సత్యం వైపు తిప్పే సౌదా కథలు

చాలా ఏళ్ల కిందట రాణి శివశంకర్ రాసిన లాస్ట్ బ్రాహ్మిన్ పుస్తకం చదివాక ఆ పుస్తకం వేసిన సౌదా  మరో పుస్తకం అపూర్వ పురాణ గాధలు కూడా నా చేతికి వచ్చింది.
ఎలా వచ్చిందో ఎవరు ఇచ్చారో కూడా నాకు ఇప్పుడు గుర్తు లేదు కానీ దాదాపు ఇరవై ఏళ్లు అయ్యుంటుంది. వచ్చిన కొద్ది రోజుల తర్వాత లాస్ట్ బ్రాహ్మిన్ లాంటి పుస్తకం వేసిన పబ్లిషర్ కథలు ఎలా ఉంటాయి అన్న కుతూహలంతో పుస్తకం తీశాను.
మొదటి కథే బర్బరీకుడు నన్ను అనేక భావాలతో  ఉక్కిరిబిక్కిరి చేసింది.
 ఇక ముందుకు వెళ్ళలేకపోయాను మళ్ళీ మళ్ళీ చాలా సార్లు అదే చదివాను. చాలామందితో పంచుకున్నాను. తర్వాత మిగతా కథలన్నీ కూడా చదివాను. ప్రతి కథ ఒక కొత్త వెలుగు. ఒక కొత్త విద్యుల్లత.
ఇన్నాళ్ల తర్వాత కూడా ఆ శైలి గాని, ఆ వాక్య నిర్మాణం కానీ, వాటి లోతులు గాని, వాటన్నింటినీ మించిన సునిశితమైన ఆ సూక్ష్మ విషయావగాహన గాని ఏమీ నాకు పాత పడలేదు. మళ్లీ చదువు కుంటే ఇంకా కొత్తగానే ఉంది.
దాని గురించి మనం నాలుగు మాటలు మాట్లాడుకుందాం. నిజానికి ఈ మధ్యకాలంలో బర్బరీకుడు కథను నాటకంగా మలిచారని, హైదరాబాదు లాంటి చోట్ల చాలా ప్రదర్శనలు కూడా ఇచ్చారని విన్నాను అలా ఎందరికో ఈ కథ తెలుసునేమో కానీ నాకు ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది.
ఇందులో భీముడి కొడుకు బర్పరీకుడిగా పరిచయం అవుతాడు. ఇతను అడవుల్లో ఒంటరిగా ఉంటూ అన్ని విద్యల్లోనూ  ఆరి తేరుతూ సాక్షాత్తు కృష్ణున్నే తన దగ్గరకు వచ్చేలా చేసుకుంటాడు. అంటే వేణు గానంతో. అసలు ఆ సన్నివేశమే మనని పులకింప చేస్తుంది.
కృష్ణుడికి ఎక్కడి నుంచో వేణు గానం వినిపిస్తోంది, అది తన వేణు గానాన్ని మించి ఉందట. అంతే ఎలా ఉన్నవాడు అలా బయలుదేరు వెళ్ళిపోయాడు. నల్లని నిగనిగలాడే ఒంటికి నూనె రాసుకుని వ్యాయామం చేస్తున్నవాడు అలానే… కస్తూరీ తిలకం శ్లోకంలో చెప్పిన ఈ అలంకారాలేవీ లేవు. ఎత్తున కొండకొమ్ములో ఉన్న బర్బరీకుడిని లోయ లోంచి చూశాడు. దగ్గరికి చేరి కొనగోటితో ఆ వెదురు బొంగును  కొద్దిగా సరి చేశాడు. అంతే స్వరం మరింత సవ్యమైన రీతిలో పలికింది.
ఇదంతా సౌదా కళ్ళకు కట్టినట్టు రాస్తారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య సంభాషణ, బర్బరీకుడి అస్త్రశస్త్ర నైపుణ్య ప్రదర్శన  ఏ పురాణం లోను కనీ వినీ ఎరగని రీతిలో సౌదా రాస్తారు.
కృష్ణుడు ఏది నీ విద్య ప్రదర్శించు అన్నాట్ట. ఆ సందర్భం లో ఈ మాటలు రాస్తారు.
“ఆ మనిషి ఒక గెంతులో ఒక చెట్టు కింద నుంచి విల్లు, అమ్ములపొది, శూలము, గదా, కత్తీ తీసుకొచ్చి శ్రీకృష్ణుడు ముందు పడేసి ఏ విద్య చూపను అన్నాడు.
 శ్రీకృష్ణుడు నవ్వి విల్లందుకొని, ఎక్కు పెట్టి బిట్టు నారిసారించి, ధనుష్టంకారం చేసి ఉరుములను, మెరుపులను మేల్కొలిపి విల్లును అతను చేతికి ఇచ్చాడు.
ఆ కారు నలుపు మనిషి అయిన బర్బరీకుడు వింటికి బాణం ఎక్కు పెట్టి మింటను మెరిసిన మెరుపును కొట్టాడు.
అది రాలి శ్రీకృష్ణుని పాదాల ముందు పడింది. కింద పడిన మెరుపును తిరిగి శూలంతో మబ్బుల మధ్య కు విసిరేసాడు. ఇదంతా మెరుపు అంత వేగంతో జరిగిపోయింది. “
ఇది బర్బరీకుడి శస్త్రం నైపుణ్యం. ఇక కృష్ణుడిని ఆ కొండమీది జలపాతం కిందనుంచి కిందకు తీసుకొచ్చాడు. ఎలాగాఅంటే అంత పెద్ద జలపాతం మధ్య నుంచి ఇద్దరి మీదా చుక్క తడి తగలకుండా, కత్తిని గిర్రున తిప్పుతూ, గొడుగు పట్టే ఛాత్ర విద్య ప్రయోగించి కృష్ణుడిని మైదానం మీదకి తీసుకొచ్చాడు.
ఇది కృష్ణుడిని ఆశ్చర్యానికి లోను చేసి అతనిని పరిచయం చేసుకునేలా చేసింది.  కృష్ణుడు బర్బరీకుడి ఆహ్వానాన్నిఅప్పటికి తిరస్కరించాడు.
ఎప్పుడో నీ దగ్గరికి వస్తాను సమయం వచ్చినప్పుడు నాకు కావాల్సింది నిన్ను అడక్కుండానే నీ దగ్గర నుంచి తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది ఒక సన్నివేశం.
రెండవ సన్నివేశంలో ధర్మరాజు యుద్ధకాంక్ష, కృష్ణుడి విఫలమైన సంధి ప్రయత్నం, యుద్ధ ఆరంభం.
ఆరంభంలో ఒక వీరుడిని  బలి ఇస్తేనే మీకు విజయం కలుగుతుందని బ్రహ్మ చెప్పాడు వీరులు ముగ్గురే ఉన్నారు. శ్రీకృష్ణుడు, అర్జునుడు, పాండవులకు అడగకుండానే సహాయం చేయటానికి వచ్చిన బర్బరీకుడు.
ముగ్గురి లో బలి కి ఒక్క భీముడు తప్ప అందరి ఓటూ బర్బరీకుడికే కదా. బర్బరీకుడు ఆనందంగా అంగీకరించాడు.
కానీ కృష్ణుడిని కొన్ని ప్రశ్నలు అడగాలని అంతా నిజమే చెప్పాలని అడిగాడు.
ఆ ప్రశ్నలు జవాబులు చాలా విలువైనవి. తరతరాల పీడకుల పీడితుల చరిత్రకు సమాధానాలు ఆ చిన్న ప్రశ్నల్లోనూ సమాధానాల్లోనూ దాగి ఉండేలాగా రాయటం సౌదా గారి అసమాన ప్రతిభకు నిదర్శనం.
నేను ఆ ప్రశ్నలూ సమాధానాలూ ఇక్కడ రాయకుండా ఉండలేను. ప్రశ్న బర్బరీకుడిది. సమాధానం కృష్ణుడిది.
రాజ్యం ఎవరిది?
 క్షత్రియులది
రాజ్యం ఎవరికి?
క్షత్రియులకు
ఈ రాజ్యానికి మేము ఏమవుతాం?
 బలి పశువులు
ఈ రాజ్యం వల్ల మాకు ఎప్పుడు సుఖం?
రాజ్యం మీదైనప్పుడు
 రాజ్యం మాది ఎప్పుడు అవుతుంది? క్షత్రియులు మరణించినప్పుడు
క్షత్రియులు ఎట్లా మరణిస్తారు?
మీరు చంపినప్పుడు
ఆ రోజు ఎప్పుడు?
 తెలీదు
 నా తండ్రి భీమసేనుడు క్షత్రియుడు కనుక నేను క్షత్రియుడను కానా?
 అది భీమసేనుడి మగతనాన్ని తెలుపుతుంది కానీ నీ కులాన్ని కాదు
 నన్ను ఎందుకు బలిస్తున్నారు?
 ఈ యుద్ధ వేదిక క్షత్రియ  పరాక్రమ ప్రదర్శన కోసమే కానీ నీలాంటి వారికి కాదు ఆ గెలుపోవటముల ప్రదర్శనలో క్షత్రియుడి వెనుక నువ్వు ఉండాలి కానీ నీ వెనక క్షత్రియుడు కాదు.
కృష్ణా దీనిని నువ్వు అంగీకరిస్తున్నావా? సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను
అన్నప్పుడు బర్బరీకుడు కృష్ణుడిని “నిన్ను తెలుసుకోలేకపోతున్నాను” అంటాడు.
దానికి కృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు.
 “నువ్వు స్వతంత్రుడిగా పుట్టావు. కానీ ఇక్కడికి పాలేరుగా వచ్చావు. ఎవడి రాజ్యం కోసమో బలి కావడానికి వచ్చావు. నువ్వు కోరుకున్నదే నీకు ఇచ్చాను. నువ్వు రావలసింది బానిసగా కాదు. ఇదేనా అంతరార్థం” అన్నాడు
ఆ మాటతో బర్బరీకుడు “ఇప్పుడు నాకు సంపూర్ణజ్ఞానం కలిగింది. అయినా మాట ఇచ్చాను కాబట్టి తప్పను కానీ యుద్ధం జరిగినంత కాలం శరీరం నుంచి వేరైనా నా తల ప్రాణంతో ఉండి ఆకాశం నుంచి యుద్ధం అంతా చూసేలాగా వరవివ్వమని ”  అడిగాడు.
18 రోజుల కురుపాండవ సంగ్రామం. అన్నదమ్ముల మధ్య అధికారం చేతులు మారింది.  అంతా చూసి బర్బరీకుడి తల అన్యాయం అంటూ నేలరాలింది.
ఇక్కడ సౌదా ఎంతో పెద్ద విషయాన్ని చిన్న చిన్న మాటల్లో అదీ అందరికీ తెలిసిన పురాణ కథ ద్వారా వినిర్మించారు.
ఈ అధికారాలు అన్నదమ్ముల మధ్య చేతులు మారటం అన్న అంశం, వారి సేవకులు అక్కడే పడి ఉండడం అనే సంగతీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎంతగా సరిపోయే విషయాలు.
 అవి అలా ఉంచితే చివరికి వచ్చేసరికి వైరాగ్యంతోఅడవిలో ఒంటరిగా పడుకున్న కృష్ణుడి అతడి ఎర్రటి పాదాన్ని దూరం నుంచి చూసి పక్షిగా భ్రమపడి ఒక నలుపు వాడు బాణంతో కొట్టేడట.
అప్పుడు కృష్ణుడు అతన్ని ఇలా ప్రశ్నించాడు.
నేనని తెలిసి వేసావా తెలియక వేసావా? అని. ఆ నల్లవాడు “తెలియక వేశాను స్వామీ” అన్నాడట.
“తెలిసి వేసేది ఎప్పుడు నువ్వు?” అని చెప్పి శ్రీకృష్ణుడు కన్నుమూశాడు. అని సౌదా  కథ పూర్తి చేస్తారు.
ఆ చిట్టచివరి వాక్యం చదవగానే నాకు ఒళ్ళు ఝల్లుమంది. ఈ ప్రశ్నలో ఎంతో ఉంది. తరచి చూసుకుంటూ వెళ్లే కొద్దీ బర్బరీకుడి దగ్గర నుంచి అటువంటి అనేకమందికి ఒక హెచ్చరిక ఉంది. ఒక ప్రోత్సాహం ఉంది. తమను తాము గమనించుకోమని, తమ బానిసత్వం బయట వారి కంటే తాము కల్పించుకుంటున్నదే ఎక్కువ అని, దాని నుంచి తామే బయటపడే ప్రయత్నం చెయ్యక తప్పదని, ఇలా ఎంతైనా చెప్పుకోవచ్చు.
ఇదంతా చెప్పటానికి చాలా అందమైన భాషలో సున్నితంగా ఎక్కడా ఏ పాత్రల తాలూకు ఔచిత్య అనౌచిత్యాల జోలికి పోకుండా వాటిని అలాగే ఉంచుతూ ఆ మధ్యలో ఉన్న ఖాళీలను మాత్రం పోరాట స్ఫూర్తితో పూరిస్తూ రాసిన కథలు.
ఇలా పురాణ గాథలనే అపూర్వంగా చేసిన కథలుఇవి.
ఇలాగే సీత, ఊర్మిళ కథలు ఉంటాయి. జనాపవాదానికి భయపడి రాముడు సీతను అడవికి పంపినప్పుడు లక్ష్మణుడు సీతను  అడవిలో వదులుతూ రథం లో కుక్కిన మూటలా ఉన్నాడట.
అతని మొహం చూసి సీత ఇలా అడిగింది “నాయనా లక్ష్మణా, పాప కార్యం చేయబోయే పాపిలా కనిపిస్తున్నావు. ఇట్టి మగవారి మొగం ఆడదానికి దుశ్శకునం అంటుంది.
ఇంకా ఇలా “నాకు జరగనున్న అరిష్టాన్ని అడగడం కోసం కాదు నీలో నీ పాప భారాన్ని దించి నిన్ను స్వస్థ పరచడం కోసం అడుగుతున్నాను నిజం చెప్పు” అంటుంది.
 ఈ ప్రశ్నలన్నీ అడిగిన తర్వాత  ఇంటికి పోయి మర్నాడు ఊర్మిళను తీసుకుని తిరిగి అడవికి వస్తాడు. అప్పుడు సీత కు ఊర్మిళ చెప్పిన మాటలు నిజంగా చెప్పుకోవాల్సినవి.” స్త్రీ పతివ్రతగా ఉందా లేదా అని కాదు లోకం చూసేది. ఆమె పతివ్రతగా కనిపించిందా లేదా అని. నువ్వు ఎంత తీవ్రంగా పతివ్రతం చేసినా పతివ్రతగా కనిపించడంలో దెబ్బతిన్నావు. అది నీ దురదృష్టం. అదే నువ్వు అంతఃపురంలో గుట్టుగా కాపురం చేస్తూ ఉండగా ఎవరికి తెలియకుండా మాయోపాయంతో అపహరణకు గురై ఉన్నావనుకో. ఏమై ఉండేది అంతపురం తల్లడిల్లి ఉండేది. నువ్వు అదృశ్యమైన విషయాన్ని కడుపులో పెట్టుకుని కుమిలుతో ఉండేది. సీత ఏమైంది? అంటే రాముని తలుచుకొని నిద్రపోతోంది అనే సమాధానం వచ్చి ఉండేది. ఎందుకంటే అప్పుడది అంతపురం రహస్యంకనుక .
ఏం మాటలు అండి ఇవి !!!
ఇలా చెప్పి ఊర్మిళ తన 14 ఏళ్ల నిద్రలో తాను కన్న కల చెబుతుంది.
తను ఆ కలలో అంతపురంలో లేదట. ఒక బంగారు ఊయలలో తన స్వామితో ఆకాశంలో విహరించింది. ఆనంద లోకాలలో తెలియాడింది. తాను అంతఃపురంలో లేదన్న విషయం అతి ముఖ్యులకు తప్ప ఎవరికీ తెలీదు. అయోధ్య వాసులంతా ఊర్మిళాదేవి అంతఃపురంలో నిద్రపోతుందని నిద్రా భంగం కలగకుండా నెమ్మదిగా మాట్లాడుకుంటూ, దీపాలు ఆరి పోకుండా నిత్యం పవిత్రంగా చూసుకుంటున్నారు.
కానీ నేను అంతపురంలో లేను.  పధ్నాలుగు ఏళ్ల తర్వాత తిరిగి అంతపురం చేరాను.
తేడా ఎక్కడ ఉందంటే నన్ను అంతఃపురంలోకి తీసుకొచ్చిన చెలికత్తల వయసులోనే.
వాళ్ళు 14 ఏళ్లు ముసలి వాళ్ళై ఉన్నారు.  అని ఊర్మిళ తో చెప్పిస్తారు. ఈ ఊర్మిళ మాటలు అన్నీ కూడా ఎంత సత్యాలో అంత నిష్ఠురమైనవి కూడా.
ఆమె 14 ఏళ్ళు ఊహాలోకంలో విహరించిందా బయట ప్రపంచంలో విహరించిందా? అన్నది ప్రతీకాత్మకం. అది అంతఃపుర రహస్యం.
లోక రీతి స్త్రీల విషయంలో ఇలాగే ఉంటుంది సుమా అని ఊర్మిళ చెప్తేనే గాని సీతకి అర్థం కాలేదు.
ఇలా ఒక్కొక్క కథని ఏవో మార్మికమైన లోతులలోకి తీసుకువెళ్లి, మనం ఏమరిచిన సత్యం వైపు మనని తిప్పటమే పని గా సౌదా  రాశారు.
నిజానికి ప్రతి ఒక్క కథ కూడా దాని తాలూకు ఆ సంభాషలన్ని వివరిస్తూ ఇలా వ్యాసాలు రాయాలనిపించేలాగా ఉన్నాయి.
 కానీ పుస్తకం చదువుకున్న వాళ్ళు సరే, చదువుకోని వాళ్ళు సంపాదించి చదువుకోవటంలోనే వాళ్ళ ఆనందం అంతాఉంది.
కొత్త విషయాలకు కళ్ళు తెరుచుకున్నాం అన్న చైతన్యపూరితమైన  సంతోషమంతా నిండి ఉంటుంది దాన్ని తగ్గించడం నాకు ఇష్టం లేదు.
*

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కొన్ని కథలే సత్యదర్శనం చేయిస్తాయి.అవి కథల ప్రయోజనాన్ని దాటి మానవ వ్యక్తిగత, సామాజిక ఉనికిని శుద్ధి చేస్తాయి.అలాంటివి వచ్చినపుడు మీ కలం ఇలా ప్రవహిస్తుంది.ఆ జల కోసం మాలాంటి వాళ్ళం ఎదురుచూస్తూ ఉంటాము.నమస్సులు రచయిత కు,మీకూ.

    • చాలా బావుంది వివరణ
      ఆలోచనలు ఆకాశమంత అనంతమైనవి
      వాటిని ఎలాగైనా అన్వయించుకోవచ్చు ను.

  • ఎంత గొప్పగా వివరించారు వీరలక్ష్మి గారు.
    నేను ఆ పుస్తకం చదవలేదు, కాని చదివినట్టు అనిపించేలా వ్రాయడం మీ గొప్పదనం.
    బర్భరీకుని గురించి కొంత తెలుసు కున్నాను.
    చాలా కాలం తర్వాత మీరు వ్రాసిన సమీక్ష చదివే భాగ్యం కలిగింది.
    రాజమండ్రి (ఇండియా) వదిలాక మళ్ళీ ఇదే మీగురించి తెలిసిన వార్త 🙏🏻
    T. T. Nageswara Rao, Rtd. Principal.
    SanJose, CA, USA

  • పురా కథలు చదివినపుడు ఆ రచనాశైలి అద్భుతం అనిపించింది. సరళ సుందరంగా స్పష్టంగా వాక్యాలు పరుగెడతాయి. మీరు పరిచయం చేసింది కూడా అంతే బావుంది. నా ఇంటి గ్రంథాలయంలో దొరకపుచ్చుకుని మళ్ళీ సౌదా బైండు పుస్తకం చదువుతాను. అభినందనలు.

  • ది లాస్ట్ బ్రాహ్మిన్ చదువుతున్నప్పుడు, చదివాక గుండె అంతా పట్టేసినట్టనిపించింది. నవలా చరిత్ర లో ఎప్పటికీ దానిదో ప్రత్యేక స్థానమే. సౌదా గారి ఈ కథల పుస్తకం నేను చదవలేదు. మీ విశ్లేషణ లో బర్బరీకుడు కృష్ణుణ్ణి వేసిన ప్రశ్నలు చూస్తే దిమ్మతిరిగి పోయింది. అవి ప్రశ్నలా! సమాజానికి ఎక్కుపెట్టిన బాణాలు. కృష్ణుడు ఆ నల్లవాడిని వాడిని “తెలుసుకొని ఎప్పుడు వేస్తావు” అన్న ప్రశ్నకు సమాధానం మన తరం లో వింటామా!
    పుస్తకం సంపాదించి చదివే వరకు ఇక ఏమీ తోచేట్టు లేకుండా చేసారు మీరు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు