ఆ ఊరికి వెళ్లే దారి వర్షం పడినప్పుడు కనిపించదు. రోడ్డు ఉందని తెలిసేది, దాని మీద నీళ్లు కొంచెం తక్కువగా నిలబడిన చోట్లే.
బస్సు చివరి మలుపు తిరిగేసరికి సాయంత్రం పూర్తిగా కొండల వెనక్కి వెళ్లిపోయింది. కిటికీ అద్దాల మీద వర్షపు చుక్కలు పరుగులు తీస్తున్నాయి. ఒక్కో చుక్క కిందికి చేరేలోపే మరో చుక్క దాన్ని దాటిపోతోంది.అర్జున్ కిటికీకి తల ఆనించాడు.సిటీలో వర్షం అంటే ట్రాఫిక్.ఇక్కడ వర్షం అంటే అడవి.బస్సు దిగేసరికి చుట్టూ ఎవరూ లేరు. ఒక చిన్న టీ కొట్టు మాత్రమే ఉంది. పొయ్యి నుండి వస్తున్న పొగ వర్షంలో కలిసిపోయి చెట్ల మధ్యకి వెళ్తోంది.
అర్జున్ బ్యాగ్ దించుకుంటూ,“రామన్నగారి ఇల్లు ఎటు?” అని అడిగాడు.టీ కొట్టువాడు అతన్ని ఒకసారి చూసి నవ్వాడు.
“అదేంటిబాబూ… మళ్లా వచ్చావా?”అర్జున్ అతని వైపు చూశాడు.
“మళ్లా?”“అవును.”“నేను ఇక్కడికి రావడం ఈ మధ్య ఇదే మొదటిసారి.”టీ కొట్టువాడు కాసేపు అతని ముఖం చూశాడు.
“అలాగా…”అంతే అన్నాడు.కొంచెం దూరంలో ఉన్న మట్టి దారిని చూపించాడు.“ఆ దారి పోతే చెరువు. చెరువు దాటాక పెద్ద రావిచెట్టు. దాని వెనక ఇల్లు.”అర్జున్ నడక మొదలుపెట్టాడు.
వర్షం ఇంకా పడుతూనే ఉంది.రామన్న ఇల్లు ఊరి చివర కాదు. ఊరు ముగిసిన తర్వాత మొదలయ్యే అడవి మధ్యలో ఉంది.
ఇంటిముందు పాత రాతి మెట్లు. మెట్ల పక్కన తులసి కోట. తులసి మొత్తం వర్షంతో వంగిపోయింది. పైకప్పు నుంచి నీళ్లు ఒకే చోట పడుతూ చిన్న గుంత చేసుకున్నాయి.
తలుపు తెరిచి ఉంది.
“రామన్నగారూ?”
లోపల నుంచి ఒక వృద్ధురాలు వచ్చింది.అతన్ని చూసి ఒక్క క్షణం ఆగింది.తర్వాత నవ్వింది.“అర్జున్ కదా?”“అవును.”
“నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు.”అర్జున్ ఆమె ముఖం చూశాడు.
“ఏమైంది?”“ఏమీ లేదు. లోపలికి రా.”
ఆమె మాటల్లో ఏదో తెలియని ఆత్మీయత ఉంది.అతను లోపలికి వెళ్లాడు.గోడ మీద పాత ఫొటోలు ఉన్నాయి.అందులో ఒక ఫొటో ముందు అతను ఆగిపోయాడు.
అతని తండ్రి.పక్కనే రామన్న.మరో మూలలో అతని తల్లి. చిన్నప్పుడు తీసిన ఫొటో.అర్జున్ చేతిని ఫొటో వైపు చాపి ఆపుకున్నాడు.అతని తల్లి చనిపోయి ఆరు సంవత్సరాలు.
తండ్రి చనిపోయి నాలుగు.ఆ ఇద్దరి మరణాల దగ్గర అతను ఉండలేకపోయాడు.అప్పుడు అతను విదేశంలో ఉన్నాడు.
వచ్చేసరికి అంతా అయిపోయింది.అతని తల్లి అంత్యక్రియలప్పుడు ఈ ఊరి వాళ్లు ఒక మాట అన్నారు.
“నువ్వు నిన్నే వచ్చావు బాబూ.”తండ్రి చనిపోయినప్పుడు కూడా అదే మాట.“నిన్నే వచ్చి వెళ్లావుగా.”
అతను అప్పట్లో నవ్వేసేవాడు.ఎవరో తనను చూసి తప్పుగా అనుకున్నారేమో అనుకునేవాడు.
కానీ ఆ మాట మాత్రం అతనిలో ఎక్కడో మిగిలిపోయింది.
ఆ రాత్రి వర్షం తగ్గలేదు.
ఇంటి వెనక కొండ మీద నుంచి నీళ్లు జారుతూ వచ్చి పొలాల్ని దాటుతున్న శబ్దం వినిపించింది.అర్జున్‌కు నిద్ర రాలేదు.
బయటికి వచ్చాడు.ఆకాశం కనిపించలేదు.చెట్లు మాత్రమే కనిపించాయి.వర్షంలో చెట్లు ఒకదానికొకటి దగ్గరగా నిలబడి ఏదో రహస్యాన్ని దాచుకుంటున్నట్టున్నాయి.
“వర్షం పడుతున్నప్పుడు ఈ ఊరు తనను తాను గుర్తుపట్టదు.”
వెనక నుంచి రామన్న గొంతు.
అర్జున్ తిరిగాడు.
వృద్ధుడు తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు.
“ఏమన్నారు?”
“ఏమీ కాదు.”
“నన్నెందుకు పిలిచారు?”
రామన్న కొద్దిసేపు వర్షాన్ని చూశాడు.
“నీకు ఒక విషయం చూపించాలి.”
“ఏంటి?”
“రేపు ఉదయం చెరువు దగ్గరికి వెళ్లు.”
“ఎందుకు?”
“ఎవరో వస్తారు.”
“ఎవరు?”
రామన్న సమాధానం చెప్పలేదు.
“వెళ్లు. అంతే.”
ఉదయం వర్షం ఆగిపోయింది.
అడవి అంతా రాత్రంతా తడిసి మొలకెత్తడానికి రెడీ గా ఉన్న విత్తులా కనిపించింది. ఆకుల చివర్ల నుంచి నీళ్లు ఒక్కొక్కటిగా జారుడు బల్లమేదనుంది పిల్లలు జారినట్టు జారుతున్నాయి.
చెరువు గర్భిణీ స్రీ పొట్టలా నీళ్ళతో ఉబ్బెత్తుగా ఉంది.నీటిమీద మబ్బులు పడుకున్నాయి.
అర్జున్ ఒడ్డున కూర్చున్నాడు.
పది నిమిషాలు.ఇరవై నిమిషాలు.ఎవరూ రాలేదు.
అతను లేచి వెళ్లబోతుండగా అవతల ఒడ్డున ఒక మనిషి కనిపించాడు.తెల్ల చొక్కా.నల్ల ప్యాంటు.చేతిలో పాత తోలుబ్యాగ్.
అతను అర్జున్ వైపు చూసి చేతిని ఊపాడు.
అర్జున్ ఆగిపోయాడు.
ఆ మనిషి చెరువు చుట్టూ తిరిగి అతని దగ్గరకు వచ్చాడు.
“చాలా రోజుల తర్వాత చూస్తున్నాను,” అన్నాడు.
అర్జున్ అతన్ని గమనించాడు.
ఎక్కడో చూసిన ముఖం.
చాలా పాత పరిచయం.
కానీ గుర్తుకు రావడం లేదు.
“మీరు ఎవరు?”అతను నవ్వాడు.“నన్ను గుర్తుపట్టలేదా?”
అర్జున్ తల ఊపాడు.ఆ మనిషి బ్యాగ్ తెరిచాడు.
లోపల కొన్ని పాత కాగితాలు ఉన్నాయి.ఒక ఫొటో.ఒక పెన్.
మరికొన్ని ఉత్తరాలు.అతను ఒక ఫొటో అర్జున్ చేతిలో పెట్టాడు.
అది అతని తల్లి ఫొటో.అర్జున్ కళ్లలో ఏదో కదిలింది.
“ఇది మీ దగ్గర ఎలా ఉంది?”“ఆమె దగ్గరే ఉండేది.”
“మీకు ఆమె తెలుసా?”“తెలుసు.”“ఎలా?”
అతను సమాధానం చెప్పలేదు.
మరో ఫొటో తీసాడు.అతని తండ్రి.
అదే చిరునవ్వు.అదే కళ్ళు.
“మీకు మా నాన్నను కూడా తెలుసా?”
“తెలుసు.”
“ఎలా?”
ఆ మనిషి చెరువువైపు చూశాడు.
“కొంతమంది మనుషుల్ని తెలుసుకోవడానికి వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం ఉండదు.”
అర్జున్ ఏమీ అనలేదు.
అతను మరో కాగితం తీసి ఇచ్చాడు.
“ఇది నీ నాన్న రాసింది.”
అర్జున్ కాగితం విప్పాడు.
అతని తండ్రి చేతిరాత.
చివర్లో ఒక్క వాక్యం.
“అర్జున్ ఎక్కడ ఉన్నా, మన దగ్గరే ఉన్నట్టు ఉంటాడు.”
అర్జున్ కాసేపు ఆ వాక్యాన్నే చూస్తూ ఉండిపోయాడు.
“ఇది నాకు ఎందుకు ఇస్తున్నారు?”
“ఇప్పుడే అర్థం కాకపోవచ్చు.”
“ఏమిటి అర్థం కావాల్సింది?”
ఆ మనిషి అతని వైపు చూశాడు.
“నీ అమ్మ చివరి రోజుల్లో నిన్ను చాలా సార్లు పిలిచింది.”
అర్జున్ కళ్లను కిందికి వాల్చాడు.
“నాకు తెలుసు.”“కానీ ఒకసారి మాత్రం పిలవలేదు.”
అర్జున్ తలెత్తాడు.“ఎప్పుడు?”“చివరిసారి
అర్జున్ మౌనంగా ఉండిపోయాడు.
ఆ మనిషి చెప్పాడు.
“అప్పుడు ఆమె తలుపువైపు చూసి నవ్వింది.”
“ఎందుకు?”
“‘వచ్చేశాడు’ అంది.”
అర్జున్ ముఖం మారిపోయింది.
“నేను… ఆ రోజు విమానంలో ఉన్నాను.”
“తెలుసు.”
“అయితే…?”
ఆ మనిషి సమాధానం చెప్పలేదు.
బ్యాగ్‌లోంచి మరో ఉత్తరం తీసాడు.
“నీ నాన్నది.”
అర్జున్ దాన్ని తెరవలేదు.
“ఇది కూడా చదవాలా?”
“నీకు అనిపించినప్పుడు.”
కొద్దిసేపు ఇద్దరూ చెరువునే చూస్తూ నిలబడ్డారు.
నీటిమీద గాలి అలలు పుట్టించింది.
అర్జున్ మళ్లీ అడిగాడు.
“మరి నువ్వెవరు?”
ఆ మనిషి నవ్వాడు.
“నేను?”
కొద్దిసేపు ఆలోచించాడు.
“నువ్వు రాలేని చోట కొంతకాలం ఉండిపోయిన జ్ఞాపకం అనుకో.”
అర్జున్ అతని ముఖాన్ని చూశాడు.
ఆ ముఖం ఒక్కసారిగా తన తండ్రిలా కనిపించింది.
తర్వాత తనలానే.
తర్వాత ఎవరో తెలియని మనిషిలా.
అతను కళ్లను రుద్దుకున్నాడు.
మళ్లీ చూసేసరికి అక్కడ ఎవరూ లేరు.
చెరువు అవతల ఖాళీ.
తడి మట్టిలో మాత్రం కొన్ని అడుగుల గుర్తులు.
అర్జున్ వాటివైపు నడిచాడు.
అక్కడికి వెళ్లి ఆగిపోయాడు.అడుగుల గుర్తులు చెరువు దగ్గరికి వచ్చి ముగిశాయి.తిరిగి వెళ్లిన గుర్తులు లేవు.
ఇంటికి తిరిగి వచ్చేసరికి రామన్న గడప దగ్గర కూర్చున్నాడు.
అర్జున్ అతని పక్కన కూర్చున్నాడు.
“నన్ను ఎందుకు పిలిచారు?”
రామన్న అతని వైపు చూడలేదు.
“చూశావా?”
“ఎవరిని?”
రామన్న నవ్వాడు.
“నువ్వే చెప్పు.”
అర్జున్ సమాధానం చెప్పలేదు.
అతని చేతిలో ఉన్న పాత ఉత్తరాన్ని చూశాడు.
“ఇది మీకు తెలుసా?”
రామన్న ఆ కాగితాన్ని చూసి,
“అది నీ నాన్న చేతిరాత.”
“మీకు తెలుసా?”
“తెలుసు.”
“ఆ మనిషి ఎవరు?”
రామన్న కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు.
“అది నీకు తెలిస్తే ఏం మారుతుంది?”
అర్జున్ అతని వైపు చూశాడు.
రామన్న మొదటిసారి అతని కళ్లలోకి చూశాడు.
“కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలిసిన తర్వాత అవి ప్రశ్నలుగా ఉండవు.”
అంతే.
టీ కొట్టు వైపు నుంచి ఎవరో పిలిచారు.
“అర్జున్ బాబూ!”
అతను వెనక్కి తిరిగి చూశాడు.
టీ కొట్టువాడు.
అతను నవ్వుతూ చేతిని ఊపాడు.
“మళ్లా వస్తావు కదా?”
అర్జున్ కూడా నవ్వాడు.
ఈసారి ఆ మాట అతనికి వేరుగా అనిపించింది.
వర్షం ఆగిపోయింది.
కొండల వెనక నుంచి సూర్యకాంతి నెమ్మదిగా బయటికి వచ్చింది.
తడిసిన చెట్లు ఎండిన బట్టల్లా మెరుస్తున్నాయి.
రోడ్డు మళ్లీ కనిపిస్తోంది.
అర్జున్ బ్యాగ్ భుజాన వేసుకున్నాడు.
ఊరిని వదిలి వెళ్లడానికి నడక మొదలుపెట్టాడు.
కొంతదూరం వెళ్లాక వెనక్కి తిరిగి చూశాడు.
ఎవరూ లేరు.
కానీ తులసి కోట పక్కన, రాతి మెట్ల మీద, తన కోసం ఎవరో ఇప్పటికీ కూర్చున్నట్టుగా అనిపించింది.
అతను మళ్లీ ముందుకు నడిచాడు.
రోడ్డుపై తన అడుగులే కనిపిస్తున్నాయి.
కొద్దిదూరం వెళ్లాక అతను ఆగిపోయాడు.
తడి మట్టిలో తన ముందుగా ఇంకొన్ని అడుగుల గుర్తులు ఉన్నాయి.అవి ఎక్కడి నుంచి వచ్చాయో కనిపించలేదు.
అవి ఎటు వెళ్తున్నాయో కూడా తెలియలేదు.
అర్జున్ వాటిని చూస్తూ నిలబడ్డాడు.
తర్వాత తన అడుగులను వాటి మీదే వేసుకుంటూ నడవడం మొదలుపెట్టాడు.
వెనక్కి చూసుకోలేదు.
వర్షం ఆగిన చోట రోడ్డు స్పష్టంగా కనిపిస్తోంది.
కానీ ఆ రోజు మొదటిసారి అతనికి ఒక విషయం అర్థమైంది—
మనిషి తన శరీరంతో చేరకముందే,అతన్ని ప్రేమించిన వాళ్ల జ్ఞాపకాలు అతని కోసం అక్కడికి వెళ్లతాయేమో?.
అర్జున్ నడుస్తూనే ఉన్నాడు.
ముందున్న అడుగులు అతనివో, తనకోసం ఎదురు చూసినవో అతనికి తెలియదు
*








అద్భుతమైన కథను అందించారు అభినందనలు