తమిళ మూలం : ఎస్.కె.పి.కరుణా
అసలు పేరు: కరుణానిథి ఎస్.కె.పి. కరుణా, తమిళనాడులోని తిరువణ్ణామలై (అరుణాచలం) వాసి. ద్రవిడియన్ నేపథ్యం గల కుటుంబానికి చెందినవారు. ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. యువకుడుగా ఉన్నప్పటి నుండే కథా రచన పట్ల ఆసక్తిని కలిగి ఉన్నారు. ఈయన వ్యాసాలు, కథలను పోలి ఉండటంతో, అతి తక్కువ సమయంలోనే గొప్ప కథకుడిగా పేరు పొందారు. పాఠకులు వీరి వ్యాసాలను ఎంతగానో ఇష్టపడటానికి కారణం, అవి వాళ్ల ఊహలలోనూ, స్పందనలోనూ, అవగాహనలోనూ మార్పును కలిగించాయి. కరుణా రాసే ప్రతి వ్యాసమూ పాఠకులకు ఊహల్లోని సాహసాన్నీ, ఉద్వేగాన్నీ కలిగించి ఎంతో నైపుణ్యం గల కథా రచయితగా నిలబెట్టాయి.
మునసామి అదిరిపడి అలాగే రాయిలాగా నిలబడిపోయాడు. అలాంటి దృశ్యాన్ని ఆయన తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ‘‘ఏంది మామా ఇదీ? పెద్ద నాటకంగా ఉండాది.’’ అంటూ పక్కకొచ్చి నిలబడ్డాడు పక్క పొలం మనిషి. ఆ వర్షపు రోజు ఉదయాన ఇంకా సన్నగా తుంపర్లు పడుతున్నాయి. పంచెను పైకెత్తి బిగించి, ఆ బురదలోకి దిగి, దానికి దగ్గరగా వెళ్లి చూశాడు. చెరుకు తోటకు, చేమంతి తోటకూ మధ్యన నేరుగా ఆ రాక్షస గొట్టం (ట్యూబు) క్రిందపడి ఉంది. గొట్టం దగ్గరకెళ్లి చూసినపుడు అది మరింత పెద్దదిగా కనిపించింది. ఒక మనిషి పూర్తిగా లోపల నిలబడి చేతులు పైకెత్తవచ్చు. అంత ఎత్తుంది. పొడవేమో ఎలా అయినా నలభై అడుగులుంటుంది. మునసామికి ఇప్పటికీ జరిగిందేమిటో అర్థంగాక తలపైకెత్తి చూశాడు. ఆ గొట్టాన్ని ఎక్కించుకొచ్చిన లారీ, ఏమీ ఎరగనట్టు అమాయకురాలిలా రోడ్డుమీద ఆగి ఉంది.
మునసామికీ, ఆయన తమ్ముడికీ సొంతమైన ఆ ఎనిమిదెకరాల భూమి, ఇంకా భాగాలు పంచుకోకుండా అలాగే ఉంది. అదీ ఆయన తమ్ముడి మరణం తర్వాత, అతని కొడుక్కి టీచరు ఉద్యోగమొచ్చి కుటుంబంతో సహా వాణియంబాడికి (ఊరు) వెళ్లిపోయాక, ఇద్దరి భాగాలనూ ఈయనే పైరు చేస్తున్నాడు. గత నెల, వాళ్ల పొలానికి నేరు అడ్డుగా కొత్త బైపాస్‌రోడ్డు కోసం, ప్రభుత్వమే భాగాల్ని వేరుచేసింది. రహదారి అంటే, ఒఠి రహదారి కాదు, పదడుగుల మట్టిపోసి ఎత్తు పెంచి, కిందనుండి చూస్తే వాహనాలు దాదాపు ఆకాశానికి దగ్గరగా తేలుతూ వెళ్తున్న దృశ్యమది.
మునసామి ఆదుర్దాతో తన కళ్లల్లో నీరు పొంగుతుంటే ఆ గొట్టాన్ని చుట్టి చుట్టి వచ్చి పంట నలిగిన నష్టాన్ని చూశాడు. రోడ్డుకు ఆనుకుని కింది భాగంలో వేసినటువంటి చేమంతి మొక్కలు దాదాపు అంతా సగం గొట్టం కింద నలిగిపోయి కనిపిస్తున్నాయి. మరొక వారంలో మొగ్గలు తొడగనున్న మొక్కలు అవి. గొట్టానికి ఇంకొక సగం, చెరుకు నాటిన భాగంలో ఉంది. మొత్తానికి, మునసామికి బురదతో కూడిన ఒఠి భూమిని మాత్రం మిగలబెట్టి, పైరంతటినీ మింగేసింది ఆ గొట్టం.
నిశ్చేష్ఠుడైన మునసామి దృష్టిని మళ్లించేలా వేగంగా ఒక జీపొచ్చి లారీ వెనక ఆగింది. అందులో నుండి, ఇద్దరు మనుషులు కిందికి దూకి, ఆ ఏటవాలులో దిగి పరుగెత్తుకొచ్చారు. అందులో ఒక యువకుడు, ‘‘మై గాడ్!’’ అని తలమీద చెయ్యి పెట్టుకుని, అలాగే ఆ తడి గట్టుమీద కూర్చున్నాడు. మరొక వ్యక్తి ఆ గొట్టం నలువైపులా ఆదుర్దాతో చూస్తూ చుట్టి చుట్టి వచ్చాడు.
మునసామికి, జరుగుతున్న దేమిటో ఏమీ అర్థం కాలేదు. పక్క పొలం వ్యక్తి, గట్టుమీద కూర్చోనున్న వ్యక్తితో, ‘‘ఏమయ్యా, ఈ గొట్టం నీదా?’’ అని అడిగాడు. అతను నిజంగానే, నిశ్చేష్ఠుడై ఉండేసరికి, ఇంకొకడు, ‘‘యోవ్, ఎవరిదైతే ఏం? అలా పక్కకెళ్లి నిలబడు.’’ అని చెప్పి, చేతిలోని సెల్‌ఫోన్లో నుండి ఎవరితోనో మాట్లాడుతూ ఉండిపోయాడు. లారీని నడుపుకుంటూ వచ్చిన సర్దార్జీ ఏమో, ఏ విధమైన ఆదుర్దా లేకుండా ఆ పెద్ద లారీ కింద స్టౌను వెలిగించి టీని తయారుచేసుకుంటున్నాడు.
సెల్‌ఫోన్లో మాట్లాడుతున్న వ్యకి, మునసామిని చూస్తూ, ‘‘పెద్దాయనా, ఇక్కడంతా నిలబడకూడదు. అలా పక్కకెళ్లి నిలబడు.’’ అని తరమగొట్టగానే మునసామి నిజంగానే భయపడిపోతూ తన పొలం నుండి గబగబా బయటపడి గట్టుమీద నిలబడ్డాడు. కొంతసేపటికి జీపులో వచ్చిన ఇద్దరి సెల్‌ఫోన్లూ మారి మారి మ్రోగుతుంటే, గ్రామ ప్రజలు మెల్ల మెల్లగా అక్కడ గుమిగూడడం ప్రారంభించారు.
ఆ ఇద్దరూ, అక్కడున్న ఎవరినీ మునసామి పొలంలోకి అనుమతించలేదు. పది గంటలకు పైన వి.ఎ.ఓ. వచ్చి వాళ్లతో మాట్లాడాకే అందరికీ మెల్లగా విషయం అర్థమైంది. ఆ గొట్టం కేంద్ర ప్రభుత్వానికి చెందింది. తిరుచ్చి నుండి బెంగుళూరుకు వెళ్లే దార్లో, రాత్రి కురిసిన కుంభవృష్టిలో, ఆ పొడవైన వాహనం రహదారి మలుపులో వేగంగా తిరిగేసరికి, గొట్టానికి కట్టబడి ఉన్న ఇనుప చువ్వల నుండి అది కదిలిపోయి మునసామి పొలంలో పడిపోయినట్టుంది.
అదృష్టం, అర్థరాత్రి సమయంలో పడినట్టుంది. పగల్లో, పిల్లలు స్కూలుకు వెళ్తున్నప్పుడు జరుగుంటే పిల్లల గతి ఏమయ్యేది?’’ అని మాట్లాడుతూ వాళ్లల్లో చాలామంది అక్కడే కూర్చుని వేడుక చూడ్డం మొదలుపెట్టారు.
విషయం తెలిసి, సారా మత్తు కళ్లతోనే వచ్చి చేరాడు పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు. అందులో బాగా ఆదాయం దొరుకుతుందని ఆయన మనసు లెక్కేసింది.
ఆ ఇద్దరు యువకుల వైపుకు తిరిగి, ‘‘ఏమయ్యా, ఎవరైనా సరే, గొట్టం తీసుకెళ్లటానికి ముందు, పొలం గల రైతు పైరుకు జరిగిన నష్టానికి తగ్గ పరిహారం ఇచ్చి తీరాలి. లేకుంటే గొట్టం మీద చెయ్యి వెయ్యటానికి అనుమతించం.’’ అన్నాడు.
సెల్‌ఫోన్లో మాట్లాడుతున్న ఇద్దరూ, ప్రెసిడెంటు వైపు ఈసడిరపుగా చూశారు. వరుసగా ఎర్రబల్బులు కలిగిన కార్లల్లో జిల్లా ప్రభుత్వ అధికారి, పోలీసు అధికారులూ వచ్చి చేరారు. ఊరి నాయకుడుతో సహా అందరినీ, అక్కడ నుండి తరిమెయ్యడంతో, ఎవరో ఒక అధికారి, పెద్ద మనసుతో మునసామిని మాత్రం అక్కడున్న ఒక చెట్టుకింద కూర్చోవటానికి అనుమతించాడు.
కలెక్టరొచ్చి వెళ్లాక మునసామి పొలం పూర్తిగా పోలీసు శాఖ కంట్రోల్లోకి వెళ్లిపోయింది. జీపు వ్యక్తులు ఇద్దరూ అదేపనిగా పొగ తాగుతున్నప్పుడు, లారీకి వ్యతిరేక దిశలో నుండి వేగంగా ఒక జీపు వచ్చి ఆగింది. అందులో నుండి దిగిన కూలింగ్ గ్లాసు ధరించిన ఎత్తైన ఆకారాన్ని ఆ ఇద్దరిలో ఒకరు చూసి, ‘‘ఓప్‌ా, అయి పోయిందిరా, డిసౌజా వచ్చాడు, చచ్చాం మనం!’’ అన్నాడు.
రోడ్డుమీద నిలబడినట్టే, కింద పడున్న గొట్టాన్ని తన కెమెరాలో ఫోటోలు తీసిన డిసౌజా, మెల్లగా నవ్వుతూ ఆ ఎత్తునుండి కిందికి దిగి వచ్చాడు. ఇద్దరూ ఆయన దగ్గరికెళ్లి నమస్కరించారు.
‘‘ఏంటయ్యా ప్రసాదూ, ఎంత పని చేసారు? పెద్దాయన భయంకరమైన మూడ్ ఔట్‌లో ఉన్నాడు తెలుశా?’’ అన్నాడు. ‘‘లేదు సార్. వర్షంలో బండి స్లిప్ అయ్యింది. కంట్రోల్ చెయ్యటానికి వీలుకాలేదు.’’
‘‘ఎలాగయ్యా కంట్రోల్ చెయ్యగలం? మీరు పాండిచ్చేరిలోనే మందుకొట్టి బండిని తీసారుగా.’’
‘‘లేదు సార్. మెల్లగానే వస్తున్నాం.’’
‘‘చింపారు. జి.పి.ఎస్ రికార్డును చూసే వచ్చాను. రాత్రి 3.15 కి ఆక్సిడెంట్ జరిగింది. తెల్లవారి 6.15 కు ఇన్‌ఫామ్ చేశారు. పెద్దాయన డీటైల్డ్ రిపోర్టు కావాలన్నారు.’’
‘‘సారీ సార్. బండిని ఆపమని చెప్పే నిద్రపోయాం. హైవేనే కదాని సర్దార్జీ తీసుకొచ్చేశాడు. ప్లీజ్ కాపాడండిసార్.’’
‘‘చూద్దాం. ఏంటీ, పాండిచ్చేరిలో ఒఠి మందేనా లేక ఇంకేదైనానా?’’
‘‘అదంతా ఏమీ లేదు సార్. ఒఠి డ్రింక్స్ మాత్రమే.’’
‘‘యోవ్, బెంగుళూరులో దొరకని సరుకా? ఎందుకయ్యా మానం తీస్తారు. ఇంకేమీ లేదా?’’
ప్రసాద్ ఠక్కున అర్థం చేసుకున్నాడు. ‘‘అదంతా బెంగుళూరులోనే అరేంజ్ చేసేస్తాం సార్.’’ ‘‘ఎక్కడ? ఎప్పుడు?’’
‘‘ఈ వీకెండ్‌లోనే పెట్టుకుందాం సార్. దేవనహళ్లిలో మన రెడ్డి ప్లాటు ఖాళీగానే ఉంది. నేను ఏర్పాటు చేస్తాను సార్.’’ పరిస్థితిని ఒకే ఒక్కమాట సహజంగా మార్చేసింది. డిసౌజా తన షూ, సాక్స్ అన్నింటినీ తీసేసి, ప్యాంటును మోకాలి వరకూ లాక్కొని, బురదలోకి దిగి చాలాసార్లు గొట్టాన్ని చుట్టి వచ్చాడు. ఒక చెట్టుకొమ్మను విరిచి, బురదలోకి గుచ్చుతూ ఎంత లోతు దిగిందో పరిశీలించాడు.
చాలాసేపు ఆలోచనల తర్వాత, ‘‘ప్రసాద్, నాకు 80 టన్నుల క్రేన్ కావాలి. అదీ రెండు క్రేన్లు. 50 మీటర్ల ఐరన్ రోప్ కూడా తీసుకురమ్మని చెప్పు. టైమ్ ఆఫీసుకు ఫోన్‌చేసి ఇన్‌చార్జితో హోసూరు క్రేన్ కంపెనీ నెంబరు తీసుకుని వెంటనే చెప్పు. రేటు గురించి మాట్లాడుతూ ఉండిపోకు. ఎంతడిగినా ఒప్పుకో. ఐదుగంటల లోపు అన్నీ ఇక్కడుండాలి. చీకటిపడే లోపు బయటికి తీసెయ్యాలి.’’ అని వెంటవెంటనే ఉత్తర్వులను ఇచ్చాడు.
మరొకరితో, ‘‘ఓయ్, మొద్దూ, ఇలారా నీ పేరేంటీ?’’ అన్నాడు.
‘‘అరివళగన్ సార్.’’
‘‘ఏం ఏడుపో? వెళ్లూ, వెళ్లి భోజనానికి ఏదైనా అరేంజ్ చెయ్. ఇటువైపంతా నాటుకోడి బాగా చేస్తారు.దానికి ఏర్పాటు చెయ్యి.’’ అంటూ పక్క పొలం మోటారు నీళ్లల్లో తన కాళ్లను కడుక్కుని వెళ్లాడు. అరివళగన్ కొంచెం లాఘవంగా మునసామి దగ్గరికొచ్చి, ‘‘పెద్దాయనా బాధపడకండి. ఆఫీసరొచ్చేశారు. ఇకపై ఆయన చూసుకుంటారు.’’ అని నవ్వాడు
ఎందుకు నవ్వుతున్నాడో మునసామికి అర్థం కాలేదు.
అరివళగన్, మునసామి చేతిలో ఐదువందల రూపాయల నోటును పెట్టి, ‘‘పెద్దాయనా, మీ ఊళ్లో ఏదైనా హోటల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి రండి. నేనిక్కడ నుండి బయటికి వెళ్లలేను.’’ అన్నాడు. ‘‘హోటలా? అవన్నీ ఇక్కడ లేవండీ. టీ కొట్టే. అదీ ఊరికి బయట రోడ్డు పక్కనుంది.’’
‘‘మీ ఇంట్లోనే ఏదైనా చేసి తీసుకు రండి. ఎంత ఖర్చవుతుందో, దానికి పైన వెయ్యి రూపాయలు తీసుకోండి. ఐదుమందికి, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం. అంతే!’’
మునసామి ఇంటికి తిరిగొచ్చేసరికి వంట జరుగుతోంది. మొదటి బస్సుకు పెద్ద కూతురు వచ్చినట్టుంది అనుకున్నాడు. ఈయనను చూడగానే మనవరాలు పరుగెత్తుకొచ్చి కాలును చుట్టేసుకుంది. పెద్ద కూతురు బయటికొచ్చి, ‘‘ఏం నాయినా? మన పొలంలో ఏందో పడిపోయిందంటగా?’’ అంది. ఆమె ముఖం నల్లబడుంది. ఈయన మౌనంగా తలాడించి ఇంట్లోకెళ్లాడు. వసారాలో భార్య పడుకొని ఉంది. దీర్ఘకాల రోగి. ఎప్పుడైనా మోకాలినొప్పులు తగ్గిన సమయంలో వంటచెయ్యటం కద్దు. ఎక్కువసార్లు మునసామి వంటే. చిన్న కూతురు లోపలి గదిలో ఉన్న టివి పై నున్న ప్రభుత్వ చిహ్నాన్ని దేనితోనో గోకుతోంది. తయారుగా ఉన్న సద్దన్నాన్ని పళ్లెంలో వేసుకుని, ఉట్టి మీదున్న పెరుగును తీసి అందులోకి పోసి పిసుకుతూ, పెద్దదానితో జరిగిన విషయాన్ని ఒక కథలాగా చెప్పాడు.
‘‘సేమంతికి మంచి ధర పలుకతాంది. ఈ సమయంలో పూలమ్మితే ఎట్టయినా కోత కూలీ పోనూ ఇరవై ఏలు సేతికందుతాది. నీ కూతురికి కమ్మలు కొనిద్దామనుకున్నాను. ఇట్టా కొద్దికొద్దిగా నీకు సెయ్యటం పూర్తిచేసి, తర్వాత సిన్నదానికి సేద్దామని అనుకుంటాంటే, అంతలోనే ఇట్టా జరిగింది. సాలని దానికి ఈళ్లకు వొంట సేసి తీసుకెళ్లాలంట. ఎయ్యి రూపాయలు ఇస్తారంట. మన ఇంటి డబ్బు ఇరవై వేలను నాశినం జేసి, ఎయ్యి రూపాయలు ఇస్తానంటం ఏం నాయమో తెలీటం లా.’’
‘‘దానికేం నాయినా? నేను వొంట సేసిస్తాను. ఎయ్యి రూపాయలైనా ముడతాందని సూడు.’’ అంది పెద్ద కూతురు. ఆ మధ్యాహ్నం, కోడి కూరా, వేడి అన్నమూ వండి పెద్ద గంపలో పెట్టుకుని మునసామి తన పొలం దగ్గరకు వెళ్తుంటే, ఆయన వెంట ఇంకో పాత్రతో చిన్న కూతురూ వెళ్లింది. ఉదయం ఉన్నచోటే ఉంది ఆ గొట్టం. కానుగచెట్టు కింద పాండిచ్చేరి నుండి తీసుకురాబడిన బాటిళ్లల్లో ఒకటి తెరిచి ఉండగా, డిసౌజా చెబుతున్న కథను ఆసక్తిగా తలాడిస్తూ వింటున్నారు మిగిలిన ఇద్దరూ.
బాగా మసాలా దట్టించి చేసిన కోడికూర తిన్న ఆనందంలో డిసౌజా పొగ పీలుస్తుంటే చిన్న కూతురు ఆయన దగ్గరికెళ్లి, ‘‘గుడ్‌మార్నింగ్ సార్.’’ అంది.
‘‘సే గుడీవినింగ్, సరేనా? నీ పేరేంటీ?’’ అన్నాడు.
‘‘ఎం.అలమేలు సార్. ఆరవ తరగతి బి.సెక్షన్.’’
‘‘వెరీ గుడ్, బాగా చదువుకో.’’ అంటూ అక్కడనుండి కదిలి వెళ్తున్న వ్యక్తితో…
‘‘ఎందుకు సార్ ఇంత పెద్ద గొట్టం?’’ అంది.
‘‘అదా, ఇదే రాకెట్ అంటే. ఇందులోకి ఇంజన్‌ను అమర్చి ఆకాశంలోకి పంపిస్తారు. ఇది తీసుకుపోయి పైన పెట్టే శాటిలైట్ మూలంగానే నువ్వు మీ ఇంట్లో టివి చూస్తున్నావు.’’ అన్నాడు. ‘‘రాకెట్టా?’’ అని నోరు తెరిచింది ఎం.అలమేలు. ఆ అమ్మాయి సైన్స్ పాఠంలో, కింద దట్టమైన పొగతో, ఓ రాకెట్ ఆకాశంలోకి వెళ్లే చిత్రం ఒకటి ఉండటం గుర్తుకొచ్చింది.
గబగబా, ఆ గొట్టం దగ్గరికెళ్లి దానికి రెండువైపులా అతికించబడిన ఇంగ్లీషు అక్షరాలను తడిమి చూసింది. తర్వాత వాటిని, ఒక్కొక్క అక్షరంగా కూడబలుకుతూ, ‘‘ఐ ఎస్ ఆర్ ఓ’’ అని గట్టిగా చదివింది.
సాయంత్రం ఇంకా కొన్ని వాహనాలలో కొందరు మనుషులొచ్చి చేరారు. క్రేను వచ్చేలోపు చీకటి పడుతుంటే డిసౌజాకు ఆలోపే మరికొన్ని సార్లు పెద్దాయన నుండి ఫోన్‌కాల్స్ వచ్చాయి.
మరో దారిలేక, రాత్రికే రాకెట్ కేసును ఎత్తివేయాలని నిర్ణయించారు. పక్కనున్న టౌను నుండి జనరేటరు, ఫోకస్ లైట్లు అంటూ తెప్పించుకుని, పనులు ముమ్మరం చేశారు.
అరివళగన్ గబగబ మునసామిని వెతుక్కుంటూ వచ్చాడు. ‘‘పెద్దాయనా, రాత్రికి భోజనం ఎలాగూ ఇరవైఐదు మందికి అవసరమవుతుంది. పది కోళ్లు కొనేయ్యండి. అలాగే గుడ్లు వేపుడు చేసెయ్యండి. ఎందుకైనా మూడు కోళ్లను ఫ్రై చేసెయ్యండి.’’ అని చెప్పేసి సమాధానం కోసం ఎదురుచూడకుండా వెళ్లిపోయాడు. మునసామికి తల గిర్రున తిరిగింది.
ఆ రోజు రాత్రి తన ఒంటెద్దు బండ్లో, చేసిన వంటను కొన్ని పాత్రలలో పెట్టుకుని, మునసామినే బండిని నడుపుకుంటూ వెళ్లటాన్ని ఊరు ఊరంతా చూసింది. కోడికూర వాసన ఊళ్లోని అన్ని కుక్కల్నీ బండి వెనకే పరుగెత్తించింది. ఊరందరి దృష్టీ తనమీద ఉండటంతో మునసామికి కొంత గర్వంగానూ అనిపించింది. బండి పొలం దగ్గరికెళ్లేసరికి సన్నగా తుంపర్లు పడటం మొదలైంది. గొట్టం చుట్టూ పెద్దపెద్ద ఇనుప కంబీలు (చువ్వలు) కడుతుంటే, ఆ కంబీల మరో కొసను రెండు పెద్ద క్రేన్లు పట్టుకుని ఉండటాన్ని, రాత్రిని పగలుగా మారుస్తున్న డూమ్‌లైట్ల వెలుగులో చూశాడు. కాసేపటికి వర్షం బలంగా కురవసాగింది. లోతైన బురదలో నుండి, ఆ రాత్రి సమయాన, గొట్టాన్ని పైకెత్తే మొదటి ప్రయత్నం విఫలమైంది. రెండు క్రేన్లూ ఒకేసారి లాగవలసిన లెక్క పనిచెయ్యకపోవటంతో, ఒక క్రేన్లో కట్టబడిన ఇనుప కంబీ మధ్యకు తెగిపోయింది. వర్షపు తేమా, బురద తడితోనూ నిండిపోయిన శరీరాలతో పడుకోవటానికి వెళ్లినవాళ్లకు ఆ రాత్రి మునసామి ఇంటి వేడన్నమూ, కోడికూరా ఎంతో ఓదార్పునిచ్చాయి.
మరో గట్టి ఇనుప కంబీ కోసం మొత్తం గ్రూపూ ఎదురుచూస్తుంటే, మరునాడు తెల్లవారి సమయాన్ని మునసామి పెద్ద కూతురు కస్తూరి చేసి పంపించిన ఇడ్లీలూ, మేక మాంసం కూరా కడుపు నింపేశాయి. దానికి కొనసాగింపుగా, ‘‘మధ్యాహ్నం చేపల కూర దొరుకుతుందా?’’ అని కొందరు మునసామిని అడిగినప్పుడు, మునసామికి గర్వం ఉప్పొంగింది. వీలవుతుందన్నట్టుగా వేగంగా తలూపాడు.
మరింత డబ్బుకోసం మునసామి, అరివళగన్‌ను వెతకేందుకు ప్రయత్నించాడు. మనిషికొక దిక్కుకు పరుగుపెడుతున్న ఆ హడావిడి సమయంలో ఆయన అరివళగన్‌ను కనిపెట్టలేకపోయాడు. ఆయన తిరగాడుతున్న విషయాన్ని గమనించిన ప్రసాద్, అతని దగ్గరికొచ్చి విషయమేంటని అడిగాడు. తన జేబులో నుండి ఇంకో ఐదువందల రూపాయల నోటును తీసిచ్చి, మొత్తం ఖర్చును చివర్లో తీసుకుందామని మళ్లీ నమ్మకం కలిగించాడు.
ఆ సాయంత్రం, మళ్లీ గొట్టాన్ని కట్టి పైకిలాగే పనులు మొదలయ్యాయి.
ఒక్కొక్కరూ ఒక ఆలోచనను చెప్పటం వల్లనూ, బురదలో బాగా లోతుగా కూరుకుపోయిన ఆ భారీ గొట్టాన్ని ఒక్క అంగుళం కూడా కదల్చలేక రెండవ ప్రయత్నమూ వీగిపోయింది. ఎన్నో ఆలోచనలతో డిసౌజా మనుషులు రాత్రి భోజనానికి కదిలారు.
అర్థరాత్రి సమయంలో, జీపులో పడుకొని ఉన్న ప్రసాద్ మనుషుల్ని, లారీ డ్రైవరు సర్దార్జీ ఆతృతగా వచ్చి లేపాడు. డిసౌజా నిద్రలో నుండి లేచొచ్చి చూడగా, అక్కడొక భారీ క్రేను ఆగి ఉంది. ఒక పెద్ద కర్మాగార నిర్మాణ పనుల కోసం రోడ్డుమీద వెళుతున్న క్రేనును సర్దార్జీ చూసి ఆపేశాడు. ఎవరూ ఊహించని అదృష్టమది. ఆ క్రేను ఆకారాన్ని చూసి అందరూ ఉత్సాహపడ్డారు.
అందరూ క్షణాలలో నిద్రనుండి లేవటంతో, ఆ చోటు మళ్లీ ప్రకాశవంతమైంది. గొట్టం యొక్క కంబీలు క్రేను కొక్కెంలో తగిలించబడ్డాయి. అంతా ఒక ప్రమాదానికి సంబంధించి జరిగే అవసరాల లాగా మొదలైంది. అన్ని కంబీల కొసలూ ఆ ఒకే క్రేనులోకి తగిలించగా, అనుభవమున్న ఆ క్రేను ఆపరేటరు సరైన సమయంలో, ఎంతో సామర్థ్యంతో, ఆ గొట్టాన్ని అలాగ్గా పైకి లాగాడు. బురదలో లోతుగా కూరుకున్న చెప్పులు, శబ్దంతో బయటికి రావటం లాగా గొట్టం మెల్లగా పైకి లేచి వచ్చింది.
బృందంలోని వాళ్లందరూ చప్పట్లు చరిచి సంతోషించిన ఆ నడి జాములో, మునసామీ, ఆయన కూతుళ్లూ రోజంతా వండిపెట్టిన అలసటలో నిద్రపోతున్నారు. తర్వాత గంట సమయానికి క్రేనుకూ, డూమ్‌లైట్లకూ డబ్బును చెల్లించి, గొట్టం ఎక్కించబడిన లారీని ముందుకు పోనిచ్చి, డిసౌజా గ్రూపు సభ్యులు దాని వెనకే బయలుదేరి వెళ్లారు.
మరునాడు ఉదయం పక్కింటి నుండి చేబదులు తీసుకున్న పెద్ద టీ క్యానులో వాళ్లందరికీ టీ చేసి తీసుకుని ఒంటరిగా నడిచాడు మునసామి. చేమంతి పూల పంట, మనవరాలికి కమ్మలు, చిన్నదానికి పెళ్లి, నిన్న జరిగిన సంఘటన, దాని గురించి బాధపడకుండా టీ చేసుకుంటున్న ఆ సర్దార్జీ… అంటూ ఏవేవో ఆలోచనలు మనసులో మెదులుతుంటే తన పొలంకొచ్చి చేరాడు.
ఆయన పొలంలో కాలు పెడుతుండగా గమనించాడు. అక్కడ గొట్టం పడిన ఆనవాలుగా నేలకు అడ్డంగా ఐదడుగుల లోతులో ఒక పెద్ద గొయ్యి మాత్రం మిగిలింది. చేమంతి పూల కుళ్లిన వాసన గుప్పుమని వీచింది.
*








Add comment