తిరిగిరాని బాల్యానికి ఒక నివాళి!

2026లో విడుదలైన భారతీయ మలయాళ భాషా సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం “బాలన్: ది బాయ్” (Balan: the boy). ఈ సినిమా 2026 జూన్ 19న మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోని డబ్బింగ్ వెర్షన్లలో, స్టాండర్డ్, EPIQ ఫార్మాట్లలో, థియేటర్లలో కూడా విడుదలైంది. ఈ చిత్ర దర్శకుడు చిదంబరం. కథా రచన ప్రముఖ రచయిత జితు మాధవన్ చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ వెంకట్ కె నారాయణ – థెస్పియన్ ఫిల్మ్స్ శైలజా దేశాయ్ సంయుక్తంగా ఎక్కడా రాజీ పడకుండా అతున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాని రూపొందించారు.  దీని నిడివి రెండు గంటల ఇరవై నిమిషాలు.

ప్రేమతో బంధించబడి, అబద్ధాలచే రక్షించబడి, విధిచే వేరు చేయబడిన ఒక చిన్నారి బాలుడు కల్లోలభరితమైన బాల్యాన్ని గడుపుతూ అదృశ్యమైన తన తల్లి కోసం వెతుకుతూ ఎదుగుతాడు. టీనేజ్ కి చేరుకున్న ఆ బాలుడే తమ గతం గురించిన నిజాన్ని, ముగింపును తెలుసుకోవడానికి చేసే అన్వేషణే ఈ చిత్ర కథాంశం!

తమది అని చెప్పుకోగలిగిన ఒక స్థిరమైన స్థలం, మనుగడ కోసం అన్వేషిస్తూ, ప్రపంచానికి దూరంగా తల దాచుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో, తమ గత జీవితపు చీకటి రహస్యాలను ఎదుర్కోవలసి వచ్చిన ఒక యువతి, ఆమె చిన్నారి కొడుకు కథను ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆధునిక భారతదేశ నేపథ్యంలో సాగే ఒక విశిష్టమైన మాతృత్వపు గాథను చెబుతూనే, ఒంటరి స్త్రీ నిరంతరం ప్రమాదంలో ఉండే ఒక భయానక పరిస్థితుల ప్రపంచాన్ని, ఆమె మానసిక సంఘర్షణను వివరిస్తుంది. ఇంత విశాలమైన  ప్రపంచంలో ఆమెను, ఆమె బిడ్డను ఆదుకునేవారెవరూ లేరు. తనను తానే రక్షించుకుంటూ, తామిద్దరికీ ఏది ఉత్తమమని భావిస్తుందో దానినే నిస్సంకోచంగా ఎంచుకుంటుంది. పైకి కనిపించని సామాజిక-రాజకీయ నియమాలు ఒక రకమైన బంధనాలుగా మారినప్పుడు, ఆమె తన కొడుకుతో కలిసి సంచారిగా జీవించాలని నిర్ణయించుకుంటుంది. జైలు నుంచి విడుదలయ్యాక జనారణ్యంలో మొదటి  కొన్ని నెలలను ఆమె ఎలా గడుపుతుందో గమనించినప్పుడు ఈ విషయం స్పష్టమవుతుంది. ఒక బ్యాగ్, కొడుకు చెయ్యి విడవని తల్లి, ఎడతెగని ప్రయాణం! జీవిక కోసం రకరకాల పనులు చేస్తూ కొడుకుని అపురూపంగా పెంచుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నంత కాలం, ప్రపంచాన్ని ఎదుర్కోగలమన్న ధీమాతో, నమ్మకంతో ఉంటారు!

ఆమె జైలులో ఉన్నప్పుడే తన కుమారుడు బాలన్ కు జన్మనిస్తుంది. వారి జైలు శిక్ష ముగిసిన వెంటనే,  ఒక వృత్తి నుండి మరొక వృత్తికి, వివిధ ప్రదేశాల మధ్య, ఒక మతం నుండి మరొక మతానికి తీసుకువెళ్లే అద్భుతమైన దృశ్యాల సమాహారం వస్తుంది. రకరకాల గుర్తింపులతో తమ జీవిత ప్రయాణాన్ని సాగిస్తుంటారు. పరిస్థితుల ప్రభావంతో, ఆయా సందర్భాలకు అనుగుణంగా మారాల్సిన అనివార్యత వారి జీవితాలను నిర్దేశిస్తుంది. ఏ క్షణం ఎలా డిమాండ్ చేస్తే, అలా మారి పోతారు. ఈ తల్లి-కొడుకుల ద్వయానికి ఒక స్థిరనివాసం, చేయడానికి ఒక పని,  సాధారణ జీవితం అనేది అసాధ్యంగా తోస్తుంది. ఎవరినీ నమ్మకూడదని తనలో తాను గుర్తుచేసుకుంటున్నప్పుడు ఆమెలో ఈ అశాంతి స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె చీకటి గతం చివరికి తమను వెంటాడు తుందేమోనన్న నిరంతర ఆందోళన ఉన్నప్పటికీ, తల్లి కొడుకులిద్దరూ అసత్యాల కథల స్ఫూర్తిని ఆవాహన చేసుకుంటూ వారి జీవితాలను  ఒక సాహసయాత్రలా నడిపిస్తుంటారు!

వారి పనితీరు చాలా సరళంగా ఉంటుంది. ఎటువంటి బంధాలు, బాధ్యతలకు కట్టుబడి లేనంత కాలం మాత్రమే ఒక చోట ఉంటారు. ఒక టీ దుకాణదారుడు తన కూతురిలాగా, మనవడిలా తనతో ఉండిపొమ్మని అడిగినప్పుడు, వెంటనే ఇందు అక్కడినుంచి కొడుకుతో పారిపోతుంది. తర్వాత ఒక మహిళ ఆమెకు వివాహ ప్రతిపాదన తీసుకువచ్చినప్పుడు, ఇక అక్కడ  ఉండకూడదను కుంటుంది. ఒకతను వచ్చి నిన్నూ, బాబునీ బాగా చూసుకుంటాను, నన్ను పెళ్ళి చేసుకోమంటాడు. మౌనంగా విని అక్కడనుంచి నిష్క్రమిస్తుంది! ప్రతి కొత్త ప్రాంతంలోనూ, వాళ్ళిద్దరూ పేర్లను, కొత్త గుర్తింపులను, సరికొత్త నేపథ్య కథలను సృష్టించుకుంటారు. టీ కొట్టులో పని చేస్తున్నప్పుడు వారి పేర్లు ఇందు-అభిజిత్ కుమార్, ఫ్యాక్టరీలో కూలీగా ఉన్నప్పుడు మేరీ-బన్నీ, గిరిజ అనే ఆమె ఇంట్లో హోమ్ మేకర్ గా ఉన్నప్పుడు షెర్లీ – వసుదేవ్.  ఈ ఇంట్లో ఒక బాబు యాక్సిడెంట్ లో చనిపోతాడు, ఆ బాబు పేరే తన కొడుక్కి పెడుతుంది. ఇవి సినిమాలో మనకు తెలిసిన తల్లీ కొడుకుల పేర్లు. నిజానికి వాళ్ళిద్దరి అసలు పేర్లు మనకి తెలియవు. తల్లి ప్రతి ప్రదేశంలోనూ ఒక కథ సృష్టించి కొడుక్కి చెవిలో చెప్తుంది. “అమ్మా, మన కొత్త కథ ఏమిటి? అందులో నా పేరేమిటి?” అని అడుగుతాడు చిన్నారి బాలన్. పసివయసు బాలుడైనా తల్లి చెప్పిన విషయాన్ని తు. చ. తప్పకుండా పాటిస్తాడు! పరిస్థితులు

డిమాండ్ చేసినప్పుడు ఎలా కప్పిపుచ్చాలో కూడా చిట్టి బాబుకి ఖచ్చితంగా తెలుసు!

ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో, ఒక పెద్దావిడ ఒంటరిగా తుపాకీతో అన్ని హంగులూ ఉన్న ఒక పెద్ద ఇంట్లో నివసిస్తూ ఉంటుంది.  ఒకప్పుడు తన భర్త వ్యతిరేకించిన తెల్లవాళ్ళ దేశంలో, తన కొడుకు స్థిరపడటం పట్ల మనస్తాపంతో ఉన్న ఆవిడ ఈ తల్లికొడుకుల పట్ల ఆదరణ చూపిస్తుంది. మొదటిసారిగా వారికి ఒక ఇల్లు, వాళ్ళ ప్రయాణానికి ఒక ముగింపు వచ్చినట్లు అనిపిస్తుంది. భర్త గల్ఫ్ కి వెళ్ళాడని అబద్ధం చెప్పి బాబుకి వసుదేవ్ పేరుతో ఒక ఐ డి సంపాదించి స్కూల్లో జాయిన్ చేస్తుంది. ప్రతిరోజూ ఒక ప్రదేశంలో బాబుని వదిలి, ఎంత ఆలస్యమైనా నేను వచ్చి తీసుకెళ్ళేవరకూ అక్కడే వేచి ఉండమని చెప్తుంది. ఆమెను అమ్మా అని, బాబు బామ్మా అని పిలుస్తూ ఇక్కడ కాస్త సౌఖ్యంగానే ఉంటారు. హమ్మయ్య అని అనుకునే లోపే, ఆమె గతం మళ్ళీ వెంటాడడం చూస్తాం!

ఒకరోజు ఎంత నిరీక్షించినా తల్లి రాదు. చిన్నారి బిక్క మొఖంతో అక్కడే ఉంటాడు. అంతేనా, ఎవరొచ్చి ఏమడిగినా స్థిరంగా, ఏమీ చెప్పకుండా, నోరిప్పకుండా అందర్నీ ముప్ప తిప్పలు పెట్టడం ప్రతి ఒక్కరూ వారి వారి కళ్ళతో చూసి తన్మయత్వం పొందాల్సిందే!

ఇక ఈ చిన్నారి బాలన్, అబ్బాస్ అనే అతని దగ్గర పెరిగి, పెద్దవాడై “మీ అమ్మని చూపిస్తానని చెప్పి”న అతని వల్ల కాదని  తేల్చుకుని, తల్లి కోసం అలమటిస్తూ, తానే వెతుక్కుంటూ బయలుదేరి, అనేక కష్టాలు పడి చివరికి తల్లిని చేరుకుంటాడు!

చిదంబరం దిగ్భ్రంతి గొలిపే దర్శకత్వం 

“మనుషులు పుట్టుకతోనే ఒక స్థిరమైన గుర్తింపుని కలిగి ఉండరని, తాము గడిపే జీవితం, ఎదుర్కొనే అనుభవాల ద్వారానే ఫలానావారుగా తమ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకుంటారు” అని జీన్-పాల్- సార్త్రే విశ్వసించాడు. ఈ ఆలోచన ఆధారంగా నాటకీయంగా, చెప్పే సర్వైవల్ డ్రామా “బాలన్ ది బాయ్”. ఇది అత్యంత చురుకైన, పదునైన, తెలివైన చలనచిత్ర నిర్మాణం!

సినిమా మొదలవడమే ఒక బొమ్మల కథనంతో ఒక అడవి, నిర్మానుష్యమైన ఒక ప్రదేశంలో ఒక చిన్న ఇల్లు, అందులో నివసించే ఒక అమ్మా, మధ్యలో ఒక బుజ్జి బాబు, ఒక నాన్నా ఉంటారు. నాన్న ఒకరోజు అడవికి వెళ్తే, ఒక ఏనుగు తన కాళ్ళ కింద తొక్కడం కనిపిస్తుంది. నాన్న చనిపోతాడు.  అమ్మా- బాబూ మిగులుతారు. ఆకలి తట్టుకోలేక వాళ్ళిద్దరూ బస్సులో నగరానికొస్తారు. ఇది తల్లి తన కొడుక్కి చెప్పిన కథ. ఇది పూర్తిగా నిజం కాకపోవచ్చు కూడా! ప్రారంభ సన్నివేశం నుండే, కెమెరా ఆ చిన్నారి బాలుడు గీసిన చిత్రాల గుండా కదులుతూ, క్రమంగా బాలుడు నివసించే జైలు ప్రపంచాన్ని చూపించే పనిని గొప్ప నైపుణ్యంతో, చిత్రీకరించిన ఈ సినిమా తన దృశ్య భాష ద్వారా  అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో తెరకు కట్టిపడేస్తుంది!

ముఖ్యంగా టైటిల్ పాత్రను ఎంతో సునాయాసంగా పోషించిన ముద్దులు మూట కట్టే బాలనటుడు అధిశేషన్ కె.ఆర్.నుండి అద్భుతమైన నటనను రాబట్టిన చిదంబరం ఎంతో ప్రశంసనీయులు! ఇది దర్శకుడు, నటుడు ఎంత చక్కగా కలిసి పనిచేశారో మనం చూడగలిగే ఒక చలనచిత్ర నిర్మాణ ఘట్టం!

తన బిడ్డను కాపాడుకోవడంలో ఒక తల్లి చూపే తీవ్రమైన సంరక్షణ చుట్టూ ఈ కథ అల్లుకొని ఉంటుంది. తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఒక తల్లి ఎంతటి సాహసానికైనా, ఎంతటి తీవ్రమైన చర్యకైనా ఎలా సిద్ధపడుతుందో తెలిపే ఒక ఆకట్టుకునే కథను చిదంబరం రూపొందించారు. ఒక ఇంటర్వ్యూలో “సినిమా మొత్తంలో మీకు ఏ సన్నివేశం ఇష్టం” అని యాంకర్ అడిగిన ప్రశ్నకు తుపాకీతో, కొడుకుతో పడుకున్న సీన్ అని చెప్పారు చిదంబరం.  ఆమె తన పక్కన లోడ్ చేసిన తుపాకీని ఉంచుకుంటుంది. అది ఒక ప్రకటన. వారు ఎంచుకున్న ఈ ప్రదేశంలోకి ఎవరికీ అనుమతి లేదు, ఏదైనా బాహ్య శక్తి ఈ శాంతిని భంగపరచడానికి ప్రయత్నిస్తే, దానికి తగిన పరిణామాలు ఉంటాయి అని తల్లి మాటలు సూచిస్తాయి!

ఇక్కడే భయపడిన బాలన్ “అమ్మా, బామ్మ, మనల్ని ఏమైనా చేస్తుందా? అని అడుగుతాడు. చెప్పలేం అని చెప్తుంది వాళ్ళమ్మ. “ఎవరైనా నిన్ను చంపకముందే నువ్వు వాళ్ళను చంపగలవా?” అని అడిగినప్పుడు, ఆమె ఏమాత్రం దాపరికాలు లేకుండా సూటిగా సమాధానం ఇస్తుంది. ఈ చిన్నోడు ఆమె దగ్గరకు పోయి “బామ్మా, మేము నిన్ను చంపేస్తాం” అంటాడు. నేను “మిమ్మల్ని కాల్చేస్తా” అంటుంది బామ్మ. “నువ్వు కాల్చక ముందే మేము టీలో విషం కలుపుతాం” నీకు తెలియదు కదా అని అంటాడు మళ్ళీ చాలా గడుసుగా. బాబుని స్కూల్లో జాయిన్ చేశాక, బామ్మకి వాళ్ళమీద నమ్మకం కలిగి, తర్వాత చాలా ప్రేమగా మారిపోతుంది. ఇల్లు మొత్తం వాడుకోమని తాను చనిపోతే ఆ ఇంటిముందే పాతి పెట్టి, అక్కడ ఒక అరటి మొక్క నాటమని చెప్తుంది. ఈ ముగ్గురి మధ్య సన్నివేశాలు, తల్లీకొడుకులు కొత్త ఇంట్లో ఎలా సర్దుకుపోయి, అనుబంధం పెంచుకుంటారో దృశ్యరూపంలో చాలా హృద్యంగా చిత్రీకరించారు. ఆమె చనిపోయాక కూడా మలయాళంలో “తక్కోల్” గీతం, అదే తెలుగులో అయితే, “ఆకాశంలో ఒక బామ్మా, చంద్రుడి లాంటి బామ్మా, బామ్మ కనులు చెమరిస్తే గగనం కూడా చెమరించులే” అనే పిల్లల పాట వీనుల విందుగా ఉంటుంది.

బామ్మగా నటించిన (డాలీ జూన్) ను ఎక్కడ, ఎలా సంపాదించారో గానీ ఆమె చిదంబరం గారికి దక్కిన  గొప్ప అదృష్టంగా

భావించాలి. సినిమాలో కొన్ని సన్నివేశాల్లోనే గానీ ఆమె కనిపించిన క్షణాలు జీవితంలో మర్చిపోలేనివి! తననీ, స్వాతంత్ర్య సమర యోధుడైన తన భర్త గురించీ మనసుని కదిలించే విషయాలు చెప్తుంది. తన అద్భుతమైన  నటనతో, ముఖ్యంగా తన కుటుంబం పట్ల ఆమెకున్న ద్వేషాన్ని ప్రదర్శించి, సన్నివేశాలను తనవైపు తిప్పుకుంటుంది. ఎన్నో సంగతులు చెప్పి ఇందులో సగం కట్టుకథలే అని హాయిగా నవ్వేస్తుంది! వారి మధ్య ఉన్న సీన్లు తక్కువే అయినా, గొప్ప ఆత్మీయతను తీసుకువచ్చినందుకు చిత్రనిర్మాత నిజంగా చాలా ప్రశంసనీయులు!

ఒక  ఒంటరి తల్లి అరుదైన జీవితపు ప్రవాహంలోకి నేరుగా ప్రేక్షకులను లీనం చేస్తారు. కథనంలోని సొగసు ఎంత బాగుంటుందంటే, ఒక వ్యక్తి తన బాల్యంలోని అత్యంత స్పష్టమైన, గుర్తుండిపోయే జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నట్లు, మనం వింటున్నట్లు అనిపిస్తుంది. చిన్నారి బాలన్  తాను మొదటిసారిగా చూస్తున్న ఆ నాలుగు కాళ్ల జీవి నిజంగా కుక్కేనా అని నిర్ధారించుకోవడానికి ప్రయత్నించే సన్నివేశం, ఈ దృశ్యీకరణ లోని చిరస్మరణీయమైన అంశాలలో ఒకటిగా నిలిచిపోతుంది!

ఈ చిత్రంలో ఖచ్చితంగా నిగూఢత, దాగి ఉన్న సత్యాలు, సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి. కానీ చిదంబరానికి ప్రేక్షకుల సినిమా అక్షరాస్యత మీద గట్టి విశ్వాసం ఉంది. ఓపెన్ ఎండెడ్ గా వదిలేస్తే వీక్షకులు వాటిని వాళ్ళ ఊహాశక్తి మేరకు అల్లుకుంటూ, విషయాలను వాళ్ళే అనుసంధానించుకోగలరని  నమ్ముతారు. ఆయన సమస్యలను ఎప్పుడూ పరిష్కరించాల్సిన చిక్కుముళ్లుగా చూడలేదు. ప్రతి భావోద్వేగాన్ని వివరించాలనే ప్రలోభం ఒక చిత్ర నిర్మాతగా ఆయనకి లేదు. వాళ్ళు ఎవరన్నది అసలు ప్రశ్నే కాదు. ఒంటరి తల్లీ-బిడ్డలకు ఎక్కడా, ఏదీ కూడా తమది అని చెప్పుకోగలిగే స్థిరమైన జీవితం లేకపోవడమేమిటి? అనేదే చిదంబరం చర్చకు పెట్టి, సమాజాన్ని నిలదీస్తున్న అసలైన ప్రశ్న!

టైటిల్ కార్డ్ కూడా విరిగినట్లుగా, “బాలన్” బొమ్మ పగుళ్లతో కనిపిస్తుంది. అది ఉద్దేశపూర్వకంగా చేసినా చేయకపోయినా, అది కథకు కేంద్రమైన బాలుడిని ప్రతిబింబిస్తుంది. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతూ గడిపిన జీవితం వల్ల ఆ బాలుడి స్వీయ భావన ముక్కలైపోయింది. భద్రత, స్థిరత్వం అనే భావనలు తాత్కాలికమైపోయాయి.  ఒక స్థిరమైన ఆశ్రయం అనేది అతనికి నిజంగా తెలియని విషయం. అయినప్పటికీ, ఈ సినిమాలోని భావోద్వేగ ప్రధానాంశం ఒక సరళమైన వైరుధ్యంలో ఇమిడి ఉంది. ఆ బాలుడికి తాను ఎవరో పూర్తిగా తెలియదు, అలాగే తన తల్లి ఎవరన్నదీ నిజంగా అతనికి తెలియదు. అవేవీ అతనికి ముఖ్యం కాదు. అతనికి తెలిసింది అమ్మ ఆప్యాయత,  అమ్మ ప్రేమ,  ఈ దుర్గమారణ్య ప్రపంచంలో అమ్మ కల్పించే భద్రత మాత్రమే!

పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన సన్నివేశాలు, ముఖ్యంగా జీన్ పాల్ లాల్ పోషించిన అహంకారపూరిత పోలీస్ పవిత్రన్ పాత్ర, బాలన్  అనుకోకుండా అతని వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలను ఎలా కదిలించాడనే విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అతనికి ద్రోహం జరిగిందనే భావన కలిగేలా చేసిన తీరును చక్కగా చిత్రీకరించారు.

ఈ చిత్రం ఒక నిశ్శబ్దమైన అశాంతి వాతావరణాన్ని సృష్టిస్తుంది.  ఇక్కడ ప్రతి సంభాషణ గతంతో నిండినట్లుగా అనిపిస్తుంది, ప్రతి జ్ఞాపకం ఒక కొత్త విషయాన్ని వెల్లడించే అవకాశాన్ని కలిగి ఉంటుంది. సినిమా 140 నిమిషాల నిడివిలో, ఈ విధానం అద్భుతంగా పనిచేసింది. సంభాషణలు చాలా తక్కువగా ఉండి దృశ్యమే ప్రధానంగా ఉంటుంది. ఇది ఒక మంచి సినిమా లక్షణం!

ఈ చిత్రంలోని పచ్చని ప్రకృతితో రమణీయంగా ఉన్న ప్రదేశాలు జనంతో నిండినట్లుగా, వాటిలో జనం గడిచిన జీవితాల ఆనవాళ్లను   మోస్తున్నట్లుగా అద్భుతంగా ఉంటాయి. ప్రతి లొకేషన్ ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేశారు.

సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్, సౌండ్ మొదలైన సాంకేతిక విభాగాలతో చిత్ర కథనాన్ని అద్భుతమైన అవగాహనతో సంయమనం చేశారు. అబ్బాస్ కథనంలోకి ప్రవేశించినప్పుడల్లా విజువల్ మూడ్ మారిపోతుంది. అబ్బాస్ కి సంబంధించిన కీలకమైన సీన్లు రాత్రిపూట చీకటిలోనూ, తల్లి కొడుకుల సీన్లు సూర్యకాంతిలోనూ చూపిస్తూ దృశ్యమాన వ్యత్యాసాన్ని సృష్టించడం ఆసక్తికరంగా ఉంటుంది.

నటీనటుల ఎంపిక ఎంతో అసాధారణంగా ఆలోచించి చేసినట్లు అనిపిస్తుంది. నటీ నటుల్ని పరిచయాలు, ప్రతిభల  ప్రాతిపదికన కాకుండా, ఈ  సినిమా కథానానికి ఆయా నటుల ముఖాలు సమకూర్చే ప్రత్యేకతను బట్టే వారిని ఎంపిక చేసినట్లు అనిపిస్తుంది. 700 మందిని ఇంటర్వ్యూ చేసి ఫర్జానా పాలతింగల్ ని ఎంచుకున్నట్లు చిదంబరం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు! అధిశేషన్, ముహమ్మద్ జీనాన్, డాలీ జూన్ లని  కూడా భలే సెలెక్ట్ చేశారు! వీళ్ళ కోసం సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా నటించారు.

చిదంబరం, రచయిత జితు మాధవన్ కలయికలో వచ్చిన మరో చిత్రం “మంజూమ్మెల్ బాయ్స్”కూడా నేటికీ ప్రసంశలందుకుంటుంది. అది సామూహిక భావోద్వేగాలను సమన్వయం చేయడంలో చిదంబరం సామర్థ్యాన్ని ప్రదర్శిస్తే, ఈ చిత్రం “బాలన్: ది బాయ్” ఒంటరిగా భావోద్వేగాలను ఎదుర్కోవడంలో ఆయనకున్న ఆసక్తిని  చూపిస్తుంది. ఈ చిత్రాలు పైకి పూర్తిగా భిన్నంగా కనిపించినా, చివరికి రెండూ కూడా తాము పూర్తిగా అర్ధం చేసుకోలేని పరిస్థితులను అనుభవించే వ్యక్తుల గురించే!

“బాలన్: ది బాయ్” చిత్ర ప్రత్యేకతలు

ఒక వినూత్నమైన ఆలోచన, బహుళ పొరల కథనంతో ఈ చిత్రం విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తన బిడ్డను పదేపదే వేరే చోటికి మార్చడానికి ఆ తల్లిని కచ్చితంగా ఏది ప్రేరేపిస్తుందో, ఆమె ప్రయాణానికి ఎప్పటికైనా ముగింపు ఉంటుందో లేదో అనే ఉత్కంఠే ఈ సినిమా మొత్తం కొనసాగుతూ  ప్రేక్షకులను కుర్చీ ముందుభాగంలో కూర్చోబెడుతుంది!

టీ కొట్టు యజమాని దగ్గరనుంచి వచ్చినప్పుడు బాలన్ అయోమయానికి గురై ఎందుకు వచ్చేశామని  అడుగుతాడు. “మనమేవరో మనకి మాత్రం తెలిస్తే చాలు, ఇంకెవరికీ తెలియకూడదు” అని చెప్తుంది. భవిష్యత్తుపై తల్లికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. తన చిన్నారి కొడుకు రాక్షసుడిలా కర్కోటకుడుగా గానీ, మనుషులకు దాసోహం చేసే బానిసగా గానీ పెరగడం ఆమెకు ఇష్టం లేదు!

ఒక ఫ్యాక్టరీలో కూలీగా (క్రిస్టియన్ మహిళ ఆహార్యంలో ఉంటుంది) పనిచేస్తున్నప్పుడు ఇందుని టీ కొట్టులో చూసిన గుర్తుతో ఒకతను పలకరించబోతాడు. అప్పుడు “మీరు నాకు తెలియదు” అంటుంది. నీ పేరేమిటి అంటే మేరీ అని చెప్తుంది. భర్త పేరు లూకా అనీ, కొడుకు పేరు బన్నీ అనీ చెప్తుంది. స్కూటర్ కలర్ అడిగితే తెలుపు అని చెప్తుంది.  అన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత అతను అపనమ్మకంగా ఇలా కాదు, అని బాబును తనవైపుకి తిప్పుకుని మచ్చిక చేసుకుంటూ, బుజ్జగింపుగా మాట్లాడుతూ ఇందుని అడిగిన వివరాలన్నీ అడుగుతాడు. ప్రేక్షకులతో పాటు దూరంగా నిలబడిన ఇందు కాస్త టెన్షన్ గా చూస్తూ ఉంటుంది. ఈ సన్నివేశం తల్లీ కొడుకులు ఎంత గట్టి హృదయ విదారకమైన అనుబంధంలో ఉన్నారో ప్రేక్షకులకు సూచిస్తుంది! వాళ్ళమ్మ చెప్పినట్లే తల్లి తండ్రి పేర్లు, స్కూటర్ కలర్ తో సహా తల్లి నోట్లో నుంచి ఊడిపడ్డట్లే సిసింద్రీ బాలన్ చెప్పి విజయం సాధిస్తాడు!

మొదట్లో, తల్లి వెళ్ళిన ప్రతిచోటా, బాబుకి అబద్ధాలు చెప్పడం, గతం గురించి కట్టుకథలు అల్లడం నేర్పిస్తుండడం చూసిన కొంతమంది ప్రేక్షకులు నైతిక కోణంలో విశ్లేషించే అవకాశముంది. ఆమె పశ్చాత్తాపం లేకుండా అబద్ధాలు చెబుతుంది. ఇలాంటి భావోద్వేగపరంగా స్థిరంగా లేని తల్లి పెంపకంలో పెరుగుతున్న ఆ బాలుడి గురించి, అలాగే పెద్దయ్యాక అతనిపై ఆమె బోధనలు చూపే ప్రభావం గురించి ఆందోళన చెందుతారు. కానీ మనం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్తున్నకొద్దీ, వారిద్దరినీ మరింత బాగా అర్థం చేసుకుంటున్న కొద్దీ, వారిలాంటి వారికి నైతికత అనేది ఒక అందుకోలేని బహు దూరపు స్వప్నంగా ఉందని తెలుస్తుంది. సామూహిక శ్రేయస్సు, ఏది ఒప్పు, ఏది తప్పు వంటి భావనల గురించి ఆలోచించగలిగేంత పరిపక్వత వాళ్ళకి ఇంకా రాలేదని, వాళ్ళు బతకడం కోసం (survival of the fittest) చేస్తున్న పోరాటంలో ఇంకా ప్రారంభదశ లోనే ఉన్నారని ప్రేక్షకులు గ్రహిస్తారు!

ఆ బాలుడికి తల్లి ఎప్పుడూ ఎవరినీ నమ్మకుండా నిలకడగా ఉండటం నేర్పింది కూడా ఈ “పాఠాలే” అయి ఉండాలి. ఈ బాలుడు అలవర్చుకున్న సహజాతాలు తర్వాతి దశలో అతనికి తోడ్పడటం మొదలవుతాయి. అప్పుడే మనం ఒక యువ నేరస్థుడిగా  బాలన్ ఆవిర్భావాన్ని చూస్తాం. కానీ ఇక్కడ కూడా, ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది, ఎందుకంటే అతనిని గానీ, అతని మార్గాలను గానీ అంచనా వేయడానికి సినిమా ఎప్పుడూ అనుమతించదు. ప్రాణాలతో బయటపడటానికి ఏది చేయాల్సి వచ్చినా చేసేలా అతనికి తల్లి ఇచ్చిన శిక్షణ ఉంది. ఎవరికైనా నమ్మకద్రోహం చేయాల్సి వచ్చినప్పటికీ, అతను సరిగ్గా అదే చేస్తూ మనకు కనిపిస్తాడు. తననెంతో ఇష్టపడి పెంచిన తండ్రి లాంటి అబ్బాస్ ని, గత్యంతరం లేని పరిస్థితుల్లో క్షమించమని అడుగుతూ, తల్లి ఎక్కడుందో తెలుసుకోవడానికి అతన్ని పోలీసులకి పట్టిస్తాడు బాలన్. ఇదే ఇంకేదైనా ఇతర చిత్రంలో అయితే, మనం ఒక క్రూరమైన నేరస్థుడి మూలాలున్న కథను చూస్తున్నాం అని అనుకుంటాం. కానీ బాలన్ ని చూస్తున్నప్పుడు మాత్రం ఇది ఒక సహానుభూతి గురించి నేర్చుకోవలసిన పాఠంగా అనిపించి పరవశం కలుగుతుంది!

షైజు ఖలీద్ ఈ చిత్రానికి ఒక గొప్ప సంపద్వంతమైన ఛాయాగ్రహణాన్ని అందించారు. చిత్రకళాత్మకమైన ఫ్రేమ్‌లు, క్లోజప్‌లు, విశాలమైన వెడల్పు షాట్‌లతో నిండి ఉంటాయి. అతని కెమెరా తరచుగా దూరం నుండి దృశ్యాలను గమనిస్తూ, నటులు తమ పరిసరాలలో ఒంటరిగా ఉన్నట్లు కనిపించేలా చేస్తుంది. వయనాడ్ స్వయంగా ఆ సినిమాలోని మానసిక స్థితికి ఒక ప్రతిబింబంగా మారుతుంది. ఆ ప్రాంతపు ప్రకృతిని దట్టమైన అడవులు, వంకర టింకర మార్గాలు, ఒంటరి గృహాలను దృశ్యీకరించి ఈ భౌగోళిక ప్రదేశం అలంకారప్రాయంగా కాకుండా, సహజంగా, అర్థవంతంగా కనిపించేలా చేశారు. ఒక  సుందరమైన దృశ్యం చూస్తున్నప్పుడే,  ప్రకృతిలోని భయానక నిశ్శబ్దాన్ని ఉపయోగించడం వంటి కెమెరా పనితనం మెచ్చుకోదగింది.

ఇక సంగీత దర్శకుడు సుషిన్ శ్యామ్ విషయానికొస్తే, సంగీతానికీ సినిమాలో ఆ సమయంలో ఉన్న వాతావరణానికీ మధ్య ఉన్న సంబంధాన్ని అర్ధం చేసుకోవడంలో ఈ కాలపు సంగీత దర్శకులలో ఆయన అగ్రగణ్యుడు. ఆ సంగీత రచన తన ఉనికిని గొప్ప హావభావాల ద్వారా చాటుకోదు. దానికి బదులుగా, ఇది ఒక సన్నివేశంలో అప్పటికే ఉన్న భావోద్వేగాలను నిశ్శబ్దంగా తీవ్రతరం చేస్తుంది. ఈ చిత్రంలోని అత్యంత శక్తిమంతమైన కొన్ని సన్నివేశాలు దృశ్యం, శబ్దం కలిసి పనిచేసే విధానం నుండే తమ ప్రభావాన్ని సాధిస్తాయి. కథ తన భావోద్వేగ పరాకాష్ఠకు చేరుకునే సమయానికి, సుషిన్ సంగీతం ఆ సినిమా భావోద్వేగపు అల్లికలో విడదీయలేని భాగంగా కలిసిపోతుంది. దీన్ని“నది ప్రవాహమై కలిసారిద్దరూ” అన్న పాటలో గమనించవచ్చు. ఈ విషయాన్ని చిదంబరం ఒక ఇంటర్వ్యూ లో సుషిన్ శ్యామ్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పారు!

చెల్లాచెదురుగా ఉన్న కథలోని చిన్న చిన్న ఆధారాలను అత్యంత అద్భుతమైన నైపుణ్యంతో ఒకచోట చేర్చి, ముగింపుని ఆకర్షణీయంగా రూపు కట్టినందుకు ఎడిటర్ వివేక్ హర్షన్‌కు సినీ లోకమంతా ప్రత్యేక ప్రశంసలు కురిపిస్తుంది.

ఈ కథనంలోని కీలకమైన విషయాలు

బామ్మ ఒకరోజు తన గురించి అనేక విషయాలు చెప్పాక, ఎంతసేపూ నేనేనా? నువ్వు కూడా ఆఖరికి ఒక కట్టు కథైనా చెప్పమని  షెర్లీని అడుగుతుంది. ఆ సందర్భంలో “ఒక రాణిని మోసం చేసి ఒక రాక్షసుడు అడవికి ఎత్తుకుపోతాడు. రాణిని లొంగదీసు కోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తాడు. రాణి తన శక్తికి మించి రాక్షసుణ్ణి ఎదిరిస్తుంది. ఆమె శక్తి సరిపోదు, చివరికి చేసేది లేక అతనికి దాసోహమంటుంది. ఒకరోజు తాను గర్భవతినని తెలుసుకుంటుంది. రాక్షసుణ్ణి చంపి గోతిలో పాతి పెట్టి బయట పడుతుంది.” అని చెప్తుంది. బిడ్డ రాక్షసుడిలా తయారావుతాడా లేక తనలా బానిసలా బతకవలసివస్తుందా అనే సందిగ్ధాల మధ్య నలిగిపోతున్న ఇందు జైలుకి వెళ్ళిన పరిస్థితులు, ఆమె ప్రవర్తనకు  గల  కారణం ప్రేక్షకులకు తెలుస్తుంది!

జైలులో ఉన్నప్పుడు అమ్మాయిలతో వేశ్యావాటిక నడిపే ఒక మహిళ(ఇందూని కూడా అలా వాడుకోవాలని చూస్తుంది)  అమ్మడూ, అని పిలుస్తూ, బామ్మ ఇంటికి వచ్చి, “ఇంట్లో ఎవరూ లేరు, చంపేసి పాతిపెట్టావా?” అదే నీ స్టైల్  కదా అంటుంది. ఈ విధంగా పొరలు పొరలుగా విషయాన్ని అల్లుకుంటూ పోతాడు దర్శకుడు. అయినా తల్లి పాత్ర మీద మనకు కోపం రాదు. ఆమెను ఒకచోటయినా సౌఖ్యంగా బతకనివ్వని దుర్మార్గపు ప్రపంచమే కళ్ళకు కడుతుంది!

ఈ విధంగా చిదంబరం, జితు మాధవన్ లు  సమాచారాన్ని దాచిపెడుతూ, కథానాయకుడైన బాలుడి అస్థిరతలోకి ప్రేక్షకులను పదేపదే తీసుకువెళతారు. వివరణాత్మకమైన సంక్షిప్త మార్గాల ద్వారా కాకుండా, విషయాలు సహజంగానే వెల్లడయ్యేలా చూస్తారు!

పాత్రల స్వభావాలను ఆవాహన చేసుకున్న నటీ నటులు  

ఈ హృద్యమైన చిత్రానికి బాలన్ గా అధిశేషన్ కె. ఆర్(adhiseshan k. R), తల్లిగా ఫర్జానా పలతింగల్ (Farzana Palathingal), టీనేజి బాలన్ గా ముహమ్మద్ జినాన్ (Muhammad Zinaan) ప్రధాన పాత్రలు పోషించి ప్రాణం పోశారు.

పసివాడైన అధిశేషన్ కే ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా మొత్తానికి వెన్నెముకగా నిలిచే అద్భుతమైన నటనను కనబరిచాడు. దాదాపు ప్రతి ప్రధాన సన్నివేశంలోనూ కనిపిస్తూ, అతను అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో, భావోద్వేగపరమైన తెలివితేటలతో కథనాన్ని ముందుకు నడిపించాడు. తన వయసుకు మించిన అనుభవాలను ఎదుర్కోవలసి వచ్చిన ఒక బాలుడి గందరగోళాన్ని, దృఢత్వాన్ని, మొండి పట్టుదలను, ఆశాభావాలను అతను అద్భుతంగా పట్టుకున్నాడు. ఆ నటన ఎప్పుడూ సానుభూతిని పొందడానికి ప్రయత్నించదు, అందువల్ల అది మరింత హృదయాన్ని కదిలిస్తుంది!

బాలన్ తల్లిగా ఫర్జానా పలతింగల్ తన పాత్రలోని రహస్యాన్ని, కష్టాలను వ్యక్తపరచడంలో, అత్యంత కీలకమైన భావోద్వేగాలను పండించడంలో హుందాతనంతో కూడిన నటనతో ఆకర్షిస్తుంది. ఈ పాత్రలో ఆమె దృఢత్వాన్ని, సున్నితత్వాన్ని, బలాన్ని, బాలహీనతని ఇలా వైరుధ్యాలను ఒకే సన్నివేశంలో ప్రదర్శిస్తుంది.  పరస్పర విరుద్ధమైన భావాలను ఆమె ఎంతో సునాయాసంగా పోషించింది. మాతృత్వాన్ని ఆదర్శీకరించడానికి నిరాకరించడమే ఆమె నటనను చిరస్మరణీయంగా నిలుపుతుంది. ఇది కేవలం త్యాగంతో నిర్వచించబడిన ఒక దేవతామూర్తి కథ కాదు. ఫర్జానాని ఒక సహజమైన మానవత్వం ఉట్టిపడే పాత్రగా సృష్టించారు. ఇది సినిమాకు కేంద్రబిందువైన భావోద్వేగ బంధాన్ని మరింత శక్తిమంతంగా ప్రతిధ్వనించేలా చేస్తుంది. ఫర్జానా, బిగువైన శరీర భాషలోనూ, గుండ్రని, పట్టుదలగల కళ్ళలోనూ వ్యక్తమయ్యే ఆమె ఉనికిని చూడటం ఒక కొత్త అనుభూతి నిస్తుంది. ఆమె చూపు ఒక కత్తిలా తెరను చీల్చుతుంది. చాలా ఫ్రేములలో ఆమె తరచుగా హడావిడిగా ఏదో ఒక పనిలో ఉండి కనిపిస్తుంది. భావాలను వ్యక్తపరచడానికి పరిమితమైన అవకాశాలే ఉన్నప్పటికీ, ఆ పాత్రకు ఆమె తన అభినయంతో జీవం పోసింది. ఆమె ఆందోళన, తక్షణ స్పందన, తెలివితేటలు తెరను ఆత్మవిశ్వాసంతో నింపుతాయి. ఏది ఏమైనప్పటికీ, ఆమె తన కొడుకుతో కలిసి బయటపడటానికి ఒక మార్గాన్ని కనుగొంటుందని మనకు తెలుసు. రెండవ భాగంలో సినిమా ఆమెను వదిలి వేరొక తీరానికి వెళ్ళినప్పుడు, ఆమె లేని లోటు తెరను ఆవహిస్తుంది!

తల్లి – బిడ్డల మధ్య ఉన్న శారీరక పోలిక, ముఖ్యంగా వారి కళ్ళలో కనిపించే పోలిక, కథనంలో ఒక ముఖ్యమైన సాధనంగా మారుతుంది. ఇద్దరూ ఒకే విధమైన భయం, అలసట, ఆశ, ప్రేమ మొదలైన ఒకే రకమైన భావాల మిశ్రమాన్ని కలిగి ఉండటం వల్ల, వారి బందాన్ని తక్షణమే ప్రేక్షకులు నమ్మేటట్లుగా ఉంటుంది.

ద్వితీయార్థంలో యువ నటుడు ముహమ్మద్ జినాన్ పీలగా, సరైన పోషణ లేనట్లుగా కనిపిస్తూ, తల్లి కోసం నిరంతరం ఆరాటపడేవాడిగా మాటి మాటికీ  కళ్ళలో నీళ్ళూరుతుండగా సమర్ధవంతంగా నటించి  అత్యుత్తమంగా నిలిచాడు!

డాలీ జూన్ (Dolly June) మరో ప్రశస్తమైన నటనతో  ప్రత్యేకమైన వ్యక్తిలా పాఠకుల మీద చెరగని ముద్ర వేస్తూ ఆమెకు ఇంకా ఎక్కువ సన్నివేశాలు, స్క్రీన్ సమయం ఉండి ఉంటే బాగుండేదని  అనిపిస్తుంది. ఒంటరి ఇంట్లోకి చొరబడే పిల్లల్ని భయపెట్టడానికి ఉత్తుత్తి తుపాకీ పేల్చేస్తూ ఉంటుంది బామ్మ. వచ్చీరాగానే ఈ తల్లీ కొడుకుల వైపు కూడా తుపాకీ పేల్చి హేండ్సప్ చేయిస్తుంది. అలాగని నిజమైన గుళ్ళు కూడా ఉంటాయి. అది సినిమాలో చూసి తీరాల్సిందే!

ఎస్ ఐ గా జీన్ పాల్ లాల్ (Jean Pal Lal), తన పాత్రకు ఒక ప్రశాంతమైన హుందాతనాన్ని తీసుకువచ్చారు, పరిమిత స్క్రీన్ టైమ్‌లోనే సూక్ష్మమైన భావాలను ఆవిష్కరించారు. అతని సంభాషణల ఉచ్చారణ, నిరాడంబరమైన హుందాతనం అసలు నటనే కాదన్నట్లు ఆయన ఉనికి తెరపై ఏమాత్రం కృత్రిమంగా అనిపించదు! విలన్ అయినప్పటికీ, ఆ పాత్రకు అతను చక్కగా సరిపోయాడు. అలాగే అతని సహోద్యోగి, ప్రేమికురాలిగా నటించిన సాండ్రా చంద్రన్ (Sandra Chandran), అతనిపై అధికారిగా నటించిన దర్శకుడు గిరీష్ ఏడీ (Girish A. D.) కూడా తమ తమ పాత్రలను చక్కగా పోషించి మెప్పించారు.

అబ్బాస్ గా టోవినో థామస్ (Tovino Thomas) ప్రశంసనీయమైన సంయమనంతో ప్రత్యేకమైన నటనతో పాత్రలో లీనమైపోయాడు! అబ్బాస్ ని ఒక క్లిష్ట సమయంలో బుజ్జి బాలన్ ఎలా ఆదుకున్నాడో, ఆ తర్వాత అబ్బాస్ ఒక తండ్రిలా బాలన్ ని ఎంత  అపురూపంగా చూసుకున్నాడో వాళ్ళిద్దరి అనుబంధం ద్వారా తెలుస్తుంది. అబ్బాస్ పాత్రలో అస్థిరత కూడా ఆ పాత్ర పట్ల మరింత ఆసక్తిని పెంచుతుంది. ఒక నేరస్థుడిగా పరిచయం చేయబడిన అబ్బాస్,  ప్రేక్షకులు వెంటనే సానుభూతి చూపగలిగే పాత్ర కాదు. అయినప్పటికీ, కథ సాగేకొద్దీ, ఈ చిత్రం లోని పొరలు తెలుస్తున్న కొద్దీ ప్రేక్షకులు అతన్ని ద్వేషించలేరు, విస్మరించలేరు!

తల్లిని తన వలలో వేసుకోవాలని ఆరాటపడే ఒక వ్యభిచార గృహ నిర్వాహకురాలి పాత్రలో బీనా ఆంటోనీ (Beena Antony) కూడా   తన నటనకు తగినట్లుగా నిందార్హంగా ఉంది.

విమర్శకుల స్పందన 

‘ది ఇండియన్ ఎక్స్‌ ప్రెస్’ కు చెందిన ఆనంద్ సురేష్ ఈ సర్వైవల్ డ్రామా “పూర్తిగా ఫర్జానా పలతింగల్” దేనని అన్నారు.

‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’కు చెందిన అన్నా మాథ్యూస్ అధిశేషన్ కె. ఆర్. నటనను ప్రశంసించారు!

‘ది న్యూ ఇండియన్ ఎక్సప్రెస్‌’ కు చెందిన విగ్నేష్ మధు “మాతృత్వానికి అసాధారణమైన రీతిలో హృదయానికి హత్తుకునే నివాళి” గా అభివర్ణించారు. ఆయన ఫర్జానా పాలతింగల్ నటనను ప్రశంసించడమే కాకుండా, చిదంబరం గత చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’తో పోలిస్తే ఈ చిత్రం పరిధి పరంగా చిన్నదైనప్పటికీ, “అత్యంత పెద్ద హృదయాన్ని” కలిగి ఉందని రాశారు.

భారతీయ సినీ దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ మలయాళ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని .. ఒక శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకుంటుందని ప్రశంసల జల్లు కురిపించారు. గత రెండేళ్ళ కాలంలో తాను చూసిన అత్యంత ప్రతిభావంతమైన, అద్భుతమైన చిత్రం ఇదొక్కటేనని ఆయన కొనియాడారు!

ఈ సినిమా హృదయాన్ని కదిలించే ఒక రకమైన విషాదంతో, లోతైన భావనతో నిండి ఉంటుంది. సినిమా పూర్తయిన తర్వాత కూడా మనల్ని ఆలోచింపజేస్తుంది! చుట్టూ రోజూ ఒంటరి తల్లుల వేదనలను చూస్తున్నందుకు నాకీ సినిమా విపరీతంగా నచ్చింది. ఇలాంటి ఒక కలవరపెట్టే ఇతివృత్తంతో, ప్రేక్షకులను చైతన్యం చేస్తున్న చిదంబరం బృందానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలనిపించింది.

బాల నటులిద్దరూ అద్భుతమైన సహజత్వంతో, విశేషమైన ప్రామాణికతతో సినిమాను ముందుకు నడిపించి, గందరగోళం, భయం, బిగి సడలని ఉత్సుకత, ఆప్యాయతలతో  ప్రతి క్షణాన్ని మనం అనుభూతి చెందేలా అమోఘమైనశక్తితో వేరే లెవెల్ కి తీసుకెళ్ళారు!

దర్శకుడి ఇంటర్వ్యూలో అధిశేషన్ కుర్చీలో ఎంత బుజ్జిగా కనిపించాడో, పసివాడు అంత భారమైన నటనని ఎలా చేశాడోనని చాలా ఆశ్చర్యం కలుగుతుంది. “నీ చెయ్యి అదే పనిగా పట్టుకోవడంతో నాచేయి నొప్పి వస్తుంది. కొంతసేపు నువ్వు పట్టుకోమంటే బాబు పట్టుకున్నాడు” అని ఫర్జానా చెప్పింది. సినిమాలో తల్లి బిడ్డలు ఎప్పుడూ చేతులు వదలరు!

కొన్ని సన్నివేశాల్లో హాస్యభరితమైన ఆకర్షణను జోడించిన ఆ చిన్నారి బాల నటుడి కోసం ఈ చిత్రాన్ని తప్పకుండా చూడొచ్చు.

నేను థియేటర్ లోనూ, ఓటీటీలో కూడా చూశాను. Zee 5 లో ఉంది. వీలైన వాళ్ళందర్నీ చూడమని  విజ్ఞప్తి చేస్తున్నా.

అవార్డు

థియేటర్లలో విడుదలకు ముందే, 2026 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ‘మార్షే డు ఫిల్మ్’ (Marché du Film) విభాగంలో “బాలన్: ది బాయ్”  చిత్రం విక్రయించబడింది.

విడుదలైన తర్వాత, ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుండి అనేక ప్రశంసలు అందుకుంటుంది.

 

శివలక్ష్మి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.