ప్రేరణ చనిపోయిన ఆ ఉదయం, బాల్కనీలో చల్లారుతున్న టీ కప్పుతో కూర్చున్న నాకు ఫోన్ వచ్చింది.
ఆ రోజు తెల్లవారుజాము నుంచే వర్షం మొదలైంది. హైదరాబాద్‌కే సాధ్యమయ్యే వర్షకాలపు పొద్దు అది: ముసిరిన మబ్బులు, తడిసిన ఆకులు, వాన దెబ్బకు కాసేపు రోడ్లమీద సడి తగ్గిన ట్రాఫిక్. వయసు పెరిగాక కొన్ని అలవాట్లు జీవితంలో భాగమైపోతాయి. ఏడింటికి చాయ్. ఏడున్నరకల్లా వార్తాపత్రికలు తిరగేయడం. ఆ తర్వాతే కోర్టు ఫైళ్లు.
క్యాన్సర్‌తో నా భార్య చనిపోయి అప్పుడే పదేళ్లు దాటిపోయింది. ఆ దుఃఖం కాలక్రమేణా గుండె మూలల్లో స్థిరపడిపోయింది—అప్పుడప్పుడు కంటికి కనిపిస్తూ, ఉన్నా లేనట్టుగా జీవితంలో ఒక భాగమైపోయింది.
నా ఆఫీసులోని జూనియర్ అడ్వకేట్ ఫోన్ చేశాడు.
“సార్, న్యూస్ చూశారా?”
“లేదు, ఏం జరిగింది?”
“ప్రేరణ మేడమ్, సార్…”
అతని గొంతులోని తడబాటు నన్ను ఒక్కసారిగా నిటారుగా కూర్చోబెట్టింది.
“ఏమైంది ప్రేరణకి?”
“ఆమె చనిపోయిందట సార్. ఇంట్లోనే…”
టీవీ స్క్రీన్ ఆన్ చేయగానే, ప్రతి ఛానల్‌లోనూ అదే వార్త.
ప్రముఖ జర్నలిస్ట్ మెట్టుపల్లి ప్రేరణ అనుమానాస్పద మృతి.
నలభై ఏళ్లకే లోకాన్ని వీడిన స్టార్ జర్నలిస్ట్.
అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
అప్పటికప్పుడే విశ్లేషణలు మొదలైపోయాయి. ఒక ఛానల్‌లో డిప్రెషన్ గురించి చర్చ. ఇంకో ఛానల్‌లో ఆమె వ్యక్తిగత జీవితంపై పోస్ట్‌మార్టం.
డ్రగ్స్. ఆత్మహత్య. హత్య .
కనీసం ఆమె ముఖం కూడా చూడని నలుగురు మనుషులు స్టూడియోలో కూర్చుని ఆమె జీవితాన్ని తమకు తోచిన విధంగా విప్పదీస్తున్నారు.
నేను టీవీ కట్టేశాను.
నేనూ, ప్రేరణా మాట్లాడుకుని ఆరు నెలలు దాటిపోయింది. ఆ దూరం ఏ ఘర్షణ వల్ల రాలేదు, బతుకు చక్రంలో వాయిదాల వల్ల అలా ఏర్పడిపోయిందంతే. చివరిసారి ఫోన్ చేసినప్పుడు ఇల్లు కోల్పోయిన ఓ మహిళ పిటిషన్ గురించి నాతో గంటసేపు వాదించింది. ఫోన్ పెట్టేసే ముందు మా కామన్ ఫ్రెండ్ కవితల్లోని పేలవమైన ప్రాసలను చదువుతూ ఆమె గట్టిగా నవ్వింది. ఆ నవ్వే ఇప్పుడు నా దగ్గర మిగిలిన చివరి జ్ఞాపకం.
రెండు రోజుల తర్వాత ప్రెస్ క్లబ్‌లో సంతాప సభ జరిగింది.
హాల్ కిక్కిరిసిపోయింది. జర్నలిస్టులు, స్టూడెంట్స్, ప్రొఫెసర్లు, టీవీ ప్రొడ్యూసర్లు… నిలబడటానికి కూడా చోటు లేనంత జనం. నేను కాస్త ముందే వెళ్ళి వెనుక వరుసలో కూర్చున్నాను.హాల్‌కి అవతలి వైపు లక్ష్మి కనిపించింది. కాలం ఆమెను చాలా మార్చేసింది. ఆ నడకలో వంకర అలాగే ఉంది, కనుబొమ్మ పక్కన ఆ పాత గాయం తాలూకు మచ్చ కూడా అలాగే ఉంది. కానీ ఆమె ముఖంలో ఒక నిశ్శబ్దమైన స్థిరత్వం కనిపించింది . ఆమె నన్ను చూసి తల ఊపింది, నేను ఊపాను. ఇద్దరం మాట్లాడుకోలేదు.
అక్కడ జనాలు అప్పుడే ప్రేరణను తమకు నచ్చినట్టు అంచనా వేసేస్తున్నారు.
స్టేజ్ మీద ఒక పెద్ద ఫోటో ఉంది. ప్రేరణ ఎప్పుడూ చూసేలాగే కెమెరా వైపు నిటారుగా చూస్తోంది. ఏదో అంచనా వేస్తున్నట్టుంది. మంత్రులను, అధికారులను, అధికారాన్ని, నన్ను… అందరినీ తను అలాగే చూసేది.
సభలో చివరగా ఆమె కొడుకు తిలక్ మాట్లాడాడు.
అతనికి పదిహేనేళ్లు. బక్కపలచగా ఉన్నాడు. అంత చిన్న వయసులో అంతటి దుఃఖాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియని ఒక తడబాటు, ఒక శూన్యం అతని కళ్లలో కనిపించింది.
“అందరూ మా అమ్మ ఎందుకు చనిపోయిందని ఆలోచిస్తున్నారు.”
హాల్ మొత్తం నిశ్శబ్దం ఆవరించింది.
“నాకు తెలియదు,” అతని గొంతు వణికింది. “నాకు తెలిస్తే బాగుండుననిపిస్తోంది. కానీ మనందరం ఆమె బతికున్నప్పుడు ఆమెను ఇంత గట్టిగా అర్థం చేసుకోవడానికి ఎందుకు సమయం కేటాయించలేదు?”
ఒక్క నిమిషం కూడా సాగకుండానే ముగిసిన అతని ప్రసంగమే, ఆ రోజు అక్కడ వినిపించిన వాటన్నిటికంటే అత్యంత నిజాయితీ గల మాట అనిపించింది.
————————–
నాకు ప్రేరణ మొదటిసారి కలిసినప్పటి రోజులు గుర్తొచ్చాయి.
ఆమెకు పదేళ్లకు మించి ఉండవు. వాళ్ల అమ్మ, నాన్న ఇద్దరూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు. పౌరహక్కుల ఉద్యమాల్లో, ప్రజా సంఘాల్లో చాలా క్రియాశీలకంగా ఉండేవారు. నేను అప్పుడే లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టాను. నా భార్య మాలతి జనరల్ మెడిసిన్ పీజీ పూర్తి చేసి, ప్రేరణ తల్లిదండ్రులతో కలిసి ఆడపిల్లల్లో పోషణ గురించి పని చేస్తుండేవారు. క్రమంగా వారితో నాకు గట్టి సంబంధం ఏర్పడింది.
ఎక్కువ రోజులు వాళ్ల ఇల్లు ఇల్లులా కాకుండా ఒక పబ్లిక్ మీటింగ్ లాగా ఉండేది. ప్రొఫెసర్లు, ట్రేడ్ యూనియన్ నాయకులు, కవులు, లాయర్లు, స్టూడెంట్స్… ఎవరో ఒకరు ఏదో ఒక సామాజిక సమస్య మీద వాదించుకుంటూనే ఉండేవారు. అలాంటి వాతావరణంలో పెరిగింది ప్రేరణ. మొదట్లో తండ్రి పక్కన కూర్చుని నిశ్శబ్దంగా వినేది, ఆ తర్వాత నెమ్మదిగా చర్చల మధ్యలో మాట్లాడడం మొదలుపెట్టింది.
పద్నాలుగేళ్ల వయసులోనే పెద్దల మధ్య జరుగుతున్న సామాజిక చర్చలను వింటూ ఆమె అడిగిన ప్రశ్నలు నన్ను ఆశ్చర్యపరిచేవి. ఆ వయసుకే ఆమెకు సమాజాన్ని చూసే ఒక ప్రత్యేకమైన పరిణతి, స్పష్టత అబ్బాయని నాకు అప్పుడే అర్థమైంది.
నాకు, ప్రేరణకు మధ్య ఇరవై ఏళ్ల వయసు తేడా ఉంది. కానీ కాలక్రమేణా మేము స్నేహితులమయ్యాం. గురు శిష్యుల బంధం కాదు, తను నాకు ‘కూతురు లాంటిది’ కాదు; కేవలం ఒకరినొకరు గౌరవించుకునే ఇద్దరు వ్యక్తుల స్నేహం. నన్ను తను ఎప్పుడూ పేరు పెట్టి పిలిచేది—అది కొత్తవాళ్లకి కొంచెం వింతగా తోచినా, మాకది చాలా సహజంగా అనిపించేది.
——————–
సంతాప సభ ముగిసి ఇంటికొచ్చాక సాయంత్రం ల్యాప్‌టాప్ తెరిచాను. ఆ న్యూస్ ఛానల్ నుంచి రాజీనామా చేశాక ప్రేరణ ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి స్వంతంగా రిపోర్టింగ్ చేసేది. అదే ఛానల్‌లో అప్పుడప్పుడు ‘ప్రేరణాస్ మ్యూజింగ్స్’ పేరుతో తన వ్యక్తిగత ఆలోచనలను పంచుకునేది.
సడన్‌గా నా దృష్టి కొన్ని నెలల క్రితం ఆమె అప్‌లోడ్ చేసిన ఒక వీడియో పైకి వెళ్లింది. అది: ఎపిసోడ్ 14 – ‘ది ఆర్కైవ్ ఆఫ్ మోర్టాలిటీ’.
దాన్ని క్లిక్ చేశాను.
ఆ వీడియోలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేదు. గ్రాఫిక్స్ లేవు. స్టూడియో లైట్లు లేవు. ఒక తెల్లటి గోడ ముందు ప్రేరణ కూర్చుని ఉంది. ఆమె కెమెరా వంక చూస్తూ మాట్లాడటం మొదలుపెట్టింది.
“మన సమాజానికి, మీడియాకి ఒక అలవాటు ఉంది. ప్రతి చావునూ ఒక సామాజిక విషయంగా మలచి అర్థం ఆపాదిస్తాం. మరణం అనేది మనిషికి అత్యంత వ్యక్తిగతమైన విషయం, కానీ దాన్ని సమాజానికి ఒక పాఠంగా మార్చేస్తాం. ఉదాహరణకు, ఒక పెద్ద రాజకీయ నాయకుడు చనిపోయాడనుకోండి. ‘ఆయన మంత్రిగా సేవలు అందించారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు, ఈ మార్పులు తీసుకువచ్చారు’ అని చెబుతూ… దాన్ని ఒక ‘ఆదర్శవంతమైన జీవితానికి’ ఉదాహరణగా మారుస్తాం. సమాజం కోసం వాళ్లు ఒక రోల్ మోడల్ అవ్వాలనే తాపత్రయం మనది.”
ఆమె కాసేపు ఆగి, గొంతు సవరించుకుని అంది:
“రెండో రకం… సమాజానికి హెచ్చరికలు జారీ చేయడానికి వాడే చావులు. ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే, దాన్ని విద్యా వ్యవస్థలోని ఒత్తిడికి ఒక కేటగిరీగా మారుస్తాం. ఒకరు ప్రమాదవశాత్తూ నీళ్లలో మునిగి చనిపోతే, భద్రతా ప్రమాణాల గురించి పాఠాలు చెప్తాం. అక్కడ మనిషి పోయాడనే బాధ కంటే, ఒక థియరీని ప్రూవ్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తాం.”
“మూడోది… అన్నిటికంటే ఇబ్బందికరమైనది ‘ది స్కాండల్’. ఒక సెలబ్రిటీ చనిపోగానే, వాళ్ల వ్యక్తిగత జీవితం రోడ్డు మీద పడిపోతుంది. ఆస్తుల గురించి, అఫైర్స్ గురించి విచ్చలవిడిగా సిద్ధాంతాలు నిర్మించి, రోత పుట్టించే టెలికాస్ట్‌లు చేస్తాం.”
ప్రతి చావు మనకు ఏదో ఒకటి నేర్పించాలి అనుకుంటాం. ఎందుకంటే, కొన్నిసార్లు బాధల నుండి, సాధారణ జీవితాల నుంచి ఎటువంటి జ్ఞానమూ పుట్టదు. మరి ఒకరి చావును సమాజపు అవసరాల కోసం ఇలా వాడుకోవడానికి మనకు అధికారం ఉందా? చనిపోయే ముందు వాళ్లు దీనికి ఒప్పుకున్నారా?”
బయట కిటికీ మీద వాన చినుకులు పడుతున్నాయి. నేను ఆ మాటలను ఒక ప్రేక్షకుడిగా కాకుండా, నాతోనే ప్రేరణ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్టు అనిపించింది.
నేను వీడియో ఆపేశాను. గది నిశ్శబ్దంగా ఉంది.
నా బుక్‌షెల్ఫ్‌లో తిలక్ రాసిన ‘అమృతం కురిసిన రాత్రి’ పుస్తకం ఉంది. పదిహేనేళ్ల క్రితం తన కొడుకు పుట్టినప్పుడు, ప్రేరణ ఆ పాత ప్రతిని నా చేతిలో పెట్టింది.
“వాడికి ‘తిలక్’ అని పేరు పెట్టాను.”
“కవి బాలగంగాధర తిలక్ పేరా?” అని అడిగాను.
అవునన్నట్టు తల ఊపింది.
“ఈ కాలంలో నీ వయసు వాళ్లెవరూ తిలక్ కవిత్వాన్ని చదవడం లేదు తెలుసా ప్రేరణా,” అన్నాను.
తను నవ్వింది. “అందుకే వాడికి ఆ పేరు పెట్టాలి. అందరూ మర్చిపోయే లోపు, ఆ పేరు వినబడినప్పుడల్లా ఎవరో ఒకరు ఆ కవిత్వాన్ని గుర్తుంచుకోవాలి కదా.”
ఆమె ఆ పుస్తకం తెరిచి తనకు ఇష్టమైన, తను అప్పుడప్పుడు గుర్తుచేసుకునే ఆ లైన్లను చదివింది.
“దారంతా గోతులు, ఇల్లేమో దూరం… చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక కవచం!”
“సాహిత్యం చేయాల్సింది ఇదే,” అంది తను. “చరిత్ర, సమాజం మర్చిపోయిన సామాన్య మనుషుల ఉనికిని అది గుర్తించాలి.”
అప్పుడు నాకు అనిపించింది… తను కవిత్వం గురించి మాట్లాడటం లేదు, తను నమ్మిన జర్నలిజం గురించే చెప్తోంది.
———-
ఆమెలోని ఆ తపన నాకు మొదటిసారి పూర్తిగా అర్థమైంది తొమ్మిదేళ్ల క్రితం నాటి లక్ష్మి కేసులోనే. ఏజెంట్ మోసంతో దుబాయ్ వెళ్లి, అక్కడి యజమానుల వేధింపులు తట్టుకోలేక బిల్డింగ్ రెండో అంతస్తు నుండి దూకుతున్న ఆ మెదక్ అమ్మాయి వీడియో సోషల్ మీడియాలో సంచలనమైంది. అన్ని ఛానల్స్ రెండు రోజులు లూప్‌లో వేసి ఆ తర్వాత మర్చిపోయినా, ప్రేరణ మాత్రం మర్చిపోలేదు. ఆ వార్త ఆగిపోయిన మరుసటి రోజే ఒక పెద్ద ఫైల్ పట్టుకుని నా ఆఫీస్‌కి వచ్చి, “మనం ఆమెను ఇండియాకి రప్పించాలి” అంది. ఆ తర్వాతి రెండు నెలలు తన ప్రైమ్-టైమ్ షో ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ, సొంత డబ్బు ఖర్చు పెడుతూ ఆమె ఆ కేసు వెనుక పడిన తీరు ఒక పిచ్చి లాంటిది.
కొన్నిసార్లు నాకు ఆమెను కాస్త నెమ్మదించమని చెప్పాలనిపించేది, కానీ ‘నెమ్మదించడం’ అనే పదం ప్రేరణ నిఘంటువులోనే లేదు. చివరికి లక్ష్మి దేశం తిరిగొచ్చింది—వీల్‌చైర్‌కే పరిమితమై, తీవ్రమైన మానసిక గాయంతో… కానీ ప్రాణాలతో. ఒక వారం తర్వాత ప్రేరణ ఫోన్ చేసి, “నేను ఆమెను వాళ్ల ఊరికి తీసుకెళ్తున్నాను, నువ్వు కూడా రా” అంది. కోర్టుల్లో నేను గెలిచిన పెద్ద పెద్ద కేసుల కంటే, ఆ రోజు ప్రేరణతో కలిసి లక్ష్మిని ఆమె ఇంటి దగ్గర దింపి వచ్చిన ఆ ప్రయాణమే నాకెందుకో ఎక్కువ తృప్తినిచ్చింది
___________
మూడేళ్ల తర్వాత ఆమె ఛానల్‌కు కొత్త యాజమాన్యం వచ్చింది. మార్పు మొదట నెమ్మదిగా మొదలై, ఆ తర్వాత వేగం పుంజుకుంది.
జర్నలిజం క్రమంగా మార్కెట్ సరుకుగా మారిపోయింది. నిజం కంటే వివాదాలే ఎక్కువ రేటింగ్స్ తెచ్చే రోజులు వచ్చాయి.
ఒకసారి స్క్రిప్ట్‌లో లేని ప్రశ్న అడిగిందని వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్‌ను మార్చమంటే నిరాకరించింది.
చివరకు ఆ వ్యవస్థలో ఇమడలేక బయటకు వచ్చేసింది. ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. తన పని తాను చేసుకుంటూ వెళ్లింది.
అదే సమయంలో తన వివాహ బంధం నుంచి కూడా చట్టబద్ధంగా బయటపడింది. భరణం వద్దంది. తిలక్ బాధ్యతను తనే తీసుకుంది. కొంతకాలం కుంగిపోయినా, మళ్లీ తనను తాను కూడదీసుకుంది.
ఆ తర్వాతే ఆ కార్డియాలజిస్ట్‌తో పరిచయం మొదలైంది. ఆమె చనిపోయాక టీవీ ఛానల్స్ విరామం లేకుండా చర్చించిన అదే సంబంధం. అతను భార్యతో విడిగా ఉంటున్నాడు. కానీ చట్టపరంగా ఇంకా విడాకులు తీసుకోలేదు. మిగతాదంతా సమాజంలోని నీతిమంతులు మాట్లాడుకోవడానికి పనికొచ్చే గాసిప్పే.
నేను ప్రేరణను దాని గురించి ఎప్పుడూ ఎక్కువ ప్రశ్నలు అడగలేదు. స్నేహమంటే కొన్ని వ్యక్తిగత హద్దులను అలాగే గౌరవించడం కూడా అని నా నమ్మకం.
____________________
ఆ రాత్రి నేను నా బాల్కనీలో ఒంటరిగా కూర్చున్నాను. వర్షం మళ్లీ వేగం పుంజుకుంది.
ఆ చీకటి వెనుక, నగరం తన అంతులేని సంభాషణను కొనసాగిస్తూనే ఉంది. టీవీ డిబేట్లు, రాజకీయ వాదనలు, బ్రేకింగ్ న్యూస్… ఎయిర్ టైమ్ కోసం, వ్యూస్ కోసం వేచి చూస్తున్న మరికొన్ని కొత్త విషాదాలు.
వర్షం పడుతూనే ఉంది.
ప్రేరణ చనిపోయిన వార్త విన్నప్పటి నుంచి ఇప్పటివరకు… మొదటిసారి నేను ఆమెకు ఏమైందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఆపేశాను.
బదులుగా, ఆమె జీవితాన్ని గుర్తుచేసుకున్నాను.
ఒక హెడ్‌లైన్‌గా కాదు.
ఒక మిస్టరీగా కాదు.
సమాజానికి బుద్ధి చెప్పే ఒక నీతి కథగా అంతకంటే కాదు.
కేవలం ఒక మనిషిగా.
వర్షం కిటికీల మీద పడుతూనే ఉంది. నగరం తన పనుల్లో మునిగిపోతూనే ఉంది.
ప్రేరణ లేని ప్రపంచం, ప్రేరణ ఉన్నప్పటిలాగే ముందుకు కదులుతూనే ఉంది.
*
చిత్రం: సృజన్ రాజ్








ఈ లోకం పోకడ మీడియా ట్రోల్స్
మనుషుల వ్యక్తిగత జీవితాల్ని ఎలా కథలు
అల్లుతుందో ..చాలా బాగా వ్రాసారు ప్రీతమ్ గారు 👏