లాబీల మాయలో మన కవిత్వం: సుగమ్ బాబు

ఏదో రాశామంటే రాశాం అన్నట్లుంది నేటి కవుల ధోరణి!

ధునిక తెలుగు సాహిత్యంలో సుగమ్ బాబుకు ఓ ప్రత్యేకత వుంది. వ్యక్తిగా ఆయన ఈ ఏప్రిల్ ఒకటికి 75యేళ్ళు నిండి 76 లో ప్రవేశించారు.కవిగా అరవై యేళ్ళు నిండాయి. ఆయన ప్రారంభించిన “ పైగంబర కవిత్వోద్యమానికి “ యాభై యేళ్ళు నిండాయి. రెక్కల ప్రక్రియ ప్రవక్తగాత్వరలోనే మూడో దశాబ్దంలోకి అడుగుపెడతారు.ఎలా చూసినా కూడా తెలుగు సాహిత్యంలో ఓ ప్రత్యేక అథ్యాయానికి అర్హుడు సుగమ్ బాబు. అయితే ఈ …సీనియర్ కవికి ఇంతవరకు ఏ అవార్డూ గట్రా రాలేదంటే కించిత్ ఆశ్చర్యమే. సాహితీ లోకంలో కవుల గ్రూపులూ, లాబీ కారణంగానే తనకు ఏ అవార్డూ రాలేదని, ఈ విషయంలో తనకు అన్యాయం జరిగిందన్నది సుగమ్ బాబు ఆరోపణ.

యం.కె సుగమ్ బాబుగా పిలువబడుతున్న ఈ కవి అసలు పేరు మహబూబ్ ఖాన్. 1945 ,ఏప్రిల్ 1 న గుంటూరు జిల్లా పెదకాకానీలో జన్మించారు.1963 లో కలంపట్టి కవిత్వం రాయడం మొదలు పెట్టారు.తొలి వచన కవితా సంపుటి “శిలలో సెలయేరు” (1968),మలి కవితా సంపుటి “ విప్లవం “ (1970) ఆతర్వాత “మంట “ గేయ రూపకం,,”కామ్రేడ్ “వచన కవితలు (1975) లెనిన్ దీర్ఘ కవిత (1979)”Banish the tears” long poem, (2001), “Sugam babus wings” (2006) Dawn rekkalu ‘ (2008) ఇంగ్లీషులో,సుగమ్ బాబు రెక్కలు (2009) “అంతర్యానం “రెక్కలు (2012),ధమ్మపథం అనుసరణ (2013),సుగమ్ బాబు రెక్కల సమగ్ర సంపుటం (2017),నీలమొక్కటి చాలు (కవిత్వం..2018) వెలువడ్డాయి. కొత్తనీరు (రెక్కలు ) గ్రీన్ బుక్ 2. (2019 ) కాంతిధార వచన పద్యాలు(లఘురూప కవిత్వం ) త్వరలో రానుంది.

పైగంబర కవిత్వం..!!

1970లో దేవిప్రియ,కిరణ్ బాబు,ఓల్గా,కమలాకాంత్ లతో కలిసి పైగంబర్ కవితోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమం ఆయన ‘బ్రెయిన్ ఛైల్డే.’ మొత్తం రెండు కవితా సంకలనాలు ( యుగసంగీతం, యుగ చైతన్యం )ఆర్నెల్ల కాలంలోనే వరుసగా వచ్చాయి.1971 లో విరసంలో చేరారు. “ సూరీడు “ పోరాట పాటలు రాశారు.విరసం (గుంటూరు శాఖ ) ప్రచురించిన తొలి సంకలనం ఇదే. అలా ఆయన ‘ సూరీడు సుగమ్ బాబు ‘ అయ్యారు,ఆ తర్వాత విప్లవ కవులపై నిర్బంధం పెరగడంతో మద్రాసుకెళ్ళి సినీరంగంలో అదృష్టం పరీక్షించుకున్నారు. తిలక్ కొల్లేటి కాపురం సినిమాలో కొన్ని పాటలు రాశారు.గురజాడపై డాక్యుమెంటరీ తీశారు.(దీనికి బంగారు నంది వచ్చింది) అయినా సినీరంగంలో కలిసిరాకపోవడంతో. హైదరాబాదుకు వచ్చేశారు. హైదరాబాదులో  ఆంధ్రభూమి దినపత్రికలో చేరారు.సాయంత్రం పూట శివారెడ్డి ద్వారకా గోష్ఠులకు హాజరయ్యేవాడు. అయితే ఇక్కడి వచన కవులలోని లాబీల కారణంగా సీనియర్ కవి అయినా ,.తనకు గుర్తింపు,గౌరవం దక్కలేదు. వచన కవిత్వం తీరు తెన్నులు,వచన కవుల లాబీయింగ్ నచ్చక క్రమంగా వచన కవిత్వానికి దూరమై 2002లో “ రెక్కలు “ అనే సరికొత్త లఘురూప కవితా రూపాన్ని ఆవిష్కరించారు. క్రమంగా‘రెక్కలు ‘ నిలదొక్కుకొని “రెక్కల గురువయ్యారు “ 2019లో “ లఘురూప కవితా వేదిక “,ను ఏర్పాటు చేశారు. 2020లో “ కాంతి ధార “ పేరుతో సరికొత్త ‘ లఘురూప వచన పద్యాల’ ప్రక్రియను ప్రారంభించారు.

కవిగా యాక్టివ్ గా వున్న మీరు ఓ రెండు దశాబ్దాల పాటు స్తబ్దుగా వున్నట్లున్నారు. కారణం తెలుసుకోవచ్చా?

‌నిజమేనండీ.కవిగా జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని చవిచూశాను.1970 లో రాష్ట్రంలో జలగం వెంగళరావు   గారి ప్రభుత్వ నిర్బంధం పెరిగిపోయింది. విప్లవ కవుల్ని అరెస్టుచేసి జైల్లో పెట్టేవారు.నా మిత్రుడు నరసింగ రావు (బీనాదేవి ) అప్పుడు జిల్లా జడ్జిగా వుండేవారు. ఓ సారి పల్నాడు జైలును సందర్శించినప్పుడు , ఆ జైలుగోడల మీద నా “సూరీడు పాటలు ‘ బొగ్గుతో రాసివుండటం చూశారట.ఆ మర్నాడే నన్ను పిలిచి నిన్నెప్పుడైనా అరెస్టు చెయ్యొచ్చు వెంటనే మద్రాసుకు మకాం మార్చమని సలహా ఇచ్చారు.ఆయన మాట మేరకు మద్రాసుకు వెళ్ళి పోయాను. సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆచార్య ఆత్రేయ, ఎమ్మెస్ రెడ్డి వద్ద అసిస్టెంట్ గా చేరాను.అక్కడ కాలం కలిసి రాలేదు.హైదరాబాద్ కు వచ్చేశాను.ఇక్కడ ఆంధ్రభూమి దినపత్రికలో చేరాను. సాయంత్రం పూట శివారెడ్డిగారి ద్వారకా బ్యాచ్ సమావేశాలకు హాజరయ్యేవాడ్ని..అయినా          ఎందుకో హైదరాబాదులో కవిగా గుర్తింపు,గౌరవం దక్కలేదు.ఇలా కవిత్వపరంగా కొంత గ్యాప్ అయితే  వచ్చింది. ఈ గ్యాప్ నేను కావాలని తీసుకున్నది కాదు. నా తిరుగుళ్ళలో అలా వచ్చింది అంతే..!

అరవై యేళ్ళ సుదీర్ఘ సాహిత్య జీవితం సంతృప్తికరం అనిపించిందా?

స్పష్టంగా చెప్పలేను.ఆహా! ఓహో…అనుకున్న రోజైతే లేదు. ఇంత వర్క్ చేశాను కదా‌! సీనియర్ పొయెట్ అన్న గౌరవం కూడా దక్కలేదన్న బాధైతే వుంది.ఆ బాధను పక్కనబెట్టి ..నా కంటూ ఓ ప్రత్యేక ఉనికి, గుర్తింపు కోసం 2002 లో “రెక్కలు “ లఘురూప కవితా ప్రక్రియకు ఆద్యుడిగా శ్రీకారం చుట్టాను. చూస్తూ చూస్తూ వుండగానే రెక్కల ప్రక్రియ కు ఓ గుర్తింపు వచ్చింది. అంతవరకు ఐ యామ్ హ్యాపీ.

రెక్కల కవితా ప్రక్రియ గురించి చెబుతారా?

తెలుగు సాహిత్య లోకంలోని కవితా ప్రక్రియల్లో “ రెక్కలు “ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇదో తాత్విక లఘురూప కవితా ప్రక్రియ. దుఃఖంలోంచే ఈ రెక్కలు రాశాను.చుట్టూ వ్యాపించి వున్న దుఃఖాన్ని పోగొట్టాలనే రాశాను. ఏదీ ……ఊహించి రాయలేదు.చూసే రాశాను.అనుభవించే రాశాను. మనిషి తన శక్తిసామర్థ్యాలను,పరిమితులను తెలుసుకొని జీవించాలని చెప్పాను.నిజాల్లో బతకమన్నాను. కవిలోకం నా బాధను అర్థం చేసుకుంది.ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ వంటివారు అనుసరించడం మొదలుపెట్టారు.ఇప్పటికి రెక్కల ప్రక్రియలో ఎన్నో కవితా సంపుటాలు వచ్చాయి.ఇంకా వస్తున్నాయి. పరిథి పెరిగి అనువాదాలు,సంపూర్ణ కావ్యాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి.ఎవరికైనా ఇంతకంటే సంతోషం ఇంకేం వుంటుంది.ఇక్కడో ముఖ్యమైన మాట చెప్పాలి. అద్దేపల్లి రామ్మోహనరావు గారు రెక్కలను ఒడిసిపట్టుకొని ఎన్నో వ్యాసాలు రాశారు. రెక్కల్ని రాసింది నేనే అయినా…మోసింది మాత్రం అద్దేపల్లివారే. అలాగే ప్రొఫెసర్ డేవిడ్ షుల్జ్ నా రెక్కల్ని “ Wings “ పేరిట ఆంగ్లంలోకి అనువదించారు.మా ఇంట్లోనే కూర్చొని 3,గంటల్లో 76 రెక్కల్ని అంగ్లీకరించారు.ప్రపంచవ్యాప్తంగా వున్న స్టడీ సెంటర్లకు ఈ వింగ్స్ చేరాయి.ఇక తమిళ కవి దామల కణ్ణన్ 2006లో వింగ్స్ ను తమిళభాషలోకి అనువదించారు.దీనిపై వివిధ పత్రికల్లో గొప్ప సమీక్షలు వచ్చాయి.

గ్రూపులు,లాబీలతో మసకబారుతున్న తెలుగు సాహిత్యం.

ఇప్పటి కవిత్వ/ సాహిత్య ధోరణుల నిర్మొహమాటంగా గురించి మీ అభిప్రాయం?

కొన్నాళ్ళుగా గ్రూపులు, లాబీల ప్రభావంతో తెలుగు సాహితీ లోకం భ్రష్టుపట్టి పోతోంది. ప్రతిభతో ఏమాత్రం సంబంధంలేకుండా అస్మదీయులకు అవార్డులు ఇప్పించుకుంటూ మంచి సాహిత్యానికి, సృజనకారులకు గుర్తింపు‌ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు మంచి కవిత్వం రాస్తున్న వారిని వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. అయితే ఇలాంటివారిని కూడా పైకి రాకుండా చేస్తున్నారు. సొంత అంగళ్ళు పెట్టుకొని సాహిత్య అకాడెమీ,తెలుగు అకాడెమీ , యూనివర్సిటీలను ప్రభావితం చేస్తూ…..అస్మదీయులకు లబ్ది చేకూర్చుకుంటున్నారు. ఫలితంగా సీనియర్ కవులకు కనీసం గుర్తింపు, గౌరవం కూడా దక్కడం లేదు. అరవైయేళ్ళ తన సాహితీ జీవితంలో ఏనాడూ ,ఒక్క అవార్డు కూడా పొందలేదు. అకాడెమీలు, సాహిత్య ‌సంస్థ లు అయినవాళ్ళకు ఆకుల్లో,కానివాళ్ళకు కంచాల్లో వడ్డిస్తున్నాయి.

”దిగంబర కవిత్వోద్యమంతో పోల్చుకుంటే మీ ‘ పైగంబర కవిత్వం ‘ వెనకడుగే నంటారా?

అలా కాదండీ.దిగంబర కవిత్వం వచ్చేనాటికి తెలుగు సాహిత్యం ప్రభుత్వాల సేవలో తరించిపోతోంది. అభ్యుదయ కవులమని చెప్పుకునే వారే సర్కారు కు బాకా కవులుగా మారిపోయారు.ఈ నేపథ్యంలో దిగంబర కవిత్వం వచ్చి తెలుగు సాహిత్యంలో వున్న స్తబ్ధతను కొంత వరకు పోగొట్టింది.కొత్త కవిత్వ భాషతో ,భావాలతో సమాజంలో,సాహిత్యంలో కదలిక తెచ్చింది. కాకపోతే సిద్ధాంత రాహిత్యం, బూతుల ప్రయోగాల వల్ల దిగంబర కవిత్వం తన లక్ష్యానికి సమీప దూరంలో ఆగిపోయింది. దిగంబరకవిత్వంతో సంబంధం లేకుండా మనిషిని అజెండా   చేసుకొని, మానవత్వాన్ని తట్టి లేపుతూ… సామాజిక చేతన ప్రధాన లక్ష్యంగా పైగంబర కవిత్వాన్ని తెరపైకి తెచ్చాం.

మేము పైగంబరులం

మాది ఒక తపస్సు

మా కవితా దీపికలు

విడదీస్తవి గాఢ తమస్సు

ప్రపంచం సమస్యల కీకారణ్యంలా వుంది. ఎటుచూసినా ఘోర నిబిడ నిశీథి. ఎటుపోయేందుకు దారి తోచదు…ఈ పరిస్థితిలో పైగంబరులుగా మేం ‘ మానవతా గీతం ఆలపించాం.’, ఏడాది కాలం లోనే రెండు కవితా సంపుటాలు వచ్చాయి. పైగంబర కవిత్వం ఉద్యమ రూపం సంతరించుకునే సమయంలోనే విరసం ఆవిర్భవించింది. పైగంబర కవుల్లో కిరణ్ బాబు ఓల్గా, నేను విరసం లో చేరిపోయాం. ఆరకంగా ఉద్యమ స్థాయిలోనే పైగంబర కవిత్వం నిలిచిపోయింది .అయినప్పటికీ భాషలో‌ ,భావంలో, చేతనా పరంగా మంచి కవిత్వాన్నే అందించాం. అందుకే యాభై యేళ్ళయినా పాఠకులకు.  పైగంబర కవిత్వం  తాలూకు ఆకుపచ్చ జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయంటే…అది పైగంబరుల విజయమే కదా !

వచన కవిత్వంతో “పేచీ “…!!

మీరు వచన కవిగా జీవితం ప్రారంభించి,ఇప్పుడు వచన కవిత్వాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

వ్యతిరేకించడమే కాదు..వచన కవిత్వానికీ,లఘురూప కవిత్వానికి మధ్య సంబంధాన్ని తెగ్గొట్టేశాం. వచనకవిత్వం నీడలో లఘురూపకవిత్వం ఎదగడం లేదు.అందుకే లఘురూప కవిత్వానికి గుర్తింపు,          గౌరవం తెచ్చేందుకు వచన కవిత్వంతో ‘ తెగతెంపులు ,’ చేసుకున్నాం . కొన్నాళ్ళుగా వస్తున్న          కవిత్వాన్ని గమనించండి. ఎంత నాశిరకంగావుందో… మీకే అర్థమవుతుంది. ఇప్పుడు వచన కవిత్వం  రాసేవారిలో ఏ ఏకొద్దిమందో తప్పితే……మెజార్టీ కవులు రాసేదంతా వుత్త ‘ ట్రాష్ ‘ .వచన కవిత్వం రాసే వారికి తామేం రాస్తున్నారో?ఎందుకు రాస్తున్నారో?ఎవరికోసం రాస్తున్నారో ? ఓ లక్ష్యం, స్పహ లేకుండా పోయాయి.చాలాకాలంగా ‘నాశిరకం ‘కవిత్వాన్ని చూసి,వచన కవిత్వంపై మొఖం మొత్తింది. లాబీల లోకంలో ఇంతకంటే మంచి కవిత్వాన్ని ఆశించడం కూడా కష్టమే అనిపించింది. అందుకే లఘు రూప కవిత్వం వైపుకు మొగ్గు చూపాను.2002 లో “ రెక్కలు “   ప్రక్రియను సృజించాను . 2019 లో “ కాంతిధార “ పేరుతో మరో లఘురూప వచన పద్యాలు రాశాను . చాలా మంది ,ముఖ్యంగా యువ కవులు ‘లఘురూప కవితా ప్రక్రియల ‘ పట్ల ఆసక్తి చూపుతున్నారు. అందుకే లఘురూప కవులందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు‌ “ లఘురూప కవితా వేదిక “ ను   2019 లో ఏర్పాటు చేసుకున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ వేదిక క్రియాశీలకంగా పనిచేస్తోంది.ఈ వేదిక ద్వారా ఉత్తమ లఘురూప కవితా సంకలనాలు/ సంపుటులకు పురస్కారాలను కూడా ఇస్తున్నాం.ఈ వేదిక ద్వారా ఎందరో… లఘురూప కవులు తమ కవితాసంపుటుల్ని వెలువరిస్తున్నారు.అంతెందుకు ఐతిహాసాలు, ‘ మహాకావ్యాల’ను కూడా లఘురూప కవిత్వంలో రాస్తున్నారు.ఇప్పటికే నూతక్కి రాఘవేంద్ర రావు రావు గారి “ ఉల్కల రామాయణం”, విశ్వేశ్వర వర్మ భూపతి రాజు ( వర్మ ) గారి “ రవ్వల గీత “(భగవద్గీత ). ‘ రెక్కల‌‌ ‘ప్రక్రియలో డి. హనుమంత రావు గారు టాగూర్ గీతాంజలి “ని అనువదించారు. డా. కేతవరపు రాజేశ్వర గారు ‘ రెక్కల్లో ‘ గీతామృతం నింపారు .వీరారెడ్డి ‘ రెక్కల్లో ‘ చాణక్య నీతులు వినిపించారు.లఘురూప కవిత్వంలో ఎంత‌ పెద్ద ఇతివృత్తాన్నయినా అవలీలగా రాయొచ్చని వీరంతా నిరూపించారు. తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు కూడా  ఇప్పుడిప్పుడే లఘురూప కవిత్వం వైపు దృష్టి సారిస్తున్నాయి. నామాటగా మీరు రాసి పెట్టుకోండి.‌ వచ్చే కాలమంతా లఘురూప కవిత్వానిదే..!!

తెలుగు గజల్ పై మీ అభిప్రాయం?

ఈ మధ్య తెలుగులో గజళ్ళు రాయడం ఓ ప్యాషన్ గా మారింది.వీటిపై నాకు అంతగా సదభిప్రాయం లేదు.నిజానికి గజల్ సంస్కృతి మనది కాదు.మనకు సూట్ కూడా కాదు. ప్రేయసి, ప్రియుడు,..ప్రేమ వాతావరణం ఇక్కడ నేటివిటీకి సరిపోదు.అది ఉత్తరాది కల్చర్. బలవంతంగా మనపై రుద్దుతున్నారనిపిస్తోంది. అరువు తెచ్చుకున్న కల్చర్ లో జీవం వుండదు. నేలవిడిచి సాము చేయడం భావకవిత్వంతోనే పోయిందనుకుంటే.. ఇప్పుడు ఈ గజల్ రూపంలో మళ్ళీ మొదలైంది.మట్టి వాసన లేని కవిత్వం రాణించదన్నదే నా అభిప్రాయం.

నేటి సాహిత్య విమర్శ పై మీరేమంటారు?

సాహిత్య విమర్శా? ఏదీ? ఎక్కడా కనిపించడంలేదే. తెలుగులో విమర్శకులు కరువయ్యారు. తెలుగు కవిత్వం వెనుకబాటు తనానికి ఇదీ ఒక కారణం. ఆనాడుఅద్దేపల్లి వంటి విమర్శకులు వుండబట్టే నా “ రెక్కలు “ ఇంతగా విచ్చుకొని, ఎగరగలుగుతున్నాయి.అటువంటి విమర్శకుల అవసరం వుంది.అయినా..నేటితరం కవులు విమర్శను తట్టుకోలేక పోతున్నారు. మేం రాసిందే కవిత్వం..అందులో తప్పులున్నా ఎవరూ ఎత్తి చూపకూడదు అనే తత్వం ప్రబలింది. అందువల్ల ఎవరైనా విమర్శకుడు ధైర్యం చేసి రాసినా..జీర్ణం చేసుకునే పరిస్థితి లేదు. విమర్శ లేకపోతే       కవిత్వం రాణించదు.

ఓ సీనియర్ కవిగా నేటి యువకవులకు మీరేం సందేశం ఇస్తారు?

ఇప్పుడు కవిత్వం రాస్తున్నవారిలో 90శాతం మంది ఉద్యోగస్తులు వాళ్ళు రాసిందేమైనా అచ్చేయించుకునే స్తోమత వున్నవారే. వీళ్ళు కవిత్వాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. అథ్యయనం అసలే లేదు. ఏదో రాశామంటే..రాశాం అన్నట్లుంది వీళ్ళ ధోరణి. నేటి యువకవులు అభ్యుదయ కవిత్వం మొదలుకొని లేటెస్ట్ ట్రెండ్స్ వరకు చదవాలి. అప్పుడే కవిత ఫార్మేషన్, మౌల్డింగ్ తెలిసొస్తుంది. అలాగే మాండలికాల్లో కవిత్వం రాయడం వల్ల కవిత్వ పరిథి కుంచించుకుపోతుంది. రీడర్స్ తగ్గిపోతారు. ప్రాంతీయంగా ఎవరి యాసకు వారు గిరిగీసుకోవడం వల్ల కూడా కవిత్వం కుంచించుకు పోతుంది. రియాలిటీని అర్థం చేసుకొని కవిత్వం రాస్తే, అది రాణిస్తుంది.

*

 

రజాహుస్సేన్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు