జీవితమా!
నీకు వేలవేల జోహార్లు
వెలకట్టలేనన్ని మప్పిదాలు
నిన్న మొన్నటి వరకు
నేనీ చరిత్ర తవ్విన పాత కుండల్లో
ఎవరివో ఎముకలుంటాయని
పాతిపెట్టిన ఆభరణాలుంటాయని
ఊహల నిచ్చెన మీద ఊగీసలాడేవాడిని
బహుశా అందరిదీ ఒకే చరిత్రయ్యుంటుందని
గుండె మైదానంలో అబద్ధపు జెండాలను ఎగరేసేవాడిని
తెలుసా నువ్వు నిజాన్ని తివాచీలా పరిచి
ఖననంతో అనార్య బోధ చేసుండకపోతే
మన ఇరు తీరాలనూ కలిపిన ఒక ద్రవిడ వంక
ఇంకా ఇలా నేల బోరియల్లో నిదరపోతుందని
నాకసలు తెలిసుండేదే కాదు.
ఈ మట్టి దుప్పటి కింద
మన మూలవాసులైన నాగులుంటారని ఇంకా అర్థమయ్యేదే కాదు.
ఇన్నాళ్లు ఈ నేలలో నల్ల విత్తనాల్లా మగ్గిపోయిన వాళ్ళు
ఏ చేతనమూ లేకుండా
సీమ చింతకాయల్లా ముడుచుకుపోయిన వాళ్ళు
ఇవాళ నల్లమట్టి వాసనలా దూసుకొస్తున్నారు
మనమెవరమో చెబుతూ గాలి దండోరా వేస్తున్నారు
ఇప్పుడు మనం ప్రేమతో వాళ్ళకు తాటి బూరలవుదాం
ఎత్తుకొచ్చిన వేట మాంసాన్నంతా
మునపటి మన కొండదేవతల ముందర పెట్టి
ఒకరికొకరం నల్ల రంగుని పూసుకుందాం
నచ్చిన ఈకలనీ, మెచ్చిన కొమ్ములనీ
ఏరి తెచ్చుకున్న పూసలనీ అందంగా అలంకరించుకుందాం
పాత జానపదాలన్నీ గుర్తుచేసుకొని
కల్లులో మునిగిన తుమ్మెదలా
నోటి డప్పుని మోగిస్తూ
గుండె గంటలు వాయించుకుందాం
ఇప్పుడు దిగుల్లేదు
ఇల్లంతా ఎర్రమన్నుతో అలికి
ఎండు తునకల తోరణాలు కట్టే తల్లులంతా
అంటూ ముట్టు లేకుండానే మనతో ఆడిపాడతారు
నల్ల చీమల వలయంలామారి
మన చుట్టూ ఆదిమ నృత్యాలు చేస్తారు
అప్పుడు మనం అమ్మతల్లిని గుర్తు చేసుకుందాం
మరిచిపోయిన మాతృస్వామ్యాన్ని తలుచుకుని
మళ్లీ పులకరించిపోదాం
ఇక మనకు ఏ యజ్ఞాలవసరమూ లేదు
అందులో ఏదీ పడేయనవసరమూ లేదు
మనం తినేదే మన దేవతలకూ పెట్టుకోవచ్చు
మన దేవతలకు పెట్టిందే
మళ్లీ మనం తినేయొచ్చు
ఇక మనకీ దేవుడికి మధ్య
ఏ మంత్ర తెరలూ ఉండవు
అప్పుడీ ద్రవిడ తటాకంలో మళ్లీ మనం
నల్ల కలువలై విరబూస్తాం
ఇంతకముందు మనల్ని దస్యులమన్న వాళ్లకు,
దయ్యాలమన్న వాళ్లకు
ఈ నేల దప్పికను
మన చెమటతో తీర్చిన కథలను చెప్పి
ఈ ద్రవిడ వంకలో
మనమే అసలైన మూలవాసులమని తెప్పలా తేలిపోదాం
మూసి ఉంచిన చరిత్ర రెప్పలను తెరచి
నల్ల ముత్యాలై మెరిసిపోదాం.
*








excellent