స్వేచ్చ కనపడుతోందా? కథ నడుస్తోందా?

త రెండు భాగాలుగా కథలో మీజాన్‌సెన్ అనే అంశాన్ని చర్చిస్తూ వస్తున్నాను. ఫ్రెంచ్ రంగస్థల నాటక ప్రక్రియలో మొదలైన ఈ “మిజాన్-సెన్” అనే పదానికి “వేదికపైన ఉంచడం” అని అర్థం. ఈ సిద్ధాంతం ప్రకారం కేవలం నటులే కాకుండా — నేపథ్యం (Setting), వస్తువులు (Props), వేషధారణ (Costume), లైటింగ్, ఫ్రేమ్/కెమెరా అమరిక (Composition), కదలికలు, శబ్దం, ప్రతీకలు (Symbols) ఇలాంటివన్నీ సరైన రీతిలో అమర్చడం ద్వారా ఆ నాటకం లేదా సినిమాలోని ఆ సన్నివేశం ప్రేక్షకులలో రచయిత/దర్శకుడు కోరుకున్న అనుభూతిని కలిగించవచ్చు అని చెప్తారు. ఒక కథ (లేదా నవల) రాసేటప్పుడు రచయిత ఈ పద్ధతిని ఎలా అవలంబించాలో చెప్తూ వస్తున్నాను. అందులో భాగంగా నేపథ్యాన్ని, అందులో ఉండే వస్తువులను వాడటం గురించి మొదట చెప్పాను. ఆ తరువాత పాత్రల కదలికలను వివరంగా చెప్పడం ద్వారా పాఠకులలో అనుభూతిని ఎలా కలిగించాలో చెప్పాను. ఆ తరువాత పాత్ర ముఖ కవళికల వర్ణన, ప్రవర్తన గురించి చెప్పాను. చివరగా శబ్దాన్ని ఎలా వాడాలో చర్చించాం. ఈ రోజు భాగంలో మరో రెండు అంశాలు మాట్లాడుకుందాం. అలా మాట్లాడుకునేందుకు ఆసరాగా ఈ క్రింది కథా భాగాన్ని చదవండి. ఇందులో పెద్దగా లోపాలు ఉన్నాయని కాదు కానీ, ఇదే కథని ఇంకొంచెం మెరుగ్గా రాయాలంటే ఎలాంటి మార్పులు చెయ్యాలో ఆలోచించండి. అవన్నీ తరువాత చర్చిద్దాం.

<< బంధనం

తెల్లవారితే పెళ్ళి. ఇంటి మేడ మీద నిలబడి ‘స్వేచ్ఛ’ గురించి ఆలోచిస్తోంది మీరా. ఆమె చిన్నప్పటి నుంచి వ్యక్తిగత స్వతంత్రాన్ని అనుభవించింది. స్వంతంగా నిర్ణయాలను తీసుకోగలిగింది. కానీ ఇప్పుడు అంతా అయోమయంగా ఉంది. పెళ్లి ఆమె జీవితాన్ని ఎన్నో రకాలుగా మార్చేస్తుందనీ ఆమెకు తెలుసు. రాబోయే ఆ పరిస్థితికి తను ఎలా స్పందించాలో ఆమెకు అర్థం కావడం లేదు.

తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనా అని ఆమె ఆలోచించింది. ఆమె తల్లిదండ్రులు మాత్రం ఈ సంబంధం చాలా గొప్పదని నమ్మారు. ఆమెకు కాబోయే భర్త బాగా స్థిరపడ్డాడు. గౌరవ ప్రతిష్టలున్న వ్యక్తి. జీవితంలో ఇది సహజంగా జరిగే ఘట్టం అని ఆమెకు తెలుసు. అయినప్పటికీ, ఈ పెళ్లి వల్ల తాను కోల్పోయే కెరీర్ అవకాశాల గురించి, త్యాగం చేయాల్సిన తన వ్యక్తిగత స్వేచ్ఛ గురించి ఆమె ఆలోచిస్తూనే ఉంది.

మీరా తన భవిష్యత్తు గురించి ఆలోచించింది. బాధ్యత, సంప్రదాయాల గురించి మథనపడింది. ఒక భార్యగా, ఒక కోడలిగా తనపై ఉండబోయే అంచనాలు, ఆమె నుంచి ఆశించే ప్రవర్తనను తలుచుకుంది. సమాజం మహిళల అవకాశాలను ఎలా పరిమితం చేస్తుందో ఆమె కనపడుతోంది. ఈ ఆలోచనలు ఆమెను తీవ్రంగా కలిచివేసాయి.

తన మనసులోని అనుమానాలను తల్లిదండ్రులకు చెబుదామని అనుకుంది కానీ, వాళ్లు కంగారుపడాతారని ఆమెకు తెలుసు. అనవసరంగా వాళ్లని భయపెట్టడం ఆమెకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ముందుకు అడుగేసి ఆ తర్వాత బాధపడకూడదని కూడా అనిపించింది. ఆమె మనసులో తీవ్రమైన సంఘర్షణ మొదలైంది. అది ఆమె జీవితంలో చాలా కఠినమైన సమయమని ఆమెకు అనిపించింది.

చివరికి, జీవితంలో కొన్ని సర్దుబాట్లు తప్పవని ఆమె నిర్ణయించుకుంది. ఏ నిర్ణయమూ పరిపూర్ణం కాదు. కొంత మంచి జరగచ్చు, కొంత జరగకపోవచ్చు. ఇష్టాలకు, బాధ్యతలకు మధ్య ఏదో ఒక దారి వెతుక్కును ముందుకు వెళ్లడమే మంచిదని ఆమెకు అనిపించింది. ఆ ఒక్క అవగాహనతో ఆమెకు ఎంతో ప్రశాంతతని ఇచ్చింది. నెమ్మదిగా మెట్లు దిగుతూ కిందకు వెళ్ళింది.

<><><> 

ఈ కథలో లోపం ఎక్కడుంది? చూడటానికి అంతా బాగానే ఉంది. మర్నాడు జరగబోతున్న పెళ్లికి నేను సిద్ధమా కాదా అని ఆలోచిస్తున్న అమ్మాయి కథ. చాలా గంభీరంమైన కథాంశం, లోతైన విషయంగురించి చర్చ. వ్యాకరణపరంగా కూడా సరిగ్గానే ఉంది. కానీ, ఎక్కడో ఏదో తేడాగా ఉంది. పాఠకులకు ఆ గంభీరమైన లోతైన విషయం అందినట్లు అనిపించట్లేదు. ఒక పాత్ర మానసిక స్థితి గురించి రచయిత చెప్తున్నప్పుడు పాఠకులు కూడా ఆ మానసిక స్థితిలోకి వెళ్లేలా రాయగలగాలి. కనీసం ఆ పాత్ర మానసిక స్థితిని అర్థం చేసుకుని సహానుభూతి చూపించేలా చెప్పగలగాలి. అందుకు పాత్రతో పాఠకులు మమేకం అయ్యేలా పాత్ర రూపకల్పన చెయ్యడం, కథని నమ్మశక్యంగా, అత్యంత సహజంగా నడిపించడం లాంటివి చాలా చెయ్యాలి. అందులో కొన్నింటి గురించి ఇంతకు ముందే చర్చించాను. ఈ భాగంలో నేను ముఖ్యమైన రెండు విషయాలు చర్చిస్తాను. అవేమిటో చూద్దాం రండి –

  1. ప్రతీకలు

పైన ఇచ్చిన కథలో ఎన్ని ప్రతీకలు ఉన్నాయో చూడండి. ఒక్కటి కూడా లేవు. “లేకపోతే లేకపోయాయి. దానివల్ల నష్టం ఏమైనా ఉందా?” అని మీరు అడగచ్చు. నష్టం జరిగిందని నేను చెప్పాలంటే దానికి కారణాలు వివరించాలి కదా? చెప్తాను వినండి.

ముందు ఒక విషయం అర్థం చేసుకుందాం. పైన మీరు చదివిన కథ ద్వారా రచయిత చెప్పదల్చుకున్నదేమిటి? పెళ్లికి ముందురోజు ఒక అమ్మాయి మానసిక స్థితి చెప్పడమే ఈ కథ ఉద్దేశ్యమా? ఒక అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. తెళ్లారితే పెళ్లి. పెళ్లికి ముందు ఆ అమ్మాయి పెళ్లి వద్దని అనుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఇదేనా చెప్పాలనుకున్నది? సరే అలాగే జరిగిందనుకుందాం. ఇప్పుడు ఈ సంఘటన గురించి మర్నాడు వార్తా పత్రికలో ఏమని వస్తుందో చెప్పండి. ఒక అమ్మాయి పెళ్ల్లి నిశ్చయమైంది. తెల్లారితే పెళ్లి… ఇదే కదా? అయితే ఆ వార్తా పత్రికలో వచ్చే కథనానికి రచయిత రాసే కథకి వ్యత్యాసం ఏమిటి? వార్త సంఘటనల్ను చెప్తుంది. కథ కేవలం సంఘటనలను చెప్పడం లేదా చూపించడంతో ఆగదు. ఆ సంఘటనకు మూలమైన (తాత్విక) ఆలోచన ఏమిటో పరిశీలిస్తుంది. ఆ ప్రశ్న, దానికి సమాధానం వెతికే ప్రయత్నమే కథగా మారుతుంది. సమాధానం కనిపెట్టడం జరగచ్చు జరగకపోవచ్చు. ఇప్పుడు పై కథని మళ్లీ చూసి అందులో కధ ద్వారా ఏ అంశాలను పరిశీలించవచ్చో చెప్పండి? స్వేచ్ఛ, స్వతంత్రం, బాధ్యత, సంప్రదాయం, సర్దుబాటు, తిరుగుబాటు – ఇవన్నీ మాట్లాడచ్చు. వక్తిగతమైన స్వేఛ్ఛ, కుటుంబం పట్ల బాధ్యత – ఈ రెండింటి మధ్య ఏది ముఖ్యం అనే చర్చలోకి కథని నడిపి, సర్దుబాటు లేదా తిరుగుబాటు సమాధానం అని కథని ముగించవచ్చు. ఇంత వరకు మీకు అర్థమైతే, ఇప్పుడు పైన చెప్పిన చర్చ (లేదా చింతన) వైపు కథని నడపడంలో ఈ కథ ఎక్కడ లోపించింది అనేది చూద్దాం.

కథలో పైన చెప్పిన స్వేచ్ఛ, స్వతంత్రం లాంటి అంశాలు కేవలం మాటలకే పరిమితమై ఉన్నాయి. అందువల్ల అవన్నీ కేవలం తాత్విక వాక్యాలుగా మిగిలిపోయాయి తప్ప, దృశ్యరూపంలో ఎక్కడా కనిపించటం లేదు.

మీరు మరీ చెప్తారండీ, స్వేఛ్ఛ లాంటి అమూర్తమైన (abstract) ఆలోచనలను చెప్పగలం కానీ ఎలా చూపించగలం అని మీరు అడుగుతారు. నాకు తెలుసు. అలాంటివి చెప్పడానికి ప్రతీకలను వాడతారు. నిజానికి ఒక గొప్ప భావాన్ని ఏదైనా ఒక వస్తువుతో ముడిపెట్టినప్పుడే అది పాఠకులకి సులభంగా అర్థమవుతుంది. గొప్ప ఆలోచనలను అంతే గొప్పగా చర్చించినంత మాత్రాన అది గొప్ప సాహిత్యం అయిపోదు. ఆ ఆలోచనకి రెండు వైపుల ఉండే మంచి, చెడులను పాత్రల స్వభావాలుగానో, అభిప్రాయలుగానో అమర్చి, ఆ రెండు పట్రలు తమ భావాలను బలంగా వ్యక్తీకరించుకునే సందర్భాన్ని సృష్టించి, చివరికి రచయిత తాను సమర్థించే (లేదా సమాజానికి ఉపయోగపడే) వైపుకి ముంగింపుని నడిపించేదే ఉత్తమ సాహిత్యంగా గుర్తించబడింది.

ఇందుకు ప్రతీకల అవసరం చాలా ఉంటుంది. ప్రతీకలు లేకపోతే, ఇతివృత్తాలు కేవలం మేధోపరమైన చర్చగా మిగిలిపోతాయే తప్ప పాఠకుల మనసును హత్తుకోవు. పాఠకులు ‘స్వేచ్ఛ’ అంటే ఏమిటో తెలుసుకోవడమే కాకుండా, కథలోని చిత్రణ ద్వారా దాన్ని చూడాలి, తాకాలి. దానిని అనుభవించగలగాలి. పైన చెప్పుకున్న మీరా కథలో స్వేచ్ఛ, స్వతంత్రం, బాధ్యత వంటి పదాలను నేరుగా వాడారు. కానీ ఇవి కేవలం తాత్వికమైన లేబుల్స్ లాగే ఉండిపోయాయి. వాటిని ప్రతిబింబించే వస్తువుగానీ, గుర్తుగానీ కథలో లేదు. ఉదాహరణకు, మీరా స్వేచ్ఛ గురించి ఆలోచించినప్పుడు — పంజరం నుంచి తప్పుకున్న పక్షి, తెగిపోయిన గాలిపటం, తెరిచి ఉన్న కిటికీ లాంటివి వాడి ఉండచ్చు. ఇలాంటివి ఉంటే పాఠకులు ఆ భావాలతో త్వరగా మమేకం అయ్యే అవకాశం ఉంటుంది.  అవి లేకపోవటం వల్ల ఆ కథ ఒక అనుభవంగా కాకుండా ఒక వ్యాసంలా అనిపిస్తోంది.

ఉదాహరణకి, చెప్పాలనుకున్న అంశం స్వేఛ్ఛ అనుకుంటే, మీరా మేడ పైన పగటిపూట ఉన్నట్లుగా కథని మార్చుకుని గాలిపటాలు ఎగురేస్తున్న పిల్లలను చూస్తోందని చెప్పచ్చు. అలా గాలిపటం, దానికి ఉండే దారం ఒక రూపకంగా మారుతుంది. స్వేచ్ఛ అనేది ఎంత గొప్పదైనా బాధ్యత అనే ఒక దారానికి కట్టుబడి ఉంటుంది అని చెప్పచ్చు. ఆ దారం తెగిపోయినప్పుడు, గాలిపటం తన ఇష్టం వచ్చినట్టు ఎగిరిపోవడం అనేది సంప్రదాయాలను తెంచుకోవాలనే ఆమె కోరికకు అద్దంపడుతున్నట్లు చిత్రించవచ్చు.

చెప్పాలనుకున్న అంశం సంప్రదాయం అనే బరువు గురించి అయితే ఇంట్లో తాతల కాలం నుంచి ఉన్న ఒక భోషాణం సంప్రదాయానికి ప్రతీకగా తీసుకోవచ్చు. మీరా దాని పక్క నుండి వెళ్ళిన ప్రతిసారీ, ఎన్నో తరాలు ఆమె మీద పెట్టుకున్న అంచనాలు గుర్తుకువచ్చి వాటి బరువును ఆమె అనుభవిస్తుందని రాయచ్చు. ఆ పెట్టెను ఎప్పుడు తెరిచినా ఒక బాధ్యత మీద పడినట్లు చెప్పచ్చు. అలా ఆ పెట్టెని నాటకీయతకి వాడుకోవచ్చు. అసలు కథ పేరే “భోషాణం” అని పెట్టి, మొత్తం కథని దాని చుట్టూ తిప్పితూ చవరికి – “భోషాణాన్ని భద్రంగా అత్తారింటికి తీసుకెళ్ళింది” అనో, “ఆ రోజు రాత్రి నుంచి మీరా, ఆ భోషాణం రెండు కనపడలేదు” అని రాయచ్చు. భోషాణం బదులు ఇంకేదైనా పాత వస్తువు వాడచ్చా? అమ్మ చీర అయితే? మీరా దాన్ని కట్టుకున్న ప్రతిసారీ ఆమె స్వతంత్రాన్ని బంధించినట్లు అనిపిస్తుంది. ఇక ఇక్కడ్నుంచి కథని మీరు అల్లుకోగలరు కదా? అదీ ప్రతీకకి ఉన్న బలం. అందువల్లే ఇలాంటి ప్రతీకలు ఇతివృత్తాన్ని కేవలం పదాలుగా మిగిలిపోనివ్వకుండా పాఠకులు చూడగలిగే, గుర్తుంచుకోగలిగే అనుభూతులుగా మారుస్తాయి. దీనివల్ల కథకు ఒక స్పష్టమైన ఆకృతి, భావోద్వేగపు లోతు చేకూరుతాయి.

  1. నడక

ప్రతీకల గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం కాబట్టి మీకో ప్రతీక ఇస్తున్నాను. కథని శాస్త్రీయ సంగీతంతో పోల్చి చూద్దాం. ఎందుకు? సంగీతం జనరంజకమైనది. జన హితాన్ని కోరేది (అనుకోవచ్చా? తప్పకుండా. సంగీతం ఇచ్చే ప్రశాంతత మనుషులను కాస్త తక్కువ ప్రమాదకరంగా చేసినా చాలుగా!). సాహిత్యం కూడా అదే ప్రయత్నం చేస్తోంది కదా? ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. సంగీతంలో ఉండే ఆరోహణ, అవరోహణ లాంటి ప్రక్రియలు మీకు తెలిసే ఉంటాయి. ఎక్కడ గొంతు / శృతి / వేగం పెంచాలో, ఎక్కడ తగ్గించాలో తెలిసిన గాయకుడు పాటని ఒక తరంగంలా మార్చగలడు. ఆ తరంగాల మీద శ్రోతలు పడవ ప్రయాణంలో ఊగినట్లు అనుభూతి పొందేలా చెయ్యగలడు. “గగనానికి, ఇలకూ బహు దూరంబనినాడో” అన్న వాక్యంలో “గగనానికి” అనే పదం పై శృతిలో, “ఇలకు” అనే పదాన్ని కింది శృతిలో అనడంలో ఎంత నాటకీయత ఉంది? ఇదీ సంగీతంలో ఉండే నడక. దీన్ని కథలోకి తీసుకొద్దాం.

కథలో దీన్నే ‘పేసింగ్’ అంటారు. అంటే కథ సాగే వేగం అని అనువదించుకోవచ్చు. ఉత్కంఠను పెంచడానికి లేదా తగ్గించడానికి వీలుగా.. సన్నివేశాల్లో యాక్షన్, ఆలోచనలు, సంభాషణలు, వర్ణనలను ఒక పద్ధతి ప్రకారం అమర్చడమే (పేసింగ్) ఈ నడక. దీనిలో భాగంగానే బీట్స్ ఉంటాయి.  “బీట్ స్ట్రక్చర్” అనేది నవలలు / సినిమా స్క్రిప్ట్ రాసేవాళ్లకి పరిచయం ఉండే ఉంటుంది. ‘బీట్ స్ట్రక్చర్’ అంటే కథలో చోటుచేసుకునే భావోద్వేగపరమైన, భౌతికమైన మలుపుల వరుస క్రమం. ఒక ‘బీట్’ అంటే ఒక చిన్న సైగ కావచ్చు, నిశ్శబ్దం కావచ్చు, అకస్మాత్తుగా కలిగే అంతరాయం కావచ్చు లేదా ఆలోచనలో వచ్చే మార్పు కావచ్చు. అలాంటి బీట్స్ ఉన్న నడక కథను ఒక సంగీతంలా నడిపిస్తాయి.

అలాంటి కథలలో పాఠకులు కేవలం చెప్పిన విషయాలను చదవరు. వాటిని అనుభవిస్తారు. ఒకే వేగంతో కాకుండా ఒక్కొక్క చోట ఒక్కో వేగంతో సాగే కథ సజీవంగా అనిపిస్తుంది. అలాంటి కథలను (రచనలను) మీరు పరిశీలిస్తే అందులో భావోద్వేగాలు పెరిగినప్పుడు నడక వేగవంతం అవుతుంది, ఆలోచనలు అవసరమైనప్పుడు నెమ్మదిస్తుంది, ఏదైనా రహస్యం తెలిసినప్పుడు, ఎవరిదైన మరణం సంభవించినప్పుడు ఒక్క క్షణం అక్కడే ఆగిపోతుంది. బీట్స్, నడక అనేవి కథా ప్రవాహంలోని monotonyని తప్పించి, పాఠకుడిని కథలోకి మరింత లోతుగా లాగుతాయి. అవి లేకపోతే, కథ అంతా ఒకే శృతిలో, ఒకే వేగంతో సాగే పాటలా చప్పగా మారుతుంది.

ఇప్పుడు మనం విశ్లేషించుకుంటున్న మీరా కథని చూడండి. ప్రతి పేరాగ్రాఫ్ ఒకే పద్ధతిని అనుసరిస్తుంది: ఒక ఆలోచనను పరిచయం చేయడం, దాన్ని వివరించడం, ఆపై ముగించడం. ఎలాంటి ఒడిదుడుకులు లేనీ ఒకే లయలో సాగే ప్రయాణం. అలాంటి ప్రయాణంలో ఎలాంటి పాఠకులకైనా నిద్ర వస్తుంది. ఈ కథలో గమనిస్తే – ఇంద్రియ అనుభవాల గురించి ఎక్కడా చెప్పలేదు, ఆమె ఆలోచనలను ఆపి మరో వైపుకు మళ్లించే అంతరాయాలు లేవు. దానివల్ల ఏం జరిగింది? మళ్లీ కథని పరిశీలించండి. ఆమె స్వేచ్ఛ గురించి ఆలోచించినప్పుడు, ఆ ఆలోచన చాలా సాఫీగా సర్దుబాటు వైపు, ఆ తరువాత సంప్రదాయం వైపు మళ్లుతూ వెళ్లింది. ఇది ఒక ఫిలాసఫీ క్లాస్ వింటున్నట్టుగా ఉంది తప్ప కథలా లేదు. దీన్ని ఎలా మెరుగు పరచచ్చు? సింపుల్. సాఫీగా సాగుతున్న ప్రయాణంలో ఒడిదుడుకులు పెట్టాలి. ఒకే వేగంతో, ఒకటే లయలో నడుస్తున్న రైలు ప్రయాణాన్ని రోలర్ కోస్టర్ రైడ్‌లా మార్చండి. అదెలా చెయ్యచ్చు? అందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఒక మూడు చూడండి –

అంతరాయాలు (Interruptions): ఆలోచనకు మరో ఆలోచనతో అంతరాయం కల్పించడం ఒక పద్ధతి. “పోనీ పెళ్లి చేసుకుంటే? చేసుకోవచ్చు కానీ అతనితో దుబై వెళ్లిపోవాలి. అక్కడ ఎలా ఉంటుందో? మన భోజనం దొరుకుతుందా?” పేల్లి నుంచి ప్రాంతం, ప్రాంతం నుంచి అక్కడి భోజన అవకాశాలు – ఒక ఆలోచనకి అడ్డంపడుతూ మరో ఆలోచనని ఇలా మొహరించవచ్చు. చాలా సార్లు ఈ అంతరాయం బయట నుంచి వస్తుంది. ఉదాహరణకి “బామ్మ గట్టిగా దగ్గడంతో మీరా తన ఆలోచనలకు కళ్లెం వేసింది.” దానికన్నా కథకి, కథలో నడుస్తున్న భావోద్వేగానికి తగ్గట్టుగా అంతరాయం ఉంటే ఇంకా బాగుంటుంది. మీరా స్వేచ్ఛ గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఉన్నట్టుండి ఒక పెద్ద పేలుడు వినిపించి (యుద్ధం కాదు ట్రాస్‌ఫార్మర్ పేలింది), కరెంట్ పోయిందని అనుకోండి. ఆ అంతరాయానికి ఆమెను కాసేపు ఆలోచనలు ఆపి, ఒక కొవ్వొత్తి వెలిగించి కూర్చుంది అని రాశారనుకోండి. తరువాత ఏం చెయ్యచ్చు? మళ్లీ పాత ఆలోచనల్లోకి వెళ్లచ్చు. ఈసారి శూన్యం బదులు దీపం వైపు చూస్తుంది. అంతకన్నా మెరుగ్గా చెయ్యాలంటే పాత ఆలోచనా సరళిని వదిలిపెట్టి కొత్త కోణంలో ఆలోచించేలా కూడా చెయ్యచ్చు. అలా అంతరాయం కథలోని ఉండే ఏకధాటి (monotone)ని చిన్న కుదుపుతో బ్రేక్ చేస్తుంది.

వేగవంతం చేయడం (Acceleration): స్వేచ్ఛ వల్ల కలిగే లాభనష్టాలను ప్రశాంతంగా లెక్కవేయకుండా, మీరా తనను తాను ప్రశ్నించుకోవచ్చు: “పెళ్లి వద్దని నాన్నకి చెప్తే? చంపేస్తాడు. పోనీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే? ఎక్కడికి? వెళ్లినా అక్కడ ఏం చేస్తాను? నగలు అమ్మితే రెండు మూడు నెలలకి సరిపోతాయా? ఆ తరువాత? వెనక్కి రాగలనా? వాళ్లు నన్ను ఎప్పటికీ క్షమించకపోతే?” ఇలా వరుసగా వచ్చే ప్రశ్నలు కథా వేగాన్ని పెంచి, ఆమె ఆందోళనను ప్రతిబింబిస్తాయి.

వ్యతిరేక సందర్భం (Reversals): నడుస్తున్న ఆలోచనకి విరుద్ధమైన పరిస్థితులు కథలో ఉత్కంఠను, నాటకీయతని పెంచుతాయి. ‘సర్దుబాటు’ చేసుకోవడం గొప్ప విషయం అని మీరా తనను తాను ఒప్పించుకుంటున్న సమయంలోనే, ఆమె తమ్ముడు చాటుగా సిగరెట్ తాగుతూ, ఫ్రెండ్స్‌తో నవ్వుతూ కనిపించాడనుకోండి — అంటే నేను త్యాగం చేస్తుంటే, వాడు స్వేచ్ఛగా జీవిస్తున్నాడు. అన్న ఆలోచన ఆమెకు (లేదా పాఠకులకు) తెప్పించవచ్చు. ఆ చిన్న దృశ్యం ఆమె భావోద్వేగ స్థితిని పూర్తిగా మారేయచ్చు.

ఇవీ నడక వేగాన్ని నియత్రించేందుకు ఉపయోగపడే కొన్ని టెక్నిక్స్.

మనం మళ్లీ కలిసినప్పుడు మరికొన్ని మీజాన్‌సెన్ సంగతులు చెప్పుకుందాం.

*

అరిపిరాల సత్యప్రసాద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు