‘అనువాదం’ కేవలం ఒక భాషను ఇంకో భాషలోకి తీసుకెళ్లే వాహనం కాదు. అది ఒక నడక.
మట్టి మీద, మనసు మీద, జ్ఞాపకాల మీద నడిచే యాత్ర. చూడగలిగితే ఆకుపచ్చ దారుల్లో, ఇరుగు–పొరుగు ఊళ్లలో గోడల కంటే మాటలే ఎత్తుగా ఉంటాయి. ఒక ఇంటి బాధ ఇంకో ఇంటి గదిలో ప్రతిధ్వనిస్తుంది. అలాగే ఒక భాషలో పుట్టిన వాక్యం ఇంకో భాషలో జీవించాలంటే ముందుగా అది అనువాదకుడి హృదయంలోకి అడుగుపెట్టాలి, అక్కడ కొంత సమయం నివసించాలి.
నా అనుభవంలో అనువాదకుడు ఒక వాక్యాన్ని అనువదించడం అంటే ఆ వాక్యానికి ఉన్న శ్వాసను మార్చకుండా మరో భాషలోకి తీసుకెళ్ళడమే. ఇరుగు–పొరుగు మనుషులతో అనుబంధం మనకు నేర్పేది సన్నిహితత్వమూ సామీప్యమే. భాషల మధ్య కూడా అదే అవసరం.
నిజానికి దూరం పెరిగితే అర్థం పలుచబడుతుంది. అందుకే అనువాదకుడు మూల భాషకి దగ్గరగా ఉండాలి లక్ష్య భాషకి కూడా అంతకంటే దగ్గరగా ఉండాలి. అతను మధ్యలో నిలబడి రెండు గాలులను ఒకే ఊపిరిగా మార్చగలగాలి అదే అనువాదం. అనువాదం కేవలం ఒక సాహిత్య ప్రక్రియ కాదు ఒక జీవించే కవిత.
ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడా భాషా సంస్కృతులు తమదయిన శూన్యంలో పుట్టవు, పెరగవు.
కవులూ రచయితలూ కూడా అంతే. తమకే సొంతమయిన స్వీయ సృజనతో పాటు ఇతర భాషలను చదవడం నేర్చుకోవడం, ఆయా భాషల్లో సాహిత్యాల్లో వస్తున్న సృజనాత్మక మార్పుల్ని గమనించడం అనివార్యమయిన అధ్యయనం. అలా చేసినప్పుడే భాషాభివృధ్ధి తో పాటు సాహిత్యాభివృధ్ధీ సాధ్యమవుతుంది.
కేవలం కొన్ని గంటలు ప్రయాణం చేసి చుట్టూ చూస్తే కొత్త భాష వినిపించే మన దేశంలో భాషా సాహిత్యాల మధ్య ‘ఆదాన్ ప్రదాన్’ అత్యంత ముఖ్యమయినది, అవసరమయింది. అది సాధ్యం కావడానికి ఆయా భాషల నడుమ అనుబంధం వాటి మధ్య అనువాదం అత్యంత అవసరమయిన ప్రక్రియ. అట్లని అనువాదం కేవలం భాషానువాదం కాదు. అది మొత్తంగా ఆ ప్రాంత జనజీవన సాంస్కృతిక ప్రతిబింబమయి వుండాలి. అందుకే అనువాదం అన్నది గొప్ప అనుసృజన.
రెండు భాషలకూ, రెండు వ్యక్తీకరణలకూ, రెండు సంస్కృతులకూ నడుమ ‘అనువాదం’ ఓ అక్షరాల వారధి. అది ఓ గొప్ప భావానుబంధం. సమస్త మానవాళి జీవితాల్నీ, జీవనానుభవాల్నీ ఏకం చేసే ఓ సాంస్కృతిక వేదిక.
అందుకే సాహిత్య చరిత్ర లో అనువాదకుడి పాత్ర విలక్షణమయింది, విశిష్టమయిందీ కూడా.
నా అనువాద ప్రయాణాన్ని గురించి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అదెక్కడ మొదలయిందో ఎట్లా మొదలయిందో అవలోకిస్తే కొంత ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. నిజానికి నా జీవిత ప్రయాణం సరళ రేఖలా ఏమీ సాగలేదు. అనేక మలుపులు తిరుగుతూ ఎత్తు పల్లాలు దాటుతూ ప్రవహించింది అయినా సాంస్కృతిక తాత్విక దిశ మారలేదు.
మిత్రుడు అఫ్సర్ అడగ్గానే నా మాతృభాష తెలుగుకూ ఇతర భాషలకూ ఎట్లా కుదిరింది ఎక్కడ మొదలయింది అని నేను నా గతంలోకి వెళ్ళాను. నా చిన్నప్పుడు కరీంనగర్ లో మా మిఠాయి దుకాణం ఇంట్లో నా చుట్టూ అందరూ వున్నా తీవ్రమయిన ఒంటరితనంతో మా అమ్మా నాన్నే లోకంలా గడిపాను.
మా ఇంటికి ఎదురుగా వున్న విజయలక్ష్మి హోటల్లో ఒక రేడియో వుండేది. అందులో ఎక్కువగా హిందీ పాటలే పెట్టేవాళ్లు. మా నాన్న ఆయన మిత్రులు అక్కడ ఆ పాటల్ని వింటూ పాడుతూ వుండేవాళ్లు. నేను కొంచెం ఎదిగే సమయానికి మా నాన్న వారాల ఆంజయ్య వృత్తిరీత్యా ఉపాధ్యాయుడే అయినప్పటికి హిందీ పాటలన్నా, ఉర్దు పుస్తకాలన్నా బాగా ఇష్టంగా వుండేవాడు. తాను స్వయంగా గొంతెత్తి పాటలు పాడేవాడు.
తలత్ మహమూద్ అన్నా నటుడు దిలీప్ కుమార్ అన్నా ఆయనకి బాగా ఇష్టంగా వుండేది. ఒక రోజు ‘ఏ హవా ఏ రాత్ ఏ చాందినీ, తేరీ అదాపే నిసార్ హై’ అంటూ నాన్న పాడటం విని ‘అట్లా అంటే ఏంది నాన్నా దాని అర్థం ఏంది’ అని అడిగాను. ఆయన నవ్వి ఒక్కో పదానికి తెలుగులో అర్థం చెప్పడం మొదలు పెట్టాడు. నాకు కొంచెం అర్థం అయ్యీ కొంచెం కాలేదు. అవి ఆ రోజు నాన్న ద్వారా హిందీ లోంచి నా మాతృభాష తెలుగులోకి నేను నేర్చుకున్న మొదటి మాటలు, పాఠాలు. ఇవన్నీ ఇంకా బాగా అర్థం కావాలంటే హిందీ బాగా చదవాలిరా అన్నాడు నాన్న.
అప్పటికి భాషల గురించి నాకు వేరే ఏమీ తెలీదు. కానీ వేరే ఒక భాష లోని మాటల్ని అర్థం చేసుకోవడానికి వాటిని మన మాతృభాషలోకి మార్చుకోవాలన్న విషయం అర్థం అయింది. బహుశా నేనే కాదు అందరూ వేరే ఏ ఇతర భాషను అర్థం చేసుకోవడానికయినా తప్పకుండా తమ మాతృభాషలోకి మార్చుకోవాల్సిందే. ఖుషీ అనగానే సంతోషం అనీ, సాడ్ అనగానే దుఖం అనీ తెలిసిపోతుంది. అదంతా మన లోపల మనకు తెలియకుండానే అప్రయత్నంగానే జరిగిపోతుంది.
కొత్త భాషను అర్థంచేసుకునే క్రమంలో జరిగే మేధోపరమయిన సమన్వయం అది.
అదంతా అప్పుడు తెలీదు. కానీ మా యింట్లో రేడియోలో ‘శ్యామే ఘంకీ కసమ్’, ‘తు కహే అగర్’, ‘సుహానా సఫర్’ ఇట్లా అనేక పాటలు వినిపించేవి. నాన్న పాడుతూ వుండేవాడు. వాటితో పాటు ప్రతి బుధవారం సిలోన్ రేడియో లో వచ్చే ‘బినాకా గీత్ మాల’, ప్రతి రోజూ ఉదయమే వచ్చే ‘పురానీ ఫిల్మోకా గీత్’ .
అట్లా అన్నీ హిందీ పాటలే. దాంతో నేను హిందీ నేర్చుకోవడానికి స్కూల్లోనూ కాలేజీలోనూ సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నాను. అకాడెమిక్ ప్రోగ్రామ్ లో భాగంగా కొంత ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను. అట్లా స్కూలు ముగిసే సరికి మూడు భాషలతో పరిచయం కలిగింది. తర్వాత సైన్స్ చదువుకోవడం ఉద్యోగంలో చేరడం చక చకా అన్నీ జరిగి పోయాయి.
మొదటినుంచీ సాహిత్యంతో పరిచయమే. తొలిరోజుల్లో డిటెక్టివ్ నవలలు, తర్వాత మహిళా రచయిత్రుల నవలలు చదివాను. తరువాత వయసు, చదువు, పరిచయాలూ పెరుగుతున్న కొద్దీ సాహిత్య అవగాహన పెరగసాగింది. నిజానికి నా సాహిత్య జీవితం కథలతో మొదలయింది.
చిత్రిక వారపత్రికలో మొదటి కథ అచ్చవగా, తర్వాత నటరాజ కళానికేతన్ వార్షిక సంచికలు, జీవగడ్డ దినపత్రిక ఇట్లా అనేక పత్రికల్లో చిన్నా పెద్ద కథల్ని రాసాను, తర్వాత కవిత్వం వైపు దృష్టి మరలి అలిశెట్టి ప్రభాకర్, జింబో, వజ్జల శివకుమార్, పీ.ఎస్.రవీంద్ర లతో కలిసి ‘లయ’ కవితా సంకలనం తెచ్చాం.
అప్పటికి ఇంగ్లీషులో ఫెర్లిన్గిట్టి, ఇలియట్, టాగోర్ ల కవిత్వం తో కొంత పరిచయం ఏర్పడింది. తర్వాత 1980లో కరీంనగర్ ఫిలిం సొసైటీ లో చేరడం తర్వాత వేములవాడ ఫిలిం సొసైటీ స్థాపించడంతో నా దృష్టి ఆసక్తి ఆర్ట్ సినిమాల వైపు మరలింది. సత్యజిత్ రే మొదలు అనేక మంది దేశ విదేశీ దర్శకుల సినిమాల్ని చూడడం మొదలయింది. అట్లా ఎపుడయితే ఆర్ట్ సినిమా వైపు ఆసక్తి పెరిగిందో అపుడు అనువాదం నాకు తెలీకుండానే నాలోకి వచ్చేసింది రే ‘పథేర్ పాంచాలి’ చూడాలంటే బెంగాలీ రాదు సబ్ టైటిల్స్ పైన ఆధారపడాల్సిందే. అంటే బెంగాలీ మాటల్ని ఇంగ్లీష్ లో చదివి తెలుగులో అర్థం చేసుకోవాలి. అలా బెంగాలీ మాత్రమే కాదు కన్నడ, మరాఠీ, తమిళ్, మలయాళం ఏ ఇతర విదేశీ భాషా సినిమా చూడాలన్నా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పై ఆధారపడ్డమే.
సబ్ టైటిల్స్ ఫాలో అవుతూ సినిమాల్ని చదవడం అట్లా భాషానువాదం జీవితంలో భాగమయి పోయింది. దాదాపు అదే సమయంలో విపులలో పలు కథల అనువాదాల్ని చేసే అవకాశం వచ్చింది. చలసాని ప్రసాద రావు గారు ఎంతో ప్రోత్సహించారు.
దాంతో పాటు ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికల్లో ఎన్.ఎస్.మాధవన్ లాంటి మళయాళ కథకుల కథల్ని అనువదించి ప్రచురించాను. ఒకవైపు సాహిత్యం చదవడంతో పాటు అప్పుడప్పుడూ ఏదయినా రాయడం ఉన్నప్పటికీ జీవితం సినిమాలే ప్రధాన ఉద్యమంగా సాగింది. సినిమాల్ని చూడ్డం కాదు చదవడమే ప్రధానంగా చేసాను. అంతేకాకుండా నచ్చిన మంచి సినిమాల్ని గురించి రాయడం, ప్రదర్శనలు ఉత్సవాలు అట్లా ఫిలిం సొసైటీ ఉద్యమంలో తలమునకలయి పోయాను. కవిత్వమయినా, వచనమయినా సినిమా అయినా కళాత్మక వ్యక్తీకరణమే ఏ ప్రక్రియా మరోదానికంటే హెచ్చూ తక్కువా కాదు అన్నది నా ఖచ్చితమయిన అభిప్రాయం. అట్లా జీవనయానం సాగుతూ ఉండగానే 2014లో తీవ్రమయిన అనారోగ్యానికి గురయ్యాను. అప్పటిదాకా వున్న సంస్థలు సభలు వాటి నిర్వహణ కార్యక్రమాలు మానేశాను.
ఇక అప్పటినుండి సాహిత్యమే జీవితమయి పోయింది. ఆ క్రమంలో తెలుగు కవిత్వమే కాకుండా వివిధ భాషల సాహిత్యం ముఖ్యంగా కవిత్వం చదవడం అలవాటయింది ‘ఇండియన్ లిటరేచర్’ లాంటి అనేక పత్రికల్ని క్రమం తప్పకుండా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. ఆన్లైన్లో అనేక దేశ విదేశ కవుల రచనల్ని చదువుతూ వచ్చాను. దాంతో పాటు నాకు దశాబ్దాలుగా ఇష్టమయిన గుల్జార్ ను ఫాలో అవడం మొదలు పెట్టాను. జావేద్ అఖ్తర్, సచ్చిదానందన్, జయంత్ మహా పాత్ర, గిరీష్ కర్నాడ్ ఇట్లా అనేక మంది రచనల్ని చదువుతూ వచ్చాను.

‘తెలియంది తెలుసుకోవడం, తెలిసింది పంచుకోవడం మొదటినించీ నాకున్న అలవాటు’ నేను చదివిన కవితల్లోంచి నాకు నచ్చిన వాటిని తెలుగులో రాసుకోవడం మొదలు పెట్టాను. ముఖ్యంగా ఏదయినా ఒక కవిత చదివినప్పుడు ‘అరె ఎంతబాగా రాశారు ఇది నేను రాసి వుంటే ఎంత బాగుండేది’ అని అనిపించినప్పుడు ఖచ్చితంగా దాన్ని అనువదించే ప్రయత్నం చేశాను. ఇక గుల్జార్ కవిత్వం విషయానికి వస్తే –
‘ముసాఫిర్ హూన్ యారో
నఘర్ హాయ్ నా టిఖానా.’
దశాబ్దాల క్రితం నాటి ‘పరిచయ్’ సినిమాలోని పాటతో గుల్జార్ తో కవిగా దర్శకుడిగా తొలి కరచాలనం జరిగింది. నేను ఇంటర్ చదువుతున్న రోజులవి ఇంతకు ముందే చెప్పినట్టు బినాకా గీత్ మాల వింటూ గడుపుతున్న రోజులు. చదువులూ పరీక్షలూ అన్నీవెన్నంటే ఉన్నప్పటికీ ఎక్కడో ఒంటరితనం లోపల వెంటాడేది, దేనికోసమో తహ తహ లాడేది. ఆ ఒంటరితనమే మొదట హిందీ పాటల వైపునకు లాగింది. ఆ క్రమంలోనే గుల్జార్ పాటలు మాటలు వెంటాడేవి. అప్పుడే వచ్చిన ‘ఆనంద్’ సినిమా నా జీవితం పై గొప్ప ప్రభావం చూపించింది. అందులో ముఖ్యంగా
‘బాబూమొషై జిందగీ బడీ హోని చాహీయే, లంబీ నహి ‘,
‘జబ్ తక్ జిందా హూ తబ్ తక్ మరా నహీ, జబ్ మర్ గయా సాలా మై హీ నహీ ‘
‘మౌత్ తో ఏక పల్ హయ్’ – లాంటి గుల్జార్ మాటలు ఇప్పటికీ వెంటాడుతూనే వుంటాయి.
(జీవితం ఉన్నత మైంది కావాలి, కాని దీర్ఘమయింది కాదు, బతికి ఉన్నంతవరకూ చావలేదు, చచ్చింతర్వాత నేనే లేను, మరణం ఒక క్షణమే).
అట్లా గుల్జార్ తో మొదలయిన నా ప్రయాణం కోషిశ్, మోసం, ఆంధీ, ఖుష్బూ, ఇజాజత్ ఇలా అనేక సినిమాలతో సాగుతూ వచ్చింది. అది అభిమానంగా మారి సినిమాలతో ఆగలేదు నా దృష్టి ఆయన కవిత్వం వైపు మరలింది.
‘కొంచెం నవ్వించి మరికొంచెం ఏడిపించి
ఈ ‘క్షణం’ కూడా వెళ్ళిపోతుంది’
‘తూఫాను వెళ్ళిపోవడం కోసం ఎదురు చూడ్డం కాదు జీవితమంటే
వర్షంలో నృత్యం చేయడాన్ని నేర్చుకోవడమే జీవితం’
ఇట్లా ఇన్నో పంక్తులు మనసున్న వారిని ఎవరినయినా పట్టేస్తాయి. అట్లా గుల్జార్ నన్నూ పట్టేసుకున్నాడు. ఆయన గజల్స్, కవితలు అనువాదాలు క్రమం తప్పకుండా ఫాలో అవుతూ వచ్చాను. అట్లా ఒక రోజు 5వ ముంబై లిటరరీ ఫెస్టివల్ లో గుల్జార్ సాబ్ ఆయన అనువాదకుడు కవి పవన్ వర్మ ల జుగల్బంది కవితా పఠనం ఆన్లైన్ లో చూసి వారు చదివిన ‘గ్రీన్ పోయెమ్స్’ తో థ్రిల్ అయ్యాను. గుల్జార్ కవిత్వంలో సహజంగా వున్న సున్నితత్వమూ, సరలత్వమూ, సూటితనమూ ఆ కవితల్లో నిండుగా వున్నాయి. ‘గ్రీన్ పోయెమ్స్’ నిండా ప్రకృతి, నదులు, అడవులు, పర్వతాలు, మంచు, వర్షం, మబ్బులు, ఆకాశం, భూమి, అంతరిక్షం అన్నీ కవితా వస్తువులై నిలిచాయి.
ఇక ఆగలేక గుల్జార్ Green Poems: Suspected Poems, Neglected Poems, Selected poems ఆన్ లైన్ లో తెప్పించుకొని ఏక బిగిన చదివేసాను. గ్రీన్ పోయెమ్స్ మళ్ళీ మళ్ళీ చదివాను. అందులోని కవితల్ని మన వాళ్ళతో పంచుకోవాలనిపించింది. మెల్లిగా అనువాదం చేయడం ఆరంభించాను. కొన్ని నెలల పాటు ‘గ్రీన్ పోయెమ్స్’ నన్ను అంటుకునే వున్నాయి. ‘గ్రీన్ పోయెమ్స్’ అనువాదం చేస్తున్నాను పుస్తకం వేయడానికి అనుమతిస్తారా అని గుల్జ్జార్ కి మెయిల్ రాసాను. వెంటనే జవాబు వచ్చింది. మీ పరిచయం మీ రచనల వివరాలు పంపండి అని. నా పుస్తకాలు కొన్ని పంపించాను. మూడో రోజుకు మళ్ళీ జవాబు వచ్చింది. అనువాదం చేయండి కాని నాకు ఒక కాపీ పంపండి అని. దాంతో మరింత ఉత్సాహంగా అనువాదం పూర్తి పూర్తయింది.
గ్రీన్ పోయెమ్స్ మూలం హిందీ, ఆ కవితల్ని పవన్ వర్మ ఇంగ్లీష్ లోకి చేసారు. పవన్ వర్మ మౌలికంగా కవి, అనేక అనువాదాలు చేసారు. ఐ ఎఫ్ ఎస్ అధికారి అయిన పవన్ వర్మ రాజ్యసభ సభ్యుడు కూడా. గుల్జార్ మూలం హిందీ నుంచి తెలుగులోకి తేవడంలో పవన్ గారి ఇంగ్లీష్ అనువాదం ఎంతో తోడ్పడింది. అట్లా గుల్జార్ కవిత్వాన్ని ‘ఆకుపచ్చ కవితలు’ పేర తీసుకొచ్చాను. ‘ఆకుపచ్చ కవితలు’ పూర్తి అవుతున్న సందర్భంలో మిత్రుడు కవీ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి నేనూ కలిసి ఒక రోజు అప్పటి కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీ సర్ఫరాజ్ అహ్మద్ ను కలవడానికి వెళ్లాం. ‘ఆనంద్ సర్ ఏం రాస్తున్నారు ఏం చేస్తున్నారని అడిగాడాయన. గుల్జార్ గ్రీన్ పోయెమ్స్ అనువాదం చేస్తున్నానగానే ఆయనలో ఉత్సాహం పెరిగింది. తనకూ గుల్జార్ అన్నా అయన రచనలన్నా చాలా ఇష్టమని అన్నారు. వెంటనే పూర్తి చేయండి అన్నారు.
గుల్జార్ గురించి చాలాసార్లు, చాలా సేపు మాట్లాడుకున్నాం. మీక్కూడా అంత ఇష్టమయిన గుల్జార్ ‘ఆకుపచ్చ కవితలు’ పుస్తకానికి నాలుగు మాటలు రాయండి అన్నాను. అనేక పనుల వొత్తిడుల మధ్య రెండు పేజీలు ముందుమాట ఆయన రాసారు. అట్లా రూపొందింది ‘ ఆకుపచ్చ కవితలు’ అనువాద సంకలనం. ఖచ్చితమయిన కళాత్మక దృష్టితో భాషను శిల్పంగా తీర్చిదిద్దే గుల్జార్ ‘ గ్రీన్ పోయెమ్స్ ‘ లోని మౌలికమయిన భావాల్ని నాశక్తి మేరకు తెలుగు లోకి తెచ్చే ప్రయత్నం చేసాను. గుల్జార్ తో నాలుగు దశాబ్దాల క్రితం మానసికంగా చేసిన కరచాలనం ఈ అనువాదంతో కవిత్వ కరచాలనమయింది. ఆయన శైలీ, సంక్షిప్తత, సాంద్రతలను తెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసాను.
అదే క్రమంలో మన తెలుగు వాళ్ళకి ‘ఇరుగు పొరుగు’ భాషల్లో కవిత్వం ఎట్లా వస్తున్నది. అక్కడి కవులు ఏమి రాస్తున్నారు, ముఖ్యంగా వర్తమాన కవుల రచనలు ఎట్లా వున్నాయి వాటిని పరిచయం చేయాలనుకున్నాను. రూపంలో సారంలో ఆయా భాషల్లో కవిత్వం ప్రత్యేకతలు ఏమిటి? అవన్నీ తెలియయాలంటే వాటిని తెలుగులోకి అనువాదం చేసి అందించడమే అనుకున్నాను. ఆ క్రమంలో గుల్జార్ చేసిన ‘ ఎ పోయెం ఎ డే’ నా కంట పడింది. అది నాకు పెద్ద ప్రేరణ. ఆ క్రమంలోనే కె.సచ్చిదానందన్ సంపాదకత్వంలో వచ్చిన అనేక భారతీయ కవులు రాసిన కవితల సంకలనాల్ని తెప్పించుకుని చదివాను. వాటితో పాటు కాశ్మీర్ కు చెందిన అఘా షాహిద్ అలీ, కెనడాలో వుంటున్న రూపి కౌర్, జయంత మహాపాత్ర, అస్సామ్ కు చెందిన నీలీం కుమార్ ఇట్లా వివిధ భారతీయ భాషలకు చెందిన కవుల సంకలనాల్ని చదివాను.
కొన్ని కవితలు అనువాదం చేసి ‘ఇరుగు పొరుగు’ పేర అనువాదాలు చేస్తున్నాను మిత్రమా అనగానే శ్రీ కాసుల ప్రతాప్ రెడ్డి ‘ఆసియ నెట్’ లో వారం వారం వేద్దాం అన్నాడు. ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ ఎంతో సహకరించారు. దాదాపు రెండేళ్లకు పైగా అది కొనసాగింది. తర్వాత వివిధ పత్రికల్లో, ఆన్లైన్ పత్రికలలో లో, సోషల్ మీడియాలో నేను చేసిన అనువాద కవితల్ని ప్రచురిస్తూనే వున్నాను.
ఇప్పటికి భారత రాజ్యాంగం తన 8వ షెడ్యూల్ లో అధికార భాషలుగా 22 భాషల్ని ఆమోదించింది. కాని మన దేశంలో లిఖిత మౌఖిక భాషలు ఎన్నో వున్నాయి. నేను ఇప్పటికీ 28 భారతీయ భాషల నుంచి 90 మందికి పైగా కవులు రాసిన కవితల్లోంచి 150కి పైగా కవితల్ని అనువదించి ‘ఇరుగు పొరుగు’ సంకలనంలో చేర్చాను. ఈ సంకలనాన్ని ప్రముఖ కవి కే.శివా రెడ్డి మా ఇంట్లో లాంచనంగా ఆవిష్కరించారు. అప్పుడు నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాధం, పీ.ఎస్.రవీంద్ర నాతోనే వున్నారు. అది నాకో మంచి సందర్భం. ఈ ‘ఇరుగు పొరుగు’ లో వున్న కవితలన్నీ నేను చదివినవి, నాకు నచ్చినవి, నేను అందరితో పంచుకోవాలుకున్నవి మాత్రమే. ఈ ‘ఇరుగు పొరుగు’ నా నిరంతర అనుసృజనా ప్రక్రియ. ఆ క్రమంలో ఇది ఇరుగుపొరుగు మొదటి సంపుటి. నా స్వీయ కవితా రచనతో పాటు అనువాదం కూడా కొనసాగుతుంది.
ఇటీవలి కాలంలో ఇతర భాషల నుంచి తెలుగు లోకి అనువాదం చేయడమే కాకుండా నా స్వంత కవితల్ని ఇంగ్లీష్ లోకి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఆక్రమంలో అనేక కవితానువాదాల్ని boloji.com అన్న వెబ్సైట్ లో ప్రచురించాను క్రమంగా ప్రచురిస్తూనే వున్నాను. నాకు నచ్చిన ఇతరుల కవితల్ని కూడా ఇంగ్లీష్ లోకి తేవాలన్నది ఆలోచన. ఇటీవలే నా ‘మానేరు తీరం’ కవితా సంకలనాన్ని ద్విభాషా కవితా సంకలం గా తెచ్చాను.
తెలుగు కవిత పక్కనే నా ఇంగ్లీషు అనువాదం చేర్చాను. ‘ఆదాన్ ప్రాదాన్’ ను కొనసాగించాలన్నది నా ప్రయత్నం.
*








చాలా సంతోషం. గుల్జార్ కథలు నాకు చాలా ఇష్టం.అనువాదంచేయాలనేకోరిక. పర్మిషన్ కోసం ఏం మెయిల్ కి రాయాలో తెలియజేయగలరా?
gulzarpost@gmail.com
మంచి సమాచారం గురువు గారూ
అనువాదం గురించి మంచి అవగాహన
కల్పంచారు
THANK YOU