రాస్తాననీ ఎప్పుడూ అనుకోలేదు: వైష్ణవి శ్రీ

ఇంట్లో తిండి గింజలు లేక వస్తులున్న రోజులూ లేకపోలేదు.

నేను పుట్టింది హనుమాన్ జంక్షన్.
అప్పట్లో అమ్మ పదవతరగతి వరకూ చదివింది. నాన్న మెకానిక్ పని చేసేవారు. చిన్నతనంలో ఎక్కువగా కృష్ణా జిల్లా పల్లెర్లమూడిలో అమ్మమ్మ తాతయ్య దగ్గరే పెరిగాను. చిన్నప్పటి నుంచీ చదువంటే ప్రాణం పెట్టేదాన్ని. తెలుగు ..హిందీ..ఇంగ్లీష్ ..ఫస్ట్ మార్క్ లు వచ్చేవి. లెక్కలు బాగా చేసేదాన్ని. అక్కడే పదవతరగతి వరకూ చదివాను. చదువులో వెనుక ఉండటం నాకసలు నచ్చేది కాదు. ఎప్పటికప్పుడు పోటీతత్వంతోనే చదివేదాన్ని. అమ్మ ..మామయ్య ఇంటి దగ్గర కూర్చోబెట్టుకుని తెలియని విషయాలు చెబుతూ చదివించేవారు. చిన్నప్పటి నుంచీ చందమామ. బాలమిత్ర ..స్వాతి పుస్తకాలు బాగా చదివేదాన్ని..అమ్మ..నాన్న ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో ఉండేవారు.మాది మధ్య తరగతి కుటుంబం కావడంతో పది పూర్తయిన తర్వాత ఇంటర్ సత్తుపల్లి గవర్నమెంట్ కాలేజీలో చదివాను. అమ్మ ఒక చిన్న కాన్వెంట్ లో టీచర్ గా పని చేసేది.
ఇంట్లో తిండి గింజలు లేక వస్తులున్న రోజులూ లేకపోలేదు. ఇంటి దగ్గర నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని..అలా చిన్నప్పటీ నుంచీ టీచింగ్ అలవాటు..ఇష్టం కూడా ఏర్పడింది. అప్పడే అమ్మ సులోచనారాణి..యండమూరి నవలలు బాగా చదివేది..అలా గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు తీసుకురావడం అమ్మతో పాటూ నేనూ చదవడం ఒక అలవాటుగా మారిపోయిందనే చెప్పాలి. సంప్రదాయాలు ..నైతిక విలువలు ఇవే అప్పటి ఆస్తులు.ఇంటర్ తరువాత పెళ్లి..ఆ తర్వాత పిల్లలూ కుటుంబ బాధ్యతలూ పెరిగాయి..మా అత్తగారు వాళ్లది వ్యవసాయ కుటుంబం..దీంతో వ్యవసాయ పనులూ చేసేదాన్ని..చదువుకున్నానుగా ఈ పని చెయ్యకూడదు అని ఎప్పుడూ అనుకునేదాన్ని కాను..ఇంకా చాలా ఇష్టంగా చేసేదాన్ని. కానీ చదువుకోవాలనే ఆశ మాత్రం చావలేదు. తర్వాత వ్యాపారా రీత్యా మేము  వైజాగ్ వెళ్లాం. దీంతో ఎ యు లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ .. బి ఎ హిందీ చేశాను..తర్వాత హిందీ పండిట్ రెగ్యులర్..అనకాపల్లిలో చేశాను..టీచర్ ట్రైనింగ్ పూర్తయ్యాక ఎమ్ ఎ హిందీ చదవాలన్న ఆశతో పిజీ కూడా పూర్తి చేశాను.వైజాగ్ లోనే హోటల్ మేనేజ్ మెంట్ కోర్స్ కూడా చేశాను.
కొన్నాళ్లు ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిెచేశాను. ప్రస్తుతం 2017 నుంచీ ప్రజాశక్తి..ఫీచర్స్ లో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నాను. మా వారు ఆర్మీలో చేసి అక్కడే కాలు ఫ్రాక్చర్ అవడంతో సర్వీస్ పూర్తి కాకుండానే బైటకు వచ్చేసారు.పాప..బాబు ఇద్దరు పిల్లలు.
కవిత్వం అంటే చెప్పలేనంత ఇష్టమే కానీ రాస్తాననీ ఎప్పుడూ అనుకోలేదు. 2015 లో ఫేస్ బుక్ ఎకౌంట్ తీసుకున్నాక కొన్ని గృూప్స్ లో పోటీకి  రాసేదాన్ని.అలా కవిత్వం వైపు దృష్టి మళ్లింది.దీంతో రాయడం రోజూ చదవటం ఒక దినచర్యగా మారింది. సమాజంలో జరిగే అనేక రుగ్మతలను చూసినప్పుడు విన్నప్పుడు..ఏదో తెలియని బాధ..కసితో మనసు సతమవుతూంటుంది..ఆ కసిలోనుంచి. ఆ బాధలో నుంచే నాలుగు అక్షరాలు పట్టుకొస్తాయి. కార్మికలు కర్షకులు..దీనులు..బడుగువర్గాలు…స్ర్తీల జీవితాలను.. బాధలను..కష్టాలను  చూసినప్పుడు రాయకుండా ఉండలేం.
శ్రీ శ్రీ ,సుబద్రాకుమారీ చౌహాన్, సుమిత్రానందన్ పంత్..ప్రేమ్ చంద్ ..సాహిత్యమంటే చాలా ఇష్టపడతాను..చిన్నప్పటి నుంచీ సమాజానికి నా వంతుగా ఏదైనా చెయ్యాలనే తపన ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే బంధువులు ..మిత్రులు  .ఇరుగు పొరుగులు ..అనాధలు ఎవరైనా సరే నాకు తోచిన సహాయం చేస్తాను..అదినాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది..ఇందులో నుంచి పుట్టుకొచ్చిందే నా కవిత్వం కూడా.  2019 లోనే “ఏడవ రుతువు” కవితా సంకలం తీసుకొచ్చాను. నేను పెద్ద కవయిత్రిని కాను..కాకపోతే నా అక్షరాలకు ఒక రూపం నా కవితా సంకలనం అంతే..

నీరైనా నిప్పైనా

నిలకడ ఉన్నంత వరకే
మానైనా మనిషైనా ఊపిరున్నంతవరకే
నీటికి ఎదురీదితే
మునిగిపోయేది మనమే
నిప్పును ఆదమరచి  పట్టుకున్నా
నిలువునా కాలిపోయేది మనమే
చిన్నా పెద్దా..బీద బిక్కీ
రాజు  ఎవరైతేనేమి
గుప్పెడు మెతుకుల పోరాటమే అందరిదీ
ఇంత నీడ కోసమే అందరి ఆరాటం
వజ్రపు సింహాసనాన్ని మోస్తున్నది
సామాన్య ప్రజలేనని మర్చిపోకు
ఎన్ని రక్త తర్పణలు
ఎన్ని ప్రాణాల బలిదానాల బరువును
మోస్తోందో నీ అధికారం
ఒక్కసారి వెన్నును తడుము
పూసలు జారిపోయే కన్నీటి కథలు
పుంఖాలు పుంఖాలుగా బైటకొస్తాయి
బీటలు వారిన నేలపై
రత్నాలు కురిపించిన చేతులే అన్నీ
అధికారం కోసం
ప్రాణార్పలను కోరుతున్నావు
అన్నం పెట్టిన చేతిని నరుక్కుంటున్నావు
శ్రామికుల గుండె చప్పుడుతో
బంగారం పండిన నేల కదా ఇది
ఇప్పుడు రక్తపు చుక్కల దాహపుటేరులా మారిందెందుకో
అధికారమంటే వాగ్దానాల మూట కాదు
మాయలు పకీరు మంత్రమూ కాదు
మా మనిషని చెప్పుకునే భరోసా
గుండెను పల్లకీ చేసుకున్నవాళ్లెప్పుడూ
బోయీలు కారు
గుండెకు కళ్లను కట్టుకుని ఒకసారి కిందికి చూడు
నేనున్నానని వారికింత భరోసానివ్వు చాలు
నెత్తుటి పాదాలు
నిన్ను నెత్తిన మోసేందుకు సిద్ధంగా ఉంటాయి
నీరు నిప్పంత నిలకడగా ఉంటాయి.

కవిత వెనక:

శ్రామికుడి లేని సమాజాన్ని చూడలేం..ఈ సృష్టిలో ప్రతి వస్తువుకీ శ్రామికుడికీ అవినాభావ సంబంధం ఉంటుంది. అయినప్పటికీ కష్టానికి తగిన ఫలితం లేదు. ప్రజల కష్టాలను తీర్చవలసిన రాజులే ..వారిని కనికరం లేకుండా కష్టాల్లోకి తోసేస్తున్నారు. లాభనష్టాల బేరీజులో కార్మికులను తూకం వేస్తున్నారు. అందలాలు ఎక్కించిన చేతులనే నరుకుతున్నారు. ఎన్నాళ్లిలా బానిస బతుకులు. ఈ పెట్టుబడీదారి వ్యవస్థ సమాజాన్ని ఎటు తీసుకెళ్తోంది? ఏమిటీ వింత పోకడలు..మా రాజువి ..మహారాజువి అన్నన్నాళ్లూ ఈ పోకడలు ఇలాగే సాగుతాయనుకుంట..నేల విడిచి సాగు చేస్తే ..ఏం మిగులుతుంది..రేపటి రోజున మన నాయకుల పరిస్థితీ అదేనని వేరే చెప్పేదేముంది..మనవంతుగానైనా శ్రామికుల పక్షాన నిలబడాలన్నదే నా ఆరాటం..ఆ ఆరాటమే ఈ నా.. నీరూ..నిప్పు..

వైష్ణవి శ్రీ

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ కవిత నీరైనా నిప్పైనా బావుంది.
    జీవితం వడ్డించిన విస్తరి కాదని మీ జీవితానుభవమే చెప్తోంది… అలాంటి వాళ్లు మనలా రాటుదేలలేరు. కష్టాలకడగండ్లను బాధల వడగల్లను ఎదుర్కొని నిలువలేరు
    హేట్సాప్ వైష్ణవిశ్రీ

  • మీ నిజాయితీ నచ్చే విషయం. అది మీ మాటల్లోనూ, కవిత్వంలోనూ ఈజీగా దొరికిపోతుంది.

    మీరింకా ఇంకా రాయాలని కోరుకుంటున్నాను.

  • మీ కవితలెప్పుడూ నిఖార్సయినా వాక్యాలతో సూటిగా నిలదీస్తుంటాయన్న విషయం అందరికీ పరిచయమే.కాని మీ గురించి తెలుసుకోవడం నిజంగా బావుంది.. అభినందనలు వైష్ణవి గారు.మీ రచనలు ఇకపై కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్బాను

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు