మనిషి పరిచయం

 10

నుకున్నట్టుగానే సాయంత్రం తెలంగాణ భవన్ నుండి పిలుపొచ్చి రాత్రికి రాత్రే హైదరాబాద్ కు వచ్చింది సుభద్ర. పొద్దంతా కార్యకర్తలను వెంటేసుకుని తిరుగుడే తిరుగుడు. కవితగారినీ, కె టి ఆర్ నూ.. సంతోష్ గారినీ, దేశపతి గారినీ.. అంతా ఒక నిశ్శబ్ద శబ్దం లోలోపల బాంబులా పేలడానికి సిద్ధంగా ఉంది.

డైరీ రాయడం మొదలుపెట్టింది ప్రతి రోజూ తెలంగాణ భవన్ లోని తన గదిలోకి రాగానే.

తేది: 12 డెసెంబర్ , 2013:

ఆంధ్రప్రదేశ్ శాసన సభ జరుగుతున్నన్ని రోజులు అక్కడి విశేషాలను గమనిస్తున్న ఏ తెలంగాణా వాదికైనా రక్తం కుతకుత ఉడుకుతది. కరడుగట్టిన ఆంధ్రా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిండు శాసన సభలో అతని చిత్తూరు జిల్లాకు ఏడు వేల కోట్ల రూపాయల నిధులను శాంక్షన్ చేసుకుని ఇక్కడి డబ్బును దోచుకుపోతాంటే ఏ ఒక్క తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ శాసనసభ్యుడూ నోరెత్తడు. ప్రతిఘటించడు.. సరికదా తెలంగాణా టి ఆర్ ఎస్ శాసన సభ్యులు ఎలుగెత్తి నిలదీస్తూంటే ఏ ఒక్క దద్దమ్మా మద్దతివ్వడు. ఒక దశలో ‘ ఔను అలాగే చేసుకుంట.. మీ తెలంగాణాకు ఒక్క రూపాయికూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి ‘ అని ముఖం మీద ఉమ్మేసినట్టు సభాముఖంగా అన్నా.. సిగ్గు మాలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు నిర్లజ్జగా కూర్చున్నారంతే.

ఈ రోజే సాయంత్రం ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి పంఫిన ‘ తెలంగాణ ముసాయిదా బిల్లు -2013 ‘ ప్రతులు ఇనుప పెట్టెల్లో హైదరాబాద్ కు చేరుకున్నాయి. గట్టి భద్రత మధ్య ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ కె.కె. మహంతికి కేంద్ర హోం శాఖకు చెందిన అధికారులు అప్పగించి వెళ్ళారు. అ వార్తను చెబుతున్నప్పుడు ప్రకటించిన విషయమేమిటంటే.. ఆ బిల్లును శాసనసభలో సవివరంగా చర్చించి 6 వారాలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ తమ అభిప్రాయాలను కేంద్రానికి పంపాలె.

తేది : 15 డిసెంబర్, 2013

ఈ రోజు శాసన సభలో ప్రతి ఎమ్మెల్యేకూ రాష్ట్రపతి పంపిన బిల్లు ప్రతిని శాసనసభలో అందజేశారు. సీమాంధ్ర శాసన సభ్యులకు లోపల ఎంత ఆక్రోశంగా ఉందో ఈ రోజు స్పష్టంగా బయటపడింది. మూకుమ్మడిగా అందరూ ఆ బిల్లు ప్రతులను ముక్కలు ముక్కలుగా చించేసి సభలో గందరగోళం సృష్టించారు. చాలా ఉద్యమ సభల్లో కేసీఅర్ అంటున్నట్టుగానే తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు ఎంత దద్దమ్మలో ఈ శాసనసభ సమావేశాల్లో స్పష్టంగా అర్థమౌతోంది. ఏ ఒక్కరూ పౌరుషంగా ఒక్క మాటకూడా మాట్లాడలేదు. దీన్నిబట్టి ఈ తరానికి అర్థమైన విషయమేమిటంటే గత 57 సంవత్సరాలుగా మన ఎమ్మెల్యేలు సీమాంధ్ర ముఖ్య మంత్రులకు ఎట్లా బానిసలై పడున్నారు.. ఏవేవో స్వంత ప్రయోజనాలను ఆశించి తమను తామూ, యావత్ తెలంగాణా ప్రయోజనాలను ఎట్లా తాకట్టుపెట్టి తమ పబ్బం గడుపుకున్నారు .. కుక్కకు ఒక బొక్కేసినట్టు ఏవో కొన్ని కాంట్రాక్టులనిచ్చి, వీళ్ళని ఎట్లా కాపలా కుక్కల్లా వాళ్ళు వాడుకున్నారు.. అన్న విషయం.

చాలా స్పష్టంగా కనబడ్తోంది.. మన్ను తిన్న పాముల్లా పడున్న తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ, మంత్రులూ. వాళ్ళ మీదికి సింహాలై గర్జిస్తూ ఈసడిస్తున్న ఉద్యమ ఎమ్మెల్యేలు.. తేడా.

డిసెంబర్ 16 న శాసన సభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధరబాబు మొక్కుబడిగా ‘ తెలంగాణ ముసాయిదా బిల్లు – 2013 ‘ పై చర్చ మొదలైనట్టుగా సభలో ప్రకటించారు. అప్పుడు స్పీకర్ స్థానంలో నాదెండ్ల మనోహరబాబు ఉన్నాడు. అంతా ఒక తంతు జరుగుతోంది.

తేది: 19 డిసెంబర్ 2013

ఇక్కడ కుక్కల కొట్లాట జరుగుతున్న విషయాలు దేశమంతా విశదమౌతున్న స్థితిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిదికోసం సికింద్రాబాద్ వచ్చారు. ఇక పోలోమని బొల్లారం భవనానికి పరుగులు అన్ని పార్టీలవాళ్ళు. ముఖాలపై నవ్వులు.. కడుపులో విషాలు. మీడియాలో ప్రహసనం.

తేది : 3 జనవరి, 2014

అసలే చచ్చిన పీనుగులు తెలంగాణ శాసన సభ్యులు. ఐనా ఎందుకైనా మంచిదని వెంటనే శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర బాబును తప్పించి ఆ శాఖను తమ మాట వినే శైలజానాథ్ కు అప్పగించిన ముఖ్యమంత్రి.

తేది : 6 జనవరి 2014

ఇంతకూ బిల్లుపై చర్చ మొదలైనట్టా కానట్టా అని అక్బరుద్దీన్ ప్రశ్న. ప్రారంభమైందని స్పీకర్ మనోహరబాబు జవాబు. ఇక గందరగోళం మళ్ళీ.

తేది : 8 జనవరి 2014

అనివార్యమై బిల్లుపై మంత్రి వట్టి వసంతకుమార్ చర్చను మొదలు పెడ్తూ ప్రసంగం. అక్కసే.

తేది 10 జనవరి 2014

తెలంగాణ శాసనసభ్యుల నేత ఈటెల రాజేందర్ తెలంగాణా ప్రాంతానికి జరిగిన అనేక అన్యాయాల గురించి చేసిన సుదీర్ఘ చర్చ. దానిపై ఆంధ్రుల వెక్కిరింతల అపహాస్యాల హేళన.. వెకిలి ప్రహసనం.

తేది 25 జనవరి 2014

ఈ రోజు ఇద్దరు ప్రముఖ తెలంగాణ బద్ద వ్యతిరేకుల ప్రసంగాలతో సీమాంధ్రుల అసలు రూపం, తెలంగాణా కాంగ్రెస్ శాసన సభ్యుల అసలు బానిసతనం బట్టబయలయ్యాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ తాము పూర్తిగా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామనీ , దాన్ని ఎన్నడూ అంగీకరించజాలమనీ స్పష్టపరిచాడు. ఇక ప్రతిపక్ష నేత నిశ్శబ్ద కుట్ర దారుడు చంద్రబాబునాయుడు ‘ అసలు ఇది బిల్లే కాదు. అదంతా తప్పుల తడక .. అని ఈసడిస్తూ.. అసలైన నిజమైన బిల్లును శాసన సభకు పంపాలని అర్థహీనమైన ప్రతిపాదనను .. రెండు కళ్ళ సిద్ధాంతం వలె సభ ముందుంచి తెలంగాణ ను వ్యతిరేకించాడు.

మొత్తంమీద అంగడిచ్చుల్లయిపోయి.. పుణ్యకాలం 42 రోజులు గడిచిపోయాయనీ ఇంకా తాత్సారం చేసేందుకు ఇంకో మూడు వారాల గడువు కావాలని ఒక వినతి పంపారు రాష్ట్రపతికి.

రాష్ట్రపతి నుండి ఆగమేఘాల మీద చర్చించడానికి మరో వారం రోజుల గడువునిస్తూ ఉత్తర్వులందాయి. ఎట్లైతేనేమి చివరికి చావు కబురు చల్లగా అన్నట్టు తామందరమూ ‘ తెలంగాణ ముసాయిదా బిల్లు – 2013 ‘ ను వ్యతిరేకిస్తున్నట్టుగా ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపి రాక్షసానందాన్ని ప్రదర్శించారు సీమాంధ్రులు కలిసికట్టుగా.

కాని మహాత్ముడు , రాజ్యాంగకర్త బి ఆర్ అంబేడ్కర్ ఇటువంటి దుర్మార్గులుంటారని అప్పుడే.. ముందే ఊహించి .. ఇటువంటి సందర్భాల్లో శాసనసభ ఆమోదం ఇటువంటి బిల్లులకు తప్పనిసరి అవసరం కాదని నిర్దేశించాడు.

బాల్ ఇక ‘ ఆంధ్రప్రదేశ్ ‘ అన్న రాష్ట్ర పరిధిని దాటి ‘ భారత ప్రభుత్వం ‘ అన్న కోర్ట్ లోకి వెళ్ళింది.

ఇక ఇక్కడ శాసనసభ దుర్మార్గులు మౌనం వహించగానే పెద్దన్నలు లోకసభ దుర్మార్గులు పార్టీలనూ, సిద్ధాంతాలనూ మరచి ఒక్కటై ఢీల్లీలో రెచ్చిపోవడం మొదలెట్టారు.

4-6 ఫిబ్రవరి , 2014 : కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ‘ ఎ.కె.ఆంటోనీ అధ్యక్షతన రెండు రోజులూ వార్ రూం లో అత్యవసరంగా సమావేశమై ‘ ఆంధ్రప్రదేశ్ తిరస్కరించిన ముసాయిదా బిల్లు ‘ ను యథాతథంగా ఆమోదించి కేంద్ర క్యాబినెట్ కు పంపింది.

విధికృతంగా కొన్ని పనులు ఇక ఎవరు ఆపినా ఆగని వింత పరిస్థితిల్లోకి వెళ్ళిపోతాయి.

నాకైతే ఎవరో కవి చెప్పినట్టు ‘ తెలంగాణ పుడమి తల్లి పురిటి నొప్పులు పడుతున్నది ‘ అన్న కవిత్వ చరణమే జ్ఞాపకమొస్తోంది పదే పదే.

7 ఫిబ్రవరి, 2014 :

జి ఒ ఎం ఆమోదించిన తెలంగాణ బిల్లును కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది.

9 ఫిబ్రవరి 2014 :

‘ తెలంగాణ బిల్లు- 2014 ‘ ఇక రాష్ట్రపతి వద్దకు చేరింది.

11 ఫిబ్రవరి 2014 :

సీమాంధ్రుల కుట్రలు పరాకాష్టకు చేరాయి. సిద్ధాంతాలను మరిచి అన్ని ఆంధ్రా పార్టీలు ఏకమై సమిష్టిగా కేంద్ర ప్రభుత్వం పై ‘ అవిశ్వాస తీర్మాణాన్ని ‘ ప్రవేశ పెట్టాయి. ఈ అక్రమ కలయిక అందరికీ జుగుప్సను కలిగించింది. తెలుగు దేశం వాళ్ళు ‘ సేవ్ ఆంధ్రప్రదేశ్ ‘ అనీ, కె వి పి రామచంద్రరావు ‘ వుయ్ వాంట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ‘ అనీ, ఒకడు ‘ రాయల తెలంగాణ ‘ కావాలనీ.. పిచ్చి పిచ్చిగా ప్లకార్డ్ లను స్పీకర్ వెల్ లోకి వెళ్ళి ప్రదర్శించారు. అప్పుడు సోనియా గాంధీకి చాలా కోపం వచ్చినట్టు ఆమె ముఖ కవళికలను బట్టి జనానికి అర్థమైంది. మధ్యాహ్నానికి ఆరుగురు కాంగ్రెస్ ఎం పి లను పార్టీ నుండి సస్పెండ్ చేశారు.

13 ఫిబ్రవరి 2014 :

కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్ సభలో ‘ తెలంగాణ బిల్- 2013 ‘ ను ప్రవేశ పెట్టారు. అదే రోజు ఇక సీమాంధ్ర ఎం పి ల దుర్మార్గం పరాకాష్టకు చేరి విజయవాడ ఎం.పి లగడపాటి రాజగోపాల్ పోడియం దగ్గర ‘ పెప్పర్ స్ప్రే’ ను చల్లి దట్టమైన పొగనూ, భరించలేని ఘాటునూ సృష్టించాడు. ఇది అతని నేర ప్రవృత్తికి నిదర్శనంగా భావించారందరూ. అందరూ అతన్ని అభిశంచారు. సి.ఎం రమేశ్ అనే తెలుగుదేశం ఎం పి ప్రభృతులు కూడా అతిగా ప్రవర్తించి సభా కార్యకలాపాలకు అంతరాయం కల్పించారు. లగడపాటి దుశ్చర్యను జాతీయ మీడియా తీవ్రంగా దుయ్యబట్టి అతన్ని ‘ దేశద్రోహి ‘ గా అభివర్ణించి శాశ్వతంగా పార్లమెంట్ కు రాకుండా నిషేదించాలని ఆకాంక్షించారు.

తక్షణమే ఈ గందరగోళానికి కారకులైన 14 మంది సీమాంధ్ర ఎం పి లను 5 రోజుల పాటు లోక్ సభ నుండి సస్పెండ్ చేశారు.

18 ఫిబ్రవరి 2014 :

తెలంగాణ బిల్లును పార్లమెంట్ చర్చ తర్వాత మూజువాణి ఓటుతో ఆమోదించింది.

తెలంగాణ ఉద్యమ కార్యకర్తలు హైదరాబాద్ లో సంబురాలలో మునిగిపోయారు. కాని అనేకసార్లు అందీ అందనట్టూ వచ్చి రాని తెలంగాణ తాలూకు పాత అనుభవాలతో ఎవ్వరూ పూర్తి స్థాయి సంతోషాన్ని పొందలేక పోతున్నారు.

19 ఫిబ్రవరి 2014 :

ఒక నిరర్థక ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా సమర్పించాడు. ఇదే రోజు తెలంగాణ బిల్లు రాజ్య సభలో ప్రవేశ పెట్టబడింది.

20 ఫిబ్రవరి 2014 :

సుదీర్ఘ చర్చ అనంతరం ‘ తెలంగాణ బిల్లు ‘ డిప్యుటీ చైర్మన్ పి జె కురియన్ కుర్చీలో ఉండగా సభ్యుల ఆమోదం పొంది ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని భారత చరిత్రలో ఆవిష్కరించింది. 29 వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి ఉన్న అన్ని అడ్డంకులూ ఈ రోజుతో తొలగిపోయి మార్గం సుగమమయ్యింది.

‘ తెలంగాణా రాష్ట్రం తోనే హైదరాబాద్ కు తిరిగి వస్తానని ప్రకటించి ఢిల్లీ వెళ్ళిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణా రాష్ట్రాన్ని వెంటబెట్టుకుని 26 ఫిబ్రవరి 2014 న బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అశేష ప్రజావాహిని వెంట రాగా గన్ పార్క్ వద్దకు వెళ్ళి మొదట అమరవీరులకు నివాళులర్పించారు.

‘ ఈ రోజు తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన నా కొడుకు మొగిలి ఆత్మ శాంతించిందా ‘ అని నా హృదయం తల్లడిల్లుతూ నన్ను ప్రశ్నించింది.

శాంతించిందనే నా నిస్సంకోచ సమాధానం.

కాని.. రాజ్య సభలో బిల్లు పాసయ్యేటప్పుడు బి జె పి నాయకుడు వెంకయ్య నాయుడు.. అటు జై రాం రమేశ్, టి డి పి ఎం పి లు కల్పించిన అడ్డంకులను ఏ తెలంగాణీయుడూ ఎన్నడూ మరచిపోలేడు

ఇక తెలంగాణా విషయం ఒక నిరంతర పోరాట ప్రక్రియ ఐ తెలంగాణా సమాజంలో గత 14 ఏళ్ళుగా ప్రజల జీవితంలో అంతర్భాగమైం ఉంటే.. మరో వేపు మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి 2 సెప్టెంబర్ 2009 న ప్రమాదవశాత్తు మరణించిన తర్వాత ‘జగన్ ‘ అనే వ్యక్తి రంగప్రవేశం చేసిన అనంతరం.. అతని మీద సి బి ఐ దాడులు.. వందల కోట్ల రూపాయల ఆస్తులూ.. అవినీతి చిట్టాలు.. కార్యకలాపాలు.. అన్నీ బయటపడి.. అనేక ఆరోపణలపై అరెస్ట్ అయి .. చంచల్ గూడ జైలు పాలై.. ఇక ప్రతిరోజూ.. ఒక నిత్యకృత్యమైపోయింది టి. వి ప్రేక్షకులకు. ఆ సి బి ఐ డిప్యుటీ డైరెక్టర్ లక్ష్మినారాయణనూ.. సి బి ఐ ఆఫీస్ నూ .. నాంపల్లి కోర్ట్ ఆవరణనూ.. చంచల్ గూడ జైలు గేట్ నూ చూడ్డం తెలుగు ప్రజలకు ఒక వ్యాపకమైపోయింది.

అవినీతిపరులకు ఇంత ఉచిత పబ్లిసిటీ నా.? .. ఉద్యోగులు ఎవరి విధులను వాళ్ళు చేసుకుపోతూంటే దానికి ఈ మీడియా పబ్లిసిటీ ఎందుకు. అదే టైంలో కర్ణాటకకు చెందిన మరో బడా నేరస్థుడు గాలి జనార్థన్ రెడ్డీ.. జగన్ కంటే బహు ముదురు.. బంగారు కుర్చీపై కూర్చుని అన్నం తింటూ.. బంగారు కమోడ్ లో దొడ్డికి పోయేవాడు.. వీళ్ళకు ఈ విపరీత ప్రచారమేమిటి.?

నేరగాళ్ళు ఈ దేశంలో గ్లోరిఫై ఔతున్నారా.

విధిలేని పరిస్థితుల్లో జనం ఈ నేరగాళ్ళ గురించే చెబుతున్న సంగతులనే టి .వి ల్లో చూస్తూ తరిస్తున్నారా.

ఈ దేశంలో ఏ ఒక్క నేరస్థుడైనా శాశ్వతంగా జైల్ లో ఉన్నాడా. ఉంటున్నాడా. జైల్లో నుండే శాసన సభలకూ, పార్లమెంట్ స్థానాలకూ నామినేషన్ వేసి గెలుస్తూ.. తర్వాత బెయిల్ పై విడుదలై.. అంతా ఒక ప్రహసనంగా మారడంలేదా.

ఈ జైల్ కూ బెయిల్ కూ ఒక అవినాభావ సంబంధముంది కదా.

ప్రతి నేరస్థుడూ ఏదో రకంగా బెయిల్ పై తప్పక విడుదలై రేపు జనజీవితంలోకి వస్తాడు తప్పకుండా అనేది ఒక పరమ సత్యమైపోయింది ఈ దేశంలో.

వెరసి .. ఎవడైనా ఎన్ని నేరపూరిత తప్పులు చేసినా ఎవరినీ ఎవరూ ఏమీ చేయలేవనీ.. డబ్బు పెడ్తే ఈ దేశంలో ఏ పనైనా చక్కగా జరిగిపోతుందని అందరూ నమ్మే స్థితి ఒకటి ఏర్పడింది. అది అస్సలే తప్పు కాదు.. అసత్యమూ కాదు.

ఈ వర్తమానంలో జీవిస్తున్న మనం.. నేరం.. రాజకీయం.. విశ్వతనీయత.. జైలు.. విజయం.. ఇట్లాంటి మాటలను పునర్నిర్వచించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

ఏమిటి చేయాలిప్పుడు.

రాజకీయాలు.. ఉద్యోగాలూ.. పౌరులు.. ప్రజలు.. సకల సంస్థలూ.. వ్యవస్థ మొత్తమూ కరప్టై.. అనివీతిమయమై.. ” ఆ ఏముందిలే .. ఎవనికి అందింది వాడు తింటూంటాడు.. తిననీ. చాతనైతే నువ్వూ తిను.. లేకుంతే అన్నీ మూసుకుని గమ్మునుండు ‘ అన్న రోజులొచ్చి ముందు నిలబడ్డయ్ ఇనుప గోడలా.

అదంతే. అన్యధా శరణం నాస్తి.

జై భారతదేశమా.. జై జై భారత నేరపూరిత పౌరులారా.. అందరూ సుఖముగా వర్థిల్లండి.

చక చకా డైరీని రాసి ఆ రాత్రి పడుకుంది సుభద్ర..’ నా తెలంగాణ నాకు వచ్చింది చాలు ‘ అన్న తృప్తితో.

11

ఇక సుభద్ర తన ఎం ఎ పరీక్షల లోకంలో మునిగిపోయింది. చదువంటే కష్టపడి కాకుండా ఇష్టపడే తత్వం గల మనిషి కాబట్టి.. ఒక పది రోజుల్లో చాలా తృప్తిగా అన్ని పరీక్షలనూ అద్భుతంగా రాసిందామె. ఐనా చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూనే ఉంది.

క్రమం తప్పకుండా డైరీని రాయడం మాత్రం ఆపలేదు.

ఎందుకైనా మంచిదని డైరీని తీసి చూచింది.

తేది :1 మార్చ్ , 2014:

తెలంగాణ ఆవిర్భావ బిల్లుపై సంతకం చేసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. ఈ రోజే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనను విధించారు. ఒక ఘట్టం ముగిసి.. ఇక కొత్త దారిలోకి తెలంగాణ అడుగిడుటకు సిద్ధమౌతోంది.

శిశు తెలంగాణ ఇప్పుడిది.

తేది 2 మార్చ్ , 2014 : కేంద్రం తెలంగాణా ఆవిర్భవానికై నిర్దుష్టమైన తేదేదీ లేకుండానే ‘ గెజిట్ ‘ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

తేదీ : 4 మార్చ్ 2014 : కేంద్రం ‘ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం ‘ గా జూన్ 2 ను ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో 29 వ రాష్ట్రంగా ఇక ‘ తెలంగాణ ‘ ఏర్పడబోతున్న నిజం.. సత్యం రూఢైపోయింది.

చాలా చాలా సంతోషంగా.. ఉద్వేగంగా ఉందివ్వాళ నాకు.

‘ కోరుకున్న ఇల్లు తయారయ్యింది.. ఇక గృహప్రవేశం చేయాలె.’

ఒక విహంగ వీక్షణంతో తెలంగాణ ను అవలోకిస్తే.,

 

మొదటి దఫా : 1324 నుండి 1948 వరకు ; మొత్తం 234 సంవత్సరాలు.

( వివిధ ముస్లిం రాజుల పాలన )

రెండవ దఫా : భారత ప్రభుత్వానికి నిజాం లొంగిపోయి

రాజ్ ప్రముఖ గా పనిచేసిన కాలం : మొత్తం 8 సంవత్సరాలు

( 1948 నుండి 1956 వరకు )

మూడవ దఫా : వలసాంధ్రుల ఆధిపత్యంలో : మొత్తం 58 సంవత్సరాలు

( 1956 నుండి 20154 వరకు ) : మొత్తం 58 సంవత్సరాలు

వెరసి 690 సంవత్సరాల సుదీర్ఘ కాలం పరాయి పాలనలో మగ్గీ మగ్గీ.. ఇప్పుడు ఇన్నేళ్లకు సంపూర్ణ ప్రజాస్వామ్య స్వంతంత్ర్రాన్ని సాధించిన తెలంగాణ ను ఇక మనమే ‘ బంగారు తెలంగాణ ‘ గా మార్చుకోవాలె.

పరీక్షలైపోయినై కాబట్టి ఇక మళ్ళీ ‘ టి ఆర్ ఎస్ ‘ కార్యకలాపాలలో పూర్తిగా నిమగ్నమై పోవాలని నిర్ణయించుకుంది సుభద్ర.

పార్టీలో తనకు ఇక విశిష్టమైన గుర్తింపు ఎందుకొచ్చిందంటే.. తను ఏ సందర్భం లోనూ ఎటువంటి పదవినీ ఆశించకపోవడమే. ‘ పార్టీలో జస్ట్ ఒక సాధారణ కార్యకర్తగా మాత్రమే కొనసాగుతాననీ , నాకు ఏ పదవులూ వద్దనీ ‘ చాలా సార్లు ఈ నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థాంలో సన్నిహితులైన పెద్ద పెద్ద నాయకులు.. వరంగల్లుకే చెందిన రాజకీయ మేధావి, విశ్లేషకుడు , జయశంకర్ సార్ శిష్యుడూ, అనుచరుడూ ఐన వి.ప్రకాశ్ , ‘ తెలంగాణ జాగృతి ‘ తో సంబంధముండడం వల్ల కవిత, కీలకమైన ఉద్యమ వ్యూహాలను రచించే కె టి ఆర్, మౌనంగా పనులను చకచకా చేసుకుపోయే హరీశ్ రావు.. వీళ్ళందరితో సత్సబంధాలున్నా.. ఎప్పుడూ ఎక్కడా ‘ నాకిది కావాలె ‘ అన్న మాట పలుకలేదు.. అడుగలేదు.

వి.ప్రకాశ్ గారితో ఎక్కువ అనుబంధం సుభద్రకు.. ఎందుకంటే ఆయన ముక్కు సూటి మనిషి. రాజకీయ మేధావి.. పార్టీకీ ముఖ్య ఘట్టాల్లో విలువైన చాలా సలహాలను ఇస్తూ డైరెక్ట్ గా కె సి ఆర్ ను కలువగల సాన్నిహిత్యమున్న వ్యక్తి. టి ఆర్ ఎస్ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ యొక్క ప్రధాన అనుచరుడు కావడం వల్లా, టి ఆర్ ఎస్ ఆవిర్భావం నుండీ ఒక వ్యవస్థాపక సభ్యునిగా పార్టీలో కొనసాగుతున్న ఆయనను ‘ అన్నా’ అనిపిలిచే ఆత్మీయ సాన్నిహిత్యం ఉంది.

నిన్ననే ప్రకాష్ గారు ఫోన్ చేసి ” అమ్మా ఇక మనం మళ్ళా కార్యరంగంలోకి దిగి.. విజృంభిచవలసిన సమయం అసన్నమైంది.. నీ దండును తయ్యార్ చేసుకుని రెడీగా ఉండు ” అన్నడు.

” ఏం సంగతన్నా.. ఇక మన తెలంగాణ వచ్చిందిగదా ఇంకేంది ”

” వచ్చిందిగాబట్టే.. ఈ హడావుడి.. మొన్న ఫివ్రవరి ఇరవై ఆరుననే విజయోత్సవ సభలను ఎంతో ఘనంగా జరుపుకున్నం గదా.. ఇగ మన ఇల్లును మనం సగబెట్టుకోవాలె.. తెలంగాణ అనే మన ఇల్లు మనకైతే వచ్చింది.. కాని దాన్ని అలుక్కొని, పూదించుకొని.. పూలదండలు కట్టుకొని పండుగ చేసుకోవాలె గదా.. అంటే ఇగ ఎన్నిలకు.. ప్రతిపక్షంతోని టక్కర్.. గెలువాలె గదా.. గెలిచి మనమే అధికారంలోకొస్తే.. అప్పుడు కెసీఆర్ చెబుతున్న మన ‘ బంగారు తెలంగాణా ‘ ను కండ్ల చూచేది.. ఔనా ”

” ఔను గదా ”

” అందుకే తయ్యార్ గావాలె ప్రతి ఒక్కరూ ”

మళ్ళీ ప్రకాశ్ గారు చెప్పిండ్లు ” అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా విను.. నిన్న మార్చ్ 5 న కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్త 543 పార్లమెంట్ స్థానాలకూ, సిక్కిం, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ స్థానాలకూ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. మన తెలంగాణ రాష్ట్రం ఇంకా ఏర్పడలేదు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఈ ఎన్నికలు జరుగుతై .. రాష్ట్రపతి పాలనలోనే ఈ ఆంధ్ర, తెలంగాణ పొత్తు ఎన్నికలు కాబట్టి మనం జాగ్రత్తగుండాలె ” అని.

” ఏప్రిల్ 30 న మన దగ్గర 119 అసెంబ్లీ స్థానాలకూ, ఎప్రిల్ 12 మే 16 న అ ఆంధ్రాలో 175 స్థానాలకూ ఎన్నికలు జరిగి ఫలితాలను మే 16 న ప్రకటిస్తారు. కాబట్టి ఇక సమరం స్టార్ట్ ఔతది మనం ఇక మన మందీ మార్బలాన్ని మోహరించవలసి ఉంది.. కార్యకర్తలంటే పార్టీ సైనికులేగదా ప్రజాస్వామ్యంలో ” అని ఆగాడు .

” మీరు పోటీ చేస్తున్నారా మన వరంగల్ లో ఎక్కడినుండైనా .. ఈ ఊపులోనైతే సుళువుగా గెలువచ్చు గదా ” అంది సుభద్ర.

” మనకు ఒక సిద్ధాంతముంది గదా.. జయశంకర్ గారు నేర్పిందే. రాజకీయ పదవులు మనకొద్దు. మనం పనిచేస్తున్నది పదవులకోసం కాదు . తెలంగాణ కోసం.. నేనూ అంతే నువ్వూ అంతే.. సరే నువ్వొచ్చేయ్ రేపు పార్టీ ఆఫీసుకు ” అని ఆజ్ఞ.

అంతే . వెళ్ళాలె.

ఆ రకంగా మొదలైన పునర్యానం.. మళ్లీ యాత్ర.

‘ సూర్యుడుదయించడనుకోవడం నిరాశ

ఉదయించిన సూర్యుడస్తమించడనుకోవడం దురాశ ‘                 – కాళోజీ

నిజానికి ఈ కాళోజీ సూక్తి ఒక జీవిత సూత్రం. ఒక్క ఈ సంగతిని జ్ఞాపకముంచుకుంటే చాలు.

వెంటనే చెన్నకేశవులు దగ్గరా, రాజ్యలక్ష్మి దగ్గరా సెలవు తీసుకుని ఆగమేఘాలమీద హైదరాబాద్ బయల్దేరి ప్రకాశ్ గారికి రిపోర్ట్ చేసింది.

ఇక మొదలైంది యుద్ధం. కారు కూతలు.. ఒకరిపై ఒకరు దిక్కుమాలిన ఆరోపణలు.. నిస్సిగ్గు భాషలో దూషణలు.

తీవ్రాతితీవ్ర ఉద్యమంలో ముఖాలు కూడా చూపించని వాళ్ళు తగుదునమ్మా అని.. బరిలో ప్రధాన ప్రత్యర్థులు.. కాంగ్రెస్. తెలుగు దేశం, బా.జ.ప, ఎం ఐ ఎం తదితరులు.

తెలంగాణా రాష్ట్రాన్ని ‘ ఇచ్చింది మేము ‘ అని కాంగ్రెస్. ‘ , ‘ తెచ్చింది మేము ‘ అని తెలంగాణ రాష్ట్ర సమితి.. యుద్ధం.

యుద్ధం ముగిసి మే 16 న ఫలితాలు ప్రకటిస్తే.,

టి ఆర్ ఎస్ -63, కాంగ్రెస్ – 21, టి డి పి – 20, ఎం ఐ ఎం – 7 , ఇతరులు – 8. వీళ్ళు విజేతలు. కాంగ్రెస్ ‘ తెలంగాణ ‘ ను ఇచ్చింది అన్న నినాదాన్ని ప్రజలు నమ్మలేదు. రాష్ట్రాన్ని టి ఆర్ ఎస్సే తెచ్చింది అనేక త్యాగాలకోర్చి అన్న పరమ సత్యాన్నే ప్రజలు విశ్వసించిండ్లు.

ఇక మామూలే అంతా.

మే 17 న శాసన సభ్యుల సమావేశం లో ఎన్నికైన ప్రతినిధులందరూ ఏకగ్రీవంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావును శాసనసభ నాయకునిగా ఎన్నుకుని రాజ్ భవన్ కు తెలియజేయుట.

జూన్ 2, 2014 : ‘ తెలంగాణ ‘ నూతన రాష్ట్ర అవతరణ. మొత్తం రాష్ట్రమంతా సంతోషసాగరంలో ఓలలాడుతున్న వేళ.,

ఆ రోజు వి.ప్రకాశ్ గారితో రాజ్ భవన్ కు వెళ్ళింది సుభద్ర. ముప్పిరిగొన్న ఆనందంతో.

అప్పటికి ప్రత్యేక రాష్ట్రం ఉనికిలో లేనందువల్ల.. మొదట హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ సేన్ గుప్తా ఇ.ఎన్.ఎల్ . నరసింహన్ చేత రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయించి.. అటు తదుపరి గవర్నర్ నరసింహన్ కెసీఅర్ తో చారిత్రాత్మకంగా కొత్తగా ఏర్పడ్డ ‘ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ‘ ప్రమాణ స్వీకారం చేయించారు.

‘ 690 సంవత్సరాల పరాయి పాలన ముగిసి తెలంగాణ రాష్ట్రం స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్న ఈ పురిటి సందర్భంలో రాజ్ భవన్ లో నేను ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉండే భాగ్యం కలిగినందుకు.. మొగిలీ నీ ఆత్మాహుతి చరితార్థమై సార్థకమైనందుకు.. ఒక తల్లిగా.. ఉద్యమకారిణిగా.. ఈ నేలపై పుట్టిన పౌరురాలిగా ఎంతో గర్విస్తున్నాను ‘ అని రాసుకుంది సుభద్ర ఆ రోజు డైరీలో.. కళ్ళ నిండా నీళ్ళతో.

ఇక ‘ బంగారు తెలంగాణ ‘ ను కళ్ళ చూడాలె.

( మిగతాది వచ్చే పక్షం )

 

 

రామాచంద్ర మౌళి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు