పదచిత్రాలా? చిత్రవర్ణాలా?!

ఈ నెల 6-8 తేదీలలో , హైదరాబాద్ నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో రామశాస్త్రి గారి చిత్రకళా ప్రదర్శన

కవిత్వం అంటే పదాలతో చిత్రాలు గీయడం.
చిత్రకళ అంటే రంగులతో కవిత్వం రాయడం.

కవి, చిత్రకారుడు ఇద్దరూ ఒక్కరే అయినప్పుడు..అంటే ఒకే వ్యక్తి రెండు మాధ్యమాల్లోనూ సృజన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి హృదయంలోని దృశ్యం (visual imagination) చాలా బలంగా, స్పష్టంగా ఉంటుంది. అంటే ఆ వ్యక్తి రెండు కళల మధ్య సరిహద్దులు లేకుండా స్వేచ్ఛగా తిరుగుతాడు. ఒక కళలో ఏమి చెప్పలేకపోతే మరో కళలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకదానిలో అంతర్గతంగా ఉండే భావన మరొకదానిలో బాహ్యంగా కనిపిస్తుంది. కాబట్టి Painting is silent poetry and the poetry is painting that speaks…అని Simonides of Ceos అన్నాడు. ఇది ఒక రకంగా సినెస్థీసియా (synesthesia) లాంటి అనుభవం. ఒక ఇంద్రియం ద్వారా వచ్చిన ఉద్దీపన మరొక ఇంద్రియాన్ని కదిలిస్తుంది. పదాలకు లేని ఆకస్మికత, తక్షణ దృశ్య శక్తి చిత్రంలో ఉంటుంది. చిత్రానికి లేని సమయ-క్రమం, లయ, లోతైన ఆలోచనా ప్రవాహం కవిత్వంలో ఉంటుంది. కాబట్టి ఒకే వ్యక్తి రెండు సృజనాత్మకతలను సాధన చేస్తున్నప్పుడు..ఆ లోపాలు లేకుండా పోతాయి. ఇది ఒక రకంగా ఆత్మ యొక్క పూర్ణత్వ వ్యక్తీకరణ (wholeness of expression) అవగలదు.

అటువంటి వ్యక్తీకరణ సాధన చేస్తున్న వారు శ్రీ ఎస్.వి.రామశాస్త్రి గారు.

2013 లో వెలువడిన ఆయన కవిత్వం ‘నల్లకలువలు – నక్షత్రాలు’లో ఈ వాక్యం నన్ను ఆవహించింది.

‘ఆమె ముందు
మనమెపుడూ
మోకరిల్లే ఇసుక రేణువులమే..!’

అనంతమయిన ప్రకృతి శక్తి ముందు, స్త్రీ ముందు మనిషి మోకరిల్లడమే మార్గం..అది తెలుసుకునేవాడు వివేకి. ఇది కూడా చూడండి :

‘ఎన్నో ముసుగులు ధరించిన నేను
అద్దం ముందు నుంచుని
గమనిస్తే
ఏ ముఖమూ నాది కాదని గుర్తించాను.’

ఇదిగో..ఇలా మనని మనం గుర్తించడమే మనలోకి ఒక జ్ణాన సంచయం కలిగిందని అర్థం..అలా అర్థం చేసుకొని , ముసుగులు వదిలించుకొన్నాక అసలు అన్వేషణ మొదలవుతుంది. తనకు అందుతున్నట్టే వున్నదాన్ని, కనిపించినట్టే వున్నదాన్ని వెతకడం ప్రారంభమవుతుంది తన లోపల.

‘ఉన్నచోటు నుంచి
ఎవరూ లేని
ఎపుడూ చూడని
ఒకానొక నిశ్శబ్ద ప్రపంచపు
సౌందర్యాన్ని అందుకోవడం’

దీని కోసం జీవితాలు వెచ్చిస్తారు. మండే ఎండలో‌ చల్లటిమాటల నీడల కోసం తపిస్తారు. అందరానిది ఏదో అందుకుందామని అర్రులు చాస్తారు. బండలయిన హృదయాల మాటున గుండెల తడి వెతుకుతారు. అందుకే కవి ఇలా తలపోస్తాడు కాబోలు :

‘నాపరాళ్ళ ఊరిలో
ఎంత సున్నిత హృదయాలు
మండే ఎండలో
ఎన్ని మాటల చలివేంద్రాలు’

కవికి తన కవితా వాక్యం తన హృదయపు కొమ్మ మీద తానుగా వచ్చి వాలే పక్షిలా వుండాలి. ధ్యానంలో సాక్షాత్కరించే వెలుగులా వుండాలి. కనుకే..

‘ప్రయత్నం లేని కవిత/ తంటాలు పడని/ వెంటాడే ఒక వాక్యం’ సాక్షాత్కరించాలని దోసిలి పట్టి నిలుచుంటాడు కవి. ఎక్కడ ఒక వాక్యం తన కళ్ళకు తళుకుమన్నా ఆ వాక్యం కళ్ళకు అద్దుకుంటాడు. దీనికి భాష అవరోధం కాదు. ఈ వాక్యం చూడండి. దీని మైమరపులో కవి ఈ వాక్య మధురిమను అందరికీ పంచాలని తన మూల భాషలోకి తెచ్చుకుంటాడు.

‘నాలో శత్రువా/ వెళ్లు/ చీకటి పోగొట్టే / వెలుతురు నింపుకో’ ( పంజాబీ మూలం : దేవ్ )

ఇది ఉత్కృష్టమైన ఆలోచనా ధార. వాక్య తపః ఫలం.

దారిలో ‘కొన్ని పూలు’ చూసిన కవి చేసిన ఊహ చూడండి :

ఆ పూలు / కాలిన గాయానికి / నవనీతం రాసినట్టుండాలి/

ఇంకొన్ని/ ఎప్పుడూ గుర్తొచ్చే అమ్మ పాడిన / చందమామ పాటలా వుండాలి/

మరికొన్ని మాటలు సరిగా రాని/ చిన్నపాప సంభాషణలా/ కొనసాగుతుండాలి

మనలో కూడా కవిత్వం ఇలాంటి అనుభవాన్ని వదిలిపెట్టాలనే కవి రామశాస్త్రి గారి ఆకాంక్ష. ఈ చిన్ని పుస్తకంలో ఆయన ప్రకృతితో, తన సహ మానవులతో, తనతో చేసిన మృదువైన సంభాషణ మనసుకు తాకుతుంది. అనువాదాల ఎంపిక ఆయన తాత్విక భూమికను ప్రతిఫలించాయి.

ఆయన కలంతో కన్నా, కుంచెతోనే ఎక్కవగా సాంత్వన పొందాడనిపిస్తుంది. సృజనకారుడిగా తనలో రేగే మూర్త అమూర్త భావనలతో అదృశ్య అవిశ్రాంత యుద్దం చేసి వాటితో సయోధ్య కుదుర్చుకున్నాడనిపిస్తుంది. ఇది ఆదిమ మానవుని స్థితికి తిరిగి వెళ్లినట్టు. పురాతన కాలంలో కవి, చిత్రకారుడు, సంగీతకారుడు అంతా ఒకడే – ఆధునిక నాగరికతలో మనం వీటన్నిటినీ వేరు చేశాం. కానీ ఒకే వ్యక్తి రెండూ అయినప్పుడు..ఆ విభజన భంగమయి, మానవ సృజనాత్మకతను ప్రాచీన స్థితికి తిరిగి తీసుకు వస్తుంది. చాలా మంది గొప్ప కవి – చిత్రకారులు విలియం బ్లేక్, రవీంద్రనాథ్ ఠాకూర్, ఖలీల్ జిబ్రాన్, అడవి బాపిరాజు, మా గోఖలే, సంజీవ దేవ్, శీలా వీర్రాజు, చినవీరభద్రుడు, రమణజీవి, చిన్నారి ముమ్మిడి, ఆప్త చైతన్య లాంటివారు ఈ స్థితిలోనే సృజన చేశారనుకుంటాను. ఈ వరుసలో నిలబడగలిగిన వారు రామశాస్త్రి గారు.

లేత లేత రంగులతో..రేఖా చిత్రాలు గీసి వాటిని ఫోటో కలర్స్ తో నింపి అద్భుతమైన చిత్రాలు గీస్తారు. ‘రాగాల మీద మీరు వేస్తున్న చిత్రాలు చాలా చాలా అందంగా వున్నాయి’ అని బాపు గారే ఆయన రాగాస్ సిరీస్‌కు కితాబిచ్చారు. మన మనసును మీటినట్టు వుండడమే ఆ చిత్రాల ప్రత్యేకత.

గురజాడ నుండి నేటి ఆధునిక కవుల వరకు సుమారు 500 వర్ణచిత్రాలు వేసారు. వీరు జాతీయ స్థాయిలో ఎన్నో చిత్రకళా ప్రదర్శనలు, చిత్రకళా పోటీలలో పాల్గొని ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు, బహుమతులు, గౌరవ సత్కారాలు పొందారు. ఆయన వృత్తి రీత్యా చిత్రకారుడు కాకపోయినా ప్రవృత్తి రీత్యా కళాకారుడు. ఎందరి ప్రశంసలనో తన బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్నారు. తనదైన ఒక చిత్రశైలిని ఆయన సృష్టించుకున్నారు. అతి తక్కువ గీతలతో ఆయన గీసిన క్యారికేచర్ లాంటి బొమ్మలు తెలుగులో ఒక ప్రయోగం.

‘అతడు గీసిన రేఖ ఒక్కటే –
అది పదంగా మారి మాట్లాడుతుంది
రంగుగా మారి నవ్వుతుంది
నీడగా మారి ఏమారుస్తుంది
కాంతిగా మారి ముద్దాడుతుంది

ఒక రేఖ లోపల దాగిన దుఃఖం –
పదంగా పుట్టి కన్నీటి ధారవుతుంది
మరొక రేఖ లోపల దాగిన ఆనందం
రంగుగా పుట్టి వెలుగు చిమ్ముతుంది’

ఆయనలోని సృజనకారుడుకి నమస్కరిస్తున్నాను.

*

శ్రీనివాస్ గౌడ్

ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.

సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు