ఇద్దరు మిత్రులు

రవై నాలుగో ఏట నేతి మూర్తికి, ఉషతో వివాహం అయ్యింది.  దాదాపు దశాబ్దం తరువాత మామగారు, “ఉషని చక్కగా చూసుకుంటున్నావు. నాకు కొడుకులేని లోటు అల్లుడిగా తీర్చుతున్నావు. అలాగే నా వ్యాపారాన్ని కూడా చూసుకో బాబు”  అంటూ ఉష చేతిని అతని చేతిలో పెట్టి ఈ లోకం నుంచి వెళ్ళిపొయ్యాడు.  అప్పటి దాకా చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి వ్యాపారంలోకి దిగాడు మూర్తి.  స్వతహాగా తెలివికలవాడున్ను, లౌక్యం తెలిసినవాడు కాబట్టి వ్యాపారాన్ని అభివృద్ది చేసాడు.

ఇరవైఏడో ఏట అల్లం వెంకట్‌కి దమయంతితో ధూంధాంగా వివాహమయ్యింది.  ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి, మూర్తి తన పెళ్లి చూపులలో ఉషని ఎన్నుకోవడంలో ప్రధాన పాత్ర వెంకట్‌దే.  అలాగే వెంకట్ దమయంతిని చేసుకోవడంలో మూర్తి పాత్ర కూడా తక్కువ కాదు.

పెళ్ళయిన సంవత్సరానికే వెంకట్‌కి కూతురు పుట్టింది. మరో సంవత్సరం తరువాత కొడుకు పుట్టాడు. పిల్లలు పుట్టిన  కొత్తలో రెండు కుటుంబాలు ఈ గుడి అని, ఆ కొండలని, ఈ లేక్ అని, ఆ సముద్రమని, ఈ అడవని, ఆ దేశమని వెళ్లిన చోటుకి మళ్ళీ వెళ్లకుండా తిరిగారు.  పిల్లలు లేకపోవడం మూర్తి దాంపత్యానికి పెద్ద లోటయ్యింది. వాళ్ళ ప్రేమ వెంకట్ పిల్లల మీదకి మళ్లింది. స్కూల్ సెలవుల కోసం మూర్తి కుటుంబం ఎదురుచూసేది.  సెలవలు రావడం ఆలస్యం, వెంకట్ పిల్లలకోసం ట్రెయిన్ టికెట్లు ముందే రిజర్వ్ చేసేవాడు మూర్తి. ఉష సెలవులకి ఒక రెండు రోజులు ముందే బెంగళూరు చేరుకునేది.  సెలవల తరువాత పిల్లల్ని దిగబెట్టడానికి మూర్తి వెళ్ళేవాడు. వెంకట్ కొడుకునో, కూతుర్నో దత్తత తీసుకోవాలని ఉష కోరిక. “మన సరోజిని కూతురుకే ఉష ఆస్థి అంతా, ఇంకెవరికి ఇస్తుంది?” అని పుట్టింటి వాళ్ల మాటలు ఉష చెవిన పడనే పడ్డాయి.  సరోజిని ఉష పిన్ని కూతురు.

బెంగళూరులో ఒకానొక  ట్రాన్స్‌నేషనల్ కార్పోరేషన్‌లో ఏరియా మానేజర్‌గా అల్లం వెంకట్  ఉద్యోగం చేస్తున్నాడు .  ఆర్థికంగా వెసులుబాటున్న జీవితాన్ని ఆస్వాదిస్తూ చిన్న చిన్న   సమస్యలను పరిష్కరించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్లతో పాటే ఖర్చులూ పెరిగాయి. పుండు మీద కారం లాగా దమయంతికి లోబ్యులార్ కార్సినోమ (బ్రెస్ట్ కాన్సర్)అని పరీక్షలలో తేలింది.  వెంకట్ కూతురు మూర్తి ‘మామయ్య’ కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పిన వెంటనే  ఉష బెంగళూరు చేరుకుంది.  దమయంతితో వారం రోజుల పాటు వుండి ధైర్యం నూరిపోసింది.  అంతే కాదు, దమయంతిని తనతో పాటు వచ్చేస్తే తనే అన్నీ దగ్గరుండి చూసుకుంటాను అని కూడా వెంకట్‌కి చెప్పింది.  వెంకట్ దంపతులు సున్నితంగానే తిరస్కరించారు.  మూర్తి కూడా వెళ్ళి ఒక రోజు  వుండి పిల్లలకి, వెంకట్‌కి ధైర్యం చెప్పి వెనక్కి వెళ్ళాడు ఉషతో పాటు. దాదాపు ప్రతిరోజూ  ఫోనులో వాళ్ళని పలకరిస్తూనే వున్నారు.

అదే సమయానికి ప్రపంచీకరణ పుణ్యమా అంటూ వెంకట్ పనిచేస్తున్న ట్రాన్స్‌నేషనల్ కార్పోరేషన్‌ ఉద్యోగాలను డవున్‌‌సైజ్ చేసుకోవడం మొదలుపెట్టింది.  ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వెంకట్‌కి ఆరు వారాల గడువుతో, ఆరు నెలల జీతం, సివియరన్స్ పాకేజ్‌తో పాటు, వెకేషన్  పాకేజ్‌, ఎక్స్టెన్డెడ్ హెల్త్  ఇన్స్యూరెన్స్ వగైరాలు ఇచ్చి ఇంటికి పంపించేసింది.  అటు ఉద్యోగం పోవడంతో పాటు, ఇటు ఆరోగ్యం కోల్పోయిన దమయంతిని చూసుకోవడం మానసికంగా వెంకట్‌ని కృంగదీసింది.

డబ్బు కోసం బెట్టింగ్‌లలో పాల్గొనడం మొదలు పెట్టాడు.  షేర్ మార్కెట్ మీద పడ్డాడు. అప్పులు చేసి రియల్ ఎస్టేట్‌లోకి ప్రవేశించాడు. ఉన్నది పోవడంతో ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం మొదలు పెట్టాడు. ఇంటికి, కారుకి, పిల్లల చదువులకోసం చేసిన లోన్‌లకి నెలసరి వాయిదాలు కట్టడంలో వెనక బడ్డాడు. హామీలు లేకుండా లోన్ ఇస్తామన్న లోన్‌షార్క్స్ చేతుల్లో పడ్డాడు. మూర్తి ఫోనులకి బదులివ్వటం లేదు. ఒక్కొక్కసారి పలికినా ముక్తసరిగా జవాబులిస్తున్నాడు వెంకట్. దమయంతి ఫోన్ అందుకునే  పరిస్థితిలో లేదు. పిల్లలిద్దరూ సరిగ్గా జవాబులివ్వడం లేదు. మూర్తికి అనుమానం మొదలయ్యింది.

                                             ***

గంట, గంటకి ఫోను చేస్తున్న లోన్‌ఆప్ కలెక్షన్ ఏజెంట్‌కి ఇప్పుడూ, అప్పుడూ అంటూ తిప్పుతున్న వెంకట్‌కి సహనం నశించి, విచక్షణ క్షీణించి, “దొబ్బెయ్, ఏం  చేసుకుంటావో, చేసుకోపో,” అని విసురుగా అంటూ బూతులు లంకించుకున్నాడు. అవతల వాడు ఫోన్ కట్ చేసాడు.

మరుసటి రోజు రాత్రి పదింటికి ఫ్లాట్ డోర్‌బెల్ మోగింది.  తలుపు తీయగానే యెదురుగుండా   ఉష.  ఆమె వెనక నేతి మూర్తి!  వెంకట్‌ని నెట్టుకుంటూ లోపలికి వెళ్ళాడు మూర్తి. నోరు తెరుచుకుని అలా నిలబడి పొయ్యాడు వెంకట్ గుమ్మంలోనే. ఉష లోపలికి వెళ్ళి బెడ్ రూమ్‌లోకి దారి తీసింది.  కళ్ళు మూసుకుని పడుకున్న దమయంతి పక్కనే కూర్చున్న వెంకట్ కూతురు, ఉషని చూడగానే చటుక్కున లేచి, రెండు అంగలలో ఉషని చేరుకుని కావలించుకుని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. “ఊరుకో అమ్మా ఊరుకో నేను వచ్చేసానుగా!” అని ఓదార్చుతూనే ఉష కూడా కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంది.

హాలులో ఒక పక్కనున్న సోఫాలో మూర్తి కూలబడ్డాడు. వెంకట్‌కి మాటలు రావడం లేదు.  సరిగ్గా అప్పుడే అలసిన మొహంతో, నలిగిపోయిన బట్టలతో, చెదిరిన జుత్తుతో వెంకట్ కొడుకు ఫ్లాట్‌లోకి వచ్చాడు. వాడి చేతిలో కారియర్.  మూర్తి‌ని చూడగానే వాడి ముఖం విప్పారింది.  సోఫాలో మూర్తి పక్కనే కూలబడ్డాడు.
“ఎలావున్నావురా,” అని మూర్తి అడిగే ప్రశ్నకి ఒక పిచ్చి నవ్వుతో జవాబిచ్చాడు.
“నువ్వు లోపలికి వెళ్లు. అత్తయ్య కూడా వచ్చింది…చూడు,” అని వాడిని పంపేసాడు వెంకట్.

తనకెదురుగా వున్న సోఫాలోకి జారుకున్న వెంకట్‌ని మూర్తి ఆపాదమస్తకం పరిశీలనగా చూశాడు.

వాడిని చూస్తుంటే వీడేనా నా బాల్య మిత్రుడు?  ఎంత తెలివి గలిగిన వాడు!  పళ్ల కోసం గోడలు దూకినప్పుడు ఆ ధైర్యం, సినిమాల కోసం క్లాసులు బంకు కొట్టినప్పుడు ఆ తెగువా… ! అనుకుంటూ జ్ఞాపకాలలోకి జారుకున్నాడు!

***
నేతి గాడిని అల్లంగాడు కొట్టాడు. అలా ఇలా కొట్టలేదు. నేల మీదకి విసిరేసి కొట్టాడు. మధ్యలో ఒకడి బటన్ వూడింది. షర్ట్ చిరిగింది. ఇదంతా చూస్తున్న మనోరంజని టీచరు తలా ఒకటిచ్చింది. నేతిగాడి కుడి చెవి, అల్లంగాడి ఎడం చెవి పట్టుకుని మెలిపెడుతూ గోడవారకు లాక్కెళ్ళి ఇద్దర్ని అక్కడ నిలబెట్టింది. అప్పటి దాకా తమాషా చూస్తున్న పిల్లలందరూ గప్ ఛుప్.

“ఏమయ్యిందిరా ఇద్దరికి? అలా కొట్టుకుంటున్నారు?” మనోరంజని టీచర్ అరిచింది.

“వాడే టీచర్ …” అంటూ అల్లంగాడు నేతిగాడి వైపు చెయ్యి చూపించాడు.

“లేదు టీచర్… వాడే మొదట…”

“నోరు ముయ్యండి ఇద్దరు! మళ్ళీ ఇంకోసారి ఇలా కొట్టుకుంటూ కనబడ్డారా….మీ పేరంట్స్‌కి కబురు చేస్తాను. జాగ్రత్త! ఇద్దరూ గోడ కుర్చీ  వెయ్యండి లంచ్ బెల్లు మోగేంత వరకు,” అని వెనక్కి తిరిగిందావిడ.  సరిగ్గా అప్పుడే లంచ్ క్లోజింగ్ బెల్ మోగింది.

స్కూల్ వదిలింతరువాత బస్సులో ఎక్కింతరువాత కాని వాసుకి నేతిగాడితో మాట్లాడే అవకాశం దొరకలేదు.

“ఎందుకురా అల్లంగాడిని లంచ్ అవర్లో కొట్టావు?” అడిగాడు వాసు.

“మా చెల్లి జడని పట్టుకు లాగాడు, అందుకని…”

“ఎవరు చెప్పారు నీకు వాడే లాగాడని?”

“చెల్లాయే చెప్పింది!”

“అల్లంగాడు కాదు లాగింది!”

“మరి ఎవరు?”

“…”

“నా చెల్లి నాతో అబద్ధం చెప్పదు!”

రెండు నిముషాలు వారిద్దరి మధ్య మౌనం.

“ఎవరు? చెప్పరా?”

“నువ్వు ఏం చెయ్యనంటే చెప్తా.” అన్నాడు వాసు.

“సరే, చెప్పు.”

“హేమ లాగింది. అస్సలు హేమకి రోజా పువ్వులంటే ఇష్టం. నీ చెల్లికి తెలీకుండా లాగేద్దాం అనుకుంది. నీ చెల్లి వెనక్కి తిరిగి చూసేటప్పడికి అల్లంగాడు కనబడ్డాడు దానికి. అస్సల లాగింది హేమానే!”

“నువ్వు చూసావా?”

“చూసా. అల్లంగాడి పక్కన హేమా, హేమ పక్కన నేను కూర్చున్నాం క్రాఫ్ట్ క్లాసులో. నీ చెల్లి మా ముందు వరసలో మా ముందే కూర్చునుంది. పాపం అనవసరంగా అల్లంగాడిని కొట్టావు!”

నేతిగాడు ఏం మాట్లాడలేదు.

వాసు ఫ్లాట్ దగ్గిర బస్సు ఆగగానే దిగడానికి లేచాడు. నేతి నారాయణమూర్తిని దాటుకుని వెళ్తూ, “పాపంరా, మొన్నే అల్లంగాడి అమ్మ కూడ చచ్చిపోయిందిరా! అనవసరంగా వాడిని కొట్టావు” అన్నాడు.

నేతి సూర్యనారాయణ మూర్తి ఏమి మాట్లాడలేదు.

నేతి సూర్యనారాయణ మూర్తికి తను అనవసరంగా అల్లంగాడిని కొట్టానన్న బాధ అల్లుకుంది. ఆ రాత్రి వాడికి నిద్ర సరిగ్గా పట్టలేదు. నిద్ర నిండా పీడ కలలే. అల్లంగాడు తన మీద పడి మరీ మరీ కొట్టినట్టు.

మరుసటి రోజు ఉదయం స్కూల్ ప్రేయర్ గ్రవుండ్ దగ్గిర అల్లంగాడి కోసం చూస్తూ నిలబడ్డాడు. అల్లంగాడు వచ్చాడు గాని ఆ లోపు ప్రేయర్ మొదలయ్యింది. మధ్యాహ్నం లంచ్‌లో అల్లంగాడు నేతి సూర్యనారాయణమూర్తిని తప్పించుకుని తిరిగాడు. వాసు, అల్లంగాడు ఇద్దరు కలిసి భోంచేసారు. నేతి సూర్యనారాయణ మూర్తి ఎక్కడైనా హేమ కనబడుతుందేమోనని చూసాడు కాని ఆ అమ్మాయి కనబడలేదు.

మూడ్రోజులయ్యింది. అల్లంగాడు నేతి సూర్యనారాయణ మూర్తికి పలకరించే అవకాశం ఇవ్వలేదు. హేమకి తన మూలంగా అల్లంగాడికి, నేతి మూర్తికి చెడిందని అర్ధమ్మయ్యి వాళ్ళందరిని తప్పించుకుని తిరుగుతోంది.

శనివారం స్కూల్ మధ్యాహ్నాం వరకే. బెల్ మోగింది. బంతి తగిలిన ఏడు పెంకుల్లాగా పిల్లలందరూ  క్లాసుల్లోంచి బయటకు పరుగెత్తారు. నేతి సూర్యనారాయణమూర్తి ఆరోజు ఉదయమే నిర్ణయించుకున్నాడు ఎలాగైనా అల్లంగాడిని పట్టుకోవాలని. స్కూల్ ఆఫీసు ముందు లాన్‌లో బల్ల మీద కూర్చుని కనపడ్డాడు అల్లంగాడు. వీడు వాడిని చూడటం, వాడు వీడిని చూడటం ఒకేసారి జరిగింది. మొహం తిప్పుకుని గభాల్న లేచి పరుగెత్తాడు అల్లంగాడు. ఏమి చెయ్యాలో అర్థంకాక నేతి సూర్యనారాయణమూర్తి నిలబడి చూస్తుండిపొయ్యాడు. వెనక్కి తిరిగి బస్సు ఎక్కాడు. బస్సులో విండో సీటు పక్కన వీడి చెల్లి, తన పక్కనే వాసు కూర్చున్నారు. వాసు పక్కనే వీడి పుస్తకాల బాగు.
“ఏం చేసావు?” అన్నాడు వాసు.
“అల్లంగాడి కోసం వెతికా. వాడు కనపడ్డాడు గాని నన్ను చూసి తలతిప్పుకుని వెళ్ళిపొయ్యాడు,” అన్నాడు వాసు ముఖం చూడకుండా.

వాసు విని ఊరుకున్నాడు.

“వాడు నీతో మాట్లాడడు…” అన్నాడు కాసేపటి తరువాత.

“వాడిల్లు తెలుసా?”

“తెలుసు”

“మరి నన్ను వాళ్ళింటికి తీసుకు వెళ్తావా?”

“అలాగేలే.  రేపు వెళ్దాం.”

”రేపు వద్దు.  ఈ రోజే వెళ్దాం,” అన్నాడు నేతి సూర్యనారాయణమూర్తి.  వాడి ముఖం లోకి ఒక సారి చూసి ఏమనుకున్నాడో ఏమో వాసు సరే అన్నాడు. “సాయంత్రం నాలుగింటికి వస్తాను,” అంటూ వాడిల్లు రాగానే బస్సు దిగి వెళ్లిపొయ్యాడు.  ఒక పావుగంట ఆలస్యంగా వచ్చాడు వాసు, సైకిల్ తొక్కుతూ.  కింద సెల్లార్‌కి వెళ్ళి తన సైకిల్ తీసుకుని వాసుతో కలిసి బయలుదేరాడు.

వీళ్ళిద్దరు వెళ్ళేటప్పడికి అల్లంగాడి ఫ్లాట్‌కి తాళం వేసి వుంది.  ఇద్దరూ మళ్ళీ లిఫ్ట్‌లో కిందకి  దిగి గ్రవుండ్‌కి వెళ్ళారు.  దూరం నుంచే కనబడ్డాడు అల్లంగాడు. డీప్ ఫీల్డ్‌మన్‌గా వున్నాడు. సైకిళ్ళు రెండూ ఆ పక్కనే పార్క్ చేసి నిలబడ్డారు ఇద్దరు.
“అల్లం,” అని పిలిచాడు నేతి సూర్యనారాయణ మూర్తి. అల్లంకి వినపడిందా? తెలీదు. వాసు పిలిచాడు.  వాసు రెండో సారి పిలిచినప్పుడు తల వెనక్కి తిప్పి ఏవిటన్నట్టు తలెగరేసాడు.
“వీడు నీతో మాట్లాడాలంటున్నాడురా!”
అల్లంగాడు తల తిప్పి ఆటలో మునిగిపొయ్యాడు.  ఆ ఓవర్ మొత్తం వీళ్ళిద్దరు ఇక్కడ, వాడు ఫీల్డ్‌లో.  ఆ తరువాత రెండు ఓవర్లకి గేమ్ అయ్యింతరువాత అల్లంగాడు వాసు దగ్గిరకి వచ్చాడు.
“సారీ రా,” అన్నాడు నేతి సూర్యనారాయణ మూర్తి వాడితో.  అల్లం వినిపించుకోనట్టు  వాసుతో “దేనికిరా? ” అన్నాడు.
“నిఝంగా వీడికి తెలీదురా ఏం జరిగిందో.  వాడి చెల్లి చెప్పింది, వీడు విన్నాడు,” అన్నాడు వాసు. షేక్ హాండ్ కోసం చెయ్యి జాస్తూ మళ్ళీ అల్లంగాడితో, “సారీరా. మళ్ళీ ఇంకోసారి అలా చెయ్యను,” అన్నాడు నేతి సూర్యనారాయణమూర్తి. అల్లంగాడు వాడి వేపు చూడనన్నా చూడలేదు.  గబుక్కున వాసు వాడి చేతిని లాగి పట్టుకుని నేతి సూర్యనారాయణమూర్తి జాపిన చేతిలో పెట్టాడు.  విదిలించుకోబొయ్యాడు అల్లంగాడు.  నేతి సూర్యనారాయణమూర్తి వదలలేదు.  “సారీరా, ఐ ప్రామిస్. మళ్ళీ ఇంకోసారి అలా చెయ్యను,” అన్నాడు. అప్పుడు అల్లంగాడు వాడి మొఖంలోకి పరికించి చూసాడు.  వాడికి అర్థం అయ్యింది.
“సరేలే,” అంటూ నేతి సూర్యనారాయణమూర్తి జాపిన చెయ్యిని మెత్తగా ఒక సారి వత్తి వదిలేసాడు.  ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్.  వాళ్ళతో పాటే వాసున్ను.

* * *

అలా వాళ్ళ స్నేహం మూడు అగ్గి పెట్టెలు, ఆరు సిగరెట్టు పాకెట్లుగా పెరిగి మహా వృక్షం అవుతున్న నేపథ్యంలో  వాసు పూనేకి వెళ్ళిపొయ్యాడు.  అప్పుడు ఇద్దరే మిగిలారు.  ఒకడు నేతి మూర్తిగాను మరొక్కడు అల్లం వెంకట్‌గాను ఇతరులు పిలుచుకుంటున్నారు.

***

వెంకట్ ముందు టేబుల్ మీదున్న గాజు ఆష్ట్రే కింద పడింది. ఆ అలికిడికి ఈ లోకంలోకి వచ్చాడు మూర్తి.

ఒత్తుగా, చిందరవందరగా వున్న జుత్తు, జిడ్డుకారుతున్న ముఖం, ఎర్రగా వుబ్బిన కళ్ళు, నలిగిపోయిన నల్ల రంగు టీ షర్టులో, జారిపోయిన భుజాలు, కుంచించుకుపోయిన ఛాతీ, తాగుడుతో లావెక్కిన పొట్ట, ముడతలు పడిన షార్ట్స్‌లో నుంచి బలహీనంగా వున్న కాళ్ళు, మట్టి కొట్టుకుపోయిన పాదాలు, తెగిపోవడానికి సిద్ధంగావున్న ఒక  స్ట్రాప్‌తో జారిపోయిన సాండల్స్.
“ఏవిట్రా ఏదైనా పని మీద వచ్చావా?” అని అడిగాడు వెంకట్.
జవాబివ్వలేదు మూర్తి. అతనివంకే తీక్షణంగా చూసాడు.  కళ్ళు కిందకి దింపుకున్నాడు వెంకట్.
“ఏవిట్రా…ఇదంతా?” అని అడిగాడు మూర్తి.
జవాబు లేదు.
సిగరెట్టు అంటించుకున్నాడు వెంకట్.  సోఫాలో నుంచి లేచి వెంకట్ ముందుకెళ్ళి నిలబడి, “రేపు దమయంతిని, పిల్లల్ని తీసుకుని ఉష వెళ్లిపోతుంది,” అని చెప్పాడు.
“ఎక్కడికి? ఎందుకు?”
“మా ఊళ్ళో మంచి హాస్పిటల్‌ వుంది.  దమయంతికి అందులో మెరుగైన వైద్యం అందిస్తాను.  పిల్లలు కూడా అక్కడే మాతో పాటే వుండి చదువుకుంటారు.”
“కుదరదు, అందరం ఇక్కడే వుంటాం!”
“వాళ్ళు వుండరు”
“వుంటారు!”
“నువ్వెవరురా చెప్పడానికి…” అంటూ ముందుకొచ్చాడు వెంకట్.
రెండు భుజాల మీద చేతులు వేసి మూర్తి అతన్ని సోఫా మీదకి నెట్టాడు. సోఫా మీద నుంచి లేవడానికి ప్రయత్నించి కాళ్లు సహకరించక అందులోకే కూలిపొయ్యాడు వెంకట్. ఈ అలికిడికి ఉష హాల్లోకి వచ్చింది.  వెంకట్ ఎడం చేతిలోని సిగరెట్ పీకని తీసుకుని కింద పడ్డ ఆష్ట్రేని టేబుల్ మీద పెట్టి దాన్లోకి కుక్కాడు మూర్తి. రోదిస్తూ అలానే సోఫామీదకి జారి కళ్లు మూసుకుని పడుకుండిపొయ్యాడు.
“పిల్లల్ని పిలువు. భోజనాలు చేద్దాం.  మిగతా విషయాలు తరువాత మాట్లాడుకుందాం” అన్నాడు మూర్తి. డైనింగ్ టేబుల్ మీద వెంకట్ కొడుకు తెచ్చిన కారియర్‌ని అందరికి సర్ది వడ్డించింది ఉష. భోజనాల తరువాత పిల్లలు, ఉష, దమయంతి బెడ్ రూమ్‌లోకి వెళ్ళి పడుకున్నారు.

ఏ అర్ధరాత్రో మెలకువ వచ్చింది మూర్తికి. బెడ్ మీద వెంకట్ లేడు. తలుపు సందులోనుండి హాలు లోని నైట్ లాంప్ వెలుతురు సన్నగా పడుతోంది.  అడుగులో అడుగు వేసుకుంటూ తలుపు దగ్గిరకి వెళ్లి చూసాడు.  వెంకట్ లేడు కాని బాల్కనిలోకి తలుపు తెరిచివుంది. వెంకట్ బాల్కనిలో గోడకి జారగిలబడి కూర్చుని వున్నాడు.  ముందు ఏదో సింగిల్ మాల్ట్ విస్కీ బాటిల్, చేతిలో గ్లాసు.  ఎడంచేతిలో కాలుతున్న సిగరెట్టు.  మసక వెలుతురులో చెంపలమీద కన్నీరు జారి ఎండిపోతున్న చారికలు.  మూర్తి వెళ్ళి ఎదురుగా నేలమీదే కూర్చున్నాడు.
“నేను పంపను, వాళ్లందరూ నాతోనే వుంటారు,” అన్నాడు వెంకట్.  ఆ కంఠంలో అతని నిస్సహాయతతో కూడిన దుఃఖం కూడా వినబడింది మూర్తికి.
“దమయంతిని చూసుకోవడం పిల్లలిద్దరికి కుదరదు. ఉష దమయంతిని చూసుకుంటుంది.  పిల్లల్ని నేను హాస్టల్లో పెడతాను.”
“కావాలంటే వాడిని తీసుకువెళ్లు…పాపని పంపను!”
“అది ఇక్కడుండనంటోంది…”
“దాన్ని పంపను!”
“పంపవా!”
“పంపను!” బింకంగా అన్నాడు వెంకట్.
మూర్తి చటుక్కున లేచి గదిలోకి వెళ్లి తన మొబైల్‌తో వచ్చాడు. ఫోన్ తెరిచి అందులో ఫోటోని పెద్దది చేసి వెంకట్‌కి చూడమని ఇచ్చాడు. మార్ఫ్ చేసిన వెంకట్ కూతురు బొమ్మ అది.
“నీకెక్కడిది ఈ ఫోటో?” నిర్ఘాంతపోతూ అడిగాడు.
“దమయంతి మందు కోసం నా ఫోన్ చార్జ్ అయిపోయిందని, నీ ఫోన్ తీసి చూస్తే రాత్రి, అందులో వుంది!”
“అయ్యో దేవుడా! దేవుడా!  నాకెందుకయ్యా ఇలాంటి శిక్ష?” అని వెక్కుతూ ఏడవటం మొదలుబెట్టాడు. లోన్‌ షార్క్ వాట్సాప్ చేసి హెచ్చరికగా పంపిన బొమ్మ అది.
“అన్నీ నువ్వు చేతులారా చేసుకుని మళ్ళీ ఆ దేవుడి మీద పడటం ఎందుకు?”
“నీ కాళ్లు పట్టుకుంటాను…ఇంట్లో ఎవరికీ  చెప్పకు…ఉషకి కూడా…ప్లీజ్…ప్లీజ్…ప్లీజ్..” అంటూ మూర్తి కాళ్ళమీద పడిపొయ్యాడు వెంకట్.
“చెప్పను.  కాని పిల్లలు, దమయంతిని మేము తీసుకు వెళ్లిపోతాము. తరువాత సంగతి తరువాత…” అని వెనక్కి తిరిగాడు మూర్తి.
“వాళ్లు లేకుండా నేను బతకలేనురా మూర్తి!”
“నీతో వుంటే వాళ్ళు బతకరు!” అని కాళ్లు విదిలించి, వదిలించుకుని లోపలికి వెళ్ళిపొయ్యాడు మూర్తి.
***
పొద్దున్నే మూర్తి ఉషతో మాట్లాడాడు. ఉష దమయంతికి నచ్చచెప్పింది. పిల్లలిద్దరూ మాట్లాడకుండా బట్టలతో సహా వాళ్ళకి కావాల్సినవన్నీ సర్దుకున్నారు, వాళ్లమ్మకి కావల్సిన మందులు, తనకి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలతో సహా.   అపరాహ్ణం వేళ ఉష, పిల్లలూ, దమయంతి  ట్రెయిన్‌కి బయలు దేరి వెళ్లిపొయ్యారు.

తనకి తెలిసిన మిత్రుడి ద్వారా ఒక పోలీస్ ఉన్నతాధికారి సహాయంతో వెంకట్ కూతురు ఫోటోని మార్ఫ్ చేసి బెదిరిస్తున్న లోన్‌ షార్క్‌ వివరాలు తెలుసుకున్నాడు మూర్తి.  పోలీస్ అధికారి ద్వారా ఆ లోన్‌షార్క్‌కి వెంకట్ ఇవ్వాల్సిన బాకీ మొత్తం ఇచ్చి సెటిల్‌ చేసాడు. పోలీస్ అధికారి అంతటితో వదలలేదు.  లోన్ షార్క్‌ని వెంకట్ ఇంటికి తీసుకెళ్ళి క్షమాపణ చెప్పించాడు.  వెంకట్ మూర్తి కాళ్ళ మీద పడిపోబొయ్యాడు.
“ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యకు. మరో సారి ఇలాంటివి జరిగితే నేను రాను.  ఇంకెవరో వస్తారని కూడా ఆశించకు,” అంటూ వెంకట్‌ని  హెచ్చరించాడు మూర్తి.

***

కాల చక్రం గిర్రున తిరిగింది. దమయంతి కాన్సర్ బారి నుండి బయట పడింది.  బెంగళూరులో వెంకట్ దగ్గిరకి తిరిగి వెళ్ళింది.  షాపింగ్‌కి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు, రోడ్డు క్రాస్ చేస్తుంటే బస్ ఢీకొని తీవ్రమైన గాయాలతో ఉష హాస్పిటల్ పాలయ్యింది.  వార్త తెలిసిన వెంటనే దమయంతి హాస్పిటల్‌లోనే ఉషకి తోడుగా వుండి తనకి సపర్యలు చేసింది.  వారం రోజులు తీవ్రమైన యుద్ధం చేసిన ఉష ఓడిపోయింది. మూర్తి ఒంటరి వాడయ్యాడు.  దమయంతే స్వంత చెల్లెలుకన్నా ఎక్కువగా అతన్ని జాగ్రత్తగా చూసుకుంది. మూర్తి వ్యాపారంలో పూర్తిగా మునిగిపొయ్యాడు.

అక్కడ వెంకట్ తన చీకటి ప్రపంచంలోనుంచి వెలుతురులోకి వచ్చాడు. ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేసే సంస్థలో ఉద్యోగంలో చేరాడు.  ఆర్థికంగా, మానసికంగాను వెంకట్‌లో మార్పు వచ్చింది.  జీవితంలో స్థిరపడ్డాడు. ఈ విషయాలు అన్నీ ఎప్పటికప్పుడు మూర్తికి తెలుస్తూనే వున్నవి.
***

“గుడ్ మార్నింగ్ రా, నేతిగా!” అని పిలుస్తున్న అల్లం వెంకట్ వైపు తన సేల్స్ రిపొర్ట్స్ చూసుకుంటున్న మూర్తి ఆశ్చర్యంగా తల పైకెత్తి చూశాడు.  ఎదురుగుండా అల్లంగాడు. అతన్ని అలా చూడటం ఎంతో సంతోషానిచ్చింది మూర్తికి.  ఆ సాయంత్రం తన  బయట పనులన్నీ  చూసుకుని వెంకట్, మూర్తి ఇంటికి వచ్చాడు భోజనానికి. పిల్లలు కూడా కూర్చున్నారు డైనింగ్ టేబుల్ దగ్గిర.
“ఇన్నాళ్లు పిల్లలు కూడా నీతోనే వున్నారు. వాళ్ళకి చదువులైపోయినవి.  ఇక్కడ మట్టుకు ఎన్నాళ్లు వుంటావు ఒంటరిగా.  దమయంతి కూడా చెప్పింది నిన్ను తీసుకుని వచ్చెయ్యమని.  నాతో వచ్చెయ్యి” అని అడిగాడు మూర్తిని, వెంకట్.
మూర్తి నవ్వి, “థాంక్స్‌రా. కానీ సారీ, నేను రాలేను. ఇక్కడ నేను చేయాల్సింది, చూడాల్సింది చాలా వుంది. కాబట్టి నన్ను బలవంతం చెయ్యకు,” అంటూ సున్నితంగానే అయినా గట్టిగా  చెప్పాడు మూర్తి.
మూర్తి మళ్ళీ ఒంటరి వాడయ్యాడు.  ఉష పేరు మీద తను స్థాపించిన ఫౌండేషన్ అతనికి అదనపు బాధ్యతలు కలిగించింది.  పూర్తిగా దానిలో మమేకపొయ్యాడు.

