1
గొలుసుకట్టు జీవితం
చిరునామా లేని చీకటి లేఖ
అరుగరుగునా పారేసి
దొంగలా దాక్కుంది వెన్నెల
రాత్రి చేతులపై తన రేఖలు చెరిపివేస్తూ
నిద్రలోకి ఇంకిపోయింది వేసవి వాన
నీడల సుడిగుండంలో
బెరుకు బెరుకుగా
అక్షరాలను
తనని బెరడులా చుట్టేసిన కాంత శ్వాసతో
నింపేసింది ఓ ప్రేయసి
తన కవితల అడుగలన్నీ
ఇక ఈ చెలి స్వేద జాడలే
ఓ మహాకావ్యంగా మారిన తనువులు
ముడుచుకున్న పట్టీల నిట్టూర్పులు వింటూ
వియోగ తరుణం వైపు కాల్లీడ్చుకుంటూ
ఓ మొద్దుబారిన టూబ్లైట్ స్తంభం కింద
విడిపోయిన చేతుల మధ్య
ఎర్రటి వెలుగు పాములా సాగింది
విప్పేసిన ముడులు
కట్లు తప్పిన గొలుసులు
మళ్లీ మెడలకు అంటిస్తూ..
ఓ వీడ్కోలు
*
2
మెరుపు లేఖలు
కాలం
ఉల్లిపాయలకై తూకానికేసిన
ఓ కవిత్వాల సంగమం
చీల్చి చెండాడబడి
చిత్తడి చిత్తడయిన
అనాథ గుండె
నగరానికి నిద్ర రాకుండా
ఒంటరిగా
ఓ ఇరుకు ఫుట్పాత్ ఒడిలో
వెక్కి వెక్కి ఏడుస్తుంది
అరణ్య వాకిలిపై
అలుపెరగని మంటల గుసగుస
మినుగురు పురుగుల
కాలిన రెక్కల వాసన
వెన్నలపై ప్రేమికుల నీడలు
చివరి వీడ్కోలు వచనాలు
ఒత్తులు విరిగిన లపితాలు
“ ఏరా అన్నం తిన్నావా?”
నాన్న శవం వూరవతల
సంతకాల్లేని సాయిబుల శ్మశానం నుంచి
రాత్రంతా మెరుపు లేఖలు రాస్తూనేవుంది
“ఏదైనా కొత్త కవిత రాసావా?
నాకూ పంపకూడదూ?”
3
దారితప్పిన సమయం
శవం చుట్టూ ఈగలల్లే
మనసంతా ముసురుకున్న ఆలోచనలు
ఎవరిదో తెలియని బాధ
ఎప్పటిదో తేలని ఆక్రందన
శ్వాస చేసే చప్పుడులో కలిసిపోయింది
రొడ్డుపొడుగునా
ఓ సముద్రం మరచిన సుడిగుండం
వేసే ప్రతి అడుగును
తన కంఠంలోకి లాగేసుకుంది
నాలికపై ఒక్కసారిగా ముల్లు మొలిచి
అక్షరాలను పదే పదే పొడవగా
లోపలున్న నిశబ్థం
బొట్లు బొట్లుగా
పెదాలంచున పేరుకుంది
అరువు తెచ్చుకున్న చరిత్రలో
ఇరుక్కుపోయింది
వలస వచ్చిన సమయం
జాలిగా నవ్వుతుంది
ఇక్కడే పుట్టి పెరిగిన నగరం
*








So much depth and beautiful rendition.
కవిత్వానికి ఆయువు పట్టు ఆర్తి.
ఇక్కడ అది నిండా ఉంది.