సాహిత్య ప్రపంచంలో ఒక మహిళకు గొప్ప గుర్తింపు లభించినప్పుడు, ఒక పాఠకురాలిగా నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మన ఆలోచనలను, అనుభవాలను, భావాలను ప్రపంచానికి చెప్పడానికి మహిళలకు ఎన్నో మార్గాలు ఉన్నాయని అలాంటి సందర్భాలు గుర్తుచేస్తాయి.
2026 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ బహుమతి కెనడాకు చెందిన కవయిత్రి, వ్యాస రచయిత్రి, అనువాదకురాలు Anne Carsonకు లభించడం కూడా అలాంటి సంతోషకరమైన సందర్భమే. ఆమెకు ఈ గుర్తింపు రావడం కేవలం ఒక రచయిత్రి విజయంగా మాత్రమే కాకుండా, సాహిత్యాన్ని కొత్త కోణంలో చూడాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన సందర్భం.
Anne Carson 1950లో కెనడాలోని Torontoలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ప్రాచీన గ్రీకు సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆమె, University of Torontoలో చదువుకుని Classicsలో డాక్టరేట్ పొందారు. కవయిత్రిగా, వ్యాస రచయిత్రిగా, అనువాదకురాలిగా ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె రచనల్లో కవిత్వం, వ్యాసం, కథ, ప్రాచీన పురాణాలు, వ్యక్తిగత అనుభవాలు ఒకదానితో మరొకటి కలిసిపోతాయి. అందుకే ఆమెను ఒకే సాహిత్య ప్రక్రియకు పరిమితం చేయడం కష్టం.
ఆమె ముఖ్యమైన రచనల్లో “Eros the Bittersweet”, “Autobiography of Red”, “The Beauty of the Husband”, “Men in the Off Hours”, “Nox”, “Red Doc” వంటి పుస్తకాలు ఉన్నాయి. ప్రాచీన గ్రీకు రచయిత్రి Sappho కవితలను అనువదించడంతో పాటు, Euripides, Sophocles వంటి రచయితల నాటకాలతో కూడా ఆమె experiment చేశారు. పాత కథలను యథాతథంగా చెప్పడం కాకుండా, వాటిలోని భావాలను నేటి మనుషుల జీవితాలకు దగ్గరగా తీసుకురావడం ఆమె ప్రత్యేకత.
Anne Carson రాజకీయంగా ఏదైనా ఒక పార్టీకి లేదా సిద్ధాంతానికి బహిరంగంగా కట్టుబడి ఉన్నారని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే ఆమె రచనలను చదివితే ప్రేమ, లింగ వివక్ష, హింస, అధికారం, ఒంటరితనం వంటి అంశాలపై ఆమెకు ఉన్న పట్టు కనిపిస్తుంది. సమాజంలో మనుషులు ఒకరినొకరు ఎలా చూస్తారు? స్త్రీల భావాలు ఎలా అర్థం చేసుకుంటారు? మనోవేదన, బాధ మనం ఎలా వ్యక్తం చేస్తాం? ఇలాంటి ప్రశ్నలు ఆమె రచనల్లో తరచూ కనిపిస్తాయి. నేరుగా రాజకీయ సందేశాలు ఇవ్వకపోయినా, మన సమాజాన్ని, మన సంబంధాలను మరోసారి ఆలోచించేలా చేయడం కూడా సాహిత్యం చేయగలదని నేను భావిస్తాను.
నేను చదివిన ఆమె రచనల్లో “The Trojan Women: A Comic” నాకు ప్రత్యేకంగా ఆసక్తికరంగా అనిపించింది. Euripides రాసిన ప్రాచీన గ్రీకు విషాద నాటకాన్ని Anne Carson, కళాకారిణి Rosanna Bruno సహకారంతో graphic రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు. ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత, విజేతల చేతుల్లో ఓడిపోయిన ట్రాయ్ మహిళలు ఎదుర్కొనే బాధ, నష్టం, అనిశ్చితి ఈ కథలో ప్రధానంగా కనిపిస్తాయి. యుద్ధంలో పురుషులు గెలిచినా, దాని భారం ఎక్కువగా మహిళలు, పిల్లలే మోస్తారనే విషయం ఈ కథ గుర్తుచేస్తుంది.
పాత కథ అయినప్పటికీ, యుద్ధాల వల్ల ఇళ్లు కోల్పోయే ప్రజలు, కుటుంబాలకు దూరమయ్యే మహిళలు, తమ భవిష్యత్తుపై హక్కు కోల్పోయే మనుషుల గురించి నేటికీ మనం చూస్తూనే ఉన్నాం. Graphic రూపంలోని చిత్రాలు, సంభాషణలు కథను మరో విధంగా అనుభవించేలా చేస్తాయి.శతాబ్దాలు గడిచినా మానవ బాధలోని కొన్ని అంశాలు మారలేదని ఇది గుర్తుచేస్తుంది.
ఆమె మరో ముఖ్యమైన రచన “Autobiography of Red”. పేరు చూస్తే ఆత్మకథ అనిపించినా, ఇది నిజానికి కవిత్వ రూపంలో చెప్పిన నవల. ప్రాచీన గ్రీకు పురాణంలోని Geryon అనే రెక్కలున్న ఎర్రటి రాక్షసుడి కథను ఆధారంగా తీసుకుని, ప్రేమ, ఆవేదన, వికాసం, ఆత్మపరిశీలన వైగైరా వంటి విషయాలను ఆధునిక జీవితానికి అన్వయించారు. ఈ పుస్తకానికి పాఠకుల, సాహిత్య విమర్శకుల నుంచి మంచి గుర్తింపు లభించింది. పురాణ కథను కొత్తగా చెప్పడం, కవిత్వాన్ని నవలలా చదివించే విధానం దీనికి ప్రత్యేకతను తెచ్చాయి. పాత కథలను కూడా కొత్త తరానికి దగ్గర చేయవచ్చని ఈ పుస్తకం నిరూపిస్తుంది.
Anne Carson రచనా శైలిలో నాకు ముఖ్యంగా కనిపించేది ఆమె ప్రయోగాలు చేయడానికి వెనుకాడకపోవడం. ఆమె రచనల్లో కవిత్వం మధ్యలో వ్యాసం కనిపించవచ్చు; ఒక పురాణ పాత్ర నేటి ప్రపంచంలో జీవిస్తున్నట్లు అనిపించవచ్చు. కొన్ని చోట్ల ఆమె రచనలు వెంటనే అర్థం కాకపోవచ్చు. కానీ ప్రతి రచనను ఒకే విధంగా అర్థం చేసుకోవాలనే నియమం సాహిత్యంలో లేదని ఆమె గుర్తుచేస్తారు. అనువాదకురాలిగా కూడా ఆమెకు ప్రాచీన రచనలపై లోతైన అవగాహన ఉంది. మూల రచనలోని భావాన్ని కాపాడుతూనే, దాని భాషను నేటి పాఠకులకు చేరువ చేయడానికి ప్రయత్నిస్తారు. అనువాదం అంటే పదాలను మరో భాషలోకి మార్చడం మాత్రమే కాదు; ఆ రచనలోని భావాన్ని, బాధను, అందాన్ని మరో భాషలోనూ అనుభవించేలా చేయడం అని నేను నమ్ముతాను.
Margaret Atwood, Haruki Murakami వంటి ప్రసిద్ధ రచయితలు ఉన్నప్పుడు Anne Carsonకే నోబెల్ ఎందుకు వచ్చిందనే ప్రశ్న సహజంగానే వస్తుంది. అయితే నోబెల్ బహుమతి అనేది ఎవరు ఎక్కువ పుస్తకాలు అమ్మారు, ఎవరు ఎక్కువ ప్రసిద్ధి చెందారు అనే పోటీ కాదు. ఒక రచయిత ప్రపంచ సాహిత్యానికి తాను చేసిన కృషి ముఖ్యమైనది. కవిత్వం, అనువాదం, పురాణాలు, ఆధునిక జీవితం మధ్య కొత్త సంబంధాలను ఏర్పరచడం Anne Carson ప్రత్యేకత. ఆమెకు ఈ గుర్తింపు రావడానికి ఈ సాహిత్య ప్రయోగాలు, విభిన్నమైన రచనా పద్ధతి ముఖ్యమైన కారణాలు అయ్యాయి.
చివరగా, Anne Carson రచనలు మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తాయి: సాహిత్యానికి హద్దులు ఉండాల్సిన అవసరం లేదు. పాత కథలను కొత్తగా చదవవచ్చు; కవిత్వంలో మన జీవితాలను వెతుక్కోవచ్చు; మానవ సంబంధాలను అర్థం చేసుకోవడానికి సాహిత్యాన్ని ఒక మార్గంగా ఎంచుకోవచ్చు. ఒక మహిళగా, మహిళల voice, వారి ఆలోచనలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించడం నాకు చాలా గర్వంగా ఉంది. అయితే Anne Carson సాధించిన విజయం ఒకప్రేరణగా మహిళలకు మాత్రమే కాదు, సాహిత్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికీ చెందుతుంది. ఆమె రచనలను చదవడం అంటే ప్రపంచాన్ని, మనుషులను, చివరికి మనల్ని మనం కూడా కొత్త కోణంలో అర్థం చేసుకునే ఒక గొప్ప అనుభూతి!
*








మంచి వ్యాసం స్వప్న గారూ, ఆమె నూటికి నూరు శాతం నోబెల్ కి అర్హురాలు,తెలుగు పాఠకులకు ఇలాంటి పరిచయాలు చాలా గొప్ప ఫలితాలను ఇస్తాయి. కంగ్రాట్స్
చాలా థాంక్యూ అండి
మంచి పరిచయం. స్వప్న తన విస్తృత అధ్యయనం నుంచి ఇటువంటి వంటి సాహిత్య పరిచయాలు అనేకం చేయాలని ఆకాంక్ష
బాగుంది. అభినందనలు.
ఆమె సాహిత్య కృషి, రచనా ప్రయోగాలు గురించి క్లుప్తంగా స్పష్టంగా చెప్పారు, థ్యాంక్యూ.
చాలా బాగుంది వ్యాసం. ఇలా ఓ సీరిస్ రాయండి మేడమ్