తొలి కథ రాసినటువంటి అనుభవాన్ని రాసి పంపించమని పెద్దలు అఫ్సర్ గారు నన్ను అభిమానంగా ఆదేశించారు. వారు నాకు ఆప్తులు. వారిది – నాది ప్రాంతీయ భావం ఒక్కటే కాదు. ఈ మాట ఎందుకన్నానంటే ఇద్దరమూ ఖమ్మం వారమే. అయినా మేము తొలిసారి కలుసుకుంది భాగ్యనగరంలోనే. పరిచయం అయిన దగ్గరినుండి అఫ్సర్ గారు ఆత్మీయులయ్యారు. ఆ విధంగా వారు నన్ను “తొలి కథ అనుభవం” రాసివ్వమంటే ముచ్చటపడ్డాను. నా తొలి కథ 2006 లో అచ్చయ్యింది.
ఇప్పటికి దాదాపు 20 ఏళ్ళు. ఈ కాలంలో నేను ఇంకా మూడు కథలే రాశాను. మొత్తం గా నాలుగు కథలే రాసిన నేను నాలుగు మాటలు రాయమంటే నాకున్న అర్హత సరిపోదేమోనని సందేహపడ్డాను. కానీ పెద్దలు ‘మరేం పరవాలేదు. మొదటి కథ అనుభవానికి మొదటికథ రాసిన అర్హత చాల’ని భరోసా ఇచ్చిన మీదట ఆ అనుభవాలను ఇలా మననం చేసుకుంటున్నాను.
నా తొలి కథ ప్రచురితమైందని “ఆంధ్రభూమి” వార పత్రిక నుండి ఉత్తరం వచ్చిన రోజు నేను పొందిన సంతోషం అంతా ఇంతా కాదు. డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాను అప్పుడు. ఆ టైం లో ఐడెంటిటీ క్రైసిస్ ఉండేది నాలో. మా ఇంటి ఆర్థిక స్థితి అందుకు కారణం. ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు తొలి కవిత రాశా. అది ఆంధ్రజ్యోతి దినపత్రిలో వచ్చింది. నా ఫోటో తో వచ్చింది కాబట్టి అది నేను రాసిందే అని నమ్మించాల్సిన అవసరం రాలేదు నాకు.
నాలోనూ రాసే కళ ఉందని మా అమ్మ సంతోషపడింది. అలా అడపాదడపా కవితలు రాస్తూ ఉండేవాడిని. డిగ్రీ చదివే సమయం లో పుస్తకాలు విపరీతం గా చదివేవాడిని. ముఖ్యం గా మధుబాబు డిటెక్టివ్ నవలలు. తరువాత యండమూరి మల్లాది మాయలో పడ్డాను. వాళ్లంటే హీరో వర్షిప్ నాకు. వాళ్ళలా రచయితనయి పాఠకుల కు హీరో అవ్వాలని కలలు కనే వాడిని. ఇంకో సంగతేంటంటే… చదివే వాడికి రాయాలనే దుర్బుద్ది పుడుతుంది. మొదట కథ రాసే ప్రయత్నం చేయమని పెద్దలెవరో సలహాయిచ్చారప్పుడు.
అందులోను స్వాతి వీక్లీలో కథల పోటీలో బహుమతి వస్తే పదివేలు అని ప్రకటించేవారు. నేను కథ రాసినట్టు, ఆ పదివేలు నాకే వచ్చినట్టు కలలోచ్చేవి. సరే కదా అని కథ రాసి పంపిస్తే “మీ కథ ప్రచురించలేము. కథ రాసిన కాగితాలు మీకు తిరిగి కావాలి అని అంటే తగినన్ని స్టాంపులు ఉన్న కవర్ పంపించండి అని ఒక కార్డు ముక్క నాకు వచ్చేది. అసలే బాధలో ఉన్న నేను ఆర్థికంగా బాధపడడం ఎందుకు అని ఆ పోస్టు కవర్ కూడా పంపించే వాడిని కాదు.
ఇలా రాయడం అవి తిరిగి రావడం మూడు నాలుగు సార్లు జరిగింది. నా పొరపాటు ఏమిటో? ఎక్కడో? అర్థమయ్యేది కాదు. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా మరొక కథ రాశాను. ఈసారి స్వాతికి కాకుండా “ఆంధ్రభూమి” వారికి పంపాను. “మీరు వ్రాసిన సిరిమల్లెలు అన్న కథ 14.09.2006 సంచికలో ప్రచురిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము” అనే కార్డు వచ్చింది. కార్డు తెచ్చిన పోస్టుమాన్ “అయితే నువ్వు కథలు కూడా రాస్తావన్న మాట. వచ్చేనెల మనియార్డర్ వస్తుంది” అని భుజం తట్టాడు. మొదటి ప్రశంస అది. తరువాత్తరువాత నా కథ నిద్రపోతున్న తెలుగు సాహితి రంగంలో “పెను సంచలనమేమీ ” కలిగించలేదు. సముద్రంలో విసిరేసిన గులకరాయిలా బుడుగ్గున మునిగింది. అయితే వ్యక్తిగతంగా నాకు మాత్రం చాలా చాలా మేలు చేసింది.
మా కాలేజీ ప్రిన్సిపాల్ రమణ గారికి కి నేను కథ రాయడం, అది పత్రికలో రావడం తెలిసి నన్ను పిలిచి ప్రత్యేకంగా అభినందించారు. ఆ కథ జిరాక్స్ పెద్దగా తీయించి నోటీసు బోర్డులో పెట్టి “మన కాలేజీ బి.కామ్ విద్యార్థి కథ ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చింది. మీలో ఓ రచయిత ఉన్నాడు. మన కళాశాల తరుపున కమలాకర్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు.
అప్పటినుండి అమ్మాయిలు నన్ను అందరి అబ్బాయిలలా కాకుండా, కొంచెం ప్రత్యేకమైన వాడిగా చూడడం మొదలుపెట్టారు. ప్రత్యేకమైన వాడిగా కనిపించేందుకు, కవిని రచయితను అనిపించుకునేందుకు తెలివిగా నేను కూడా చొక్కా జేబులో పెన్ను పెట్టుకోవడం ప్రారంభించాను. రచయితననే సింబాలిజం మైంటైన్ చేయడానికి అలా చేశాను. గుడ్డ సంచి కూడా భుజానికి తగిలిద్దామనుకున్నాను. మా అమ్మను “అమ్మా… పాత గుడ్డ ఏదైనా ఉందా? సంచి కుట్టించుకోవాలి ” అని అడిగితే, మసిగుడ్డ ఇచ్చింది మా అమ్మ. దాంతో టైలర్ దగ్గరకు పోవడం నామోషీ అనిపించి సంచి సంగతి వదిలేసాను. లేకుంటే రాసిన కాయితాలతో నిండిన ఆ సంచి బరువు నాకు భుజం నెప్పితెప్పించేది. గండం తప్పింది.
నా మొదటి కథ “నేను కథ కూడా రాయగలను” అనే ధైర్యాన్నిచ్చింది. ఆ నమ్మకం నాలో ఇప్పటికీ ఉంది అంటే కారణం మొదట ప్రచురితమైన సిరిమల్లెలు అన్న కథే.
తరువాత డిగ్రీ అయిపోయి CA ( చార్టెడ్ అకౌంటెన్సీ) చదవడం వలన నాకు సమయం పెద్దగా దొరికేది కాదు. ఒకవేళ ఏ కొద్ది సమయం దొరికినా “పుస్తకాలు చదవడానికి సరిపోయేది”. నాకు రాయడం కంటే చదవడం ఇష్టం.
తరువాత్తరువాత నేను విరివిగా రాలేకపోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. నన్నయ మొదలుకొని ఇప్పటివరకు చాలామంది రచయితలు చాలా చాలా రచనలు చేశారు. ఒక్కో రచయిత లెక్క పెట్టడానికి వీలులేనన్ని కథలు నవలలు రాశారు. అందరూ రాస్తే చదివేదెవ్వరు? అందరూ పల్లకిలో కూర్చునే వారే అయితే మోసే వారెవ్వరు? అందుకే నేను “మొద్దామని” నిర్ణయించుకున్నాను. చదువు అయిపోయాక డిగ్రీ లెక్చరర్ కావడం, అక్కడినుండి సినిమా రంగానికి రావడం కూడా నాలుగు కథలే రాయడానికి ఇంకొక కారణం.
సినిమా రచనలో భాగం కావడం వలన మన “సృజన” ఇంకా ఎక్కువ మందికి చేరుతుందనే ఆలోచన కూడా తక్కువ రాసేలా చేసిందేమో!?
అయితే తొలి కథ తొలి ముద్దంతా తీయగా, తొలికౌగిలి అంత వెచ్చగా, తొలి కలయికంత గొప్ప జ్ఞాపకంగా నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఇప్పటికీ గుర్తుంది.
*








కల్పనా సాహిత్య సృష్టి చెయ్యడానికి రాసే నేర్పు కన్నా రాసే తెగింపు ఉండాలి.
ఇలా రాస్తే బావుంటుందా అలా రాస్తే బావుంటుందా అనే సమయంలో పడితే రచయిత అవ్వడం కష్టం.
అదే సమయంలో రాయాలనుకున్నది రాసి పడేయడం కూడా సరి కాదు.
బాధ్యతా యుతమైన రచయితగా ఎదగాలి అనుకునే వారు ఎక్కువ రాయకపోవడానికి కారణం అదే