మీ పిల్లలకు తెలుగు వచ్చా?!

మీ పిల్లలకు తెలుగు రాదా?

పిల్లలకి తెలుగు ఎందుకు నేర్పించలేదు?

పిల్లలకి మన భాష నేర్పించుకోక పోతే ఎలా?

అనే ప్రశ్నలు ఎక్కడికెళ్లినా, ముఖ్యముగా  ఇండియా వెళ్ళినప్పుడు చుట్టాలు, స్నేహితులు  అడిగే ప్రశ్నలు ఇవి.

ఇక్కడ కూడా  ఏ చిన్న గాదరింగ్ అయినా పిల్లలకి తెలుగు వచ్చా అనేది  ఓ కామన్ టాపిక్ అనే చెప్పొచ్చు.

మా పిల్లలకు తెలుగు నేర్పిద్దామని చాల ప్రయత్నం చేసి విఫలమయ్యాను . తెలుగు అంటే కాస్త అభిమానం ఎక్కువే  నాకు. ఎప్పుడు ఇండియా  వెళ్లినా విశాలాంధ్ర, హైద్రాబాద్ బుక్ ట్రస్టు, నవోదయాకి  వెళ్లి కొన్ని నవలలు, కథల  పుస్తకాలు తెచ్చుకోవడం అలవాటు. ఓ చిన్నపాటి గ్రంధాలయం ఉంది నా దగ్గర.  పిల్లలకి తెలుగు చదవడం నేర్పించాలని  పెద్దబాల శిక్ష కూడా తెచ్చుకున్నాను ముందు చూపుగా.

మా పెద్దాడు రోజుల పిల్లవాడిగా ఉన్నప్పటినుండే వాడికి తెలుగు కథలు  చదివి వినిపించేదాన్ని. అమరావతి కథలనుండి, ‘వాన ‘ కధ చదివితే శ్రద్దగా వినేవాడు. ఆ కథలో ఉండే శబ్దసౌందర్యం కారణం కావచ్చు. వాడికి రెండో ఏడూ నిండేటప్పటికీ తెలుగు మాట్లాడ్డం బాగానే వచ్చింది. ఈ లోపు అమ్మ రావడంతో వాడి తెలుగు ఇంకా మెరుగు పడిందనే చెప్పాలి. ఆటస్థలం, ఉయ్యాల, జారుడుబల్ల వంటివి.

అమ్మమ్మా , ‘బయటకెళ్దాం, ఆటాడుకుందాం ‘ అని వీడు తెల్లారగానే పాట  మొదలుపెట్టేవాడు.  మధ్యాహ్నం  అన్నం తినగానే  అమ్మమ్మ, మనవడు ఇద్దరు కలిసి  ఇంటి వెనక ఉన్న పార్కుకెళ్లేవాళ్లు.  ఓ రెండు గంటల తర్వాత, వరిపొలం మాసూలు చేసి, గట్టెక్కిన కూలీల్ల్లా జుట్టు రేగిపోయి, బట్టలు నలిగిపోయి, మట్టి కొట్టుకొని ఇంటికి చేరేవాళ్ళు. తర్వాత తీరీగ్గా చెప్పేవాడు  ఏమేమి చేసారో.

“ఆటస్థలంకి   వెళ్ళామా, అక్కడేమో నేను, అమ్మమ్మ  జారుడుబల్ల ఎక్కి జర్రున జారాము. ఉయ్యాల ఊగాము , ఇసుకలో ఆడుకున్నాం” అని కబుర్లు చెప్పేవాడు.

మూడేళ్ళ వయస్సులో ఓ రోజు “అమ్మా, ఇంటి వెనక ఓ అమ్మాయి పొట్టి నిక్కరుతో పరుగెత్తుంది” , అంటూ డెక్ మీద నుండి అరిస్తే, వాళ్ళ నాన్న నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడని పొంగిపోవడం  ఇంకా నాకు గుర్తుంది.

కానీ ఆ తర్వాత వాడు నర్సరీ స్కూల్లో చేరినప్పటి నుండి, కొంచెం తెలుగు మాట్లాడ్డం తగ్గుతూ వచ్చింది. ఇలా కాదని మా ఇంట్లోనే తెలుగుబడి మొదలుపెట్టాం. ఆంధ్రుల ఆరంభ శూరత్వానికి ఉదహరణగా మాబడి పిల్లలతో కళకళలాడింది మొదట్లో . నేను, ఇంకో టీచర్ కలిసి తెలుగు పాఠాలు మొదలుపెట్టాం. మా ఇద్దరు  పిల్లలకి  కూడా  రాయడం, చదవడం అబ్బింది కానీ అర్థం వివరించి చెప్పాల్సివచ్చేది. వాళ్ళతో ముందు తెలుగులో మాట్లాడి తర్వాత ఇంగ్లీషులో మాట్లాడేదాన్ని.  ఇది ఇలా సాగేది.

ఆకలేస్తుందా? అన్నం పెట్టనా?

ఆర్యూ హంగ్రీ? యు వాంట్ మీ టు  సర్వ్ అన్నం?

ఇది క్రీస్తు సువార్త సభల్లాగా, విదేశీయులు విచ్చేసే స్వామీజీ ప్రవచనాల్లాగా సాగింది ఈ ప్రహసనం కొన్నాళ్ళు.

నెమ్మదిగా విద్యార్థులు తగ్గుతో వచ్చి, చివరికి మా పిల్లలిద్దరూ, ఆ ఇంకో టీచర్ పిల్లలిద్దరూ వెరసి నలుగురు మిగిలారు. వాళ్ళ పిల్లలకి నేను, మా వాళ్లకి ఆ టీచర్ తెలుగు నేర్పుతూ వచ్చాము.  రెండు సంవత్సవరాలు  గడిచేటప్పటికి మా పిల్లలకి నెమ్మదిగా ఆసక్తి తగ్గి, కుదురుగా కూర్చోవకపోవడం, పడుకొని రాయడం, వినిపించనట్లు నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రవర్తన మిగతా క్లాసుల్లో చూపిస్తారేమోనని ఇక బడి మూసివేశాం చివరికి. ఆ పిల్లలిద్దరూ ఇప్పటికి చక్కగా తెలుగు మాట్లాడుతారు, చదువుతారు. క్రెడిట్ అంతా ఆ పిల్లలది మరియు వాళ్ళ తల్లితండ్రులది. మా పిల్లలికి తెలుగు రాకపోవడం మా తప్పు.

వీళ్ళకి తెలుగు బాగానే అర్ధం అవుతుంది కానీ తిరిగి తెలుగులో జవాబు చెప్పలేరు.

ఆ ఎండాకాలం సెలవుల్లో అమ్మ, నాన్న వచ్చారు. ఈ రకంగా పిల్లలకి తెలుగు కొంచెం అలవాటు అవుతుందేమోనని ఆశపడ్డాను.

“వద్దు”,  “నాకు తెలియదు” అని తెలుగులో వీళ్ళు ,

“నో” అని ఇంగ్లీషులో మా అమ్మ

నెగటివ్ పదాలతో భాష నేర్చుకోవడం మొదలుపెట్టారు. సర్లే ఎదో ఒకటి, కొంతయినా భాష తెలుస్తుంది కదా అనుకున్నా.

ఈలోపు పెద్దాడు గూగుల్ సహాయంతో కమ్యూనికేషన్ చేయడం మొదలుపెట్టి నా ఆశల్ని వమ్ము చేశాడు. ఏదయినా చెప్పాలంటే వీళ్ళు ఇంగ్లీషులో టైపు చేస్తే, గూగుల్ అనువాదం చేస్తే, అమ్మ చదవడం సాగింది.

వయోలిన్ ప్రాక్టీస్ చెయ్యమని అమ్మ గుర్తుచేస్తే , వీళ్ళు “ఐ యాం బిజీ రైట్ నౌ, విల్ డూ ఇట్ లేటర్” అని టైపు చేస్తే ,

గూగులమ్మ ” ప్రస్తుతం ఈ కార్యక్రమంలో తీరిక లేనందువలన  వయోలిన్ అబ్యాసం తర్వాత   చేస్తాము.” అని తెలుగీకరిస్తే మా అమ్మ అది చదువుకొని  మురిసిపోయి, నేను ఇంటికి రాగానే తన మనవలకి చక్కటి తెలుగు వచ్చని తెగ చెప్పేది.

కొసమెరుపు ఏంటంటే, ఈ మధ్య ఇల్లు సర్దుతుంటే, అమ్మ రామకోటి పుస్తకాలు  కనిపించాయి. వాటి మధ్య పేజీల్లో  “ఫాల్కన్ రాకెట్ లాంచింగ్”, “టెస్లా కార్ల టెక్నాలజీ”, “పారడాక్స్ థియరీ అఫ్ టైం ట్రావెల్” , “నాసా మార్స్ మిషన్ ” లాంటివన్నీ తెలుగులో రాసినవి కనిపించాయి. పెద్దాడు వీటన్నిటి గురించి వాళ్ళ అమ్మమ్మకి చెప్పాలని  ఇంగ్లీషులో టైపు చేస్తే, గూగులమ్మ  దానిని తెలుగీకరిస్తే,

ఈవిడ గారు  తాను పవిత్రంగా చూసుకొనే రామకోటి పుస్తకాల్లో రాసుకొంది.

మేముండే ఏరియాలో ఇండియన్ల సంఖ్య తక్కువ కాబట్టి తెలుగు రావడంలేదని, అదే ఏ కాలిఫోర్నియా బే ఎరియాలోనో, డల్లాస్ లో లాంటి చోట్ల ఉండుంటే భాష వచ్చేదని నాకు నేనే చెప్పుకుంటాను. మా పిల్లలు స్పానిష్  , కొంత ఇటాలియన్,  కొన్ని చైనీస్, జపనీస్ పదాలు నేర్చుకుంటున్నారు కానీ తెలుగు మాత్రం నేర్చుకోవాలన్న ఆసక్తి ఇంకా రాలేదు కానీ ఎప్పటికైనా తెలుగు కూడా నేర్చుకుంటారని నా ఆశ.

” వయోలిన్, ఫెన్సింగ్ కన్నా తెలుగు నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు కదా! భాష తెలిస్తే అమ్మమ్మతో మాట్లాడచ్చు కదా!” అని నేనంటే ,
“అమ్మా! యు వాంట్ అజ్ టూ లెర్న్ ద లాంగ్వేజ్? ఆర్ యు వాంట్ అజ్ టు బీ ఎబెల్ టూ కమ్యూనికేట్ విత్ అమ్మమ్మ? వుయ్ అండర్ స్టాన్డ్ హర్ , అండ్ షీ అండర్ స్టాండ్స్ అజ్ వెల్ “, అని సెలవిచ్చారు.

*

 

 

 

 

 

 

ఇంద్రాణి ఇన్నుగంటి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇంద్రాణి,
    మించి విలువైన, అవసరమైన piece రాశావు, great going, pl.continue
    —Narsim

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు