Gen Z కారానికి ఓల్డేజ్ మమకారం

మనకోసం ఎన్నో చేసిన అమ్మమ్మకు మనం ఏమైనా చేద్దామనే పాయిరాన్ని పుట్టిస్తుంది ఈ పుస్తకం.

స్కూలుకు సెలవులు దొరకగానే పిల్లలకు పొలమారే పేరు అమ్మమ్మ ఊరు. అమ్మమ్మ పేరెత్తగానే పిల్లల్లో ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది. జెన్జీ కారానికి ఓల్డేజ్ మమకారం తగిలినప్పుడే లైఫ్ ఫుల్   కదా! అమ్మానాన్నల దగ్గరున్న హద్దులన్నీ చెరిపేసుకొని అమ్మమ్మ దగ్గర ఎక్కడలేని స్వేచ్ఛను, స్వతంత్రాన్ని గుండెల నిండా పొదువుకోవాలని ఆరాటపడని తుంటరి పిల్లలకు కొదవ ఉంటుందా? బాల్యం నిండా అమ్మమ్మ ఆక్రమించుకున్నంత స్థలాన్ని ఏ బంధమూ కబ్జా చేయలేదనేది యాదృచ్చికమా? అమ్మమ్మ అంతే జీవితమ్మీద పొడుచుకునే పచ్చబొట్టే. చెరకు పొలం మీద తేలాడే తెల్లని తుంగ దూస అమ్మమ్మ నవ్వు.

‘కొన్ని ఆనందాల కోసం నేను పడే తపన నా మొత్తం వేదనలోనే అంతర్లీనమై ఉండటం ఎంత వింత కదా…!’ విశ్వకవి ఖలీల్ జీబ్రాన్ రాసిన ఈ లైన్లు బహుశా అమ్మమ్మ గురించే అయి ఉంటాయి.

తొలి ఏకాదశికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ చేసిపెట్టిన ఆ సకినాలు, పూరీలు, లడ్డూలు మన జ్ఞాపకాల్లో ఎప్పుడూ కరకరలాడుతుంటాయి కదూ. అమ్మమ్మ ఇల్లు, ఆ అరుగులు, వాటి మీద ఒడవని ముచ్చట్లు, అరుగుల వారగా వారు ఊసిన ఎర్రని తమలపాకు ఉమ్ములు, మనవళ్ళు, మనవరాళ్ళను చూడగానే ఆమె నుదుటన వికసించే ఆ సూర్యోదయాలు, తిరిగి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆమె కళ్ళల్లో కనిపించే ఆ సూర్యాస్తమయాలు, ఆమెతో ఆడిన కబూర్ల నిండా నిండు చంద్రుని వెన్నెలలు, ఒడిలో పడుకొని నక్షత్రాల లెక్కింపు, బొమ్మల కొలువులు.., ఇలా ఎన్నో ఎన్నెన్నో అమ్మమ్మ తాలూకు జ్ఞాపకాలు.

మనం పుట్టగానే మన జీవన ప్రారంభానికి రిబ్బన్ కట్ చేసి లాల పోసి, జోల పాడి, ఊయల్లో లాలించి, పాలించి…, గొప్ప ఆరంభ వేడుక నిర్వహించిన అమ్మమ్మ, కొత్తిల్లు కట్టేటప్పుడు వేసే ముగ్గులా మన జీవితపు పునాధుల కింద చెరగకుండానే ఉంటుంది. కానీ ఆ తర్వాతి జీవితంలో తలమునకలవుతూ ఎందుకో అమ్మమ్మ మన మతి నుండి కనుమరుగు అయిపోతుంది?

ఎందుకు అని ప్రశ్నిస్తే మన దగ్గర బరువులు, బాధ్యతలు, ఆర్థిక సంక్షోభాలు అనే రకరకాల కారణాలు ఉంటాయి. ఇవన్నీ అమ్మమ్మకూ ఉన్నాయి. కానీ ఆమె ఏనాడూ తనలోని మమకారాన్ని కారంగా మార్చుకోలేదు. ఎప్పుడూ చెరుకు గడే అయి తీపినే పంచింది. ఎర్రని గోరింటై అరచేత విరిసింది. కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టె అయి దానిమీద రుబ్బిన ఎల్లిపాయ కారమైంది. జున్నుగడ్డ కింద చిక్కుడాకు అయింది. బుడ్డోళ్ళ మురిపాల్లో ముత్తైద పూలు చల్లింది. బర్రె మాయ పోసే పుట్టగడ్డయ్యింది. సర్వరోగ నివారిణిలా కాముని బూడిదయ్యింది. చెరకు గడకు చుట్టుకునే ఉడుకుడుకు పూబెల్లమయ్యింది. కుటుంబం కోసం తలుగు లేని తన్లాటయ్యింది. దీపావళి మూడోరోజు పెండకుప్ప మీద వెలిగే దీపంలో గుంజర గడ్డి అయింది. ఇలా ఎన్నెన్నో అయిన అమ్మమ్మకు ఆయిశ్శు గట్టిగా ఉండాలి గానీ మన తర్వాతి తరాలకు కూడా ఆమె సేవలు చెయ్యడానికి, ప్రేమలు పంచడానికి నడుముకు కొంగు చెక్కుకొని సిద్ధంగానే ఉంటుంది.

ఆమె దగ్గర ఎన్నో నీతులు, సామెతలు, పలుకుబడులు, కథలు.., నేర్చుకున్నవాళ్ళు పెద్దవగానే అమ్మమ్మను ఎందుకో కాస్త లైట్ తీసుకుంటారు! అమ్మను ప్రేమించినంతగా ఆ అమ్మను మనకు ప్రసాదించిన అమ్మమ్మను మాత్రం విస్మరిస్తుంటాం. ‘పెద్దమనిషి అయిపోయిందిలే…’ అనుకుని నెమ్మదినెమ్మదిగా అమ్మమ్మతో బంధం ఉన్నా అనుబంధాన్ని కొనసాగించలేక విస్మరిస్తుంటాం.

కుటుంబాన్ని నిలబెట్టడంలో కీలకంగా వ్యవహరించే అమ్మమ్మ మీద చాలా తక్కువగా సాహిత్యంలో ఆమె ప్రస్తావన వచ్చుంటుంది. సినిమాల్లోనూ అంతే. కథలు, నవలలు, సినిమాల్లో అమ్మమ్మ పాత్రలు ఉంటాయి. కానీ అవి సపోర్టింగ్ రోల్స్ మాదిరే ఉంటాయి. అదిగో ఆ వెలితిని తీర్చడానికి ప్రముఖ సినీ నటుడు రచ్చ రవి ‘నీ రుణం తీరేది ఎట్ల?’ అనే ఈ పుస్తకం రాశారు. అమ్మమ్మే సాంతం లీడ్ రోల్ అయి సాగే మమతలు పొంగే పుస్తకం ఇది.

రవి తన అమ్మమ్మకు కమ్మటి యాసలో అక్షరాభిషేకం చేసిన ఈ పుస్తకం చదివితే… మీరు గాయిగాయై మీ అమ్మమ్మ దగ్గరికి పరుగెత్తుకెళ్ళి ఆమె మీ బాల్యంలో మీకెన్ని ఊసులు చెప్పిందో అవన్నీ మీరు ఆమెకు అప్పచెబుతారు. ఆమె మరింత ఆరోగ్యంగా బతకాలని ప్రయత్నిస్తారు.

ఇప్పుడున్న బిజీ చట్రపు లైఫులో అమ్మానాన్నలనే పట్టించుకునే తనం లేదు. ఇక అమ్మమ్మను అంటారా అనే ప్రశ్న మాత్రం ఖచ్చితంగా మనలో ఆవిరైన తేమను తిరిగి రప్పిస్తుంది? వినాలి గానీ ఆ ముసలి మనసులో బుడ్డోళ్ళ బుడిబుడి అడుగుల సవ్వడులు ఇంకా మోగుతూనే ఉంటాయి. ఆ చర్మపు ముడతల్లో ఇంకా అనురాగం ధ్వనిస్తూనే ఉంటుంది. ఆ చిన్నారి పొన్నారి మాటలింకా ఆమె చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి.  కానీ ఆ వృద్ధ మనసులోకి తొంగిచూసి, కాస్తంత టైం తీసి అమ్మమ్మ ఇంటికి పరుగెత్తుతారా? ఆ పరుగుకు విజిలేసి ‘గో… అహెడ్!’ అంటుంది ఈ పుస్తకం.

బిడ్డలు దూరమైతే ఎప్పటికైనా వచ్చి అక్కున చేర్చుకుంటారనే ఆశ ఉంటుంది. కానీ అదే అమ్మ అమ్మమ్మ అయ్యాక మనవలు, మనవరాళ్ళు దూరమైతే ఈ ముసలి ప్రాణాన్ని అక్కున చేర్చుకునే అవకాశం లేదనే సత్యాన్ని గ్రహించి, తాను చనిపోయాక చివరిచూపుకైనా వస్తే చాలనుకునే ఆ అనురాగపు ఆశను తనతోనే మోసుకెళ్తుంది అమ్మమ్మ. ఆ ఆశను ఎండిపోకుండా పచ్చగా ఉంచడానికి మనం కాస్త అమ్మమ్మకు సమయం ఇద్దాం. ఆమె చేసిన ఎన్నో త్యాగాలకు ప్రతిగా మన ప్రజెన్సును ఆమె చెంతన ఉంచుదాం. ఆడుదాం, పాడుదాం, పిండివంటలు చేయించుకుందాం, రెండు మొట్టికాయలతో అమ్మమ్మ చేత వెన్న ముద్దలు తిందాం.

అదిగో ఈ పుస్తకం నిండా ఆ అమ్మమ్మ ప్రేమను పిండారబోసినట్టుగా ఉంటుంది. ఇంతకాలం నటుడిగా విభిన్నమైన పాత్రల్లో  అలరించిన రచ్చ రవి రచయితగా తనలోని బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ ఈ అపురూపమైన పుస్తకం రాశారు. వరంగల్ పద సంపదతో పుస్తకం నిండా అమ్మమ్మ మీద మనవడు రాసిన ప్రేమకావ్యమై మనల్ని ఆ ప్రేమలో ముంచెత్తుతుంది.

‘ఫిదా’ సినిమాలో ఆడబిడ్డలను బయట ఇవ్వలేక ఆ తండ్రి హీరోను ఇల్లరికం అల్లుడిగా చేసుకుంటాడు. ఆ సినిమా అక్కడితో ముగుస్తుంది. ఈ పుస్తకం ఆ ముగింపు నుండే మొదలైనట్టు ఉంటుంది. బిడ్డల కాపురాలు నిలబెట్టడానికి అమ్మమ్మ పడే పాట్లు ఎన్నెన్ని ఉంటాయో చదువుతుంటే ఔరా అనిపిస్తుంది.

అమ్మమ్మ చేసిన పురుడు, బారసాల, ఆమె చేయించిన పట్టగొలుసులు, కాళ్ళ కడియాలు, చెవి దిద్దులు, తెచ్చిన బట్టలు, ఆమె చేత కుట్టిన బొంతలు, మెత్తలు, లంగోటలు, ఒంటికి రాసిన నూనెలు, ఇచ్చిన చిల్లర నాణేలు, ఆ డబ్బులతో కొనుక్కున్న పిప్పర్మెంట్లు, కొబ్బరి గోలీలు, కథలు వింటూ ఆమె ఒళ్ళో సేదదీరిన చల్లని క్షణాలు, ఆమె కొంగుతో వింజామరలా గాలూపుకున్న ఆ సందర్భాలు, ఒళ్ళంతా నూనెతో మసాజ్ చేసి, పులాయిల్, నీలగిరి ఆకులేసి మరిగించిన నీళ్ళతో స్నానాలు చేయించిన అమ్మమ్మ, ఎప్పుడైనా దెబ్బ తగిలితే విలవిలలాడిపోయే అమ్మమ్మ, చిక్కులుపడ్డ వెంట్రుకలన్నీ విడదీసి నూనె పెట్టి, దూసి, చక్కగా జడేసిన అమ్మమ్మ, కొసరి కొసరి తినిపించే అమ్మమ్మ, అలిగితే బుజ్జగించే అమ్మమ్మ.., ఇలా మీ మీ అమ్మమ్మలందరూ గుర్తొచ్చి దిగ్గున లేచి అప్పటివరకు అమ్మమ్మ మీద ఉన్న ఆదమరుపును పటాపంచలు చేసి ఆ దిక్కున పరుగు లంఖించడానికి ఊతం ఇచ్చే పుస్తకం ఇది.

మన జీవితంలో తెలిసో తెలియకో ఎన్నో విస్మరిస్తుంటాం. ఆ విస్మరణలో అమ్మమ్మ అస్సలుండొద్దు సుమా అని ఎరుకజేస్తుంది ఈ పుస్తకం. మనకోసం ఎన్నో చేసిన అమ్మమ్మకు మనం ఏమైనా చేద్దామనే పాయిరాన్ని పుట్టిస్తుంది ఈ పుస్తకం.

ఇన్నాళ్ళు మనకు నటుడిగానే తెలిసిన రచ్చ రవి రచయితగా తన మొదటి రచన కోసం అమ్మమ్మ సబ్జెక్ట్ ఎత్తుకొని మనం మరచిన దారిని గుర్తుచేశాడు. మనవడిని ఎత్తుకొని లాలించి పాలించిన అమ్మమ్మను… తిరిగి మనవడే అమ్మమ్మను ఎత్తుకొని లాలించినట్టు గొప్ప అక్షర నివాళిని సమర్పించాడు రవి.

తన బాల్యం నుండి అన్నీ అయి అమ్మమ్మ ఏమేం చేసిందో అవన్నీ పూస గుచ్చినట్టు యాభై రెండు సెగ్మెంట్లలో వివరించాడు. ప్రతీ చాప్టర్ అమ్మమ్మ ప్రేమ, త్యాగాలు, కాసిన్ని నవ్వులుంటాయి.

తన అమ్మమ్మతో తిరిగిన జాతర్లు, బోడ్లె సంచితో కొనుక్కున్న నిమ్మ పిప్పర్మెంట్లు, నాపరాయితో రాసి రాసి బోరింగ్ దగ్గర స్నానాలు చేయించిన రోజల దగ్గర నుంచి బిడ్డల కాపురాలు దిద్దడమే కాకుండా మనవలూ, మనవరాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఆ శాంతవ్వ పడ్డ ఆరాటాలను, జీవన పోరాటాలను అక్షరబద్ధం చేశాడు రచ్చ రవి.

చివరి సెగ్మెంట్ కు వచ్చేసరికి మాత్రం గుండె చిక్కబట్టుకుంటాం. ఆ చేజారిన వసంతాన్ని జ్ఞాపకాల్లోనే చిగురింపజేసుకుంటామని… ఆలోపు మనం అమ్మమ్మకు ఏం చెయ్యలేదని? ఎందుకు చెయ్యలేదని? అమ్మమ్మను ఎందుకు మరిచిపోయానని? ఇలా రకరకాలుగా మనల్ని మథిస్తాడు రవి. ఈ బతుకు బాటలో కోల్పోయిందేదో కనుక్కుని ఆ దిక్కున వెళ్ళి బతకడం కాదు జీవించడం నేర్చుకొమ్మని చెబుతాడు.

చీకటి చంద్రయ్య – చీకటి శాంతవ్వల ముద్దుల మనవడు రవయ్య. అమ్మమ్మ ఆయన్ను ముద్దుగా, గౌరవంగా రావయ్యా అని పిలుస్తుంది. ఆ అనురాగం ప్రతీ పేజీలో ప్రస్పుటిస్తుంది. అద్దపావు మటన్ తాతకు వండిపెట్టి, మెత్తటి ముక్కలు ఏరి మనవడికి వేసి, కూతుళ్ళు, కొడుకుల కాపురాలు ఎక్కడ పట్టుతప్పుతున్నాయో అక్కడొక పానా పట్టుకొనొచ్చి దాన్ని రిపేర్ చేసి నిలబెట్టి, మనవలు, మనవరాళ్ళకు ఏమేం చెయ్యాలో, ఏమేం కావాలో అన్నీ చేసే ఆ అమ్మమ్మ ప్రేమను అంబటి గుల్లలోని అమృత పదార్థాల్లా… మనల్ని పచ్చని పొలంలో కూర్చోబెట్టి వెడల్పాటి టేకుటాకుల్లో కమ్మగా వడ్డించాడు రచ్చ రవి.

ఇది అందరూ చదవాల్సిన పుస్తకం అని ఖచ్చితంగా చెప్పగలను. అప్పటివరకు అమ్మమ్మ మీద మనకున్న లైటర్ వ్యూ ను బరువుగా, బాద్యతగా ఫీలయ్యేలా చెయ్యడం ఈ పుస్తకం గొప్పతనం. పేజీపేజీకో అమ్మమ్మ జ్ఞాపకాన్ని ఏరుకునేలా రాశాడు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనలో తడి ఆరిపోయిన అమ్మమ్మ జ్ఞాపకాలకు ఊపిరి పోసేలా చిక్కగా రాశాడు.

‘నీ రుణం తీరేది ఎట్ల?’ అనే బరువైన టైటిల్ పెట్టి తీసుకొచ్చిన ఈ పుస్తకం అన్వీక్షికి పబ్లిషర్స్ నుండి వచ్చింది. అమెజాన్ లో అందుబాటులో ఉంది.

*

హుమాయున్ సంఘీర్

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మనందరి జీవితాల్లో అమ్మమ్మ పాత్ర గురించి పుస్తకం రాసిన రచ్చ రవి గారికి అభినందనలు💐💐💐.
    ఆ పుస్తకాన్ని గురించి హుమాయున్ సంఘీర్ గారు చేసిన పరిచయం అద్భుతంగా ఉంది. తప్పక చదవాల్సిన పుస్తకంగా భావిస్తున్నాను.
    మంచి పుస్తకాన్నిగురించి ఎంతో గొప్పగా పరిచయం చేసిన హుమాయున్ సంఘీర్ గారికి ధన్యవాదాలు🙏

  • అసలు పుస్తకమేమో కానీ హుమాయూన్ గారూ… మీరు పేనిన అక్షరాలు అమ్మమ్మ చేసిన పాల తాళికల్లా ఎంత కమ్మగా ఉన్నాయో.

  • అమ్మ గురించి చాలా రాశాం..చాలా చదివాం…చాలా విన్నాం.. అమ్మమ్మ గురించి అద్భుతంగా రాసినట్టు తెలుస్తుంది టైటిలే ప్రశ్నిస్తోంది… అమ్మమ్మ ఋణం తీరేది కాదు.. రచ్చ రవన్న ఈ పుస్తకం అచ్చు అవుతున్నప్పటి నుండి విడుదల వరకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పబ్లిసిటీ అయితే జరిగింది.. sangheer భాయ్ అద్భుతమైన విశ్లేషణ చేశాడు ఇది చదివాక వెంటనే పుస్తకం చదవాలి అనే కోరిక కలిగింది … కంటెంట్ బావుంటే సమీక్ష బావుంటుంది .. ఇద్దరికీ అభినందనలు…

  • అమ్మ గురించి చాలా రాశాం..చాలా చదివాం…చాలా విన్నాం.. అమ్మమ్మ గురించి అద్భుతంగా రాసినట్టు తెలుస్తుంది టైటిలే ప్రశ్నిస్తోంది… అమ్మమ్మ ఋణం తీరేది కాదు.. రచ్చ రవన్న ఈ పుస్తకం అచ్చు అవుతున్నప్పటి నుండి విడుదల వరకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పబ్లిసిటీ అయితే జరిగింది.. sangheer భాయ్ అద్భుతమైన విశ్లేషణ చేశాడు ఇది చదివాక వెంటనే పుస్తకం చదవాలి అనే కోరిక కలిగింది … కంటెంట్ బావుంటే సమీక్ష బావుంటుంది .. congratulations to Racha Ravanna &Sangheer Bhai

    • థాంక్యూ భయ్యా. పుస్తకం చాలా బాగుంటుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు