మోహం అనే సంకెల..

మోహాలు స్త్రీ పురుషులను అలాగే మెలిపెట్టి తిప్పి ఎక్కడో దిక్కుతోచనిచోట పడేస్తాయని, నేలబారు జీవితాల్లో బతికేవాళ్ళకు అటువంటివారు అర్థం కారనే చలంగారు అన్ని కథల్లో వాపోయారు.

యే మోహ మోహ కె ధాగే – తేరే ఉంగులియోం సె జా ఉల్ ఝే

కోయి టోహ టోహ నా లాగే – కిస్ తరహ్ గిరహాయే సుల్ ఝే

మూడేళ్ళ కిందట అనుకుంటాను ఈ పాటను ఫేస్ బుక్ లో ఒకామె పరిచయం చేస్తూ లింక్ పెట్టారు. వినగానే నిన్నటి సాయంత్రపు పూలు రాత్రి వర్షానికి ఈ ఉదయం నేలరాలినట్టు దీర్ఘ విరహ ప్రేమగాథలెన్నో మనసులో మెదిలాయి. విఫల ప్రేమకథలు కూడా. అయినా ప్రేమ ఎంత మధురం? ఎంత పెద్ద సంకెల!!

‘ఈ మోహపు దారాలు – నీ వేళ్ళలో చిక్కుకున్నాయి. ఈ చిక్కులు విప్పుకోవడం చాతకావడం లేదు’ అనగానే ఎందుకో రవీంద్రనాథ్ టాగూర్ శిథిల కుటీరం కథ మనసంతా నిండిపోయింది. ఊపిరాడనట్టయింది. తీసి అప్పుడూ ఇప్పుడూ కూడా మళ్ళీ చదువుకున్నాను. మళ్ళీ అదే ఊపిరి అందకపోవడం.

అంత విశాలంగా ఆ ముగ్గురి హృదయాలూ పరచి, లోపలి ప్రతిస్పందననూ వినిపించిన టాగూర్ కథను సత్యజిత్ రే కవిత్వంలా మలచుకుని దృశ్యకావ్యం చేసాడు. “చారులత” మళ్ళీ మళ్ళీ చూడాలనిపించి, చూసేక బరువును ఎక్కడా దింపుకోలేకుండా చేసే సినిమా.

చాలా ఏళ్ళ క్రితం తెలుగులో ‘యాత్ర’ అని ఒక నవల చదివాను. ఆ నవల కూడా ఇలా మోహదారాల చిక్కుల కథే. అందులో విషాదంగా మిగిలిన ప్రేమ గురించి రచయిత కృష్ణ ఇలా రాస్తారు, ‘ఈ చిగురు మొగ్గగా, పువ్వుగా మారడం తెలిసేలోపే పిందెగా మారి పెనుగాలి నేల రాలిపోయింది’ అని.

శిథిల కుటీరం పెద్ద కథ. అమల్, చారులతలు వదినా మరుదులు. చారు భర్త భూపతి ఉద్యోగం అవసరం లేనంత ధనవంతుడు. సరదాకి ప్రింటింగ్ ప్రెస్ పెట్టి వార్తాపత్రిక తెస్తూ ఉంటాడు. భార్య చారులతతో గడిపే సమయం ఉండదు.  ఆ అవసరమూ తెలీదు. తమ్ముడు అమల్ కి ఆమెను అప్పజెపుతాడు చదువు చెప్పమని. ఆవిధంగా తన బాధ్యత తీరిందనుకుంటాడు.

‘‘భార్యాభర్తల ప్రేమోన్మేషపు తొలి అరుణకాంతిలో ఒకరికొకరు ఎంతో ఆశ్చర్యకరంగా, నిత్యనూతనంగా భాసిస్తుండే దాంపత్యంలోని బంగరు కాంతులు వెదజిమ్మే ప్రభాత సమయం అజ్ఞాతంగా ఎప్పుడు దాటిపోయిందో అది ఎవరూ తెలుసుకోలేకపోయారు. నూతన తృష్ణ యొక్కఆస్వాదనను పొందకుండానే ఉభయులూ అతిపరిచితులూ, అలవాటూ అయిపోయారు’’ అంటారు టాగూర్. ఇది భూపతి చేసిన, వెనక్కి తీసుకోలేని తప్పిదం అంతే కాక సమవయస్కుడయిన మరిదిని ఆమెకు తోడుగా పెట్టడం మరొకటి.

అమల్, చారూ మంచి స్నేహితులయ్యారు. పెద్ద ఉద్యానవనం నిర్మించాలనే ఊహలని అక్షరాలలోకి మళ్ళించారు. అప్పటికే కాస్త రచనలు మొదలుపెట్టిన అమల్  వాటిని వదినతో పంచుకోసాగాడు.

చారులత పూల రెక్కల లాంటి మృదులభావాలు కల అమ్మాయి. పొంగిపొరలే తన సేవలకు, ప్రేమలకు ఆధారం వెతుక్కుంటున్న పిపాసి.

అచ్చులో అరవై పేజీల కథని రెండు గంటల చలనచిత్రంలోకి తేవడంలో ‘రే’ రాసుకున్న స్క్రీన్ ప్లే ఎంత నేర్పుగా ఉంటుందంటే – పేజీలు పేజీలలో ఉన్న చారులత మనోభావాలను చిన్న చర్యలోకి కెమెరాతో పట్టుకుంటాడు. కథలో లేని బైనాక్యులర్స్ సినిమాలోకి వస్తాయి. చారులత బీరువాలోంచి వాటిని తీసి మాటిమాటికీ దూరాలు దగ్గర చేసుకుంటూ ఉంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే ఆమె దృష్టికోణంలోని ప్రత్యేకతను సత్యజిత్ రే అలా ప్రతీకాత్మకం చేసాడు.

అమల్ రచనలు పత్రికలకెక్కాయి. ఇది చారు మనసుకి ఆమెకే తెలియని గాయం. ఆ రచనలకి తానొక్కతే పాఠకురాలని, అది తామిద్దరూ మాత్రమే రహస్యంగా పొందవలసిన ఆనందమని ఆమె తనకే తెలియనివిధంగా భావించుకుంది. గాయం ఎందువల్ల అయిందో కూడా తెలీకుండా అమల్ దోషి అనుకుంది.

ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో తెలీక, తనూ రాయడం మొదలుపెట్టింది. అదే ఆమె చేయగల ప్రతీకారం. తీరా అది అచ్చులోకి వెళ్ళి అమల్ కంటే ఆమె రచననే గొప్పగా ఉందనే ప్రశంస రావడాన్ని కూడా ఆమె ఊహించలేదు. ఆమెకు నచ్చలేదు కూడా.

ఈ కాలమంతటా వారిలో స్నేహం ఎప్పుడు వికసించిందో అది ఆమెలో మోహతంతువుగా ఎలా మారి అతని అంగుళుల మధ్య అక్షరాలలోంచి, రచనలలోంచి విస్తరించి చివరకు చిక్కుముళ్ళు పడిందో గ్రహించలేకపోయింది.

అమల్ పాఠకలోకంలో ఆమె లభించిన ప్రశంసకు ఆమె ఆనందంతో ఉందనుకున్నాడు. కానీ ఆమె ఆ ప్రశంసలను స్వీకరించే మనస్థితిలో లేదు. ‘‘ఆమె మనస్సు ఏవిధంగానూ సంతోషించేటట్లు లేదు. శోచనీయమయిన ప్రశంసాసుధాపాత్రను నోటిదాకా రాగానే తోసిపారెయ్యడం మొదలుపెట్టింది’’.

మోహం ప్రేమగా పరిణతి చెందేలోపే ముక్కలయ్యేది ఇలాంటి అపోహల వల్లనే.  చిన్న చిన్న కారణాలతో ప్రేమికులు విడిపోయినట్లు కనిపిస్తుంది కానీ – మోహతంతువులు బహు సున్నితం. అవి ఊలుదారాల కన్నా మృదువు. బిస తంతువులంటారు పూర్వ కవులు. అంత సుకుమారం. ఏ గాఢానిలపు తాకిడికయినా అల్లల్లాడిపోతాయి.

దూరాలు పెరిగిపోయాయి. భూపతి వ్యాపారంలో నమ్మకద్రోహానికి బలయ్యాడు. ఓదార్పు కోసం ఇంటివేపు చూశాడు. చారులత తనలో తాను లేదు. విరిగి మీద పడబోతున్న ఆకాశం వంక  చూస్తూ ఉంది. అమల్ దూరంగా వెళ్ళిపోయాడు.

చారులత అతని వెంట దూరాల దాకా సాగిపోయిన మోహ పాశాలను తెంపలేకపోయింది. అమల్ నిర్వికారంగా వెళ్ళిపోవడాన్ని ఆమె అర్థం చేసుకోలేకపోయింది. భర్తను ఓదార్చవలసిన స్థితిలో తననే తను నిగ్రహించుకోలేకుండా ఉంది.

పగిలిన మోహాల తర్వాత మిగిలే వేదన ఎలా ఉంటుందో టాగూర్ కంటే ఎవరూ యదార్థంగా చెప్పలేరనిపిస్తుంది. పెద్ద దెబ్బ తగిలితే కండరాలు మొద్దుబారిపోయి మొదట్లో బాధ తెలియనట్టు, ఈ ఎడబాటు తొలిరోజుల్లో అమల్ లేని వెలితిని చారు పూర్తిగా తెలుసుకోలేకపోయిందంటాడు.

సరిగ్గా ఇవే మాటలు శరత్ దేవదాసు నవలలో రాస్తాడు.

పార్వతి పెళ్ళి అయి వెళ్ళిపోగానే దేవదాసుకి ఏమీ తెలియలేదని, పార్వతి తనలో భాగం అనుకున్నాడని, కొంత కాలానికి అర్థం అయిందనీ, శరీరంలో ఒక భాగం పక్షవాతం వల్ల చచ్చుబడినప్పుడు తప్ప నష్టం ఎంతో తెలియదని రాస్తాడు.

రోజులు గడుస్తున్నకొద్దీ చారుకి ఆ శూన్యం తెలియడం మొదలుపెట్టింది. తోటలోంచి ఎడారిలోకి వచ్చిపడింది. నిజానికి ఆమెకు ఆ ఎడారి గురించి ఏమీ తెలీదు.

అది ప్రేమించినవాళ్ళందరూ అనుభవించవలసిన శిక్షే. దాని గురించి ముందుగా తెలుసుకునేటంత సమయమూ, వ్యవధీ కూడా ఉండవు. ప్రేమలు మధ్యలో తెగిపోయిన వాళ్ళందరికీ అర్థమయి, ఊరటనిచ్చే మాటలు ఇలా రాస్తాడు టాగూర్.

‘‘నిద్రలేవగానే ఏమిటో గుండె గతుక్కుమనేది. అమల్ లేడు అన్న సంగతి గుర్తొచ్చేది.  ప్రతి పని వెనుకా అతను లేడు, రాడు అన్న విషయం గుర్తొచ్చి గుండె మెలిపెట్టేది’’.

మనోవేదన అనుక్షణం పీడిస్తుండడంతో ఆమెకు భయమూ కలిగేది. దాసదాసీలు, నౌకర్లు వీధిలో బరువులు మోసే కూలివాళ్ళు సైతం నిశ్చింతగా తిరుగుతున్నారు. నాకిలా ఎందుకయింది అని ప్రశ్నించుకుని, ‘భగవాన్ హరీ నన్నిలా విపత్తులోకి ఎందుకు తోసావ్?’ అని బాధపడేది.”

” ఏం చేసినా దుఃఖోపశమనం లేదు. అమల్ స్మృతులు ఆమె మనస్సులోనూ, బయటా కూడా ఎటూ పారిపోవడానికి సందు లేనంతగా పరివ్యాప్తమయిపోయాయి. చివరకు ఓటమి అంగీకరించి తనలోనే ఒక రహస్య శోక మందిరాన్ని నిర్మించుకుంది’’ అని రాస్తాడు.

చారు తాను అమల్ తో విప్పుకోలేని అనుబంధం పెట్టుకున్నాననిగాని, దాని పర్యవసానం గురించి గానీ ఆలోచించే స్థితిలో ఉన్నట్టు రాయడు టాగూర్. ఆమె ఆ పరిచయంలోంచి ఆ అనుబంధంలోంచి ఆ ఊబిలో కూరుకుపోయింది అన్నట్టు ఉంటుంది.

మోహాలు స్త్రీ పురుషులను అలాగే మెలిపెట్టి తిప్పి ఎక్కడో దిక్కుతోచనిచోట పడేస్తాయని, నేలబారు జీవితాల్లో బతికేవాళ్ళకు అటువంటివారు అర్థం కారనే చలంగారు అన్ని కథల్లో వాపోయారు. వారిని ఆశ్చర్యంగా చూడండి, వారి గురించి ఉదారంగా మాట్లాడండి అని కూడా రాస్తారు

భూపతితో గృహ జీవనంలో ఇమడాలని ప్రయత్నించింది కానీ అమల్ ఉపేక్ష ఈ ‘శాంతవిషాదపు చంద్రా తపచ్ఛాయ’ను చెదరగొట్టేసింది. ‘ఆమెలోపల మళ్ళీ గుండెలు మెలివేసుకుపోవడం ప్రారంభమయిందట’’.

ఈ ‘గుండెలు మెలివేసుకుపోవడం’ అనుభవించినవాళ్ళకు తప్ప మరొకరికి అర్థం కాదు.

భూపతికి క్రమంగా అర్థమయింది. ‘‘హృదయం మృతభారంతో ఉండే ఆమెను హృదయానికి హత్తుకోవడం. అది నేను మాత్రం ఎన్నాళ్ళు చేయగలను’’ అనుకుంటాడు.

విడిచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాడు.! నేను వస్తానంటుంది. ‘వద్దు, నావల్ల కాదు’ అంటాడు. మళ్ళీ వెంటనే ‘నాతోనే రా’ అంటాడు. ‘అహ – వద్దులెండి’ అంటుంది.

అక్కడ కథ ఆగిపోయింది.

సత్యజిత్ రే ఈ ఆఖరి సన్నివేశం ఎలా తీస్తాడా అని ఉత్కంఠతో చూసాను.

వరండాలో చెప్పుల చప్పుడు విని చారు సంశయంగా గుమ్మం దగ్గరకి వచ్చింది. గుమ్మం బయట భూపతి. పనివాడిని దీపం వెలిగించి తెమ్మంది అప్పటికే.

సంధ్య చీకట్లు మూగుతున్నట్లు ఆ నలుపు తెలుపుల ఫొటోగ్రఫీతో చూపిస్తాడు. చారు భయ సంశయాలతో చెయ్యి చాపింది. అయిష్టంగా, సంశయంగా భూపతి చెయ్యి అందించబోయాడు. ఆ చేతులు కలవలేదు. కలుస్తాయో లేదో తెలీదు. కెమేరా ఆగిపోయింది.

దూరంగా నౌకరు చేతిలో దీపం.

సంధ్య వెలుగులను కమ్ముతూ క్రమంగా ఆక్రమిస్తున్న చీకట్ల మధ్య వారిరువురూ.

ఇలా ఇద్దరూ టాగూర్, సత్యజిత్ రే లు వేరువేరుగా చెప్పినా ఒకేలా గుండె బరువెక్కిస్తారు.

ఇక తర్వాత పుస్తకం మూసినా, సినిమా ఆపినా అస్తిమితంగా అటూ ఇటూ తిరుగుతాం. ఎప్పటికోగానీ మళ్ళీ మామూలు ప్రపంచంలో పడం.

ఇదంతా అవసరమా! అంటారు కొందరు. కానీ ఇలాంటి కథలు, సినిమాలూ, ప్రేమలూ, ఆనందవైఫల్యాలు లేదా విఫల సంతోషాలూ లేకపోతే గుండె ఎంత శూన్యం తో నిండిపోతుంది.

అందులోకి దయామృతం ప్రవహించడానికి దారి ఎలా ఏర్పడుతుంది మరి!!

ఇదంతా టాగూర్ స్వంత కథే అంటారు. కానీ కథంతా వదిన వేపు నుంచి చెప్తాడు. ఆమె అమాయకంగా, నిస్సహాయంగా ఈ అగ్నిలోకి దూకడం గురించే చెప్తాడు.

ఇవాళ టాగూర్ వదిన కాదంబరి లేదు కానీ చారులతగా మన మనస్సుల్లో ఉండిపోయింది.

గత శేఫాలికలు:

 

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

27 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వసంతవేళ కోయిల మావి చిగురు వగరును పిలుపుగానూ, మబ్బుఛాయలేక వేసవి రేయి నెమలి చేసే విరహరవం గానూ…. వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారి హృదయస్పందనలు మన జీవితంలోని గత మధురస్మృతులను సవరించడం ఎన్నిసార్లైనా ప్రతిసారీ అంత సుతారంగా తడిమి, ఎదను బరువెక్కించి రెండు కన్నీటి చుక్కలు ఒలికించడం ఓ గొప్ప ప్రత్యేకత.
    నవలలో సజీవత్వం తెరకు ఎక్కిస్తూ తమదగు సృజనాత్మకతను పొందుపరచడం సత్యజిత్ రే గారి కళాత్మకత. దాన్ని మనకు బహు సున్నితంగా అందించడం వీరలక్ష్మి గారి గారడి !!! మోహం ప్రేమలో ఒక స్థితి… అది తీరిపోతే ఆ తీపి తరిగిపోతుందేమో అన్నట్టు … కొన్ని అనుబంధాలు అలా మరో దారిలోకి వరలిపోతాయేమో… అలా చేజారిన అనుభూతుల భారపు వన్నెలు వీరలక్ష్మి గారి కలం చిత్రించిన ఈ వ్యాసం చాల పర్సనల్ ఆస్తి …అనిపించింది…

    • థాంక్యూ వెరీమచ్ శైలజ గారూ

    • జయా థాంక్యూ వెరీమచ్

  • అక్కా!.. ….ముందుగా నా మనః పూర్వక అభినందనలు .
    .టాగోర్ “శిధిల కుటీరం” లోని సున్నిత హృదయాల భావనల్ని నవలగా…. సత్యజిత్ రే “చారు లత” సినిమాగా ఎంత హృద్యంగా తెరకెక్కించారో !!….రకరకాల భావోద్వేగాలకు లోనవుతూ చదివి ,చూ సిన నాకు వారిద్దరికీ సమజోడిగా అంతే చక్కగా ఆ భావనల ని పొందుపరుస్తూ సమతౌల్యం తో వ్రాసిన నీ ఈ “కొన్ని శేఫాలికలు ” శీర్షికలోని మోహం అనే సంకె ల ..వారిద్దరి ప్రయత్నాలని హృద్యముగా వివరించి వర్ణించిన తీరు …..భలే సంతోషాన్నిచ్చింది .ఎంచేతనంటే ఆ ( కద, లేదా సినిమా చదివి ,చూసాక ) ఆనందాన్ని మాటల్లో ఎలా పెట్టాలో తెలీక పడిన అవస్థ పోయింది . ఎంతో సంతృప్తి ని కూడా . క లి గింఛావు

    • శుభా
      మంచి విశ్లేషణ
      థాంక్యూ వెరీమచ్

    • థాంక్యూ వెరీమచ్ పద్మా జీ
      మీరు ఊళ్లోనే ఉండి దాగుడుమూతలాడుతున్నారు

  • ఆర్ద్రతతో కూడిన కొన్ని నమస్సులు మీకు, Originally కోసం English subtles tho ఉన్న బెంగాలీ భాష లోని ‘చారులత’ సినిమాని పదిసార్లు చూసి ఉంటానమ్మ, నేపథ్యంలో వచ్చే సంగీతం, కవిత్వం కోసమే. మీ వ్యాసం చదివకపోయి వుంటే కథ లోని లోతును ఇంతలా ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోదును _/\_ feeling amazing Mam, Thank you!!

    • రేఖా థాంక్యూ వెరీమచ్
      మీ కవిత్వం నాకు ఇష్టం

      • Thank you so much Mam, and sorry for the spelling mistakes in my comment 🙁 * originality కోసం English subtitles తో – అని 🙂

  • “మోహం అనే సంకెల ” పేరుతో టాగూర్ కథ “శిధిలకుటీరం” తో సత్యజిత్ రే సృజించిన ” “చారులత” చిత్రాన్ని కళ్ళముందుంచారు. చారులత ఒకవైపు మోహం మరొక్కవైపు వైవాహిక బంధం నడుమ చిక్కుకొన్న మానసిక తుములం మీరు ఉదహరించిన ” ఈ మోహపు దారాలు.–నీ వేళ్ళలో చిక్కుకొన్నాయి. ఎలా విప్పుకోవాలో తెలియటంలేదు” వాక్యాలతో కట్టి పడేసి , ఆసక్తిని సృష్టించేశారు. చాలా సంవత్సరాల మునుపు చూసిన కన్నడ సినేమా ” ఉయ్యాల” గుర్తుకొచ్చింది.అది కూడా త్రికోణపు ప్రేమ. ప్రేమ ఎంత మధురం ఎంత గట్టి సంకెల” కళ్ళముందుంచారు చారలతను. ఆమె ఆ మోహపు సంకెళ్ళలో చిక్కుకొని అనుభవించిన వేదన మనసును నులిపెట్టేశాయి. పార్వతిని పోగొట్టుకున్న తరువాత తెలుసుకొన్న దేవదాసు వ్యథ ,అతని చివరి దశ కళ్ళనీళ్ళు తెప్పించటమేకాదు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది జీవితాంతం. ధన్యవాదాలు లక్ష్మీ గారు ఇన్ని జ్ఞాపకాలను లేపి చారులత చిత్రాన్ని కళ్ళముందు, మనసులో నిలిపినందుకు.

    • సుశీలనాగరాజ గారూ
      అన్నింటికీ థాంక్స్

  • నమస్తే వీరలక్ష్మి గారూ. చాల మంచి పరిచయం. మీ పరిచయం కూడా టాగూర్ & సత్యజిత్ రే లంతా కళాత్మకంగా పరిచయం చేసారు. మీ ” శేఫాలికలు” అన్ని చదువుతాను

    • ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారూ

  • ఒక్క పల్లవి మిమ్మల్ని ఎంత లోతైన ప్రయాణాన్ని చేయించింది ???? ఈ శేఫాలిక చదివినందుకు చాలా ఆనందంగా ఉంది అమ్మా. మీరు నిజంగా హృదయవాదే ????

    • థాంక్యూ సునీత గారూ

  • Super veera lakshmi garu… అది అనుభవంలోకి వస్తే మనసు పడే బాధ వర్ణనాతీతం.

    • థాంక్యూ వెరీమచ్ సత్యవేణి గారూ

  • చాలా సంతోషం అక్కా!
    ఈ సాయంత్రం…మనసును తీయని బాధతో నింపుకొన్నాను

    • థాంక్యూ వెరీమచ్

  • ఈ సినిమా చూద్దామని మొదలుపెట్టినా పూర్తి చేయలేదు. మీ విశ్లేషణ చదివాకా చూడాల్సిందే

    • థాంక్యూ వెరీమచ్

  • చాలా బాగుంది మేడం. మీ వ్యాసం చదివాక సినిమా చూడాలనిపించింది.

    • థాంక్యూ వెరీమచ్ చందూ

  • పుస్తకం చదవలేదు కానీ సినిమా చూసాను. మళ్ళీ అంతా జ్ఞాపకం వచ్చింది. చాలా బాగా వివరించారా సంఘర్షణను.

  • అత్యద్భుతః!!..మాటల్లేవు.. భావాలని వ్యక్తీకరించ డానికి!!
    (ఇక తర్వాత పుస్తకం మూసినా, సినిమా ఆపినా అస్తిమితంగా అటూ ఇటూ తిరుగుతాం. ఎప్పటికోగానీ మళ్ళీ మామూలు ప్రపంచంలో పడం.)..చారులత సినిమా అర్జెంట్ గా చూడాలనిపిస్తోంది…ఎటూ కాదంబరి నవల తెచ్చుకోలేను కాబట్టి!(మోహాలు స్త్రీ పురుషులను అలాగే మెలిపెట్టి తిప్పి ఎక్కడో దిక్కుతోచనిచోట పడేస్తాయని, నేలబారు జీవితాల్లో బతికేవాళ్ళకు అటువంటివారు అర్థం కారనే చలంగారు అన్ని కథల్లో వాపోయారు. వారిని ఆశ్చర్యంగా చూడండి, వారి గురించి ఉదారంగా మాట్లాడండి అని కూడా రాస్తారు..)ఇలాంటి వాక్యాలను పొందుపరచడం…ఎంత హృద్యంగా ఉందో!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు