ఆ అదృశ్య జీవితాలకి దక్కిన గుర్తింపు ఇది..

సామాజిక కార్యకర్తగా, స్వతంత్ర జర్నలిస్ట్ గా ప్రజాసమస్యలపై నిరంతరం రాజీపడకుండా  పనిచేసే సజయ 2021వ సంవత్సరానికి గానూ కేంద్ర సాహిత్య అకాడమి అనువాద పురస్కారాన్ని పొందారు. తోటిమనిషి మలాన్ని చేతులతో ఎత్తి శుభ్రం చేసే వృత్తిలో మగ్గిపోతున్న పాకీ స్త్రీల జీవితకథలను భాషా సింగ్ ‘అదృశ్య భారత్’ పేరుతో హిందీ లో రాశారు. దాని ఇంగ్లీష్ అనువాదం ‘అన్ సీన్’  ని సజయ ‘అశుద్ధ భారత్’ పేరుతో తెలుగులోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమి అనువాద పురస్కారం పొందిన సందర్భంగా సజయతో ప్రముఖ రచయిత్రి, యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎం.ఎం.వినోదిని చేసిన ఇంటర్వ్యూ:

వినోదిని : `మీరు చేసిన “అశుద్ధ భారత్” అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది కదా.. ఎలా ఫీలవుతున్నారు?

భాషాసింగ్

సజయ :  ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమి లాంటి సంస్థ నుండి ఈ విధంగా గుర్తింపు రావడం ఒక అమానవీయమైన వృత్తి నిర్మూలనలో ముందుకు పడాల్సిన వేలకోట్ల అడుగుల్లో ఒకటిగా చూస్తున్నాను. ఇది కేవలం నా ఒక్క దానికే వచ్చిన అవార్డుగా కూడా నేను భావించడం లేదు. ఈ పుస్తకంలో వున్న జీవితాలకి ఇచ్చిన గుర్తింపు. అనంతపురం లో నారాయణమ్మ, కశ్మీర్ లో శారా, న్యూఢిల్లీలో మీనా, బీహార్ నుంచి కుసుమి, పశ్చిమ బెంగాల్ భాట్పరలోని లక్ష్మనీయ హారీ… ఇలా ఈ పుస్తకంలో ప్రతిధ్వనించిన ప్రతి ఒక్కరిదీ. మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ పాలసీల్లోకి రాని, కనిపించని ఈ జీవితాల్ని, వారిని పౌరులుగా నిలబెట్టడం కోసం కృషి చేస్తున్న బెజవాడ విల్సన్ ఇంకా ఇతర మిత్రులు; ప్రభుత్వాలు, న్యాయస్థానాలు అడిగే సవాలక్ష ప్రశ్నలకు అత్యంత ఓపికతో సర్వేలు నిర్వహించి రిపోర్టులు అందించే ‘సఫాయి కర్మచారి ఆందోళన’ క్షేత్రస్థాయి కార్యకర్తలు; శ్రమకోర్చి అన్ని రాష్ట్రాలూ తిరిగి స్పష్టమైన ఆధారాలతో, గణాంకాలతో కూడిన పరిశోధన చేసి ప్రపంచానికి అందించిన భాషాసింగ్, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న పాకీ సమూహం, పుస్తకాన్ని ప్రచురించిన హెచ్ బి టి…  అందరికీ ఈ అవార్డులో భాగస్వామ్యం వుంది. ఈ విషయాన్ని నేను ఇంతకు ముందే తెలుగు విశ్వవిద్యాలయం ఈ పుస్తకానికి 2018వ సంవత్సరపు ఉత్తమ అనువాద గ్రంథంగా పురస్కారం ఇచ్చినప్పుడు చెప్పాను. మళ్లీ ఇప్పుడు కూడా అదే విషయాన్ని మరింత స్పష్టంగా చెబుతున్నాను. ఈ పుస్తకం వెలికి తీసిన జీవితాలు సాహిత్యలోకంలో చర్చకి రావడం, ఆ వేపుగా అనేక మంది ఆలోచించే విధంగా ఉండటం ఆహ్వానించే విషయం. నిజానికి, తలుచుకోవడానికి కూడా ఇష్టపడని ఈ జీవితాలను, ఆ జీవన దృశ్యాలు కళ్ళముందు కనిపించినా కానీ ఉనికిలో లేని అంశంగా, తప్పనిసరై గుర్తించాల్సి వస్తే తమ హావభావాల్లోనే ప్రపంచంలోని అసహ్యాన్నంతా ప్రదర్శించే సభ్యసమాజం మనది. అలాంటి జీవితాలు సాహిత్య అకాడమీలు, విశ్వవిద్యాలయాల్లోకి బరాబరి నడుచుకుంటూ వెళ్లి పుట్టుకతో కులం కారణంగా తోటిమనుషుల పియ్యి పెంటల కంపుని అనేక సంవత్సరాలుగా సంస్కృతి అనే పేరిట తమతో నిర్బంధంగా మోయిస్తున్న సమాజాన్ని “స్వతంత్ర భారతదేశంలో ఇదేనా మా జీవితం” అని గల్లా పట్టుకుని నిలదీస్తున్న సందర్భం ఇది. “ఎక్కువ డబ్బులు ఇస్తే మీరెవరైనా ఈ పనిచేస్తారా?”, “ఇన్నేళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా మా పిల్లలతో బడుల్లో పాకీదొడ్లు కడిగిస్తున్నారు” అంటూ తమ కఠోర వాస్తవ జీవితాలతో శతాబ్దాల నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతున్న ఆ గొంతులను తెలుగు పాఠకులకు, సాహిత్యానికి పరిచయం చేసే అవకాశం నాకు వచ్చినందుకు, వారి ఉద్యమంలో భాగమవటం నా సామాజిక బాధ్యతగా భావిస్తున్నాను.

వినోదిని : భాషాసింగ్ “అన్ సీన్” చదివినప్పుడు మీరేం ఫీలయ్యారు?

సజయ :  సిగ్గు, అవమానం, దుఃఖం, ఉద్వేగం, కోపం…అన్నీ కలగలిసిపోయిన ఊపిరాడని పరిస్థితి. నేను అతిశయోక్తిగా ఈ మాట అనటం లేదు. కొన్ని అనుభవాలు చదువుతూ ఉంటే అయోమయంగా, నిజంగా మనం మనుషులమేనా అని తలబాదుకోవాలనిపిస్తుంది. మనచుట్టూ ఇంత అమానవీయత అత్యంత సహజమైన విషయంగా చలామణి అవుతుంటే ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని ఒక పోరాట అంశంగా ఎందుకు తీసుకోలేదు అని కోపం వస్తుంది. మార్క్సిస్ట్, విప్లవ పార్టీలు కూడా దీనికి మినహాయింపు కాకపోవటం విషాదం. స్త్రీవాద, దళిత, మైనారిటీ అస్తిత్వ ఉద్యమాలకు కూడా ఈ విషయంలో వివిధ రకాల పరిమితులు వున్నాయి. ఎవరూ దీనిని తమ కార్యాచరణలో ప్రత్యేక ప్రాధాన్యత వున్న విషయంగా చూడలేదనే బెజవాడ విల్సన్ విమర్శని మనమందరం స్వీకరించాలి.  పితృస్వామిక కుల, మత సమాజపు పట్టు అన్ని సమూహాలలోను ఎంత బలంగా ఉంటుందో ఈ పుస్తకంలోని అనుభవాలను చదువుతుంటే వ్యక్తిగతంగా ఒక విధమైన నిస్సహాయత కమ్మేస్తుంది. ఇంతటి గడ్డు స్థితిలో కూడా పరిస్థితులను ఎదుర్కొనే దైర్యం, అనుభవంతో ఎదుటి వ్యక్తులని అంచనా వేసే ఈ స్త్రీల హాస్యపు మాటలు, వారి సునిశిత దృష్టి మనల్ని ఆకట్టుకుంటాయి. ఈ అమానవీయమైన పని నుంచి బయటపడటానికి ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవటానికి సంసిద్ధమవుతూ.. తమ తర్వాతి తరాన్ని మాత్రం ఈ వృత్తిలోకి రానివ్వకుండా గట్టి పట్టుదలతో ఉన్నారనేది “అన్ సీన్” లో చదివినప్పుడు అర్థమయింది. మనం మనసు పెట్టి వారి అనుభవాలని వినటం, వారి జీవితాలను అర్థం చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన అంశం.

వినోదిని: “అన్ సీన్” అనువాదం చేయాలని ఎందుకు అనుకున్నారు?

సజయ : నిజానికి, పాకీ పని మన కళ్ళ ముందు జరుగుతూ వున్నా గానీ అది అమానవీయమనే స్పృహ మనకు వుండదు. ఆపనిలో వున్నవారి హక్కుల గురించి మాట్లాడే గొంతులు, యూనియన్లు వుండవు. 1994-95 ప్రాంతంలో అనుకుంటా నేను మొదటిసారి హైదరాబాద్ లో బేగంపేటలో జరిగిన ఒక చిన్న సమావేశంలో బెజవాడ విల్సన్ ను చూశాను. దుఃఖం, ఆగ్రహం కలగలసిన గొంతుతో పాకీ పని చేస్తున్న మనుషుల ఫోటోలను చూపిస్తూ అనంతపురంలోని నారాయణమ్మ అనుభవాన్ని వివరించాడు. తను ఆంద్రప్రదేశ్ లో ఎస్.ఆర్.శంకరన్ గారితో కలిసి అప్పుడు పాకీ సమూహాన్ని కూడగట్టే పనిలో వున్నాడు. నేను చేయగలిగిన తోడ్పాటు ఏమన్నా వుంటే  చేస్తానని చెప్పాను గానీ ఆ అవకాశం రాలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత పాకీ పని చేసే వ్యక్తులను కామెడీ పేరుతో క్రూరంగా అపహాస్యం చేసే ఒక తెలుగు సినిమాని చూడాల్సి వచ్చింది. అది చూసిన వెంటనే 1999 జూన్ లో ఈ పనిలో ఇమిడి ఉన్న అమానవీయత గురించి “వార్త” దినపత్రికలోని “చెలి” పేజీలో నా శీర్షిక ‘ప్రవాహం’లో భాగంగా ఒక వ్యాసాన్ని రాశాను. ఒక ప్రధాన స్రవంతి తెలుగు దినపత్రికలో ఈ అంశం మీద సహానుభూతితో రాసిన మొట్టమొదటి వ్యాసం ఇదేనని బెజవాడ విల్సన్ తన స్వస్థలం ‘కోలార్ గోల్డ్ ఫీల్డ్స్’ నుంచి ఫోన్ చేసి చెబుతుంటే ఆశ్చర్యంతో పాటు ఇంతకాలం ఈ విషయం మీద దృష్టి సారించనందుకు దుఃఖం కూడా కలిగింది. అయితే, ఇతర రాష్ట్రాల్లో ఈ సమూహపు పని తీరుతెన్నుల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం వెంటనే రాలేదు. సఫాయి కర్మచారి అందోళన్ 2004 ప్రాంతంలో చేపట్టిన ‘పాకీ దొడ్లని, పాకీ బుట్టల్ని తగలబెట్టండి’ అనే ప్రచారోద్యమంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలలో జరిగిన కార్యక్రమాల్లో అను(అమన్వేదిక అనురాధ), పెన్నోబులేసు వంటివారితో పాల్గొనటానికి అప్పుడు నా ఆరోగ్యం సహకరించలేదు. ఆ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ లో పాకీపని గురించి గీతా రామస్వామి, విమల మోర్తాల కలిసి ‘మా కొద్దీ చండాలం’ అనే పేరుతో ఒక పుస్తకం తెలుగులో రాశారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల సమాచారంతో పూర్తి స్థాయిలో నేను చదివిన పుస్తకం ‘అన్సీన్’. అంతకుముందు కొన్ని రిపోర్టులు, వ్యాసాలూ చదివాను. అయితే వాటికీ, ఈ పుస్తకానికీ చాలా స్పష్టమైన తేడా ఉంది. సాధారణంగా రిపోర్టుల్లో ఆ సంస్థలు చేసిన కార్యక్రమాల వివరాలు వుంటాయి. వ్యాసాల్లో వ్యక్తుల అనుభవాలను ఒకటి రెండు వాక్యాల్లో వివరించి ఆ తరువాత గణాంకాలతో ఆయా విషయాలతో ముడిపడివున్న అంశాలను వివరించుకుంటూ వెళ్తారు. కానీ వివిధ రాష్ట్రాలలోని ఈ సమూహపు స్త్రీలను కలిసి ప్రత్యక్షంగా వారితో కలిసి ప్రయాణించడం ద్వారా, వారి దృష్టి కోణం నుంచీ విషయ తీవ్రతను వివరిస్తూ రాసిన పుస్తకం ఇది. వారిని మనుషులుగా గుర్తించి, ఆ జీవితాలకు విలువ ఇచ్చి గౌరవించిన పుస్తకం. సమాజపు అంచుల కిందకి కనబడకుండా తోసేసిన సమూహపు జీవిత వాస్తవాలను మన ముందు నిలబెట్టిన పుస్తకం. అత్యంత కటువైన విషయాన్ని అతి సామాన్యమైన వ్యక్తీకరణలతో, ఆ జీవితాల పట్ల సహానుభూతితో భాషాసింగ్ ఈ పుస్తకం రాసింది.

సజయ, వినోదిని

ఒక పాత్రికేయురాలిగా భాషాసింగ్ ఈ అంశంతో ముడిపడి ఉన్న అనేక సంక్లిష్టతలని క్రమపద్ధతిలో బయటకు తీసుకువచ్చి సమాజానికీ, ప్రభుత్వాలకీ ఒక సవాలు విసిరింది. ముందు హిందీలో ఆ తర్వాత ఇంగ్లీషులో వచ్చిన ఆ పుస్తకాన్ని 2015లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ద్వారా తెలుగులోకి కూడా తీసుకు రావాలని ‘సఫాయి కర్మచారి అందోళన్’ బాధ్యులు భావించారు. ఆ సంస్థ బాధ్యులైన బెజవాడ విల్సన్, పుస్తక రచయిత భాషాసింగ్, పబ్లిషర్ గీతా రామస్వామి… ఈ ముగ్గురూ కల్సి ఈ పుస్తక అనువాద బాధ్యతని నాకు అప్పగించారు. నిజానికి అప్పటివరకూ ‘సవాలక్ష సందేహాలు’, ‘స్త్రీవాద రాజకీయాలు’ పుస్తకాలకు సంపాదకత్వ బాధ్యతల్లోనూ, ఇతర పుస్తకాలకు అవసరమైన వ్యాసాలను అనువాదం చేయటమే తప్పించి, ఒక పెద్ద పుస్తకం పూర్తిగా అనువాదం చేసిన అనుభవం నాకు లేదు. ‘అన్ సీన్’ పుస్తకం అనువాద బాధ్యతని అయితే స్వీకరించాను గానీ సరైన న్యాయం చేయగలుగుతానో లేదోననే సందేహం లోలోపల చాలా నడిచింది. చిన్నప్పుడు హైస్కూల్ స్థాయిలో ప్రత్యేక హిందీ పరీక్షలు పాసవడం వల్ల హిందీ చదవడం వరకూ ఇబ్బందిపడకుండా చేయగలను. కానీ, మాట్లాడటం, రాయడంలో ఆ భాషలో ప్రావీణ్యత అయితే పెద్దగా లేదు. ఇంగ్లీషు కూడా అవసరార్థం పట్టుబట్టి నేర్చుకున్నదే. అయితే ఈ పుస్తకం అనువదించే క్రమంలో ఇంగ్లీషు, హిందీ పుస్తకాలు రెండింటినీ సరి చూసుకుంటూ చేయడం వల్ల సమయం కూడా ఎక్కువ తీసుకుంది. నిజానికి, ఈ పుస్తకం చదువుతుంటే, అనువాదం చేస్తుంటే నేనూ భాషాసింగ్ తో కలిసి అదృశ్యంగా ప్రయాణం చేసి అన్నీ చూసినట్లే అనిపించింది. అందుకే నాకు ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలు, మనుషులు, వారి కథలు ఏవీ కూడా అపరిచితంగా అనిపించలేదు. నేనే వారి ఎదురుగా కూర్చుని విన్నట్టుగా అనిపించింది. పుస్తకం ప్రింట్ అయి వచ్చిన కొద్దికాలంలోనే, చదవటానికి ఎంతో సులభతరంగా వుందని అసలు అనువాదంగా అనిపించడం లేదని రాఘవులు, ఇందిర, సరస్వతి వంటి  క్షేత్ర స్థాయి కార్యకర్తలు, సిద్దెంకి యాదగిరి వంటి ఉపాధ్యాయులు చెబుతుంటే అదే పెద్ద ప్రశంస అనుకున్నాను. ఈ పుస్తకం గురించి సీనియర్ ఎడిటర్ రామచంద్రమూర్తి గారు సాక్షి పత్రిక ఎడిట్ పేజీలో రాస్తూ ప్రత్యేకించి అనువాదం చాలా సమర్థవంతంగా చేశారు అని పేర్కొనటం గౌరవంగా భావిస్తున్నాను. ఇంకా కొన్ని దిన పత్రికల్లోనూ, ఇతర మాస పత్రికల్లోనూ సమీక్షలు వచ్చాయి. ఈ పుస్తకం చదివిన ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ పాకీ పని ప్రత్యామ్నాయాల గురించి చర్చించటం కోసం బెజవాడ విల్సన్ ని కలిసి, ఆయనతో జరిపిన సుధీర్గ సంభాషణని రెండు వ్యాసాల రూపంలో నవ తెలంగాణ దినపత్రికలో రాశారు. కోనసీమలో వుండే బడుగు భాస్కర్ జోగేష్ అనే యువ రచయిత పుస్తకం మీద సుదీర్ఘమైన వ్యాసాన్ని రాశాడు. ఇంకా అనేకమంది తమ అభిప్రాయాలను వివిధ మాధ్యమాల్లో పంచుకున్నారు. కుల, పితృస్వామ్య వివక్షకు పరాకాష్ట గా వుండే పాకీ పని స్వభావం మీద వచ్చిన ఈ పుస్తకం ప్రజా, సాహిత్య సమూహాల్లోకి ఇంకా విస్తృతంగా వెళ్ళాల్సిన అవసరం వుంది.

వినోదిని: ఇంగ్లీషులో “అన్ సీన్”ని తెలుగులో “అశుద్ధ భారత్” అన్నారు. ఈ పేరు ఎలా తట్టింది?

సజయ :  హిందీలో “అదృశ్య భారత్”గా, ఇంగ్లీషులో “అన్ సీన్”గా వచ్చిన ఈ పుస్తకానికి తెలుగులో ఏం పేరు పెట్టాలా అని ఎంతో ఆలోచించాల్సి వచ్చింది. మూల రచనలో వున్నట్లు ‘అదృశ్య భారత్’ అనే పెట్టొచ్చు కానీ తెలుగులో ఆ గాఢత రాదేమో అనిపించింది. ముందే చెప్పాను కదా పుస్తకాన్ని అనువాదం చేసే క్రమంలో ఆ జీవితాలు నాకు అపరిచితంగా అనిపించలేదని! ఒకచోట “ఇప్పటికీ ఆ పీతికంపు నా జుట్టులో నుంచీ వస్తూనే వున్నట్లు అనిపిస్తుంది” అని హర్యానాలో కమలేశ్ చెప్పిన అనుభవం, “ఆ రోజుల్ని తలచుకుంటేనే నాకు కడుపులో తిప్పుతుంది” అని సంవత్సరాల తరబడి ఆ ఎత్తుడు పాకీదొడ్లు శుభ్రం చేసిన  అనుభవాన్ని అనంతపురం నారాయణమ్మ చెప్పింది చదువుతుంటే మన మనశ్సరీరాలు రెండూ ఆ పీతి పెంటల్లో మునిగిపోయి ఆ కంపు మనల్ని కమ్ముకుని వెంటాడుతూనే వుంటుంది. ఆ భావన మనల్ని వదలదు. అందుకే “కనిపించని భారతం”/ “మరుగునపడ్డ బతుకులు”, “మురుగు” వంటివి వాడినా గానీ విషయం పూర్తిగా అర్థంకాదనిపించింది. పూర్తిస్థాయి భావం ట్యాగ్ లైన్ లేకుండా సూటిగా ఉండాలంటే “అశుద్ధ భారత్” అయితే బావుంటుందని గీత, విల్సన్ సూచన చేశారు. పాఠకులు ఈ టైటిల్ ని ఎలా అర్థం చేసుకుంటారు అనేదాని మీద కూడా చాలా చర్చ మా మధ్యలో జరిగింది.

వినోదిని : ఈ అనువాదంలో మీరు వాడిన భాష, పదాలు తెలుగు సాహిత్యంలో అంతగా వాడకంలో లేవు కదా.. ఇవి ఎలా కుదిరాయి?

సజయ :  మూల రచన దెబ్బతినకుండా తెలుగులోకి సరళంగా తీసుకు రావడం అంత సులభంగా ఏమీ జరగలేదు. ముఖ్యంగా ప్రధాన ఇతివృత్తం పాకీ పనికి సంబంధించింది కావడంతో ఎలాంటి పదాలు వాడాలి అనే ప్రశ్న ముందుకి వచ్చింది. ఒక కుల సమూహం పేరైన ‘ఛండాలం’ అనే పదాన్ని వాడకూడదని ముందే అనుకున్నాను. సామాన్య ప్రజల వాడుకలో ఉండే “పియ్యి”, “పెంట” అని వాడాలా? లేక సంస్కృతీకరణకి గురైన “మలమూత్రాదులు” అని వాడాలా? మరుగుదొడ్లా లేక ఎత్తుడు దొడ్లు అని వాడాలా అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ పదాలు ఉపయోగిస్తే పాఠకులు పుస్తకాన్ని స్వీకరిస్తారా అనే సందేహం కూడా నా లోపల వుంది. నిజానికి పాకీ అనే పదాన్ని వాడాలా వద్దా అనే మీమాంస నడిచింది. దీని కోసం దళిత ఉద్యమంలో పనిచేస్తున్న కొంత మంది మిత్రులు, రచయితలతో చర్చించినప్పుడు స్పందన మిశ్రమంగా వచ్చింది. ఇంగ్లీష్ లో అతి సాధారణం గా ‘షిట్’ ‘ఫక్’ అని సులభంగా ఈతరం అనేయటం చూస్తున్నాం. అదే పదాల అర్థాలు తెలుగులో అనటానికి ఒక ఇబ్బంది వుంటుంది. బెజవాడ విల్సన్ తెలుగువాడు కాబట్టి ఆయా పదాలతో వున్న సమస్యలను చర్చించటానికి సులువు అయింది. ఆ చర్చల్లో భాగంగా సఫాయి కర్మచారి ఆందోళన్ క్షేత్రస్థాయి కార్యకర్తల అభిప్రాయం ప్రకారం ఆ సమూహ ప్రజల అలవాటు వాడుక పదాలనే ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇదంతా ఒకరోజులో జరిగిన విషయమేమీ కాదు. దాదాపు ఆరు నెలలపాటు ఈ పుస్తకం గురించి ఎవరో ఒకరితో నిరంతర చర్చ నడుస్తూనే వుండేది. పదాల ఎంపికలో చేసిన మార్పుల వల్ల ప్రారంభంలో చేసిన కొన్ని చాప్టర్లు మళ్లీ తిరగరాయాల్సి వచ్చింది కూడా. అనువాదం చేస్తున్న క్రమంలోనే సిసిసి (కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్)లో నాతో పనిచేసే రజని, నరేష్ ఎప్పటికప్పుడు రాసినంత వరకూ టైప్ చేసి ఇచ్చేవారు. వారే మొదటి పాఠకులు. వారి అభిప్రాయం కూడా తీసుకునేదాన్ని. దానితో కాపీ ఎడిట్ చేయటం కొంచం సులభమయింది. ఫైనల్ కాపీ ఎడిటింగ్ లో వాక్యనిర్మాణం, భాషాపరమైన అంశాలు, అచ్చుతప్పులను వొమ్మి రమేష్ చాలా జాగ్రత్తగా సరిచూశాడు.

వినోదిని: మీరు చేసిన ఇతర అనువాదాలకి ఈ అనువాదానికి ఏం తేడా గమనించారు?

సజయ :  ఏ అనువాదమైనా కేవలం భాషకు మాత్రమే సంబంధించిన విషయం గా వుండదు. భావం, ఇతివృత్తం ప్రధానంగా వుంటాయి. మూల రచనలోని అంశంతో ఏకీభావం లేకుండా, ఆ రచనతో సహానుభూతి చెందకుండా అనువాదం సాధ్యం కాదు. ప్రతి అనువాదం ప్రత్యేకమైన అంశాలతో కూడి ఉంటుంది. స్త్రీవాద సైద్ధాంతిక అంశాలు తెలుగులోకి అనువదించేటప్పుడు అనేక పదాలకు సమానార్ధకాలు ఉండవు. వాటిని తెలుగులో అర్దమయ్యే విధంగా రాయటానికి చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఆయా వ్యాసాల్లో ఉన్న అంశాలను బట్టి, రచయితలు రాసే శైలిని బట్టి కూడా అనువాద ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. అయితే ఈ పుస్తకం విషయంలో భాషా సింగ్ శైలి అత్యంత ఆసక్తి కరంగా వుంది. ప్రతి చిన్న విషయాన్ని నమోదు చేయటం ద్వారా చదువరులను ఆ పరిస్థితుల్లోకి నడిపిస్తుంది. హిందీ నుంచి ఇంగ్లీష్ అనువాదం చేసిన రీనూ తల్వార్ కూడా శైలిలో ఎక్కడా రాజీ పడకుండా చేశారు. అయితే తెలుగులో పదాల ఎంపిక అంత సులభంగా జరగలేదు. కారణం ఆయా పదాలు సాహిత్య వ్యక్తీకరణల్లో గౌరవప్రదం కాకపోవడమే. అయినప్పటికీ ఒక రాజకీయ వ్యక్తీకరణగా ఆ వృత్తిలో ఇమిడిఉన్న అమానవీయతని సమాజం ముందు బరిబాతలుగా నిలబెట్టటం కోసం “పియ్యి”, “పెంట”, “పాకీ” వంటి పదాలను వాడుతూనే  భాషా సింగ్ చదివించే శైలిని యధాతధంగా తెలుగులోకి తేవటానికి ప్రయత్నించాను.

వినోదిని: ఈ “అశుద్ధ భారత్” వంటి పుస్తకాలు పాఠకుల్ని ఎంత వరకు సెన్సిటైజ్ చేస్తాయని మీరు అనుకుంటున్నారు?

సజయ :  మొట్టమొదలు ఇలాంటి పుస్తకాలు సంచలనాత్మకమో, ఆకర్షణీయమైన ఇతివృత్తం వున్నవో  కావు. ఈ వృత్తి మీద శతాబ్దాల తరబడి ఏ నిశ్శబ్దం అయితే కుట్రపూరితంగా పరుచుకుని ఉందో అదే నిశ్శబ్దం ఈ పుస్తకానికి కూడా వర్తిస్తుంది. ఈ పుస్తకం పాకీ వృత్తిమీద వున్న అనేక భావజాల సంఘర్షణలను కూడా అర్థం చేయిస్తుంది. భాషా సింగ్ తన ముందుమాటలో పేర్కొన్నట్లు గాంధీ, అంబేడ్కర్ లు ఈ వృత్తి మీద వివిధ సందర్భాల్లో వెలిబుచ్చిన అభిప్రాయాలను కూడా అర్థం చేసుకోవటం, విశ్లేషించటం ముఖ్యం. ఏ సైద్ధాంతిక పునాది మీద నిలబడి ఈ వృత్తిని వారు విశ్లేషించారు అనేది చాలా ముఖ్యమైన అంశం. సామాజిక అంశాల పట్ల స్పందించగలిగిన సామాన్యమైన వ్యక్తులకు ఈ పుస్తకం చేరువవటం సంతోషించవలసిన విషయం. ఆలస్యమైనప్పటికీ సాహిత్యకారుల చేతుల్లోకి కూడా వెళ్ళింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ పుస్తకం తన ప్రచారాన్ని తానే నిర్వహించుకుంటోంది. విశ్వవిద్యాలయాల బోధనాంశాల్లోకి, పరిశోధనల్లోకి ఈ సమూహపు ప్రజల జీవితాలు వెళ్ళగలిగినప్పుడు మరింత మానవీయమైన మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.  75 సంవత్సరాల స్వాతంత్ర రజతోత్సవాన్ని పురస్కరించుకుని ఈ విషయంపై అన్ని రాష్ట్రాల్లోనూ #stop killing us అనే పేరుతో దేశవ్యాపితంగా ఒక ప్రచారోద్యమం నడుస్తోంది. ప్రభుత్వాలలోనే కదలిక తక్కువ వుంది.

వినోదిని : మీరు చేసిన ఇతర రచనలు, అనువాదాల గురించి చెప్పండి?

సజయ :  సంపాదకత్వం వహించిన పుస్తకాల గురించి, అనువాదాల గురించి చెప్పాల్సి వస్తే అన్వేషి సంస్థతో కలిసి నేను చేసిన ప్రయాణం నుంచీ మొదలుపెట్టాలి. నేను 1989 లో హైదరాబాద్ లోని అన్వేషి రీసెర్చ్ సెంటర్ ఫర్ విమెన్స్ స్టడీస్ లో ICHR ప్రాజెక్ట్ లో రీసెర్చ్ అసిస్టెంట్ గా జేరాను. ఈ ప్రాజెక్ట్ పని  స్వాతంత్ర పూర్వకాలం నుంచీ తెలుగులో వచ్చిన స్త్రీల పత్రికలను సేకరించి భద్ర పరచటం. వేటపాలెం సారస్వత నికేతన్, రాజమండ్రి గౌతమి గ్రంధాలయాలతో పాటు ఇతర జిల్లాలలో వున్న పాత గ్రంధాలయాలు వెతుక్కుంటూ వెళ్లి అక్కడ దొరికిన పత్రికలను జిరాక్స్ చేయించి భద్రపరిచాము. వాస్తవానికి అప్పుడు జిరాక్స్ సౌకర్యం కూడా సరిగ్గా వుండేది కాదు. అలానే నానా ఇబ్బందులూ పడి చాలా పత్రికలను సేకరించాం. అలా అన్వేషి నుంచి వివిధ ప్రాజెక్టుల్లో పని చేసిన క్రమంలోనే సంస్థ సభ్యురాలిని కూడా అయ్యాను. అప్పుడే కొంతమంది మిత్రులం కలసి భూమిక పత్రికను 1993లో స్వతంత్రంగా ప్రారంభించాం. పత్రిక నిర్వహణలో భాగంగా తెలుగులో రాయలేనివారి వ్యాసాలను అనువాదం చేయాల్సి వచ్చేది. భూమిక కంటే ముందు తారకం గారు సంపాదకులుగా వచ్చిన నలుపు పత్రిక ద్వారా నా వ్యాస రచన, అనువాదాలు సీరియస్ గా ప్రారంభం అయ్యాయని చెప్పవచ్చు.

అన్వేషి సంస్థ చేసిన పరిశోధనల్లో తెలుగులో పుస్తక రూపంలో వచ్చినవాటిల్లో ముఖ్యమైనది స్త్రీలు ఎదుర్కొంటున్న ఆరోగ్య అంశాలను ప్రధానం చేసుకుని రచించిన ‘సవాలక్ష సందేహాలు-స్త్రీలు-ఆరోగ్యం-సంస్కృతి’. ఈ పుస్తకం మొదటి ఎడిషన్ 1991 నుంచీ దానితో నా అనుబంధం కొనసాగుతూనే వుంది. మళ్లీ అనేక సంవత్సరాల తర్వాత 2004లో అదే పుస్తకానికి  కె.లలిత తో కలిసి  అన్ని అధ్యాయాలకు కొత్త సమాచారం చేర్చి సంపాదకత్వ, సమన్వయ బాధ్యతలు నిర్వహించడం మర్చిపోలేని అనుభవం. ఇది కేవలం భాషకు, సామాజిక అంశాలకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, సాంకేతికంగా వైద్యవృత్తితో ముడిపడిన అంశం కూడా. యూరినరీ ఇన్ఫెక్షన్స్ వంటి కొన్ని అధ్యాయాలలో స్త్రీల అనుభవాలను నమోదు చేయటం అంత సులభమైన విషయం కాదు. అవసరమైన కేసు స్టడీల కోసం రోజుల తరబడి హాస్పిటళ్ళలో గడిపిన సందర్భాలు వున్నాయి.

అలానే ఆరవ శతాబ్దం నుంచీ 20వ శతాబ్దం 80వ దశకం వరకూ వచ్చిన స్త్రీల రచనలను సుజీతారు, కె.లలిత సంపాదకులుగా ఇంగ్లీష్ లో ‘విమెన్ రైటింగ్ ఇన్ ఇండియా’ పేరుతో 1991లో రెండు సంకలనాలు ప్రచురించారు. 2015 లో తెలుగులో రెండో సంకలనాన్ని ‘దారులేసిన అక్షరాలుగా’ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. ఈ పుస్తకానికి తెలుగులో కాపీ ఎడిటింగ్ చేశాను.

స్త్రీవాద ఉద్యమం అనగానే తెలుగులో కేవలం కవిత్వానికి మాత్రమే పరిమితం చేసే ఒక మూసధోరణి కనిపిస్తుంది. నిజానికి స్త్రీవాద ఉద్యమం అనేక అంశాలను సమాజంలో చర్చకు పెట్టింది. ఈ ఉద్యమానికి చాలా పరిమితులు ఉన్నప్పటికీ అది చర్చించిన అంశాల విస్తృతి రాజకీయంగా ఎంతో ముఖ్యమైనది. వాటిని కొంతమేరకు భూమిక లో చర్చించటానికి ప్రయత్నం చేశాము. ఇలాంటి రచనల ద్వారా తెలుగులో స్త్రీవాద ఉద్యమమంటే కేవలం కవిత్వం అనే అపోహను పోగొట్టగలిగామనే అనుకుంటున్నాను. అన్వేషి లైబ్రరీ కి వచ్చే యూనివర్సిటీ విద్యార్థులు అనేకమంది స్త్రీవాద సైద్ధాంతిక చర్చల గురించి తెలుగులో సమాచారం, పుస్తకాలు, వ్యాసాలు కావాలని  ఇప్పటికీ అడుగుతూ వుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశోధక విద్యార్థుల కోసం భారతదేశంలో ఎమర్జెన్సీ తర్వాత స్త్రీవాద ఉద్యమం చర్చించిన అంశాలను తెలుగులో పరిచయం చేయటం కోసం పదమూడు వ్యాసాలతో కూడిన ‘స్త్రీవాద రాజకీయాలు-వర్తమాన చర్చలు’ పుస్తకం  ప్రొఫెసర్ రమా మెల్కోటే తో కలిసి 2006లో సంపాదకత్వం వహించాను. ఇందులో వున్న తొమ్మిది అనువాద వ్యాసాల్లో నాలుగు నేనే చేశాను. అనువాదం, పుస్తక సంపాదకత్వం లో వుండే అనేక అంశాలను అర్థం చేసుకోవడంలో ఈ పుస్తకం మీద పనిచేసే క్రమంలో చాలా నేర్చుకున్నాను. వీటితో పాటు అన్వేషి సంస్థ కో-ఆర్డినేటర్ గా పనిచేసిన సునీత అచ్యుత నేతృత్వంలో వివిధ అంశాల మీద పరిశోధనాత్మకంగా ప్రచురించిన బ్రాడ్ షీట్స్ కి, ఇతర పుస్తకాలకి అవసరమైనప్పుడు అనువాదాలు కూడా చేసిచ్చేదాన్ని.

పూర్తి అనువాద పుస్తకాలు ఇప్పటికి మూడు చేశాను. మూడూ కూడా హెచ్బిటినే ప్రచురించింది.  మొదటిది, మరాటీ రచయిత్రి వందనా సోనాల్కర్ ఇంగ్లీష్ లో రాసిన ఒక పెద్ద వ్యాసాన్ని ‘జెండర్ రాజకీయాలు- చర్చనీయాంశాలు’ పేరుతో నేనూ, యువక(కలేకూరి ప్రసాద్) అనువాదం చేశాం. రెండోది, ‘అశుద్ధ భారత్’. ఆ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ 2021 సంవత్సరపు అనువాద పురస్కారం ప్రకటించిన సందర్భంలోనే మనం ఈ ఇంటర్వ్యూ లో ఇవన్నీ మాట్లాడుకుంటున్నాము. దేశవ్యాప్తంగా సఫాయి కార్మికుల జీవితాల మీద జర్నలిస్ట్  భాషా సింగ్ రచించిన ‘UNSEEN- the truth about India’s Manual Scavengers’ పుస్తకానికి అనువాదం ఇది. ఈ పుస్తకానికే  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచీ 2018 సంవత్సరానికి గానూ అనువాదంలో అత్యుత్తమ పురస్కారాన్ని అందించింది.

నా మూడో అనువాద పుస్తకం ప్రొఫెసర్ జంగం చిన్నయ్య పరిశోధనాత్మక రచన ‘Dalits and the Making of Modern India’ ని ‘ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితులు’ గా చేశాను. దళిత చరిత్రని పునర్ నిర్మించే రచనల్లో ఇది ఎంతో ముఖ్యమైన పరిశోధన. అస్తిత్వ ఉద్యమాల కార్యకర్తలు, పరిశోధకులు తప్పనిసరిగా చదవాల్సిన, చర్చించాల్సిన పుస్తకం.

వినోదిని:  మీది కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం కదా.. ఆ స్ఫూర్తితోనే మీరు సామాజిక కార్యకర్తగా ఎదిగారా?

సజయ : కమ్మ్యునిస్టు కుటుంబ నేపథ్యం సామాజిక రాజకీయ ఆలోచనలకు, వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో పనిచేయటానికి ప్రేరణ నిచ్చింది. అయితే కొద్దికాలమే పనిచేసినప్పటికీ ఆ ఉద్యమసంస్థల సభ్యులతో ముఖ్యంగా జెండర్, కుల అంశాలపై జరిగిన భావ సంఘర్షణ, తర్వాతి కాలంలో జీవితంలో నిలదొక్కుకోవటానికి ఒక స్త్రీగా ఎదుర్కొన్న అనేక చేదు అనుభవాలతో పాటు స్త్రీవాద, దళిత, మైనారిటీ, ట్రాన్స్ జెండర్… అస్తిత్వ ఉద్యమాలు సంధించిన ప్రశ్నలు, కార్యాచరణ, మానవ పౌర హక్కులపై రాజ్య నిర్బంధం – వీటన్నిటిని అర్థం చేసుకునే క్రమంలో ఎదురైన సామాజిక రాజకీయ వొత్తిడి, అణగారిన సమూహాల హక్కుల కోసం జరిగే వివిధ పోరాటాలు, నా పుట్టుక మూలాలు ఎక్కడ వున్నప్పటికీ రాజకీయ కార్యాచరణలో స్వతంత్రంగా నేనెక్కడ ఎవరితో ఏ అంశాలతో నిలబడాలి అనే స్పష్టత నిచ్చాయి.

వినోదిని: కాలమిస్టుగా, స్వతంత్ర జర్నలిస్టుగా ఉన్నారు కదా… ఎక్కువ ఏ విషయాల మీద రాశారు?

సజయ :  భూమిక నిర్వహణ బాధ్యతల నుంచీ తప్పుకున్న తర్వాత 1999 నుంచీ స్వతంత్ర జర్నలిస్ట్ గా వార్త దినపత్రిక చెలి పేజీలో ‘ప్రవాహం’ శీర్షిక ప్రతి వారం నిర్వహించాను. ‘ప్రవాహం’ స్త్రీల దైనందిన జీవితాలలో పైకి కనపడని పితృస్వామ్య సాంస్కృతిక అంశాల గురించి చర్చించింది. ఇదే పేరుతో ఈ వ్యాసాలను 2013 లో పుస్తక రూపంలో లిఖిత ప్రెస్ తరఫున ప్రచురించాము. 2000 సంవత్సరంలో ‘ఆంధ్ర ప్రదేశ్ లో స్త్రీల భూమి హక్కులు-అనుభవాలు’ అనే అంశం మీద ఢిల్లీ లోని నేషనల్ మీడియా ఫౌండేషన్ నుంచీ పరిశోధనా ఫెలోషిప్ అవార్డు ఒక సంవత్సర కాలానికి వచ్చింది. దీనికి సంబంధించి కేస్ స్టడీస్ కోసం అనేక జిల్లాలలోని మారుమూల ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు కూడా వెళ్ళాను. ఈ అంశం మీద చేసిన ఆ పరిశోధనే ఆ తర్వాత రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగిన సిద్దిపేట, మెదక్, వరంగల్, మహబూబ్ నగర్, అనంతపురం ప్రాంతాలలో ఆ కుటుంబాలతో, మహిళా రైతులతో పనిచేయటానికి పునాదిగా పనిచేసింది. ఆ క్రమంలో వచ్చిన ప్రశ్నలను, అనుభవాలనే 2015 నుంచీ నవ తెలంగాణ దినపత్రికలో వ్యవసాయ అంశాల మీద ‘తొలిపొద్దు’ శీర్షికన ప్రతీవారం ఒక కాలమ్ గా రాశాను. ఇది 2016లో ‘రైతు ఆత్మహత్యలు-మనం..!?’ పేరిట సంపుటిగా వచ్చింది. ‘రైతు ఆత్మహత్యలు-మనం’ పుస్తకం వ్యవసాయం చుట్టూవున్న అనేక అంశాల గురించి, మహిళా రైతుల భూమి హక్కులు, గుర్తింపుల గురించి చర్చిస్తుంది. ఈ రెండు పుస్తకాలు కూడా వారం వారం కాలమ్ గా వస్తున్నప్పుడే సామాన్య పాఠకుల మన్ననలు పొందాయి. వ్యవసాయ విధానాల మీద రాసిన ఈ వ్యాసాలకు  2017 లో దక్షిణాసియా దేశాల విభాగంలో లాడ్లీ మీడియా ఉత్తమ కాలమిస్ట్ అవార్డ్ ప్రకటించారు.

అదే సమయంలో వీక్షణం-రాజకీయార్ధిక, సామాజిక మాస పత్రికలో కూడా వ్యవసాయ సంబంధిత అంశాల మీదే ఎక్కువ రాశాను. ఆంధ్రజ్యోతి, సాక్షి, వార్త, నమస్తే తెలంగాణ దినపత్రికలలో కూడా స్త్రీల హక్కుల అంశాలతో పాటు ప్రధానంగా రైతు ఆత్మహత్యల మీద రాయటం జరిగింది. దేవులపల్లి అజోయ్ సంపాదకులుగా వున్న ప్రజాతంత్ర దినపత్రికకు 2018 నుంచీ ‘సంకేతం’ పేరుతో ఒక శీర్షికను సమకాలీన సామాజిక అంశాలపై రాస్తున్నాను. వీటిని వివిధ అంశాల వారీగా పుస్తక రూపంలోకి తేవాల్సి వుంది కానీ అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. ‘సారంగ వెబ్ మ్యాగజైన్ ‘లోనే ‘యాక్టివిస్ట్ డైరీ’శీర్షికతో విభిన్న సామాజిక కార్యకర్తల జీవితాలను, వారి విలువైన అనుభవాలను కొన్ని నమోదు చేశాను. అందులో హెచ్చారెఫ్ జీవన్ కుమార్ గారి అనుభవం పుస్తకంగా వేశాము. ఇంకా చాలా మందివి రాయాల్సి వుంది.

వినోదిని: సామాజిక కార్యకర్తగా స్త్రీల సమస్యల మీద, వ్యవసాయం మీద, రైతు ఆత్మహత్యలు- ఆ కుటుంబాల స్త్రీలు, పిల్లల మీద పనిచేస్తున్నారు కదా.. ఆ అనుభవం గురించి చెప్పండి?

సజయ : రైతు ఆత్మహత్యల కుటుంబాలతో కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్ గా దాదాపు ఒకటిన్నర దశాబ్దంగా ప్రయాణం చేస్తున్నాము. నా పని నా ఒక్కదానికే పరిమితమయింది కాదు. మేము అనేకమందిమి ఒక టీంగా పనిచేస్తాము. కొండల్, లక్ష్మి, శ్వేత, సుజాత, ప్రవీణ్ లాంటి గ్రామీణ కార్యకర్తల నుంచీ యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకూ ఎంతోమంది దీనిలో వుంటారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ పనిచేయాలి. మొదట్లో ఆయా కుటుంబాలకు వెళ్లటం వారి అనుభవాలను నమోదు చేయటం వారి పిల్లలకు చదువులో సాయపడటం వరకూ చూసేవాళ్లం. గ్రామీణ స్థాయి నుంచీ వాలంటీర్లను తయారుచేయడం, వారికి రాజ్యాంగవిధులు, ఆహార భద్రత, జెండర్ , కులవ్యవస్థ, హక్కుల గురించి శిక్షణలు ఇవ్వటం, కాలేజీల్లో రైతు ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితులపై, వ్యవసాయ విధానాల పై అవగాహన కల్పించడం, ఆ కుటుంబాల పిల్లలతో సమావేశాలు నిర్వహించడం వంటివి చేసేవాళ్ళం.  ఆత్మహత్య చేసుకున్న రైతుల భార్యల వ్యధ ఒక తీరని దుఃఖం. తన ప్రమేయంలేని చర్యకు జీవితకాలం బాధ్యత వహిస్తూ కుంగిపోయే పరిస్థితి. వేలెత్తి విమర్శించే బంధువులు, సమాజం ఒకవైపు, వ్యవసాయ విధానాలకు బాధ్యత వహించకుండా ‘నీ భర్తతో గొడవ పడ్డావు కాబట్టి అతని చావుకు నువ్వే కారణమని’ నిస్సిగ్గుగా అధికార మదాన్ని చూపించే ఎమ్మార్వోలు, పోలీసులు, వ్యవసాయ అధికారులు, కలెక్టర్లు, మంత్రులని వాళ్లు వంటరిగా ఎదుర్కోవటం సాధ్యం కాదు. నోట్లోంచి మాట పెగలదు. అడుగడుగునా భయం కమ్ముకుని వుంటుంది. అందుకే వివిధ జిల్లాలలో ఒక్కొక్కరినీ కూడగట్టి వారిని ‘రైతు ఆత్మహత్యల బాధిత కుటుంబాల వేదిక’ గా ఏర్పరిచాము. ఎక్స్ గ్రేషియా కోసం అధికారులకు ఏ వినతిపత్రం ఇవ్వాలన్నా,  హైదరాబాద్ లాంటి నగరాల్లో ధర్నా, సెమినార్, ప్రెస్ కాన్ఫరెన్స్, బహిరంగ సభల్లాంటివి పెట్టాలన్నా ఈ వేదిక తరఫు నుంచే నిర్వహించేవాళ్ళం. ఇప్పుడు ఆ కుటుంబాలని, చిన్న సన్నకారు మహిళా రైతులను ఆర్థికపరంగా, సామాజికపరంగా సుస్థిర పరిచేందుకు కో ఆపరేటివ్ రూపంలో పని ఇంకా విస్త్రుతమయింది. అలాగే అనేక సంస్థలు రైతు ఆత్మహత్యల అంశాన్ని  ప్రాధాన్యతగా తీసుకుని రెండు రాష్ట్రాలలోనూ పనిచేస్తున్నాయి. ప్రత్యేకించి మహిళా రైతుల అంశాలపై ‘మహిళా రైతుల హక్కుల వేదిక’గా, విస్త్రుత వ్యవసాయ అంశాల మీద ‘రైతు స్వరాజ్య వేదిక’గా అనేకమందిమి కలిసి పనిచేస్తున్నాము.

ఇంకోవైపు, స్త్రీలకు సంబంధించిన వివిధ అంశాలపై  ‘మహిళా, ట్రాన్స్ జెండర్ సంఘాల, వ్యక్తుల ఐక్య కార్యాచరణ వేదిక’గా దాదాపు ఇరవై సంఘాలకు పైగా కలిసి తెలంగాణలో పనిచేస్తున్నాము. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అనేక డిమాండ్లతో అన్ని రాజకీయ పార్టీలను జెండర్ అంశాలపై మీ వైఖరి ఏమిటో తెలపాలని ‘ఎన్నికల మేనిఫెస్టో’ కూడా ప్రకటించాము. ఏ అంశం మీదైనా అందరం చర్చించుకున్న తర్వాతే కార్యాచరణలోకి వెళతాము. ఇది ఒక అరుదైన కార్యాచరణ వేదిక. మహిళలు, పిల్లలు, ట్రాన్స్ జెండర్లు, గృహ కార్మికులు, నిరాశ్రయులు, వ్యవసాయదారులు, చేనేత కార్మికులు, అసంఘటిత కార్మికులు, దళిత, మైనారిటీ సమూహాలతో పనిచేసే సంఘాలు, వ్యక్తులు దీనిలో భాగం. తెలుగు సినీ పరిశ్రమలో మహిళల స్థితిగతులపై విచారణకు ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీ వేయక తప్పని పరిస్థితి ఈ వేదిక ద్వారా చేసిన కృషి వల్లనే సాధ్యమయింది. ఇది ఒక ఉదాహరణ. పైన వివరించిన ఈ వేదికలన్నిటిలో పని అంతా కూడా ఎవరికి వాళ్లం ఒక సామాజిక, రాజకీయ బాధ్యతగా నిర్వహిస్తున్నవే.

వినోదిని: “దిశ” సంఘటనలో జరిగిన ఎన్ కౌంటర్ మీద కేసు వేశారు కదా.. అందులో మీ పాత్ర ఏంటి? దాని గురించి చెప్పండి?

సజయ : 2019లో హైదరాబాద్లో జరిగిన ‘దిశ’ హత్యాచారం సంఘటన అత్యంత బాధాకరం. ప్రభుత్వ, పోలీసు యంత్రాంగాల వైఫల్యం. దానిమీద వెల్లువెత్తిన ప్రజల ఆగ్రహాన్ని, ప్రశ్నల్ని పక్కదారి పట్టించడం కోసం అనుమానితులుగా వున్న నలుగురిని (అందులో ముగ్గురు మైనర్లు) విచారణ పేరుతో వారిని 6 డిసెంబర్ 2019న  ‘ఎన్ కౌంటర్’ అంటూ కాల్చి చంపేశారు పోలీసులు. నేరస్తులుగా నిరూపణ చేసి శిక్ష విధించాల్సింది (అది ఏ శిక్ష అయినా సరే) న్యాయవ్యవస్థ. కానీ నిజాలు తెలపగలిగిన అనుమానితులను అంతమొందించడం అంటే నిజాన్ని కూడా రూపు మాపడమే. నిజాన్ని రూపు మాపే పనిని తెలంగాణ పోలీసు వ్యవస్థ ఈ సంఘటనలో చేసింది. ఇది నిర్ద్వందంగా మానవహక్కుల ఉల్లంఘనే. స్త్రీలపై జరిగే హింసకు పరిష్కారాలు సమాజంలోని అన్ని వ్యవస్థలను ప్రజాస్వామికీకరించి, వాటిని బలోపేతం చేయటం, రక్షణ వ్యవస్థలను ఏర్పరచడం,  విద్యావిధానం నుంచీ మీడియా వరకూ చైతన్యవంతం చేయటం ద్వారా చేయాలి తప్పించి, సత్వర న్యాయం పేరు మీద పోలీసులకు అపరిమిత అధికారాలను ఇవ్వటం ప్రమాదకరమని విస్పష్టంగా ప్రకటిస్తూ, పోలీసులు చెబుతున్న ‘ఎన్కౌంటర్’ కథ మీద విచారణ జరపాలని కోరుతూ అదే రోజు సాయంత్రం భిన్న వృత్తుల్లో వున్న దాదాపు ఇరవైరెండు మందిమి కలిసి ‘మహిళా, ట్రాన్స్ జెండర్ సంఘాల, వ్యక్తుల ఐక్య కార్యాచరణ వేదిక’ తరఫున తెలంగాణ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి ఉత్తరం రాశాము. దీనిలో సంధ్య, దేవి, మీరా సంఘమిత్ర, విమల, పద్మజ షా, ఝాన్సీ తదితరులు వున్నారు. మరణించిన వ్యక్తుల శరీరాలను భద్రపరిచి మళ్లీ ఒకసారి పోస్ట్ మార్టం చేయాలని, ఎన్కౌంటర్ కు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపించాలని కోరాము. మా విజ్ఞప్తి ని స్వీకరించిన తెలంగాణ హై కోర్ట్ దానిని ప్రజా ప్రయోజన వాజ్యంగా (పిల్)గా మార్చి విచారణ ప్రారంభించింది. ఆ తర్వాత ఇదే విషయమై సుప్రీం కోర్ట్ లో దాఖలైన ఒక పిల్ కారణంగా ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ విచారణ కమిషన్ ని విశ్రాంత న్యాయమూర్తి వి.ఎస్.సిర్పుర్కర్ నేతృత్వంలో సుప్రీమ్ కోర్ట్ నియమించింది. దీనిలో సభ్యులుగా విశ్రాంత న్యాయమూర్తి రేఖా పి సొందుర్ బల్దోతా తో పాటు విశ్రాంత సిబిఐ ముఖ్యాధికారి డా.డి.ఆర్.కార్తికేయన్ (రాజీవ్ గాంధి హత్య కేసును విచారణ చేసి న్యాయస్థానం ముందు నేరస్తులను నిలబెట్టిన అధికారి)వున్నారు. కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్ల సమయం తీసుకున్న ఈ విచారణ పూర్తి అయ్యింది. హై కోర్ట్ లో పిటిషన్ వేసిన అందరి తరఫున నేను ఒక సామాజిక కార్యకర్తగా కమిషన్ ముందు జరిగిన అంశాలపై సాక్షిగా పాల్గొని వాంగ్మూలం ఇచ్చాను. మా తరఫున లీగల్ కౌన్సిల్ గా వసుధ, వ్రింద గ్రోవర్ పనిచేశారు. మేము ఏవయితే అనుమానాలను వ్యక్తం చేస్తూ హై కోర్ట్ కి, సుప్రీమ్ కోర్ట్ కి వెళ్ళామో వాటిని ధృవపరుస్తూ ఎన్కౌంటర్ కట్టుకథ అని ఆధారాలతో సహా కమిషన్ తన ఎంక్వయిరీ లో తేల్చి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు కేసుని తెలంగాణ హై కోర్ట్ పరిథిలోనే న్యాయవిచారణ చేయాలని సుప్రీమ్ కోర్ట్ ఆదేశించింది. హై కోర్ట్ లో వాదవివాదాలు ప్రారంభమయ్యాయి. నేరం చేసిన పోలీసు అధికారులకు శిక్ష పడుతుందా, బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందా అనేది మనముందున్న ప్రశ్న.

వినోదిని: చిలకలూరిపేట బస్సు దహనం కేసులో నిందితులైన చలపతి, విజయవర్ధనరావుల ఉరిశిక్ష సందర్భంలో మీరు ఒక డాక్యుమెంటరీ తీశారు కదా.. దాని గురించి చెప్పండి?

సజయ : ఇది 1993 మార్చిలో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన. సినిమాల ప్రభావంతో అడ్డదారిలో డబ్బు సంపాదించాలని, పేదరికాన్ని వదిలించుకోవాలని ఇద్దరు దళిత యువకులు చలపతిరావు, విజయవర్ధన్లు  ఒక బస్సులో దొంగతనం చేయాలని తీసుకున్నబాధ్యతారాహిత్య నిర్ణయం ప్రమాదవశాత్తూ ఇరవై మూడుమంది ప్రాణాలు అన్యాయంగా పోవటానికి కారణమయింది. ఏ సామాజిక, కుల, ధన, రాజకీయ అండాలేని ఈ  నేరస్తులిద్దరినీ ఒక వారంలోపలే పోలీసులు అరెస్ట్ చేశారు. 1995లో గుంటూరు సెషన్స్ కోర్ట్ లో జూన్లో విచారణ మొదలై సెప్టెంబర్లో ఉరిశిక్ష తీర్పుతో ముగిసింది. ఆ తీర్పుని నవంబర్లో హై కోర్ట్ ఆమోదించింది. 1996 ఆగస్ట్ లో సుప్రీమ్ కోర్ట్ కూడా అదే తీర్పుని ధ్రువీకరించింది. వారిద్దరినీ సెప్టెంబర్ లో ఉరి తీయటానికి అన్ని సన్నాహాలూ జరిగాయి. జరిగిన నేరాన్ని ఎవరూ సమర్ధించలేదు. వారికి చట్టపరంగా శిక్ష పడకూడదని కూడా ఎవరూ వాదించలేదు. కానీ, విచారణ జరిగిన తీరు మీద, మన దేశంలో మరణశిక్షల ఔచిత్యం మీద అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ పౌరహక్కుల న్యాయవాది బి. చంద్రశేఖర్ ఈ విషయాన్ని ప్రజాసమూహంలోకి తీసుకువచ్చారు. వారిద్దరి ఉరిశిక్షను రద్దుచేసి, జీవితఖైదుగా మార్చాలని పౌరహక్కుల సంఘం చేపట్టిన కాంపైన్ ను అనేకమంది విమర్శించారు. ఇరవైమూడు మంది మరణానికి కారణమైన ‘ఈ ఇద్దరినీ ఉరితీస్తే తప్పించి రాష్ట్రంలో నేరాలు ఆగవు’ అని ఆవేశంగా ఎంతోమంది వాదించారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్ లో 1985 లో కమ్మ భూస్వాముల చేతిలో కారంచేడు మాదిగలు ఊచకోతకు గురయ్యి దశాబ్ద కాలం. హంతకులు కుల, ధన, రాజకీయ బలంతో దర్జాగా బయట తిరుగుతున్నారు. 1991లో చుండూరు రెడ్ల చేతిలో మాలలపై జరిగిన మారణకాండ ఇంకా పచ్చిగానే వుంది. ఈ నేపథ్యంలో  ‘ఆ ఇద్దర్నీ క్షమించలేమా’ అంటూ కె.శ్రీనివాస్ ఆంద్ర జ్యోతిలో రాసిన వ్యాసం ఆలోచనాపరుల్ని తట్టిలేపింది. ‘దళితులకేనా ఉరిశిక్ష- కారంచేడు, చుండూరు హంతకులు ఎక్కడ’ అంటూ ప్రజా పోరాట యోధుడు కె.జి.సత్యమూర్తి గారు ఇచ్చిన పిలుపు అనేకమందిని కదిలించింది. బాలగోపాల్, మల్లేపల్లి లక్ష్మయ్య లాంటి వారి నాయకత్వంలో ఈ ఇద్దరి ఉరిశిక్ష రద్దుచేయాలనే ఉద్యమం రాష్ట్రంలో వివిధ రూపాల్లో ఊపందుకుంది. దానిలో హైదరాబాద్ నుంచీ  చంద్రశ్రీ, జంగా గౌతం, సౌదా, అరుణ, యువక, తెరేష్ బాబు, ఆర్.ఎం.ఉమా మహేశ్వరరావు, సమత రోష్ని, అంబిక, అనంత్, లెల్లె సురేష్, మద్దెల శాంతయ్య, కోయి కోటేశ్వరరావు, నామాడి శ్రీధర్, జి.ఎస్.రామ్మోహన్, శ్రీశైల్ రెడ్డి, కుమారి, రమేష్, నేను ఇంకా అనేకమందిమి ఒక టీం గా చురుగ్గా పాల్గొన్నాము. దాదాపు  ఆంధ్రప్రదేశ్ లోని అనేక పట్టణాల్లో ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ అనేక సభలు జరిగాయి. చాలావాటిలో నేనూ వక్తగా పాల్గొన్నాను. అలా పాల్గొంటున్న సందర్భంలో ఈ విషయం మీద డాక్యుమెంటరీ ఫిల్మ్ చేస్తే బావుంటుందనే ఆలోచన వచ్చింది. అప్పటికే డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణంలో అపార అనుభవం వున్న డైరెక్టర్ మొయిద్ హసన్ (హైదరాబాద్ లోని ‘లామకాన్’ ఈయన ఇల్లే)కి నేను తెలుగు అనువాద సహాయం చేస్తున్నాను. ఆయనతో కలిసి నేను, అంబిక  ‘హాంగ్ ద నూస్’ పేరుతో డాక్యుమెంటరీ మొదలుపెట్టాము. అప్పటికి ఉరిశిక్ష పడిన ఆ ఇద్దరు యువకులు రాజమండ్రి జైలులో వున్నారు. వారి మీద ఇంకా ఉరిశిక్ష రేపో మాపో అన్నట్లుగా అమలుకోసం వేచివుంది. జైలు అధికారులు వారిని కలవటానికి మాకు అనుమతి ఇవ్వలేదు. వారిద్దరినీ ఇంటర్వ్యూ చేయటానికి అనుమతి ఇవ్వమని హై కోర్ట్ కి వెళ్ళాం. మా తరఫున సీనియర్ లాయర్ వి.వి.ఎస్.రావుగారు వాదించారు. హై కోర్ట్ నుంచి కేవలం ఒక గంట కోసం అనుమతి వచ్చింది. రాజమండ్రి జైలులో వారిద్దరినీ వీడియో ఇంటర్వ్యూ చేశాం. ఉరిశిక్ష పడ్డ ఖైదీలను, ఆ శిక్ష అమలు కోసం వేచివున్న సమయంలోనే జైలులో వీడియో ఇంటర్వ్యూ చేయటం అనేది బహుశా ఇదే మొదటిది కావొచ్చు. ఆ ఇద్దరు యువకులు చిన్నప్పటి నుంచీ పెరిగిన గుంటూరు కోబాల్ట్ పేట పరిసరాలు, వారి బంధువులతో పాటు, మరణించిన బాధితుల కుటుంబీకులను కూడా ఇంటర్వ్యూ చేశాము. కారంచేడు బాధితుల అభిప్రాయాలను కూడా రికార్డు చేశాం. ఫిల్మ్ పూర్తి కావటానికి దాదాపు మూడున్నర సంవత్సరాలు పట్టింది. ఈలోపల వారిద్దరికి క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి రెండుసార్లు విజ్ఞాపన వెళ్లింది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మహాశ్వేతాదేవి వారిద్దరికీ ఉరిశిక్ష నుంచీ క్షమాభిక్ష ఇవ్వమని నాటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ కి విజ్ఞప్తి చేశారు. ఇన్ని ప్రయత్నాల తర్వాత వారిద్దరి ఉరిశిక్షని మరణించేవరకూ జీవితఖైదుగా మార్చారు. ఆ ఇద్దరూ ఇప్పటికీ జైలులోనే వున్నారు.

అతి తక్కువ ఆర్ధిక వనరులతోనే డాక్యుమెంటరి మొదలుపెట్టాం. కొండవీటి సత్యవతి, కుప్పిలి పద్మ, ఏలే లక్ష్మణ్, రామకృష్ణారెడ్డి, ఇంకా అనేకమంది మిత్రులు వివిధ దశల్లో ఆర్ధిక తోడ్పాటు నందించారు. కొన్ని సాంకేతిక కారణాలరీత్యా ఈ ఫిల్మ్ ఇప్పుడు అందుబాటులో లేదు. దానిని మళ్లీ తిరిగి ఎడిట్ చేయాల్సి వుంది.  దీనితర్వాత, పంచాయితీ ఎన్నికల్లో స్త్రీలు, 2000 సంవత్సరం హైదరాబాద్ వరదలు, ఆహార భద్రత-ఆకలిచావులు, రైతు ఆత్మహత్యలు, బుద్దిజం, జైనిజం(డిగ్రీ విద్యార్థుల కోసం) మీద కూడా డాక్యుమెంటరీలు చేశాను.

వినోదిని: “లిఖిత ప్రెస్” పేరుతో పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నారు కదా… “లిఖిత ప్రెస్” ప్రత్యేకత ఏంటి? ఎలాంటి పుస్తకాలు వేస్తున్నారు?

సజయ : సాహిత్య, సామాజిక అంశాల మీద మాకున్న అభిరుచి మేరకు మా వెసులుబాటు ప్రకారం పుస్తకాలను ప్రచురించాలని ‘లిఖిత ప్రెస్’ ప్రచురణలని 2000 సంవత్సరంలో నేనూ, వొమ్మి రమేష్ బాబు, ఫాంట్ లైన్ గ్రాఫిక్స్ నిర్మలగారూ కలిసి మొదలుపెట్టాం. సాహిత్యంలో వచన ప్రధానంగా వివిధ ప్రక్రియలతో వుండే రచనలకు, ముఖ్యంగా కథా సంపుటాలకు ప్రాధాన్యమిస్తూ వచ్చాము. కుల, పితృస్వామ్య, రాజ్య అధికార స్వభావాల్ని వివరించే ‘సందిగ్ధ-రాజస్థానీ జానపద కథలు’ మా మొదటి పుస్తకం. కె.సురేష్ (మంచిపుస్తకం) అనువాదం చేశారు. మా ప్రయాణం ఎలా వుండాలనుకున్నామో ఈ పుస్తకం వివరిస్తుంది. ఇప్పటికీ దాదాపు ఇరవై పుస్తకాలు ప్రచురించాము. ఇంకా అనేక పుస్తకాలు పరిశీలనకు వచ్చినా గానీ ఆర్థికభారం వల్ల అన్నిటినీ ప్రచురించే పరిస్థితి లేదు. ప్రచురించిన అన్నిటికీ మార్కెట్ వుంటుందనే భరోసా వుండదు. కొన్ని పుస్తకాలు బాగా అమ్ముడవుతాయి. కొన్ని కావు. వాటిని సమతూకం చేస్తూ మరీ ఎక్కువ నష్టాల్లోకి వెళ్ళకుండా నడిపిస్తున్నాము. ఏ పుస్తకమైనా పాఠకుల్లో  ప్రజాస్వామ్య ఆలోచనలను, ప్రశ్నలను రేకెత్తించేదిగా ఉండాలనేది మా ఉద్దేశం.

 

వినోదిని: మీరు వైవిధ్యమైన పనులు చేస్తున్నారు.. రైటర్ గా, యాక్టివిస్టుగా, జర్నలిస్టుగా, పబ్లిషర్ గా ..! ఈ పనులని, టైంని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?

సజయ : అన్నిటికంటే కష్టమైన ప్రశ్న ఇదే. అన్నీ బ్యాలెన్స్ చేయాలనుకుంటాం కానీ చేయలేం. ఇన్ని సంవత్సరాల నుంచీ ‘కాలమ్’ రాస్తున్నా గానీ అన్నీ చివరి నిముషంలోనే రాయడం అవుతుంది. ముందు ప్లాన్ చేసుకుని తీరిగ్గా రాయడం అనేది సాధ్యం కాదు. ఎప్పుడో ఒకసారి అలాంటి అరుదైన సందర్భం వుంటుంది. అనువాదాలు, కాపీ ఎడిటింగ్, పుస్తకాల ప్రచురణ లాంటి బాధ్యతలు పెట్టుకున్నప్పుడు మాత్రం వాటికోసం ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయం కేటాయించుకోవలసిందే. సాధారణంగా అలాంటి పనులు వున్నప్పుడు నేను తెల్లవారుజాము మూడూ నాలుగు మధ్యలో లేచి ఆపకుండా రెండు మూడు గంటలు పనిచేసి కొద్దిసేపు మళ్లీ పడుకుంటాను. అప్పుడు మాత్రమే ఇంట్లో ఏ అడ్డంకీ లేకుండా వుండే సమయం. ఆ సమయంలో ఏ ఫోన్లూ కూడా రావు కాబట్టి ఏ ఆటంకం లేకుండా పనిచేసుకోవచ్చు. కానీ, నిద్ర త్యాగం చేయాల్సి వుంటుంది. ఆ రొటీన్ కి అలవాటు పడటం ఒక సమస్య అయితే, పని పూర్తయ్యే వరకూ మధ్యలో ఏ అడ్డంకీ రాకుండా చూసుకోవటం మరో సమస్య. కానీ, సరిగ్గా మనకు సమయం అవసరమైనప్పుడే అడ్డంకులూ, అవరోధాలు మేమున్నామని పరిగెత్తుకుంటూ వచ్చి ఊపిరాడకుండా వాటేసుకుంటాయి.

యాక్టివిస్ట్ గా ఉండటమంటే అనేక ఊహించని అంశాలలోకి మన జీవితం వెళ్ళిపోవటానికి అవకాశం ఇవ్వటమే.  ఒక్కోసారి విక్టిమ్స్ ఎవరికోసం మన సమయం వెచ్చిస్తున్నామో వారి వైపు నుంచీ విపరీతమైన విమర్శలు, ఒక్కోసారి తీవ్ర దూషణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వారి యాంగ్జైటినీ భరిస్తూనే, వోపికతో స్పష్టంగా మాట్లాడాలి. అయినా అర్థం చేసుకోక పోవచ్చు. అవసరమైనప్పుడు రోజుల తరబడి బాధితుల్ని ఇంట్లోనే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఇంకో కొత్త ట్రెండ్ సోషల్ మీడియా ట్రోలింగ్ బారిన పడటం. కుటుంబ హింస, అత్యాచారాలు, మానసిక ఆరోగ్యం, రైతు ఆత్మహత్యల కుటుంబాలు, కులాంతర మతాంతర వివాహాల్లో ఏర్పడే సంఘర్షణల మీద కౌన్సిలింగ్ చేయటం అంత సులభమైన విషయం కాదు. ఎంతో సమయం వెచ్చించాల్సి వుంటుంది. మనం చేసే ప్రతీ పని ప్రభావం మనతో జీవించే కుటుంబ సభ్యులపై వుంటుంది. ఫీల్డ్ వర్క్ వుంటే దూర ప్రయాణాల వల్ల కుటుంబంలో ఎంతో ముఖ్యమైనవాటికి హాజరు కాలేని పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఇంటా, బయటా అన్నిటినీ సమన్వయం చేసుకోవాలనుకోవటమే వొత్తిడిని పెంచుతుంది. చేసే పనులన్నీ దాదాపు ‘ప్రోబోనో’ కాబట్టి కొన్నివిషయాల్లో ఆర్ధికంగా కుటుంబ సభ్యుల మీద ఆధారపడాల్సి వుంటుంది. అది ఒక ఊపిరాడని పరిస్థితి.

చాలాసార్లు ఏమవుతుందంటే ఒకవిషయం మీద జర్నలిస్ట్ గా రాద్దామనుకునే సమయానికి, యాక్టివిస్ట్ గా పూర్తిగా భిన్నమైన ఇంకో విషయంలో దృష్టి పెట్టాల్సి రావొచ్చు. అప్పుడు రెండూ చేయటం అనేది అసాధ్యం. ఇలాంటి సందిగ్ధాలు చాలా తరచూ ఎదురవుతాయి నాకు.

వినోదిని: కోవిడ్ సందర్భంలో చాలా పనిచేశారు కదా..ఏమేం చేశారు? అ పనులు ఇంకా కొనసాగుతున్నాయా?

ప్రజాతంత్ర దినపత్రికలో కోవిడ్ ప్రారంభం నుంచీ రెండో దశ సమయం వరకూ ప్రభుత్వం తీసుకోవాల్సిన వివిధ వ్యవస్థాగత అంశాలకు సంబంధించి దాదాపు పది వ్యాసాలు రాశాను. రాయటంతో పాటుగా వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లటానికి, వారికి కనీసావసరాలు అందించటానికి హైదరాబాద్లో పౌర సమాజంగా అనేక కార్యక్రమాలు చేశాము. ఆరోగ్యపరమైన అవగాహన కోసం సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించాము. కోవిడ్ బారిన పడినవారిని భయం నుంచీ బయటపడవేయటానికి, భరోసా కల్పించటానికి గంటల తరబడి ఒక్కొక్కరితో మాట్లాడాము. కోవిడ్ లాక్ డౌన్ తదనంతరం కూడా వలస కార్మికులకు సంబంధించి వివిధ అంశాలలో సమష్టి కార్యాచరణలో పని నడుస్తోంది. కోవిడ్ సమయంలో మేము చేసిన పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో ‘సారంగ’ లోనే 2020 లోనే మూడు భాగాలుగా ఒక పెద్ద వ్యాసం రాశాను. ఆసక్తి వున్నవాళ్లు ఆ వ్యాసం ఇక్కడ పాత సంచికల్లో చూడొచ్చు.

నావరకూ కోవిడ్ కి సంబంధించి రెండు అంశాలు వున్నాయి. ఒకటి వ్యక్తిగతం. రెండు సమష్టి కార్యాచరణ. రెండోది ఆగదు. ఎవరు వున్నా లేకపోయినా అవి జరుగుతూనే వుంటాయి. మనం వుంటేనే జరుగుతాయనే భ్రమలు వుండాల్సిన అవసరం లేదు. మనకి వీలు వున్నప్పుడు ఆ పనిలో మళ్లీ భాగస్వామ్యమయ్యే స్నేహ సంబంధాలు నిలుపుకోవాలి.

మొదటిదానికి వస్తే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రెండో వేవ్ లో దాదాపు మా కుటుంబం అంతా దానిబారిన పడ్డాం. కానీ, దురదృష్టం ఏమిటంటే మేమందరం బయటపడ్డాము కానీ, మా అమ్మని కాపాడుకోలేకపోయాము. కుటుంబాలలో అమ్మలే అన్నిటికీ త్యాగం చేస్తారు. వున్నప్పుడు విలువ తెలియదు. పోయిన తర్వాత ఆ నష్టం పూడ్చగలిగేది కాదు. అప్పటివరకూ సజావుగా నడిచినట్లుండే సంబంధాలూ, వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయి. అమ్మ చనిపోయిన తర్వాత 82 సంవత్సరాల నాన్న మా దగ్గరికి వచ్చేశారు. ఆయనకి ఐదారేళ్ళ నుంచీ పార్కిన్సన్స్ వల్ల చేతుల్లో విపరీతమయిన వణుకు వుంటుంది. దీనికితోడు అమ్మ పోయిన డిప్రెషన్ ఆయన్ని వదలలేదు. పదిహేనేళ్ల క్రితం జరిగిన కారు యాక్సిడెంట్ లో ఆయనకి ఒక కాలు బాగా దెబ్బతిన్నాగానీ చేతి కర్ర సాయంతో బాగానే నడిచేవారు. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత పక్కన ఎవరూ లేకుండా నడిచే పరిస్థితి పోయింది. ఇప్పుడు ఇంట్లోనే కాలుజారి పడటంతో మళ్లీ అదే కాలుకి ఫ్రాక్చర్ అయి సర్జరీ అనివార్యమయింది. నాలుగు నెలల నుంచీ పూర్తిగా మంచం మీదే వున్నారు. ఎమర్జెన్సీ ముందు సమయం నుంచీ  పౌరహక్కుల కోసం పనిచేశారు.  మాకు సామాజిక అంశాల్ని, చందమామ, బాలమిత్ర, రష్యన్, చైనీస్ పిల్లల సాహిత్యాన్ని, శరత్, డిటెక్టివ్ సాహిత్యాన్ని పరిచయం చేసిన వ్యక్తి. ఇప్పుడు ఆరోగ్యం బాలేక ఇంకొకరి మీద ఆధారపడే పరిస్థితిలోకి వెళ్లిపోయారు. ఆయన్ని చూసుకోవటానికి పూర్తికాలం ఒక హెల్పర్ వున్నాగానీ ఆయనకి సంబంధించిన అన్ని పనుల సమన్వయం బాధ్యతంతా రమేషే చూస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో తను పూర్తికాలం ఉద్యోగంలోకి వెళ్లటానికి వెసులుబాటు దొరకటం లేదు. మా ఇంట్లో అందరికంటే ముందు మొదటి దశలోనే తను కోవిడ్ బారిన పడ్డాడు. ఉద్యోగానికి అప్పుడు తీసుకున్న విరామం మా నాన్న కోసం ఇంకా కొనసాగుతోంది.

జెరియాట్రిక్ కేర్ అనేది ఎంత పెద్ద విషయమో, అందులో మగవాళ్ళని చూసుకోవటం ఎంత బరువైన బాధ్యతో, ఎంత ఘర్షణ వుంటుందో మాకు అనుభవంలోకి వచ్చింది. నాన్న వృద్ధాప్యంతో పాటు, శారీరిక, మానసిక ఆరోగ్యఅంశాలు ఇమిడివున్న సంక్లిష్టత మాది. స్పర్శ్ హాస్పైస్, రామకృష్ణా హోం కేర్ సర్వీసెస్, హెల్పింగ్ హాండ్స్ లాంటి సంస్థల సేవలు సమాజానికి ఎంత అవసరమో ప్రత్యక్షంగా అర్థం చేసుకోగలిగాము. వీరందరి సహకారం ఎంత విలువైనవి అని చెప్పటానికి మాటలు సరిపోవు. ఇప్పుడు నాన్న వున్నంతకాలం శారీరికంగా, మానసికంగా సాధ్యమయినంత నెప్పి లేకుండా చూసుకోవడం అనేది మా ఇద్దరి ముందున్న సవాలు.

వినోదిని : మీరిన్ని కార్యక్రమాలు చేస్తూ బిజీగా వుంటారు కదా…మీ సహచరుడు ప్రముఖ రచయిత వొమ్మి రమేష్ బాబు సహకారం ఎలా వుంటుంది? భవిష్యత్ కార్యాచరణ ఏమిటి?

సజయ : ఇది ఒకటి రెండు మాటల్లో చెప్పలేను. ఏ కుటుంబ సంబంధమైనా అనేక సంక్లిష్ట అంశాలతో ముడిపడి వుంటుంది. రెండున్నర దశాబ్దాల సహజీవనంలో పరస్పర అవగాహన, ప్రేమ, నమ్మకం, గౌరవం తో పాటు కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు, పట్టుదలలు, కోపాలు కూడా సర్వసాధారణం మా ఇద్దరికి. రెండు భిన్న సామాజిక కుల నేపధ్యాల నుంచీ వచ్చిన వ్యక్తులు ఒక దగ్గర కలిసి జీవితం పంచుకునే సందర్భంలో ఎన్నో సాంస్కృతిక అంశాల తేడా వుంటుంది. వాటి పట్ల జాగరూకత అవసరం. ఆ జాగ్రత్తని ఇద్దరం పాటిస్తాము. అంతే కాదు, లిఖిత ప్రెస్ కి సంబంధించిన పనులు కూడా పెరుగుతున్నాయి. ఎంత అవగాహన వున్నా గానీ ఒక్కోసారి రోజువారీ విసుగు తెప్పించే తప్పని పనులు, అనుకోకుండా వచ్చిపడే కొన్ని తప్పని పనులు మా ఇద్దరి వోపికని పరీక్షిస్తూ కోపాన్ని తెప్పిస్తూ వుంటాయి. ఇప్పుడు కుటుంబం వున్న సంక్షోభంలో మా పనిని కొన్ని సర్దుబాట్లతో సజావుగా నడిచేలా చూసుకోవటం కూడా కత్తి మీద సాములా వుంది.

రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, పైన వివరించినట్లు దాదాపు పదినెలల నుంచీ నా ఆరోగ్యంతో సహా ఇంట్లో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితిని కొంచం కష్టమైనా గానీ వోర్చుకుంటున్నాడు. అదీ మానవ సంబంధాల్లో, స్నేహాల్లో తనకున్న కమిట్మెంట్. తన పరిచయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా తనని బాగా ఇష్టపడతారు.

భవిష్యత్ కార్యాచరణ అంటే, కోవిడ్ తదనంతర ఆరోగ్య సమస్యల వల్ల, ‘కార్పొల్ టన్నెల్ సిండ్రోమ్’ వల్ల నా కుడి అరచేతికి ఆపరేషన్ అవటంతో  పత్రికలలో రాసే ‘కాలమ్’ లకు చాలా ఎక్కువ అంతరాయమే  వచ్చింది. తొందరలోనే మొదలు పెట్టటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకో రెండు పుస్తకాలు అనువాదం కోసం ఎదురుగా వున్నాయి. లిఖిత ప్రెస్ నుంచీ రావలసిన ప్రచురణలు, పునర్ముద్రణలు వున్నాయి. మళ్లీ ఒక క్రమం లోకి రావటానికి నేనూ, రమేష్ ప్రయత్నం చేస్తూ వున్నాము.

*

వినోదిని

31 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సజయ, చరిత్ర ఎంతగా చెట్టాపట్టాలేసుకుని నడుస్తున్నారో ఈ వ్యాసం మళ్ళీ కళ్ళకి కట్టింది.

  • చాల విషయాలు వివరంగా చెప్పినారు మేడం
    మంచి ఇంటర్వ్యూ మేడం

  • ‘సిగ్గు, అవమానం, దుఃఖం, ఉద్వేగం, కోపం…అన్నీ కలగలిసిపోయిన ఊపిరాడని పరిస్థితి’ లో ఉన్న అశుద్ధ భారత్ దగ్గర ఆగిపోకుండా సోషల్ యాక్టీవిస్ట్ వివిధ రంగాల్లో సజయ చేసిన చేస్తున్న ప్రయాణాన్ని ఈ ముఖాముఖి కవర్ చేసింది.
    వినోదిని మాత్రమే చేయగలిగిన ఇంటర్వ్యూ.

  • సామాజిక కార్యకర్తకు నిజమయిన అర్థం మీ జీవితం. సజయ గారి స్ఫూర్తి వంతమయిన జీవితాన్ని అద్భుతంగ ఫోకస్ చేసిన గొప్ప ఇంటర్వూ

    • సంజయ్ గారి సామాజిక సేవా జీవితం ఎంతోమందికి స్పూర్తి దాయకం…వినోధిని గారికి ధన్యవాదాలు మంచి ఇంటర్వ్యూ ను అందించినందుకు 🙏🙏🤝🤝

  • అదృశ్య జీవితాలకు దక్కిన అరుదైన గౌరవం
    సజయ గారు మీరు ఇంకా చీకటి లో మగ్గి పోతున్న బతుకుల ను మీ అక్షరాల ద్వారా వెలుగు లోకి రావాలని కోరుకుంటూ మంచి మనిషి ని ఇంటర్వూ చేశావు వినోదిని నాకు ఈ బుక్ కావాలి జై భీం
    మీ మేరీ మాదిగ తార్నాక హైదరాబాద్ 9848147259

    • థాంక్యూ మేరీ. Navodaya book house , కాచి గూడ x roads దగ్గర పుస్తకం దొరుకుతుంది.

  • అదృశ్య జీవితాలకు దక్కిన అరుదైన గౌరవం
    సజయ గారు మీరు ఇంకా చీకటి లో మగ్గి పోతున్న బతుకుల ను మీ అక్షరాల ద్వారా వెలుగు లోకి రావాలని కోరుకుంటూ మంచి మనిషి ని ఇంటర్వూ చేశావు వినోదిని నాకు ఈ బుక్ కావాలి జై భీం
    మీ మేరీ మాదిగ తార్నాక హైదరాబాద్ 9848147259

  • సజయగారికి ముందుగా హృదయపూర్వక అభినందనలు. విపులంగా, వివరంగా, విస్తృతంగా ఉంది ముఖాముఖి. 1984లో నేను హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరే ముందు కూడా మా బందరులో కొన్ని ఇళ్లలో ఈ పాకీ పని చేసేవారు వచ్చేవారు. నేను నలిగిపోయేవాణ్ణి నిస్సహాయంగా! అంతెందుకు మా మామయ్య వాళ్ల ఇంటి గోడకే మనిషి పట్టేంత చిన్న hole ఉండేది. అందులో మనిషి ముడుచుకుపోయి లోపలికెళ్లి అశుద్ధాన్ని తీసుకుని చిన్న తోపుడు బండిలో వేసుకుని వెళ్లేవారు. ఇప్పటికీ ఆ దృశ్యం నా కళ్లలో మెదులుతోంది. ఓ ఆర్నెల్లు జీతం తీసుకునే ఉద్యోగి ఆత్మ విశ్వాసం వచ్చాక ఇంకా అలాగే ఉంటే చితక్కొట్టెయ్యాలి ఇంట్లో వాళ్లని అనుకుంటూ బందరెళ్లా! పరిస్థితులు మారి ఆధునిక పాయిఖానాలతో కొంచెం మారింది బందరు. సజయగారికి, ప్రొ.వినోదినిగారికి, నా అభిమాన అంతర్జాల పత్రిక ‘సారంగ’కు మరోసారి అభినందనలు. స్ఫూర్తినిచ్చే ముఖాముఖికి కృతజ్ఞతలు.

    • థాంక్యూ చల్లా రామఫణి గారు. 2005 సంవత్సరం వరకూ చాలా పట్టణాల్లో అదే పరిస్థితి. మధ్యతరగతి సెప్టిక్ ట్యాంక్ లు పెట్టించుకున్నారు కానీ అవి నిండిపోతే మళ్లీ వీళ్ళే చేతులతో శుభ్రం చేయాలి. ట్యాంకర్లు వచ్చినా గానీ. సమస్య రూపాలు మార్చుకుంటోంది కానీ పరిష్కారం మాత్రం రాలేదు.

  • ఇంటర్వ్యూ చాలా బాగుంది. అశుద్ధభారత్ పుస్తక నేపథ్యము, దాని అనువాద అనుభవాలతో పాటు సామాజిక కార్యకర్తగా, రచయిత్రిగా ,అనువాదకురాలుగా సజయ అందించిన అనేక రకాల సేవలు గురించి తెలియజేయడమే కాక రచయిత్రి వినోదిని చేసిన ఈ ఇంటర్వ్యూ , సజయ బహుముఖ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించి, పాఠకులకు స్ఫూర్తి కలిగించే విధంగా ఉంది.

  • అబ్బో చాలా వివ‌రంగా ఇంట‌ర్వ్యూచేశారు. స‌జ‌య గారి కార్య‌క‌లాపాల‌న్నీ చ‌ర్చించారు. పుస్త‌క అనువాదంలో తీసుకున్న జాగ్ర‌త్త‌లు, అనుస‌రించిన ప్ర‌ణాళిక‌లు, పుస్త‌కానికి ఆ పేరే ఎందుకు పెట్టార‌న్న విష‌యాల నుంచి దాదాపు అన్ని అంశాల‌నూ స్పృశించారు. అదృశ్య‌భార‌త్‌., అన్‌సీన్‌..అశుద్ధ‌భార‌త్‌గా ఎలా రూపుదిద్దుకుందీ చాలా స్ప‌ష్టంగా చెప్పారు. సంద‌ర్భోచితంగా చేసిన ఇంట‌ర్వ్యూకు కొన‌సాగింపుగా.. వ్య‌క్తిగ‌త విష‌యాలూ, భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు అన్నీ చ‌ర్చించ‌డం బాగుంది. అభినంద‌న‌లు స‌జ‌య‌గారు, మిత్రుడు ఒమ్మి ర‌మేష్‌గారికి కూడా శుభాకాంక్ష‌లు. వినోదిని గారు ఇంట‌ర్వ్యూ బాగా చేశారు..బాగా రాశారు!

  • చాలా మంచి ఇంటర్వ్యూ. సజయ గారి వ్యక్తిత్వం అవిడచేస్తున్న వివిధ కార్యక్రమాలు వివరంగా తెలిపారు. వినోడిని గారు అడిగిన ప్రశ్నల వరస కూడా సజయ గారి గురించి బాగా తెలుసుకునే అవకాశం దొరికింది

    ఇద్దరికీ అభినందనలు

  • సజయ మేడం గారికి ముందుగా కృతజ్ఞతలు..మీ సంపూర్ణ జీవితాన్ని సమీక్షిoచినట్లుగా ఉంది ఈ ఇంటర్వ్యూ. మీ గురించి మరింతగా తెలుసుకునే అవకాశం ఈ ఇంటర్వ్యూ ద్వారా కలిగింది.
    “విలక్షణ వ్యక్తిత్వానికి ప్రతీక” మీరు. ఇంటర్వ్యూ చేసిన వినోదిని మేడం గారికీ.. కూడా కృతజ్ఞతలు.

  • ‘ఒళ్ళూ, మనసు చాలా శుభ్రంగా ఉంచుకుంటాం’ అని మనని నమ్మించుకునే మనలో ఎంత పీతి కంపు (పిల్లల డయాపర్లో కనిపించని మలమూత్రాల్లాగే! తేడా మన పెద్దరికం ఒక్కటే) ఉంటుందో తెలియజేశారు. ఈ నిజాన్ని సిగ్గు పడుతూనైనా ఒప్పుకు తీరాలి.

  • ‘ఒళ్ళూ, మనసు చాలా శుభ్రంగా ఉంచుకుంటాం’ అని మనని నమ్మించుకునే మనలోపల ఎంత పీతి కంపు (పైకి ఫ్రెష్ గా కనిపించే పిల్లల డయాపర్లో దాగిన మలమూత్రాల్లాగే! తేడా పెద్దరికం ఒక్కటే!) ఉంటుందో తెలియజేశారు. ఈ నిజాన్ని సిగ్గు పడుతూనైనా ఒప్పుకు తీరాలి.

  • చాలా మంచి ఇంటర్వ్యూ. మంచి విషయాలు చర్చించారు. జీవితాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీరు మంచి ఉదాహరణ. ఇలాంటి పుస్తకాలు అనువాదం చేయడమే గొప్ప! ఎందుకంటే దాన్ని చదవడానికే ఎక్కువ మంది ఆధునికులు ఇష్ట పడరు. ఆ పేరు విని పారిపోతారు. మీరు ఎంతైనా అభినందనీయులు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు