గుర్తుండిపోయే అందమైన అనుభవం!

ఒక నదిని భారతదేశం భూభాగంలో మొత్తం చూడటం ఇదే ప్రథమం నాకు.

మా వాహనం హిమాలయాల్లో ముందుకి వెడుతున్న కొద్ది మేఘాలు కింద కనబడటం మొదలుపెట్టాయి. 15వ మైలురాయి దగ్గర ఒక దుకాణంలో కారు ఆపాడు ఇలు. అక్కడ మంచులో నడవటానికి వీలుగా ‘మంచు బూట్లు’ స్నో బూట్స్ అద్దెకు తీసుకున్నాం.

ఇక అక్కడ్నించి Tsongo సరస్సు వరకు కూడా మా చుట్టు మొత్తం మంచు పరుచుకుంది. మా వాహనాన్ని ఒకచోట ఆపి మంచులో ఫొటోలు తీసుకుని ఒకరి మీద ఒకరం మంచు విసురుకుని ఆనందించాం.

మొత్తం మంచులో కప్పబడిపోయిన ప్రపంచాన్ని మేము ప్రత్యక్షంగా చూడటం అదే మొదటిసారి. పదేళ్ళ క్రితం మేము మనాలి వెళ్ళినా అది మే నెలలో వెళ్ళటం వలన మంచు దర్శనం కొంచెం కూడా కాలేదు. ఈసారి మా చుట్టూ అంతా మంచు ప్రపంచం.

నా కిష్టమైన యాత్రా రచయిత్రి డెర్వ్ మర్ఫీ (Devrla Murphy) తన మొదటి పుస్తకం ఫుల్ టిల్ట్ (Full Tilt) లో ఆప్షన్లోని బామియన్ కొండల్లోను, ఆజాద్ కాశ్మీర్ లోని హిమాలయాల్లో సైకిల్ మీద చేసిన ప్రయాణాలు గుర్తుకొచ్చాయి.

ఎం.ఆదినారాయణ గారు ‘కాలిబాటలు స్వర్గ ద్వారాలు’లో హిమాలయాల్లో కులు ప్రాంతాలలో చేసిన పర్వత పరిక్రమణ గురించి చెప్పిన విషయాలు గుర్తొచ్చినయి.

మంచులో ఆడుకుంటూ మేము ముగ్గురం బాల్యంలోకి వెళ్ళిపోయాము.Tsongo సరస్సు దరిదాపుల్లోకి చేరే సరికి వర్షం మొదలయింది. సున్నా డిగ్రీ ఉష్ణోగ్రత దగ్గర వర్షం పడితే ఎలా వుంటుందో జీవితంలో మొదటిసారి అనుభవించాం. మేం వేసుకున్న చలికోటులు, మంచు బూట్లు, చేతిర్లవుజులు పెట్టుకున్న మంకీ టోపీలు ఇవి ఏవీ చలిని ఆపకపోగా మేము గజగజ వణకసాగాం. కాళ్ళు కొంకర్లు పోవడం, చేతులు చెప్పిన మాట వినకపోడం వర్షంలో ఏమీ కనపడకపోవడం సరస్సు దగ్గర అలా చూస్తు చేష్టలుడిగి నిలబడిపోయాం .

అడుగు తీసి అడుగు వేయాలంటే మంచులోకి కూరుకు పోతున్న కొంచెం నడవాలన్నా జారిపోతున్న అడుగులు.

ఇంకాసేపటికి వర్షం ఎక్కువవుతుంది. బయట హెరుగాలి, తట్టుకోలేక, కారులోకి చేరి హీటరు త్వరగా ఆన్ చేయమని డ్రైవరుని తొందర పెట్టాం. మధ్యాహ్నం తర్వాత అక్కడ్నించి తిరుగు ప్రయాణం మొదలు పెట్టాం .

15 మైలు దగ్గర మంచు బూట్లని, తిరిగి ఇచ్చేసి వెనక్కి ప్రయాణం మొదలుపెట్టాక కానీ వర్షం తగ్గలేదు.

మా మిగతా ప్రయాణం త్వరగానే ముగిసింది. గాంగ్ టక్ లో ఆ రోజు 5 డిగ్రీల ఉష్ణోగ్రత వుంది. Tsongo సరస్సు సందర్శించి వచ్చాక గాంగ్ టక్ చాలా వెచ్చగా అనిపించింది.

పాండిచ్చేరిలో వున్నపుడు 25 డిగ్రీలు కూడా చల్లగా ఎందుకు అన్పిస్తుందో. శరీరతత్వం ఎంత విచిత్రమైనదో.

మర్నాడు గాంగ్ టక్ స్థానికంగా వున్న ప్రదేశాలు చూడ్డానికి నిర్ణయించుకున్నాం. మళ్ళీ వుదయాన్నే మా గది బాల్కానీ నుంచి కాంచనజంగా అద్భుత బంగారు కాంతులతో ముందురోజు ప్రయాణ అలసట తీరిపోయింది.

సిక్కింలో 60 కి పైగా బుద్ధిస్టు మొనాస్టరీలు వున్నాయి. భారతదేశంలో పుట్టిన బుద్ధిం టిబెట్ లో బాగా బలంగా పాతుకుంది. కాలానికి అనుగుణంగా అది కొన్ని మార్పులు చెందింది. క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో భోటియా తెగ వారు టిబెట్ నుంచి సిక్కింకి వలస వచ్చారు. వాళ్ళు నియంగ్మా శాఖ బుద్దింని పాటించేవారు. భాటియు తెగవారు సిక్కిం యొక్క పాలకులుగా మారి సిక్కింలో వున్న లెప్చా తెగ వారిని పాలించారు. ఆ రకంగా మహాయన బుద్ధిజం శాఖకి ఉపశాఖగా వున్న నియంగ్మా శాఖ బుద్ధిజం పాలక వర్గ మతంగా సిక్కింలో వేళ్ళూనింది. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో టిబెట్ లోని బుజం గురువు పద్మ సంభవుడు సిక్కింను సందర్శించాడు. ఆ తర్వాత అనేక మంది బౌద్ధ గురువులు సిక్కింలో అనేక బౌద్ధిక ఆరామాలను నిర్మించారు.

ఆ రోజు గాంగ్ టక్ దగ్గరలోని కొన్ని మొనాస్టరీలని దర్శించి అక్కడ జరుగుతున్న పూజల్ని తిలకించాము. ఒక మొనాస్టరీలో అందరూ ఆడవారే వున్నారు. చిన్న వయసు పిల్లలు సమయానికి పూజలు, చేస్తూ నిష్టగా కనబడ్డారు.

1950 వరకు కూడా టిబెట్లో వున్న బౌద్ధ ఆరామ విద్యా విధానమే సిక్కింలో వుండేదట. వాటిలో ఎక్కువగా పూజలు, మంత్రాలు, చేయడం ఆచార విధానాన్ని పాటించే విద్య ఎక్కువగా వుండేది.

అయితే సిక్కింలోని బౌద్ధ మతం కాలక్రమేణ టిబెట్ లోని బౌద్ధ మతాన్నించి విబేధించి ఎన్నో స్థానిక లేప్చా తెగల ఆచార వ్యవహారాల్ని తనలో కలుపుకుంది. ఆ రకంగా సిక్కిం సంస్కృతిగా పరిణామం చెందింది. 1975లో భారత దేశంలో విలీనం తర్వాత ఆధునిక రాజ్యాంగ విలువలకు అనుగుణంగా సర్వమత సమానత్వం సిక్కిం సంస్కృతిలో ప్రధాన లక్షణంగా పరిణమించింది.

మేము చూసిన బౌద్ధ ఆరామాలలో బుద్ధుడి అద్భుత విగ్రహాలు, ప్రకృతి ఒడిలో విద్యాబోధన మాత్రమే కాక సందర్శకుల పట్ల స్నేహభావం, శాంతి కొట్టొచ్చినట్టు కనబడ్డాయి. అయితే రమ్ టెక్ మెనాస్టరీలో మటుకు పోలీసు బలగాల మోహరింపు ఎక్కువగా కనబడింది. వివిధ వర్గాల మధ్య అంతర్గత కలహాలు దానికి కారణం అని తెలిసింది. ఈ సంక్లిష్ట పరిస్థితి 1992 నుంచి కొనసాగుతోందట. దీనిని ‘కర్మాపా’ కలహం అంటారట.

బౌద్ధ ఆరామాలలో కూడా దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న కలహాలను చూస్తే కొంచెం నిరాశ కలిగింది.

 

తాఓడెలిక్ ట్రావెల్ డెస్క్ ఇంఛార్జి వందన మాకు చెప్పింది, ఉత్తర సిక్కిం చూడకుండా వెళితే ఏమీ చూసినట్టు కాదని. మర్నాడు మా లాఛుంగ్, యూంగ్ టంగ్ లోయ ప్రయాణం మొదలైంది.

లాఛుంగ్ వెళ్ళాలంటే ప్రత్యేక పర్మిట్ కావాలి. వందనయే మాకు అవి ఏర్పాటు చేసింది. గాంగ్టక్ నుంచి లాఛుంగ్ 125 కిలోమీటర్లు ఉత్తరంగా వుంది. లాఛుంగ్ దాదాపు టిబెట్ పక్కనే వుంది. లాఛుంగ్ అనే పేరుతో తీస్తానదికి ఒక ఉపనది కూడా వుంది.

ఉదయాన్నే బయలుదేరాం. మేము సిలిగురి నించి వచ్చిన కారు అదే డ్రైవరు మాకు ఇప్పటికీ బాగా అలవాటయాయి.

మొత్తం ప్రయాణం అంతా మళ్ళీ తీస్తా నది ఒడ్డునే జరిగింది. లాఛుంగ్ దాదాపు తీస్తానది మూలం. లాఛుంగ్ కి కొంచెం పైన తీస్తా నదికి ప్రధాన ఉపనది లాఛుంగ్ ఉపనది జన్మస్థలం. ఈ రకంగా తీస్తానదిని మైదాన ప్రాంతమైన సిలిగురి నుంచి దాని జన్మస్థలం వరకు చూడబోతున్నాం. ఒక నదిని భారతదేశం భూభాగంలో మొత్తం చూడటం ఇదే ప్రథమం నాకు.

ఈ నది పొడుగునా బౌద్ధమతం శతాబ్దాలుగా విలసిల్లింది. చాలా చోట్ల దీనికి గుర్తుగా బౌద్ధ అరామాలు వున్నాయి. ఉత్తర సిక్కింలో రహదార్ల పరిస్థితి ఏమీ బాగా లేదు.

హిమాలయాల్లోపలికి ప్రయాణించిన కొద్దీ చాలా నెమ్మదిగా ప్రయాణం సాగింది. తీస్తానది అందం ఒక పక్క హిమాలయాలు, మంచు ప్రతిఫలిస్తూ, కొండలు లోయలు ఈ అందం ముందు ఎన్ని గతుకులు కూడా పెద్ద కష్టంగా అనిపించలేదు. దారిలో ఛుంగ్ టాంగ్ అనే వూరిలో రోడ్డు పక్క దూకాణంలో కారు ఆపాడు. ఆ పక్కనే తీస్తానది మీద కట్టిన జలాశయం, విద్యుతుత్పత్తి కేంద్రం వున్నాయి. ఆ ప్రదేశంలోనే తీస్తానది యొక్క రెండు వుపనదులు లాగైన్ మరియు లాఛుంగ్ కలుస్తున్నాయి. ఆ జలాశయంలో నీళ్ళు ఇపుడే మంచు కరిగిన లేత నీలిరంగులో కను విందు చేస్తున్నాయి.

ఆ దుకాణంలో స్త్రీ అక్కడే పండుతున్న ఆకుకూరలు అమ్ముతోంది. వేడివేడిగా ‘సూప్’ తాగాము. చూడ్డానికి టిబెటెన్ మహిళలా కనబడినా ఎంతో ఆధునికంగా వుంది. చుంగ్ టాంగ్ లో ఒక సైనిక స్థావరం కూడా వుంది. సైనికుల పిల్లల కోసం ఒక పాఠశాల కూడా కనబడింది.

చుంగ్ టాంగ్ నుంచి లాఛుంగ్ వరకు రహదారి పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారయింది. అయితే అతి కొంచెం దూరంలోనే మొత్తం దారి అంతా మంచుతో కప్పబడి కనువిందు చేసింది. మేము లాఛుంగ్ చేరే సరికి సాయంత్రమయింది. అప్పటికి అక్కడి ఉష్ణోగ్రత ‘సున్నా’ వుంది. వూరంతా మంచుతో కప్పబడి వుంది. అక్కడి నించి ఎత్తయిన హిమాలయ శిఖరాలు మొత్తం మంచుతో కప్పబడి కనువిందు చేస్తున్నాయి.

మేము దిగిన హెటల్ గదిలో హీటరు వున్నా అదేమీ పని చేయలేదు. రాత్రి ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల వరకు వెళ్ళిపోతుందంటే దొరికిన రగ్గులు, అన్నీ మీద వేసుకొని హిమాలయ రాష్ట్రంలో గడపడం మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే అందమైన అనుభవం అని చెప్పక తప్పదు

*

ఆకెళ్ళ రవిప్రకాష్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు