ఇంటింటికొక కత

“దిమ్మచెక్కలాగ అలా కూచోకపోతే కాస్త గంధం తియ్యరాదుషే?’’

“ఓసి నీ సిగ్గు చిమడా… దిక్కుమాలిన పీనుగా?’’

“దరిద్రం ఓడుకుంటూ పుట్టుకువచ్చావు…’’

“ఎంత ఒళ్లు కరుచుకుని తిరుగుతున్నావే పింజారీ!’’

“చద్దువు చద్దువుగాని… మహమ్మాయి వండించేస్తానో లేదో చూసుకుందువుగాని’’

“నేలబెట్టి రాసేస్తాను కాని, నిన్ను చావనిస్తానుషే’’

తెలుగులో గొప్ప రచయిత అయిన శ్రీపాదగారు రాసిన ఒక కతలోనివి పై నుడుగులు. పసియీడులోనే తలచెడి పుట్టింట్లో ఉంటున్న మనవరాలిని అమ్మమ్మ ఆడిపోసుకొన్న మాటలవి. చాదస్తపు కొంపలో ఆ పసిపిల్ల పడిన అలమటను చదువుతుంటే కడుపు తరుక్కుపోతుంది మనకు. మనవరాలిలో దూరి శ్రీపాదే కత చెబుతున్నట్టుగా ఉంటుంది. ‘మేమే పెద్దవాళ్లం’ అని చెప్పుకొనే ఒక కులంలోని ఆనాటి కుళ్లును ఎలుగెత్తి చాటినాడీ కతలో శ్రీపాద.

అరిటాకు మీద దోనెడు వేడివేడి కూడును వడ్డించుకొని, పట్టెడు ముద్దపప్పూ కమికెడు ఆవకాయా చేరెడు ఆవునెయ్యీ కలగలుపుకొని తింటున్నంత కమ్మగా ఉంటుంది శ్రీపాద తెలుగు. తియ్యటి గోదాటి నల్లింటి (అగ్రహారపు) తెలుగు కదా!

అప్పుడెప్పుడో 1935లో తెలుగులో కతలుపుట్టంగ పుట్టిన కత శ్రీపాదగారి ‘అరికాళ్లకింద మంటలు’ అయితే నేను చదివింది మటుకు ఇరవైయొకటవ నూరేడు పెట్టినాకనే. కత వెలువడిన డెబ్బై ఏళ్లకు చదివిన నేను అబ్బురపాటుతో ఉబ్బి తబ్బిబ్బయినాను. శ్రీపాద కతలను పొగడడానికి నేనెంతవాడిని! నాకంత తగుది (అర్హత) లేదని నేనెరుగుదును.

అయితే రెండేళ్ల కిందట నాచేతికొక కతలపొత్తం వచ్చింది. ఆ పొత్తంలోని తెలుగు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. కమ్మటి మొగిలేటి గట్టు మాలవాడ తెలుగది.

గోదాటి గట్టుతో నాకే పొంతూ లేదు కానీ,  మొగిలేటి మాట నాదే, అచ్చంగా నాదే. అత్తావున అయిదుతాడుల (మైలుకు కాస్త ఎక్కువ) వెడల్పు ఉండే మొగిలేటికి, అద్దరిన మునికాంతపల్లి, ఇద్దరిన తుమ్మూరు. నాకుండిన పదునాలుగుమంది అమ్మమ్మలలో ఒకరిది తుమ్మూరు. పొద్దుపోకడలో ఎన్నడో ఎవ్వరెరిగిననాడో మునికాంతపల్లి తనపేరును చిగురుపాడుగా మార్చుకొనేసింది. మారిన పేరు కింద ఆవూరిలో తరాలకు తరాలే మారిపోయినాయి.

ఏళ్లూ పూళ్లూ గడిచినాక అదే చిగురుపాటిలో సంక్రాంతివాళ్లింట ఒక పిలగాడు పుట్టినాడు. వాడికి మొగిలేరంటే ముదిగారం. ఏటికట్ట మింద యెన్నిటగుడ్లాట ఆడడం… ఏటి ఇసకలో చెలమ లోడి మూతిబెట్టి నీళ్లు తాగడం… ఇట్ట్టాంటి ముదిగారాలన్నీ పడతా పడతా ఉంటే, ఒకనాడు ఆ మొగిలేరే గుసగుసమని చెప్పిందంట, ‘ఒరే అబయా! మీవూరి మొదుటిపేరు మునికాంతపల్లిరా’ అని. ఆపేరుతోనే కతలను రాసేసినాడు ఆ పిలగాడు.

సోలోమోన్ విజయకుమార్‌ రాసిన మునికాంతపల్లి కతలమీద వచ్చినన్ని తెగడ్తలూ పొగడ్తలూ ఇన్నెనక(ఇటీవల) ఇంకొక పొత్తం మీద రాలేదనుకొంటాను. అవ్వాటిని అవతలపెడితే, గొప్ప బతుకులను ఎన్నింటినో పటంగట్టి మనముందు నిబడతాయా కతలు. పంటనాడులో పారే ఏరులలో పెద్దది మొగిలేరు అయితే, మొగిలేటికి చెల్లెలు కాళంగి. 1990లోనే కాళంగి కరకట్ట బతుకులను కళ్లకు కట్టినాడు ఉమన్న(ఆర్‌.ఎం.ఉమామహేశ్వరరావు). అప్పటికి పదిపన్నెండేళ్ల ఈడు ఉండుండవచ్చు మునికాంతపల్లి పిలగాడికి. చెల్లెలి ఒడిలో చెలువపు కతలు పుడతుంటే చూసి కుళ్లుకొన్న మొగిలక్క, తన పిలగాడి చెవిగొరికి రాయించిందీ బతుకులను.

సేలల్లో సెలకల్లో పెరక్కొచ్చిన అటికిమావిడాకు, పొనగంటాకు, సేస్తిరేసాకు, బచ్చలాకులతో ఎనిపిన పులగూరలూ, సినకల కాలాన గెనాలమిందకు పొయి ఏరకొచ్చిన కుంకులు, కాసిప్పలు, ఎంటకాయల పులుసులూ, వారంవారం దబరడు గొడ్డుకూరా, అదురుస్టం పండినపుడు అడివిపంది తునకలూ, గొంజి ఆకులు కప్పెట్టి ఊరబెట్టే సొంటికూడూ, ఎండలకి సలవనిచ్చే కలిశారూ, గంపల్లో మగ్గతుండే ఉప్పిడి బియ్యమూ, వొడిమ్ముద్దలూ, పాకం బెల్లమూ… పిలగాడోళ్ల పెంచిలవ్వ సుట్టింటి(వంటింటి) సింగారాలియ్యి.

సరే! ఏదో మొదలుపెట్టి ఇంకేదో వాగతుండానని అనుకోవద్దండి. మునికాంతపల్లి కతల్లో ‘మా పెంచిలవ్వ’ అనే కతను చదువుతుండేటపుడు, ఎందుకనో మరలా శ్రీపాద నా తలపులను తట్టినాడు. గోదాటి నల్లింటి బతుకులలో ఒక ముసలిది, తన తలచెడిన మనుమరాలిని సూటిపోటి మాటలతో కాల్చుకొని తింటుంది. మొగిలేటి మాలింటి బతుకులలో మరొక ముసలమ్మ మొగుడు పోయిన తన కూతురి ఎదుట కళకళలాడుతూ తిరగలేక, మొగుడుండీ బొట్టునూ పూలనూ వదిలేస్తుంది.

తను పుట్టి పెరిగిన ఇళ్లలోని కుళ్లును కళ్లకుకట్టి కడిగిపోసిన మహనీయుడు శ్రీపాద అయితే, అణచివేతలూ అలమటలే కాదు, అందలాలు ఎక్కించదగిన అందమైన బతుకులు మావి అని చాటినవాడు మునికాంత పిల్లోడు. అవును, ఇంటింటికొక మంటిపొయ్యి కదా! అలికి ముగ్గుబెట్టినవి కొన్నయితే, మురికితో మసిగొట్టుకొన్నవి మరికొన్ని.

*

స వెం రమేశ్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నాకొక పుస్తకం పంపించండి రమేశ్ సార్

  • మునికాంతపల్లి కతల ప్రస్థావన బహుశా ఓ ఇరవై యేళ్ళ తరువాత కూడా వస్తుందేమో..
    అప్పుడూ నేను ఇదేవిధంగా కదలిపోతానేమో..
    మారలా ఆ బతుకులను నెమరేసినందుకు ధన్యవాదాలు స.వెం‌ రమేష్ గారు!

  • ఈ రచనకు ఇది చాలా ఆలస్యం అయిన రివ్యూ అయినా ….మీ మాటలు గుండెల్లో నుండి వచ్చాయి

  • మునికాంత పల్లి కథలు చదివాను.ఒక్కో కథా ఒక దృశ్యకావ్యం. ఆ భాష, యాస,బతుకులు గొప్పవి.విజయకుమార్ కూ, పరిచయం చేసిన మీకూ అభినందనలు

  • వందేళ్ల తెలుగు సాహిత్యం నుంచి ఏర్చి కూర్చిన కవితలు, విశ్లేషణ వ్యాసాలు , ఇంకా అనేక ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచిన వెయ్యి పేజీల గ్రంథం “కవన గర్బరాలు”.. అమెజాన్ లో అందుబాటులో ఉంది. వెల ఆరువందల రూపాయలు.. సంపాదకులు చేపూరి సుబ్బారావు వి.కె.ప్రేంచంద్
    Book Brochure link: https://kavanagarbaralu-telugubook.blogspot.com/2024/01/blog-post.html

  • ఇన్నిమంచి కథలు చెప్పినందుకు, అభినందనలు సోలోమోన్ విజయకుమార్ అన్నా .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు