
“కావాల్సినవన్నీ పెట్టుకున్నావు కదా! అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చాలా బిజీ అయిపోతాను. అప్పుడు వచ్చి అది లేదు ఇది లేదు అంటే కుదరదు. ముందరే చెప్తున్నాను” అంటూ స్వతహాగా పెళ్ళైన ఆడవాళ్ళల్లో ఉండే ఆ భార్యా బెదిరింపు అనే లక్షణాన్ని వాడుతూ చెబుతున్నట్టుగా అనిపించింది.
“అబ్బా! అన్ని సర్దుకున్నానులే గానీ, నాలుగు రోజులు మీ ఇంట్లో ఉండాలంటావా? అదేదో పెళ్లి జరిగే రోజు అక్కడ ఉంటే సరిపోతుంది ఏమో కదా!.” భర్తను అన్న విషయం మర్చిపోయి సగటు మగాడిలాగా లోపల నుండి అనుకోకుండా వచ్చేసిన ఆ మాటల బాణం తిరిగి నాకే వచ్చి గట్టిగా గుచ్చుకుంటుందని తెలిసినా కూడా ఏదో ఓ చిన్న ప్రయత్నం అయితే చేశాను.
నేనన్న మాటకి సమాధానం ఏమి వచ్చుంటుందో భర్తల సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి భర్త మహాశయులందరికీ తెలిసిందే! “నేను మా పుట్టింట్లో పెళ్లికి వెళ్లి ఎన్ని ఏళ్ళు అయింది? మీ ఇంట్లో పెళ్లి అయితే పది రోజులు ముందరే వెళ్లి చాకిరి చేయాలి. నువ్వు మటుకు ఆ రోజున అలా వచ్చి ఇలా వెళ్ళిపోతావు బ్లా… బ్లా… బ్లా…బ్లా…” అని మొదలెట్టింది.
మొత్తానికి ఎయిర్పోర్ట్ చేరుకునేసరికి లేట్ అవ్వడంతో టెర్మినల్ కి వెళ్లడానికి హడావిడిగా నడుస్తూ ఉంటే అతి సహజ సిద్ధమైన జెన్ ౙీ పిల్లల్లాగే ఫోన్ చూసుకుంటూ కూల్ గా నడుచుకుంటూ వస్తున్నాడు జెన్ ౙీ నా పిల్లాడు. అదే మా అబ్బాయి సంహిత్.
నాకంటే మాటల బాణాలు కానీ వాడికేముంది మొన్ననే హై స్కూల్ కి వచ్చిన పిల్ల వెధవ. అలా నడుచుకుంటూ వస్తున్న వాడి వైపుకి చూపుల బాణం వేసింది నా భార్య ఇందిర. అంతే ఆ బాణం తగిలిన వాడు వెంటనే ఫోన్ తీసి జేబులో పెట్టి గబగబా నడవడం మొదలుపెట్టాడు.
ఫ్లైట్ ఎక్కంగానే మళ్లీ మొదలుపెట్టింది. “ఆల్రెడీ మా చుట్టాలందరూ వచ్చేసి ఉన్నారు. ఇదిగో వీడి పరీక్షల వల్లే మనం ఆలస్యంగా వెళ్లాల్సొస్తోంది. కాబట్టి మనం వెళ్ళంగానే అందరూ నిన్ను పలకరిస్తారు. నువ్వు కూడా పేరుపేరునా అందరినీ పలకరించడం మర్చిపోకు. అసలే నీకు మనుషుల మొహాలు ఇంకా వాళ్ల వరసలు అస్సలు గుర్తుండవు. ఎదురుగా ఉన్న మనిషిని వేరే పేరుతో పలకరించగలవు జాగ్రత్త” అంటూ నాలో ఉన్న గజినీని బయటికి తీసింది మళ్లీ.
*
ఫ్లైట్ దిగిన మేము నేరుగా క్యాబ్లో పెళ్లి ఇంటికే చేరుకున్నాము. ఇందిర ఇంట్లో నాకు గట్టిగా తెలిసిన ముఖాలు మా అత్తగారు, మామగారు ఇంకా నా బామ్మర్ది. వీళ్లు కాకుండా ఎవరు ఎటు నుంచి వచ్చి పలకరిస్తారా అంటూ బిక్కు బిక్కున కారు దిగి నడుచుకుంటూ వస్తుండగా…
“అల్లుడుగారూ బాగున్నారా?” అంటూ చేయి ముందుకు చాస్తూ వచ్చాడు ఒక ఆయన.
వెంటనే నాలో ఉన్న గజినీ నిద్రలేచాడు. మా మామగారు కాకుండా నన్ను ఇంకొకళ్ళు అల్లుడుగారు అంటున్నారు అంటే ఇతను ఎవరై ఉంటాడు? నేను ఇప్పుడు ఈయనని ఏమని పిలవాలి? అంటూ ఆలోచిస్తూ ఉండగా వెంటనే పక్కకు వచ్చిన ఇందిర “బాబాయ్ ఎలా ఉన్నావు?” అంటూ ఆయన్ని పలకరించడంతో ఊపిరి పీల్చుకున్నాను.
ఇందిరా పక్కకి వెళ్లడంతో “మేమంతా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు చిన్న మావయ్య గారు? పెళ్లి ఏర్పాట్లు బాగా జరుగుతున్నట్లు ఉన్నాయి. ఇంతకి పెళ్లికూతురు తేజస్విని ఎక్కడ?” అంటూ లేనిపోని ఆప్యాయతని తెచ్చి పెట్టుకుని మాట్లాడుతూ, జరుగుతున్న పెళ్లి ఏర్పాట్లని గమనిస్తున్నాను.
“పెళ్లికూతురు పేరు తేజస్విని కాదు అల్లుడుగారు. అది నా మొదటి కూతురు పేరు. ఇప్పుడు పెళ్లి నా రెండో కూతురుది కదండీ! మన మనస్వినిది” అన్న వాళ్ళ బాబాయ్ మాట అక్కడే దగ్గరలో ఉండి వినిపించుకున్న ఇందిర ఒక్కసారి ఆ చూపులతో మళ్ళీ వదిలింది బాణాన్ని. కనీసం పెళ్లికూతురు పేరైనా గుర్తుంచుకోలేవా అన్నట్టుగా వచ్చింది ఆ చూపుల బాణం లో నుంచి ఒక ఇన్నర్ వాయిస్.
ఇలా కాదని నేనూ, సంహిత్ కలిసి లోపలికి వెళ్ళాము తయారవ్వడానికి. తయారైన కాసేపటికి బయటకు వెళదాము అనుకుంటుండగా ఎవరో తలుపు కొట్టారు. ఎవరా అని తలుపుతీస్తే మా మామగారు ఇంకా నా బామ్మర్ది.
“టిఫిన్ చేద్దురు గాని రండి అల్లుడుగారు!” అంటూ దగ్గరుండి తీసుకెళ్లడానికి వచ్చారు.
కాఫీ, టిఫిన్లు కానిస్తున్నంతసేపూ ఒకటే డైలాగ్. అదేదో సినిమాలో ఆలీ అన్నట్టు “బాగున్నారా! బాగున్నారా!” చిరాకు పుట్టింది. ఈ బాగున్నారాలన్నీ కానించుకొని వెళ్లి సంగీత్ జరుగుతున్న చోట కూర్చున్నానో లేదో వెంటనే మొదలైంది మా ఆవిడ డాన్స్ ప్రోగ్రాం.
అరే! ఇందాకే అంత జర్నీ చేసి వచ్చిందో లేదో అప్పుడే స్టేజి ఎక్కి డాన్స్ చేయడానికి ఎక్కడ లేని ఓపిక వచ్చింది. అదే వీకెండ్ వచ్చేసరికి పొరపాటున మొగుడు ఏదైనా చేసి పెట్టమని అడిగితే “ఆఫీసులో పని చేసి చేసి టైర్డ్ అయిపోయానండి బయటి నుంచి ఏమైనా తెచ్చుకుందామా?” అంటూ ఒక నీరసపు ముఖాన్ని నా మొహాన పడేస్తుంది.
అక్కడ అలా తను డాన్స్ మొదలుపెట్టిందో లేదో ఇక్కడ ఇలా నా చుట్టూరా మూగాయి కాకులు అదే ఐ మీన్ చుట్టాలు.
“మీరు కూడా పైకెళ్ళి ఒక స్టెప్ వెయ్యండి అల్లుడుగారూ” అంటూ ఒకటే గొడవ. వీళ్లు వీళ్ళ పైత్యాలు అనుకొని ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాను. కాసేపటి తర్వాత జెట్లాగ్ వల్ల నిద్ర వచ్చి అక్కడే కుర్చీలోనే నిద్రపోయాను ఆ సంగీత్ లోని దారుణమైన డాన్సులు చూడకుండా.
మొదటిరోజు మొత్తానికి ఈ పలంకరింపులతో, డ్యాన్స్ ల గోలతో ముగిసింది.
*
ఇంక రెండో రోజు, అదే పెళ్లి జరగాల్సిన ముఖ్యమైన రోజు రానే వచ్చింది. మనం ఎలాగో పెళ్లి కూతురు తరపున కదా పొద్దునే ఆ స్నాతకం వాటికీ మనం ఎందుకులే అనుకొని తీరికగా పడుకున్నాము నేను, నా సంహితుడు.
“ఆలస్యంగా తయారై వచ్చినా అదిరిపోయేట్టుగా రెడీ అయి వచ్చారే అల్లుడుగారు” అన్నాడు ఒకాయన. ఇంతకీ అతను మావయ్యా? బాబాయా? చిన్నమామయ్యా? ఎవడో ఆ దేవుడికే తెలియాలి కానీ ఈ గజినీకి ఏమి తెలుస్తుంది. వాడు మనల్ని పొగిడినట్టా తిట్టినట్టా అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పక్కకి పిలిచింది నా భార్యామణి.
“బాబాయ్ వాళ్ళకి బట్టలు పెట్టాలి. వస్తారా కొంచెం?” అంది బాణాలు విసరడానికి సిద్ధమైన విల్లు లాంటి కోపపు ముఖాన్ని పెట్టుకొని.
అలా వాళ్ళకి బట్టలు పెట్టడానికి నడుచుకుంటూ వెళుతున్నామో లేదో ఈలోగానే రెండు మూడు బాణాలు టకా టకా మంటూ వదిలింది. ఈరోజు పెళ్లి పెట్టుకుని ఇంత ఆలస్యంగా లేవడమేంటి? ఎంత ఇంటి అల్లుడైతే మాత్రం ఎవరూ ఏమి అనరులే అనా? నిన్న సంగీత్ లో డాన్సులు చూడకుండా అలా నిద్రపోయారేంటి? అరే! కనీసం పెళ్లికొడుకు, పెళ్ళికూతురు డాన్స్ కూడా చూడలేదు బ్లా… బ్లా…బ్లా…బ్లా.
ఇంక పెళ్లి ముహూర్తం అర్థరాత్రి అయ్యేసరికి జెట్లాగ్ వల్ల మంచి హుషారుగా ఉన్నాను. పెళ్ళంతా చక్కగా బానే జరిగిపోయింది. ఆశీర్వచనానికి మేమిద్దరం స్టేజి మీదకి వెళ్లాము.
“హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు బోత్ ఆఫ్ యు” అని తెచ్చిన గిఫ్ట్ ని వాళ్ళిద్దరి చేతిలో పెట్టాం. మీరు ఎక్కడ పని చేస్తుంటారు? మీ వివరాలు ఏంటి? అంటూ పెళ్లి కొడుకుతో నా సంభాషణ సాగుతూ ఉండగా పక్కనుండి వచ్చిన ఒక ఆయన…
“ఏం బాబు ప్రయాణం అలసట తీరిందా? నిన్న సంగీత్ లో కూడా మా వాడి డాన్స్ అది చూడకుండానే నిద్రపోయావే?” అంటూ ఏదో బాగా చనువున్న వ్యక్తి లాగా మాట్లాడుతున్నాడు. వీడే ఎవడో గుర్తు రావట్లేదు అనుకుంటే ఇంకా వీడి కొడుకు వాడి డాన్స్ కూడానా.
ఇంత చనువుతో కూడిన మాటలు, ఈ కటౌట్ ని కలిపి ఎక్కడో చూసినట్టుందే! అని ఆలోచిస్తున్న నా గజిని బుర్రకి పదును పెట్టేంతలో…
“అల్లుడుగారు! అక్కడ ఏదో సహాయం కావాలంటున్నారు. ఒకసారి ఇలా రండి” అంటూ ఇంకో వ్యక్తి వచ్చి తోలుకుపోయాడు నన్ను.
ఏదో అల్లుడిని కదా అని చిన్న పనిలో సహాయం అడగడం, వాళ్ళు అడిగినంతలో నేను చేయడం, ఆ తర్వాత ఇవతలకు వచ్చి నేను నా సంహితుడుతో కలిసి ఫోన్లో రీల్స్ చూసుకుంటూ ఉండడం. ఇదే పెళ్లిలో మా పని.
ఇలా రాత్రంతా పెళ్లి హడావిడి అయ్యి, తెల్లవారుఝామున నాలుగు గంటలకు కాసేపు నడుము వాల్చారు అందరూ.
*
ఇంక మూడో రోజు. కొత్తగా పెళ్లయిన జంట వ్రతం చేసుకుంటున్న రోజు. ఇవాళ అంతకుముందు రెండు రోజుల్లా కాకుండా ముందరే లేచి తయారయ్యి “ఆ ఏంటి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాము? అదే వ్రతానికి?” అంటూ ఆమె బాణాల ధాటిని తగ్గించడానికి నా ప్రేమ బాణాన్ని వాడుతూ యాక్టివ్ గా పలకరించాను నా శ్రీమతిని.
“ఆల్రెడీ వ్రతం మొదలైంది. కావాలంటే మీరు నాన్న వాళ్ళతో కలిసి వెళ్ళండి. నేను కాసేపట్లో వస్తాను” అంది ఇందిర.
“అది సరేగాని ఇంతకీ పెళ్లికి మీ మేనమామ రాలేదేంటి?” అంటూ భార్య పుట్టింటిపైన అల్లుడిగా నాకు ఉండే పెత్తనాన్ని, హక్కుని చలాయించే ప్రయత్నం చేసిన నన్ను, ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్లుగా చూసిన ఇందిరని ఎవరో పిలిచేసరికి వేయాల్సిన బాణాన్ని హోల్డ్ లో పెట్టి వెళ్లినట్టుగా వెళ్ళింది.
ఇల్లు దగ్గరే అవడంతో వ్రతము, భోజనాలు అయిపోయి తిరిగి మేమున్న గదికి వెళ్లి విశ్రాంతి తీసుకోవడానికి బయలుదేరాము. నేను నా బామ్మర్ది కలిసి నడుస్తూ ఉండగా వాడిని ఇదే ప్రశ్న అడిగాను “మీ మేనమామ రాలేదేంటి పెళ్లికి?” అని.
“బావ! మా మేనమామ ఎవరో నీకు గుర్తు లేదా?” అంటూ ఆశ్చర్యంగా అడిగాడు నా బామ్మర్ది.
“ఎహే… ఊరుకో! మా పెళ్లి సంబంధం కుదిరిచ్చిందే మీ మేనమామ. నాకెందుకు గుర్తులేదు. మీ మేనమామ…మీ మేనమామ…ఆయన పేరు…ఆ రామ్మూర్తి” అంటూ చాలా సునాయాసంగా సమాధానాన్ని ఇచ్చేశాను.
“మరి ఇందాక అక్కడ వ్రతంలో…” అని బామ్మర్ది ఏదో చెప్తుండగానే పక్కకు వచ్చి అతని మాటలను ఆపింది ఇందిర.
“నువ్వెళ్ళు. మీ బావ తోటి నేను మాట్లాడాలి” అంటూ విల్లును ఎత్తడానికి సిద్ధంగా ఉన్న వీర వనిత లాగా నా పక్కన నడుస్తూ మాట్లాడుతోంది.
సీరియస్ గా ఉన్న ఆమె ముఖాన్ని చూసి “ఏమైంది ఇందిర?” అంటూ ఎక్కడ తప్పు చేశానా అని లోపల బిక్కుబిక్కున భయపడుతున్న భర్తగా అడిగాను.
నాలో ఉన్న గజినీగాడు ఏదైనా తప్పు చేశాడా? ఏమో తెలీదు. మళ్లీ అడిగాను ఏమైందని.
“మనకి ఈ పెళ్లికి సంబంధించిన శుభలేఖ వచ్చింది గుర్తుందా?” అని అడిగింది.
“అవును గుర్తుంది.”
“అందులో పెళ్ళికొడుకు, పెళ్ళికూతుర్ల పేర్లు కూడా ఉన్నాయి కదా!” విల్లు యొక్క తాడుని గట్టిగా బిగిస్తున్నట్టుగా ఉంది ఆమె ప్రశ్న.
“ఆ. ఉన్నాయి. కాకపోతే మీ బాబాయి పెద్ద కూతురు పేరుకి చిన్న కూతురు పేరుకి ఏదో చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది” అంటూ అలవోకగా తీసిపడేశాను ఆ కన్ఫ్యూజన్ తాలూకు తప్పుని.
“వరుడు పేరు కి పైన తల్లిదండ్రుల వివరాలు వేసుంటారేమో కదా!” బాణాన్ని తీసి విల్లుకి ఎక్కుపెట్టినట్టుగా అనిపిస్తోంది.
“ఉండే ఉండుంటాయి. నేను పెద్దగా ఆ డీటెయిల్స్ ని చూడలేదు. ఇన్ఫాక్ట్ పెళ్లికూతురు తల్లిదండ్రులైన మీ బాబాయ్ వాళ్ళ పేర్లు కూడా నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు” అంటూ నా మాట వేగం తగ్గి ఏమి చెప్పబోతోందా అన్నట్టు భయంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాను.
ఎక్కు పెట్టిన బాణాన్ని వదలకుండా అక్కడే వదిలేసి వెళ్లిపోయినట్టుగా వెళ్ళిపోయింది ఇందిర. ఏమైయుంటుందా అని ఆలోచిస్తూ నడుస్తూ ఉండగా నా వెనకాలే వచ్చిన సంహితుడు అదే మా అబ్బాయి సంహిత్…
“డాడ్! నిన్ను రామ్మూర్తి తాతయ్య ఒకసారి రమ్మంటున్నారు” అన్నాడు.
అబ్బా మళ్లీ వెనక్కి వెళ్లాలా అనుకుంటూ వెళ్లి నా పుత్రుడి సహాయంతో ఆ రామ్మూర్తి ఎవరో తెలుసుకుని ఆయన్ని కలవంగానే “ఏం లేదు బాబు! నా స్నేహితుడొకడు అమెరికాకి రమ్మని ఒకటే గొడవ చేస్తున్నాడు ఆ ప్రొసీజర్ కి సంబంధించిన వివరాలు మీతో మాట్లాడదామని మళ్లీ రమ్మన్నాను. మీరు వచ్చిన రోజే మాట్లాడదాం అనుకున్నా ఈ పెళ్లి హడావిడి సరిపోయింది అనుకోండి” అంటూ ఎవరెవరికో ఫోన్ పేలు చేస్తూ ఉన్నాడు.
“పెళ్ళికి ఖర్చు అంతా మీరే పెడుతున్నట్టు చేస్తున్నారే ఫోన్ పేలు!” అని ఆటపట్టించడానికి అన్నట్టుగా సరదాగా అన్నాను అల్లుడిగా తెచ్చి పెట్టుకున్నటువంటి చనువుతో.
“కొడుకు పెళ్లికి ఆ మాత్రం ఖర్చు చేయకపోతే ఎట్లా చెప్పండి” అంటూ సాగుతూనే ఉన్నాయి ఫోన్ పేలు.
ఏమిటన్నాడు? అప్పుడు ఆశీర్వచనం అప్పుడు కూడా ఇలాగే మా వాడి డాన్స్ చూడకుండా పడుకున్నారే అన్నాడు. అంటే… ఒక్కసారిగా గుండె ఝలక్ అన్నట్టుగా అనిపించింది. మీ అబ్బాయి… పెళ్లి… అంటూ నసుగుతుండగా…
“బావగారు! ఒక్క నిమిషం మీతో ఒక మాట మాట్లాడాలి” అంటూ ఇప్పుడే వస్తానన్నట్టుగా సైగ చేసి మా మామగారి దగ్గరికి వెళ్ళాడు మిస్టర్ రామ్మూర్తి గారు.
మా మావయ్య గారిని ఈయన బావగారు అని పిలుస్తున్నాడు అంటే, ఈ పెళ్లికి ఖర్చు అంత ఈయన పెడుతున్నాడు అంటే, ఆ పెళ్ళికొడుకు యొక్క తండ్రి ఈయన అయ్యుంటే, ఆ పెళ్లికూతురు ఈయనకి మేనకోడలు అంటే, నా భార్యకి ఈయన…? జవాబు మెదడుకు తట్టగానే ఒక్క ఉదుటున అక్కడినుండి లేచి పరిగెత్తుకుంటూ వెళ్లాను మా గది వరకు.
మేము ఉండే గదిలో, ఆ గది చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు ఇందిర. బహుశా ఏదో పనిమీద బయటికి వెళ్ళి ఉంటుంది. ఇదే కదా దొరికింది సందు అన్నట్టుగా అక్కడినుండి మర్యాదగా మిగిలిన వాళ్ళకి చెప్పి బయలుదేరిపోయాను ఆ ఊళ్లోనే ఉంటున్న ఒక స్నేహితుడిని కలవడానికి.
*
కట్ చేస్తే నాలుగో రోజైతే నేను నా భార్యామణి పుట్టింట్లో అయితే లేను. ఆ వారం రోజుల ట్రిప్పులో మిగిలిన రెండు రోజులు కూడా నా స్నేహితుడుతోనే గడిపాను. భార్యామణిని మళ్లీ కలిసినప్పుడు ఏం చేస్తుందో అని గుండె గుబ గుబ లాడుతోంది.
ఈ వెధవ రోగం ప్రపంచంలో ఎంతమందికి ఉందో లేదో తెలియదు గాని నాకే బహుమతిగా ఆ దేవుడు ఎందుకు ఇచ్చాడా అనిపించింది. పేర్లు గుర్తున్నా ఆ పేరు గల మనిషి ముఖం గుర్తుండి చావదు. అందులోనూ భార్య తాలూకా అనేసరికి ఎవ్వరూ గుర్తు ఉండరు!
మొత్తానికి చివరి రోజు మళ్ళీ ఎయిర్పోర్టులో కలుసుకున్నాము. ఫ్లైట్ ఎక్కడమూ జరిగింది. ఎటువంటి బాణాలూ రావట్లేదు ఇందిర నుంచి. ఆశ్చర్యంగా అనిపించింది. ఇక బాణాలు, బాంబులు లాభం లేదని ఏకంగా అస్త్రాలను ప్రయోగిద్దాం అనుకుంటోందా ఏంటి! ఇంటికి వెళ్ళగానే బహుశా బ్రహ్మాస్త్రమేనేమో అని బెదిరిపోతుండగా…
“నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు!” అంటూ అందుకుంది.
“అది… అది…” అని నేను ఏదో చెబుతుండగా…
“కొత్తగా పెళ్లయిన వాళ్ళిద్దరికీ అలాంటి గిఫ్ట్ ఇవ్వాలని నీకెలా అనిపించింది!”
నన్ను తిడుతోందా? పొగుడుతోందా? ముఖం చూస్తేనేమో మామూలుగానే ఉంది. మాట చూస్తేనేమో నిదానంగా వస్తోంది. భగవంతుడా! ఇలాంటి భావోద్వేగాలను కలిగించడానికే భార్య అనే బంధాన్ని భర్తకు కట్టబెట్టావా నాయనా! అని ఇన్నర్ వాయిస్ లో అనుకునేంతలో…
“నిజంగా నువ్వు ఇంత బాగా ఆలోచిస్తావని ఎప్పుడూ అనుకోలేదు. ఆశీర్వచనం అప్పుడు నేను వాళ్ళిద్దరి కోసం బహుమానంగా తీసుకున్న స్మార్ట్ వాచీలు ఇస్తుంటే, దానిపైన ఇంకో కవర్ పెట్టి ఏమి ఇచ్చావా అనుకున్నాను! వాళ్ళిద్దరూ కలిసి హనీమూన్ కి వెళ్ళడానికి కులుమనాలి టికెట్స్ ఇచ్చావు. ఇట్స్ అన్ బిలీవబుల్.”
“మన పెళ్లయిన కొత్తలో నేను చెప్తే కానీ ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేయ్యని నువ్వు, ఇప్పుడు నీ అంతట నువ్వే వాళ్ళ కోసం హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశావు. అలాగే అమ్మ వాళ్ళని యుఎస్ కి తీసుకు వచ్చే ఏర్పాట్లు చేస్తానని కూడా చెప్పావంట కదా. నిజంగా నువ్వు మా వాళ్ల గురించి ఇంతలా ఆలోచిస్తావని ఎప్పుడూ అనుకోలేదు. దట్స్ ఆసమ్!” అంటూ పొగుడుతుండేసరికి నిజంగానే గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. అదేంటి తేలుతూనే ఉన్నాను కదా! అంతా ఫ్లైట్ మహిమ.
“అది సరే మరి… మరి… మీ మేనమామ ముఖాన్నే మరిచిపోయాను, అలాగే శుభలేఖ లో పెళ్ళికొడుకు డీటెయిల్స్ కూడా… “
“అదా సర్లే. ఎప్పుడూ ఉండేదేగా. మా వాళ్ల గురించి చెప్పిన సరిగ్గా వినవు. ఫోటోలు చూపించిన ఫోకస్డ్ గా చూడవు. ప్రతి సంవత్సరం తరచుగా కలుస్తుంటేనే నీకు జనాల ముఖాలు, ఇంకా వాళ్ల వరసలు అంతంత మాత్రాన గుర్తుంటాయి. ఇంకా మూడేళ్లకో నాలుగేళ్లకో కలిస్తే! మా వాళ్ళు ఏం గుర్తుంటారులే!” అని ఇందిర అన్న మాటలు వినంగానే భరించే వాడే భర్త అయితే బంధంతో అప్పుడప్పుడు బెదిరింపులతో కట్టిపడేసేదే భార్య అనిపించింది.
ఇదంతా విన్న నా పుత్రరత్నం వాళ్ళ అమ్మ బాత్రూం లోకి వెళ్ళగానే…
“డాడ్! ఇవన్నీ నీ ఐడియాస్ కాదు నావి అని మామ్ కి తెలిస్తే?”
“ఆపరా బాబు! అసలే కలగక కలగక మీ అమ్మకి నా మీద ఏదో మంచి ఇంప్రెషన్ కలిగింది. అయినా నీకు లేటెస్ట్ యాపిల్ లాప్టాప్ కొని పెడతా అన్నాను కదా!”
“యాపిల్ లాప్టాపా? ఇప్పటినుంచి వాడికి అంత కాస్ట్లీ లాప్టాప్ ఎందుకు?” అంటూ బాత్రూంలో నుంచి బయటికి వచ్చిన ఇందిర తండ్రి కొడుకుల మాటల మధ్యలో చేరింది.
“ఏం లేదులే ఏదో చిన్న పిల్లాడు కదా నేనే కొనిపెడతా అన్నాను” అంటూ కవర్ అప్ చేసే బిల్డప్ ఇచ్చాను కొంత అతి చేస్తూ.
“అంత కాస్ట్లీ ల్యాప్టాప్ కొనిస్తాను అన్నారంటే, దాని వెనకాల ఏదో పెద్ద రీజనే ఉండి ఉంటుంది. సంహిత్ నువ్వు చెప్పరా ఏం జరిగింది అసలు?”
“అది డాడ్ పెళ్లి వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ ఇంకా అమ్మమ్మ తాతయ్యలని ఇక్కడికి రప్పించమన్న ఐడియాస్ నావి. డాడ్ వి కాదు” అంటూ బాంబుని పేల్చేశాడు.
ఇంకేముంది మళ్లీ మొదలు. బాణాల వేట. తీస్తుంది గా భార్య నా తాట.
*









Add comment