“పుస్తకాలన్నీ ఒకటి కావు… కొన్ని భ్రమలను కల్పిస్తే… కొన్ని భ్రమలను తొలిగిస్తాయి.” అలా ‘శ్రీకాకుళం గిరిజన, రైతాంగ ఉద్యమాల’ పట్ల ఇప్పటివరకు మనకున్న భ్రమలను పటాపంచలు చేసే పుస్తకమే ఎస్.ఎ. విద్యాసాగర్ గారు రాసిన “శ్రీకాకుళం రైతాంగ, గిరిజన సాయుధ పోరాటం” అనే 474 పేజీల పరిశోధనా గ్రంథం. ఈ పుస్తకం తొలిసారిగా 2007లో ‘వెంకట్’ అనే కలం పేరుతో వెలువడింది. అయితే, రచయిత గత ఇరవయ్యేళ్లలో తాను ఏర్పరుచుకున్న సైద్ధాంతిక దృక్పథానికి అనుగుణంగా దీనిని పునర్రచన చేసి, మరలా మన ముందుకు తీసుకొచ్చారు. ఈ పుస్తకంలో ఏడు అధ్యాయాలున్నాయి. స్వాతంత్ర్యానికి పూర్వం, అంటే 1936లో ఒరిస్సా రాష్ట్రం ఏర్పడక ముందు విశాఖ, గంజాం జిల్లాల్లో భాగంగా ఉన్న, 1950లో శ్రీకాకుళం జిల్లాగా ఏర్పడిన ఈ ప్రాంతంలో 1970 వరకు జరిగిన గిరిజన, రైతాంగ పోరాటాలను మాత్రమే కాకుండా, రాజకీయ, సామాజిక, చారిత్రక, సాంస్కృతిక మార్పులను కూడా మార్క్సిస్టు దృక్కోణంలో మన కళ్లకు కట్టినట్లు చూపించిన పుస్తకం ఇది. ఉద్యమ క్రమంలో జరిగిన లోపాలను ఎత్తిచూపడమే కాకుండా, మార్క్సిస్టు దృక్కోణంలో వాటికి సరైన పరిష్కారాన్ని కూడా రచయిత ఈ పుస్తకంలో ప్రతిపాదించారు.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాకకు పూర్వం, నేటి శ్రీకాకుళంగా పిలవబడుతున్న ప్రాంతంలో భూములపై క్షత్రియులు, కొండరాజులు, వెలమ కులాలకు చెందినవారు ఆధిపత్యం కలిగి ఉండేవారు. కాపులు, కొప్పల వెలమలు, కళింగులు, గవరలు ప్రధానంగా కౌలు రైతులుగా ఉండేవారు. మంగలి, చాకలి వంటి సేవా కులాలకు జీవనం కోసం భూమిని కేటాయించేవారు. దళితులు ప్రధానంగా కూలీలుగా ఉండేవారు. అప్పటివరకు భూమిపై లేని ప్రైవేటు యాజమాన్య వ్యవస్థకు బ్రిటిష్ కంపెనీ పునాదులు వేసింది. రెవెన్యూ వసూళ్ల యంత్రాంగంగా ఉన్న జమీందారులకు శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ద్వారా భారీ భూఖండాలపై అధికారం కట్టబెట్టింది. 1802లో వైజాగ్ జిల్లా పరిధిలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అమల్లోకి రాగా, 1804 సంవత్సరం చివరి నాటికి గంజాం జిల్లాలో కూడా ఈ పద్ధతి అమల్లోకి వచ్చింది. మూడు సంవత్సరాల సరాసరి ఆదాయాన్ని లెక్కలోకి తీసుకొని, అందులో రెండు వంతులు కంపెనీకి, ఒక వంతు జమీందారులు తమ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకునే విధంగా శిస్తు (పేష్కష్) నిర్ణయ పద్ధతి అమల్లో ఉండేది.
విశాఖ, గంజాం జిల్లాల్లో బొబ్బిలి జమీందారీ, పర్లాకిమిడి జమీందారీ, విజయనగరం జమీందారీ, మందస జమీందారీ ఉండేవి. రైతులపై విపరీతమైన శిస్తుల భారం ఉండేది. కరువులు, ఆర్థిక మాంద్యం కారణంగా శిస్తులు చెల్లించలేక రైత్వారీ వర్గం తీవ్ర ఇబ్బందులు పడేది. ఈ కాలంలోనే రైతు సంఘాలు ఏర్పడటం, కమ్యూనిస్టులు రైతు సమస్యలను చేపట్టడం జరిగింది. ప్రథమ అఖిల భారత కిసాన్ సభ జమీందారీ రద్దును ప్రతిపాదించింది. మొత్తానికి 1948లో జమీందారీ రద్దు చట్టం వచ్చినప్పటికీ, ఆ చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని ఫ్యాక్టరీల పరిధిలోని భూములుగా, ట్రస్టుల రూపంలో వేల ఎకరాల భూములను తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఇది చదివినప్పుడే విజయనగరం మహారాజు మాన్సస్ అనే ట్రస్టును ఏర్పాటు చేసి విద్యాసంస్థలను నెలకొల్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో మనకు అర్థమవుతుంది. జమీందారీ పద్ధతి అమల్లో ఉన్న ప్రాంతాల్లో బ్రిటిష్ ప్రభుత్వం నీటిపారుదలకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టేది కాదు. కానీ, రెవెన్యూ వసూళ్లు పంట దిగుబడితో సంబంధం ఉన్న రైత్వారీ ప్రాంతాల్లో మాత్రం ప్రాజెక్టులు నిర్మించడానికి ఉత్సాహం చూపించింది. విశాఖ జిల్లా శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అమల్లో ఉన్న ప్రాంతంలో ఉండటం వల్ల ఇక్కడ ప్రాజెక్టులు నిర్మించలేదు. అందుకే ఈ ప్రాంతం నుంచి మలేషియా, బర్మా వంటి ప్రాంతాలకు వలసలు ఎక్కువగా ఉండేవి. గోదావరి, కృష్ణా జిల్లాల్లో ప్రాజెక్టులు నిర్మించడానికి కారణం రైతాంగంపై, వ్యవసాయంపై ప్రేమ కాదని, శిస్తు రూపంలో ఆదాయం పెంచుకోవాలనే ఆర్థిక ప్రయోజనమేనని ఈ పుస్తకం చదువుతుంటే మనకు అర్థమవుతుంది.
ఇక 1950–64 కాలానికి వచ్చేసరికి, అప్పటివరకు కొన్ని వర్గాల చేతుల్లోనే భూమి కేంద్రీకృతమై ఉండటాన్ని చూపిస్తూ, “రైతులందరికీ భూమి” అనే నినాదంతో కాంగ్రెస్ కరాచీ సమావేశంలో తొలిసారిగా భూసంస్కరణల అంశాన్ని ముందుకు తెచ్చింది. 1961లో భూకమతాల గరిష్ఠ పరిమితి చట్టం అమల్లోకి వచ్చింది. శాస్త్రీయ సామ్యవాద పునాదులపై ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ కూడా తరువాత భూసంస్కరణల వలలో చిక్కుకుందని రచయిత విశ్లేషించారు. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ద్వారా జమీందారులకు భారీ భూఖండాలు దక్కితే, జమీందారీ విధానం రద్దు తర్వాత గ్రామీణ బూర్జువా వర్గం భూమిని దక్కించుకుంది. రైత్వారీ విధానం అమల్లో ఉన్న ప్రాంతాల్లోనూ కొద్దిమంది రైతులకు ఎక్కువ మొత్తంలో భూములు దక్కాయి. సమాజపు క్రింది పొరల్లో ఉన్నవారికి మాత్రం భూమిపై యాజమాన్యం దక్కలేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో అశాంతి చల్లారలేదు సరికదా, ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రైతుల భూములకు సరైన నీటి సదుపాయం లేదు. సరైన రుణ సదుపాయం లేక ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసేవారు. ఒకవైపు పెరిగిన శిస్తులు, మరోవైపు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక రైతాంగం తమకున్న కొద్దిపాటి భూమిని కూడా వదులుకోవాల్సి వచ్చింది. రైతుల పరిస్థితి ఇలా ఉంటే, రైతు కూలీల పరిస్థితి మరింత అధ్వానంగా ఉండేది. శిస్తు వసూళ్లకు వ్యతిరేకంగా రైతులను సమీకరించిన పార్టీయే కూలి రేట్ల పెంపు కోసం, తప్పుడు కొలతలకు వ్యతిరేకంగా, బంజరు భూముల పంపిణీ కోసం రైతు కూలీలను ముందుకు తెచ్చింది. దీనిని చిన్న, మధ్యతరగతి రైతాంగం వ్యతిరేకించింది. ధనిక భూస్వామ్య రైతాంగం గ్రామాల్లో కూలీలకు సామాజిక బహిష్కరణ వంటి శిక్షలు విధించింది. దీనిని బట్టి రైతు కూలీల ప్రయోజనాల కోసం సంఘం నిలబడితే, తమ మిగులులో కొంత భాగాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేని రైతాంగం దానిని వ్యతిరేకించేదని మనకు అవగతమవుతుంది.
మైదాన ప్రాంతాల్లో భూమిపై కొద్దిమందికే హక్కును శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి, జమీందారీ రద్దు విధానాలు తోడ్పడితే, ఏజెన్సీలో సైతం జమీందారీ విధానం రద్దుతో కొండరాజులు పెద్ద మొత్తంలో భూములను కోల్పోయారు. ప్రభుత్వం ఒక్క కలం పోటుతో అప్పటివరకు తమదేనని భావించిన అడవిపై గిరిజనుల హక్కులను హరించింది. ఈ అటవీ ప్రాంతంలో వ్యవసాయ భూములకు కౌలుదారులుగా ఉన్నవారిని ముస్తాజాదారులు అనేవారు. జమీందారులు గూడెం పెద్దలను తొలినాళ్లలో ముస్తాజాదారులుగా నియమించి, వారి సహాయంతోనే పన్నులు వసూలు చేసేవారు. అదేవిధంగా ‘ఖండగుత్త’ విధానం, జీలుగు కల్లు స్థానంలో సొండీల సారాయిని ప్రవేశపెట్టడం వంటి చర్యల వల్ల గిరిజనులు అప్పులు చేయాల్సి వచ్చేది. ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక చివరకు తమ భూములను కోల్పోయే పరిస్థితి ఏర్పడేది. ఆదివాసీల రక్షణ పేరుతో ప్రభుత్వం రకరకాల చట్టాలు చేసినప్పటికీ, ఆచరణలో అవి వారికి ఏమాత్రం ఉపయోగపడకపోగా, గిరిజనులను మరింతగా దోచుకోవడానికే తోడ్పడ్డాయని రచయిత విశ్లేషించారు. చివరికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన సహకార సంస్థ కూడా గుత్త వ్యాపార సంస్థగా మారిపోయింది.
1948లో కురుపాంలో ఎన్.జి. రంగా ఆధ్వర్యంలో మొట్టమొదటి ఆదివాసీల సభ జరిగింది. 1959 సంవత్సరం వరకు ఈ జిల్లాలో ఆదివాసీ ఉద్యమాలను కమ్యూనిస్టు పార్టీ నడిపిన దాఖలాలు లేవు. పాలకొండ ఏజెన్సీలో గిరిజనులపై ఆ ప్రాంత మున్సిఫ్లు, కరణాలు సాగిస్తున్న దోపిడీని చూసి, 1959లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ‘పల్లె రాములు’ తొలిసారిగా గిరిజనులను సంఘటితం చేసే ప్రయత్నం చేశారు. 1961లో శ్రీకాకుళ గిరిజన మహాసభకు 4,000 మంది గిరిజనులు హాజరయ్యారు. ఈ సభలో భూమి సమస్య, బంజరు భూముల సమస్య, వడ్డీ వ్యాపారుల సమస్య, వైద్య సౌకర్యాలపై తీర్మానాలు చేశారు. ఈ సంఘానికి అధ్యక్షుడిగా ‘వెంపటాపు సత్యం’, కార్యదర్శిగా ‘ఆదిభట్ల కైలాసం’ ఎన్నికయ్యారు. వీరిద్దరూ ఏజెన్సీ భూములను సర్వే చేయించి, బంజరు భూముల పంపకాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. 1950–68 వరకు శ్రీకాకుళం జిల్లాలో ఇటు మైదాన ప్రాంతంలోనూ, అటు గిరిజన ప్రాంతాల్లోనూ భూమి సమస్యపైనా, కూలి రేట్ల పెంపుపైనా, తప్పుడు కొలతలకు, విపరీతమైన వడ్డీ రేట్లకు, మోసాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగాయి. ప్రభుత్వపరంగా కూడా అనేక చట్టాలు వచ్చాయి. అయితే ఇవి పైవర్గాల ప్రయోజనాలకే ఉపయోగపడ్డాయి తప్ప, కింది వర్గాలకు ఆశించిన మేలు చేయలేకపోయాయని రచయిత విశ్లేషించారు. అదేవిధంగా వివిధ సంఘాల రూపంలో అనేక ఉద్యమాలు జరిగినప్పటికీ, ఎన్.జి. రంగా అధ్యక్షతన జరిగిన ఉద్యమాలు కొంత సంస్కరణవాద దృక్పథంతో ముందుకు సాగగా, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నడిచిన కొన్ని ఉద్యమాలు కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఉపకరించే విధంగా మారిపోయాయని రచయిత అభిప్రాయపడుతున్నారు.
సైద్ధాంతికంగా ఈ జిల్లాలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలను పరిశీలించినట్లయితే, అవన్నీ ఒక పెటీ బూర్జువా భావజాలంతో జరిగాయని రచయిత విశ్లేషించారు. “భూమిపై ఎవరికీ ప్రైవేటు హక్కులు ఉండరాదని, రాజ్యం ఆధీనంలో భూమి ఉండాలని మార్క్స్, ఏంగెల్స్, లెనిన్లు స్పష్టంగా ప్రకటించారు” అనే సైద్ధాంతిక అవగాహనకు విరుద్ధంగా భూసంస్కరణల పేరుతో పోరాటాలు జరిగాయని రచయిత వాదిస్తున్నారు. “చిరు ఆస్తిపరులను సృష్టించడం అంటే సొంత ఆస్తి పేరిట అది ఎంత చిన్నదైనా కలిగి ఉండటం గొప్పదనే పెట్టుబడిదారీ భావజాల ప్రచారంలో భాగమే ఈ భూసంస్కరణలు. ఈ స్వభావం పెటీ బూర్జువా ప్రతిఘాతక స్వభావం తప్ప, దానికి ఎటువంటి శాస్త్రీయ సామ్యవాద దృక్పథం లేదు. కాబట్టి భూసంస్కరణలు అమలు చేయాలని కోరడమంటే చిన్న ఆస్తిపరులను తయారు చేయడమే. ఈ చిన్న ఆస్తిపరులే పెట్టుబడిదారీ వ్యవస్థకు రక్షణగోడలా ఉంటారు” అని రచయిత సూత్రీకరిస్తూ, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇదే జరిగిందని సైద్ధాంతికంగా విశ్లేషించారు.
అంతర్జాతీయతను నమ్మే ఈ రచయిత, 1960–70 కాలంలో పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరిస్తున్న క్రమంలో ఏర్పడిన అపసవ్య పరిణామాల నుంచి ఒకానొక వ్యతిరేకత, ఉద్రిక్తతగా ఎలా రూపాంతరం చెందిందో వివరిస్తారు. దీనిలో భాగంగానే వియత్నాం–అమెరికా యుద్ధం, మార్టిన్ లూథర్ కింగ్ హత్యకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు, ఫ్రాన్స్లో విద్యార్థులు, కార్మికులు చేసిన తిరుగుబాట్లు అంతర్జాతీయంగా పెట్టుబడిదారీ వ్యతిరేక అతివాద వాతావరణాన్ని స్పష్టపరిచాయని రచయిత చెబుతారు. భారతదేశంలో, అందునా “చిలకలు… చురకత్తులు… ఝలిపించాయి” అని ఒక కవి చెప్పిన ఈ నేలలో, ఒకానొక పార్టీ అతివాద ధోరణితో ఎలా సాగింది? సంఘ రూపంలో వ్యవస్థీకృతం కావాల్సిన ఉద్యమం తన ఉనికి కోసం, అమాయక గిరిజనులపై జరిగిన దాడులను సైతం తమ పంథా సరైన మార్గంలో ఉన్నందుకే జరుగుతున్న దాడులుగా ఎలా నమ్మబలికింది? ఒకానొక వ్యక్తివాద ధోరణితో ముందుకు నడిచిన ఉద్యమం ఎంతటి వెనుకబాటుతనానికి దారితీసింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే “శ్రీకాకుళం రైతాంగ, గిరిజన సాయుధ పోరాటం” పుస్తకాన్ని చదవాల్సిందే.
* * *








Add comment