దేశం@జంతర్ మంతర్ 2.0

అంధ రాజ్యం!

“సార్… వాళ్ళంతా మూకగా వచ్చి కొడుతున్నారు…” గాయాలపాలై వురుకులపరుగులతో వచ్చి, పెగిలీ పెగలని గొంతుతో చెప్పాడో విద్యార్థి.

పోలీసులు వినిపించనట్టు తమకేమిటి సంబంధమన్నట్టు చూశారు.

“చూడండి సార్, నా బట్టలు చించేశారు…” గొంతు తడారిపోతూ వుండగా మళ్ళీ చెప్పాడు విద్యార్థి.

‘ఎంత సేపు శంఖం వూదుతావో వూదుకో’ అన్నట్టు చూశారు పోలీసులు.

ఈసారి పోలీసుల యెదురుగానే మూక మరో విద్యార్థిని మీదపడి చేతికివచ్చిన బలంతో ముఖమ్మీద పిడిగుద్దులు గుద్దింది.

పోలీసులు ఆపలేదు, తమ డ్యూటీ యేదో వాళ్ళు చేస్తున్నట్టు. అడిగితే లాఠీలూ తుపాకులు కూడా అందివ్వడానికి మేం సిద్ధం అన్నట్టు సేవకుల్లా చూస్తున్నారు.

బూతులు తిడుతూ ఆ విద్యార్థిని జుట్టుపట్టి వూపేస్తోంది గుంపు.

“సార్, వాటీజ్ దిస్?” మూక మధ్య పెనుగులాడుతూవుంది విద్యార్థిని.

పోలీసులే కాదు, వాళ్ళ యూనిఫామ్ భుజాలమీద వున్న నాలుగు సింహాలూ నవ్వుతున్నాయి.

‘లాస్ట్ టైం యేమన్నారు? గుర్తు తెలియని వ్యక్తుల దాడి- అని కదా?’ అని, ‘యివిగో మా గుర్తులు’ కాషాయ జెండాలు తలకీ మొలకీ మెడకీ చుట్టుకున్నాయి హిందూ రక్షణ దళాలు. ప్రతివొక్కడూ వొక్కో ‘స్వతంత్ర భరద్వాజ్’ల్లా వున్నారు.

‘రేపటి జంతర్ మంతర్‌లో విద్యార్థుల ప్రొటెస్ట్ అడ్డుకోవడానికి ఆరెస్సెస్ సిద్ధం’ వార్తలు గుర్తుకువచ్చాయి ఆ విద్యార్థినీ విద్యార్థులకి.

“సార్, వాట్ హేపెండ్? మీరా వాళ్ళా, యెవరు పోలీసులు?” విద్యార్థిని వెన్నుమీద దెబ్బలు పడుతూవుంటే అడిగింది.

“మేమందరం పోలీసులమే,” అందో కాషాయ కండువా గర్వంగా.

“నో సార్… మీరు మా పై ఆఫీసర్స్!” అంటూ పోలీసులు వినయాతివినయంగా మూకకు సెల్యూట్ చేశారు, నేలను బూటు కాళ్ళతో తన్ని.

“ఆర్ యూ క్రేజీ?” అన్నాడు విద్యార్థి షాక్‌లోంచి బయటపడకుండా.

పోలీసులు అప్పుడు యేక గొంతుతో చెప్పారు. “మీరు మాకే కాదు, మన దేశ నాయకత్వానికే నాయకులు. ఎస్, మీరు మా సూపర్ బాస్‌లు…” అని.

‘మా దేహాన్నయినా ముక్కలు కానిస్తాం కాని యీ దేశాన్ని ముక్కలు కానివ్వం’ అంటూ కాషాయం జెండా రెపరెపలాడింది. దానికింద వున్న ఆ విద్యార్థినీ విద్యార్థులకే కాదు యెవరికీ చివరికి ప్రజాస్వామ్యానికీ వూపిరి ఆడడం లేదు!!

ఆమె రాయని కవిత్వం!

ఔను, మీరిప్పుడు నా జుట్టుపట్టి వెంట్రుకకు వొకడు చప్పున వేలాడగలరు!

మీరు కౌరవులు అనడానికి వందమంది కాదు యాభై వేలమంది.

తెలుసు, మీరిప్పుడు నా కాలొకరు చెయ్యొకరు జబ్బొకరు రొమ్మొకరు మెడొకరు తొడొకరు పట్టి తలక్రిందులుగా యెత్తుకు పోగలరు!

అపహరణ వస్త్రాపహరణ మీకు తెలిసిన యేకైక వైద్యం!

ఔను, మీరిప్పుడు నా దేహం నిండా చేతులు వెయ్యగలరు, యిది లైంగిక వేధింపు కాదు, అత్యాచారం అంతకన్నా కాదు, అదుపులోకి తీసుకోవడం!

తెలుసు, మట్టిని కాళ్ళతో కుమ్మినట్టు పోలీసు వ్యాన్‌లో నా వొళ్ళంతా బూట్ల కాళ్ళతో కుమ్మి నలిపి మరోసారి నుజ్జునుజ్జు చేయగలరు!

ఇన్ని చేసి మీరు నన్ను బాధ మాత్రమే పెట్టగలరు. కాని భయపెట్టలేరు!

ఔను, మీరు చేసేది వుద్యోగం కాదు, వూడిగం! రేపు జీతం అందుకున్నప్పుడు నోట్లు లెక్కపెడుతున్నప్పుడు వుమ్మి తడి అక్కర్లేదు… మా రక్తపు తడి అంటుకొని మీ వేళ్ళను తప్పక తాకుతుంది!

ఇంటికెళ్ళాక మీ పిల్లల ముఖాల్లో మా ముఖం కనిపించినప్పుడు సిగ్గుపడి కళ్ళు మూసుకోకండి!

కనీసం వొక్కసారైనా మీ పిల్లల కళ్ళలో కళ్ళు కలిపి చూసి మనుషులవ్వండి! పిల్లలు లేని వాళ్ళు కాదు మీరు!

తెలుసు, రేపు యే స్త్రీని చూసినా నేనే కనిపిస్తాను… మీ ముఖమ్మీద వుమ్మేసినట్టు నవ్వుతూ కనిపిస్తాను!

పువ్వులు రాలిపోతాయి… కాని వాసన తప్పక అంటుకొనే వుంటుంది!!

ఆఫ్ ది కెమెరా…

“మీరు కమీషనర్ ర్యాంకులో వున్నారు, మీరు ఖచ్చితంగా నేమ్ ప్లేట్ ధరించాలి కదా?” జర్నలిస్ట్ అడిగాడు.

“పడిపోయింది… కింద పడిపోయింది…” చెప్పాడు కమీషనర్.

“ముందునుంచీ లేదా?, ఏం చెపుతారు?” మళ్ళీ అడిగాడు జర్నలిస్ట్.

కమీషనర్ తప్పించుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు.

“మీరు కమీషనర్ ర్యాంకులో వున్నారు, మీ నుండి సిన్సియారిటీని ఎక్సుపెక్ట్ చేస్తాము…” జర్నలిస్ట్ వదలడం లేదు, వెంటపడుతూ.

“మీ దగ్గర నుండే నేమ్ ప్లేట్ లేనప్పుడు… పక్కవాళ్ళ నుండి యేమి ఆశిస్తాము?” పట్టువదలని విక్రమార్కుడయ్యాడు జర్నలిస్ట్.‌

మాట్లాడకుండా వన్నూటూ కలిపివచ్చేస్తున్నట్టు అక్కడ నుండి పరుగులాంటి నడకతో వెళ్ళిపోతున్నాడు కమీషనర్.

అప్పుడే అటుగా వెళ్తున్న మరో పారామిలటరీ యూనిఫామ్‌లో వున్న ఆవిడతో “మేడమ్… మీ నేమ్ ప్లేట్?” అడిగాడు జర్నలిస్ట్.

జవాబివ్వలేదు, ఆమే కాదు యెవ్వరు కూడా.

కనిపించిన అందర్నీ ‘నేమ్ ప్లేట్’ గురించి అడగడం మానలేదు జర్నలిస్ట్. విసుగూ విరామం లేకుండా. పోయిన వోటును వెతుకుతున్నట్టే ‘నేమ్ ప్లేట్’ను వెతుకుతూనే వున్నాడు.

పోలీసులు అందరూ వొకే సమాధానమిచ్చారు… వొకే బళ్ళో చదివినట్టు.

జర్నలిస్టుకు నాలుగు తగిలించాలని అనిపించింది కమీషనర్‌కి. కెమెరా కేప్చర్ చేస్తుందని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ నవ్వుతూ చూశాడు.

“నేమ్ ప్లేట్ పడిపోయిందని చెప్పమని మీరు అందరికీ ఆర్డర్స్ యిచ్చారా సార్, లేకపోతే ప్రభుత్వమే మీకు అలా చెప్పమని ఆర్డర్స్ యిచ్చిందా?” జర్నలిస్ట్ నిజాయితీగా అడిగాడు.

“అదేం లేదండీ… మా అందరి నేమ్ ప్లేట్సూ పడిపోయాయి…” చాలా సౌమ్యంగా చెప్పాడు కమీషనర్.

“నమ్మగలిగేలా లేదు,” అన్నాడు జర్నలిస్ట్, సంకోచం లేకుండా.

బేటరీ అయిపోవడంతో కెమెరా దించి బేటరీ మారుస్తూ వున్నాడు కెమెరా మెన్. ఆ అనువైన సమయం చూసి “నేమ్ ప్లేట్ యెందుకు?” అడిగాడు కమీషనర్.

ఊహించని యీ ప్రశ్నతో జర్నలిస్ట్ వొక్కక్షణం మాటలు రానట్టు ఆగిపోయాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న కమీషనర్ “నేమ్ ప్లేట్ వల్ల యే పర్పజ్ వుండదు,” అన్నాడు నవ్వుతూ.

కెమెరా మెన్‌ని తొందరగా రెడీ కమ్మని చూశాడు జర్నలిస్ట్.

“ఇండియా పేరు పక్కన ‘డెమోక్రటిక్ కంట్రీ’ అని నేమ్ ప్లేట్ యెందుకు? ఇండియా అంటేనే డెమోక్రటిక్ కంట్రీ. ‘నేమ్ ప్లేట్ లేదు అంటేనే పోలీస్’. మళ్ళీ పోలీసులు ‘నేమ్ ప్లేట్స్’ పెట్టుకోవడం యెందుకు? హౌ సిల్లీ?” నవ్వాడు కమీషనర్.

కెమెరా ఆన్ అయింది.

కమీషనర్ మాటలు ఆఫ్ అయ్యాయి.

జర్నలిస్ట్ యిప్పుడు చెప్పండి అన్నట్టు అడగబోతూ నోటిదగ్గర మైక్ పెట్టబోతే- కమీషనర్ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

సనాతన ఇండస్ట్రీలో వొక ప్రోడక్ట్!

సెల్‌లో వున్నట్టు ఐటీ సెల్లో వున్నవాళ్ళకి వూపిరి ఆడడం లేదు?!

“ఏం చేస్తున్నార్రా?” వెర్రెక్కిపోయాడు ఇన్చార్జ్.

“హిందూమతం ప్రమాదంలో వుంది…” చెప్పబోయాడు క్రియేటర్.

“అదెప్పుడూ ప్రమాదంలోనే వుంటుంది. ముందు మనం వుండకుండా చూడండి,” గింజుకున్నాడు ఇన్చార్జ్. ఆపై సిస్టమ్ ముందు కూర్చొని యిదివరకే అప్ లోడ్ చేసినవి చూశాడు.

నేహా బోరా బారికేడ్స్ దాటుతూ వంగినప్పుడు కేప్చర్ చేసిన ఫోటోని బాగా జూమ్ చేసి, దానికింద ‘సెక్స్‌పోజర్’ అని రాసి వున్నది చదివి కూడా సంతృప్తి పడలేదు.

“ఏఐతో క్లాత్స్ తీసేయమంటారా?” క్రియేటర్ దురదగా వున్న చేతుల్ని నలుపుకున్నాడు.

“అలా చేస్తే మనమందరం మూసుకొని యింటికి పోవాల్సివస్తుంది, వొక పని చెయ్… మొత్తం కాకుండా క్లాత్స్ కొద్దిగా తీసేసి డిజైన్ చెయ్… మోడ్రన్ డ్రెస్ వెయ్… తొడలు ఎగ్జిబిట్ చెయ్… నడుమూ బ్రెస్టూ ఎక్సుపోజ్ చెయ్…” చెప్పుకు పోతున్నాడు ఇన్చార్జ్.

అనుమానంగా చూశాడు క్రియేటర్.

ఆ అనుమానాన్ని అర్థం చేసుకొని “అమ్మాయిని మార్చు,” అని చెప్పాడు ఇన్చార్జ్. చెప్పినట్టుగానే క్షణాల్లో ఏఐతో క్రియేట్ చేశాడు క్రియేటర్.

నిక్కరు వేసుకున్న వొకమ్మాయి పోలీసు వ్యానుమీద చెయ్యివేసి వంపులు తిరుగుతూ నిలబడివుంది.

“ఆ బ్యాక్ గ్రౌండ్ మార్చు… జంతర్ మంతర్ పెట్టు,” ఇన్చార్జ్ చెప్పినట్టుగానే క్షణాల్లో మారిపోయింది దృశ్యం, వాస్తవాన్ని వెక్కిరిస్తూ.

“దీన్ని గొర్రెల్లోకి వదిలేయండి, మన భక్తులు వాళ్ళు రాయాల్సింది రాసుకుంటారు… రామకోటి,” అన్నాడు రిలాక్స్ అవుతూ ఇన్చార్జ్.

“ఇది ‘ఏఐ క్రియేషన్’ అని జనం గుర్తుపడతారు కద్సార్…” అమాయకంగా అడిగాడు కొత్త జీతగాడు.

“ఈలోగా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది… అది ముఖ్యం,” ఇన్చార్జ్ మనసు తెలుసుకున్నట్టు అన్నాడు క్రియేటర్.

“అంధులు యేది యిచ్చినా సర్క్యులేట్ చేసుకుంటారులే,” అన్నాడు ఇన్చార్జ్.

‘అంధులు’ అని ఇన్చార్జ్ యెవరిని అన్నాడో అర్థంకాలేదు ఆ కొత్త జీతగాడికి!?

నగ్న దేశం!

“చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చెయ్యాలి…”

“రాజీనామా చెయ్యాలి… రాజీనామా చెయ్యాలి…”

విద్యార్థులు హోరెత్తుతున్నారు.

“ఈ కాక్రోచ్‌లకు మరేం పనిలేదా?”

“నిన్న ధర్మేంద్ర ప్రధాన్‌చేత రాజీనామా చేసేదాక వదల్లేదు, ఇవాళ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేదాక వదిలేలా లేరు…”

దేశభక్తులు తెగ దిగులు పడుతున్నారు.

“వీళ్ళు చెప్పిన వాళ్ళందరూ రాజీనామా చేస్తే, యింక ప్రభుత్వం యేముంటుంది?”

“మన దేశ గౌరవ ప్రతిష్టల్ని దెబ్బతీస్తున్నారు… వోడిపోయిన వాళ్ళందరూ అలాగే మాట్లాడుతారు…”

సామంత రాజకీయనాయకులు వాపోయారు.

“ఇది అర్థంలేని ఆందోళన, వేరే దేశాల్లో అయితే అరెస్టు చేసేవారు…”

“రాజ్యాంగబద్దమైన ఎన్నికల సంఘంపై బురద చల్లడం దేశ ప్రయోజనాలకూ ప్రజాస్వామ్యానికీ అస్సలు మంచిది కాదు, ఓట్ల తొలగింపు అపోహ మాత్రమే…”

మాజీ మేధావి, మాజీ వుప రాష్ట్రపతి ఆందోళన చెందారు.

“ఏ కోర్టు కూడా దీన్ని క్షమించదు…”

“ఇది రాజ్యాంగ విరుద్ధం…”

కొందరు న్యాయమూర్తులు వుగ్గబట్టుకోలేక బయటపడిపోయారు.

“పార్టీ గెలుపుకు కారణమైన జ్ఞానేశ్ కుమార్‌ని కాపాడుకోవాలి…”

“మరి? ఆయనవల్లే కదా, వెస్ట్ బెంగాల్ దాక గెలిచింది…”

ప్రధాన ఎన్నికల కమీషనర్‌పట్ల ప్రేమను పంచుకున్నారు పార్టీ కేడరు.

“ఇది పాకిస్తాన్ కుట్ర…”

“హిందూ మతం ప్రమాదంలో వుంది…”

సమాలోచనలు చేసేస్తున్నారు సన్నాసులు.

“ఇదంతా మోడీషాల కోసమే చేశానని చెపుతాడా జ్ఞానేశ్?”

“చెప్పడు, ఆయనకు భారతరత్న వద్దా? లేకపోతే రాజ్యసభ సీటు వద్దా? గవర్నర్ గిరి రేపు చెయ్యడా?”

టీవీ ఛానెళ్ళలో విశ్లేషణలు చేస్తూ వున్నారు విశ్లేషకులు.

“సుప్రీమ్ కోర్టు చూస్తూ వూరుకుంటుందా?”

“జ్ఞానేశ్‌కు యిచ్చేవే జడ్జీలకూ యిచ్చి నోరు మూయించొచ్చు!”

పండిత చర్చలు జరిపారు కొందరు పెద్దలు.

“అయ్యా… నా వోటు కనిపించలేదు, చూడండి…”

“అయ్యో… వోటర్ల లిస్టులోనుండి మా పేర్లు తీసేశారు…”

గల్లంతైన వోటర్లని కాక్రోచ్‌లని, అర్బన్ నక్సల్స్-దిమాగి నక్సల్స్ అని కేసులు నమోదు చేశారు పోలీసులు!

కుట్ర!

“అసలు యీ నాటకం ఆడిస్తున్నది యెవరు?”

“అందరికీ తెలుసు- అని వాళ్ళకీ తెలుసు!”

“నాకర్థం కాలేదు…”

“బీజం యెక్కడ పడిందో తెలిస్తే, స్క్రీన్ ప్లే క్లియర్‌గా అర్థమవుతుంది,”

“బీజం యెక్కడ పడింది?”

“2023లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది తెలుసు కదా?, యెందుకూ?”

“పాత చట్టం వారికి పర్పజ్ ఫుల్‌గా లేదేమో?!”

“ఎగ్జాట్లీ… ‘వడ్డించేవాడు వశమైతే, కడబంతిలో కూర్చుంటే యేమి?’ అని సామెత!”

“వడ్డించేవాడు యెవరి వశమయ్యాడు?”

“ఎవరు నియమిస్తే వాడి వశమే!, మనం పాలు పోసిన కుక్క మనకిగాక పక్కింటికి కాపలా కాసి కాపాడుతుందా?”

“ఊహూ…”

“చీఫ్ ఎలక్షన్ కమీషన్ నియామక కమిటీలో మొదట యెవరు వుండేవారు?”

“సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి… యింకా…”

“ఆయన్ని తీసేశారు,”

“ఎందుకూ?”

“న్యాయాన్యాయాలు మాట్లాడకూడదని…”

“మరి యెవరిని పెట్టారు?”

“ప్రభుత్వం తరుపున వొక క్యాబినెట్ మంత్రిని తెచ్చిపెట్టారు,”

“అప్పుడు ప్రధాని యింకా ఆయన చెప్పుచేతల్లో వుండే క్యాబినెట్ మంత్రి… అంటే ప్రభుత్వం తరుపున యిద్దరూ- ప్రతిపక్ష నాయకుడు వొకడూ-”

“అప్పుడు ‘టూ ఈస్ట్ వన్’ అవుతుంది కదా?”

“అవాలనే కదా?”

“అప్పుడు యిద్దరు ఆమోదిస్తే అమలవుతుంది, అంటే ప్రభుత్వం యేమని అనుకుంటే అదే జరిగి తీరుతుంది,”

“వెరీగుడ్డు…”

“గాడిద గుడ్డేం కాదూ… అఖిల పక్షం కాదు, యిది పూర్తి యేక పక్షం!”

“పైగా యింకో విషయం… దీన్ని హోమ్ మినిస్టరు లీడ్ చేస్తాడు,”

“ఐపాయె…”

“అయిపోలేదు, టూ ఈస్టూ వన్ కాదు, వన్ ఈస్టూ టూ- చేసాడ్లే,”

“ఔను, మిగతా యిద్దరు ఎన్నికల కమీషనర్లు తప్పుపట్టినా వారి అభ్యంతరాలు వినలేదట కదా?”

“వింటే తనను నియమించిన వాళ్ళకు న్యాయమెలా చేస్తాడు? కాబట్టి న్యాయం చెయ్యడం కోసం జస్ట్ పదమూడున్నర కోట్ల వోట్లని తొలగిస్తే అంతా అన్యాయం అంటున్నారు…”

“అన్యాయం… అన్యాయం…”

“అని అంటున్నారు గాని, యెప్పుడూ ప్రజలు ప్రభుత్వాన్ని యెన్నుకోవడమేనా? ప్రజల్ని ప్రభుత్వం యెన్నుకోవద్దా?”

“ఆ?”

“ఆ! మనకి యే యే వర్గాల నుండి వోట్లు పడవో గుర్తించి వాళ్ళందర్నీ తీసి పారెయ్యాలి కదా?!”

“కేవలం వెయ్యి వోట్ల తేడాతో యెన్నో చోట్ల గెలుపోటములు మారిపోయాయి కదా?”

“అలాంటిది లక్షల వోట్లు కాదు, కోట్ల వోట్లు రద్దయితే?”

“ఎప్పటికీ అధికారం మనదే!”

“వాటే వండ్రఫుల్ ప్లాన్?!?”

“దట్సాల్!”

ముఖాముఖి!

“పదమూడుకోట్ల నలభై లక్షల వోట్లు తొలగించడం… అసలు యేమిటిదంతా?”

“SIR. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్…”

“పాలక పక్షానికి లబ్ది చేకూరేలా చెయ్యడం కోసం మీరు అర్హులైన అనేక మంది వోటు హక్కును కాలరాశారంటే, మీరేమంటారు?”

“చెప్పాగా, జెస్ట్ రివిజన్,”

“బీజేపీ వ్యతిరేక వోట్లని తొలగించారని అనుకోవచ్చా?”

“బుల్ షిట్,”

“దీన్ని ‘వోట్ల దొంగతనం’ అంటున్నారు…”

“………………………………………….”

“ఓటర్ల జాబితా సవరణ, డిజిటల్ వ్యవస్థల నియంత్రణ వంటి కీలక నిర్ణయాల్లో మీ సహ ఎన్నికల కమీషనర్ల లిఖితపూర్వక అభ్యంతరాలను వొకసారి కాదు, పద్నాలుగు సార్లు తోసిపుచ్చారని…”

“లేదు… అలాంటిదేం జరగలేదు,”

“మీ సహ కమీషనర్లకు తెలీకుండా అంగీకారం కూడా లేకుండా ఉత్తర్వులు జారీ చేశారని…”

“లేదు… అలాంటిదేం లేదు,”

“ఒక కమీషనర్ అయితే, ‘అనధికారం’ ‘చట్టవిరుద్ధం’ అని నిరసించారని…”

“నో, వాళ్ళతో కూడా కావాలంటే స్టేట్మెంట్లు యిప్పిస్తాం,”

“ఫారమ్ 6 లో చేసిన మార్పుల వల్లే యీ సమస్య వచ్చిందంటారా?”

“లేదు, యే సమస్యా లేదు. ఫారమ్ 6 లో చేసిన మార్పులను సుప్రీమ్ కోర్టు ఆమోదించింది”

“మేము అలాంటి మార్పులకు ఆమోదం తెలపలేదని సుప్రీమ్ కోర్టు చెపుతోంది కదా?”

“……………………………….”

“సుప్రీమ్ కోర్టు పేరుని వాడుకొని సియ్యీసీ దేశాన్ని తప్పుదారి పట్టించిందని… యిది తీవ్రమైన నేరమని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి…”

“అధికారంలో లేనప్పుడు అలాంటి మాటలు కామన్,”

“మీరు అధికార పార్టీకి కొమ్ము కాయలేదంటారు? వ్యవస్థను వుపయోగించుకోలేదంటారు?”

“రేపు వాళ్ళు అధికారంలోకి వస్తే యిదే వ్యవస్థను చక్కగా వాడుకోవచ్చు… వాళ్ళకు అనుకూలంగా,”

“మీ నిర్ణయాలపై సుప్రీమ్ కోర్టులో పిటీషన్లు వేశారు,”

“నా సస్పెన్షన్‌కు గాని తక్షణ మధ్యంతర వుత్తర్వులు యివ్వడానికి గాని సుప్రీమ్ కోర్టు వొప్పుకోలేదు- తెలుసు కదా?”

“అంటే, కోర్టులు కూడా పాలక పక్షమే అంటున్నారా?”

“లేదు, కోర్టు వొప్పుకోలేదు- అని అంటున్నాను,”

“భవిష్యతులో మీమీద చర్యలు తీసుకుంటే?”

“అవకాశమే లేదు… సియ్యీసీ తన పదవీకాలంలో తీసుకున్న నిర్ణయాలపై పదవీ విరమణ తర్వాత యెలాంటి చట్టపరమైన చర్యలూ విచారణలూ వుండవు…”

“ఎందుకు వుండవు?”

“అది చట్టం. ప్రత్యేక రక్షణ చట్టం. ఇమ్యునిటీ,”

“దేశ ప్రధానికీ అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తులకూ లేని ప్రత్యేక రక్షణ చట్టం మీకు మాత్రమే యెందుకు?”

“ఈ ప్రభుత్వాలు యేర్పరచేదే మేం గనుక!”

“అది సరే, మీరు చేతులు కాలక ముందే ఆకులు యెందుకు పట్టుకున్నారని అడిగితే?”

“పనిచేసేటప్పుడు కాల్తాయని తెలుసు గనుక… హహ్హహ్హా…”

“మొత్తానికి కాల్చారని వొప్పుకున్నారు!”

“……..?!?…….”

పోలీసులు రావడంతో విద్యార్థుల స్ట్రీట్ ప్లే మరో చోటికి మారింది!

ఫారమ్ 6

ఆన్ లైన్‌లో కాదు కదా ఆఫ్ లైన్‌లో కూడా నింపడం నా వల్ల కాదు… అన్నట్టు చేతులు యెత్తేశాడు వోటు గల్లంతైన పౌరుడు.

ఓపిక వుండాలి అన్నట్టు చూశాడు ఆన్ లైన్‌ వర్క్ చేస్తున్న ఆఫీసు అసిస్టెంట్.

“లాస్ట్ SIR లిస్టులో మీ పేరుందా?”

ఇంతకు ముందువున్న వోటు యిప్పుడు యెందుకు పోయిందో… యీ SIR లిస్టు యేమిటో యేమీ బోధపళ్ళేదు వో.గ. పౌరుడికి.

“పోనీ, లాస్ట్ SIR లిస్టులో మీ తలిదండ్రుల పేర్లు వున్నాయా?”

వో.గ. పౌరుడు తలను యెలా వూపాలో తెలీక అలా వుండిపోయాడు.

“పోనీ మీ తాతల పేర్లు?”

“పేర్లు…” నీళ్ళు నమిలాడు వో.గ. పౌరుడు.

“పేర్లు వుండడం కాదు, వుంటే వోటు వివరాలు చెప్పండి,” సిస్టమ్‌లో చూస్తూ అడిగాడు ఆ. అసిస్టెంటు.

“వివరాలు అంటే?” గుటకలు వేశాడు వో.గ. పౌరుడు.

“వివరాలు అంటే వారిది యే కానిస్టెన్సీయో చెప్పు…” మళ్ళీ చెప్పాడు ఆ. అసిస్టెంటు.

“అంటే, చచ్చిపోయారండి…” అంతకన్నా యేమి చెప్పాలో వో.గ. పౌరుడికి తెలీలేదు.

“మీ తాతలది తండ్రులది… ఓటేసి వుంటారు కదా? ఆ వివరాలు పట్రా. అన్నట్టు బూత్ నెంబర్ మర్చిపోకు. సీరియల్ నెంబర్ కూడా ఇంపార్టెంటే…” ఆ. అసిస్టెంటు అలసి ఆవలింత తీశాడు.

ఓటు గల్లంతైన పౌరుడు “నా దగ్గర ఆదార్ కార్డ్ వుంది… రేషన్ కార్డ్ వుంది… బ్యాంకు అకౌంట్ వుంది… గ్యాస్ బిల్… కరెంట్ బిల్…” యింకా చెప్పడం పూర్తికాలేదు.

“ఒరే బాబూ యీడ్ని తీసికెళ్ళండిరా,” అరిచాడు వోపికలేనట్టు ఆ. అసిస్టెంటు.

అప్పుడు వో బొట్టుగాడు వచ్చి పక్కకు తీసుకువెళ్ళాడు.

‘ఎంతవుతుంది?’ అన్నట్టు చూశాడు వో.గ. పౌరుడు.

“ఇదిగో మా దగ్గర యేమీ వుండదు, మేం అప్లోడ్ చెయ్యడమే. అక్కడ… యెక్కడ ఢిల్లీలో వున్నాయన నీకు వోటు యివ్వాలో వద్దో- నువ్వు అసలో నకిలీయో- తేలుస్తాడు. అంతా సెంట్రల్ సిస్టమ్…” మా ప్రమేయ జోక్యాలేవీ లేవన్నట్టు అరుస్తూ చెపుతున్నాడు ఆ. అసిస్టెంటు.

“నీదేకాదు, చాలామందిది వోటు పోయింది,” బొట్టుగాడి మాట ధైర్యం యివ్వడానికో లేక నలుగురిలాగే నువ్వూ, నీకొక్కడికే అన్యాయం యేమీ జరిగిపోలేదని చెప్పడానికో అర్థంకాలేదు.

పోయిన ఓటు కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ- చెప్పులే కాదు, కాళ్ళూ అరిగిపోయిన అవస్తలో వుండి “బొక్కలో వోటు వుంటే యెంత? పోతే యెంత? ఏ లం.కొడుక్కి వేసినా మన బతుకు మారదు” యెవడో తిట్టుకుంటూ పోతున్నాడు.

“నాకు వోటున్నప్పుడు కూడా నా వోటు యెవడో వేస్సాడు. ఇప్పుడూ అలాగే పోయిందనుకుంటాను. పోనీ ఛీ… యమ్మ…” మరొకడు ముందువాడికి జత కూడి మాట్లాడుకుంటూ పోతున్నారు.

“ఆ గాడిద కొడుకులకి అంతే తెలుసు, అంతకన్నా యేమీ తెలీదు,” బొట్టుగాడు వెళ్ళిపోతున్న యిద్దర్నీ తిట్టాడు.

‘అబ్బా… ప్రజాస్వామ్యానికి యిలాంటి వాళ్ళు వుండాలి’ మనసులోనే అనుకున్నాడు వో.గ. పౌరుడు.

“ఓటు లేకపోతే రేపు టెర్రరిస్టులైపోతారని బుర్రతక్కువ యెదవలకి తెలీదు,” కసిగానే కాదు, అచ్చం జ్ఞానిలా అన్నాడు బొట్టుగాడు.

వో.గ. పౌరుడు వెర్రి వెధవలా చూశాడు.

“వోటు కార్డు లేపోతే, రేపు నువ్వు బంగ్లాదేశ్ నుండి వచ్చావని అంటారు. కాదంటే, అయితే మయన్మార్ నుండి వచ్చావు అంటారు. అదీ యిదీ కాకపోతే, నువ్వు నీ ఫామిలీ మొత్తం రోహింగ్యాలు అంటారు. వలస వచ్చారు అంటారు. కాదని నువ్వు నిరూపించుకోవాలి. లేదంటే దేశం వదిలి పోవాలి. ఉంటా అంటే పోయి జైల్లో పడాలి…” బొట్టుగాడు నింపాదిగా చెప్పుకుపోతున్నాడు.

ఊపిరి ఆడలేదు వో.గ. పౌరుడికి. చేష్టలుడిగి చూస్తున్న తనకి భగవద్గీతని వినిపిస్తున్న కృష్ణుడులా అయితే కనిపించాడు బొట్టుగాడు.

“దారేది?” కాళ్ళమీద పడిపోయినంత పనిచేశాడు వో.గ. పౌరుడు.

కొన్ని నిశ్శబ్ద వుద్విగ్న క్షణాల తరువాత, “మనలో మన మాట… మనదే పార్టీ?” గొంతు తగ్గించి మెల్లగా అడిగాడు బొట్టుగాడు.

వో.గ. పౌరుడు నోరు తెరవలేదు కళ్ళు కదపలేదు… స్టాచ్యూలా వుండిపోయాడు.

“హు…” అని నిట్టూర్చి, “నాకు టైం లేదు. పాయింటుకు వస్తున్నా. నువ్వు మునుపు యే పార్టీ అయినా కా, యిప్పుడు యే పార్టీ అన్నదే ముఖ్యం. ‘నువ్వు మా వోడివే’ అని మా పార్టీవాళ్ళు నమ్మితే, నీ కత వేరే వుంటాది. చెయ్యాల్సింది చేసి పెడతారు,” అని చెప్పాడు. ఏ పార్టీ అని అర్థం కాలేదేమో అని, తన చెవ్వు యిరకన వున్న పువ్వును తీసి చూపించాడు.

పార్టీ పేరుని మాటగా కాకుండా పెదవులు నెమ్మదిగా కదిలిస్తూ సౌజ్ఞగా అన్నాడు వో.గ. పౌరుడు.

“అన్ని రాష్ట్రాలూ అదే… దేశమంతా అదే… అది అయితేనే నీకు వోటు వస్తుంది, అయినా ఆ కతంతా నీకెందుకు? నడిపించేవాళ్ళు నడిపిస్తారు. గుడ్డోడు యేమి కోరుకుంటాడు? కళ్ళు!” అన్నాడు బొట్టుగాడు.

“రూల్స్…” యేదో అనాలని యేదో అన్నాడు వో.గ. పౌరుడు.

“ఒరే సన్నాసీ… రూల్ చూడు. నువ్వూ నీ తాతల తండ్రుల గోత్రాలు అడిగేది యెందుకు? పెళ్ళి సంబంధాలు చూడడానికా? కాదు, నీ ఫేమిలీ మేపింగూ అదీ తెలిస్తేనే నీకు వోటు యిచ్చేది చచ్చేది. లేదంటే లేదు…” వోపిక తెచ్చుకుంటూ చెప్పాడు బొట్టుగాడు.

“ఫ్యామిలీ మేపింగా?” నోరు వెళ్ళబెట్టాడు వో.గ. పౌరుడు.

“అబ్బా…” అని నెత్తి కొట్టుకొని, “నువ్వు యెవరు? యేవూరు… అంటే యే ప్రాంతం నుండి వచ్చావు? మీ ప్రాంతంలో యే పార్టీకి బలం వుంది? నువ్వెవరి బలగంలో వున్నావు? ఇవేవీ లేకుండా నీకు వోటు యిచ్చీమంటావా? పెద్దాయనకు తెలిస్తే గుండేసి కొట్టించేస్తారు. మరీ వొట్టి అమాయకుడిలా వున్నావే…” బొట్టుగాడు చెపుతుంటే నీరుగారిపోయాడు వో.గ. పౌరుడు.

“నువ్వు అదృష్టవంతుడివి. మన మతం కాకపోతే నీకు అవకాశమే లేదు. సాయిబులూ చర్చిగాళ్ళకి అయితే ఛాన్స్ లేదు. అలగా జాతి అయితే ఆడోళ్ళయితే అస్సలు లేదు,” అని ఆగి, మళ్ళీ “నీ ఇన్ఫర్మేషన్ యిందాక ఆన్ లైన్‌లో అప్ లోడ్ చెయ్యడానికి అర్జీ పెట్టుకున్నప్పుడు చూసాన్లే…” ఇంటలిజెన్స్‌వాడి కన్నా స్మార్ట్‌గా కనిపించిన బొట్టుగాన్ని చూసి వో.గ. పౌరుడు గజగజా వణికిపోయాడు.

“నేను నిన్ను యెందుకు నమ్మానో తెలుసా?” బొట్టుగాడు అడిగాడు.

తలడ్డంగా వూపాడు వో.గ. పౌరుడు.

“నువ్వూ నాలాగే బొట్టు పెట్టుకున్నావ్ అదీ… జై శ్రీరామ్…” అన్నాడు బొట్టుగాడు.

“జై శ్రీరామ్” అన్నాడు లోగొంతుతో వో.గ. పౌరుడు, వోటు రాదనో అనకపోతే తంతారనో.

ఇద్దరు బొట్టుగాళ్ళూ జట్టయి అక్కడి నుండి నడిచారు!

భక్తీ vs భయమూ!

“మీ జెన్-జీ జెన్-ఆల్ఫాలకు భయమెందుకు లేదు?” జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్‌లో వున్నవాళ్ళని వో జర్నలిస్ట్ అడిగాడు.

“మాకు భయమెందుకు లేదు?, చాలా భయమేస్తుంది!” అని భయపడే కళ్ళతో చూశారు జీ-ఆల్ఫాలు.

“నిజమా? అయితే దేనికి భయపడుతున్నారు?” మళ్ళీ అడిగాడు జర్నలిస్ట్.

“మా మీద ఈడీ- ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడి చేస్తుందేమో అని భయపడుతున్నాం…” చెప్పాడో విద్యార్థి.

జర్నలిస్ట్ వస్తున్న నవ్వు ఆపుకున్నాడు.

“మా మీద ఇన్‌కం టాక్స్ దాడులు జరుగుతాయేమోనని టెన్షన్‌గా వుంది,” చెప్పిందో విద్యార్థిని.

చుట్టుముట్టివున్న పోలీసులు లాఠీలు పట్టుకు సిద్ధంగా వున్నారు.

“మా మీద సీబీఐ దాడులు చేస్తుందని…” వుచ్చ పడుతోంది అన్నట్టు చిటికెన వేలు చూపించాడు మరో విద్యార్థి.

పారా మిలటరీ బలగాలు గుంపుగా వచ్చేస్తున్నాయి.

“ఎన్ఐయ్యే మా మీద కేసులు పెడుతుందని చాలా షివరింగ్‌గా వుంది” వణుకు నటించాడు యింకో విద్యార్థి.

ఏమని ప్రశ్నించాలో తెలియని జర్నలిస్ట్ తలూపుతూ చూశాడు.

“మాకు కాంట్రాక్ట్ దక్కదేమో అని…” “మా కాలేజీల మీదికి బుల్డోజర్లు పంపుతారేమో అని…” “అయోధ్య రామమందిరం చోరీ కేసులో మమ్మల్ని బయటకు లాగుతారేమో అని…” “మా డిగ్రీ సర్టిఫికేట్ చూపించమంటారేమో అని…” “మాకు స్పేస్ టెక్నాలజీ రోడ్స్ వెయ్యరేమో అని” “పెట్రోల్లో మా ఇథనాల్ కలపనివ్వరేమో అని…” “నన్ను క్రికెట్ బోర్డులోంచి తీసేస్తారేమో అని…” “నామీదున్న పాత కేసులు తిరగాదోడుతారేమో అని…”

జెన్-జీ జెన్-ఆల్ఫాలు అంతులేకుండా వొక్కక్కరూ వొక్కొక్కటి చెప్తూ పెద్దగా అరుస్తూ నవ్వడం మొదలుపెట్టారు.

పోలీసులు లాఠీలు తియ్యడంతో విద్యార్థులు పరుగులు తీశారు!

చోరీ!

అప్పుడే వో విద్యార్థి తన అన్ని జేబులు తడుముకుంటూ అక్కడకు వచ్చాడు. ఆగి వెనక్కి చూశాడు. వచ్చిన దార్లో పడిపోయిందా అన్నట్టు రెండడుగులు వెనక్కి వేసి వెతికి చూసి మళ్ళీ వచ్చాడు.

పోలీసులు సహా అంతా ఆ విద్యార్థిని చూస్తూ వున్నారు.

ఆ విద్యార్థి అయితే జేబులు వొత్తుకుంటూ వెతుకుతూ వున్నాడు.

“ఏం పోయింది?” జర్నలిస్టు యెవరో అడిగారు.

“వాలెట్?” మరెవరో అడిగారు.

పక్కనే వున్న పోలీసులను చూపిస్తూ “యిక్కడే వున్నారు కదా, ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చెయ్” అన్నారు తోటి విద్యార్థులు.

పోలీసులు తలలు ఆడిస్తున్నారు, తమ దగ్గరకు వస్తున్న ఆ విద్యార్థిని చూస్తూ చెప్పమన్నట్టు.

“నాది పోయింది,”

“ఏమిటి?”

“కొద్దిగా వెతికి పెడతారా?”

“ఏమిటి?”

“ఓటు… నా వోటుని యెవరో కొట్టేసారు!”

“నీ వోటుని యెవరో చోరీ చెయ్యలేదు, మన ఫిఫ్టీ సిక్స్‌గాడే” విద్యార్థులందరూ వొక్కసారిగా ఘొల్లున నవ్వారు.

పోలీసులు నవ్వలేదు, కొద్దిగ దూరం వెళ్ళి గాని!!

కేట్సూ డూప్లికేట్సూ!

పోలీసులు కష్టపడి యిద్దర్ని పట్టుకొన్నారు. వాళ్ళూ పోలీసులే.

ఆపై కోర్టులో జడ్జిగారి ముందు నిలబెట్టారు. అయితే బోనులో నిలబడ్డ ఆ యిద్దరు పోలీసులూ జడ్జిగారికి గౌరవంగా సెల్యూట్ చేశారు. అప్పటికింకా జడ్జిగారు కేసు యేమిటో ఫైల్ తీసి చూడలేదు. చదువుదామని ఫైల్ తెరుస్తూ బోనులోని యిద్దరు పోలీసులవంక తలతిప్పి తేరిపార చూశారు. ఫైల్ మూసేసి ‘యెక్కడ చూశానా?’ అని వొక్కక్షణం ఆలోచనలో పడ్డారు జడ్జిగారు.

ఆ జుట్టు కటింగూ ఆ యూనిఫామూ బెల్టూ బూట్లూ అన్నీ చూసి ‘యీ పోలీసుల్ని నేనయితే చూశాను… ఐ నో’ అని అనుకున్నారు. ఆయన జ్ఞాపక శక్తిమీద ఆయనకు అంత నమ్మకం.

“ఏమిటి కేసు?” అని అడిగారు జడ్జిగారు.

బ్రీఫింగ్ యిస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ “మిలార్డ్… యీ యిద్దరు దొంగలు…” చెప్పడం పూర్తికాలేదు. “ఊ?” అన్నారు జడ్జిగారు, అర్థం కానట్టు.

“దొంగ పోలీసులు సార్… నకిలీ పోలీసులు,” అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుమాన నివృత్తి చేస్తూ.

జడ్జిగారికి తన జ్ఞాపక శక్తిమీద మరింత నమ్మకం కలిగింది. ‘కోర్టులో చాలాసార్లు చూశాను… ఐ నో’ అనుకున్నారు. ‘కాకపోతే పోలీసులు కాదు, దొంగలు’ అని అనుకుంటూ, ‘ఆ రెంటికీ పెద్ద తేడా యేముందిలే’ అని నాలుక మడత పెట్టి సమర్ధించుకొని మళ్ళీ తన జ్ఞాపక శక్తిని అభినందించుకున్నారు.

“బాగున్నారయ్యా,” నవ్వారు జడ్జిగారు.

“థాంక్యూ సార్…” వొక్క గొంతై అన్నారు దొంగ పోలీసులిద్దరూ.

కోర్టు హాలులో అందరూ నవ్వడంతో వాతావరణం తేలికయ్యింది.

“సినిమాలు బాగా చూస్తారా?” తలూపుతూ జడ్జిగారు అడిగారు.

దొంగ పోలీసులిద్దరూ లేదన్నట్టు అడ్డంగా తలలూపారు.

“ఏమిటి మీ ఇన్స్పిరేషన్?” నవ్వుతూ అడిగారు జడ్జిగారు.

“చిన్నప్పటినుండి పోలీస్ డ్రెస్ వేసుకోవాలని కోరిక సార్…” యిద్దరూ కూడబలుక్కున్నట్టు చెప్పారు.

“కొత్తది కుట్టించి వేసుకున్నారా?” కనిపెట్టేసినట్టు చూశారు జడ్జిగారు.

ఇద్దరూ తలలు అడ్డంగా వూపారు. జడ్జిగారు ‘మరి?’ అన్నట్టు ప్రశ్నార్థకంగా అంతకుమించి అనుమానంగా చూశారు.

“మన ఢిల్లీలో పోలీసు డ్రెస్‌లు పంచుతుంటే మేమూ రెండు తీసుకున్నాం, మా తోటి డెకాయిట్లు చాలా మంది డ్యూటీలు కూడా చేసేస్తున్నారు సార్” అని వొక దొంగపోలీసు చెపితే, మరొక దొంగపోలీసు “మీకు ట్రైనింగ్ కావాలంటే జంతర్ మంతర్‌కు వెళ్ళమన్నారు సార్,” అని చేతుల్లోని లాఠీలు చూపించారు.

జడ్జిగారికి యేమి మాట్లాడాలో తెలీక పోలీసుల వైపు చూశారు. పోలీసులు జడ్జిగారిని ఫేస్ చెయ్యలేక దొంగ చూపులు చూశారు.

“సార్, వీళ్ళకు వేసిన జంతర్ మంతర్లో డ్యూటీ చెయ్యకుండా బ్యాంకులకు వెళ్ళారు సార్…” అసలు విషయం చెప్పారు అసలు పోలీసులు.

సుత్తి అందుకోబోతున్న జడ్జిగారి చేతుల్ని పట్టేసుకొని “వద్దుసార్,” అని బిళ్ళ బంట్రోతు ఆపాడు?!

భయమూ అభయమూ!

“ఓట్ల తొలగింపుపై సుప్రీమ్ కోర్టు సంచలన వ్యాఖ్యలు,” అని టీవీ స్క్రీనంతా అక్షరాలు వస్తున్నాయి.

“ఓటు హక్కు అనేది పౌరసత్వానికి ప్రాణాధారం- వోట్ల తొలగింపుపై సుప్రీమ్ కోర్ట్ జడ్జ్ భూయాన్ కీలక వ్యాఖ్యలు,” అంటూ టీవీలో చెప్పిందే చెపుతున్నారు.

మధ్య మధ్యలో “బిగ్ బ్రేకింగ్ న్యూస్,” అని స్క్రీన్ మీది లెటర్స్ జూమ్ ఇన్ అయి జూమ్ అవుట్ అవుతూ వున్నాయి.

“ఓటును తొలగించడం అంటే శరీరం నుండి ఆత్మను వేరుచేయడమే-నని సుప్రీమ్ కోర్ట్ జడ్జ్ భూయాన్ అన్నారు. ధనికుడయినా పేదవాడయినా వాళ్ళ వోటు విలువ సమానం- అని ఆయన చెప్పారు” అంటూ రీడర్ వార్తలు చదువుతూ వుంది.

“మరణిస్తే తప్ప వోటు తీయొద్దు” అని స్క్రీన్ మీద యిట్నుంచి అట్నుంచి అక్షరాలు వస్తూ పోతూ వున్నాయి.

అదే సమయంలో టీవీ ఛానెల్స్‌‌కు అనేకానేక ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అందరు చెప్పేది అడిగేది వొక్కటే.

“అయితే మమ్మల్ని చంపేస్తారా?”

“మిమ్మల్ని యెవరు యెందుకు చంపుతారు?” ఛానెల్ వాళ్ళు తిరిగి అడిగారు.

“మరణిస్తే తప్ప వోటు తీయొద్దు- అని చెపుతున్నారుగా?”

“అది మేం చెప్పింది కాదు, జడ్జిగారు చెప్పింది” వివరణ కూడా యిచ్చారు ఛానెల్ వాళ్ళు.

“ఎవరు చెపితే యేంటి? మా వోట్లు తీసేయ్యాలంటే మమ్మల్ని చంపమని మీరు హింటిస్తున్నారా? మా వోట్లు తీసేస్తే తీసేశారు గాని ‘మరణిస్తే తప్ప’ అని చెప్పడం యెందుకు? ఆ కాజ్ పెట్టుకొని మమ్మల్ని యేదైనా చేస్తే యెవరండీ పూచీ?…”

వాళ్ళ గొంతుల్లో ఆగ్రహం. దుఃఖం. వేదన. ఏడుపు. ఉక్రోషం.

ప్రేక్షక దేవుళ్ళు భక్తులకి భయపడ్డ విషయం బయటకు పొక్కకుండా చూసుకున్నారు ఛానెళ్ళవాళ్ళు.

బహుశా!

ప్రభుత్వం యే క్షణమైనా కుప్పకూలిపోయేలా వుందని, ప్రజలు ఎమర్జెన్సీని ఫీలవుతున్నారని ఇంటలిజెన్స్ శాఖ ప్రభుత్వానికి తెలియజేసి ముందస్తుగా అప్రమత్తం చేసింది.

దాంతో అప్పటికప్పుడు అత్యవసర సమావేశం యేర్పాటయ్యింది. ప్రభుత్వ పెద్దలూ పార్టీ మేధావులూ భక్తులూ సన్యాసులూ అంతా హాజరయ్యారు.

మేధోమథనం జరుగుతోంది.

“ఈ జెన్-జీతో తలనొప్పులు మనం పడలేకపోతున్నాం, ఇప్పుడు వీళ్ళని యెలాగోలా కంట్రోల్ చేస్తాం… తన్నో కేసులు పెట్టో. కాని రేపు?” అంది పార్టీ పెద్ద తలకాయ.

“వాళ్ళకి దెబ్బలూ కేసులూ అలవాటైపోతాయి, మనకు కూడా యిదంతా రొటీన్‌గా జరిగేదే అని నార్మల్ అయిపోతుంది,” యేళ్ళ తరబడి పొలిటీషియన్‌గా పార్టీలు మారి యెప్పుడూ అధికారంలో వుండడానికే అలవాటుపడ్డ మొద్దు చర్మం నిర్లక్ష్యంగా అంది.

“అది కాదు, వీళ్ళే మన వోటర్లు…” ఆందోళన పడిందో బట్టతల.

“నిజమే, పదమూడున్నర కోట్ల వోట్లు తీసేయడం కాదు, రేపు యీ జెన్-జీని వోటర్ల లిస్టులోంచి యెలా తప్పిస్తాం… అది ఆలోచించండి,” బెదిరిపోతూ అందో కళ్ళజోడు.

“కొందర్ని తప్పించొచ్చేమో కాని అందర్నీ వొకేసారి తప్పించలేం?” తలని అడ్డంగా వూపిందో పంచె.

“అందర్నీ వొకేసారి తప్పించాలంటే, యీ జెన్-జీ ముప్పు పోవాలంటే వొక్కటే మార్గం…” అన్నాడో నిలువు నామాల మేధావి.

అంతా అతనివైపు చూశారు… తహతహలాడుతూ. చెప్పమన్నట్టు అక్కడి వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది… అటెన్షన్ యిస్తూ టెన్షన్ పడుతూ.

“కాని యిది జీవోగా తేవాలి…” నామాల మేధావి కండిషన్‌గా చెప్పిన మాట పూర్తికాకముందే, “పార్లమెంటులో మెజారిటీ మద్దతు సంపాదించి జీవో తేవడం పెద్ద కష్టం కాదు,” అంది మొద్దు చర్మం, నమ్మకంగానే.

“కాని ప్రజలు వ్యతిరేకిస్తే?” ఆందోళన వీడలేదు బట్టతల.

“ప్రజలెవరండీ మధ్యలో బొక్కగాళ్ళు? పిల్లి గుడ్డిదైతే ఎలక యేదైనా చూపిస్తుంది,” అసహనం పెరిగిపోతూ వుండగా అంది పార్టీ పెద్ద తలకాయ.

“ముందు ఆ తేవాల్సిన జీవో యేమిటో చెప్పి యేడవండి?” అంది పంచె, కూర్చుంటే నడుంపట్టి నిలబడితే కాళ్ళు నొప్పిపెట్టి.

చెప్పమన్నట్టు చూశారంతా.

“ఓటింగ్ ఎలిజిబులిటీ ఏజ్… టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్సుటెండ్ చేస్తే చాలు,” నామాల మేధావి తన తెలివికి తానే మురిసిపోతూ గర్వంగా చూసింది.

“టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ట్వంటీ ఎయిట్ టు థర్టీ త్రీ… జెన్-జీలకు వోటు హక్కు తీసేసినట్టే,” అంటున్న కళ్ళజోడు ముఖమే కాదు, అన్ని ముఖాలూ వెలిగిపోయాయి.

“ఏవరేజ్ లైఫ్ స్పాన్ పెరిగింది. మేరేజ్ ఏజ్ పెరిగింది. రిటైర్మెంటు ఏజ్ ఎక్స్టెండ్ అయ్యింది. సో… సో…” నామాల మేధావి చెప్పడం పూర్తికాలేదు.

“సో… వోటర్ ఏజ్ పెరిగిందీ,” అందరూ ముక్త కంఠంతో అన్నారు.

“విద్యార్థులను రాజకీయాలకు దూరంగా వుంచాలని చాలా కాలంగా అంటున్నాం. తలిదండ్రులు కూడా అదే అంటున్నారు. ఈ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం యిస్తున్న వోటుని కొన్నాళ్ళు ఎక్స్టెండ్ చెయ్యడంలో తప్పు లేదు,” అంది పార్టీ పెద్ద తలకాయ.

“సాధ్యం కాదనుకున్న త్రీసెవెంటీనే సాధ్యం చేశారు, యిదెంత?” గట్టినమ్మకంతో కితాబిచ్చారు కొందరు.

“అర్థమైంది, దేశాన్ని మరోసారి కశ్మీర్ చెయ్యాలి!” అంది ఆలోచనగా తలూపుతూ పార్టీ పెద్ద తలకాయ.

వ్యూహ రచన!

“వాళ్ళ బలహీనతే మన బలం!”

“కుర్రాళ్ళకు బలహీనతలు యేముంటాయి?, మనం ఆడుకోనేవి?”

“ఉంటాయ్ వాడుకోనేవి. మంచితనం. ఈ దేశాన్ని బాగుచెయ్యాలని… తమ భుజాలమీద పెట్టుకు మోయ్యాలని…”

“వాళ్ళ మంచితనంతో వాళ్ళనే అదుపు చెయ్యడమా… అదెలా?”

“అక్కడికే వస్తున్నా, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి యిప్పటివరకూ జరిగిన అన్ని ప్రొటెస్ట్‌లను స్టడీ చేయించా, సమ్మరీ వచ్చేసింది”

“బాగుంది, కాని వాళ్ళు లాఠీలతో కొడితే కాస్తున్నారు, రౌడీలతో తన్నిస్తే యేడుస్తున్నారు… కాని తిరగబడడం లేదు, అలా తిరగబడితే- తిరిగి మనం కొట్టో కాల్చో పరిస్థితిని ఈజీగా అదుపులోకి తేవచ్చు… కాని…”

“అదికాదు, నే చెప్పేది విను. ఏ అమ్మాయినీ యే అబ్బాయీ అల్లరి పెట్టడం లేదు చూడు. వాళ్ళకి జెండర్ సెన్సిబులిటీ వుంది…”

“ఉంటే?”

“దొరికారు నా కొడుకులు. జెంట్స్ మీదికి మన లేడీ కానిస్టేబుళ్ళని వదులుదాం. వాళ్ళు రెస్పెక్ట్‌బుల్‌గా వుంటారు. మన పని స్మూత్‌గా జరిగిపోతుంది…”

“ఐడియా బావుంది… “

“ఆడపిల్లల మీదికి మన మగ పోలీసుల్ని దింపుదాం. పోలీసులు. అందులో మగాళ్ళు. ఇంక చెప్పక్కర్లేదు. సరెండర్ అయిపోతారు…”

“నాకర్థమయిపోయింది… సగం మూమెంటు అదుపులోకి వచ్చేసింది, అందుకే మీకు హోమ్ యిచ్చింది…”

“హహ్హహ్హా… హహ్హహ్హా…”

తెరవెనుక…

దొర్లి దొర్లి పొర్లి పొర్లి యేడుస్తున్నాడు ‘జ్ఞా’.

‘మో’ ‘షా’ యిద్దరూ ‘జ్ఞా’ని పట్టుకొని బుజ్జగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చేసేకొద్దీ ‘జ్ఞా’ రెచ్చిపోయి పిచ్చివాడిలా అరుస్తున్నాడు.

“మేమున్నాం, నీకేం కాదు…” నచ్చజెప్పడానికి ట్రై చేశాడు ‘షా’.

“ఏం కాదా? నా స్కిన్ చిరిగితే మీ యిద్దరిదీ చిరుగుతుంది… ఆ…” హెచ్చరికగా అన్నాడు ‘జ్ఞా’.

ఆమాటతో ‘మో’ ‘షా’లు యిద్దరూ ముఖా ముఖాలు చూసుకున్నారు.

“నా పని అయిపోయిందనుకో… మీ పనీ అయిపోయినట్టే… రెడీగా వుండండి,” కళ్ళముందు భవిష్యత్తు చిత్రపటం చూస్తున్నట్టే చెప్పాడు ‘జ్ఞా’.

“ఏమీ కాదు మిత్రోం…” ‘మో’ చెప్పబోయాడు.

“ఏమీ కాదా? అయితే వెళ్ళి ఫారిన్ కంట్రీస్ జాలీగా తిరిగిరా… వెళ్ళు… అలవాటేగా?” అని తన లెంపలు తనే వాయించుకున్నాడు ‘జ్ఞా’.

“ఎత్నీ తేజస్వీలోగ్ హై హమారా పాస్…” అన్నాడు ‘మో’.

“నువ్వేం మాట్లాడుతున్నావ్?” ‘షా’కి కోపం వచ్చింది.

“టెలీప్రామ్టర్ లేదు కదా?” యేదో వొకటి అన్నట్టు అర్థం చేసుకోమన్నట్టు చూశాడు ‘మో’.

“నిన్ను సీటులో కూర్చోపెట్టాను చూడు…” అని తన చెప్పు తీసుకొని తనే చెంపలమీద కొట్టుకున్నాడు ‘జ్ఞా’.

“నువ్వు నన్ను కూర్చోబెట్టావా? నేను నిన్ను కూర్చోబెట్టానా?” ‘మో’కి కోపం వచ్చింది.

“నన్ను వొత్తినే కూర్చోబెట్టావా? నిన్ను యెప్పటికీ కూర్చోబెడతానని నన్ను కూర్చోబెట్టావు…” ‘జ్ఞా’కి వచ్చింది ఆవేశమో ఆందోళనో తెలియడం లేదు.

“ఇప్పుడు మనం గొడవలు పడడం కాదు, గొడవలు యెలా ఆపాలో ఆలోచించండి,” అన్నాడు ‘షా’.

“అది మీ పని,” అంత ఆవేశంలోనూ బాధ్యతని గుర్తుచేశాడు ‘జ్ఞా’. అక్కడితో ఆగిపోలేదు, “మీకోసం యెన్ని జెన్యూన్ వోట్లు తీసేశానూ… మరెంతమందికి వోట్లిచ్చానూ? కుక్క పేరుమీద కూడా వోటిచ్చాను. ఫారినర్స్‌కి కూడా వోటిచ్చాను. ఒకరికి వొక వోటు కాదు. అది వొదులు. ఇంటికి ఐదొందలు… యెనిమిది వందల వోట్లిచ్చాను. అది కూడా అక్కడ యిల్లే లేకుండా. నాలాంటి వాణ్ని వొక్కణ్ని వొక్కణ్ని చూపించు…” తిక్కరేగిపోయినట్టు తిరగబడుతూ రొప్పుతున్నాడు.

“మేం కూడా చెయ్యాల్సింది చేస్తూనే వున్నాం కదా? వదిలెయ్యలేదు కదా? వోటింగ్ మిషన్లు టాంపర్ చేశాం. ఎలక్షన్స్ అయ్యాక నీమీదికి యే గొడవా రాకుండా ఈవీయంలను తగలబెట్టించాం…” ‘షా’ యింకా చెప్పబోతుంటే-

“జ్ఞా’జీ… మీకు తెలుసు. మిమ్మల్ని కాపాడడం కోసం…” ‘మో’ చెప్పబోయాడు.

“నన్ను కాపాడడం కోసం కాదు, మిమ్మల్ని మీరు కాపాడడం కోసం…” ‘మో’ మాటని సరిచేశాడు ‘జ్ఞా’.

“నిన్నూ నన్నూ కాదు, మనల్ని మనం కాపాడడం కోసం…” సర్దే ప్రయత్నం చేశాడు ‘షా’.

“కోసం ఆర్ముడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ని దించాను. సెంట్రల్ రిజర్వుడ్ పోలీసుల్ని దించాను. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల్ని దించాను. ఐటిబిపిస్‌ని… మొత్తం రెండువందల యిరవైయ్యొక్క కంపెనీల కేంద్ర బలగాలను దించాను…” చెప్పుకుపోతున్నాడు ‘మో’.

“దించకపోతే నిన్ను దించేస్తారు…” మధ్యలో వుక్రోషంగా నవ్వాడు ‘జ్ఞా’.

“నీ కోసం… సారీ మనకోసం… యాభైయ్యేడు మెట్రో స్టేషన్లు క్లోజ్ చేశాం, రెండువందల యాభైకి పైగా రైళ్ళు రద్దు చేయించాం. ఇంకా ఇంటర్నెట్ బందు చేయించాం…” ‘షా’ చెపుతుంటే-

“ఎవడి కోసం?” పొగరుగా అన్నాడు ‘జ్ఞా’.

‘షా’ ‘మో’ వొకర్ని వొకరు చూసుకొని పెద్దగా నిట్టూర్చారు. అంతలోనే కళ్ళతో సౌజ్ఞ చేసుకొని-

“అది కాదు, మేం యెంత కష్టపడుతున్నామో మీకు అర్థం కావడం లేదు…” అని ఆగి, టాబ్లెట్ వేసుకొని “సీజేపీ నాయకుల్ని డిటెన్షన్ కాదు కిడ్నాప్ చేశాం. స్టూడెంట్స్‌ని యిరగ కుమ్మేశాం. జర్నలిస్టుల్ని లోపలేశాం. అపోజిషన్ లీడర్లనే కాదు, మాజీ సియ్యమ్ముల్ని కూడా అరెస్టు చేశాం. యాభైవేలమంది పోలీసుల్ని మొహరించాం…” చెపుతూ వున్నాడు ‘షా’.

“సాల్వ్ చెయ్యలేకపోతే యెందుకు?, పాకిస్తాన్ పొండి,” మధ్యలో పిచ్చి ప్రేలాపనలా పేలాడు ‘జ్ఞా’.

“పదివేలమంది సీజేపీ వాళ్ళని నిర్భంధించాం. ఏడెనిమిది వేల మందిని డిటెన్షన్ చేశాం…” అలసి ‘షా’ ఆగితే-

“రోడ్లమీద మేకులు కూడా వేశాం…” మధ్యలో తలూపుతూ అందించాడు ‘మో’.

“మనం ఆ రోడ్డు మీదకు రాకుండా చూసుకోండి,” శాంతపడలేదు ‘జ్ఞా’.

“ఒకవైపు మన ఐటి సెల్ కష్టపడుతోంది… మరోవైపు నిముషానికో వీడియో చప్పున యీ ఐదు నెలల్లో యెన్నో వీడియోలను డిలిట్ చేస్తున్నాం…” ‘షా’ చెపుతుంటే-

“నేను కూడా యూట్యూబ్ వీడియోలు చేశాను…” గర్వంగా చెప్పాడు ‘మో’.

“రేపు అవే చేసుకుందాం… దిగిపోతే,” తలూపుతూ సౌమ్యంగా అన్నాడు ‘జ్ఞా’.

‘జ్ఞా’ మాటల్ని పట్టించుకోకుండా “జంతర్ మంతర్‌లో నిరసనలు చెయ్యకుండా నిషేధిత స్థలంగా ప్రకటించాం…” అన్నాడు ‘మో’.

“అవన్నీ వద్దు, రిసల్ట్ చెప్పు?” తెగింపుగా అన్నాడు ‘జ్ఞా’.

“దిమాక్ కరాబ్ ‌హో గయా క్యా?” ‘మో’ సహనం కోల్పోయాడు. ‘జ్ఞా’కాలర్ పట్టుకున్నాడు. ఇద్దరూ కుస్తీలు పట్టారు. కిందా మీదా దొర్లారు. అలిసిపోయి ఆగారు.

“అయిపోయిందా?” అడిగాడు ‘షా’. రెండు క్షణాలు వ్యవధియిచ్చి “మమ్మల్ని యేమి చెయ్యమంటావో చెప్పు. చేస్తాం…” ప్లీజింగుగా అడిగాడు.

“మీరేం చెయ్యలేరు, నాకు తెలిసిపోయింది. నేను అప్రూవర్‌గా మారిపోతాను…” అన్నాడు ‘జ్ఞా’ వొక నిశ్చయానికి వచ్చినట్టు.

లేచి దులుపుకు వెళ్ళిపోతున్న ‘జ్ఞా’ని చూసి ‘మో’ ‘షా’ పరుగున వెళ్ళి అడ్డంపడి ఆపి “యేంటిరా… అప్రూవర్‌గా మారిపోతావా? అంటే ఆ అపోజిషన్‌గాడి మాటే నువ్వూ అంటున్నావంటే…” అర్థమయిపోయింది అన్నట్టు తలలు ఆడించి మీద పడ్డారు. కొట్టుకున్నారు.

అప్పుడే పోలీసులు వచ్చారు.

“ఏం జరుగుతోంది?” అడిగారు.

“స్టేట్ ప్లే,” తడబడుతూ చెప్పాడు ‘జ్ఞా’.

“కాదు, స్ట్రీట్ ప్లే,” కూడబలుక్కున్నట్టు బెదరకుండా చెప్పారు ‘మో’ ‘షా’.

తెరపడింది!

జంతర్ మంతర్!

“నిరసనని నిషేధించలేదు?”

“మరి?”

“జంతర్ మంతర్‌ని నిరసన స్థలాల నుండి అఫీషియల్‌గా తీసేశారు!”

“ఎందుకూ?”

“ఇప్పుడు స్టూడెంట్స్ యెక్కడ వుంటే అక్కడే జంతర్ మంతర్!”

“ఇప్పుడు దేశమే వొక జంతర్ మంతర్!”

*

బమ్మిడి జగదీశ్వరరావు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.