* * *

 వెంకట్ కూతురుకి జెర్మనీలో స్థిరపడిన తెలుగు కుటుంబంతో సంబంధం కుదిరింది.  మూర్తి ఆమెకి  ఉష వాడుకున్న వజ్రాల హారం బహుకరించాడు.  వెంకట్ కొడుకుకి పూనేలో మంచి ఉద్యోగమే వచ్చింది.  తన ఆఫీసులోనే పనిచేస్తున్న కష్మిరీ  అమ్మాయి అతనిని ఇష్టపడింది.  ఆ అమ్మాయితో  వివాహం జమ్మూ దగ్గిర ఒక పల్లెలో జరిగింది.  ఆ వివాహానికి మూర్తి వెళ్ళలేకపొయ్యాడు.  మూర్తి ఆశీర్వాదాలు కోసమే కాకుండా అతనితో ఒక రెండు  రోజులు గడిపి వెళ్దామని వెంకట్ దంపతులు,  వాళ్లబ్బాయితోను, కొత్త కోడలుతో కలిసి మూర్తి దగ్గిరకి వెళ్ళారు.  వాళ్ళు ఎలాగు వస్తున్నారని తెలిసి ఊళ్ళో ఉన్న వెంకట్ బంధువులు ఒకరిద్దరుంటే వారిని కూడా భోజనాలకి ఆహ్వానించాడు మూర్తి.  అందులో ఒకాయన పెద్దవాడే. ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా ఉద్యోగ విరమణ చేసి కాలక్షేపం చేస్తున్నవాడు.  మూర్తి ఆహ్వానించిన వాళ్ళలో ఉష పిన్ని కూతురు సరోజిని  కూడా వుంది.

భోజనానంతరం అందరూ వరండాలో తమలపాకులు, కిళ్ళీలు సేవిస్తున్న తరుణం అది. వచ్చిన వాళ్లలో ఎవరో అన్నారు, “వెంకట్ కోడలుపిల్ల తెలివిగలది. కట్నం లేకుండానే మొగుడ్ని సంపాదించుకుంది.”
“ఎవరంది ఆ మాట? ఈ రోజు పిల్లలందరూ అలా లేరులే.  ఆ అమ్మాయి కావాలనుకుంది, కుర్రాడు కావాలనుకున్నాడు…చేసుకున్నారు. మధ్యలో మనకేంటి” అన్నాడు వెంకట్ బంధువైన పెద్దాయన.
“కాదులే…ఎంతైనా  దమయంతి, వెంకట్ గారు చాలా తెలివిగలవారు. చిన్నప్పట్నుంచి మూర్తి బావగారేగా  వెంకట్ పిల్లలిద్దర్నీ సాకింది.  వెంకట్ గారి అమ్మాయికి మా అక్క ఉష వజ్రాల హారం కూడా ఇచ్చాడుగా! ఇప్పుడు ఈ అబ్బాయికి మాత్రం ఏం తక్కువ చెయ్యడులే! తన తరువాత ఆస్తి అంతా వాడికేగా!” అంది సరోజిని.

వింటున్న వెంకట్, దమయంతుల ముఖాలలో ఒక్కసారిగా రక్తం ఇంకిపోయినట్టయి నల్లబడిపోయినవి. వాళ్ళిద్దరూ విస్తుబోతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇదేమిటి?  తాము కలలో కూడా ఇలాంటి ఆలోచన  చెయ్యలేదే!  ఈ సరోజిని ఏమిటి ముందూ వెనక ఆలోచించకుండా ఇలా మాట్లాడుతోంది.  అందులో పదిమంది ముందూ!

మూర్తి ఒక్కసారిగా మాన్ప్రడి పొయ్యాడు.  ఇవేమి పట్టించుకోకుండా సరోజిని, “అసలు ముందు వెంకట్‌గారి కూతుర్ని దత్తత తీసుకుందామనుకుంది ఉషక్క. వీళ్ళకేమో పిల్లల్లేరు.  అందుకనే ఆ పిల్లల్ని తన సొంత పిల్లలుగా చూసుకుంటున్నారు బావగారు. ఐనా ఆ విషయాలు నాకెందుకులే.  నేవెళ్ళొస్తానండి బావగారు” అంటూ వెళ్లిపోయింది.   సరోజిని అన్న ‘నేవెళ్ళొస్తానండి’ అన్న మాటలో విరుపు, వ్యంగ్యం, తన అక్క ఆస్తి తన పిల్లలకి దక్కకుండా పోతోందన్న దుగ్ధ వినపడింది వెంకట్ దమయంతులిద్దరికి.

ఒక్క ఉదుటున లేచి దమయంతికేసి అదోలా చూస్తూ లోపల గదిలోకి వెళ్లాడు వెంకట్.  దమయంతి అతన్ని అనుసరించింది.
“జరిగింది చాలు…ఇక మన సామాన్లు సర్దు. ఒక నిముషం కూడా ఇక్కడ ఇంక వుండే పని లేదు,” అని ఆగ్రహంగా అన్నాడు.
“ఏవిటి, ఏం మాట్లాడుతున్నారండి?  ఆ అమ్మాయి సరోజిని ఏదో అందని మనం వెళ్ళిపోతే ఆ అమ్మాయి మాటలే నిజం అనుకుంటారు ఇక్కడి వాళ్ళందరు. కొంచెం నిగ్రహంగా ఆలోచించండి”
“ఇంకా నిగ్రహం ఏమిటి అన్ని మాటలంటేను! నీకు తెలుసు, నాకు తెలుసు. మనం వాడి డబ్బుల కోసం ఎప్పుడు అలా ఆలోచించలేదు.  వాడు…ఆ నేతి గాడు మట్టుకు ఏం మాట్లాడకుండా అలా ఎలా వున్నాడు!  వాడికి తెలీదా? మనది ఈ రోజు స్నేహమా? ప్రశ్నే లేదు.”
“ఆగండి. మీరే అంటున్నారుగా మీది బాల్య స్నేహమని. మీకు గుర్తుందిగా! మీ చిన్నప్పుడు మూర్తన్నయ్య మిమ్మల్ని అపార్థం చేసుకున్నాడు…తన చెల్లెలి జడ పట్టుకుని మీరే లాగారనుకుని మీమీద చెయ్యి జేసుకున్నాడు. నిజం తెలిసిన  తర్వాత మీకు క్షమాపణ చెప్పాడుగా?” అని అంటుంటే “ఆపు” అంటూ వెంకట్ అడ్డం పడి, “మనం మట్టుకు తక్కువ చేసామా?  ఉషకి బాగోకపొతే నువ్వెళ్ళి హాస్పిటలో వుండి తనకి హెల్ప్ చెయ్యలేదా? తను పోయింతరువాత మూర్తి కోలుకునే దాకా ఇక్కడే వున్నావుగా!” అన్నాడు.

“అందుకనేనండి…ఆవేశంలో అందరూ ఏదో ఒక మాట అనుకుంటారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి.  అందుకని మనం ఇన్నేళ్ళ బాంధ్యవాలన్నీ మరిచిపోతామా?  కాదుగా!  ఈ రోజు తను పెళ్ళికి రాలేకపొయ్యడనేగా ఇంత దూరం మనబ్బాయి, కోడలితో వచ్చింది.  కాస్త స్థిమితంగా ఆలోచించండి” అంటూ సర్ది చెప్పడానికి ప్రయత్నించింది దమయంతి. వెంకట్ సందిగ్ధంలో పడ్డాడు.

వెంకట్ వెనకే ఆ గదిలోకి వచ్చిన వెంకట్ కొడుకు తన తల్లి తంద్రుల మధ్య సంభాషణ విన్నాడు.  మొహం చికాకుగా పెట్టాడు.
“అన్నీ మీ ఇష్టమేనా?  ఒకటా రెండా దాదాపు ఫార్టీ ఇయర్స్ ఫ్రెండ్‌షిప్.  ఎవరో ఏదో అన్నారని ఆ స్నేహాన్న్ని వదిలేస్తారా? ఆ మాత్రం ఓపికగా ఆలోచించరా?  మన ఫామిలీ టఫ్ టైమ్స్ ఎదుర్కుంటునప్పుడు అంకులే కదా నన్ను , చెల్లిని దగ్గరకు తీసుకుని చదువు చెప్పించాడు.  అమ్మకు బాగోకపోతే ఆంటీయేగా దగ్గిరుండి అన్నీ చేసింది!  అవన్నీ  మరిచిపొమ్మంటవా?  ఇట్’స్ నాట్ పాసిబుల్.  ఐ వోంట్ గో విత్ యూ. ఆమ్ విత్ మమ్మీ అండ్ మూర్తి అంకుల్.  ఇఫ్ యూ వాంట్ టు గో, ఇట్స్’స్ అప్టు యూ.  యు అర్ ది వన్ హూ టోల్డ్ మి ‘A real friend walks in when the rest of the world walks out’” అంటూ గదిలోనుంచి గట్టిగా అడుగులేస్తూ బయటికి వెళ్లిపొయ్యాడు.

*

అనిల్ అట్లూరి

అనిల్ వున్నచోట ఉత్సాహం. సాహిత్య ఉత్సవం. తక్కువ రాసినా వాసికి పెద్ద పీట. అభ్యుదయానికి ఇవాళ్టి బాట.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Anil Atloori garu! Nice Story and good narration, ee madhya kalam lo intha manchi kadha chaduvaledu, please keep it up. 45 years back maa Amalapuram ZP. Boys high school lo ilanti chinna maata teda valla oka friend tho matalu cut ayyi last year 2023 December lo old students meet lo malli kalisaamu. Ade gurthukochhindi. Please keep it up in writting good stories like this.

  • అసహనం, మూర్ఖత్వం, పోలరైజేషన్‌ల మూలంగా చిన్ననాటి స్నేహాలు, బంధుత్వాలు కూడా ఛిద్రం అవుతున్న రోజులివి. ఈ కథలోని ప్రాణస్నేహితుల మధ్య విభేదాలకు ఏవైనా కావచ్చుగానీ, యువతరం ముందుకొచ్చి వారి సాన్నిహిత్యాన్ని గుర్తుచేసిన విధం ముచ్చటగొలిపింది. ద్వేషం కాకుండా, కరుణ, సహానుభూతి – ఇవే మనుష్యుల మధ్య వారధులను నిర్మించగలవు అనిపించింది. అభినందనలు, అనిల్!!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు