సెలయేటి పొగమంచు…

బరువైన పదాలు కాకుండా పల్చటి ఉల్లిపొరల్లాంటి  పదాల వెనక ఇంత భావం ఉంటుందా? ఇలా కూడా కవిత్వం రాయొచ్చా అనే భావాన్ని కలిగిస్తారు

మధ్య పగలేం బాగోవడం లేదు… ఒక ఫిర్యాదు ….!

ఎవరి మీద…?

ఫలానా అని కాదు

అందరూ బిజీ అయిపోయారు…?

ఎందుకు….? తెలీదు…!

మరి మనం…?

సమాధానం లేని ప్రశ్న.

నిషిగంధ తన కవితా సంపుటిలో ఎక్కడా ఆగబుద్ది కాదు అలా అని అంతా వదిలేసి వెళ్లాలని ఉండదు అంటున్నారు… ఇది కూడా  ఫిర్యాదనే అందామా..!

మనకి హాయినిచ్చే పలకరింపు కావాలి, పక్కమీద వాలిపోగానే  ఒక చల్లని గాలితెర మన కళ్లమీద వాలిపోతే గాఢ నిద్రలోకి  వెళ్లిపోవాలి…!

కొన్ని బద్ధకపు మధ్యాహ్నాలు ఉంటాయని ఈవిడ చెప్పేస్తుంటారు…వాటి వెనక ఉండే అందమైన దృశ్యాన్ని మనకి మనమే కళ్ళతో చూసే అనుభవాన్ని అక్షరాల్లోకి మార్చి చూపిస్తారు.

మనమూ మసకబారిన సాయంత్రపు కొసన ముడుచుకు పోయిన టీకొట్టు చూస్తాం.

దానికే వేలాడుతున్న రేడియో బరువుగాఊగడం వెనక అందులో వచ్చే పాటలు ఏ బాధ గర్భితమైన ఘంటసాలవో లేక మహ్మద్ రఫీనో లోపల కచ్చేరీ చేస్తూ ఆ బరువును పెంచారేమో అని ఆవాక్యం చదవగానే అనిపిస్తుంది. వాక్యాన్ని కవిత్వం చేసే కళ ఇది. ఇంత భావుకత తో మనం ఉంటే రచయిత్రి కూడా ఆ స్టాంజా ని అలాగే ముగిస్తారు. టప్ మని చూరు నీళ్ళని దాటొచ్చిన పాట మొదటి సారి మనల్ని పలకరిస్తుంది. అంతే ఇహ ఆ పాట మనల్ని వీడిపోదు. మన గుండెల్లో తిష్ట వేసి పెదాల మీద పూసి ,మన ఒంట్లో భాగమైపోతుంది.

రిక్షా వెనక మూగమనసులు అని రాసి ఉన్న పై భాగంనుంచి అనుపమా పరమేశ్వరన్  చూస్తుంటే బయట శర్వానంద్ అలానువ్వు చూస్తే చాలు అంటూ రామజోగయ్య శాస్త్రి సలహాతో ఒక మనసు పాటను పాడుకుంటాడు.

కురిసెళ్లిపోయిన వానని దాయలేక

దక్షిణపు గాలితో దాగుడుమూతలాడే

ఆకుల మెత్తని అలజడి

నువ్వు నాటిన నిద్ర గన్నేరు చెట్టుదే అంటుదీవిడ….!

అక్కడితో ఆగితేనా…!

అసలు మొదలే  “ఎన్ని సార్లని చెప్పలేదూ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూడకని” అంటే ఎవరు మాత్రం చూడకుండా ఉంటారు. అందులో ఆ చూపుల్ని చూసి సంభాళించుకోలేని తనం ఉంది

ఆ చూపులో నిలిచిపోయింది తన మొఖమే కదా…అందుకే ఈ ఉలుకు.

మనలో ఎందుకు సున్నితత్వం పోయింది మన చుట్టూ ఏం జరుగుతున్నా మనకేం తెలీదు అని మిన్నకుండి పోవడం వలనే కదా..! అవునన్నా కాదన్నా ఇదే సత్యం. తన కాలేజీ ఆవరణం లో చెట్టు కొట్టేస్తుంటే చూడలేక ఉద్యోగాన్ని  వదిలిపెట్టిన మాస్టారు  కథ పతంజలి గారు రాశారు. ఎందుకు ఆ చాదస్తం అన్నా సరే ఆయన ఆగడు. ఆయనకి ఆ విలువ తెల్సు.

దుమ్మూ దుమారాలు దాటేసి వెళ్తున్న సమయాల్లో హఠాత్తుగా దాడి చేసే మబ్బుల ఫెళ ఫెళ ల నుంచి కాపాడి ఆసరా ఇచ్చిన చెట్టు మీద ప్రేమ ఉండడం సామాజిక ప్రేమే కదా..! చెట్టు చరిత్ర ని మౌనంగా ఆకుల్లో దాచి మోస్తుంది. అదే చెట్టు ఒకరోజు ఖండ ఖండాలుగా నరకబడి కనబడుతుంది. ఆ ఊరుకో లేక ఆ ప్రాంతానికో ఒక ఆసరా పోయిన అనుభవం మనకి కూడా అవుతుంది ”  గుబురుకొమ్మల చెట్టు ” కవిత చదివినాక.

అమితంగా ప్రేమించడం అంటే ఏమిటి…?

” జ్ఞాపకాల శకలాలని…

సుదూర స్వప్నాలనీ

పగటి పాట్లని

వాటంతట వాటికి వదిలేసి

ఈ రాత్రికి  జీవించాలని ఉంది” అనే మాటల్లో ఉండే అలౌకిక అనుభూతి అనుభవం లోకి వస్తే తప్పా మనకి అర్ధం కాదు. చాలా మందికి ఈ పుస్తకం లో ఏముంది…? భావావేశం తప్పా అని అనిపించ వచ్చు…! ఇందులో భావం ఉంది, ఆలోచన ఉంది. మనం మానవులుగా తప్పిపోతున్న  జీవన విధానం ఉంది.సరిచేసుకోవాల్సిన మార్గం ఉంది. విడిపోయిన వ్యక్తులు కలుసుకోవడానికి ఇందులో ఒక దారి ఉంది. అలా అని వచనమో లేక వ్యాఖ్యానమో లేదు సుమీ…! తెరలు తెరలు లా పలకరించే కవిత్వం చిక్కగా చేతికి అందుతుంది.

ఈమె కవిత్వం అంతా  పొగమంచు  మాదిరి తోస్తుంది దూరం నుంచి చూస్తున్నంత సేపు మనం ఎప్పుడెప్పుడు ఆ  లోపలికి వెళ్లిపోదామా అనిపిస్తుంది. ఒక్కసారి మనం వెళ్ళీ వెళ్ళగానే ఆకుల మధ్యలో గాలీ, గూళ్ళల్లో పక్షులు , విత్తనం చిట్లిన చప్పుళ్ళు వింటాం.

ఇంత భావుకతా అనిపిస్తుంది మరీ చిక్కగా లేదూ…! ఉంది..! అయితేనేం హాయిగా ఉంది. ఎక్కడా కఠినమైన పదాలు లేవు పల్చటి మేఘాల కింద దేవతలు ధరణి పైకి జారవిడిచిన ఒక  ధవళ వస్త్రం మనల్ని కప్పేస్తుంది. నీ రాకకోసం అనే కవితలో  ఒక్కోసారి మంచు తడి ఆరకుండానే కళ్ల ముందుంటావ్ అని అంటూనే ఆ ఆకస్మిక ఆనందం మళ్ళీ ఎప్పుడు అని అడుగుతుంది.మళ్లి ఆ  పక్క  పేజీలోనే అలిగితివా అని బుజ్జగించే పని మొదలు పెడుతుంది. ” రాయబారానికి పంపిన మల్లెలు మరువం  పూజ గదిలో బందీలై” అని మరు మల్లెల గుభాళింపు లాంటి కవిత రాస్తుంది. నీరెండ మెల్లగా గదిలోనుంచి తప్పుకుంది.. అనే మాటలో అంతరార్ధం చీకటి గదిలో  అలక పోయిందని చెప్పకనే చెప్పారు. ముందుమాటలో మానస చామర్తి ముందు మాటలో ఈ కవిత్వాన్ని  గిలిగింతలిచ్చే నెమలీక్ అన్నారు.నిషీ తన కవిత్వంలో  అపురూపమైన పదాల్ని,  భావాల్ని మోసుకురావడం మాత్రమే కాదు. చదివినంత సేపు హాయిని, హృదయాన్ని హత్తుకునే భావకవితను చదివామనే ఒక  తన్మయాన్ని పొందుతాడు.

ముందు అనుకున్నట్లుగా జీవితాల్లో చాలా ఘడియలు, క్షణాలు మనం లెక్కలోకి తీసుకోము, అంటే వాటి మీద మనకి ఆసక్తి లేదా అంటే ఉంటుంది కానీ మనకి చెప్పే పద్ధతి తెలియక పోవడం కూడా ఆలోచన చేయవలసిన అంశం. అలాంటి చాలా సన్నివేశాలు మనకి ఈ జాజుల జావళి లో దొరుకుతాయి. అన్ని మంచి ముత్యాలే.. ఏరుకుని మాల కట్టుకోవడమే మన పని. ఇందులో మనం  వస్తు పరమైన కవిత్వం కన్నా, భావగర్భిత మైన  నిర్మాణాన్ని ఎక్కువగా చూస్తాం. నిషి తన కవిత్వం లో చెట్లు గురించి, పాపాయి గురించి ,ఏకాంత యామిని కవితల్లో కాస్త వస్తువు ప్రస్ఫుటంగా కనబడిన కూడా వాటిల్లో కూడా భావమే కాస్త డామినేట్ చేసింది అనిపిస్తుంది. నానీ గాడు అనే కవితలో  సదరు నానీ తోడుగా ఉన్నప్పుడు చేసిన పనులన్నీ ఒక క్రమపద్దతిలో అమర్చి చెప్పడం వల్ల వస్తువు దాని నిర్వహణా సులభంగా పాఠకుడు ఆ కవితకు కనెక్ట్ అవుతాడు. అవన్నీ ఎక్కడో ఒకచోట మనం మన ఇంట్లోనో లేక మరో చోటా చూసే ఉంటాం . అందుకే నిషి కవిత్వం మనకి మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. బరువైన పదాలు కాకుండా పల్చటి ఉల్లిపొరల్లాంటి  పదాల వెనక ఇంత భావం ఉంటుందా?! ఇలా కూడా కవిత్వం రాయొచ్చా అనే భావాన్ని కలిగిస్తారు. స్నేహాన్ని, నిద్రని కూడా వదలకుండా కవిత్వంలోకి తీసుకువచ్చి  ఈ సంపుటిలో  చేర్చారు. మధ్య మధ్య లో వేసిన బొమ్మలు అతకలేదు. అవసరం లేదు కూడా.. అది వినా పుస్తకం బాగుంది. అనల్ప ప్రచురణ. వెల 150 రూపాయలు.

*

 

అనిల్ డ్యాని

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బావుంది అనిల్ గారూ.. కవిత్వం రాయడం పుస్తకం వేయడం ఒక ఎత్తైతే, దానిపై అంతే అందంగా సమీక్ష రాయడం ఇంకో ఎత్తు అని అర్ధమవుతోంది. జోహార్లు మీకు🙏.మంచి పుస్తకాన్ని చక్కగా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

  • అప్పుడే అయిపోయిందేంటి వ్యాసం ఇంకాస్త ఉండకూడదా అనిపించింది. విత్తనం చిట్లిన చప్పుళ్ళు వింటాం అన్నారు అదేమిటో అనుభవించాలనిపించింది. ఆ జాజుల జావళి మేమూ పాడుకోవాలనిపించింది. ఇవాళే ఆర్డర్ పెడతా. థాంక్యూ సర్ సున్నితమైన కవిత్వాన్ని పరిచయం చేశారు.

  • మంచి పుస్తక పరిచయం అనిల్ గారు అభినందనలు .

  • ఎక్సలెంట్ రైటప్ తమ్ముడు… చక్కటి విశ్లేషణ

  • చాలా బావుంది అన్న..
    ఆసక్తిగా చదివించిన వ్యాసం…💐💐
    శుభాకాంక్షలు అన్న

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు