మొదటిసారి పబ్లిక్ గార్డెన్ లో మోగిన రేడియో

బట్టల షాపు బాగా పేరున్న షాపు.అప్పుడే షాపు తెరిచినట్టున్నారు.మేమే(నేనూ, కొలీగ్ అనిల్ ప్రసాద్) మొదటి విజిటర్స్.మేము  కొనటానికి కాదు, మాకు ప్రకటనలు ఇవ్వండి అని అడగటానికి వచ్చినవాళ్ళం అని తెలియగానే సదరు దుకాణ యజమానిగారు మామీద చికాకుపడ్డారు.విదిల్చినట్టు మాట్లాడారు.నాకు, అనిల్ ప్రసాదుకు బాధనిపించింది.ఏమీ అనలేక బయటకొచ్చేసి హన్మకొండ చౌరాస్తా సమీపంలో ఉన్న అశోకా హోటల్ కు వెళ్ళి కాఫీ తాగొచ్చేశాం.

కట్ చేస్తే మేం వెళ్ళొచ్చిన ఆర్నెల్లకు మా యాంకర్ మఖ్దూం వాళ్ళు ఏదో స్పాన్సర్ షిప్ ఇస్తామన్నారు, కలవండి సర్ అని ఆఫీసుకు వచ్చి చెప్పాడు.అలా మళ్ళీ వెళ్ళి మాట్లాడి వాళ్ళతోటే స్పాన్సర్ షిప్ తీసుకున్నాం.

అప్పుడే ప్రసారభారతి ఏర్పడింది.రెవెన్యూ జనరేషన్ మీద ఫోకస్ ఉండేది.అప్పటికి ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ రేడియో స్టేషన్ కమర్షియల్ రెవెన్యూ సంపాదించే స్టేషన్ గా మంచి పేరు గడించింది.

అలాగే వరంగల్ లో  పేరుగాంచిన హాస్పిటల్స్ మాకు ప్రకటనలిస్తుండేవి.జిల్లాయ యంత్రాంగం వారు అవసరాన్నిబట్టి  నిర్వహించే కేంపెయిన్లలో రేడియోకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు.

అప్పట్లో “వెలుగు” పథకం ఉండేది.ప్రధానంగా మహిళా స్వయంశక్తి సంఘాలు(వీటిని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా గ్రూపులనేవారు) పొదుపు సంఘాలు నిర్వహిస్తు ఉండేవి.వారు నిర్వహించే కార్యక్రమాలను, సమావేశాలను, వారి సక్సెస్ స్టోరీలను రేడియోలో రికార్డు చేసి ప్రసారం చేసేవారము.దానికి స్పాన్సర్ షిప్ ఇచ్చేవారు.

ఇందుకోసం అనేక గ్రామాలు తిరిగి వారు నిర్వహించే సమావేశాలు రికార్డు చేయటమో గొప్ప జ్ఞాపకం.ఈ మీటింగ్స్ ఎక్కువగా రాత్రిపూట ఏడుగంటలు, ఎనిమిది గంటల మధ్య జరిగేవి.చాలా ఉత్సాహంగా జరిపేవారు.శ్రోతలకు మహిళా స్వయంశక్తి సంఘాలు ఏవిధంగా సమావేశాలు నిర్వహించుకుంటాయో, వారి కష్టం తెలిసేది.

నిజానికి వరంగల్ రేడియో స్టేషన్ ఎప్పుడూ సందడికి పుట్టిల్లులా ఉండేది.వరంగల్ లో నేను గమనించిన అంశాలలో యువత పాడటం రాయటం చాలా అలవోకగా చేయటం ఒకటి.అలా యువవాణి కార్యక్రమంలో ఎప్పుడూ కొత్త కళాకారులు వస్తుండేవారు.

అలాగే చిందు యక్షగాన కళాకారులకు నిలయంగా ఉండేది వరంగల్ జిల్లా.

వరంగల్ లో తెలుగు విశ్వవిద్యాలయం వారి జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఎంతో సేవచేస్తుండేది.ఎన్.భక్తవత్సలరెడ్డిగారు దానికి ఇన్ఛార్జ్ గా ఉండేవారు.వారు, స్టేషన్ డైరక్టర్ ఆదిత్యప్రసాద్ గారు కలిసి జిల్లాలోని అన్ని కళారూపాల ప్రదర్శన హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో జరిపేందుకు నిశ్చయించారు..దాదాపు నలభై కళారూపాలు, నలభైరోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం ఆరుగంటలకు రసజ్ఞులైన ప్రేక్షకులను అలరించాయి.ఆ కార్యక్రమాలు రికార్డుచేసి రేడియో ద్వారా ప్రసారం చేశాం.

2004 లో అదే పబ్లిక్ గార్డెన్ లో పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ రోజున(నవంబర్ 12వ తేదీన) రేడియో ప్రసారాలు అందరూ వినేలా పార్కు అంతటా స్పీకర్లు ఏర్పాటుచేసింది వరంగల్ రేడియో. ఆనాటి కార్యక్రమానికి అప్పటి వరంగల్ జిల్లా కలెక్టర్ ఎన్.శివశంకర్, ప్రముఖ ధ్వన్యనుకరణ కళాకారులు పద్మశ్రీ డా.నేరెళ్ళ వేణుమాధవ్ హాజరయ్యారు.పార్కుఅంతటా రేడియో ప్రసారాలు వినటం ఆరోజుల్లో ఒక కమనీయ ఘట్టంగా భావించాలి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే వరంగల్ రేడియో అంతగా ప్రజాజీవనంతో ముడిపడిపోయింది అని చెప్పేందుకు.అలా ఒక పెర్ఫెక్ట్ లోకల్ రేడియో స్టేషన్ గా నిలిచింది.

ఇంకో రెండు విషయాలు చెప్పాలి.మేమందరం ఒక టీంలానే పనిచేసేవాళ్ళం..మా సీనియర్ కొలీగ్స్ వ్యాస్ కుమార్, విద్యాలంకార్, డా.విజయ, జయపాల్ రెడ్డి, డా.పుట్టపర్తి నాగపద్మిని అందరూ listener friendly, talker friendly గా ఉండేవారు.

నేను వ్యవసాయ కార్యక్రమాలు చూస్తుండటం వలన విస్త్రృతంగా పల్లెలు తిరిగి రైతులతో ముఖాముఖి నిర్వహించే అవకాశం లభించింది.రైతులకు వ్యవసాయ పరిశోధనా కేంద్రాలకు, కృషి విజ్ఞాన కేంద్రాలకు అవినాభావ సంబంధం ఉంటుంది.అలాగే వ్యవసాయశాఖ రైతులకు రబీ, ఖరీఫ్ పంటల్లో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తుంది.వీటన్నిటిలోనూ ఆకాశవాణి వరంగల్ కేంద్రాన్ని భాగస్వామిగా చేసేవారు.రేడియో తరఫున నేను హాజరయేవాడిని.

వ్యవసాయం గురించి, పంటల గురించి, సీజన్ల గురించి అంతరపంటల గురించి వరంగల్ వెళ్ళాకే ఈ విషయాలు నేను నేర్చుకున్నాను.పశుపోషణ గురించి, పౌల్ట్రీ గురించి కూడా నేను నేర్చుకోగలిగాను.నాకు వ్యవసాయం లో డిగ్రీ లేకున్నా ఆరేళ్ళపాటు రైతులతో మమేకం కాగలిగాను.

ఒకసారి ఈనాడు లో ఒక రైతు సక్సెస్ స్టోరీ వచ్చింది.అతను నర్మెట్ట మండలానికి చెందిన యువరైతు.ఆరోజుల్లో 2000-2004  సంవత్సరాల మధ్య డ్రిప్ ఇరిగేషన్ మీద చాలా ఫోకస్ ఉండేది. ప్రభుత్వం ఆ పద్ధతిలో సాగుచేసేవారికి సబ్సిడీ ఇస్తుండేది. అలా ఆ సబ్సిడీ వినియోగించుకుని ఆ యువరైతు ఉద్యాన పంటలు వేసి లాభాలు గడించాడు.

ఆ పేపర్ రిపోర్టర్ ఓ ప్రశ్న వేశాడు.

అసలు ఈవిధంగా డ్రిప్ ఇరిగేషన్ తో సాగుచేయొచ్చని మీకు ఎవరు చెప్పారంటే అతను చెప్పిన జవాబు నాకింకా గుర్తే.

ఒకరోజు వరంగల్ రేడియోలో సైంటిస్ట్ జలపతిరావు గారు ఎవరో రైతు అడిగినప్పుడు, నీటి సౌకర్యం తక్కువుంటే సూక్ష్మనీటి సాగు(drip irrigation) చేయండి.అది మీకు మేలు చేస్తుంది, పైగా మీకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని చెప్పారు.అది నాకు గుర్తుండిపోయి మా వ్యవసాయశాఖ అధికారి నడిగి వివరాలు పొంది డ్రిప్ తో సాగు చేశాను అని చెప్పాడు.నర్మెట్ట చాలా రిమోట్ గా ఉంటుంది.అలాంటి చోట రేడియో లో చెప్పిన విషయాన్ని అతను ఎంత బాగా ఉపయోగించుకున్నాడు అనిపించింది. 2004లోనే వరంగల్ ఆకాశవాణి కేంద్రానికో గుర్తింపు వచ్చింది. అదేమిటంటే….!

*

 

"రేడియో" రాంబాబు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.