ఒక అప్రకటిత యుద్ధం!

ఒక విగ్రహానికి మూడువేల కోట్ల రూపాయిలు ఖర్చు పెడతారట.  ఎవరి సొమ్ము అది?  విగ్రహాల మీద వందల, వేల కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టే దేశం పేదవాడి ప్రాణాల్ని, సొమ్ముని దోచుకునేది కాదా?  ఎన్ని వేల రహదార్లు వేయొచ్చు ఆ డబ్బుతో?   సరైన రోడ్లుంటే ఎన్ని ప్రాణాలు మిగిలేవి? 

క్క తుపాకీ గుండు పేలదు.  టాంకులతో పనిలేదు.  ఒక అప్రకటిత యుద్ధం!  క్షతగాత్రులు మృతులే తప్ప సైనికుల్లేని యుద్ధం.  పరాజితులు, విగతులే తప్ప విజేతల్లేని యుద్ధం.  ఈ యుద్ధంలో దేశ ప్రజలు సంవత్సరానికి నాలుగున్నర లక్షల మంది గాయపడి, లక్షన్నరమంది అశువులు బాస్తున్నారు.  ఆ విధంగా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కోటిమందికి పైగా ఈ యుద్ధంలో చనిపోయారు.  రహదార్ల మీద జరిగే ఈ ఏకపక్ష యుద్ధంలో మృతులెప్పుడూ నిరాయుధులే.  ఏ రెండు దేశాల మధ్యన జరిగే యుద్ధంలో కూడా ఇంతటి ప్రాణ నష్టం వుండదు.

భారతంలో బకాసురుడు గుర్తున్నాడా?  అతనికి ఆహారంగా రోజూ ఒక బండెడు అన్నం, అన్నంతో  నంచుకు తినటానికి ఒక మనిషిని పంపే విధంగా అతనితో నగరవాసుల ఒప్పందం జరుగుతుంది!  అప్పట్లో ఒక్క బకాసురుడే!  ఇప్పుడు రహదార్లన్నీ బకాసురులే నాయనా!  రహదారి బకాసురుడికి ఒక్క మనిషి చాలటంలేదు.  సంవత్సరానికి మన దేశం రోడ్ల మీద లక్షన్నర మంది బలైపోతున్నారు.  మన రహదార్లకి బాగా ఆకలేస్తున్నది ఈ మధ్యన.  రోడ్ల మీద జనం మాంసం ముక్కలైపోతున్నారు బాబూ.  అయ్యో! నెత్తుటి ముద్దలైపోతున్నారు తండ్రీ!  రహదార్ల నిండా అకాల వడగళ్ళ వానలా వాహనాల గాజుపెంకులు! కాలిపోతున్న బతుకు చిత్రాలు.  అర్ధాంతరంగా ఆగిపోతున్న ఊపిర్లు!  కాళ్ళ నుండి ఊడిపోయి చెల్లా చెదురైన చెప్పులు, చినిగిన బట్టలతో ఛిద్రమైన అవయవాలతో, చితికిన దేహాలతో రహదార్లు రక్తస్నానం చేస్తున్నాయి.

ఇంటి నుండి బడి దగ్గర దింపటానికి బైకు మీద బయల్దేరి సైడు నుండి ఆర్టీసీ బస్సు తగిలి కొడుకుతో సహా టైరు కింద నలిగిపోయిన ఓ నాన్న, స్కూటీ మీద వెళుతూ కుక్క అడ్డం వచ్చి పడిపోయిన ఇల్లాలు, తల్లి మరణవార్త విని కడ చూపు కోసం వెళుతూ హైవే మీద నలిగిపోయిన యువకుడు, పరీక్షలు రాసొస్తున్న వాళ్ళు, పెళ్ళి చూపులకి వెళ్ళొచ్చే వాళ్ళు, సినిమా ఆడియో ఫంక్షన్లకి ఉత్సాహంగా హాజరై తిరుగు ప్రయాణంలో చావు కౌగిట్లోకెళ్ళేవాళ్ళు, దైవదర్శనం సంగతేమో కానీ మృత్యదర్శనం చేసుకునే తిరుమల, సింహాచలం, యాదగిరి గుట్ట భక్తులు….ఇలా ఎంతమందో!

పెళ్ళి బస్సు బోల్తా

కాలువలో పడ్డ పాఠశాల బస్సు

చెట్టుకి గుద్దుకున్న కొత్త దంపతుల కారు

డివైడర్ కి గుద్దుకున్న బైకులు

అర్ధరాత్రి పూట నిలువునా దగ్దమై పోయే వోల్వో బస్సులు

రాంగ్ రూట్లో వచ్చే టిప్పర్ లారీ కింద నలిగే అభాగ్యులు

లోయలో పడే అయ్యప్ప భక్తుల స్పెషల్ బస్సులు

బోల్తా పడే ట్రాక్టర్లు

అదుపుతప్పి ప్రాణాల్ని గల్లంతు చేసే షేరింగ్ ఆటోలు

టీవీఎస్ 50ల మీద పాల క్యాన్లు కట్టుకొని వెళ్ళే వాళ్ళు

సైకిళ్ళ మీద ఆకు కూరలమ్ముకునే వాళ్ళు

మనుషులు కళేబరాలు కావటానికి క్షణాలు చాలు.

ఏమిటీ రక్తపాతం?  ఇదంతా మన నాగరీకత ఫలితమేనా?  లేదా గీతలో కృష్ణుడు చెప్పినట్లు కర్మ ఫలమేనా?

మృతుల రక్తంతో, ఆత్మీయుల కన్నీళ్ళతో కాంక్రీటు రోడ్లు తడిసిపోతున్నాయి.  రోడ్ల మీదనే కుప్పకూలి బిడ్డ తలని ఒడిలోకి తీసుకొని గుండె పగిలేట్లు ఏడ్చే తల్లి దుఃఖానికి,  సగం శరీరం లారీ కిందకి వెళ్ళిపోయిన భర్త దేహాన్ని చూసి స్పృహ తప్పిన భార్య దైన్యానికి,   చెప్పా పెట్టకుండా ఇళ్ళకి పైకప్పులెగిరి పోయినట్లు కుటుంబాలు రోడ్లన పడటానికి బాధ్యులెవరు?

ఏ ప్రయాణమూ భద్రం కాదు.  మృత్యువుని భుజాల మీద మోస్తూ తిరుగుతున్నాం.  మెడల చుట్టూ కాళ్ళు బిగించి చావు మన తలల మీద డప్పు మోగిస్తున్నది.

ప్రమాదం దైవికమని, తలరాతని ఆస్తికులు సర్దిబెట్టుకోవచ్చు గాక!  నెపాన్ని భగవంతుడి మీదకో, ఆయన రాసాడని చెప్పబడే తలరాత మీదకో నెట్టడం నచ్చక ఏం చెప్పాలో తెలియని నాస్తికులు “అయ్యో!  అయ్యయ్యో!” అని వాపోవచ్చు గాక!  నిజానికి ఏ ప్రమాదమూ అనూహ్య పరిణామం కాదు.  ప్రతి ప్రమాదం వెనుక ఒక వ్యవస్థ వుంది. దాని విధ్వంసక నిర్మాణం వుంది.  భావజాలం వుంది. అక్కడ ఆ స్థానంలో విగతుడు ఓ సుబ్బారావు కాకపోతే మరో సులేమాన్  కావొచ్చు.  ఓ జగన్నాథం కాకపోతే ఓ జాన్ కావొచ్చు.  ఓ మేరీ కాకపోతే మరో మావుళ్ళమ్మ కావొచ్చు.  ఓ అలేఖ్య కాకపోతే మరో మౌనిక కావొచ్చు.  ఓ వరుణ్ కాకపోతే మరో అవినాశ్ కావొచ్చు.  కాలానుగుణంగా వర్షాలు కురిపించే నింబస్ మేఘాలు ఏర్పడతాయో లేదో కానీ ఈ దేశంలో అకాల చావు మబ్బులు మాత్రం ఎల్లప్పుడూ కమ్ముకునే వుంటాయి.

ప్రతీకాత్మకంగా కాదు వాస్తవంగానే చెబుతున్నాను.  ఒక దేశం అభివృద్ధి ఎంత సజావుగా, సౌకర్యవంతంగా, సమతౌల్యంగా వుందనేది ఆ దేశ రహదార్లే చెబుతాయి.  ఒక వ్యవస్థ ప్రయాణం ఎంత మృదువుగా వుందనేది మనుషులు తిరిగే మార్గాలు చెబుతాయి.  ప్రమాదాలకి అవకాశం లేకుండా, ప్రజల పట్ల బాధ్యతాయితంగా, భద్రతా ప్రమాణాలతో రహదార్ల నిర్మాణం జరిగిందా మన దేశంలో?  పోనీ జరుగుతున్నదా?  ఇంతకు ముందు జరగలేదు.  ఇప్పుడు జరగటం లేదు.  భవిష్యత్తులో జరుగుతుందన్న నమ్మకమూ కలగటం లేదు.  హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, అండర్ గ్రౌండ్ మార్గాలు దాదాపుగా లేవు.  ఒకవేళ అక్కడక్కడా వున్నా జనం వాటిని సజావుగా ఉపయోగించే విధంగా వాటి నిర్వహణ వుండదు.   ప్రజలంటే నేరస్తులుగా చూసే పోలీసోళ్ళు చలాన్లు రాయటానికి, డబ్బులు గుంజుకోటానికి తప్పితే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయరు.  ప్రాణాలకు తెగించకుండా మీరు హైదరాబాద్ నగరం నడిబొడ్డైన ఆబిడ్స్ లో రోడ్డు దాటలేని పరిస్తితి వుంది.  మనకంటే పెద్దగా అభివృద్ధి చెందని ఇండోనేషియా వంటి విదేశాల్లోలా ఒక్కో తరహా వాహనానికి ఒక్కో గీత నిర్దేశించి వాటి మధ్యలో మాత్రమే ప్రయాణించే విధంగా ప్రజలకు అలవాటు చేయాలి. మన నగరాల రోడ్ల మీద బైకు మీద వెళుతుంటే మీరెన్నోసార్లు మిమ్మల్ని రాసుకుంటూ పోతుండే రెండు భారీ వాహనాల మధ్యన ఇరుక్కుపోయి భయంతో మీ గుండె బిర్ర బిగుసుకు పోయే వుంటుంది.  నగరం రోడ్ల మీద నేనెన్నో సార్లు మృత్యువుని అతి సమీపంలో వున్నట్లు గమనించాను.  అందుకేనేమో అజంత “నగరం రోడ్ల మీద నా శవాన్ని నేను చాలా సార్లు చూసాను” అన్నారేమో!  అసలింత కాలం ఈ రోడ్ల మీద ఇలా తిరుగుతుండగలగటం చాలా ఆశ్చర్యమేసేది.

“భారతదేశం పేద దేశం కదా!  ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే వుంది కదా!  జనాభా ఎక్కువ కదా!  ఒక్కో చదరపు కిలో మీటర్ కి బతికే జనసాంద్రత ఎక్కువ కదా!  ఒక్కసారిగా అద్భుతమైన రోడ్లు ఎక్కది నుండి పుట్టుకొస్తాయి?”  ఈ సన్నాయి నొక్కులు, అమాయకపు ప్రశ్నలు వేసేవారు తక్కువేమీ కాదు.  ఐతే ఇక్కడ మనం వేసే ప్రశ్న ఒకటే.  “ఒక పేద దేశం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ ప్రాధమ్యాలేంటి?”

ఇక్కడికొచ్చి పరిశ్రమలు పెడతారో లేదో, ఒకవేళ పెడితే అవి ఎంతవరకు మన దేశ ఆర్ధిక స్థిరత్వానికి, భద్రతకి ప్రమాదరహితంగా వుండగలవో కానీ సెజ్ లకు కరెంటిచ్చి, నీళ్ళిచ్చి, రోడ్లేసి, ఇతర సాధన సంపత్తినంతా పోగేసి, చాలా చోట్ల వృధాగా పడేసే బదులు గ్రామీణ ప్రాంతాల రోడ్లేయొచ్చు కదా?  విశాఖ జిల్లా ఆగనంపూడి దగ్గర టెక్స్ టైల్ పార్క్ పేరుతో వందల, వేల కోట్ల రూపాయిల ప్రజాధనం వృధా కావటం తెలుసు.  శ్రీ సిటీలో ఎన్ని వచ్చాయి?  వస్తున్నాయి?  ఇవి కేవలం ఉదాహరణలే.  ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో!

గ్రామీణ, గిరిజన గర్భిణీ మహిళల్ని ప్రభుత్వాసుపత్రులలో పురుడు పోసుకోమని ఊదర కొడతారు కానీ అనుకోకుండా నొప్పులొచ్చే విపత్కర సమయాల్లో వారు సమీప పట్టణానికో, మండల కేంద్రానికో వెళ్ళాలంటే అనువైన రహదార్లున్నాయా?  విశాఖ జిల్లాలో మంచం మీద పడుకోబెట్టి నాలుగు వైపులా నలుగురు పట్టుకొని తీసుకెళ్తున్న కొస ప్రాణంతో కొట్టుమిట్టాడే ఆదివాసీ గర్భిణీ మహిళని నేను ఇదివరకోసారి చూసాను.  నేను ఒకసారే చూసాను కానీ అదో సర్వ సాధారణ దృశ్యం.

ఒక విగ్రహానికి మూడువేల కోట్ల రూపాయిలు ఖర్చు పెడతారట.  ఎవరి సొమ్ము అది?  విగ్రహాల మీద వందల, వేల కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టే దేశం పేదవాడి ప్రాణాల్ని, సొమ్ముని దోచుకునేది కాదా?  ఎన్ని వేల రహదార్లు వేయొచ్చు ఆ డబ్బుతో?   సరైన రోడ్లుంటే ఎన్ని ప్రాణాలు మిగిలేవి?

అమరావతి, ధొలేరా వంటి ఖరీదైన స్మార్ట్ నగరాలు కడతారట.  వాటి వలన ఎవరికి ఎక్కువ ప్రయోజనం?  రియల్ ఎస్టేట్ వ్యాపారం, ప్రాజెక్టులు చేసుకునే కాంట్రాక్టర్లకే కదా?  ప్రభుత్వాదాయం ప్రజల సంక్షేమానికి ఉపయోగించే ఆర్ధిక వనరుగా మనం నమ్మగలిగేంత సంక్షేమ దృక్పథం మన పాలకులకుందా?

సామాన్య ప్రజలు, గ్రామీణులు, ఆదివాసీలు నిత్యం బతుకటం కోసం సంచరించే దార్లనొదిలేసి వేల కోట్ల రూపాయిలు ఖర్చుపెట్టి ఎయిర్ పోర్టులకెళ్ళే ఎక్స్ ప్రెస్ హైవేలు, పలు వరసల దారులు, బుల్లెట్ ట్రైన్ ట్రాక్ లు నిర్మించటం సరైన ప్రాధామ్యమేనా?  తక్కువమంది వారి సౌకర్యాలు, లబ్ది కోసం అధిక శాతం జనాభా సంక్షేమాన్ని, ప్రాణాల్ని గాలికి వదిలేసే ప్రభుత్వాలు ప్రజా ప్రభుత్వాలా?

భారీ కంచు విగ్రహాలు, సెజ్ లు, బుల్లెట్ ట్రైన్లు, స్మార్ట్ సిటీలు అభివృద్ధికి గీటురాళ్ళుగా వున్నంత కాలం ఈ దేశంలో సామాన్యులు సంచరించే రహదార్లు నల్ల తాచుల్లా భయపెడుతూనే వుంటాయి.

(ఇటీవలే రోడ్డు “ప్రమాదం”లో మరణించిన మనందరి సాహితీ మిత్రుడు పారిజాత శరత్ చంద్రకి గుండె తడితో ఈ వ్యాసం అంకితం)    

అరణ్య కృష్ణ

అరణ్య కృష్ణ

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • డియర్ కృష్ణ గారు..హాట్సాఫ్????????రక్తస్నానం చేస్తున్న రహదార్లు… మెడల చుట్టూ కాళ్లు బిగించి డప్పు మోగిస్తున్న చావు.. ఆసాంతం ఆర్దతతో కూడిన, ఆలోచనలు రేకెత్తించే వ్యాసం.
  స్వార్థ పూరిత రాజకీయ నాయకులు, ప్రజల్లో అవిద్య(illiteracy) ,అచేతనత్వం ఉన్నంతకాలం ఈ పరిస్థితి మారదు.

  ప్రజల్లో అవగాహన, తిరుగుబాటు తత్వం లేనంతవరకు.. వారు కట్టే కంచు విగ్రహాలను “”చీల్ ఉడేతో భైస్ ఉడే”..అన్న చందాన గుడ్లప్పగించి చూస్తూ ఉండవలసిందే!!
  మీలాంటి వారు వ్రాస్తున్న వ్యాసాలను చదివి ప్రజల్లో వాస్తవాల అవగాహన అవుతుందన్న ఆశతో….ఆద్రతతో మీరు అందించిన అద్భుతమైన వ్యాసానికి మీకు అభినందనలు ????????????????

 • రోడ్డు పై వాహనాలు ఆపి చాలానాలు రాసి డబ్బులు వసూలు చేసే పోలీసులు ఏ వాహనం ప్రమాణాలు కు తగిన విధంగా ఉందొ లేదో పట్టించుకోరు. అధికంగా ప్రయాణికులు ప్రయాణిస్తే పట్టించుకోరు.ఆటో.ట్రాక్టర్ లు ఒక్కసారిగా మృత్యు సకటాలు గా మారతాయి.కింది స్థాయి నుంచి నిబద్ధత ఉండాలి. 16 ఏళ్ల కుర్రాళ్ళు ఖరీదైన బళ్ళు ఎంత వేగం గా నడుపుతుంటారో. చూడడానికి భయం వేస్తోంది.ఏదైనా అయితే వాళ్ళ జీవితాన్ని ముగించుకున్న ట్లే.ఎదరవాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళు బతుకుతున్నారు.సమస్య ను సరైన కోణంలో ప్రస్తావించారు.ప్రభుత్వం పట్టించుకోవడం జరిగేది కాదు.స్పీడ్ లిమిట్ అన్ని వాహనాలు పాటించేలా చూడాలి..

 • What ever ఇట్ మే be take ప్ A policy with table త్రీ benifits ఫర్ the financial security of your family with negligible ప్రీమియం when compared with car/ motor cycle comprehensive policy

 • ఇక్కడ మన సమస్య గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేవు ఆనా? లేక ఎక్కడో స్టాట్యూ కడుతున్నారు ఆనా? మీకు రోడ్డు కావాలి, 6 రోజులు రోజుకి 10 గంటలు పని చేసి 7 వ రోజు కాస్త బయట పార్క్ కానీ లేదా రిక్రియేషన్ కోసం ఒక ప్రదేశం స్టాట్యూ నో ఇంకొకటో వేళ్ళాలి అని నాకు ఉంటుంది, మరి నా పరిస్థితి ఏంటి? నేను ఈ సమాజం లో లేనా? నేను పని చేసి ప్రభుత్వానికి టాక్స్ లు కడుతున్నాను కదా? ఇక్కడ స్టాట్యూ ఎందుకు అని కాకుండా, మనకి కావాల్సింది రోడ్డు ఐతే మనం రోడ్డు కావాలి అని అడిగితె బవుంటుంది అనుకుంటున్నా..

  పోలీసులు కానీ ఇంకొక వ్యవస్థ కానీ ఎంత వరకు ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తారు? నేను నెల రోజులు ముందు మా విలెజ్ కి వెళ్ళాను, ఊరు అంతా సిమెంట్ రోడ్లు వేశారు బాగున్నాయి, వెళ్లే దారిలో ఒక ఇంటి నుంచి కాంపౌండ్ వాల్ మీదుగా వాళ్ళు వాడిన మురికి నీళ్లు రోడ్డు పక్కన పోసేసారు.. మల్లి మనమే గోల చేస్తాం రోడ్డు అంతా మురుగు దోమలు అని.. స్వచ్ఛ భారత్ అని వందల కోట్లు ప్రకటనలపై గుమ్మరిస్తుంది ప్రభుత్వం, అది ఎడ్యుకేట్ చేయటమేగా? ఎవరో ఎడ్యుకేట్ చేసే కంటే ముందు, మనకి కామన్ సెన్స్ పెరగాలి.. అప్పుడు అన్ని సర్దుకుంటాయి..

  మన దగ్గర ఒక బస్తా పంట గింజలు ఉన్నాయి, వాటిని కావాలి అంటే తినటాని ఉపయోగించుకోవచ్చు లేదా తిరిగి పంట వేసుకోవచ్చు.. ఇప్పుడు వాటితో మీరు ఏమి చేస్తారు? మొత్తం తినేస్తారా లేక సగం తిండికి ఉంచుకొని సగం వాటితో మల్లి పంట వేసి గింజలు తీస్తారా? కరెంటు, రోడ్లు మన ఇళ్ళకి వేసుకొని పరిశ్రమలకి ఇవ్వకపోతే సంపద ఎలా సృష్టిస్తారు? స్మార్ట్ సిటీలు, పరిశ్రమలు సంపద సృష్టికి నిలయాలు.. సంపద సృష్టించి పేదరికాన్ని రూపుమాపాలి కానీ, బస్తా పంటగింజలు తిండికి మాత్రమే ఉపయోగించు కోకూడదు అనుకుంటున్నా..

  భారతదేశ అతి పెద్ద సమస్య అవినీతి.. దాన్ని కట్టడి చేస్తే అందరికి అన్ని సమకూరుతాయి అనుకుంటున్నా..

  • మీ స్పందనకి ధన్యవాదాలు. వందల వేల కోట్ల రూపాయిలతో విగ్రహాలు కట్టే పార్కులకెళ్ళే మానసికంగా విశ్రాంతి పొందుతారా? కాసిన్ని చెట్లు, పిల్లల ఆటస్థలం, కొన్ని బెంచీలు, రేడియో వార్తలు వినిపించే పార్కులు చాలవా? విగ్రహాల కోసం పార్కులు కట్టరు మాష్టారూ! ఈ వ్యాసం ఉద్దేశ్యం ప్రభుత్వం ప్రాధమ్యాల(ప్రయారిటీస్)లో ప్రజలు ప్రధానం కాకపోవటాన్ని చెప్పటం. చెత్త పడేయ్యకుండా చూడటం స్వచ్చభారత్ లక్ష్యమా లేక సరైన చెత్త డిస్పోసల్ స్వఛ్ఛభారత్ లక్ష్యమా? నేననుకోవటం రెండోదే కరెక్ట్. ప్రజలకు నాలుగు మంచి మాటలు చెప్పటం ప్రభుత్వ లక్ష్యం కాకూడదు. ప్రజలు పొరబాటు చేయకుండా చూడటం లక్ష్యం కావాలి. మీరు పోలీసులు గురించి వాపోయారు. పోలీసుల్లో వున్న ప్యునిటీవ్ టెండెన్సీ గురించి మీకూ తెలుసు కదా. అసలు ఏ రూలూ పాటించనిదే పోలీసోళ్ళు. సెజ్ల లక్ష్యం చెప్పేదొకటి, చేసేదోకటీ లెండి. అభివృద్ధి సమతౌల్యంగా వుంటేనే అభివృద్ధి కదా సార్!

 • అరణ్యకృష్ణగారు! పరిస్థితిని చాలా లోతుగా విశ్లేషించి చాలా బాగా కళ్ళముందుంచారు. ధన్యవాదాలు !

 • Nice write-up sir….మీరు రాసింది నూటికి నూరు పాళ్లు నిజం ….దానికి ఉదాహరణ గా తీసుకుంటే మా రాజీవ్ రహహదారే….రామగుండం నుండి హైదరాబాద్ హైవే….ప్రతి రోజు ఖచ్చితంగా ఒక ప్రాణమైనా కావాలి ఈ రహదారికి ….ఎన్నో హృదయవిధారకమైన సంఘటనలు…..హాట్సాఫ్ అరణ్యకృష్ణ గారు …మంచి విషయాలను తెలియ చేసినారు….

  • రహదార్ల నిర్వహణ సరిగ్గా లేకపోతే అవి బకాసుర పాత్ర నిర్వహిస్తాయి సార్! మీ స్పందనకి ధన్యవాదాలు.

 • ప్రతిరోజూ రక్తమోడుతూ కనిపించే రహదారులే! పోగొట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ… ఆలోచనాత్మకం Mee maatalu. అనిసరణీయo కూడా. ధన్యవాదములు AK గారూ!

 • మీ ఆవేదనని, ఈ టపా స్ఫూర్తిని అర్ధం చేసుకుంటూనే ఒక రెండు మాటలు Krishna గారు.
  పాదాచారులు, రహదారులని వాడుతున్న వాహనచోదకులు, అవి ఆటోలు కావఛ్హు, బస్సులు కావఛ్హు, ద్వి/త్రి చక్ర వాహనాలు కాని మరెవో కాని కావఛ్హు…వారందరు సక్రమంగానే వాడుతున్నారా, సూచనలు పాటిస్తున్నారా అని కూడా మనం ప్రశ్నించుకోవల్సిన అవసరం కూడా ఉంటుందా, ఉండదా? సివిక్ సెన్స్ కి తెలుగు పదం నాకు గబుక్కున గుర్తు రావడం లేదు…ఎంత మంది పాటిస్తున్నారు?

  రవాణా ఖర్చులు, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఆధునిక సాంకేతిక వాహనాలని ప్రవేశపెడుతున్నారు. ప్రాక్ పశ్చిమ దేశాలలో రవాణా, పౌర సరఫరా పద్దతుల గురించి మీకు ఎంతో కొంత తెలిసే ఉంటుంది. వారితో పోల్చుకుంటే మన ప్రజలు ఎక్కడుంటారు వాటి పాటించడంలో?

  ప్రజలు కూడా నియమాలను పాటించాలి. అప్పుడే మనకి రహదారులకి సంబంధించిన ప్రాణ నష్టం తగ్గుతుంది.

 • అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఏ మార్పూ లేదు. అవసరమైన విశ్లేషణ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు