్లు జీవితంలో ఇంక పనికిరాకుండాపోయే ప్రమాద మున్నది. మరి ఆ మంట రాజెయ్యడ మెలా? అతని ప్రయత్నాలు సఫల మయ్యాయా?

నూట పదహారేళ్లకి పైగా వయసున్న ఈ కథ ఇప్పటికీ అత్యుత్తమ అమెరికన్ కథా సంకలనాల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఉత్తమ మన్న కథలన్నీ సంపాదకుల అభిరుచులని ప్రతిబింబిస్తూంటాయి మాత్రమే నన్న అభిప్రాయంలో నిజం లేకపోలేదు గానీ, నా దగ్గరున్న ఐదు సంకలనాల్లో మూడింటిలో ఈ కథ ఉన్నది అంటేనే ఈ కథని ఎంపిక చేసుకుని ఆ సంకలనాలు ప్రతిష్ఠని సంపాదించుకున్నా యని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

ఈ కథలో వర్ణన అద్భుతం. మానవుడివీ, జంతువువీ కూడా మనోభావాలని పాఠకులకి మనసుకు హత్తుకునేలా చెప్పిన ఈ కథ అనితర సాధ్యం. అసలు ఇలాంటి ఆలోచన రావాలంటే తిరుగులేని అనుభవం కావాలి.  అది జాక్ లండన్ కి పుష్కలంగా ఉన్నది. 1897లో సహోదరి భర్తతో కలిసి క్లోన్డైక్ గోల్డ్ రష్ (Klondike gold rush) లో పాల్గొన్నాడు. ఆ ఎముకలి కొరికే చలిలో పోషక పదార్థాలు సరిగా దొరికే తిండి లేక స్కర్వీ వ్యాధికి గురయి కొన్ని పళ్లని పోగొట్టుకున్నాడు. అక్కడ ఉన్నది ఒక సంవత్సరమే అయినా కాలిఫోర్నియాకి వెనక్కు వచ్చిన తరువాత రాయడానికి బోల్డన్ని అనుభవాలని గుర్తుపెట్టుకున్నాడు. అదే వాతావరణంలో బక్ అన్న కుక్కని నాయకుడిగా పెట్టి రాసిన కాల్ ఆఫ్ ద వైల్డ్ (Call of the wild) నవలిక ఇంకొక అద్భుత రచన. ఈ పుస్తకాన్ని ఇప్పటికీ పాఠశాలల్లో పిల్లలచేత చదివిస్తూంటారు. మరువలేని ఈ కథని అందజేసిన రచయితకు జోహార్లు!

రచయిత పరిచయం:

జాక్ లండన్ (Jack London), 1876-1916. రచనలవల్ల పేరు, ప్రతిష్ఠలే గాక డబ్బుని కూడా బ్రతికుండగానే సంపాదించినవాళ్లల్లో ప్రథముడు అని చెబుతారు. 1903 లో Saturday Evening Post పత్రికలో Call of the wild నవలిక ధారావాహికగా వచ్చినప్పటినించీ ఇప్పటిదాకా ఎప్పుడూ అవుటాఫ్-ప్రింట్ కాలేదు. ఈయన శ్రమజీవుల పక్షపాతి. సోషలిస్ట్ ముద్రని సంపాదించుకున్నాడు. శ్రమజీవుల తరఫున వకాల్తా పుచ్చుకుని క్రీస్తు శకం 2600 సంవత్సరంలో జరిగిన దంటూ డబ్బున్న కొద్దిమంది చేసే రాజ్యపాలన (oligarchy) సమాజానికి చేకూర్చే వికృత ఫలితాలని కళ్లకి కట్టినట్లు Iron Heel నవలలో ఆనాడే రాశాడు. ఈనాడు గనుక ఆయన బ్రతికుంటే, ఆరువందల ఏళ్లు ఆగవలసిన అవసరం లేకుండా వంద ఏళ్లకే ఆ నవలలో పేర్కొన్న పరిస్థితిని దేశం దాదాపుగా చేరుకున్న దని గమనిస్తే తను ఎంతగా తప్పుడు అంచనా వేశాడన్న ఆశ్చర్యం ఆయనకు కలగక మానదు. ఈ నవలకు తెలుగు అనువాదం ఈమధ్యనే “ఉక్కుపాదం” అన్న శీర్షికన తెలుగులో వచ్చింది. చిన్నవయసులో జనారణ్యానికి దూరమవడం సాహితీరంగానికి తీరని లోటుని చేకూర్చింది.

published by L C Page and Company Boston 1903 – https://archive.org/details/littlepilgrimage00harkuoft (Little Pilgrimages page 235), Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=11926153

తాడికొండ శివకుమార శర్మ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు