ఉరకలై గోదారి….కథలుగా సాగింది

అవధాన ప్రక్రియలో సమస్యాపూరణం ఇచ్చి పద్యం చెప్పమని అడిగితే అవధాని గారు అలవోకగా పద్యం చెప్పినట్లు  మిత్రులు ఇచ్చిన కథా శీర్షికలకు అనుగుణంగా కథలు రాశారు రాజు గారు

తెలుగు సాహిత్యానికి జన్మనిచ్చి….వరదలా ఉప్పొంగించిన నది గోదావరి.

కాటన్ దొర వేసిన ఆనకట్ట గోదారి  నీళ్ల గతిని మాత్రమే కాదు… తెలుగు ప్రజల చరిత్రను మార్చి మరో దారి పట్టించింది.

ధవళేశ్వరం ఆనకట్ట ప్రారంభమైన తర్వాత తెలుగు నాట జరిగిన ప్రతి కీలక చారిత్రక మలుపులోనూ…. నేటి పోలవరం దాకా సంఘటన వెనక అంతర్లీనంగా గోదారి నీళ్లు ఉంటాయి.

నాసికా త్రయంబకం నుంచి మొదలైన గోదారిని…తెలంగాణ లో గంగ అని పిలుచుకుంటున్నారు.

గోదారి ప్రవహించే ప్రతీ ప్రాంతంలోనూ ఒక్కో తీరంలో ఒక్కో తరహా జీవన విధానం, సంస్కృతి నెలకొన్నాయి. అటువంటి గోదావరి నదిని కథల గోదారిగా మళ్లించారు ప్రముఖ కవి, కథకులు దాట్ల దేవదానం రాజు.

ఈ గోదారి తీరాన్నే ఉన్న యానాం… పేరుకు చిన్న పట్టణమే ఐనా చారిత్రకంగా, సాహిత్యపరంగా విశిష్టమైన చరిత గలది. సాగర సంగమానికి చేరువగా ఉండడం వల్ల విస్తృతంగా దొరికే చేపల కారణంగా, ఎంతో ప్రసిద్ధి చెందిన పులస చేపల కారణంగా మత్స్య కారుల సందడి ఎక్కువ.

ఇటు భక్తికీ, అటు వ్యాపారానికి, బతుకు దెరువుకూ యానం తీరంలోని గోదారి నెలవు. అటువంటి యానాం నగరం చుట్టూ ఉన్న ప్రజల జీవితమే కథలుగా ప్రవహించిన కథల సంకలనం గోదారి కథలు.

ఏ దారి లేకుంటే గోదారి అని ఓ సామెత తెలుగు నాట ప్రసిద్ధి. కానీ గోదారిని నమ్ముకుంటే ఏదో ఒకదారి చూపించకుండా ఎందుకు ఉంటుంది….?

పాపి కొండల్లో గోదారి తిరిగిన మలుపుల్లాగా…మనిషి జీవితంలోని అనేక మలుపులను దర్శింపజేస్తూ మనుషుల ప్రవర్తన లోని లోతుల్ని, అనేక సత్యాల్ని ఈ కథలు దర్శింపజేస్తాయి.

ముందుమాటలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు చెప్పినట్లు గోదావరి నదిమీద యానాం తీరానికి ప్రయాణిస్తూ రకరకాల మనుషుల్ని పలకరిస్తూ, వారి అంతరంగాల్ని శోధిస్తూ రాసిన జీవవంతమైన కథలివి.

నిత్యం భక్తితో స్నానాలు చేస్తూ నదిలో మునకలు వేస్తూ మోక్షం కోసం అన్వేషించే వాళ్లొక వైపు….. ఈ పూట గడవడం కోసం అదే నీళ్లలో బతుకుతెరువును వెతుక్కునే మత్స్యకారులు మరోవైపు కనిపిస్తారు.

వ్యాపారులు, వ్యవసాయ దారులు….. ఇలా సమస్త భారతీయ సంస్కృతి గోదారి ఒడ్డున తళతళామెరుస్తుంది.

ఇందులోని కథలతో పాటూ…కథల శీర్షికల వెనక ఆసక్తి కరమైన అంశం ఉంది. అవధాన ప్రక్రియలో సమస్యాపూరణం ఇచ్చి పద్యం చెప్పమని అడిగితే అవధాని గారు అలవోకగా పద్యం చెప్పినట్లు  మిత్రులు ఇచ్చిన కథా శీర్షికలకు అనుగుణంగా కథలు రాశారు దేవదానం రాజు గారు.

గోదారి మయాన”, కిటికీలోంచి గోదారి”, గోదారి నవ్వింది”, దళిత గోదారి…ఇలా కథల పేర్లన్నీ గోదారి తీరం దాటుకొచ్చే పిల్లగాలి తెమ్మెరల్లా ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటాయి.

జీవితానికి మించిన గురువు లేడని, అనుభవాల్ని మించిన పాఠాల్ని ఉండబోవని నిరూపిస్తూ….వరదలు పోటెత్తిన వేళ తన ఇంటికి కాపాడుకున్న ఓ వృద్ధుని అనుభవం గుమ్మంలో గోదావరి కథ.

భక్తి రాజకీయాలు, భక్తి పేరిట జరుగుతున్న మోసాలను వివరించిన కథ గోవుదారి.

గోదారి బేసిన్ లో జరుగుతున్న చమురు రాజకీయాల నేపథ్యంలో సాగి పోయే కథ… జ్వలిత గోదారి. అన్నీ ఇచ్చిన గోదావరి …జీవిత పాఠాలు కూడా నేర్పిన కథ నా గోదావరి….నీతో ఒక రోజు.

కథల నిండా గోదావరిని బతుకు దెరువుగా చేసుకుని జీవించే మత్స్య కారులు, వాళ్ల స్త్రీలు, కనిపిస్తారు.

గోదావరి జీవితాల్ని ప్రతిబింబించే అందమైన ముఖచిత్రాలు, లోపలి చిత్రాలు వేసిన తల్లావజ్జల శివాజీ గారి గురించి చెప్పకపోతే ఎలా…?

గోదారినీ, పడవనీ, స్త్రీని, రేపటి భవిష్యత్తును అన్నిటినీ ఒకే చిత్రంలో ఇమిడ్చి మత్స్యకారుల జీవితం గురించి వ్యాఖ్యానించిన అందమైన ముఖచిత్రం, కథ లోపల బొమ్మలు కూడా కథావిస్తృతిని మరింత పెంచుతాయి.

కథలకు నిజంగా బొమ్మలు అవసరమంటారా… అనే వాళ్ల ప్రశ్నకు శివాజీ గారు వేసిన బొమ్మలు చిరునవ్వుతో సమాధానం చెబుతాయి.

దళిత గోదారి కథలో….కవులంతా ఓ సారి పడవలో గోదావరిపై విహారయాత్రకు వెళ్లారు. ఆ పడవ నడిపే వ్యక్తి కవులను ఓ ప్రశ్న అడుగుతాడు.

మీ కవులు, మా చేపలు పట్టేవాళ్లం, పెద్దోళ్లు, పేదోళ్లు….అందరం ఒకే తల్లి కడుపులోంచి వచ్చిన వాళ్లమే కదా. మీరు ఎవరి గురించి కవిత్వం రాస్తున్నారు. మా గురించి కూడా పట్టించుకుంటారా. అని అమాయకంగా ప్రశ్నిస్తాడు.  మా గురించి నాలుగు ముక్కలు రాయండి అని బతిమాలుకుంటాడు.

సాహిత్యకారులు ఎటు వైపు నిలబడాలో స్పష్టంగా చెప్పిన కథ ఇది. ఆ పడవ నడిపే పెద్దాయన వేసిన ప్రశ్న….ఇవాళ సాహిత్యకారులందరూ ఆలోచించాల్సిన ప్రశ్న.

ఒక్క ముక్కలో గోదావరి నీళ్లనే సిరాగా నింపుకుని రాసిన కథలివి. గోదావరి అలలు అక్షరాలుగా ప్రవహించిన కథలివి.

*

చందు తులసి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

    • మీకు ఫేస్ బుక్ లో సమాచారం ఇచ్చాను చూడండి సర్

  • మా గోదారి మీద కథల పుస్తకాన్ని రాసిన దాట్ల దేవదానం రాజు గారికి, పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు, చందు తులసిగారు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు