‘చిన్నపిల్లలైనా పెద్ద మనసుతో పనిచేశార్రా’

అప్పటికి నాకు ఇంగ్లిష్ సాహిత్యం పరిచయమే కాలేదు, తెలుగు కవిత్వం కూడా అంతగా అర్థమయ్యేది కాదు.

3

మారాకు వేసింది

ఆరోజుల్లో – అంటే స్వాతంత్య్రానికి కాస్త ముందూవెనుకా – వ్యవసాయమూ చదువులూ ఒక ఆవృత్తంలో కలిసికట్టుగా సాగేవి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు వ్యవసాయ పనులేమీ ఎక్కువగా ఉండవు. పొలం పనులకు కావలసిన పరికరాలు బాగుచేసుకోవడం, వచ్చేది వానకాలం కనుక ఇళ్ల గోడలు, పైకప్పులు మరామ్మత్తు చేసుకోవడం, కావలసిన వంటచెరకు, కందులు, మినుములు, పెసలు, నువ్వుల పంటలను జాగ్రత్త చేసుకోవడం వంటివి చేసుకునేవారు రైతు కుటుంబాలు. మామిడితోటల్లో పనులు ముమ్మరమయ్యేవి. ఎండలు ముదిరినప్పుడు వేడికి అల్లాడిపోయేవారు.ఉదయం, సాయంత్రం పనులు ముగించుకుని మధ్యాహ్న వేళంతా ఇంటిపట్టునే ఉండేవారు.

ఎండలు కాస్త ముదురుతున్నాయనగా ఏప్రిల్లో చదువులు పూర్తిచేసి వార్షిక పరీక్షలు రాసి విద్యార్థులు ఇళ్లకు చేరుకునేవారు. ఫలితాల కోసం ఎదురుచూపులు వేసవిని మరింత మండించేవి. రేడియో, టీవీ, సినిమాలు ఏవీ అందుబాటులో ఉండక కాలం గొప్ప భారంగా గడిచేది. మే మొదట్లోనో, రెండో వారంలోనో పరీక్షల ఫలితాలు వచ్చేవి. ఎస్ ఎస్ ఎల్ సీ మొదలుకొని డిగ్రీల వరకూ ఇదే ధోరణి. ఫలితాలను దినపత్రికల్లో ప్రచురించేవారు. దినపత్రికలు అందే చోటులో ఉంటే సరేగాని, అవి ఆలస్యమవుతున్న కొద్దీ విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగిపోయేది. మర్నాడుదయం తమ నెంబరు చూసుకునేవరకూ వారిలో చెప్పరానంత ఆదుర్దా ఉండేది.

ఫలితాలు వచ్చాక, వచ్చిన మార్కులను బట్టి, విద్యార్థి భవితవ్యం ఏమిటనేది కుటుంబమంతా కలిసి కూర్చుని నిర్ణయించేది. మంచి మార్కులు వస్తే, కుటుంబ పరిస్థితి అనుమతిస్తే విద్యార్థులు పై చదువులకు వెళ్లేవారు, కాలేజీ మెట్లెక్కేవారు. ఫెయిలయినా, ఫీజులు కట్టలేని పరిస్థితి ఉన్నా, ఇక చదువు మాట మర్చిపోవాల్సిందే. ఆ రోజుల్లో పాసయ్యేది ఇరవై శాతమే. అంత కఠినంగా ఉండేవి పరీక్షలు. కాని ఫెయిలవడం అంటే ఊళ్లో, బంధుమిత్రుల్లో పరువు పోవడం. అప్పటిదాకా తల్లిదండ్రులు చేసిన త్యాగానికి విలువ లేకపోవడం. ప్రతి ఊళ్లోనూ బడి ఉండేదికాదు కనక వారు అష్టకష్టాలు పడి పిల్లలను చదివించేవారు. ఆ పైన కాలేజీకి వెళ్లాలన్నా పొలాలను తాకట్టు పెట్టి లేదా అమ్మేసి డబ్బు తెచ్చేవారు. అటువంటివి పసి హృదయాల మీద చెరగని ముద్రలు వేసేవి. దానివల్లే కొందరు పదోతరగతి ఫెయిలయితే ఆత్మహత్యలకు పాల్పడేవారు. పూర్తి జీవితానికి అది మలుపు తిప్పే సమయం గనక పదోతరగతి రాసిన వారికి ఆ వేసవి దుర్భరంగా ఉండేది.

పాసయినా కష్టాలన్నీ గట్టెక్కినట్టేం కాదు. అప్పట్లో ఉన్న కాలేజీలే తక్కువ. ఉన్నవాటిలో సీట్లు రావడం కష్టం, వాటికి తగిన డబ్బు సమకూర్చుకోవడమూ కష్టమే. ఇవన్నీ జూన్ నెలకల్లా తేలిపోవాలి. వ్యవసాయమూ అప్పుడే ఊపందుకునేది. విత్తనాలు సిద్ధం చేసుకోవాలి, రుతుపవన మేఘాలు కురవగానే నార్లు పోసుకోవాలి… అన్నిటికీ ముందు పెట్టుబడి సిద్ధం చేసుకోవాలి. మొత్తమ్మీద అటు విద్యార్థులకూ ఇటు రైతులకూ కొత్త అధ్యాయం మొదలైపోయేది.

*

మా నాన్న నేరుగా వ్యవసాయం చేసేవారుకాదుగనక మా కుటుంబానికి ఆ పనులతో అంతగా అనుసంధానం లేదు. కాని గ్రామీణ వాతావరణంలోనే ఉండేవాళ్లం గనక మేమంతా ఆ జీవనక్రమంలో భాగస్వాములమే.

ఆ ఏడాది మే మధ్యలో ఫలితాలు వచ్చాయి. నేను, అన్నయ్య కూడా పాసయ్యాం. అప్పటివరకూ మా నెత్తిమీద బరువుగా కూర్చున్న భూతం దిగిపోయింది. అతనికది మూడో ప్రయత్నం, నాది రెండో ప్రయత్నం. అవి ఫలించకపోతే ఏమవుతుందన్న ఊహకే భయపడేవాళ్లం. ఎందుకంటే పైన చెప్పినట్టు మాకంటూ వ్యవసాయ భూములేమీ లేవు. చదువు తప్ప ఆధారం లేదు. అందువల్ల మేమిద్దరం పాసయ్యామంటే కుటుంబమంతా ఊపిరి పీల్చుకుంది. పాసయినా ఇబ్బందులుంటాయని చెప్పాను కదా, అనుకున్నట్టే ఏ కాలేజీలనెంచుకోవాలి, ఏ కోర్సునెంచుకోవాలి, డబ్బు సర్దుబాటు ఎలా అవుతుందన్న మూడు సవాళ్లూ మాముందు నిలబడ్డాయి.

అప్పటికి కోస్తా ఆంధ్రలో జూనియర్ కాలేజీల సంఖ్య తక్కువ. నెల్లూరు, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, భీమవరం, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ వంటి ప్రధాన పట్టణాల్లోనే కాలేజీలుండేవి. 500 మైళ్ల ప్రాంతం పొడుగునా పట్టుమని పది కాలేజీలుండేవేమో. దాని అర్థం ఎన్నో పల్లెటూళ్లు, చిన్నటౌన్ల విద్యార్థులు ఆ పట్టణాలకు రోజూ రాకపోకలు సాగించాలి లేదా హాస్టల్లో ఉండాలి. హాస్టలంటే నెలకు ముప్ఫై రూపాయల ఖర్చు. అదేమీ చిన్నమొత్తం కాదు. అలాగ ఇద్దరికి అంటే తడిసి మోపెడవుతుంది. అప్పటికి ఎమ్మే పూర్తి చేసిన మా రెండో అక్కయ్య బి.ఎడ్. కోర్సులో చేరింది. మా వదిన కూడా అందులోనే చేరింది. అంటే మొత్తం నలుగురి చదువుల భారం మా నాన్న మీద ఉన్నదన్న మాట. కాని ఆయన దానికి సిద్ధపడ్డారు తప్ప వెనకంజ వెయ్యలేదు. అప్పటికీ మా వదిన ఫీజుల సంగతి వాళ్ల నాన్న చూసుకుంటానన్నారు. ఆ రోజుల్లో ఒక్క బిడ్డను చదివించడమే భారం అనుకునే స్థితిలో ఉండేవి కుటుంబాలు. అలాంటప్పుడు మా నాన్న చేసింది ఎంత సాహసమో పాఠకులకు అర్థమవుతుంది.

మా అన్న కొంచెం దూకుడుగా ఉండేవాడు, ఉత్సాహంగా కాకినాడ పి.ఆర్.కాలేజీలో చేరతానన్నాడు. అది దూరం, ఖర్చు కూడా ఎక్కువ. నేను కుటుంబం మీద ఆర్థిక భారం తగ్గించాలన్న ఉద్దేశంతో విజయవాడ కాలేజీలో చేరతానని చెప్పాను. 1937లో ఉయ్యూరు రాజావారు ఆ కాలేజీని స్థాపించారు, ఆయన తండ్రి శ్రీ రాజా రంగయ్య అప్పారావుగారి పేరిట దాన్ని ఎస్.ఆర్.ఆర్ కాలేజీ అనేవారు. కాని కొందరు వెటకారంగా ఆర్. ఎస్. ఎస్ కాలేజీ అనేవారు. ఎందుకంటే అక్కడి ప్రిన్సిపాల్ కు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)తో సంబంధాలుండేవని చెప్పుకునేవారు. మహాత్మాగాంధీ హత్యకు గురైనప్పుడు ఆ కాలేజీ ప్రిన్సిపాలును అరెస్టు చేసి విచారించారు. అందువల్ల ఉన్నత విద్యావంతులు ఆ కాలేజీని ఇష్టపడేవారు కాదు. కాని నేను ఎందుకు ఎంచుకున్నానంటే, ఉయ్యూరు రాజావారికి మా నాన్న, కుటుంబ పరిస్థితి బాగా తెలుసు. అందువల్ల ఫీజు మాఫీ చేస్తారని ఆశించాను. నేను ఎందుకు ఆ కాలేజీ ఎంచుకున్నానో మా నాన్నకూ తెలుసు. బయటపడలేదుగాని, మనసులో నేను తన కష్టం అర్థం చేసుకున్నందుకు అభినందించే ఉండొచ్చు.

కాలేజీలు ఎంచుకోవడం పూర్తయ్యాక, సబ్జెక్టులను ఎంచుకోవాలి. ఇంటర్మీడియెట్ అంటే అది పేరుకు తగినట్టే స్కూలు చదువుకు, ప్రొఫెషనల్ కోర్సులకూ మధ్య వారధి వంటిది. అప్పటికే సబ్జెక్టుల విషయంలో కొన్ని భావనలు సమాజంలో స్థిరపడి ఉండేవి. ఉదాహరణకు మేథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంచుకున్నవారు తెలివైనవారని, వాళ్లు ఇంజినీర్లు, డాక్టర్లు అవుతారని అందరూ అనుకునేవారు. అదే అకౌంటింగ్, హిస్టరీ, లాజిక్, తెలుగు సాహిత్యం వంటి ఎంచుకుంటే సమాజం నుంచి కాస్త చిన్నచూపు, వ్యంగ్యం ఎదుర్కోవలసి వచ్చేది. ‘నీకేం భవిష్యత్తుంది? బడి పంతులు అవడం తప్ప ముందేం బతుకుంది?’ అని మొహమ్మీదే అనేసేవారు.

మా అన్నదమ్ముల విషయానికొస్తే, మేం హైస్కూల్లోనే హిస్టరీ తీసుకున్నాంగనక ఇంటర్మీడియెట్ లో దాన్ని కొనసాగించక తప్పదు. మా అక్కయ్య అప్పటికే హిస్టరీతో బియ్యే చదువుతోంది. దానికితోడు మేమిద్దరం కూడా హిస్టరీనే అంటే, సంఘంలో మా కుటుంబ స్థాయి ఓ పదిరెట్లు కిందకు జారిపోయినట్టే. ‘ఒక్కరైనా ఇంజినీరు, డాక్టరు కారు. ఊరికే బరువు మోత తప్ప వెంటకట్రామయ్యకేం వస్తుంది, ముగ్గురు పిల్లల చదువుల భారం ఎలా లాగుతాడో ఏమిటో’ అని మా నాన్న వెనక ఇతరులు మాట్లాడుకోవడం నా చెవిన పడుతూనే ఉండేది. వాళ్లకేదో సమాధానం చెప్పాలని, వాళ్లంటున్నది తప్పని నిరూపించాలని నా మనసులో ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉండేదిగాని, ఏం చెయ్యడానికీ అశక్తుణ్ని. జీవితం విసిరే సవాళ్లకు సమాధానం చెప్పడానికి ఇంకా చాలా సమయం వేచి ఉండాలి.

ఇంటర్మీడియెట్ కోర్సు మిగిలిన జీవితానికి చేసే ప్రయాణం. ఆ సమయంలో కలిగే మార్పులు ఒకటి కాదు. అనేకం. వాటిలో మొదటిది మాధ్యమం. అప్పట్లో ఇంటర్మీడియెట్ పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో ఉండేది. అందువల్ల అప్పటివరకూ గ్రామీణ ప్రాంతాల్లో, తెలుగు మాధ్యమంలో చదివినవాళ్లకు అందులో ఇమడటం, అర్థం చేసుకోవడం కష్టం. పదోతరగతి వరకూ ఇంగ్లిష్ ఒక సబ్జెక్టు. అదికూడా బట్టీలు పట్టి, కాస్త ముక్కునపట్టి, పరీక్షలు రాసి ఏదోలాగ పాసయినవాళ్లే ఎక్కువగా ఉండేవాళ్లు. తాము చదివిన ప్రశ్నలు వస్తే అదృష్టవంతులు, ముందుకు వెళతారు, లేదంటే అక్కడితో గోవిందా.

ఇక మరో మార్పు ఇంటికి దూరంగా ఉండటం లేదా, రాకపోకలు సాగించడడం. అప్పటివరకూ పూర్తిగా తల్లిదండ్రుల కనుసన్నల్లో ఉన్న విద్యార్థులు హాస్టల్లో ఉండి దాన్ని స్వేచ్ఛగా భావిస్తుంటారు. తోటిపిల్లలతో కలిసిమెలిసి ఉండటం, కొత్త స్నేహాలు, తమ బాగోగులు తామే చూసుకోవడం వాళ్లలో రకరకాల భావాలను ప్రేరేపిస్తుంటాయి. ఈ తరహా మార్పు కొంతమందిలో సొంత వ్యక్తిత్వానికి పునాది వేస్తే, మరికొంతమందిలో దుర్వినియోగమయ్యేవి. బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా 16 – 19 మధ్య వయసే కీలకమని మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు. ఆ వయసులో మంచి స్నేహాలు దొరికితే అవి భావి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని ఆయన నమ్మేవారు.

*

ఈలోగా దేశంలోనూ, మద్రాసు ప్రెసిడెన్సీలోనూ కొన్ని పెద్ద మార్పులు జరిగాయి. గౌరవనీయులు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు నేతృత్వంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం పూర్తిస్థాయి సుస్థిరమైన ప్రభుత్వంగా ఏర్పడింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగువారే అయినా ఆయన తెలుగు మాట్లాడటం తక్కువ. కేంద్రంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. కాని అందులో ముస్లిమ్ లీగ్ ప్రతినిధులెవ్వరూ లేరు. వాళ్లు కొత్తగా ఏర్పడిన తమ మాతృభూమి పాకిస్తాన్కు మరలిపోయారు. దేశవిభజన మత కల్లోలాలను రేపింది. అటూఇటూ కొన్ని వేలమంది చనిపోయారు, మరింతమంది నిరాశ్రయులయ్యారు. వలసలు అటూఇటూ కూడా సాగాయి. శరణార్థులకు పునరావాసం అనేది కొత్త ప్రభుత్వానికి సవాలుగా మారింది. దానికితోడు కాశ్మీరులో అత్యయిక పరిస్థితి. దేశంలోని సంస్థానాల విలీనం, మరోవైపు ఆహార కొరత – ఇవన్నీ దేశాన్ని వేధించే సమస్యలే.

కౌమారబాలుడిగా నాకివన్నీ పూర్తిస్థాయిలో అర్థమయ్యేవి కాదు. కాని పత్రికలు చదివేవాణ్ని కనుక కొంత అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించేవాణ్ని. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వచ్చేవి. ఇవిగాక విజయవాడ కేంద్రంగా జన్మభూమి అనే ఒక పత్రిక, ప్రజాశక్తి అనే మరో పత్రిక వచ్చేవి. జన్మభూమి అచ్చుతప్పులకు, తద్వారా జనించే హాస్యానికి కేంద్రంగా ఉండేది. ప్రజాశక్తి పత్రికను కమ్యూనిస్ట్ పార్టీ తీసుకొచ్చేది. పరీక్ష ఫలితాలు తప్ప, మిగిలిన వార్తలన్నీ వాళ్లకు అనుకూలమైనవే వేసుకునేవారు. పార్టీ విశ్వాసపరులు దాన్ని తప్పకుండా కొనేవారు. విద్యార్థులు వేసవికాలంలో కొనేవారు, పరీక్ష ఫలితాలు నమ్మకంగా తెలుస్తాయని.

మద్రాసు ప్రావిన్సు పరిధిలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు సమాజంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టాయి.

వాటిలో మొదటిది – గాంధీజీ సిద్ధాంతాలకు కట్టుబడి అమలు చేసిన మద్యపాన నిషేధం. ఒక్క దెబ్బకు సాయంత్రాలు కళకళలాడే లిక్కరు దుకాణాలు మూతబడిపోయాయి, వాటి ఖాతాదారులు కనిపించకుండా పోయారు. ఈ దుకాణాలకు అనుబంధంగా తినుబండారాలు అమ్మేవారుండేవారు. ఉడికించిన కోడిగుడ్లు, బాతుగుడ్లు, మసాలా దట్టించి నిప్పుల మీద వేయించే మాంసం చీకులు వీటి వాసన సాయంత్రమయ్యేసరికి గాల్లో తేలుతూ ఉండేది. నాకు మాంసమంటే ఇష్టం లేదుగాని, నూనెలో వేగే చిరుతిళ్ల వాసన తట్టుకోవడం కష్టంగా ఉండేది. కాని చేతిలో పైసలుండేవికాదుగనక నేనెప్పుడూ వాటిని రుచిచూడలేదు. అదొక తీరని కోరికగా మిగిలిపోయింది.

నా మాటకేంగాని, మద్యపాన నిషేధం వల్ల ఊళ్లలో దొంగసారా వ్యాపారం పెరిగిపోయింది. అది చాలా ఘాటుగా ఉండేది. తాగకుండా ఉండలేక, తాగితే తట్టుకోలేక ఎందరో కడుపు నొప్పి, పుళ్ల బారిన పడేవారు. మా అమ్మ తరపు బంధువు ఒకరు, నాకు వరసకు మావయ్య అయ్యే వ్యక్తి వాటితోనే మరణించాడు. అతని బతుకంతా దు:ఖమే అన్నట్టుండేది. అనుమానంతో భార్యను వదిలిపెట్టాడు, కూతురు దూరమైపోయింది, తండ్రి నుంచి వచ్చిన ఆస్తులు అమ్మేశాడు, తాగుడికి బానిస అయిపోయాడు. చాలాఏళ్ల తర్వాత మా పెద్దన్నయ్య ఆయన కథతో హిందీలో నవల రాశాడు. ప్రతి ఊరులోనూ అలా మద్యానికి బానిసలైన వాళ్లు ఎందరో ఉండేవారు. సమాజాన్ని రక్షించాల్సిన పోలీసులు కూడా వారిలో ఉండటం మావంటి బాలురకు ఆశ్చర్యంగా ఉండేది.

ఇక రెండో మార్పు – ప్రభుత్వం జమీందారీ వ్యవస్థను రద్దు చెయ్యడం. 1776లో లార్డ్ కార్న్ వాలిస్ పర్మనెంట్ రెవెన్యూ సిస్టమ్ అనేదొకటి అమలు పరిచిన ఫలితంగా మన దేశంలో ఎక్కడికక్కడ జమీందారులు ఏర్పడ్డారు. ఒక్క గుంటూరును మినహాయిస్తే కోస్త జిల్లాలన్నిటా బోలెడన్ని జమిందారీలు కనిపిస్తాయి. తర్వాత సర్ థామస్ మన్రో మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలో ప్రవేశపెట్టిన రైత్వారీ పద్ధతి వల్ల కూడా ఈ వర్గం వృద్ధి చెందింది. రైతుల నుంచి భూమి శిస్తు వసూలు చేసి ప్రభుత్వానికి అప్పజెప్పాల్సిన దళారుల పాత్ర పోషించిన వీళ్లు సంపదను పోగేసుకున్నారు.

కొందరు జమీందార్లు సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేశారు. అవి ప్రచారానికి నోచుకున్నది తక్కువ. ఉదాహరణకు చల్లపల్లి, వెంకటగిరి, ఉయ్యూరు, పిఠాపురం, కపిలేశ్వరపురం, విజయనగరం వంటి ఎన్నో ప్రాంతాల జమీందార్లు ధనాన్ని వెచ్చించి ఎన్నో ఊళ్లలో స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, సత్రాలు నిర్మించారు, వ్యయప్రయాసలకోర్చి వాటిని నిర్వహించేవారు. నిజానికి మన దేశంలో విద్యావ్యాప్తికి కృషి చేసిన ముందు తరం వారు వారే. కొన్నితరాల విద్యార్థులు ఉన్నత చదువులు చదివారంటే అది వారు చేసిన సాయమే. అలాగే ఎన్నో కళలు, సంస్కృతి, సాహిత్యాలను వారు పోషించి వెలుగులోకి తీసుకొచ్చారు. ఎంతోమంది రచయితలు, కవులు వారిని ఆశ్రయించి తమ పుస్తకాలను ప్రచురించుకున్నారు. బోలెడన్ని దేవాలయాలకు ధర్మకర్తలుగా ఉంటూ, వాటి ఆస్తులను సంరక్షిస్తూ, సమాజ ఆధ్యాత్మిక ప్రగతిని కొనసాగించారు. నిజానికి వారు చేసిన బహుముఖ కృషి మీద ఓ పెద్ద పుస్తకమే రాయవచ్చు. కాని అటువంటి ప్రయత్నం ఎవరూ చేసినట్టు కనిపించదు. ఇదంతా నాకెలా తెలుసంటే, ఆనాటికి చివరి మహారాజుగా గుర్తింపు పొందిన విజయనగరం రాజు పూసపాటి విజయరామ గజపతిరాజు (పి.వి.జి.రాజు) నాకు ఆంధ్రా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు పరిచయమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా మొదలుకొని విజయనగరం వరకు తమకున్న భూములు, వాటిని తాము వినియోగించే తీరు గురించి ఆయనే నాకు ఒక సందర్భంలో చెప్పారు. తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రివర్యులుగా, ఎంపీగా కూడా ఎన్నికయ్యారు.

కొన్ని ప్రాంతాల్లో జమీందార్లకు ఈ తరహా హుందాతనం ఉండేది కాదు. అర్థం లేని భూమి లెక్కలు, శిస్తు కట్టలేకపోతే భూములు లాక్కోవడం, దానికోసం ప్రైవేటు బలగాలను పోషించడం వంటివి సర్వసాధారణంగా ఉండేవి. విలాసవంతమైన జీవనశైలి, వ్యసనాలు – వాటినుంచి అప్పుల పాలవడాలు, తమ జమీందారీలను కోల్పోవడాలు జరిగేవి. కమ్యూనిస్టు పార్టీ ప్రచారం వల్ల వాళ్ల ఆగడాలు కథలుకథలుగా ప్రచారంలోకి వచ్చాయి. సామాన్యులకు సైతం జ్ఞాపకంలో ఉండిపోయాయి. ‘ముందడుగు’ అనే ఒక నాటికను కమ్యూనిస్టులు తరచూ ప్రదర్శించేవారు. అందులోని డైలాగులు వింటే ఎంతటి జడులైనా విప్లవం వైపు ఆకర్షితులవక మానరు. ఒక జమీందారు తన కొడుకు పుట్టినరోజు వేడుకల కోసం పాలు సేకరించమని సేవకులను ఆదేశించాడట. కరువు రోజులు, ఎక్కడా దొరకలేదని వాళ్లొచ్చి చెబితే, బాలింతల చనుబాలు పిండి తీసుకురమ్మన్నాడట. ఇది నిజంగా జరిగిందని కథలుకథలుగా చెప్పుకొనేవారు.

చెప్పొచ్చేదేమంటే జమీందార్ల అకృత్యాలు గుర్తుండిపోయాయి, వారు చేసిన పుణ్యకార్యాలు చరిత్ర పుటల్లోకి మౌనంగా నిష్క్రమించాయి. ఏదైతేనేం, జమీందారీ వ్యవస్థ రద్దుతో వారికున్న ప్రత్యేక సదుపాయాలన్నీ రద్దు అయిపోయాయి, సామాన్యులుగా మిగిలిపోయారు.

ఆ వెంటనే దేవదాసీ రద్దు చట్టం వచ్చింది. వ్యభిచార నిషేధ చట్టం వచ్చింది. సంప్రదాయంగా చూసినప్పుడు దేవదాసీలు వేశ్యలు కారు. దేవాలయాల్లో కళార్చనకు మాత్రమే నియోగించబడినవారు, వారి పోషణభారం దేవాలయాలదే. కాని ఆ వ్యవస్థ కాలక్రమంలో క్షీణించిపోయింది. సంగీత నృత్యాలు వినోద సాధనాల జాబితాలోకి వచ్చాయి. ఈ మార్పును గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకం ప్రతిబింబించింది. ఆ రోజుల్లో డబ్బున్నవారు వివాహ సందర్భంలో నృత్యం చెయ్యడానికి దేవదాసీ బృందాలను పిలిపించేవారు. కృష్ణా జిల్లా గుడివాడ, గుంటూరు జిల్లా తెనాలి మేజువాణీ బృందాలకు ప్రఖ్యాతి చెందినవి. పెళ్లి ఊరేగింపు ముందు వీధుల్లో ఒక పెద్దామె సారధ్యంలో యువతులు నాట్యం చేసేవారు. ఆ పాటలు, వారి భంగిమలు కాస్త రసికంగానే ఉండేవి. బాగా తయారై, తలనిండా మల్లెపూలు పెట్టుకుని చవకరకం సెంట్లు రాసుకుని పెట్రోమాక్స్ లైట్ల వెలుతురులో తళతళలాడుతూ తయారయ్యే ఆ యువతుల నాట్యం యువ హృదయాలకు గిలిగింతలు పెట్టేది.

ఇదంతా సమాజానికి మచ్చగా ఉన్నదని నాటి సంఘసంస్కరణవాదులు భావించారు. ఒక్క కలం పోటుతో రద్దు చేశారు. గాంధీజీ కలలుగన్న స్వతంత్ర భారతంలో మద్యం, మేజువాణీ, జమీందారీ వంటివి ఉండకూడదని ఆనాటి పాలకులు అనుకున్నారు.

కాని దేవదాసీ వ్యవస్థ రద్దు పర్యవసానాలు చిత్రంగా మారాయి. ఒకప్పుడు అది కేవలం కొన్ని కులాల వారికే పరిమితమై ఉండేది. కాని రద్దు తర్వాత వ్యభిచారం ఒక వృత్తిగా స్థిరపడింది, అన్ని కులాలవాళ్లూ అందులోకి వచ్చారు. పోలీసులకు ఆ విషయంలో అదివరకు లేని అధికారం ఏర్పడింది. శాంతిభద్రతలనేగాక, సామాజిక శాంతిని కూడా తామే కాపాడుతున్నామని అనుకోవడం వాళ్ల విధుల్లో భాగమైంది. దాంతో వాళ్లు నెలవారీ కేసు రిజిస్టర్లు తక్కువైనప్పుడల్లా వీళ్ల మీద పడేవారు. ఎక్కువ కేసులు చూపెట్టాలనే తాపత్రయంతో పోలీసులు సారాకేసులు, వ్యభిచారం కేసులు పెట్టేవారు.

నాటి నుంచి నేటి వరకూ ఈ చట్టాల అమలు పడుతూలేస్తూ ఉండటాన్ని మనం గమనిస్తూనే ఉంటాం. మద్యపాన నిషేధం కొన్నాళ్లు అమల్లో ఉంటుంది, కొన్నాళ్లు ఉండదు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం కావలసి వచ్చినప్పుడల్లా అమ్మకాలకు ప్రోత్సాహం లభిస్తుంటుందని జగమెగిరిగిన సత్యమే. 1990ల్లో సారా వ్యతిరేక ఉద్యమం ఊపందుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసు. అలాగే వ్యభిచార నిరోధక చట్టం సంగతి మరి చెప్పనవసరం లేదు. ఈ విషయంలో ఇండియా, చైనాల సఫలత ఒక్కతీరుగానే ఉంది. ఛైర్మన్ మావో ప్రత్యేక రక్షణాధికారి స్వయంగా యువతులను సేకరించి జంగోన్ హైకి (ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు ఏకాంతంగా ఉండే చోటు) ఛైర్మన్ బంగళాకు పంపాడని తర్వాత్తర్వాత వెల్లడయ్యింది.

ఈ విషయంలో సింగపూర్ ప్రధాని లీ కున్ యూ కనబరిచిన దృష్టి విశాలమైనది. ‘ప్రతి సమాజంలోనూ కొన్ని ఎక్కువతక్కువలుంటాయి. శృంగార కార్యకలాపాలు వాటికేం మినహాయింపు కాదు. ప్రపంచ ప్రాచీనమైన వ్యాపారాన్ని నిషేధించడమంటే వేరే నల్లబజారుకు తలుపులు తెరవడమే. దానికి బదులు, ఆ వ్యాపారాన్ని నియంత్రించి, అమ్మకందారు, కొనుగోలుదార్ల ప్రయోజనాలను కాపాడితే బాగుంటుంది. ఉదాహరణకు ఆ వ్యాపారంలో ఉన్నవాళ్లకి ఉచిత వైద్య పరీక్షలు, చికిత్సలు వంటివి ఇప్పించాలి…’ అంటూ మాట్లాడాడు ఒక సందర్భంలో.

స్వతంత్ర భారతంలో పైన చెప్పిన సంఘ సంస్కరణ అంతా జరుగుతున్నది. ఆ సమయంలోనే ఆర్థిక పరిస్థితులు కాస్త తీవ్రంగానే ఉన్నాయి. అన్నిటికీ లోటే. విభజన వల్ల వ్యవసాయం, దుస్తుల పరిశ్రమ వంటివెన్నో నష్టపోయాయి. బెంగాల్ కరువు వల్ల దేశమంతా అంతోఇంతో పస్తులుండవలసి వచ్చింది. దీన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఒక తరహా ముతక బియ్యం, కిరోసిన్, పంచదార వంటివి రేషన్ లో ఇచ్చే పద్ధతి మొదలుపెట్టింది. అలాగే యుద్ధసమయంలో ఐర్లాండు నుంచి దిగుమతి చేసుకున్న బంగాళాదుంపలు మిగిలిపోతే, అవి పంచడం మొదలుపెట్టారు. ఈ రేషన్ అంతా పట్టణ ప్రాంతాలకే అందేది. గ్రామీణ ప్రాంతాల్లో పండిన పంటలను బలవంతంగా సేకరించేవారు. ఈ కంట్రోల్ మార్కెట్ విధానం వల్ల చాలా లీకులు, అవకతవకలు తలెత్తాయి. కొన్ని నిబంధనలకు అసలు అర్థమే ఉండేది కాదు.

ఉదాహరణకు పెళ్లిళ్లలో భోజనాలు ఇరవైమందికే పెట్టాలని, అంతకు మించితే ఎవరి బియ్యం వారు తెచ్చుకోవాలనే రూలుండేది. దానికి అనుగుణంగా పెళ్లి పత్రికల్లో దాన్ని రాసి కూడా పెట్టేవారు. నిబంధనలు అతిక్రమిస్తే పోలీసులకు చేతినిండా పని దొరికినట్టే. ఈ కంట్రోలు వల్లనే కోస్తా జిల్లాల నుంచి మద్రాసు వైపు వెళ్లే రైళ్లలో గర్భవతులు ఎక్కువగా కనిపించేవారు. ఏమంటే ఆడవారు ఎవరికీ అనుమానం రాకుండా నడుముకు బియ్యం కట్టుకుని దగ్గరవాళ్లకోసమో, అమ్మకానికో పట్టుకెళ్లేవారు. మా నాన్న హోల్డాలులోని దిండు గలేబుల నిండా బియ్యం కూరి మద్రాసులో ఉంటున్న మా పెద్దన్నయ్యకు పంపేవారు. ఈ పరిస్థితులు కొన్నేళ్లపాటు కొనసాగాయి. 1951లో రఫీ అహ్మద్ కిద్వాయ్ ఆహారమంత్రి అయినప్పుడు ఈ రేషన్ పద్ధతికి స్వస్తి చెప్పేశాడు. ఆశ్చర్యం ఏమంటే ఒక్క రాత్రిలో ఆహార ధాన్యాల కొరత మాయమైంది, అన్నీ అందరికీ దొరికే ఫ్రీ మార్కెట్ ఉదయానికల్లా అవతరించింది! అప్పుడే మన దేశం అమెరికా నుంచి ఆహారధాన్యాల దిగుమతి (రూపాయల్లో) కోసం   పిఎల్480 ఒప్పందం చేసుకుంది.

*

మా కుటుంబమంతా కాంగ్రెస్ వాదులం అనుకునేవారు ఊళ్లో అందరూ. నాన్న మొదట్నుంచీ గాంధీ సిద్ధాంతాలతో మమేకం కావడం, నూలు వడకడం, 1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో మా అన్నయ్య, నాన్న అరెస్టులు కావడంతో ఊళ్లో ఆ పేరు వచ్చింది. కాని నాకు రాజకీయ రంగంతో ఏ రకమైన పరిచయమూ లేదు. ఏ పార్టీవైపు స్పష్టమైన మొగ్గు లేదు. అసలు ఆసక్తే ఉండేది కాదు. ఫోర్త్ ఫారం, ఫిఫ్త్ ఫారం చదువుతున్నప్పుడు నేను తోటివాళ్లతో కలిసి ఆరెస్సెస్లో కొంత తిరిగినట్టు గుర్తుంది. ఏవో ఊరేగింపులు చెయ్యడమూ, ఖాదీ యూనిఫామ్ వేసుకుని నాయకుడిగా డ్రిల్లు వంటిది చెయ్యడమూ గుర్తుంది. కాని అది పెద్ద ఇష్టంగా మారలేదు.

నా సహాధ్యాయులు కొందరు కాలేజీల్లో చేరాక రాజకీయాలను కొనసాగించారు. వాళ్లు వర్తమాన వ్యవహారాలను విశ్లేషించేవారు, వందమంది ముందు అనర్గళంగా మాట్లాడేవారు. కాని రాజకీయాల పట్ల వారు చూపిన నిబద్ధత వ్యక్తిగతంగా వారికిగాని, సమాజానికిగాని ఏమీ ఉపయోగపడలేదని మాత్రం నాకు అర్థమయింది. జీవితంలో వాళ్లు ఓటమి పాలయినట్టే లెక్క.

ఆ సమయంలో నిజామ్ రాజ్యంలో రజాకార్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది.

హైదరాబాద్ రాష్ట్రం హిందువులు మెజారిటీగా ఉన్న ప్రదేశం. భారత స్వాతంత్ర్య సమయంలో దాన్ని నిజామ్ ఉస్మాన్ ఆలీఖాన్ పాలిస్తూ ఉండేవారు. అన్ని సంస్థానాలూ భారతదేశంలో విలీనం అయినా, నిజామ్ విలీనానికి సమ్మతించలేదు. ఆయన రాజ్యంలో ఖాశిమ్ రజ్వీ అనే విద్యావంతుడు, ముస్లిమ్ సానుభూతిపరుడు ఒక సైన్యానికి అధ్యక్షత వహించాడు. ఆ సైనికులను రజాకార్లు అనేవారు. వారు తెలంగాణ అంతటా ముస్లిమ్ రాజ్యం ఏర్పడాలనే లక్ష్యంతో ఉండేవారు. మొదట్లో నిజామ్ కు సలామ్ చేస్తూ కొన్ని ప్రత్యేక అధికారాలు తీసుకున్నారు, క్రమంగా ఆయన్నే కమాండ్ చేసే స్థితికి చేరుకున్నారు. వీరు హిందువుల్ని, కమ్యూనిస్టుల్ని, సానుభూతిపరులుగానో, తటస్థంగానో ఉండే ముస్లిములను సైతం హింసలు పెట్టేవారు, చాలాసార్లు కాల్చి చంపేసేవారు. పట్టణాలు, గ్రామాలు అన్నిటా అకృత్యాలు సాగించారు. అక్కడ ఉండలేక నైజాం ప్రాంత ప్రజలు ఆంధ్ర వైపు లేదంటే బొంబాయి వైపు వెళ్లిపోయి తల దాచుకునేవారు.

నేను కాలేజీలో చేరే సమయానికి తెలంగాణ ఊళ్ల నుంచి శరణార్థులు వరదలాగా ఆంధ్ర వైపు రావడం మొదలుపెట్టారు. తెనాలి, గుంటూరు, విజయవాడ, ఏలూరు – ఎక్కడ కాస్త నీడ దొరికితే అక్కడ తలదాచుకున్నారు. ఆ ఊళ్లలో కొందరు అదే అదనని వరండాలకు సైతం అద్దె వసూలు చేసేవారు. శరణార్థులు తెలుగు తక్కువ మాట్లాడేవారు, ఉర్దూ, హిందీ కలగలసిన వారి భాష ఇక్కడివారికి అర్థమయ్యేది కాదు. ఆడవారి కట్టూబొట్టూ అన్నీ వేరేగా ఉండేవి. తమవాళ్లంటూ కనబడితే సొంతూళ్లలో పరిస్థితి ఎలా ఉందో కనుక్కునేవారు. భారత ప్రభుత్వం ఎప్పుడు కలగజేసుకుంటుందో, ఎప్పుడు పరిస్థితులు చక్కబడతాయో అని చర్చించుకుంటూ దినమొక యుగంగా గడిపేవారు.

విజయవాడ కాలేజీలో నాతోపాటు చేరినవారిలో తెలంగాణ విద్యార్థులు కొందరుండేవారు. వారినుంచి నేను అక్కడ జరిగే విషయాలను తెలుసుకునేవాణ్ని. వాళ్ల కష్టనష్టాలు వింటే మనసు కరిగిపోయేది. దినపత్రికల్లో నిత్యమూ వచ్చే వార్తలు వారిని స్థిమితంగా ఉండనిచ్చేవి కాదు.

ఆ సమయంలోనే ఇటు కోస్తా జిల్లాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు పట్టు పెరిగింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా గ్రామాల్లో వారి ప్రాబల్యం పెరిగింది. నా కజిన్స్ కొందరు దానిలో ముఖ్య సభ్యులయ్యారు. వారు నాటకాలు, పాటలు, నాట్యాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సామాన్యులను ప్రభావితం చేసేవారు. విజయవాడ మొగల్రాజపురం రెండు చిన్న కొండల మధ్య ఉండే ప్రదేశం. అక్కడ కమ్యూనిస్టులు తమ సొంత ప్రెస్ స్థాపించుకున్నారు. దాన్నుంచే ప్రజాశక్తి దినపత్రిక ప్రచురించేవారు. అలాగే మార్క్స్, లెనిన్, స్టాలిన్ ల పుస్తకాలను, కమ్యూనిస్ట్ సాహిత్యాన్ని కూడా ముద్రించి సామాన్యులకు చేరువచేశారు. ఆ పార్టీ సభ్యులకు ప్రజాశక్తి పేపరు పట్టుకుని తిరగడం ఒక గౌరవంగా భావించేవారు.

స్వత్రంత్ర భారత రాజకీయాల్లో తన పాత్ర ఏమిటని కమ్యూనిస్టు పార్టీ పునరాలోచనలో పడిన సమయం అది. ప్రజా ఉద్యమాల్ని నిర్వహించడమా – కొత్త ప్రభుత్వాన్ని సమర్థించడమా – ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పాల్గొని పోటీ చెయ్యడమా – హింసాత్మకమైన పంథాలో పయనించడమా అనే నాలుగు మార్గాల్లో అది ఆలోచనలు చేస్తూ ఉండేది. అప్పటికింకా చైనా కమ్యూనిస్ట్ రిపబ్లిక్ అవలేదు. (1949 అక్టోబర్ లో అయింది) మావో నేతృత్వం, ఆయన విధానాలు ఇక్కడి నేతలను ఆకర్షించేవి. బోంబే స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పట్టభద్రుడైన బి. టి. రణధివే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రోత్సహించేవాడు. మహారాష్ట్రలో పత్తి పంట ఉత్పత్తి విధానాలను అధ్యయనం చేసిన ఆర్థికవేత్త అయినప్పటికీ ఆయన ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయన పిలుపుతో యువత బాంబుల తయారీ, పోలీసు స్టేషన్లపై దాడి చేసి .303 (పాయింట్ త్రీ జీరో త్రీ) రైఫిల్స్ ను ఎత్తుకుపోవడం, పెళ్లి బృందాలపై దాడి చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకుపోవడం వంటి పనులు చేసేవారు. 1948 జూన్ నుంచి మొదలై ఇవి 1949, 50 వరకు సర్వసాధారణం అయిపోయాయి. ఈ ధోరణి గ్రామీణ జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.

వీటన్నిటివల్లా సమాజం మారుతున్న తీరును, ఆర్థిక, రాజకీయ మార్పులను ఆనాటి తెలుగు సాహిత్యం ప్రతిబింబించింది. అప్పటికి ప్రచురణ రంగం ఎక్కువ మద్రాసులోనే ఉండేది. ఆంధ్రపత్రిక, భారతి ప్రామాణికమైనవని అందరూ భావించేవారు. ఆంధ్రజ్యోతి మాసపత్రికగా వచ్చేది. యువ అనే మరో పత్రిక బి.ఎన్.కె. ప్రెస్ నుంచి ప్రచురితం అయ్యేది. తర్వాత వాళ్లు సినిమా నిర్మాణంలోకి వెళ్లిపోయాక ఆగిపోయింది. ఆనందవాణి, చిత్రగుప్త మాసపత్రికలుగా వచ్చేవి. పిల్లల కోసం ప్రత్యేకంగా బాల, చందమామ వంటి పత్రికలు బొమ్మలు, కథలతో వచ్చేవి. మొత్తానికి అన్నిటికీ తమదైన ప్రత్యేక పాఠక వర్గం ఉండేది.

సంప్రదాయ సాహిత్యం విస్తరిస్తున్న కాలంలోనే ‘రైల్వే లిటరేచర్’ కూడా వచ్చేది. కొవ్వలి నరసింహారావు, జంపన చంద్రశేఖరరావు అనే ఇద్దరు రచయితలు రాసే నవలలు చిన్నగా ఉండి రైల్వే స్టేషన్లో దొరికేవి. ఒక్కోదాని వెల పావలా. ప్రయాణాల్లో శ్రమ తెలియకుండా చదివేందుకు అనువుగా ఉండేవి. మరోవైపు బెంగాలీ రచయితలు శరత్ చంద్ర ఛటర్జీ, రవీంద్రనాథ్ టాగోర్ వంటివారి రచనలు తెలుగులోకి అనువాదమై వచ్చేవి. చలం, కొడవటిగంటి కుటుంబరావు వంటివారు యువతరంపై చెరగని ముద్ర వేశారు.

ఈ సమయంలోనే తెలుగు సాహిత్యంలో మరో రెండు పంథాలూ మొదలయ్యాయి. ఒకదానికి కేంద్రం తెనాలి. దాన్ని ఆంధ్రా పారిస్ అనేవారు. అప్పట్లో అదేమిటో తెలియదుగాని, ఆంధ్ర దేశాన్ని అన్నిటా ఫ్రాన్సుతో పోల్చుతూ ఉండటం ఒక ట్రెండుగా ఉండేది. ఆ దేశానికి అది శృంగార రాజధాని. అటువంటి పేరు సొంతం చేసుకున్న తెనాలి నుంచి రేరాణి, అభిసారిక అనే పత్రికలు ప్రారంభమయ్యాయి. సహజంగానే వీటికి యువత పట్టం కట్టారు. ఆడవారు సైతం దాచుకుని రహస్యంగా చదివేవారు. అప్పటివరకూ శృంగారభరితమైన సాహిత్యం అయితే పామరులకు లేదంటే జమిందారులకే అందుబాటులో ఉండేది. ఆ కొరతను ఇవి తీర్చేశాయి. అయితే వాటిలో లైంగిక విజ్ఞానం ఒక ప్రధాన అంశంగా ఉండేది. ఈ పత్రికలకు క్రమం తప్పకుండా రాసే ఒక యువకుడు తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో నా సమకాలికుడయ్యాడు. అప్పటికాయన ప్రఖ్యాత హేవ్లాక్ ఎలిస్ రాసిన ‘హ్యూమన్ సైకాలజీ ఆఫ్ సెక్స్’ రెండు వాల్యూములను శ్రద్ధగా చదివి ఆ వ్యాసాలను తెలుగులోకి అనువదించేవాడు. ఆయన ఇంగ్లిష్ సాహిత్య విద్యార్థి అయినా తెలుగు పత్రిక ‘స్వతంత్ర’కు ఆలోచనాత్మకమైన వ్యాసాలు రాసేవాడు.

మరోవైపు విజయవాడలో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. వాళ్లు అభ్యుదయ అనే మాసపత్రికను తీసుకొచ్చేవారు. దానిలో శ్రీశ్రీ కవితలు ప్రచురితమయ్యేవి. ఛందోబద్ధం కాకుండా, విప్లవ పంథాలో నడిచిన ఆయన కవిత్వం యువతరాన్ని ఉర్రూతలూగించింది. అభిమానులు, అనుయాయులు విరివిగా ఏర్పడ్డారు. ఆ తరహాలో రాసిన రచయితలూ వచ్చారు. బైరాగి రాసిన ‘నూతిలోన గొంతుకలు’ అప్పుడే వచ్చింది, అది టి.ఎస్. ఇలియెట్ రాసిన ‘కోరస్ ఆన్ రాక్స్’ కు అనుసరణ. అయినా చాలా పేరొచ్చింది బైరాగి కవిత్వానికి.

అప్పటికి నాకు ఇంగ్లిష్ సాహిత్యం పరిచయమే కాలేదు, తెలుగు కవిత్వం కూడా అంతగా అర్థమయ్యేది కాదు.

సెలవుల్లో నేను తెనాలి వెళ్లినప్పుడు తెలుగు సంగీతంలో కూడా ధోరణి మారుతోందని గమనించాను. సినిమా పాటలు కాకుండా లలిత సంగీతం అప్పట్లో కోస్తా జనాలకు పరమ ప్రియంగా ఉండేది. సాలూరి రాజేశ్వర్రావు, బాల సరస్వతి పాడిన యుగళగీతాలను ఆలిండియా రేడియో ప్రసారం చేస్తూ ఉండేది, వాటికి గొప్ప ఆదరణ లభించేది. చల్లగాలిలో యమునా తటిపై… నాకో కల ఉంది… వంటి పాటలు అందరి నోళ్లలో నానేవి. మేం కాలేజీలో చేరిన ఏడాది బళ్లారి నుంచి వచ్చిన నాగరాజు అనే విద్యార్థి వాటిని బాగా పాడేవాడు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆ పాటల్లో ఒకటి పాడమని మేమందరం అతన్ని కోరాం. కాని లెక్చరర్లు అది అమ్మాయిలను ఉద్దేశించి పాడినట్లు ఉంటుంది అని వద్దనేశారు. అది రేడియోలో నిత్యం వినవచ్చేదేనని, ఆ అబ్బాయి నైపుణ్యాలను ప్రదర్శించడమే తప్ప మరే దురుద్దేశమూ లేదని చెప్పినా వాళ్లు వినిపించుకోలేదు!

ఆ సమయంలో గాయకుల్లో మకుటం లేని మహారాజు ఎవరంటే ఘంటశాల వేంకటేశ్వర్రావుగారి పేరే వినిపించేది. నాకు తెలిసి మూడు దశాబ్దాల పాటు ఆయన సినిమా సంగీతరంగాన్ని ఏలేశారు. వాటికన్నా ముందు ఆయన ఆలపించిన లలిత గీతాలు ‘స్వాతంత్ర్యం నా జన్మహక్కు…’ ‘నా జీవన యానంలో…’ వంటివి గొప్ప అలజడిని రేపాయి. వాటిని పాడినందుకు ఆయన బ్రిటిష్ కాలంలో జైలు పాలయినవారే. అయితే ఇవన్నీ వినడానికి మా ఇంట్లో సొంతంగా రేడియో, గ్రామఫోను వంటి పరికరాలేం లేవు. ఆ రోజుల్లో హోటళ్లలో, పెళ్లిళ్లలో మైకు పెట్టి పాటలు వినిపించేవారు. ఆంధ్రాయూనివర్సిటీలో చదువుతున్నప్పుడు మోహనరావు అనే నా సహవిద్యార్థి ఆయన పాటలు చాలా బాగా పాడుతుండేవాడు. నేను పెద్దయ్యాక ఒకసారి గుడివాడ నుంచి విజయవాడ వెళుతున్నప్పుడు అనుకోకుండా ఘంటశాలగారు నా సహ ప్రయాణికులయ్యారు. (అప్పట్లో రైళ్లలో ఫస్ట్, సెకెండ్, ఇంటర్మీడియెట్, థర్డ్ క్లాస్ ఉండేవి. హనుమంతయ్యగారు రైల్వే మంత్రయ్యాక 1960లో వాటిని పునర్వవస్థీకరించి 1, 2, జనరల్ క్లాసులుగా విభజించారు, ఏసీ సదుపాయం కల్పించారు.) సెకెండ్ క్లాస్ ప్రయాణంలో ఘంటశాల కాసేపు చుట్టకాల్చారు, పడుకున్నారు, లేచారు. తర్వాత చాలాసేపు మాట్లాడారు. స్నేహశీలిగా, సాధారణంగా అనిపించారు. మాట్లాడుతున్నప్పుడు ఆయన గొంతు ఆడపిల్లల గొంతులాగా ఉండేది. తర్వాత ఆయన మద్రాసుకు, నేను ఢిల్లీకి వెళ్లిపోయాం.

నేను ఇంటర్మీడియెట్ లో చేరేనాటికి నా చుట్టూ ఉన్న ప్రపంచం ఇది. ప్రతిదీ అర్థమయీకాకుండా, అందీ అందకుండా ఉండేది. అప్పటికి నాకంటూ ఏ గుర్తింపూ లేదు. కేవలం తల్లిదండ్రుల చాటు బిడ్డను.

*

జూన్ (1948) మూడో వారానికల్లా కాలేజీలు తెరిచారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యింది. మా రెండో అన్నయ్య కాకినాడలోని పి. ఆర్. కాలేజీలో చేరాడు. తర్వాత నా వంతు. నాన్న వచ్చి చేర్చి హాస్టల్లో దిగబెట్టి సాయంత్రానికి వెళ్లిపోయారు.

విజయవాడలోని మాచవరంలో ఓ వైపు కొండలు, మరోవైపు రైవస్ కాలువ – అక్కడ ఉయ్యూరు రాజావారు 1937లో జూనియర్ కాలేజీని స్థాపించారు. ఆయన తండ్రి పేరు మీద దాన్ని శ్రీరాజా రంగయ్య అప్పారావు (ఎస్.ఆర్.ఆర్) కాలేజీ అనేవారు. అది ఎల్ ఆకారంలో ఉండేది. అప్పటికి ఆర్ట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో కేవలం ఇంటర్మీడియెట్ మాత్రమే ఉండేది. నేను చేరిన ఏడాది తర్వాత అంటే 1949లో వాళ్లు బోటనీ, డిగ్రీ కోర్సులు బి.ఏ. మాథమేటిక్స్, బి.కామ్ మొదలుపెట్టారు. నేను చేరేటప్పటికి జూనియర్లు 300 మంది, సీనియర్లు 200మంది ఉండేవారు.

ఆరోజుల్లో కాలేజీ ఊరికి దూరంగా ఉన్నట్టే అనుకునేవారు. ఎందుకంటే గవర్నరుపేట, నక్కలవీధిలో డాక్టర్లు, లాయర్ల ఇళ్లుండేవి. వాటి తర్వాత ఏలూరు రోడ్డు నిర్మానుష్యంగా ఉండేది. రోడ్డుకు అటూఇటూ పెద్దపెద్ద చింత చెట్లు ఉండేవి. వాటికింద జీడిపిక్కలు కాల్చే కార్మికులు ఉండేవారు. మరోవైపు రైవస్ కాలువలో అటూఇటూ తిరిగే బోట్లు ఉండేవి. ఆదివారం తప్ప మిగిలిన రోజుల్లో ఉదయం 9 – 10 మధ్యన, మళ్లీ సాయంత్రం 5- 6 మధ్యన కాలేజీకి వచ్చివెళ్లే విద్యార్థుల కోలాహలం ఉండేది. ఎక్కువమంది నడిచే వచ్చిపోయేవారు. అప్పట్లో సైకిలంటే పెద్ద విలాసం కిందే లెక్క. సిటీ బస్సులుండేవి కాని పెద్దగా ప్రసిద్ధం కాదు. కాలేజీ వెనక గ్రౌండులో కొందరు యువకులు క్రికెట్ ఆడేవారు. కాని సాయంత్రం ఆరు తర్వాత ఆ రోడ్డులో పిట్ట మనిషి కూడా కనిపించేవారుకాదు. మా కాలేజీలో వెంకటరత్నం అనే విద్యార్థి ఉండేవాడు. అతన్ని గొప్ప శ్రీమంతులు దత్తత తీసుకున్నారు. అందుకని అతన్ని దత్తుడు అని పిలిచేవారు. బోలెడు ఆస్తి వచ్చిన అతను దాన్ని ప్రదర్శించేందుకు ఏమాత్రం వెనకాడేవాడు కాదు. స్టడ్ బేకర్ కారు తీసుకొచ్చేవాడు కాలేజీకి. తనకు నచ్చినవారిని అందులో ఎక్కించుకుని తీసుకెళ్లేవాడు.

నేను అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడే కాలేజీ యాజమాన్యంలో మార్పుచేర్పులు సంభవించాయి. జమీందారీ రద్దు చట్టం వల్ల ఉయ్యూరు రాజావారు కాలేజీని పూర్తిగా తాము నడపలేని పరిస్థితి వచ్చింది. అప్పుడే విజయవాడలో చుండూరు వెంకటరెడ్డి అనే వైశ్యుడొకాయన ఉండేవారు. ఆయనకు సొంత ఫౌండ్రీ ఉండేది. అప్పట్లో ఆయన ఇన్కమ్ టాక్స్ శాఖకు కొంత ఋణపడ్డారు. మా కాలేజీ నిర్వహణ భారం ఆయన భరించేట్టు, ఆయన ఋణం తగ్గించేట్టు ప్రభుత్వంతో ఆయన ఏదో ఒక ఒప్పందం చేసుకున్నారు. దాంతో మా కాలేజీ పేరులో ఆయన పేరు కలిసి, ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ కాలేజీగా పేరు మారింది. ఆయన కాలేజీ వ్యవహారాలను శ్రద్ధగా పట్టించుకునేవాడు, రోజుకోసారైనా వచ్చేవాడు. ఆయన హయాంలోనే కాలేజీలో డిగ్రీ కోర్సులకు ఒక పొడుగాటి షెడ్డు నిర్మాణం జరిగింది. అందులో మూడు సెక్షన్లుండేవి. కాని ఆయన వృత్తికి ప్రతీకగానా అన్నట్టు అది ఒక పరిశ్రమకు తగిన షెడ్డులాగా అనిపించేది మాకు. ఉయ్యూరురాజావారికి మా కుటుంబం స్థితిగతులు తెలుసుగనక పూర్తి ఫీజు మాఫీ చేస్తారనుకున్నాం. కాని మారిన పరిస్థితుల వల్ల ఆయన సగమే చెయ్యగలరని తెలిసింది. ఎంత కొంచెమైనా మాకదే ఎక్కువ సాయం.

మా కాలేజీలో మంచి ఉపాధ్యాయులు ఉండేవారు. అప్పటికి ఆర్థిక మాంద్యం ఉండేది కనుక ప్రతిభావంతులు, మంచి అర్హతలున్నవారికి కూడా ఉద్యోగాలు దొరికేవి కాదు. నిరుద్యోగిగా ఉండేకన్న, ఏదైనా కాలేజీలో లెక్చరర్గా వస్తే చాలనుకునేవారు. కాలేజీ తొలి ప్రిన్సిపాల్ డాక్టర్ పుట్టపర్తి శ్రీనివాసాచారిగారు. అనంతపురానికి చెందిన ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పి.హెచ్.డి. చేశారు, 1948లో నేను చేరే సమయానికి ఆయన బర్మా (నేటి మయన్మార్) ఆర్కియలాజికల్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ గా నియమితులయ్యారు.

వారి తర్వాత ముడుంబై రాఘవాచార్యులు యాక్టింగ్ ప్రిన్సిపాల్ గా విధులు చేపట్టారు. మేథమేటిక్స్ లెక్చరర్ గా పనిచేసిన ఆయన ఆర్ ఎస్ ఎస్ లో క్రియాశీలక సభ్యుడిగా ఉండేవారు. కాని కాలేజీలో ఆయన అంత స్వయంప్రతిపత్తి చూపేవారు కాదు. హుందాతనం, స్ఫూర్తిదాయకత్వం, విద్వత్తు – అన్నిటిలోనూ ఆయనను ముందు ప్రిన్సిపాల్ తో పోల్చిచూసేవారు అందరూ. ఈయన చాలా డల్ అని, ఏమీ మాట్లాడరని పోలికలు తెచ్చేవారు.

నిజానికి మా అధ్యాపకుల్లో అందరూ మణిపూసల వంటివారే. మాకు తెలుగు లెక్చరర్ కవిసామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు. ఆరడుగుల ఆజానుబాహుడు. గుండు, నుదుటన గంధం, లేత గోధుమరంగు ఖాదీ ధోవతి, లాల్చీ, కండువా ధరించి వచ్చేవారు. ఆయనను చూస్తేచాలు ఎవరైనా గౌరవించవలసిందే. ఆయన క్లాసులో ప్రసంగిస్తున్నప్పుడు విద్యార్థులు కాదుకదా, ఆకు కూడా కదిలేది కాదు. అంత నిశ్శబ్దంగా ఉండేవారంతా. ఆయన కూడా చాలా గొప్పగా పాఠాలు చెప్పేవారు.

ఆ ఏడాది మొదట్లో ఒక వింత సంఘటన జరిగింది. ఆయన ఒకసారి మధ్యాహ్నం టిఫిన్ కోసం హాస్టల్ కు వచ్చారు. మేమంతా కూర్చుని ఇడ్లీలు తింటున్నాం. నన్నెవరో పేరు పెట్టి పిలవడం ఆయన విన్నారు. తర్వాత నన్ను పిలిచి నా పేరు నేపథ్యం ఏమిటని అడిగారు. నేను మా నాన్న హిందీ అభిమానం సంగతంతా చెప్పాను. అంతా విన్నాక ఆయన ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉన్నారు. తర్వాత ‘అబ్బాయ్, ఒక పని చెయ్యి, నువ్వు పెద్దయ్యాక తండ్రివైనప్పుడు నీ కొడుక్కు నా పేరు పెట్టు’ అన్నారు గంభీరంగా. నేను సిగ్గుగా, మొహమాటంగా నవ్వాను. నేను పెద్దయ్యాను, తండ్రినయ్యానుగాని, కొడుకులు పుట్టలేదు గనక ఆయన పేరు పెట్టే భాగ్యం నాకు దక్కలేదు.

కొద్దినెలల తర్వాత తుఫాను వచ్చి విజయవాడలో చాలా ఇళ్లు తడిసి, కూలి పాడయిపోయాయి. విశ్వనాధ వారిల్లు కూడా అలాగే అయింది. వాన ఆగాక విద్యార్థులమంతా సహాయక చర్యలు చేపట్టాం. హాస్టల్లో ఉన్న సరుకులతో వంట వండించాం, తర్వాత మాకు సమీపంలో ఉన్న ఇళ్లకు వెళ్లి మధ్యాహ్నం భోజనాలకు రమ్మని పిలిచాం. రోజుకూలీలు, నిరుపేదలు, స్త్రీలు – ఎందరో ఆనాడు కడుపు నింపుకొన్నారు. ఆ సందర్భంలో ఆయన కళ్లు చెమర్చాయి. ‘చిన్నపిల్లలైనా పెద్ద మనసుతో పనిచేశార్రా’ అని మమ్మల్ని మెచ్చుకున్నారు.

విశ్వనాధ సత్యనారాయణగారు పాఠాలు చెప్పే తీరు చాలా గొప్పగా ఉండేది. పద్యాలను గొంతెత్తి పాడేవారు. ప్రతి పదమూ సరళంగా, సూటిగా, తేటగా, అర్థమయ్యేలా చెప్పేవారు. ఆయన చెప్పిన పాఠాలు నేటికీ గుర్తున్నాయంటే ఆయన శైలి ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆ రెండేళ్లనూ తల్చుకుంటే మది గర్వంతో ఉప్పొంగుతుంది.

ఆయన చాలా నవలలు, పద్య కావ్యాలు రాశారు. రామాయణ కల్పవృక్షం అన్నిటిలోకీ మణిమకుటం అనదగిన రచన. దానికే ఆయనకు భారతీయ జ్ఞానపీఠ అవార్డు లభించింది. నిజానికి ఆయన ఒక్క పేజీ కూడా స్వయంగా చేత్తో రాసేవారు కాదట, ఆశువుగా చెబుతుంటే శిష్యులో, స్నేహితులో రాసేవారట. మరో సంగతి ఏమంటే ఆయనకు ఇంగ్లిష్ సినిమాలంటే ఇష్టం. కొత్త ఇంగ్లిష్ సినిమాలు విడుదల అయినప్పుడు ఆయన నేస్తాలతో కలిసి తొలిరోజే లీలా మహల్కు వచ్చేవారు. మేం కనిపిస్తే మొహమాటపడకుండా మాట్లాడేవారు.

గురువుల ప్రవరలో చతుర్వేదుల రామనరసింహంగారి గురించి తప్పక చెప్పుకోవాలి. ఆయన హిస్టరీ డిపార్ట్ మెంట్ హెడ్. పొట్టి మనిషి. తొలిచూపులో దృష్టిని ఆకర్షించేవారుకాదు. కాని జీవితమంతా నిజమైన గాంధీవాదిగా సింపుల్ గా గడిపారు. బల్లమీద మఠం వేసుక్కూర్చుని బ్రిటిష్ చరిత్రను అలవోకగా చెప్పేవారు. అదికూడా తేదీల వారీగా కాకుండా థీమ్ ప్రకారం చెప్పడం వల్ల అందరికీ సులువుగా అర్థమయ్యేది. ప్రతి పదాన్ని స్పష్టంగా పలికేవారు. మేం రన్నింగ్ నోట్స్ రాసుకుంటే, వినడం ముఖ్యం అని చెప్పేవారు. నిజానికి నేను వార్షిక పరీక్షల్లో రాసిందంతా ఆయన ప్రసంగ సారాంశమే. దానితోనే నాకు 75శాతం మార్కులొచ్చాయి. అంత బాగా చెప్పేవారు. తర్వాత నేను ఆంధ్రా యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు స్టాఫ్ రూమ్ కు వచ్చి కలిసి కూర్చుని మాట్లాడేవారు.

‘మీరెందుకు రావడం మాస్టారూ? కబురు పెడితే నేనే వచ్చేవాణ్ని కదా’ అనేవాణ్ని నొచ్చుకుంటూ.

‘అదికాదయ్యా, నిన్నిక్కడ అధ్యాపక స్థానంలో చూస్తే గొప్ప సంతృప్తిగా ఉంటుంది. విశ్వవిద్యాలయంలో ఆచార్యుణ్ని కావాలన్నది నా లక్ష్యం. నేను సాధించలేకపోయాను. కాని నువ్వు సాధించావు. అది చూస్తే నాకు గర్వంగా ఉంటుంది. అందుకే నేనే వస్తుంటాను…’ అనేవారు.

అటువంటి సరళమైన వ్యక్తిత్వం ఉన్న వారు, ఒకరోజు మధ్యాహ్న భోజనం తర్వాత పడక్కుర్చీలో విశ్రమించి, అలాగే ప్రాణాలొదిలేశారు. భార్య వచ్చి టీ ఇద్దామనుకుంటే లేవలేదు!

కాని ఆయన బోధన వల్ల రామనరసింహంగారిని విద్యార్థులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఒకవేళ విద్యార్థుల గౌరవమర్యాదల ఆధారంగా ఎవరైనా అధ్యాపకులకు ర్యాంకులిస్తేగనక, ఆయన ఆ కాలానికి మొదటి పదిమందిలో తప్పక ఉండేవారు.

మమ్మల్ని ప్రభావితం చేసిన మూడో లెక్చరర్ అన్నే రాధాకృష్ణమూర్తి. మాకు లాజిక్ బోధించేవారు. తెల్లని ఖాదీ ధోవతి, లాల్చీ, అంగవస్త్రాలతో వచ్చేవారు. గొప్పవ్యక్తి అని చూడగానే తెలిసేది. ఆయన రావడాన్ని చూసి వాచీని సరిచేయొచ్చు అన్నంత పంక్చువల్గా ఉండేవారు. విద్యార్థులు కూడా అంత క్రమశిక్షణగా ఉండాలని ఆశించేవారు. క్లాసులోకి రాగానే ఎవరెవరు రాలేదో ఒక్కసారి పరికించి చూసేవారు. ఆ తర్వాత ముందురోజు లెక్చర్ సారాంశాన్ని క్లుప్తంగా రెండు నిమిషాల్లో చెప్పేవారు, దాన్ని నేడు చెబుతున్నదానితో కలిపేవారు. లాజిక్ సబ్జెక్టు అబ్ స్ట్రాక్టుగా ఉంటుంది, మొదట్లోని ఉత్సాహం నెమ్మదిగా పోతుందని ఆయనకు తెలుసు. అందువల్ల పీరియడ్ రెండో భాగంలో నల్లబల్లను ఉపయోగించి మనసుకు హత్తుకునేలా చెప్పేవారు. విద్యార్థులను ఆమడ దూరంలో ఉంచేవారుగాని, మా మంచి కోరేవారని స్పష్టంగా తెలుస్తూ ఉండేది. అందువల్ల అత్యంత అల్లరి పిల్లవాడు కూడా ఆయన క్లాసులో కిక్కురుమనకుండా ఉండేవాడు.

ఇండక్టివ్ – డిడక్టివ్ లాజిక్ మీద ఆయన చెప్పింది నాకిప్పటికీ గుర్తుంది. నేను పెద్దయ్యాక రాసిన అన్ని పేపర్లకూ, రాతలకూ కనిపించని న్యాయమూర్తిగా ఆయనే ఉండేవారు. ప్రతి రాత ఆయన ఆమోదించే లాజిక్ ఉందా లేదా అని బేరీజు వేసుకునేవాణ్ని. ఇటువంటి జీవితకాల ప్రభావం విద్యార్థుల మీద ఉంటుందని వాళ్లకు తెలిస్తే ఎంత గొప్పగా ఫీలవుతారో?!!

*

కాలేజీని ఆనుకుని హాస్టల్ ఉండేది. హాస్టలంటే పెద్దదేం కాదు, పది గదులు, అన్నీ గుడిసెలు. ఒక్కోదానిలో ఇద్దరు విద్యార్థులు చొప్పున ఉండేవారు. అనుకోవడానికే అవి గదులు. ఎందుకంటే గోడలు ఆరున్నర అడుగులే ఎత్తు ఉండేవి. పైకప్పుకు, గోడలకు మధ్య బోలెడంత ఖాళీ ఉండేది. అందువల్ల గదిలో ఎవరేం మాట్లాడుకున్నా, గొంతెత్తి చదివినా, ఆఖరికి రాత్రి గురక పెట్టినా అందరికీ వినిపిస్తుంది. అందులో కేవలం ఇరవై మందిమే ఉండేవాళ్లం. పదిమంది సీనియర్లు, పదిమంది జూనియర్లు. నిజామ్ రాజ్యంలో పరిస్థితుల వల్ల అక్కణ్నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువగానే ఉండేవారు. చివరకు సర్దార్ వల్లభాయి పటేల్ చొరవ మేరకు ‘ఆపరేషన్ పోలో’ మొదలయింది. ఆర్మీ బలగాలు నిజామ్ రాజ్యాన్ని ఐదు వైపుల నుంచి చుట్టిముట్టి, రజాకార్లను అంతమొందించి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశాయి. అప్పుడు పరిస్థితులు చక్కబడ్డాక, మా సహాధ్యాయులు కొందరు తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు.

విద్యార్థుల్లో వైవిధ్యం ఎక్కువగానే ఉండేది. నాలాగా పల్లెటూళ్లలో తెలుగు మాధ్యమంలో బోర్డు స్కూళ్లలో చదువుకున్నవారు కొందరు. ఇంగ్లిష్ మీడియమ్ లో పెద్ద ఊళ్లల్లో చదువుకున్నవారు మరికొందరు. బాగా వెనుకబడిన కులాలు, ఆర్థిక నేపథ్యాలకు చెందినవారు ఇంకొందరు. కాని అప్పట్లో వారికి ప్రత్యేక సదుపాయాలేం అడిగేవారు కాదు, ఇచ్చేవారు కూడా కాదు. అసలు కాలేజీలో అందరం సమానం అన్న భావనే ఉండేది తప్ప, కులం, మతం, ప్రాంతం, అంతస్తు ఆధారంగా ఏ అంతరాలూ ఉండేవికాదు. కలిసి చదువుకునేవాళ్లం, కలిసి భోజనాలు చేసేవాళ్లం, హాస్టల్లో అంతా కలిసే ఉండేవాళ్లం.

విద్యార్థులు దాదాపు అందరూ చదువే లోకం అన్నట్టుగా ఉండేవారు. భోజనాల దగ్గర కూడా సబ్జెక్టుల గురించే చర్చించుకునేవారు. చాలా తక్కువమందికి సినిమా, సంగీతం, సాహిత్యం వంటి ఆసక్తులుండేవి. కొందరు అటు చదువులో, ఇటు ఆటల్లో, మరోవైపు డిబేట్లలో రాణించేవారు.

నేను చేరిన తొలి వారంలోనే నా ముందున్న లక్ష్యం ఎంత పెద్దదో, ఎంత కష్టపడాలో నాకు తెలిసొచ్చింది.

నా అదృష్టం నా రూమ్మేట్ అని చెప్పుకోవాలి. అతని పేరు కోటంరాజు నారాయణరావు. అతనిదీ నా గ్రూపే. కాని ఒక ఏడాది సీనియర్. అతని తండ్రి కోటంరాజు రామారావుగారు అప్పటికే ప్రసిద్ధ పాత్రికేయులు, సంపాదకులు. భారత స్వాతంత్ర్య సమర సమయంలో పండిట్ నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. యాజమాన్యంతో విభేదాలు రావడంతో ఆయన లక్నో నుంచి వచ్చేశారు. పాట్నాలోని దినపత్రిక సెర్చ్ లైట్ లో చేరారు. ఈ మార్పుల వల్ల తర్వాత ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఆయన కుటుంబాన్ని తన సొంతూరు బాపట్లకు తరలించారు. దీని ఫలితమే నారాయణరావు విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరడం. చాలా మంచివాడు, అభిమానస్తుడు. అప్పటివరకూ ఉత్తరాదిన పెరిగి రావడంతో అతనికి తెలుగు అంతంతమాత్రంగానే వచ్చు. ఆంధ్రా భోజనమూ అంతగా నప్పేదికాదు, చపాతీల కోసం అర్రులు చాచేవాడు. కాని కాలేజీలో, హాస్టల్లో అందరికీ అభిమానపాత్రుడు. మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. నాకో అన్నయ్యలాగా వ్యవహరించాడు.

పుస్తకాలేమీ కొనే పని పెట్టుకోవద్దని, భారత చరిత్ర, బ్రిటిష్ చరిత్ర, లాజిక్ – అన్నీ తాను ఇస్తానని చెప్పాడు నారాయణరావు. నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే అవన్నీ కొనేంత డబ్బు లేదు నాదగ్గర. అలాగే నాకు ఇంగ్లీష్ మాట్లాడటం అస్సలు రాదని, వచ్చిన కొద్ది ముక్కలూ మాట్లాడితే ఎబ్బెట్టుగా ఉంటుందని అతనికి తొందరగానే అర్థమయ్యింది. కాని నన్ను అపహాస్యం చెయ్యలేదు. తనతో ఇంగ్లిష్ మాత్రమే మాట్లాడాలని, సాయంత్రాలు ఇంగ్లిష్ నవలలు, పుస్తకాలు చదవాలని చెప్పాడు. దాంతో తప్పకుండా ఆ భాషలో ప్రావీణ్యత సంపాదిస్తానని భరోసానిచ్చాడు. అతని దగ్గర పెంగ్విన్ అండ్ పెలికాన్ పబ్లికేషన్స్ పుస్తకాలుండేవి. ఒకరోజు జార్జి బెర్నార్డ్ షా పుస్తకం చూశాను. వెనుక పేజీ మీద ఒక కొటేషన్ ఉంది. బెర్నార్డ్ షాను చదవకపోతే కాలానికి వెనకబడ్డట్టే అని. ఎందుకో నేను అన్నింటా వెనుకబడినట్టే అనిపించింది నాకు. క్లాసులకు వెళ్లడం మొదలెట్టాక అది ఇంకా తేటతెల్లంగా తెలుస్తూ వచ్చింది.

మాకు రెండు గదుల అవతల వారణాసి రామ్మూర్తి అని ఏలూరు నుంచి వచ్చిన విద్యార్థి ఉండేవాడు. అతని సబ్జెక్టు గణితం. చదువు పట్ల చాలా శ్రద్ధాసక్తులున్నవాడు. తన గ్రూపులోనే కాకుండా కాలేజీలోనే అత్యుత్తమ విద్యార్థి అనిపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నవాడు. ఇంగ్లిష్, తెలుగు గొప్పగా మాట్లాడేవాడు. ఆ రోజుల్లో యువ పత్రికలో మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన వ్యాసం ‘వాణి నా రాణి’ అనే శీర్షికతో వచ్చింది. అది చదివితే నాకేమీ అర్థం కాలేదు. కాని వారణాసి రామ్మూర్తి దాని అర్థం నాకు వివరించాడు. అతను ఎంత ఆకట్టుకునేలాగా చెప్పాడంటే ఆ తర్వాత నేను మల్లాదివారి కథలు, కవిత్వం, సినిమా పాటలు – అన్నీ ఇష్టంగా ఫాలో అయ్యేవాణ్ని. నారాయణరావు చాలా వరకు మౌనంగా ఉండేవాడు, రామ్మూర్తి మాత్రం చలాకీగా సరదాగా ఉత్సాహానికి మారుపేరుగా ఉండేవాడు. ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్లిద్దరూ నాకు రోల్ మోడల్స్ అయ్యారు.

హాస్టల్లో ఉన్న ఇరవై మందిలోనూ కొందరు సరదా మనుషులు లేకపోలేదు. ఉదాహరణకు ఒకబ్బాయి, పేరు శాస్త్రి. చాలా తెలివైనవాడు. కాని అతనికి చదువంటే పెద్ద ఇష్టం ఉండేది కాదు. బొంబాయిలో హిందీ సినిమాల నటి ఖుర్షీద్ అంటే అతనికి ప్రాణం. ఆమె ఆరాధ్య దేవతగా చూసేవాడు. ఆమె ఫోటోను పెట్టెలో దాచుకుని రోజూ తీసి చూసుకునేవాడు. ఆమె బాగుండాలని ప్రార్థనలు చేసేవాడు. కాలేజీ నుంచి రైల్వే స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్లి అక్కడి హిగ్గిన్ బాథమ్స్ బుక్ స్టాల్ లో ఫిలిమ్ ఇండియా పత్రిక కొనుక్కొని నడుచుకుంటూ వచ్చేవాడు. బొంబాయి చిత్ర పరిశ్రమ విషయాలన్నీ చదివి మళ్లీ మాకు పూసగుచ్చినట్టు చెప్పేవాడు. అప్పట్లో ఖుర్షీద్ నటించిన సినిమా ‘తాన్ సేన్’ విడుదలయ్యింది. అందులో ఆమె కొన్ని మంచి పాటలు కూడ పాడింది. ఆ సినిమా విజయవాడలో విడుదలయిన రోజు మా శాస్త్రికి పండగే. అది ఆడినన్నాళ్లూ ప్రతి సాయంత్రం ఆటకూ తప్పనిసరిగా వెళ్లేవాడు. అతనికి దృష్టి లోపం ఉండేదనుకుంటాను, ఒక్కడే వెళ్లి రాలేడు గనక మాలో ఒకరిని తోడు తీసుకెళ్లేవాడు. నేను కూడా అతనితో వెళ్లి ఆ సినిమా చూసొచ్చాను. తర్వాత ఖుర్షీద్ పాకిస్తాన్ కు వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం శాస్త్రిని బెంగలో ముంచేసింది. ఫైనల్ పరీక్షల తర్వాత బొంబాయి వెళ్లి ఆమెను చూసి వ్యక్తిగతంగా కలవాలని అతను అనుకునేవాడు. కాని ఆ దేవి ఈ భక్తుణ్ణి కనికరించలేదు. ఆమె నిర్ణయం తెలిసిన తర్వాత చాలా రోజులు శాస్త్రి మామూలు మనిషి కాలేకపోయాడు, చదువు మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోయాడు.

కొన్ని విషయాలను ఇప్పుడు తల్చుకుంటే సరదాగా ఉన్నా, అప్పట్లో నన్ను చాలా గందరగోళంలోకి నెట్టేసేవి. గ్రామీణ ప్రాంతంలో వారానికి ఐదు రోజులు కేవలం బడి సమయంలో సహాధ్యాయులతో గడపడం వేరు. పట్టణ వాతావరణంలో హాస్టల్లో అనునిత్యం వారితోనే ఉండటం వేరు. కొందరి దారి కష్టంగా ఉండేది, కొందరిని చూస్తే సులువేమో అనిపించేది. ఎవరి దారి ఎంచుకోవాలో తెలియక తికమకగా ఉండేది. కాని తక్కువ కాలంలోనే ఒక వాస్తవం మనసును హత్తుకుంది. జీవితంలో పైకి రావాలంటే ఒక లక్ష్యం ఉండాలి, దాన్ని సాధించడం కోసం శ్రమించాలి. గాలికి తిరగడం, తేలిక విషయాల మీద శ్రద్ధ పెట్టడం చాలా సులువు. కాని దానివల్ల విలువైన కాలాన్ని, జీవితాన్ని నష్టపోతాం.

విద్యార్థులుగా నా స్నేహితులు గడిపిన తీరు, తర్వాత వారు జీవితాల్లో స్థిరపడిన తీరును గమనిస్తే ఇది మరింత నిజమని నాకు అర్థమయింది. ఉదాహరణకు చదువే ప్రపంచంగా గడిపిన కోటంరాజు నారాయణరావు ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ సర్వీస్ డిస్టింగ్విష్డ్ మెంబర్ అయ్యాడు. ఢిల్లీలో స్థిరపడి మరోవైపు గొప్ప జ్యోతిష పండితుడిగా పేరు తెచ్చుకున్నాడు. నాస్తికుడవుతాడేమో అనుకున్నాంగాని, హిందూ క్రతువుల పట్ల నమ్మకమున్న ధర్మపరాయణుడిగా మార్పు చెందాడు. పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని గడిపి రిటైరయ్యాక జ్యోతిష శాస్త్రాన్ని సైంటిఫిక్ గా అధ్యయనం చెయ్యడానికి తన కాలాన్ని అంకితం చేశాడు.

వారణాసి రామ్మూర్తితో నా సాన్నిహిత్యం ఆంధ్రా యూనివర్సిటీలో కూడా కొనసాగింది. చదువులో చక్కగా రాణించిన అతను ధన్ బాద్ లో స్కూల్ ఆఫ్ మైన్స్ లో, తర్వాత అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాకు వెళ్లాడు. జియోఫిజిక్స్ లో నిష్ణాతుడైన అధ్యాపకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

ఖుర్షీద్ భక్తుడైన శాస్త్రి పరీక్షల్లో తప్పి ఇంటికెళ్లిపోయాడు. తర్వాత ఏమయ్యాడో ఎవరికీ తెలియదు.

అయ్యే చెట్టు ఆకుల్లోనే తెలుస్తుంది అన్న సామెత నాకు అర్థమవుతూ వచ్చింది. జీవితంలో ఎన్నో కూడళ్లు, క్రాస్ రోడ్స్ వస్తూ ఉంటాయి. ఏది ఎంచుకుంటామో దాన్నిబట్టే విజయమో, అపజయమో లభిస్తాయి, ప్రయాణం సాఫీగా సాగుతుంది.

*

నేను నా చదువును శ్రద్ధగానే ఆరంభించాను. కాని అది సరిపోదని నాకు త్వరగానే అర్థమయ్యింది. తెలుగు, హిస్టరీ, లాజిక్ ఫర్వాలేదనిపించేవి. కాని ఇంగ్లిష్ కవిత్వంతో చచ్చే చావుగా ఉండేది. బైరన్, డి లా మేర్, మాన్స్ ఫీల్డ్ మొదలైనవారి కవిత్వమంతా మాకు పాఠాలుగా ఉండేది.

క్లాసులో 150మంది విద్యార్థులు ఉండేవారు. అందువల్ల వెనుక కూర్చుంటే ఏమీ వినిపించేది కాదు. అందులోనూ ఇంగ్లిష్ లెక్చరర్ స్వరం సన్నగా పీలగా ఉండేదేమో, అసలే వినిపించేది కాదు. మొదట్లో నేను కొన్ని రోజులు ముందు వరసల్లో కూర్చుని వినడానికి పోటీ పడేవాణ్ని. కాని దానివల్ల ఏ ఫలితమూ లేదనిపించింది. అప్పట్లో ఇంటర్మీడియెట్ మొదటి ఏడాది పరీక్ష ఉండేదికాదు, రెండేళ్ల చదువూ అయిన తర్వాత ఒకేసారి పరీక్ష ఉండేది. అందువల్ల ఇంగ్లిష్ సంగతి అప్పటిలోగా ఏదో ఒకటి చెయ్యవచ్చనుకున్నాను.

మా క్లాసులు మొదలైన కొత్తలోనే హైదరాబాదు పోలీసు చర్య జరిగిందని, శరణార్థులు తిరిగి సొంతూళ్లకు వెళ్లారని చెప్పాను కదా, అప్పుడే గన్నవరం ఎయిర్ పోర్టు ప్రారంభమైంది. ఆర్మీ బలగాలకు అది కీలకమైంది. అది మా కాలేజీకి 10 మైళ్ల దూరంలో ఉండేది. ఆ విమానాలు మా కాలేజీ మీద నుంచే ఎగిరేవి.

ఆగస్టుకల్లా స్వాతంత్ర్య దినోత్సవం వచ్చింది. ఆ సందర్భంగా కన్యాశుల్కం నాటకంలోంచి కొన్ని సీన్లు ప్రదర్శించాం విద్యార్థులం. నేను ఫోటోగ్రాఫరు వార్తాహరుడిగా చిన్నపాత్ర వేశాను. వేదిక మీద కనిపించేది కొద్ది సేపే. కాని అది నాలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇంకా ఏమైనా చెయ్యగలనని, చదువులో రాణిస్తానని నమ్మకం కలిగింది.

అయినా ఇంగ్లిష్ రాదని, వెనకబడి ఉన్నానని లోపల్లోపల తొలుస్తూనే ఉండేది. జిమ్ కార్బెట్ రాసిన ‘మ్యాన్ ఈటర్స్ ఆఫ్ కుమావున్’ పుస్తకం మాకు నాన్ డీటెయిల్డ్ టెక్ట్స్ గా ఉండేది. అప్పుడే మాకు ఇంగ్లిష్ చెప్పడానికి కర్ణాటకలోని ధార్వార్ నుంచి కె.ఎస్. హోస్కొటె అనే లెక్చరర్ వచ్చారు. కాని ఫలితం లేదు. ఆయన విద్యార్థుల గౌరవాన్ని సంపాదించలేకపోయారు. జిమ్ కార్బెట్ కథనం, వేట పద్ధతులు ఇవన్నీ అర్థమయ్యేవి. కాని పరీక్షల్లో ఏం ప్రశ్నలిస్తారు, నేనేం రాయాలి అన్నది ఏమీ అర్థమయ్యేది కాదు.

ఈలోగా క్వార్టర్లీ పరీక్షలు వచ్చాయి. విద్యార్థులంతా ప్రశ్నలు ఏమొస్తాయి, జవాబులు ఎలా రాయాలి అని చర్చించుకునేవారు. నాకు అంతా అయోమయంగా ఉండేది. నా జవాబు పత్రాలు, మార్కులు చేతికొచ్చాక చూసిన నారాయణరావు నిరాశ చెందాడు. ఇంకేం చెయ్యగలడు? అయినా నా మొహం చూసి, ఏమీ అనకుండా, ‘భవిష్యత్తులో ఇంకా బాగా చెయ్యాలి, అది ముఖ్యం’ అని మాత్రం చెప్పాడు.

రెండో ఏడాది ఇంగ్లిష్ ప్రోజ్ లో మూడు పాఠాలుండేవి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రవీంద్రనాథ్ టాగోర్ మీద రాసిన వ్యాసం ఒకటి, ఐజాక్ వాల్డన్ రాసిన ‘ఏంగ్లింగ్ ఏజ్ పాస్ టైమ్’ (Angling as pass time), విలియమ్: హేజ్ లిట్ రాసిన ‘ద ప్లెజర్ ఆఫ్ పెయింటింగ్’ వంటివి. ఇవి మాకు అర్థమయ్యేవి కాదు. ఏదో బట్టీ కొడదాం అనుకున్నా, ఏ ప్రశ్నలు వస్తాయో, వాటికేం సమాధానాలు రాయాలో తెలిస్తే కదా? వాటి అర్థం నిగూఢంగా ఉండేది. అదీగాక ఏంగ్లింగ్ ఏజ్ పాస్ టైమ్ వంటి రచనలను అర్థం చేసుకోవడం సాంస్కృతికంగా కష్టం. ఇక్కడి సంస్కృతిలో చేపలు పట్టడం అనేదొక కులవృత్తి, శూద్రకులాలది. ఉన్నత విద్యావంతులు దాన్నొక ఉత్సాహభరితమైన మంచి వ్యాపకంగా స్వీకరించడం ఏమిటో మాకు అంతుపట్టేదికాదు.

కాని మాకో వరం అనిపించేలా అప్పుడే డాక్టర్ పుట్టపర్తి శ్రీనివాసాచారిగారు బర్మా నుంచి సెలవులో ఇంటికి వస్తున్నారని తెలిసింది. ఆయన బావమరిది మాకు చరిత్ర చెప్పేవారు. ఆయనే ఈ విషయాన్ని మా చెవిన వేశారు. వారిల్లు మా కాలేజీకి దగ్గరే. దాంతో ఒకరోజు ధైర్యం చేసి ముగ్గురు విద్యార్థులం ఆయన దగ్గరకు వెళ్లి మా ఇంగ్లిష్ కష్టాలను విన్నవించుకున్నాం. ఆయన ‘దానికేం భాగ్యం, ఇక్కడున్నప్పుడు పాఠం చెబుతాను రండి’ అన్నారు. బత్తాయి పండు తొనలు ఒలిచి పెట్టినంత సులువుగా మాకా పాఠాలు చెప్పేశారు ఆయన. అంతేకాదు, పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో, వాటికెలా సమాధానాలు రాయాలో కూడా చెప్పారు. ఎంత అభిమానంగా, అర్థమయ్యేలా చెప్పారంటే – మమ్మల్ని మేం మరిచిపోయి వినేవాళ్లం, అంతే. ఆయన పట్ల మా సీనియర్ విద్యార్థులు చూపే భక్తిశ్రద్ధలకు మూలం ఏమిటో మాకు అప్పుడే అర్థమయింది. గొప్ప ఉపాధ్యాయుడు ఎప్పటికీ గొప్ప ఉపాధ్యాయుడే అనిపించింది. ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మేం ఇంగ్లిష్ మంచి మార్కులతో గట్టెక్కామంటే అదంతా ఆయన చలవే. దైవం మేలు చేసి మాకిటువంటి సాయం అందకపోతే ఏమయ్యేదో ఊహించడానికే భయం వేస్తుంది. శ్రీనివాసాచారిగారికి ఒకే కొడుకు. అమెరికాలో స్థిరపడ్డాడు. అతనితో కలిసి నివసిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు రోడ్డు దాటుతూ ప్రమాదవశాత్తూ మరణించారు ఆయన. ఆ విషయం తెలిసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించాను. భౌతికంగా మరణించినా, విద్యార్థుల మనసుల్లో మాత్రం ఆయన చిరంజీవిగా నిలిచిపోయారు.

*

మొదటి ఏడాదిలో సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడు చదువు భయాలకు తోడు కుటుంబ పరిస్థితి ఇంకొంత అర్థమై భయపెట్టింది. అప్పటికి కొంత కాలంగా మా నాన్న ఉయ్యూరు రాజకీయాల్లో శ్రద్ధ పెట్టారు. తెనాలి నుంచి దూరమైపోయారు. ఆంధ్ర పత్రిక ఏజెన్సీ, చందాదారులను పెంచుకోవడం వంటివి చూసుకోకుండా ఉయ్యూరు పంచాయితీ వ్యవహారాలను పట్టించుకునేవారు. దాన్ని ఆయన ఉద్యోగులిద్దరూ అలుసుగా తీసుకున్నారు. వచ్చిన చందాలు కూడా కట్టకుండా తమ జేబుల్లో వేసుకునేవారు. మరోవైపు ఎక్స్ ప్రెస్ గ్రూపు ఇస్తున్న పోటీతో అమ్మకాలు పడిపోయాయి. దాంతో 1948 సెప్టెంబరుకల్లా ఆయన పేపరు ఏజెన్సీని కోల్పోయారు. దాంతో తెనాలిని పూర్తిగా వదిలేసి, అమ్మనీ చెల్లినీ తీసుకుని ఉయ్యూరు వచ్చేశారు.

కెసిపి పంచదార మిల్లు యాజమాన్యం నెలకు 150 రూపాయల వేతనంతో నాన్నను ఉద్యోగంలోకి తీసుకుంది. అక్కడ రాజకీయంగా తలెత్తే వివాదాలను పరిష్కరించే పెద్దమనిషిగా ఆయన్ను కుదుర్చుకుంది. ఏళ్లు గడుస్తూ, ఆర్థిక అవసరాలు పెరుగుతూ ఉండటంతో ఆయన జీవితంతో అప్పుడు రాజీ పడ్డారు. ప్రయోగాలకు స్వస్తి చెప్పి ఉద్యోగంలో కుదురుకున్నారు. అది రాజీ ఎందుకయ్యిందంటే, ఆయన జీవితాంతం గాంధీ అనుయాయి, నేషనల్ కాంగ్రెస్ సభ్యుడు. కాని కెసిపి వారు అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతు పలికేవారు. అధికారం మారాక వాళ్లు తమ ధోరణి మార్చుకోవలసి వచ్చింది. ప్రముఖ రాజకీయ నాయకుడు వి.వి.గిరి చాలా ఏళ్ల పాటు కెసిపితో అనుబంధం కొనసాగించారు. మద్రాసు ప్రెసిడెన్సీలో ఆయన పరిశ్రమల శాఖ మంత్రి అయ్యారు. ఆ తరహా పెద్దవారి బలమే కాకుండా, క్షేత్రస్థాయిలో బలగం ఉండాలని కెసిపి భావించింది. ఈ నేపథ్యంలో మా నాన్న వారికి అక్కరకు వచ్చారు.

కెసిపి వ్యవస్థాపకులు అడుసుమిల్లి గోపాలకృష్ణగారిని అందరూ తాతగారు అనేవారు. ఆయన నాన్నను పిలిచి ‘గతాన్ని మర్చిపోదాం, మనం రాజకీయ శత్రువులుగా మసిలుకున్నాం.. కాని ఇప్పుడు నాకు నువ్వు, నీకు నేను అవసరం..’ అని నచ్చజెప్పారు. ఆయన మాటల్లో జీవిత వాస్తవాలను గుర్తించిన నాన్న ఉద్యోగంలో చేరారు. కుటుంబాన్ని కూడా పూర్వం ఆయన కడవకొల్లులో కట్టుకున్న ఇంటికి మార్చేశారు.

ఉయ్యూరు పంచదార కర్మాగారానికి కడవకొల్లు రెండు మైళ్ల దూరంలో ఉంటుంది. అక్కడ స్థానికంగా ఉండటం నాన్నకు కలిసొచ్చింది, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని ఆయన కంకణం కట్టుకున్నారు. పోస్టాఫీసు శాఖను వచ్చేలా చెయ్యగలిగారు. తాను ప్రారంభించిన హయ్యర్ ఎలిమెంటరీ స్కూలును హైస్కూలుగా చెయ్యాలని సంకల్పించారు. అప్పుడే కృష్ణా జిల్లా బోర్డుకు కొత్త ఛైర్మన్ గా కాకాని వెంకటరత్నం వచ్చారు. ఆయన విద్యావ్యాప్తికి కృషి చేసేవారు. ఆయన కృషి వల్లనే కృష్ణా జిల్లాలో అనేక హైస్కూళ్లు వచ్చాయని, కొన్ని తరాల పిల్లలు విద్యావంతులయ్యారని చెప్పుకుంటారు. అలాగే ఆ స్కూళ్లకు బోలెడుమంది ఉపాధ్యాయులు కావలసివచ్చారు. రెండేళ్ల బాచిలర్ డిగ్రీ పూర్తయితే చాలు, ఉద్యోగం దొరికేదట. దాంతో జిల్లాలో నిరుద్యోగమూ తగ్గింది. అటువంటి వ్యక్తి ఉన్నప్పుడే తన ప్రయత్నాలను తీవ్రం చేశారు మా నాన్న. కాని ఆయన కృషి ఫలించలేదు. అదృష్ట దేవత మాకు సమీప గ్రామమైన కాటూరును వరించింది. అది కడవకొల్లుతో పోలిస్తే పెద్దది, సంపన్నమైనది.

ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పూర్తయ్యాక వేసవి సెలవులకు నేను మా అన్న కడవకొల్లు ఇంటికి వెళ్లాం. పసిప్రాయంలో, ఊహ తెలియని వయస్సులో వదిలి వెళ్లిన ఇంటికి తిరిగి రావడం ఒక వింత అనుభూతిని కలగజేసింది. ఆ సమయంలో అక్కడకు వెళ్లడం ఒక రకంగా వరం, ఒకరకంగా శాపం.

కడవకొల్లు చిన్న ఊరు, నిశ్శబ్దంగా ఉంటుంది, కాలేజీ విద్యార్థులు ఎవరూ లేరు. ఏ రకమైన వినోదమూ లేదు. అందువల్ల బోరు కొట్టే అవకాశం ఎక్కువ. కాని ఆ నిశ్శబ్దం, పరిసరాలు నాకు వరంగా మారింది. సబ్జెక్టులను అర్థం చేసుకుంటూ చదువుకోవడానికి నాకు అవకాశం దొరికింది. నాకంటూ ప్రత్యేకమైన దినచర్య పెట్టుకున్నాను. ఉదయాన్నే అన్నం తిన్నాక ఎదురుగా ఉన్న స్కూలుకు వెళ్లేవాణ్ని. అక్కడ నా పుస్తకాలు చదువుకుని, ఓ కునుకు తీసి లేచేవాణ్ని. ఈలోగా గ్రామస్తులు కొందరు ఉత్తరాలు తీసుకుని వచ్చేవారు. వాటిని చదివి వినిపించడం, ప్రత్యుత్తరాలు రాయడం చేసేవాణ్ని.

సాయంత్రం రైవస్ కాలవ గట్ల మీద నడిచేవాణ్ని. ఆ కాలవలు జూలై నుంచి మార్చి వరకూ నీటితో నిండుగా ఉండేవి. సరుకు రవాణా పడవలు తెగ తిరిగేవి. అప్పటికింకా మన దేశంలో రోడ్డు మార్గాలు, ట్రక్కుల వంటివి ఇంకా రాలేదు. పడవవారు తమ కష్టం మరిచిపోవడానికి పాటలు పాడేవారు. అవి గాలిలో వినిపిస్తూ మరో లోకాల్లోకి తీసుకుపోయేవి. వాళ్ల జీవనశైలి నిరాడంబరంగా ఉండేది. పడవలోనే అన్నం వండుకునేవారు. గ్రామస్తులు ఆవకాయో, కూరలో, ఇంత మజ్జిగో ఇస్తే తీసుకుని తినేసేవారు. వేసవిలో కాలువలు ఎండిపోయేవి. పడవలు బాగుచేసుకోవడం వంటి పనులు చేసుకునేవారు. వారిని చూస్తూ, మరోవైపు విజయవాడ కొండలను చూస్తూ ఇసుక తిన్నెల్లో నడిచేవాణ్ని.

ఇంటికి మరలినప్పుడు ఎవరో ఒకరు బండిలో వెళుతున్నవారు గుర్తుపట్టి వస్తావా అంటూ కేకేసేవారు. బండి ఎక్కితే చాలు, నా చదువు గురించి సవాలక్ష ప్రశ్నలు వేసేవారు. డాక్టరవుతానా, ఇంజినీరవుతానా అని అడిగేవారు. అవి అయ్యే అవకాశం లేదని తెలిస్తే ‘మరెందుకు ఇంత కష్టం’ అంటూ ఆశ్చర్యపోయేవారు. ఇంటికొచ్చి రాత్రి భోజనం తిని నా చాప తీసుకుని స్కూలు దగ్గర ఏర్పాటు చేసిన కమ్యూనిస్టులను పట్టుకొనే వలంటీర్ల బసకు వెళ్లి పడుకునేవాణ్ని. అక్కడ ఇతర గ్రామాల సంఘటనలు కథలుకథలుగా తెలుస్తుండేవి. వాటిని వింటూనే నిద్రలోకి జారుకునేవాణ్ని. ఈ తరహా దినచర్య వల్ల నేను గ్రామంలో భాగమయ్యాను, బోరు కొట్టలేదు సరికదా, గ్రామీణ జీవితం పట్ల ఇష్టం కలిగింది.

వాస్తవానికి కృష్ణా జిల్లా పల్లెల్లో ఆరోజులు చాలా ఉద్రిక్తంగా ఉండేవి. కమ్యూనిస్టు పార్టీ సమాజంలో మార్పుకోసమంటూ ఉద్యమ పంథాను ఎంచుకుంది. గ్రామీణ యువతీయువకులను ఆకర్షించి పటిష్టమైన క్యాడర్ ను ఏర్పాటు చేసుకోవడంలో తలమునకలుగా ఉండేది. ముందే చెప్పినట్టు వాళ్లకు బాంబుల తయారీ, తుపాకులను ఎత్తుకురావడం, సంపన్నులను, పెళ్లి బృందాలను దోచుకోవడంలో శిక్షణనిచ్చేవారు.

ఆరోజుల్లో గ్రామాల్లో బ్యాంకులుండేవి కాదుగనక, సంపన్నులు ఇనప్పెట్టెల్లో తమ సొమ్ము, బంగారాలను దాచుకునేవారు. వీరు ఆయా ఇళ్లమీద పడి ఇంటి పెద్ద తలకు తుపాకి గురిపెట్టి వాటిని తెరిపించి దోచుకునేవారు. ఇవ్వకపోతే వారిని అక్కడికక్కడే కాల్చేసి సమాజ విరోధిని అంతం చేశామని పెద్దపెద్ద నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోయేవారు. అప్పటికి సమాజంలో ధనం పోషించే పాత్ర గురించి నాకు పూర్తిగా తెలియకపోయినా, జి.బి.షా రాసిన ‘ఇంటెలిజెంట్ ఉమన్స్ గైడ్ టు కాపిటలిజమ్, సోషలిజమ్’ అన్న పుస్తకాన్ని చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాణ్ని.

తర్వాత ఏడాదికి ఊళ్లలో కమ్యూనిస్టు పార్టీ ఆగడాలు శృతి మించాయి. ప్రభుత్వం రంగంలోకి దిగింది. మొదటి చర్యగా ప్రెసిడెన్సీలో పార్టీపై నిషేధం విధించింది. ‘మలబార్ ఆర్మ్డ్ స్పెషల్ పోలీస్’ పేరుతో ప్రత్యేక పోలీసు బలగాలను కమ్యూనిస్టుల ఏరివేతకు ఊళ్లలోకి దించింది. వారు రాత్రిపూట గస్తీ కోసం దళాలను ఏర్పాటు చేశారు. దానిలో యువకుల్ని చేర్పించారు. వాళ్ల విధి ఏమిటంటే కమ్యూనిస్టు పార్టీ రహస్యంగా సాగించే సమాచార వ్యవస్థను అడ్డుకోవడం. అది రాత్రి పూటే పనిచేసేది కనుక, దాన్ని నిరోధించేందుకు కాపలా కాయాలన్నమాట. అయితే ఉదయమంతా వ్యవసాయ పనుల్లో కాయకష్టం చేసే యువకులకు రాత్రి నిద్ర లేకుండా కాపలా కాయడం కష్టమైపోయేది. పోలీసులు తనిఖీ చేసినప్పుడు వాళ్లు కునుకు తీస్తూ పట్టుబడితే ఏదో తప్పు చేసినట్టు దండించేవారు.

అసలు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులెవరో, కానివారెవరో గ్రామాల్లో కనిపెట్టడం కష్టంగా ఉండేది. ఎందుకంటే అక్కడందరూ పరిచయస్తులే, రక్త సంబంధీకులే, అయినవాళ్లే. అందువల్ల గ్రామీణులు తమవారిని మోసం చెయ్యలేక, పోలీసులకు సహకరించలేక – అడకత్తెరలో పోకచెక్కల్లా నలిగిపోయేవారు. క్రమంగా పోలీసుల ఆగ్రహం పెరిగిపోయింది. వాళ్ల లాఠీలు కరుకు భాష మాట్లాడటం మొదలుపెట్టాయి. పార్టీ వర్కర్లు దొరికితే వాళ్లను రాత్రిపూట తీసుకుపోయి ఊళ్ల బయట తాటిచెట్లకు కట్టేసి కాల్చేసేవారు. వాళ్లు తప్పించుకునే క్రమంలో ఎన్ కౌంటర్ తప్పలేదని మర్నాడుదయం బుకాయింపు వార్తలు వచ్చేలా చేసేవారు.

అప్పట్లో కాటూరులో అందరూ కమ్యూనిస్టులే అన్న ఉద్దేశంతో ఆంధ్రా మాస్కో అనేవారు. అలాంటి ఊరి మీద మలబారు పోలీసులు పడ్డారు. ఉదయాన్నే ఊరిని చుట్టుముట్టి బహిర్భూమికి వెళ్లే మగవాళ్లను పట్టుకొని నగ్నంగా చేసి నడిపించారు. ఎవరైనా చేతులు అడ్డం పెట్టుకోబోతే వారి మోచేతుల మీద లాఠీతో కొట్టారు. కమ్యూనిస్టుల జాడ చెప్పమంటూ రోజంతా హింసా కాండ నడిపారు. గ్రామస్తుల ధాన్యమంతా కుప్పబోసి, కిరోసిన్ పోసి తగలబెట్టారు. ‘అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న’ అన్నట్టుగా గ్రామీణులు అటు కమ్యూనిస్టులు, ఇటు పోలీసుల హింసను తట్టుకోలేని పరిస్థితికి చేరుకున్నారు.

ఈ వార్తలనే నేను ఊళ్లో రాత్రిపూట కాపలాగా ఉంటున్న గ్రామీణ యువకులు మాట్లాడుకుంటే వినేవాణ్ని.

*

సంక్రాంతి సెలవుల తర్వాత కాలేజీ తెరిచారు. నన్ను ఇంగ్లిష్ సమస్య కొన్నాళ్లు వెంటాడింది. కాని పట్టుదలగా ప్రయత్నించాను. కొన్ని ప్రశ్నలకు సమాధానాలకు బట్టీ కొట్టడం, కొన్ని అనుకోని ప్రశ్నలు వచ్చినా రాసేంత ధైర్యం సంపాదించడం చేశాను. అద్భుతంగా కాకున్నా, పాసుమార్కులొస్తాయన్న భరోసా వచ్చింది. ఒక తెలియని పేరాగ్రాఫ్ ఇచ్చి, దాన్ని నాలుగో వంతుకు కుదించి రాయాలి. దీనికోసం మొదటిసారి శంకరనారాయణ నిఘంటువును ఉపయోగించాను. మొదటిసారి పైస్థాయికి నా ప్రయాణం మొదలైనట్టు అనిపించింది. ఈలోగా పుట్టపర్తి శ్రీనివాసాచారిగారి బోధన లభించడంతో నమ్మకం పెరిగింది.

నాకన్నా డబ్బున్న సహాధ్యాయులు నాకు చరిత్ర పుస్తకాలను చదువుకోవడానికి ఇచ్చేవారు. అవి లావుగా ఉండేవి, వాటి ధర కూడా ఎక్కువే. రామ్ సే మ్యూర్ రాసిన బ్రిటిష్ హిస్టరీ, రాయ్ చౌధురి రాసిన భారతీయ చరిత్ర, దత్తా, మజుమ్ దార్లు రాసిన అడ్వాన్స్ డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా వంటివి మాకు పాఠ్యపుస్తకాలు. అందులో కొన్ని పేరాగ్రాఫులు ఎంత గొప్పగా ఉండేవంటే, వాటిని ఎన్నోసార్లు చదివాను, అవి నాకు కంఠస్తం అయిపోయాయి.

నెమ్మదిగా ఏడాది గడిచిపోయింది. ఫైనల్ పరీక్షలు దగ్గర పడ్డాయి. చాలా టెన్షన్ గా ఉండేది. శివరాత్రి రోజు విద్యార్థులు కూడా కృష్ణానదిలో స్నానాలు చేసి, సీరియస్ ప్రిపరేషన్ మొదలుపెట్టేవారు. ప్రతి సీనియర్ చాలా సీరియస్ గా ఉండేవారు. ఏం ప్రశ్నలొస్తాయో, ఎలాంటి సమాధానాలు రాయాలో తీవ్రమైన చర్చల్లో మునిగిపోయేవారు. రాత్రి పదింటికి కూడ టీలు తాగి చదువుతూ ఉండేవారు. పరీక్షలు పూర్తయ్యే వరకూ ఇదే పరిస్థితి. జూనియర్ల మీద అంత ఒత్తిడి ఉండేదికాదుగాని, వాతావరణంలో వాళ్లు కూడా అంతే సీరియస్ గా మారిపోయేవారు. సీనియర్లకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా మసలుకొనేవారు.

ఎవరికి ఫస్ట్ క్లాస్ వస్తుంది అని ఊహాగానాలు చేసేవారు. అందరి జాబితాల్లో ఎంపీసీ గ్రూపువాళ్లే ఉండేవారు. సోషల్ సైన్సుల వారు ఎవరూ ఉండేవారు కాదు. మాథమెటిక్స్ లో మార్కులు సంపాదించడం సులభం. మంచి విద్యర్థులకు సాధారణంగా ఎనభై శాతం పైన వచ్చేసేవి. అతి తక్కువమందికి 100శాతం మార్కులొచ్చేవి. అలాంటివారికి ఇంగ్లిష్, తెలుగుల్లో కాస్త తక్కువ వచ్చినా కవరయిపోయేవి. దీనివల్లే ఫస్ట్ క్లాసులు ఆ గ్రూపు నుంచే ఎక్కువొచ్చేవి. సోషల్ గ్రూపుల్లో డిస్టింక్షన్ అంటే 60 శాతం పైన వస్తే గొప్పగా అనుకునేవారు. ఇంగ్లిష్, హిందీ చాలా బాగా వచ్చుగనక కోటంరాజు నారాయణరావుకు ఆ ఏడాది ఫస్ట్ క్లాస్ గ్యారెంటీ అనుకునేవాళ్లం మేం.

పరీక్షలయ్యాక అందరం విడిపోయాం. ఆ ఏడాది చదువు మా ఇరవైమందినీ దగ్గర చేసింది. అందరం కలిసి బతికాం. కలిసి క్లాసులకు వెళ్లాం, భోజనాలు, సినిమాలు అన్నీ కలిసే చేశాం. స్నేహాలు బలపడ్డాయి. నారాయణరావు వెళుతూ తన చరిత్ర పుస్తకాలు నాకు ఇచ్చాడు. ఫలితాలు వచ్చినప్పుడు అతనికి, మాకు కూడా నిరాశే కలిగింది. ఫస్ట్ క్లాస్ రాలేదు. కొందరు కొన్ని సబ్జెక్టుల్లో తప్పారు కూడా. సెప్టెంబరులో రాస్తే పాసవుతారు.

నేను రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టాక, ఫస్ట్ క్లాస్ సాధించగలనా అన్న ఆలోచన మొగ్గతొడిగింది. అంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించగలనా అని సంశయం, అందుకోలేనేమోనన్న అపనమ్మకం ఇవి మనసులో మెదిలేవి.

కాని ఆ ఏడాది నా ఇంగ్లిష్ మెరుగయ్యింది. సిలబస్ లో షేక్ స్పియర్ రాసిన జూలియస్ సీజర్ ఉండేది. క్లాసులు ప్రారంభం కావడానికి ముందే నేను చదివాను. చాలా ఫాసినేటింగ్ గా అనిపించింది ఆ రచన. ఆ ఏడాది దాన్ని నేనెన్నోసార్లు చదివాను. ఎంతంటే చాలా భాగం నాకు కంఠస్థమయిపోయింది. అలాగే మెకాలే రాసిన ‘లైవ్స్ ఆఫ్ జాన్సన్ అండ్ గోల్డ్ స్మిత్’ చాలా ఆసక్తిదాయకంగా ఉండేది. హిస్టరీ, లాజిక్ కూడా కష్టపడి చదివేవాణ్ని.

ఆ ఏడాది సగం గడిచి మూడో సెమిస్టరులోకి అడుగుపెట్టేసరికి నాలో ఫస్ట్ క్లాస్ ఆలోచన బలపడింది. భారతీయ చరిత్ర చెప్పే లక్ష్మణాచారిగారు నన్ను చాలా ప్రోత్సహించారు. టైమ్ మేనేజ్ మెంట్ ముఖ్యమని తొలిసారి చెప్పినదాయనే. పరీక్షలో ఐదు ప్రశ్నలిస్తారు, రెండున్నర గంటల్లో రాయాలి. చాలామంది విద్యార్థులు నాలుగు ప్రశ్నలకు సమాధానాలు బాగా రాసి ఐదో ప్రశ్న రాయలేకపోతారు. కాని అన్ని ప్రశ్నలకు సమయం కేటాయించుకుని సిద్ధమైతే మంచి మార్కులు తప్పక వస్తాయని ప్రోత్సహించారు. నాకు నమ్మకం పెరుగుతూ వచ్చింది, నాతోటివారు సోషల్ వాళ్లకు ఫస్ట్ క్లాస్ రాదనే మాటలోనే ఉండిపోయారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు రావాలని నేనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను.

పరీక్షల తర్వాత నేను అన్న మా ఇంటికొచ్చేశాం. మా అన్న అన్ని సబ్జెక్టులు పాసవుతానని, సెకెండ్ క్లాసు వస్తుందని చెప్పాడు. నాన్నకు భయంగానే ఉండేది. నా పట్ల ఆయన నమ్మకంగా ఉండేవారు. ఆ ఏడాది మే గడవడం కష్టమైపోయింది. క్షణమొక యుగం అంటారే, అలాగ గడిచింది. నా భయం పాస్ పట్ల కాదు, ఫస్ట్ క్లాస్ వస్తుందా రాదా అన్నదే చింత.

ఫలితాల రోజు నేను పామర్రులో మా పెద్దక్కయ్య ఇంట్లో ఉన్నాను. మా నాన్న నూజివీడులో తాతగారి (అడుసుమిల్లి గోపాలకృష్ణ)తో ఉన్నారు. ఆరోజు దినపత్రిక వచ్చినప్పుడు వణికే చేతులతో తెరిచి చూశాను. నా నెంబర్ (5753) ఫస్ట్ క్లాస్ లో ఉండటం చూసి సంతోషంతో పిచ్చెక్కిపోయాను. తర్వాత మా అన్న నెంబరు (3402) సెకెండ్ క్లాసులో వెతికాను. అక్కడ లేదు. ఇండివిడ్యువల్ సెక్షన్ లో వెతికాను. అక్కడా లేదు. నాలో టెన్షన్ పెరిగిపోయింది. మూడు పరీక్షలు పోయే విద్యార్థి అయితే కాదు మా అన్న. చివరి ప్రయత్నంగా ఫస్ట్ క్లాసులో చూశాను. అక్కడ ఉంది మా అన్న నెంబరు!! తనమీద తనకు నమ్మకం లేక అలా చెప్పాడు మా అన్న. జీవితమంతా అతనిలో ఆ లక్షణం అలాగే ఉండిపోయింది. దానివల్లే నేను తన నెంబరు కోసం కిందనుంచి చూసుకుంటూ వెళ్లాను.

మా అక్క, బావ మా ఫలితాలు చూసి చాలా సంతోషించారు. అప్పటిదాకా ఉన్న అపనమ్మకాన్ని ఆర్ట్స్ స్టూడెంట్స్ గా మేమిద్దరం తొలగించినందుకు గొప్పగా ఫీలయ్యారు. నాన్న కూడా నూజివీడులో ఫలితాలున్న దినపత్రికను చూశారు. తన ఆనందాన్ని తాతగారితో పంచుకున్నారు. ఆయన ‘నువ్వు ఇప్పుడు ఆఫీసులో కాదు, కుటుంబంతో ఉండాలి, ఈ ఆనందం పిల్లలతో పంచుకోవాలి’ అంటూ తన షెవర్లే కారిచ్చి, తమ తోటలో పండిన వంద మామిడిపండ్లిచ్చి పంపించారు. సాయంత్రానికి అటు నుంచి నాన్న, ఇటునుంచి నేను ఒకేసారి ఇల్లు చేరాం. మా నాన్న కళ్లల్లో ఆనందబాష్పాలను తొలిసారి చూశాను.

ఆ నెల పూర్తవకముందే డిగ్రీ కోర్సులకు దరఖాస్తులకు చేశాం నేనూ మా అన్నా. మా ఫస్ట్ క్లాసులకు ఏ కాలేజీలోనైనా అడ్మిషన్ వస్తుందన్న నమ్మకం ఉండేది. మా అన్న మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో హిస్టరీ సబ్జెక్టుతో బి.ఏ. హానర్స్ చదవడానికి నిర్ణయించుకున్నాడు. నేను వాల్తేరులోని ఆంధ్రా యూనివర్సిటీలో ఎకనామిక్స్ సబ్జెక్టుతో బి.ఎ. హానర్స్ చదవడానికి దరఖాస్తు చేశాను. ఇద్దరికీ అనుకున్న అడ్మిషన్లు దొరికాయి. కొత్తకాలం మారాకు వేసింది.

(సశేషం)

ఫోటో:యువ ప్రేం చంద్ కుటుంబ సభ్యులతో తల్లీ తండ్రివెంకట్రామయ్య, నాగరత్నమ్మ. అక్క, బావ, అన్నయ్యలు

అనువాదం: అరుణా పప్పు

అరిగపూడి ప్రేమ్ చంద్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అప్పటి జీవిత విశేషాలు మంచి రికార్డుగా మిగిలిపోతుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు