ఒకనాటి కర్నూలు పల్లెను కెమెరా పెట్టి చూపిన కథ..

కొన్ని కథలు చదువుతున్నపుడు, పేడతట్ట నెత్తిన పెట్టుకుని ఊరి గొడ్ల వెనుక తిరిగే అమ్మ కొంగుపట్టుకుని నడిచినట్టుగా ఉంటుంది. మారుతి పౌరోహితం రాసిన కథలు నన్ను ఇలాగే బాల్యంలోకి తీసుకువెళ్లాయి. ‘కుశలంబేగదా ఆంజనేయా’ అనే కథ పూర్తిచేసి పుస్తకం మూసేసి రెండు వారాలు దాటినా, అది మరుగైపోయిన మా నాయనను పదేపదే గుర్తు చేస్తూనే ఉంది. పల్లె మనుషులను నాటకం ఎంత గాఢంగా అల్లుకుపోయి ఉండేదో ఆత్మీయంగా చెప్పిన కథ ఇది. ఊళ్లకు ఊళ్లు బండ్లు కట్టుకునీ, చాపలు చుట్టుకునీ, నులక మంచాలు తెచ్చుకునీ నాటకానికి వచ్చే రోజులు నాకు తెలుసు. అట్లా మా ఊరికి పాతిక కిలోమీటర్ల దూరం చిట్టడివిలో ప్రయాణించి, పులికాట్‌ ఉప్పుకయ్యల ఒడ్డున కరెంటు లేని కల్లూరు అనే చిన్నపల్లెలో ‘బాలనాగమ్మ’ నాటకానికి మా నాయనా, ఆయన స్నేహితులూ సిద్ధమైన రోజుల సందడిని ఈ కథ నాకు గుర్తు చేసింది.

కుశలంబే గదా ఆంజనేయ చదవండి!

డైలాగులు, పద్యాలు, హావభావాలు పలికే తీరు నేర్చుకునే క్రమంలో దొర్లే తప్పులూ, నవ్వులూ, తిట్లూ, కోపాలూ, కొట్టడాలూ, అలకలూ, బుజ్జగించడాలూ.. భలే రోజులవి. సంగుగా రేబాల రమణ. బాలనాగమ్మగా గూడూరు సావిత్రి, మాయల ఫకీరు వేషం వేసిందెవరో నాకు గుర్తుకు రావడంలేదు. పెద కార్యవర్ధిరాజుగా తోట వేంకటేశ్వర్లు వేశారు. మా నాయన చాకలితిప్పడు.  నాటకంలోని ఇతర చిన్న పాత్రలకు నటుల ఎంపిక, శిక్షణ బాధ్యత మా నాయనది. ఆయన తన టైలరు శిష్యుల్లో కొందరికి నేర్పడం మొదలు పెట్టాడు. చందమామ కథల్లోంచి దిగొచ్చి మాట్లాడుకుంటున్నట్టుగా ఉండేది వాళ్లు ప్రాక్టీస్‌ చేస్తూ ఉంటే. చినకార్యవర్ధిరాజు పాత్రకు తగిన పిలగాడు కోసం వెతుకుతూ ఉంటే, ‘నేను వేస్తా’ అని అడిగాను. అప్పుడే హైస్కూలు బడి మెట్లెక్కిన వయసులో ఉన్న నావైపు సందేహంగా చూశాడు మా నాయన. ఆయన శిష్యుడు గూని సుబ్రమణ్యం మాత్రం, ‘ఉత్సాహపడతా ఉండాడు గదా నేర్పిద్దాం నా.’ అని రెకమండ్‌ చేశాడు.  నాలుగు డైలాగులూ, రెండు పద్యాలూ  రాసిచ్చి.. తడబడకుండా, తప్పుపోకుండా చెబితేనే స్టేజీ ఎక్కిస్తామని షరతు పెట్టాడు మా నాయన. నోటుపుస్తకం ముందు పెట్టుకుని పరీక్షకి పాఠం చదివినట్టుగా నేను డైలాగులు చదువుతుంటే టైలరు కాలేషా చూసి,  ‘ఇట్ట కాదబయా డ్రామా నేర్చేది. దినామూ పొద్దన్నే ఏటికి బోతావు గదా. పోతా… డైలాగులు చెప్పుకోవాల. కడుక్కుంటా… డైలాగులు చెప్పుకోవాల. వొస్తా… డైలాగులే చెప్పుకోవాల. ఒళికి పోసుకునేటపుడు సబ్బు రుద్దుకుంటా గూడా డైలాగులే పలకాల..’ అని  కిటుకు చెప్పాడు.

ఇంకన సాధన మొదలైంది. ఒంటేలు గంట కొట్టగానే బడి వెనక్కి పరుగుతీసి పోసుకుంటా ‘నాదు జనయిత్రి.. సాద్వి అయినదియనేమి..’ అని పద్యం ఎత్తుకోగానే పిలకాయలు వన్సమోర్‌..వన్సమోర్‌ అని అరస్తా ఈలలేసేవాళ్లు. చినబాలవర్ధిరాజు నడుముకి చిన్న చురకత్తి ఉంటుంది. కంసాలమిట్ట మింద పెద్దోడినడిగి చెక్కతో కత్తి చెక్కించుకున్నాను. దాన్నెప్పుడూ మొలతాడుకి దోపుకోనుండేవాడిని. మాటి మాటికీ చెక్కకత్తిని దూసి పద్యం ఎత్తుకునేవాడిని. నా నేస్తులంతా మళ్లీమళ్లీ అడిగి నాతో డైలాగులు చెప్పించుకుంటా ఉంటే భలే కుశాలగా ఉండేది.

రేబాల రమణ నన్ను ఉమశ్రీ అని పిలిచి, నేను ఉడుక్కుంటూ ఉంటే ఆటపట్టించేవాడు. డ్రామా వేసే రోజుకి కల్లూరుకి చేరుకున్నాం. పెట్రొమాక్స్‌ లైట్లకి పురుగులు కమ్ముకుంటూ ఉన్నాయి. చుట్టుపక్కల పల్లెల నుంచి జాతరకు వచ్చినట్టుగా వచ్చిన జనాన్ని చూస్తూనే కాస్త దడ మొదలైంది. మేకప్పులు జరుగుతున్నాయి. చొక్కా, చెడ్డీ విప్పేసి డ్రాయర్‌తో కూర్చోమన్నారు. సిగ్గుపడుతూనే సిద్దపడ్డాను. నా ముఖంలో మారుతున్న రంగులు చూస్తూ రేబాల రమణా, మా నాయనా గుసగుసగా మాట్లాడుకున్నారు. కాసేపటికే నాకన్నా రెండు మూడేళ్లు పెద్ద వయసున్న ఇంకో పిలగాడు వచ్చి మేకప్‌ చేసే ఆయన ముందు కూర్చున్నాడు. రంగు పూసి, పౌడరేసి, ధగధగ మెరిసే గుడ్డలు తొడిగి వాడ్ని చిన కార్యవర్ధి రాజుని చేశారు.  వాడు స్టేజి మీదకి వెళ్లీవెళ్లగానే ఈలలు హోరెత్తాయి. ఈ బుడ్డోడికి ఇంత సీనేందబ్బా అని మాయలఫకీరు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. చినకార్యవర్ధిరాజు వేషంలో ఉన్నది నేనే అనుకుని ఆ ఊళ్లో ఉన్న మా హరిదాసు చిన్నాయన బంధుబలగం అంతా కలిసి చేసిన హడావుడి అది. తెర వెనుక నిలబడ్డ నా కళ్లలోంచి నీళ్లు కారిపోతూ ఉంటే సంగు వేషంలో ఉన్న రేబాల రమణ ‘ఉమశ్రీ మొదటిసారి కదా. జంకతావని వాడ్ని ఎక్కించినాం. జాగ్రత్తగా చూడు. ఈసారి నువ్వే ఎక్కుదువుగానీ’ అని సముదాయించాడు. విశేషం ఏమిటంటే ఆ రోజు వేషం వేసింది నేను కాదని  కల్లూరులోని మా చుట్టపక్కాలు ఎవ్వరికీ ఇప్పటికీ తెలీదు.

మా నాయన  బుర్రకథలు కూడా చెప్పేవాడు. హార్మొనీ వాయించేవాడు. పద్యాలు రాసేవాడు, పాడేవాడు. ఎందుకోగానీ మా ఇంట్లో ఒక్కరికి కూడా ఇవేవీ అంటలేదు. కూటికి గుడ్డకి కొరగాని పనులనే వాటిని మా అమ్మ అంటనివ్వలేదు. అయితే పుట్టా పెంచల్దాసు మా నట్టింట్లో నేలమీద కూర్చుని హరిశ్చంద్ర కాటిసీను పద్యాలు పాడుతూవుంటే మాత్రం,  పక్కనే చేరి అతనివైపు తన్మయంగా చూసేది. గోడమీద వేలాడదీసిన ఫోటోలోంచి మా నాయన ఈ దృశ్యాన్ని నవ్వుతూ చూస్తుండేవాడు.

మారుతీ పౌరోహితం రాసిన ‘కుశలంబేగదా ఆంజనేయా’ కథ, టైం మెషీనలా నన్ను 50 ఏళ్ల వెనక్కి తీసుకువెళ్లింది. పల్లె నాటక సంబరాన్ని కళ్లకు కట్టింది. గువ్వలదొడ్డి ఉర్సుకి  శ్రీరామాంజనేయ యుద్ధం డ్రామా వేయాలని నిర్ణయం తీసుకున్న రోజు నుంచి ఆరునెలల పాటు ఆ ఊరు ఉత్సవంలా మారిన పండుగ వాతావరణాన్ని రచయిత  హృద్యంగా చిత్రించారు. డ్రామా నేర్పించే పాండురంగయ్య, రంగస్థల నటి రంగాబాయి, హార్మోనిస్టు పలుకూరు తిమ్మయ్య వంటి రంగుపిచ్చోళ్లకి ఇంట్లో పేడనీళ్లు ఎదురైతే, వీధిలో పసుపునీళ్ల స్వాగతం లభిస్తుంది. రెండువేల బత్తెం ఆశతో ఒంటెడుదిన్నె నుంచి డ్రామా నేర్పించేదానికి గువ్వలదొడ్డికి చేరుకున్న పాండురంగయ్య  రోజూ రాజభోగమే అనుభవించాడు. సాయంత్రం ఆరు నుంచీ సాధన మొదలయ్యేది. డైలాగు పలకలేక పడే అవస్థలూ, వాళ్లను చూసి వరసైన వాళ్లు చేసే వ్యాఖ్యలూ, గురువు మందలింపులూ.. కథ ఆద్యంతం నవ్వులు పూస్తూనే ఉంటాయి. అందరి ముందూ తిట్టకుండా గురువును తునకల కూరతో సంతోషపెట్టేవారు శిష్యులు. రాముడి వేషం వేసే రసూలు సాయిబు నోట మాత్రం పద్యం పొల్లుపోకుండా రాగయుక్తంగా వినిపించేది.

డ్రామా వేసే రోజుకి పెద్ద చిక్కే వచ్చిపడింది. ‘దేవుడి గెడ్డం’ నేను తియ్యనంటే తియ్యనని రసూలు సాయిబు మొండికేశాడు. తలో మాట విసిరారు. ‘రసూలు గాడు శానా నిష్టగా డ్రామా నేర్చుకొనేడ్య. ఏడు నెలలల సంది ఒక్క దినుము కూడా నీసు ముట్టల్యా. కడాకి గుడ్డుకూడా తినల్యా. మరి ఆయప్ప మన దేవునికి అంత భక్తి సూపిచ్చినప్పుడు, మనం గూడా ఆయప్ప దేవునికి అంతే భక్తి సూపల్ల గదా’ అంటూ పెద్దమనుషులు రసూలు సాయిబు మాటకే ఆమోదం తెలిపినారు. అట్లా గెడ్డం రాముడు స్టేజీ ఎక్కి దంచేసినాడు. ‘ అయినదేమో అయినదీ ప్రియ’ అనే పాటకి వడ్డే వెంకటప్ప రంగాబాయితో కలిసి డ్యాన్సు వేస్తుంటే ఈలలు హోరెత్తిపోయాయి. గువ్వలదొడ్డివారి శ్రీరామాంజనేయ యుద్ధం సూపర్‌ హిట్‌. ఊరు ఊరంతా ఉప్పొంగిపోయారు. డ్రామా నేర్పించిన పాండురంగయ్య దంపతులకి గుడ్డలు పెట్టారు. ఇంటింటికీ పిలిచి ధాన్యం కొలిచారు. రమణారెడ్డి లాగా వచ్చిన పాండురంగయ్య బయలుదేరే రోజుకి రేలంగిలాగా ఒళ్లుచేశాడు. గువ్వలదొడ్డివాళ్లు వేసిన డ్రామా గురించి ఊళ్లకు ఊళ్లు గొప్పగా చెప్పుకుంటూ ఉంటే, ఆఊరి ఆత్మీయతను  రంగాబాయి, పలుకూరు తిమ్మయ్యలు  కలిసినపుడంతా గుర్తుచేసుకునేవాళ్లు.

‘కుశలంబే కదా ఆంజనేయా’ కథ మొదలుపెట్టాక చదువుతున్నట్టుగా ఉండదు. చూస్తునట్టే ఉంటుంది. మారుతీ పౌరోహితం కథను దృశ్యం కట్టి చెప్పిన తీరు అద్భుతం. పల్లె మనుషులు, వారి కోపతాపాలూ, సూటిపోటి మాటలూ, చమత్కారాలూ, విసుర్లూ, ఆప్యాయతలూ.. కర్నూలు గ్రామీణ నేపథ్యంగా పట్టి చూపిన విధానం హత్తుకుంటుంది. పల్లెజనం మధ్యం కులం, మతం ఎంత చిన్నవో  ఈ కథ అంతర్లీనంగా చెబుతుంది. ఒక సాయిబు రాముడి వేషం వేయడమే గాక, గెడ్డంతో వేయడానికి ఆమోదం పొందడం..  అది ఆ ఊరి ఔన్నత్యం అన్నట్టుగా రచయిత ఎక్కడా నొక్కి చెప్పకపోవడం ఈ కథ ప్రత్యేకత. నిజమే.. ఒకప్పుడు ఊరి బతుకు కలనేతలా సాగేది. ఇప్పటి వాతావరణంలో నుంచి చూసినపుడు అది విడ్డూరంగానే కనిపిస్తుంది. ఆనాటి పాత పల్లె రోజులను కథగన్న రచయిత, యధాతధంగా దాన్ని పాఠకుల ముందుంచారు. కర్నూలు గ్రామీణ మాండలికంలో కథ నడుస్తుంది. అయితే యాసను పలికినట్టుగానే రాయడానికి చేసిన ప్రయత్నం ఈ మాటలు పరిచయం లేని వారిని ఒకటిరెండు పేజీల దాకా ఇబ్బంది పెడుతుంది. తెలుగు వర్ణమాలలోకి యాస మాటలను ఇముడ్చుకునేటపుడు రచయిత కొంత స్వేచ్ఛను తీసుకోవచ్చనుకుంటా.  తిరుపతి ప్రాంత మాండలికమే రాసినా పులికంటి కృష్ణారెడ్డి కథల్లో చదువరికి ఎదురయిన ఇబ్బంది, నామిని కథలు చదువుతున్నపుడు ఎదురుకాలేదు. సరళం చేసుకోవడం వల్ల మాండలిక సౌందర్యం మరింత పెరుగుతుంది కూడా. అల్లం రాజయ్య ‘అగ్నికణం’ నాటికి తెలంగాణ మాండలికం సంక్లిషంగా అనిపించేది. ఆ తర్వాత కాలంలో రాజయ్య సహా ఆ ప్రాంత రచయితలు యాసమీద గాక, మాండలిక మాటలను ఏరి కూర్చి మాలగట్టి అందంగా సాహిత్యానికి  అందించడం మీద శ్రద్ధ పెట్టారు. ఇప్పడు తెలుగు సినిమాకే అందమైన ఆభరణంగా తెలంగాణ మాండలికం మారిపోవడాన్ని మనం చూస్తున్నాం. వైవిధ్యభరితమైన రాయలసీమ మాండలికమూ అంత సౌందర్యవంతమైనదే!

‘ఊరిమర్లు’ కథలతో నాగప్పగారి సుందరరాజును మారుతి పౌరోహితం బాగా గుర్తు చేశారు.

*

ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

20 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • మా గువ్వలదొడ్డి గ్రామ ప్రజలకు మీరు ఇచ్చిన గౌరవం సార్! దాన్ని ఎప్పటికీ నిలుపుకొంటాం సార్!

 • Thank you so much RM Umamaheswara Rao sir! మా ఊరు గురించి , మాగ్రామంలోని వారి గురించి మీరు వ్రాసినది చదువుతూ ఉద్వేగానికి లోనయ్యాను సార్! మా ఊరివారందరి తరుపునా ధన్యవాదాలు సార్ మీ ప్రోత్సాహం మరువరానిది. 💐💐💐💐

 • నిజమే,మాండలికం మన సంస్కృతిని మాత్రమే కాదు, మరుగున పడుతున్న ఆప్యాయతలను కూడా తట్టి లేప గల అద్భుతాలనూ చేయగలదు…ఇలాంటి రచనలను తప్పకుండా ప్రోత్సహించడమే కాదు, మనమూ భాగమవ్వాలి. తెలుగే రానట్టూ, మాటున మళ్లీ దొరికిపోతూ ఉండే మాయదారి నటులకు కనువిప్పు కలిగేలా… మేము రాయలసీమ వాసులం అని గర్వించేలా మాండలికాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..ధన్యవాదాలు..

 • సమీక్ష కథ లాగే బాగుంది. జ్ఞాపకాలలో తిప్పుతుంది

 • గొప్పగా విశ్లేషించారు సర్.
  మీరు మారుతి పౌరోహిత్యం గారి కథల గురించి సహృదయపూర్వకంగా చెప్పాక
  మారుతి గారి
  కథలు మీద నాకూ ఓ అవగాహన వచ్చింది. గౌరవమూ ఇంకా పెరిగింది.

  మీరు పూనుకొని ఇంత అద్భుతమైన సమీక్ష చేసినందుకు కృతజ్ఞతలు

 • విశ్లేషణ సమీక్ష ఇంత గొప్పగా ఉంటె, అసలు కథ ఎంత అద్భుతమో!!

  పంపగలరు> ఎక్కడ దొరకుతుందొ తెలియపరచగలరు, భవదీయ,

  9440292979

  • ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో వాలుతుంది మహోదయా!

   • మారుతి సార్…. మీ కథలు,…… మరియు ఈ ఊరుమర్లు,ఇంకా మీ కథా సాహిత్యంలో వచ్చినవి ఏవి ఉన్నా నాకు పంపండి సార్ నా పిహెచ్. డి పరిశోధనకి చాలా అవసరం…. సార్
    నా వాట్సప్ నంబర్7780398573 కి తెలియజేసినా నేను ప్రతిస్పందిస్తాను.బయట చాలా ప్రయత్నం చేశా దొరకలేదు

 • అయితే యాసను పలికినట్టుగానే రాయడానికి చేసిన ప్రయత్నం ఈ మాటలు పరిచయం లేని వారిని ఒకటిరెండు పేజీల దాకా ఇబ్బంది పెడుతుంది. తెలుగు వర్ణమాలలోకి యాస మాటలను ఇముడ్చుకునేటపుడు రచయిత కొంత స్వేచ్ఛను తీసుకోవచ్చనుకుంటా. తిరుపతి ప్రాంత మాండలికమే రాసినా పులికంటి కృష్ణారెడ్డి కథల్లో చదువరికి ఎదురయిన ఇబ్బంది, నామిని కథలు చదువుతున్నపుడు ఎదురుకాలేదు. సరళం చేసుకోవడం వల్ల మాండలిక సౌందర్యం మరింత పెరుగుతుంది కూడా.

  మాండలిక పదాల ప్రయోగంలో ఇబ్బందులు సూటిగా చెప్పారు.

 • మారుతీ సార్ రాసిన ప్రతి కతా సదుతాంటే మనల్ని చెయి పట్టుకోని ఆయా ఊర్లకి, మనుసుల దెగ్గిరికి తొడకపోయినట్టె ఉంటాది. ఇంక ‘కుశలంబే గదా ఆంజనేయ’రాసే ఇదాయికంలో అయన పడిన పడుబాట్లు నాకు తెల్సు. ఎట్టయితే ఏం గానీ గొప్ప కత రాసినారు. అదీ మా ఉమన్న సమీక్ష చెయిడం అద్భుతం. ఊరిమర్లు కతా సంకలనం అందురూ సదవదగింది కచ్చితంగా!

 • ఆ పాత మది – ఆ పాత మధురం
  తిరిగిరాని బాల్యం – మరపు రాని జ్ఞాపకం
  మదిని నింపే ఉగాది
  మర్లు గొలుపు – నేటి గందరగోళం
  తిరిగి రాని ఆనాటిని ఆ జ్ఞాపకాలను
  బండి ఎక్కించి – విహరింప చేసే..

  మీ ఊరి మర్లు – మది నిండా ఉత్సాహం
  తనువు తనువు పులకింప చేసే ఊరి మర్లు..
  ఊరు జ్ఞాపకం సజీవం
  మీ ఆలోచన అభినందనీయం
  ఊరి మర్లు – మధురం .

  మీ కథానైపుణ్యానికి అభినందనలు.

 • కథ అద్భుతం ! ఉమా గారి సమీక్ష అత్యద్భుతం

 • భారత సమాజం ఏకస్తంభం పై నిర్మించబడిందనే సమకాలీన మతతత్వ వాదనను తప్పని నిరూపిస్తూ బహుస్తంబాలపై నిర్మితం భారత సమాజం అని చెబుతుంది ఈ కథ. భారత సమాజంలో సామరస్యం అంతర్భాగమని దానిని గుర్తించడంలో సాహితీ వేత్తలు విఫలం అవుతున్నారని చెప్పకనే చెబుతుంది. సమకాలీన ఫాసిస్ట్ సమాజంగా రూపుదిద్దుకొంటున్న ప్రస్థుత పరిస్థితులలో ఇలాంటి సాహిత్య సృజన అవసరం ఎంతో ఉంది. జయహో మారుతీ పౌరోహితం. జయహో ఆర్ ఎం ఉమామహేశ్వర రావు!

 • అన్న నమస్తే,
  నీళ్లు ఇంకని నేల కథ ద్వారా మన పశ్చిమ కర్నూల్ వాసుల భాషని, ఇక్కడి మనుషులు సంప్రదాయాలకు ఇచ్చే విలువలనును, కనుమరుగవుతున్న నీటి వనరులను, మానవ సంబంధాలను చక్కగా కనబరిచినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను🙏
  ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్న నీళ్లు కూడా తాగకుండా అంత్యక్రియలు జరిగేంతవరకు సంప్రదాయాలకు విలువనిచ్చేటువంటి గిడ్డయ్య గారి పాత్ర తీరు ఎంతో అద్భుతం.
  అది మన ప్రాంతవాసులు సాంప్రదాయానికి ఇచ్చేటువంటి విలువలు. ప్రస్తుతము కనుమరుగైతున్నటువంటి సాంప్రదాయాలను, మానవీయ విలువలను తట్టి లేపిన మీ రచన ఎంతో అద్భుతం.
  మీ నుండి మేము ఇంకా ఎంతో సాహిత్యాన్ని ఆశిస్తున్నాం. మరి ముఖ్యంగా పశ్చిమ కర్నూల్ ప్రాంతంలో పండుగల సందర్భంగా వేసేటువంటి కళారూపాలు పులి వేషాలు, బోల్ బోల్ సిద్ధి వేషాలు, ఒగ్గు కథలు ఇతివృత్తంగా ఒక మంచి కథ సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకు రాగలరని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను.🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు