తెలుగు సాహిత్యంలోనే కాదు, మన దేశ సాహిత్య చరిత్రలో ముస్లింవాదం ఒక అద్భుతమైన ఆవిష్కరణ. తెలంగాణ కేంద్రంగా వచ్చిన ఈ ఉద్యమం ఇతర ప్రాంతాలకు గొప్ప ప్రేరణ. నిజానికి ప్రపంచ సాహిత్యంలో కూడా ఇలాంటి ఒక ఉద్యమం మరెక్కడా కనిపించదు. ఇలా అన్నాను అంటే, ఇతర భాషా సమాజాలలో ముస్లిం వస్తువు, ఇతివృత్తాలతో రాయలేదని కాదు అర్థం. చాలా మంది ముస్లిం రచయితలు వాళ్ల స్థానికత నుండి, అనుభవం నుండీ రాసిన రచనలు వున్నాయి. కానీ అవేవీ ఒక ఉద్యమంగా, ఒక వాదంగా, ఒక ప్రాపంచిక దృక్పథ భావజాలంగా మారలేక పోయాయి. అలాంటి ఒక వ్యక్తీకరణను, గుర్తింపును అవి సొంతగా ప్రకటించుకోలేదు, అలాగే బయటి సమాజం వాటిని ఆ గుర్తింపుతో సంకేతించలేదు. ఇది ఒక అవిస్మరణీయ సాహిత్య వాస్తవికత.
తెలుగులో ముస్లింవాదం ఒక చారిత్రిక పరిణామంగా అవతరించింది. మనం (we), పరాయి (other) అనే వర్గీకరణ సమాజంలో ఒక రాజకీయ వ్యక్తీకరణగా మాత్రమే కాకుండా, ఒక సామాజిక హింసాత్మక వ్యక్తీకరణగా మారిపోతూ వుంటుంది. ఈ వర్గీకరణ వల్ల పరాయివాళ్లనే బృందాలూ, సమూహాలు, వర్గాలు తీవ్రమైన వెలివేతను, వివక్షణ, అణచివేతనూ ఎదుర్కొంటాయి. ఈ దైనందిన సంకేతాత్మక హింస ఒక మామూలు విషయంగా సాధారణీకరించబడుతుంది. అదీ ఎంతలా అంటే, కండ్ల ముందు కనిపించే ఈ హింసను సహజమైన విషయమనీ, అందులో అన్యాయమైన నేరంగానీ, అమానుషంగానీ ఏవీ లేవని అనుకొని ఎలాంటి ప్రతిస్పందనగానీ కనీసం అది సరైనది కాదని నోటి మాటగానైనా ఖండించాలనే కనీస స్పృహగానీ లేని స్థితికి “మనం” అనుకొనేవారిని లేదా బృందాలనూ లేదా సమూహాలను, లేదా వర్గాలను తీసుకు పోతుంది. ఇలాంటి ఒక స్థితికి “మనం” , “వాళ్లు” అనే విభజన ఒక ప్రాపంచిక దృక్పథం కారణం.
ఈ విభజన దృక్పథం మతపరమైనది అయితే, దాని పర్యవసనాలు మరీ దారుణంగా వుంటాయి. బ్రాహ్మణీయ భావజాలంలో ఈ విభజన కులం రూపంలో వ్యవస్థీకృతమైంది. ఈ విభజన భావజలం వల్ల కొన్ని వర్గాలకు విశాలమైన, విస్తృత ప్రయోజనాలున్నాయి. అందుకే నాలుగు వర్ణాల విభజ, వేల కులాల ఉప విభజనను ఆ భావజాలం సాధారణీకరించింది. ఈ విభజనలో వున్న కీలకమైన సమస్య ఏమిటంటే, అది “పరాయివాళ్లు” అనే పిలవబడే వారిపట్ల విద్వేషాన్ని, అసూయనూ, హింసనూ ప్రేరేపిస్తూ వుంటుంది. అంటరానివాళ్లని పిలవబడిన అస్పృశ్యులను బ్రాహ్మణీయ సమాజం ఈ రకంగానే అణచివేసింది. ఇప్పుడు ముస్లింలను ఆ రకంగానే అణచివేస్తుంది.
ముస్లింవాదం బహుళత్వాన్ని గుర్తించి, అంగీకరించే ఒక సమ్మిళిత తాత్వికత. అది హిందూత్వ ఫాసిజానికి పోటెత్తిన ప్రతిఘటనలోంచి పురుడు పోసుకున్నప్పటికీ, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం అనేవి దాని మౌలిక సూత్రాలు. ఈ సైద్ధాంతిక తాత్విక బలం వల్లనే అది ఒక మానవీయమైన ప్రజాస్వామిక సాహిత్య చింతనగా, ప్రత్యేక ప్రాపంచిక దృక్పథంగా అది వికసించింది.
స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనేవి సోదరభావం పునాదిగా వుండాలని, అది లేకపోతే మిగతా మూడూ అర్థంలేని పరిభాషగా మారిపోతుందని అంబేద్కర్ భావించాడు. సోదరభావానికి మూలం బంధుత్వం. అది కుటుంబ సభ్యుల మధ్య వుండే బంధం. ఆ బంధం స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే విలువల ప్రాతిపదికన వ్యవస్థాపితం కావాలి. స్త్రీ, పురుషుల మధ్య వుండాలి. ఈ సహజమైన సూత్రం అసహజమైనదిగా మారిపోయినదనీ, స్త్రీని అణచివేసే ఆచారాలను, సంప్రదాయాలను వదిలుకొని, ఆధునకతను, ఆధునికోత్తర సాంకేతిక కాలాన్ని అందుకొనే శక్తి సామర్ధ్యాలను పొందాలని స్త్రీవాదం ప్రతిపాదిస్తున్నది. అందువల్ల ముస్లింవాదం ఆధునికతను అంతర్గత సంస్కరణకు మారు రూపంగా భావిస్తున్నది. ముస్లిం స్త్రీల వికసానికీ, విముక్తికీ ఆధునిక విద్య అవసరమనీ, స్త్రీల భాగస్వామ్యంలేని వికాసం డొల్లదని ముస్లింవాదం వాదించింది. ఇలాంటి అనేక న్యాయమైన తార్కిక వాదనల వల్ల అది ఇంటి నుంచీ బయటి నుంచీ విమర్శలను ఎదుర్కొన్నది. అంతేకాదు, ఇస్లాంను ఒక మత విశ్వాసంగా, ముస్లింలను ఒక సామాజిక వర్గంగా అది అర్థం చేసుకున్నది. అందువల్ల ముస్లిం సమాజంలో స్వాభావికంగానే బహుళత్వం వుందనీ, అందుకు ఇస్లాం స్థానిక సామాజిక పునాదుల మీద నిలబడటమే అని ముస్లింవాదం భావించింది. ఈ అవగాహన నిజానికి మన సమాజ మౌలిక స్వభావాన్ని సరిగా అర్థం చేసుకోవడం వల్ల రూపొందినది.
ఆధునికతనూ, అది నిర్మించిన రాజకీయాలను ముస్లింవాదం ప్రజాస్వామిక దృక్పథం నుంచి అర్థం చేసుకుంటుంది. వలస ఆధునిక కాలంలో తయారు చేసిన ద్విజాతి సిద్ధాంతాన్ని ఇప్పటి నయా హిందూ నాజీయిజం బలంగా ప్రచారం చేస్తూనే వున్నది. తత్ఫలితంగా ముస్లిం సమాజం పట్ల ద్వేషం, హింసా పరివ్యాప్తమవుతూనే వున్నది. ఈ హింసాత్మక రాజకీయాలు రాజ్యాంగ వ్యవస్థలను నియంత్రిస్తూ, ఆపద్ధర్మ హిందూ రాజ్ ఏర్పాటు దిశగా పయనిస్తూ వున్నాయి. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, లౌకిక, ప్రజాస్వామిక అవగాహనను చైతన్యాన్ని ఇనుమడింప చేసే సాహిత్య సేద్యం కొనసాగాలని ముస్లింవాదం ప్రతిపాదించింది. ఈ స్పష్టత వల్లనే అది అన్ని రకాల ప్రక్రియలకు విస్తరించింది. మన దేశంలోని ఏ భాషా సమాజమూ సృష్టించని అద్భుతమైన సాహిత్యాన్ని మనకు అందించింది. ఇప్పటికే అది ప్రపంచ స్థాయికి చేరుకున్నది. టెర్రీ ఈగల్టన్ చెప్పినట్టు సాహిత్య రచనను ఒక బాధ్యతగా, ఒక ఉద్యమ కార్యాచరణగా ముస్లింవాదం స్వీకరించింది. నయా హిందూ నాజీల హింసాత్మక పరిపాలనలో ముస్లింవాదం ఒక ప్రజాస్వామిక వ్యక్తీకరణ దీపస్తంభంలా వెలుగుతూనే వున్నది.
*








రాను రాను ‘ సారంగ ‘ కాంగ్రెస్ పార్టీ కి ఒక వాణి గా మారుతున్నదేమీ? ప్రపంచం లోని ఏ ఇతర మతమూ తనని తాను మార్చుకోదు. ఎవరూ మార్చాలని ప్రయత్నించారు. వాటిలోని ఆచారవ్యవహారాలు ఏమైనా మనకు అనవసరం. అది వారి స్వవిషయం. కేవలం హిందూ అనే ఒకే మతం లోని అన్ని ఆచారవ్యవహారాలు మాత్రం చక్ ఛాందస భావాలు. ఇది అందరికీ కావాలి. ఈ మతం లోని ఛాందసాలను రూపుమాపటానికి అనేకమంది సంఘ సంస్కర్తలు, యుగపురుషులు, దేశోద్ధారకులు పుట్టారు. మా మతంలో తప్పులు లేవు అని చెపితే అది మతతత్వ వాదం. ఆ పార్టీ మతవాద పార్టీ. కులం లో తప్పిందట. ముస్లిం కులం లో తప్పు లేదట. ఆహాహా! ఎంత తియ్యగా చెప్పారు? క్రిస్టియన్ కులాలలో తప్పు లేదు. హిందూ మతం లోనే అన్ని తప్పులూ ఉన్నాయట. ఇది ఏమి విడ్డూరమో. సాహిత్య పత్రికలో ఈ రాజకీయాలు ఎందుకో.