“ఏ కథ అయినా మనసుకి దగ్గరగా మనసుకి దగ్గరగా ఎప్పుడు వస్తుంది? ఆ కథలో మనం కనిపించినప్పుడు”( కథా సమయం, పుట.7)
ఉమా! అని నేను ప్రేమగా పిలిస్తే పలికేమిత్రుడు ఆర్ ఎం ఉమామహేశ్వరరావు. ఆయన నూనూగు మీసాల నూత్న యవ్వనం నుండి నాకు స్నేహితుడు. ఎక్కువ తెలిసి తక్కువ మాట్లాడే సుగుణశీలుడు. ఎక్కువ చదివి మితంగా రాయడం ఆయన అలవాటు. ఆయన ప్రధానంగా పాత్రికేయుడు. పఠన, దృశ్య మాధ్యమాలలో చాలా కాలం పని చేశారు. కొన్ని కథలు కూడా రాశారు. చాలామంది కథా రచయితలతో ఆయనకు స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఆయన రాసిన విమర్శ పుస్తకం పేరు “కథా సమయం”.
చదవడం ఆనందం. రాయడం ఒక హింస” అన్నది ఆయన అభిప్రాయం. అయినాకథా విమర్శ రాశారు సారంగ వెబ్ పత్రికలో తనకు నచ్చిన కథలలో ఒక్కొక్క కథ మీద ఒక్కొక్క వ్యాసం రాసి వాటిని “కథా సమయం” పేరుతో ప్రచురించారు. అందులో 28 కథల మీద 28 వ్యాసాలు ఉన్నాయి. ఆర్ ఎం ఉమామహేశ్వరరావు కథావిమర్శ తెలుగు వారికందరికీ పరిచయమైన, అలవాటైన విమర్శ కాదు.
ఆయనది ఒక విలక్షణమైన పద్ధతి. కథ వివరించడానికి ముందో, కథను వివరిస్తూనో, కథా వివరణను ముగిస్తునో ఆ కథలో తనను చూసుకోవడం, ఆ కథను చదివి తాను ఎలా ప్రభావితరయ్యాడోచెప్పడం, ఆ కథలో తనకు తెలిసిన సమాజం ఎలా కనిపిస్తుందో చప్పడం ఆయన పద్ధతి.మధ్య మధ్యలో సమాజం గురించి, కథల గురించి శక్తివంతమైన అభిప్రాయాలు చెబుతారు. తనకు నచ్చిన కథలనే విమర్శిస్తారు గనక ఆయన విమర్శలో ఒక తాదాత్మ్య గుణం కనిపిస్తుంది.ఒకటి అరా కథలలో తప్ప తక్కిన కథల చర్చలలో ఆయన కథకులతో మమేకం అయ్యారు. ఆయన విమర్శలో తాదాత్మ్యం చుట్టూ ఆమోదం,అనుభూతి, తృప్తి వంటి అనుకూల అంశాలు ఆవరించి ఉంటాయి.
ఆర్ఎం విమర్శలో వేమన పద్యాలలోని ఆశుగుణం, అలవోకతనం దాగి ఉన్నాయి. అమాయకంగా కనిపించే ఆర్ ఎం విమర్శలో ఒక గొప్ప విమర్శ కర్తవ్యం దాగి ఉంది. అదేమిటంటే సాహిత్యాన్ని ప్రజల వద్దకు ప్రజలను సాహిత్యం వద్దకు చేరవేయడమే సాహిత్య విమర్శ కర్తవ్యం అన్న త్రిపురనేని మధుసూదన రావుగారు చెప్పిన మాటలు ఆర్ ఎం విమర్శలో ప్రతిధ్వనిస్తాయి. ఫలానా కథ నాకు ఇలా అనిపించింది, మీరు కూడా చదవండి అని పాఠకులను ప్రోత్సహిస్తున్నట్టుగా ఆయన విమర్శ ఉంటుంది.
తాను ఏదో అన్వేషిస్తూ ఉంటే అది తాను చదివిన కథలో దొరికినట్లు, తనకు ఏదో వెలితి ఉంటే అది తాను చదివిన కథద్వారి తీరినట్లు చెప్పే పద్ధతి చాలా కొత్తగా ఉంది. కథలో నుంచి తన ప్రపంచంలోకి, తన ప్రపంచంలో నుంచి కథలోకి పయనించడం ఆర్ ఎం విమర్శలో ప్రధానంగా కనిపించే లక్షణం. “రంగు వెలిసిన రాజుగారి మేడ”( మెహర్) కథలో “చంగన్న చెప్పే కథల్లో పాత్రలన్నీ మేమే. మా అమ్మలే రాణులు, మా నాయనలే యువరాజులు”అన్నారు (పుట 11)” ఫాతిమా”( విజయ్ కుమార్) కథలోని “నెల్లూరు జిల్లా దక్షిణ ప్రాంత జీవిత వివరాలు నాలోకి ప్రవహించి బాల్య జ్ఞాపకాలను తట్టి లేపాయి”అంటారు( పు ట.38). “దేవుడమ్మ”( ఝాన్సీ పాపుదేశి) కథ నలభై ఏళ్ళకు ముందు వచ్చుంటే మా బంధువుల అమ్మాయి ఈ పొద్దుటికి ప్రాణాలతో మిగిలి ఉండేది కదా!” (పుట 64 )అంటారు.
తన విమర్శ పద్ధతిలోని ఈ ప్రధానమైన అంశాన్ని ఆయనసూత్రీకరించుకున్నారు కూడా.” కొన్ని కథలు చదువుతున్నప్పుడు మన అనుభవంలోని కొన్ని సంఘటనలు గుర్తుకొస్తాయి . మనల్ని లేదా మనకు దగ్గర వారిని కథల్లోని పాత్రలతో పోల్చుకుంటాం.”( పుట 80) అన్నారు. సాహిత్యంలోనూ సాహిత్య విమర్శలోనూ కొందరు జ్ఞాత శిల్పులు ఉంటారు. అంటే తాము చేసేదంతా తెలిసి చేసేవారు. ఆర్ఎం అలవోక విమర్శక శిల్పిగా కనిపించే జ్ఞాత విమర్శాశిల్పి. లేకపోతే “సందల్ ఖోడ్ “(అక్కంపేట ఇబ్రహీం) కథలో ఇబ్రహీం వాళ్ళ అమ్మలో నాకు మా అమ్మే కనిపించింది (పుట.86) అనరు.
త్రిపురనేని మధుసూదన రావు గారు “విమర్శకులు సాహిత్యాన్ని ప్రేమించాలి. అది మూఢభక్తి కాకూడదు. రచయితలను గౌరవించాలి. అది అహేతుకం కారాదు” అన్నారు. ఉమామహేశ్వరరావు విమర్శకుడిగా కాన్షియస్ గా ఉంటూనే పారవశ్యంలోకి వెళ్తారు. “రంగు వెలసిన రాజుగారి మేడ కథ” ఒళ్ళూ, పయ్యీ మైమరపించిన కథ. ఒకే ఒక్క కథ మెహర్ భక్తుడిగా నన్ను మార్చేసిన మాయ కథ.” అన్నారు (పుట 11) ఈ పారవశ్యం విమర్శకులకు ఉండకూడదు. అయినా ఆయన పారవశ్యం ఆ కథ శక్తిని ధ్వనిస్తున్నది.
కథా రచనలో రెడ్డకొట్టుడు పద్ధతిని ఉమామహేశ్వరరావు ఆమోదించరు. అందువలన ఆయన నిరంతరం తాను చదివిన కథలలోని ప్రత్యేకతను, విభిన్నతను, నూతనత్వాన్ని గుర్తించు చెబుతూ ఉంటారు. “పురుడు”( రమేష్ కార్తీక్ నాయక్) కథ “తెలుగు కథకు తండా పరిమళాలను అద్దిన కథ” అంటూ ,సూర్యుడిని “గుండ్రంగా మర్రికాయలా మెరుస్తున్నాడని, చీకటిని “ఆకాశంలో నుండి నల్ల చీమల్లా దిగుతున్నదనివర్ణించడం తండా బిడ్డ రమేష్ నాయక్ కు మాత్రమే సాధ్యమవుతుంది” అన్నారు( పుట 184)సంచార అర్ధసంచార తెగల గురించి సాహిత్యం వచ్చినా, ఆ తెగలనుంచి కథా సాహిత్యం రావడం తెలుగు సాహిత్యంలోని ఖాళీని పూరిస్తున్నది అని అభిప్రాయపడ్డారు.
కథను వ్యాఖ్యానిస్తూ కథాంశాన్ని సామాజిక వాస్తవి కతకు అనుసంధానం చేయటం ఉమామహేశ్వరరావు విమర్శ పద్ధతులలో ఒకటి. “మూగబోయిన శబ్దం” (అనసూయ) కథను పరామర్శిస్తూ కోయ జాతిలోకి మతం ప్రవేశించి చేసిన విధ్వంసాన్ని వ్యాఖ్యానిస్తూ, “మతమేలేని కోయజాతినే వింగేసింది మతం. మతం ఏదైనా మింగడమే దాని లక్ష్యం”( పుట 102) అని ఇచ్చిన స్పష్టత పాఠకులను ఆలోచనలో పడేస్తుంది. “ఒక పారో కథ”(అనురాధ) ను పరిచయం చేయడానికి ముందే “ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామిక దేశంగా మనకు మనం గొప్పలు చెప్పుకునే భారతదేశం నిజస్వరూపం తెలియాలంటే జైలుకు వెళ్లాల్సిందే” (పుట. 106) అని ప్రకటించారు. ఇది పాఠకులను ఆశ్చర్యపరుస్తూ కథలోకి నడిపిస్తుంది.” ఎర్ర పుంజు”( సాంబయ్య) కథనంతా వివరించి,” పైకి వృత్తుల్లా కనిపించే కుల వ్యవస్థ అంతరాల వికృత రూపాన్ని “ఎర్ర పుంజు” కథ అంతర్లీనంగా వెల్లడిస్తుంది” అని చెప్పి ఆ వ్యవస్థ నగరాలలో వర్ధిల్లుతూ ఉన్నదని పేర్కొన్నారు.( పుట.198)
ఒక రచనను చదువుతూ ఉంటే మరొక రచన లేదా మరొక సామాజిక సంఘటన, సందర్భం గుర్తుకు రావడం ప్రపంచ సాహిత్య విమర్శలో అరుదుగా నైనా ఉండే అంశం . చేరా వంటివాళ్ళు విమర్శలో ఈ లక్షణం బాగా కనిపిస్తుంది. ఇది విమర్శకుల అధ్యయన విస్తృతిని తెలియజేస్తుంది. అనుభవ సాంద్రతను సూచిస్తుంది . ఉమామహేశ్వరరావు విమర్శలో ఈ ధోరణి విరివిగా కనిపిస్తుంది. “దేవుడమ్మ”( ఝాన్సీ) కథను చదువుతున్నప్పుడు వాళ్ళ బంధువుల అమ్మాయి గుర్తుకు వచ్చింది .(పుట 62)” కాంత పున్నమి వెన్నెల ” కథ ఉప్పల లక్ష్మణరావు” గెరిల్లా” కథకు అజ్ఞాత సూరీడు “విప్లవలో మాతృత్వం” కథకు కొనసాగింపుగా గుర్తించారు .( పుట.174 )
“విరాటపర్వం” సినిమా చూస్తుంటే “ఇద్దరు శస్త్రకారులు” కథ రాసిన షహీదా గుర్తుకు వచ్చింది” అన్నారు( పుట.192 )”శోకం ఒక పరిశీలన” (పూర్ణిమ) కథ చదివినప్పుడు విశాఖలో రోడ్లమీద పెడరెక్కలు విరిచి కట్టిపడేసిన డాక్టర్ సుధాకర్ , ఇంటింటి తలుపు తట్టిన ఉజ్జయిని బాలిక, తన ఊళ్లో రెండు రూపాయలకే గుడిసె తడికె తెరిచి కుర్రవాళ్ళను లోపలికి తీసుకుపోయే యానాది చెంగమ్మ కూతురు, డాక్టర్ వి చంద్రశేఖర రావు కథల్లోని మోహన సుందరం గుర్తుకొచ్చారు అన్నారు ఉమామహేశ్వరరావు.(పుట157) సమాజాన్ని, సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసిన విమర్శకులకు ఇలా గుర్తుకు రావడం భవిష్యత్తు విమర్శకులకు ఒక మంచి అనుభవంగా కనిపిస్తుంది . విమర్శకులు ఇవి చెప్పడం వలన ప్రయోజనం ఏమిటంటే పాఠకులను ఆ గుర్తుకు వచ్చిన రచనలను చదవడానికి ప్రోత్సహించడం. సాహిత్య విమర్శ పాఠకులను సాహిత్య పఠనానికి ప్రోత్సహించడం దాని ప్రయోజనం అని డాక్టర్ సర్దేశాయి తిరుమల రావు గారు అన్నారు. ఉమామహేశ్వరరావు కథల విమర్శ చదివిన పాఠకులకు అనేక ఇతర కథలను చదవాలన్న ఆసక్తి కలిగిస్తుంది.”.
“కదిలేది కదిలించేది “నవకవనం అన్నారు శ్రీశ్రీ. కథ చదవకముందు ఒకరకంగా ఉన్న మనిషి కథ చదివి మరొక రకం మనుషిగా మారితే అది గొప్ప కథ అన్నారు కొడవటికంటి కుటుంబరావు గారు. కథలు చదివి కదిలిపోయే, చెలించిపోయే గుణం ఉమామహేశ్వరరావులో ఉంది. అది బలంగా కూడా ఉంది. “సందల్ ఖోడ్”( ఇబ్రహీం) కథ చదువుతున్నంతసేపు ఒక దుఃఖపు తెర నా కళ్ళకు అడ్డుపడుతూనే ఉంది. “మునిరాజ మహేశ్వరం”( మనోహర్)కథను కథగా మలిచి నా ముందు పెట్టినప్పుడు పొత్తిళ్ల బిడ్డను దోసెట్లోకి తీసుకున్న సంబరం కలిగింది నాకు. (పుట120 ) “ఓబుల్ రెడ్డి ఎద్దులు”( వివేక్ ) కథ ఇటీవల నా మనసును తాకిన తాజా పరిమళం ఈ కథ. (పుట 132) వంటి వ్యాఖ్యలు విమర్శకుని గుండె తడిని పట్టిచూపుతున్నాయి .
కథను గురించి కథారచయితలకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అలాగే కథా విమర్శకులకు కూడా కొన్ని విలువైన అభిప్రాయాలు ఉంటాయి. విమర్శ చేస్తున్న సమయంలో విమర్శకులు వాటిని వ్యక్తం చేస్తారు. ఉమామహేశ్వరరావు కథను గురించి విలువైన అభిప్రాయాలు చెప్పారు 1.అవసరమే కదా రూప శిల్పాన్ని నిర్దేశిస్తుంది ( పుట.7).
2.యథాతథ చిత్రణ మాత్రమే కథ కాదు, కథను మలచుకోవాలి. మలచుకోవడంలో మెలకువ చూపాలి (పుట 19)
3.రచయిత కాలంతోపాటు కలగలిసిపోయి ప్రవహించగలగాలి.( పుట.50)
4.రాయడం కళ అయినట్లే, చదవడమూ ఒక కళే. ఆ కళను నేర్పిస్తాయి కొన్ని కథలు.( పుట 190)
ఒక రచననో ఒక రచయితనో విమర్శకు తీసుకున్నప్పుడు విమర్శకులు ఆ రచనను ఆ రచయితను నిర్వచించాలి. మదింపు చేయాలి. విలువ కట్టాలి. తీర్పునివ్వాలి. ఇవేవీ లేకుండా వాచాలత్వం ప్రదర్శిస్తేనో, మూగనోము పట్టితేనో విమర్శ విఫలమైనట్లే. ఉమామహేశ్వరరావు ఎప్పటికప్పుడు తన విమర్శ నాటకాన్ని పాఠకులకు నిర్వచనం రూపంలోనో, వర్ణనరూపంలోనో అంచనాకట్టి చెబుతుంటారు. అనేక కథల మీద ఆయన చెప్పిన అభిప్రాయాలు కథల పట్ల ఆయనకు గల నిబద్ధతను చాటిచెప్పుతున్నాయి. “మెహర్ మాంత్రికుడు. మాయావి”.( పుట.12) “కలాపి”వంటి కథాంశంతో రాయడం ఒక సాహసమే”.( పుట.18)”ఎండపల్లి భారతి కథల్లో అడివంచుపల్లె బతుకుల్లోని స్వచ్ఛత కనిపిస్తుంది. భారతి కథల్లో ప్రత్యేకంగా ఆకట్టుకునేది ఒక కథలోంచి ఇంకో కథను చెప్పడం.” (పుట. 46 ) “భవిష్యత్తును భూతద్దంలో చూపించి భయపెట్టడం ఈ కథ (Hiraeth) లక్ష్యం కాదు. వర్తమానంలో మానవ నిర్లక్ష్యాన్ని, స్వార్థపూరిత బాధ్యతారాహిత్యాన్ని గుర్తుచేసి హెచ్చరించడం ఈ రచయిత్రి వ్యూహం”.( పుట. 56) “పడికట్టు పరిష్కారాలు చూపకపోవడమే ఈ కథ (కాంత పున్నం వెన్నెల)ప్రత్యేకత”.(పుట .178)
తమ భావజాల ప్రచారానికే ప్రధానంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన వల్ల సాయుధ పోరాటాన్ని వస్తువుగా స్వీకరించిన చాలా కథల్లో శిల్పనిర్మాణం బలహీనంగా కనిపిస్తుంది. షహీదా, మిడ్కో వంటి వారు ఈ బలహీనతను జయిస్తున్నారు” (పుట. 98) “తాత్వికధార ఒకటి కథను (మునిరాజ మహేశ్వరం) అల్లుకుంటూ కొనసాగుతుంది. (పుట.18)”మారుతీ పౌరోహితం కథను దృశ్యం కట్టి చెప్పిన తీరు అద్భుతం” (పుట 147) “టీనా ఒక పిల్లి అని కథ చివరి దాకా చెప్పకపోవడం రచయిత కథనచాతుర్యం . అయితే కథ మొత్తాన్ని పిల్లి చెప్పడం విశేషం.” (టీనా పుట. 172) ఇలాంటి పరిశీలనాత్మక వాక్యాలు భోజమహారాజు ఇచ్చే బిరుదులు వంటివి కావు. కథపఠనానుభవం విమర్శకునిలో మాగిమాగి వెలికి వచ్చిన కథాసారం. దీనిని చెప్పడం కోసమే విమర్శకుని అవసరం.
కథకు అభివ్యక్తి సాధనం భాషే.భాషలోనే కథాంశం కళాకృతిని పొందుతుంది. కథలో భాష శిల్పకళలో ఉలి నిర్వహించేపాత్రను నిర్వహిస్తుంది. కథా రచయితలు కథకు సజీవత్వాన్ని తీసుకురావడం కోసంభాషను జాగ్రత్తగా ఉపయోగిస్తారు. కథలలో భాష నిర్వహించిన పాత్రను అంచనా కట్టడం విమర్శకుల బాధ్యత. ఉమామహేశ్వరరావు ఈ బాధ్యతను చక్కగా నిర్వహించారు. ఆయనకు ఏ ప్రాంతం ప్రాదేశికభాషన్నా ఎనలేని మక్కువ. ఆయనది ఎల్లలు లేని భాషాభిమానం.
చాలా కథల పరామర్శలో ఆయన భాషా పరిశీలన చేశారు . కథావిమర్శలో కథకులు ఉపయోగించే భాష ఏ ప్రయోజనాలను సాధించిందో చెప్పకపోతే కథావిమర్శ అసంపూర్ణమని ఉమామహేశ్వరరావుకు తెలుసు. “పాణిని జన్నాభట్ల రాసిన ‘చెయ్యాల్సిన పని’ కథా నిర్మాణం సాఫ్ట్వేర్ శైలిలో సాగినా, సంభాషణలో గుంటూరు జిల్లా గ్రామీణ మాండలికం అద్భుతంగా పలికింది. ఈ రెండింటి కలయిక కథను సరళంగా చదివిస్తుంది.” (పుట. 175) ” ఉత్తరాంధ్ర మాటల్ని తెలుగుకథ మెడలో వేసిన ఆధునిక కథకురాలు కత్తి పద్మ. రావిశాస్త్రిని గుర్తుకు తెస్తారు” (పుట. 163). “హైదరాబాద్ నగర బస్తీల ఉర్దూ కలగలిసిన తెలుగు భాషా,యాసా కథకు (ఇసుక అద్దం) భలే అందంగా అమరిపోయాయి. ,(పుట 140) లంకమల అడవి అంచు పల్లెల యాస కథకు (ఓబుల్రెడ్డి ఎద్దులు) పట్టునిచ్చింది.( పుట.132). చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతపు మాటలూ, యాసా కథకు (యర్రావుదూడ)అదనపు సౌందర్యాన్ని ఇచ్చాయి.(పుట.126) “ఝాన్సీ వార్తా కథనాల్లో పత్రికా భాష తప్ప మాండలికాన్ని ఎన్నడూ గమనించని నేను సంబరపడిపోయాను. అచ్చమైన, అందమైన చిత్తూరు యాసలో ఆమె కథ (దేవుడమ్మ )నడిపిన తీరు నన్ను అబ్బురపరిచింది .(పుట 61).
ఈ ఉటంకింపులన్నీ కథా విమర్శకులకు కథల పరిశీలనలో భాష కూడా పట్టించుకోవాల్సి అంశమని గుర్తు చేస్తున్నాయి. విమర్శకులనైనా,సాధారణ పాఠకులనైనా, కథాంశం తర్వాత కథను చదివి సంబరపడేది కథకులో ఉపయోగించిన భాష దగ్గరే . కథలో ప్రాదేశిక భాషను ఉపయోగించు కొనడంలో రచయితలు ఆలోచించవలసిన విషయాలను కూడా ఉమామహేశ్వరరావు ఒక చోట గుర్తు చేశారు. మారుతి పౌరోహితంకథ ( కుశలంబేకదా ఆంజనేయా!) కర్నూలు గ్రామీణ మాండలికంలో కథ నడుస్తుంది అయితే యాసను పలికినట్లుగానే రాయడానికి చేసిన ప్రయత్నం, ఆ మాటలు పరిచయం లేని వారిని ఒకటి రెండు పేజీల దాకా ఇబ్బంది పెడుతుంది. తెలుగు వర్ణమాలలోకి యాస మాటలను ఇముడ్చుకునేటప్పుడు రచయిత కొంత స్వేచ్ఛను తీసుకోవచ్చు అనుకుంటా!
తిరుపతిమాండలికమే రాసినా పులికంటి కృష్ణారెడ్డి కథల్లో చదువరికి ఎదురైన ఇబ్బంది, నామిని కథలు చదువుతున్నప్పుడు ఎదురు కాలేదు. సరళం చేసుకోవడం వల్ల మాండలిక సౌందర్యం మరింత పెరుగుతుంది కూడా. అల్లం రాజయ్య “అగ్నికణం” నాటికి తెలంగాణ మాండలికం సంక్లిష్టంగా అనిపించేది. ఆ తర్వాత కాలంలో రాజయ్య సహా ఆ ప్రాంత రచయితలు యాస మీద గాక మాండలిక మాటలను ఏరి కూర్చి మాలగట్టి అందంగా సాహిత్యానికి అందించడం మీద శ్రద్ధ పెట్టారు. ఇప్పుడు తెలుగు సినిమాకే అందమైన ఆభరణంగా తెలంగాణ మాండలికం మారిపోవడాన్ని మనం చూస్తున్నాం. వైవిద్య భరితమైన రాయలసీమ మండలికమూ అంత సౌందర్యవంతమైనదే.” (పుట. 148) తెలుగు సాహిత్య సమాజం వీరగ్రాంథికభాష నుంచి సరళగ్రాంథికభాషకూ, అక్కడినుండి పాత్రోచిత భాషకూ, ప్రాదేశిక భాషకూ ప్రయాణం చేయడం ఒక పెద్ద పరిణామం. సాధారణ, సార్వత్రిక మాండలిక భాష నుంచి స్థల నిర్దిష్టమైన యాస వరకు ప్రయాణించడం మరింత ప్రగతిశీలమైన అంశం. అయితే అదే సమయంలో భాషా వ్యవహర్త నోట్లో నుంచి మాట ఎలా బయటికి వస్తే దానినలాగే రికార్డ్ చేయాలి అనే ప్రయత్నం తిరస్కరించడానికి వీలుకానిదైనా, కథాపాఠకులను దృష్టిలో పెట్టుకొని కొంత సడలింపు పాటించాలని ఉమామహేశ్వరరావు చేసిన సూచనను వీరమాండలికవాదులు గుర్తించాలి.
తెలుగులో కథా విమర్శనం ఒక శాస్త్రంగా కాకుండా కళాత్మకంగా చేయటానికి ఉమామహేశ్వరరావు ప్రయత్నించారు .అట్లని ఆయనది విమర్శలో అలంకారక శైలికాదు. ఆయనది సహృదయ పరామర్శ. అనుభవపరామర్శ.దానిని ఆయన తనకు తాను తీర్చిదిద్దుకున్నారు. ఆయన విమర్శ చదువుతుంటే ఆయన మన ముందు కూర్చొని గాని లేదా ఒక మైకు పట్టుకుని గాని మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. పాఠకులతో ఆయన విమర్శ ఆహ్లాదకరంగా చదివించడంలోని రహస్యం ఇదే.కథను చదివించినట్లే, కథా విమర్శను కూడా చదివించేది భాషే. ఉమామహేశ్వరరావుది సరళమైన తెలుగుభాష. జాతీయమైన తెలుగు వాక్యం. తెలుగు సాహిత్య విమర్శలో ఆర్ఎం ఉమామహేశ్వరరావుది తనదైన వాణి, తనదైన బాణి .
” అన్వేషణ ప్రశ్నకు దారితీస్తుంది
ప్రశ్న కన్నా ప్రమాదకరమైనది ప్రపంచంలో లేదు”
( కథా సమయం: పుట. 159 )








Add comment