ఊరి నేపథ్యంలోనే మరి రెండు నవలలు: సిధారెడ్డి

మలిదశ తెలంగాణ ఉద్యమకాలంలో నా భావోద్వేగాలు రాయాలని ఉంది. అయితే – ఆళ్వార్ స్వామి, దాశరథి రంగాచార్యలాంటి వాళ్ళు మహనీయులు. వాళ్ళ స్థాయి వేరు. నవలా రచనలో వాళ్ళు చేసిన అద్భుతాలు వేరు.

నందిని సిధారెడ్డి కవిగా సుప్రసిద్ధులు. కానీ కవిత్వంతోపాటు కథలు, పాటలు రాశారు. ఇప్పుడు “నాగటి తరం” అనే  నవల వెలువరించారు. ఈ సందర్భంగా  నందిని సిధారెడ్డి తో  జయప్రకాష్ ముఖాముఖి-

నవలా రచనకు మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు ఏమిటి?

చాలా సందర్భాల్లో సాహిత్యంలోని అన్ని ప్రక్రియల పట్లా ఆకర్షితుణ్ణయ్యాను.  మంచి రచనలు కలిగినప్పుడు కలిగే పారవశ్యంలో అటువంటి రచన చేయాలని ఉత్సాహం కలిగేది. నవల కూడా అట్లే ఆకర్షించేది. నేను చదివిన తొలి నవల శారదా అశోకవర్ధన్ ‘సాగర సంగమం’. మామూలు నవలే అయినా ఆ ప్రక్రియ ఆ ఊహా ప్రపంచం ఆకర్షించింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు వార పత్రికల సీరియల్ నవలలు చదివే అలవాటయింది. ఆంధ్రజ్యోతి వారపత్రిక ‘‘నవలా ప్రియదర్శిని’’ వరుస నవలలు ఆకర్షించాయి. ఎం.ఏ.లో నవల ఒక పేపర్. చదివి చదివి ఆ ఊపులో ‘‘అంగడి’’ అనే నవల రాశాను. సంతృప్తి కలగలేదు.  తిరిగి రాయటం కుదరలేదు. అది పోగొట్టుకున్నా నవల రాయాలనే కోరిక పోగొట్టుకోలేదు. ఖాళీ దొరికి ఈ మధ్య నవలలు చదువుతున్నప్పుడు రాయాలనే ఉత్సాహం బలపడింది. శిల్ప కౌశలం లేదనే సందేహంతో రాయటం మానేస్తే తనకు తెలిసిన జీవితం మరెవరు రాస్తారని ఉర్దూ రచయిత్రి రషీద్ జహాన్ మాటలు నా బలాన్ని పెంచాయి. ఆ శక్తితో నవల పూర్తి చేశాను.

“నాగటితరం” శీర్షిక విలక్షణంగా అనిపిస్తుంది. ఆ శీర్షిక పెట్టడానికి కారణం ఏంటి? అలాగే నవల ఇతివృత్తం క్లుప్తంగా చెప్పండి.

‘నాగలి’ సంప్రదాయిక గ్రామీణ వ్యవసాయ ప్రతీక. ‘నాగలి’ చుట్టే ఊరు, వృత్తులు, ఉమ్మడి జీవనం, మానవ సంబంధాలు, ఉత్పత్తి, ఉద్వేగాలు, త్యాగాలు, పోరాటాలు అల్లుకున్నాయి. మనిషీ భూమీ సంబంధం ఎట్లా విడదీయరానిదో, భూమీ నాగలీ సంబంధం, ఊరూ వ్యవసాయం సంబంధం విడదీయరానిది. ఈ సంబంధాలేవి వ్యాపారం కాదు. యాంత్రికం కాదు. నాగలి సంబంధాలన్నీ జీవితం. మానవ జీవితం. పరస్పర ఆధారం. సహకార సహజీవనం. ‘నాగలి’ నుంచి ప్రాణం పోసుకున్న రచయితను. ప్రేరణ పొంది, ఉత్తేజం అందుకుని ఉద్యమించిన తరానికి ప్రతినిధిని. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చింది. వేగం పెరిగింది. బుల్డోజర్ / ప్రొక్లెయినర్ వచ్చింది. విధ్వంసం పెరిగింది. భౌతిక జీవితం మెరుగుపడినట్లనిపించినా, మానసిక జీవితం విధ్వంసమైంది. మనిషి ధ్వంసమయ్యాడు. నాగలి తరం ఆలోచనలు ‘మనిషి’ కోసం నిర్మాణమైనాయి. జెసిబీ తరం ఆలోచనలు ‘డబ్బు’ కోసం నిర్మాణమవుతున్నాయి. బంధాలు, ఆలోచనలూ అన్నీ పోయాయి. ‘నాగలి’ చుట్టూ బోలెడు సాహిత్యం వచ్చింది. నాగలి ఒకప్పటి ప్రతీక. బుల్డోజర్ ఇప్పటి ప్రతీక. ఆ తరం త్యాగం ధ్వనించటానికి ‘నాగటి తరం’ పెట్టాను.

ఊరిలో సాధారణ రైతు ఊళ్ళకోసం, మనుషుల కోసం నిలబడితే నగరంలో ఉన్నత విద్య చదువుతున్న యువకులు మనుషులకోసం, ఊళ్ళకోసం వచ్చి పోరాటాలు నిర్మాణం చేయటం ఇతివృత్తం.  దున్నే రైతు, చదివే విద్యార్థి ఒకరికొకరు ఆలోచించిన ఒక తరం. ప్రజల కోసమే జీవించిన ఒక తరం కథ. వ్యక్తిగతంగా మా ‘బాపు’ కథ. బాపుతో అల్లుకున్న గిరాయిపల్లి అమరుల కథ.

తొలిసారి నవల  రాస్తున్నప్పుడు సాధారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి.  మీరు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?  వాటిని మీరు ఎలా  అధిగమించారు?

నవల రాయటం గొప్ప అనుభవం. క్రమం ఏర్పరుచుకోవటం, తీరిక సృష్టించుకోవటం, ప్రతిక్షణం ఉత్సాహం నింపుకోవటం నవల రాస్తున్న కాలంలో తప్పనిసరి.  కథా గమనానికి, కాలగమనానికి సంబంధం సరిచూసుకోకపోతే ఇబ్బంది. నా వరకు నాకు నవల రాయాలనే వాంఛ బలంగా ఉండటం వల్ల, తెలిసి ఉన్న జీవితం అయి ఉండటం వల్ల ఇబ్బందులేం ఎదురుకాలేదు. ఒకటి రెండు సందర్భాల్లో అవగాహన కోసం మిత్రులతో మాట్లాడి స్పష్టపరుచుకున్నాను.

 వట్టికోట ఆళ్వారు  స్వామి, దాశరథి రంగాచార్య లాంటివాళ్ళు  తెలంగాణ రైతాంగ పోరాట కాలాన్ని నవలలుగా  మలిచారు. ఆ బాటలో మీరు మలిదశ తెలంగాణ  ఉద్యమ కాలాన్ని నవలలుగా రాసే ఆలోచన ఏమైనా ఉందా?

మలిదశ తెలంగాణ ఉద్యమకాలంలో నా భావోద్వేగాలు రాయాలని ఉంది. అయితే – ఆళ్వార్ స్వామి, దాశరథి రంగాచార్యలాంటి వాళ్ళు మహనీయులు. వాళ్ళ స్థాయి వేరు. నవలా రచనలో వాళ్ళు చేసిన అద్భుతాలు వేరు. ఆ రైతాంగ పోరాటం కూడా మహోన్నతమైంది. నవలలుగా కాదుగాని – మలిదశ తెలంగాణ ఉద్యమానుభవాల్ని ఆత్మకథలో భాగంగా రాసే ఆలోచన ఉంది.

 మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి.. అలాగే  సాహిత్యంలో నేడు నెలకొన్న ఖాళీలు ఏంటి..  వాటిని పూరించడానికి సాహిత్యకారులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి?

మా ఊరి నేపథ్యంలోనే మరి రెండు నవలలు రాసే ప్రణాళిక ఉంది. సమయం అనుకూలిస్తే తప్పక రాస్తాను. జీవితం పెద్ద సముద్రం. ఊరు తరగని గని. కథలు రాసినా, కవిత్వం రాసినా, నవల రాసినా నా చిన్న జీవితమే ఒడువలేదు. మన చుట్టూ రాసిన జీవితంకంటే రాయకుండా మిగిలిపోయిన జీవితమే ఎక్కువ. రాయాలి. రాయగలిగిన వాళ్ళంతా ఎంత రాయగలిగితే అంత రాయాలి. ఆత్మకథ రాయమని ఒత్తిడి ఉంది. నా ప్రణాళికల్లో అదొకటి. కాలం గతంలాగే సాగుతున్నాఆధునిక జీవితం శరవేగంగా మారుతున్నది. నాగటితరం ఆలోచనలకూ, ఐటీతరం ఆలోచనలకూ పొంతనే లేదు. బోలేడు మార్పులు. కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతున్నాయి. వివాహ వ్యవస్థ వణుకుతున్నది. నేర ప్రవృత్తి మేరల్లేకుండా చొచ్చుకొస్తున్నది. నిర్మాణాలు విధ్వంసాలు కొల్లలు. నిస్సిగ్గు మనస్తత్వాలు కొల్లలు. అన్నీ ఖాళీలే. సాహిత్య సృజనకారులు చిత్రిక పట్టే లోపలే మారిపోతున్నాయి. అవన్నీ అందుకోవాలి. రచయితలకు విరామం లేదు. రాయాలి. రాయాలి. భూవిముక్తి అయ్యే లోపలే మనిషి బందీ అయ్యాడు. మనిషిని విడిపించాలి.

*

జయప్రకాష్

డాక్టర్ వి. జయప్రకాష్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ‘‘దాశరథి రంగాచార్య సాహిత్య జీవిత ప్రస్థానం’’ అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్.డి పొందారు. విశాలాంధ్ర ప్రచురణాలయం, ఆంధ్రప్రభ, TV5, వనిత టీవీ (Ntv) లలో సేవలందించి, ప్రస్తుతం తెలంగాణ మోడల్ స్కూల్, మహేశ్వరంలో పీజిటిగా పనిచేస్తున్నారు. రంగాచార్యపై గ్రంథాలు సహా పలు గ్రంథాలకు సంపాదకత్వం వహించారు.. తెలుగు భాషా చైతన్య సమితి ద్వారా అంతర్జాల వేదికలో ఐదేళ్ళుగా వినూత్నమైన సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఎస్.సి.ఇ.ఆర్.టి. రాష్ట్ర రిసోర్సు సభ్యులుగా సేవలు అందిస్తున్నారు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు