లోసారి సుధాకర్ కవితలు రెండు

1

మౌన సంవాదం

ఇప్పుడు ఇక్కడ గొంతు విప్పడం కుదరదు
శబ్దం నిషేధం కదా
శబ్దంతో పాటు చలనం కూడా
చలనం అంటే చైతన్యం కదా

చైతన్యం ఇక్కడ నిషేధం
చైతన్యంతో పాటు చూపు కూడా
చూపు అంటే ఎరుపు కదా

ఎరుపు ఇక్కడ నిషేధం
ఎరుపు అంటే ఒట్టి వర్ణం కాదు కదా
తరతరాల అణచివేతలోంచి

యుగ యుగాల బానిసత్వం లోంచి
పెల్లుబికిన అగ్ని గోళం కదా…
అగ్ని ఆయుధం కలిసే వేళ
రుధిరం మౌన సంవాదం

2

కొత్తపాట

ఎవరో ఢంకా  మోగిస్తున్నారు
ఎవరో శంఖాలు పూరిస్తున్నారు
శబ్దాలు రాజుకొంటున్నాయి

గుండెలు హోరేత్తే
ఒక నినాదం
గూడాలలో వాడలలో  నగరాల్లో  వీధుల్లో వేదికల్లో
గొంతెత్తుతున్నారు

ఎవరో నరనరాన్ని స్వరం చేసి ఒక నిజాన్ని
నగరాల్లోకి నడి వీధుల్లోకి ఆలపిస్తున్నారు
ఎవరో పసిపాప ఏడ్పును పాటగా అందుకుంది
ఎవరో చంటిది అమ్మ కొంగును జెండాగా ఊపుతుంది

ఎవరో ఇంకెవరో ఏదో కొత్తను రాగం తీస్తున్నారు
సమాధి చేసిన సత్యాన్ని వెలికి తీస్తున్నారు
పురాతనం నుంచి పునాదుల నుంచి
ఒక కొత్త గొంతుకను తవ్వి వెలుగెత్తుతున్నారు

రండి అలా కిటికీలు తెరిచి వోరగా చూద్దాం
అలా తలుపులు తెరచి తెరచాటుగానైనా నిలబడదాం

అలా గడపదాటి
ఒక అడుగు వీధుల్లోకి
ఒక్కొక్కటిగా వేస్తూ పదం పదం కలుపుదాం
సమూహాలుగా సాగుదాం

ఒక శక్తిని
ఒక ధైర్యాన్ని పాదుకొల్పి
ముందుతరానికి  సరి కొత్తరాగాన్ని అందిద్దాం

*

 

 

లోసారి సుధాకర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అన్నా! రెండు కవితలు చాలా బాగున్నాయి.. ఇంత మంచి కవితలు ప్రచురించిన సారంగాకు హృదయపూర్వక ధన్యవాదాలు..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు