మనిషి పరిచయం – 8

వెంటనే లోపల ఒక భయ వీచిక.. ఏదో తప్పు చేసినట్టు అపరాధ భావన. చేయకూడని ఏదో అకృత్యాన్ని జరిపినట్టు గిల్టీనెస్. మోసం జరిగింది.. ఎవరితో ఎవరికి.. ఇప్పుడు ఎవరివెవరు మోసం చేశారు. సాంఘిక పరమైన కొన్ని కట్టుబాట్లకు లోబడి జీవించలేని తాము.. వాటిని ఉల్లంఘించి మోసం చేశారా. తమను తామే మోసం చేసుకున్నారా.

శ్వేత అనుకుంది.. అమ్మ అనుకుంటుందా తానిట్లా చేయగలనని. నాన్న అనుకుంటాడా తన ఆలోచనలు ఇంత వికృతంగా ఉంటాయని. పెళ్ళి కాకుండానే శారీరక వాంఛలకు లొంగి సకల సాంఘిక నియమాలనూ, కట్టూబాట్లనూ త్యజించి.. చేసిన ఈ పని . ఏమిటి. కనీసం తను ఒక్కసారైనా రోహిత్ ను అడుగలేదు ‘ మరి మనం పెళ్ళి చేసుకుందామా ‘ అని. పెళ్ళి.. వైవాహిక జీవితం.. ఈ శారీరక కలయిక తర్వాత ఏమిటి.. తర్వాత ఏం జరుగుతుంది.. అసలా ఆలోచనా, స్పృహా లేనే లేదస్సలు.

జస్ట్ హ్యావ్ అండ్ గో.. నా.?

ఇప్పుడు తను చేసిన పని అమ్మకూ, నాన్నకూ తెలిస్తే.. ఎట్లా ఉంటుంది.. తను తలెత్తుకుని వాళ్ల ముఖాల్లోకి చూడగలదా. గిల్టీ.. గిల్టీ.

రోహిత్ కూడా ఒక రకమైన షాక్ కు గురయ్యాడు. పొందిన ఆనందం గొప్పదీ, అద్భుతమైందే.. కాని జరిగిన విధానం.. అమ్మా.. నాన్నా.. చుట్టూ ఉన్న సమాజం.. కుటుంబం.?

ఇప్పుడిక ఆలోచించాలి.

రోహిత్ శ్వేత దిక్కు తిరిగి.. కళ్ళలోకి చూస్తూ.,

ఒక చిర్నవ్వు నవ్వి.. ఏదో విజయాన్ని హస్తగతం చేసుకున్నట్టు.,

” చాలా బాగుంది కదా ” అన్నాడు.

ఆమె ఏ జవాబూ చెప్పకుండా లేచి.. కూర్చుని తల వంచుకుని.. లోలోపల ముడుచుకుపోతూ.,

లేచి బాత్ రూం కు పోదామనుకుంటూండగా.,

బయట తలుపులపై ఎవరో కర్రతో టకటకా కొడ్తున్నట్టు చప్పుడౌతూ.,

ఇద్దరూ మాట్లాడలేదు. ఖిన్నులై భయం నిండిన చూపుల్తో.. ఒకరినొకరు చూచుకుంటూ .,

” ఎవరు ” అంది సన్నగా రోహిత్ ను ఉద్దేశించి.

” ఏమో ”

మళ్ళీ చప్పుడు. ఈ సారి బలంగా.. గట్టిగా.. పదే పదే.,

చకచకా రోహిత్ లేచి నిలబడి ఒంటిపై బట్టలు సర్దుకుంటూ.. ఆమె కూడా పంజాబీ డ్రెస్ నూ, చున్నీనీ సవరించుకుంటూ,

తలుపులపై బాదుడెక్కువౌతోంది.

రోహిత్ అసంకల్పితంగానే వెళ్ళి బోల్ట్ తీసి తలుపులు తెరిచి.. చూచి నిర్ఘాంత పోయాడు. ఎదురుగా ముగ్గురు పోలీస్ లు. ఒక ఇన్స్ పెక్టర్.. ఇద్దరు కానిస్టేబుల్స్.

ఇద్దరి ముఖాలూ పాలిపోయి.. కొయ్యబారిపోయి.. ‘ ఇప్పుడేం చెయ్యాలి ‘ అని శతకోటి ప్రశ్నల బాంబుల వర్షం.. తల దిమ్మెక్కి.. ఎటూ తోచని తత్తరపాటు.

శ్వేత శరీరం అదుపు తప్పుతోంది. ‘ తప్పు చేసింది తను. ‘ లోపల శతకోటి కంఠాలతో ఆత్మ ఘోషిస్తోంది. . తప్పు చేసింది తను.. తప్పు చేసింది తను.

” ఏయ్ మిస్టర్.. ఎవరు మీరు.. మీ ఐడెంటిటీ ఏమిటి.. మీరిద్దరేమౌతారు.. ”

గద్దింపు ఇన్ స్పెక్టర్ నుండి. పోలీస్ సంస్కృతిలో.. వాళ్ళకు శిక్షణ నిచ్చేప్పుడే చెప్పే మొదటి పాఠం ‘ ఎదుటి మనిషిని మొదలు మొదలే మానసికంగా దెబ్బ తీసి నిర్వీర్యం చేయాలె.. వానికి వాడే స్వతహాగా ఢీలా పడిపోయేట్టు పరుశమైన మాటల్తో కించపరిచి డౌన్ చేయాలె.’ అని. అదే చేశాడు ఇన్స్పెక్టర్. పోలీసు లిద్దరూ గదిలోకి వచ్చి ఒట్టిగనే అటూ ఇటూ తిరుగుతూ.. ఒకరు బాత్ రూంలోకి వెళ్ళి.. బయటికొచ్చి.,

” మీ ఆధార్ కార్డ్స్ ఏవి.. ఇవ్వండి ” కంఠంలో కటువుదనం.. కరుకుదనం.

ఆధార్ కార్డ్స్ ఇస్తే ఇంకేమైనా ఉందా..అంతా బట్టబయలై.. ఇజ్జత్ పోయె. ఎట్లా ఇప్పుడు. రోహిత్ లో గజగజా వణుకు పుట్టింది.

శ్వేతకైతే ముచ్చెమటలు పట్టి.. కంపించిపోవడం మొదలైంది. ఈ విపత్తులోనుండి బయటపడ్డం ఎట్లా. అసలు బయట పడగలదా. ఈ సంగతి బయటికి పొక్కుతే.. పరువు..ఇజ్జత్.. మీడియాలో.,

ఆమెకు అన్ని టి వి చానళ్ళలో తమ విషయమే పదే పదే ఒక అక్రమ సంబంధ అంశంగా ప్రసారమౌతున్నట్టూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రేక్షకులు ‘ విచ్చలవిడితనానికి అలవాటు పడ్డ ఇంజనీరింగ్ విద్యార్థుల అకృత్యాలు ‘ వంటి శీర్షికలతో.. తనదీ, రోహిత్ దీ ఫోటోలు మార్చి మార్చి చూపిస్తూ.. వ్చ్.,

ఇప్పుడెలా.

” కమాన్.. షో.. యువర్ ఆధార్ కార్డ్.. ఊ., ” రోహిత్ గల్ల పట్టుకున్నాడు ఇన్స్ పెక్టర్. రోహిత్ వణికిపోతున్నాడు. చటుక్కున జేబులోనుండి అప్పుడు కౌంటర్ లో చూపెట్టిన కార్డ్ ను ఇచ్చేశాడు. అతను ఆ కార్డ్ ను పరిశీలిస్తూండగా శ్వేత చటుక్కున ప్రక్కనే ఉన్న బాత్ రూం లోకి చొరబడింది చున్నీని అడ్డంగా పెట్టుకుని.

” ఊ.. ఐతే హనుమకొండ నుండి ఈ పోరిని లేపుకచ్చి .. ఈ హోటల్ ల ఎంజాయ్ చేస్తానౌర లంజకొడ్కా.. బ్రోతల్ కేస్ ఇది. ఏంజేస్తౌ నువ్వు..”

గజగజా వణికిపోతూ.. తన ఇంజనీరింగ్ కాలేజ్ బాపతు ఐడి కార్డ్ నిచ్చాడు రోహిత్. అతని పని ఐపోయింది. మొత్తం నీరుగారిపోయిండు. ” సారీ సర్.. సారీ సర్.. తప్పయి పోయింద్సార్.” మాట రావట్లేదు.. నోరు ఎండుకుపోయింది. తత్తరపడ్తూ షివర్ ఐపోతున్నాడు.

” మీకేం రోగంరా లంజకొడ్కుల్లారా.. మంచిగ చదువుకొమ్మని మిమ్మల్ని ఇంజనీరింగ్ కాలేజ్ లకు పంపుతే.. ఇదా మీరు చేసేది. బాగ మదమెక్కింది నా కొడ్కా.. లోపలేసి నిన్నూ, దాన్నీ మీడియా ముందు ప్రవేశ పెడ్తే .. లంజకొడ్కా ఇగ ఎవ్వరు చెయ్యరిటువంటి పనిని. పా పోలీస్ స్టేషంకు ” గద్దింపు.. మెడపట్టి నూకుడు ముందుకు. ” అదేది.. బాత్రూంల జొచ్చిందా .. అరే బైటికి పిలువురా దాన్ని..”

” ఏయ్.. బైటికి రావే.. లోపల చొచ్చినావ్.. భలే సిగ్గయితాందిలే నీకు.. దా ” అని కానిస్టేబుల్ గద్దింపుతో.. బాత్ రూం పై కర్రతో టకటకా.,

ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో.. కాని ఇద్దరు ముగ్గురు టి.వి వాళ్ళు చేతుల్లో కెమెరాలతో ప్రత్యక్షమయ్యారు. చేతుల్లో మైక్ లు.. భుజాలపై కెమెరాలు. రోహిత్ ముందు మైక్ పెట్టి .. గద్దింపుగా ” చెప్పండి .. ” అని.

వెంటనే ఆ హోటల్ లో, రెస్టారెంట్ లో ఉన్న జనం.. చుట్టుప్రక్కల గదుల్లో ఉన్న వాళ్ళు.. స్టాఫ్ అందరూ గుమికూడి పెద్ద షో.

రోహిత్ కుడితిలో పడ్డ ఎలుకలా తన్నుకుంటున్నాడు.

మరోవైపు కానిస్టేబుల్స్ బాత్ రూం పై చేతికర్రలతో బాదీ బాదీ..,

ఇక భరించలేక శ్వేత బయటికొచ్చింది అవమాన భారంతో ఎర్రబడ్డ ముఖంతో. ఒక్క అడుగు బయటకు వచ్చిందో లేదో.. రోహిత్ ను విడిచిపెట్టి శ్వేతను చుట్టు ముట్టారు ఇన్స్ పెక్టర్, పోలీసులు, మీడియా వాళ్ళు. ఆమె అందరిదిక్కూ తేరిపార గంభీరంగా.. నిస్సహాయంగా చూచి గబుక్కున మళ్ళీ బాత్ రూం లోకి వెళ్ళిపోయింది గొడగొడా ఏడ్చుకుంటూ.

మీడీయా కెమెరాలు ఇటువంటప్పుడూ, రోడ్లపై ఆత్మహత్యలూ, బహిరంగ హత్యలూ జరుగుతున్నప్పుడూ అత్యుత్సాహంగా షూట్ చేస్తూంటారు. అదే జరిగింది లిప్త కాలంలో.

మళ్ళీ టి వి వాళ్ళు రోహిత్ వెంటబడి ” చెప్పండి .. చెప్పండి.. అసలు మీరెవరు.. ఆ మీ వెంట ఉన్న యువతి ఎవరు.. ఎందుకు ఈ హోటల్లో ఉన్నారు ” వంటి ప్రశ్నలను సంధిస్తున్నారు.

రోహిత్.. తల పట్టుకుని బెడ్ పై కూర్చుని.. దోసిట్లో ముఖాన్ని దాచుకుని.. దుఃఖం.

అంతా గందరగోళం .. జనం గోల.. ఒత్తిడి. పోలీసుల ఓవర్ యాక్షన్.

అప్పటికే మీడియా చానళ్ళలో ప్రసారాలు మొదలయ్యాయి.

‘ ఫస్ట్ చానెల్ టు రిపోర్ట్.’ అని ఒక స్క్రోలింగ్.. ఇక నానా రకాల వ్యాఖ్యలతో.. ‘ అదుపు తప్పుతున్న యువతరం ‘..’ విచ్చలవిడి సంస్కృతిలో యువత ‘ .. ఇట్లా వ్య్హ్హాఖ్యానాలు.

భారతదేశంలో మీడియా హద్దులుమీరి.. బాధ్యతలను మరిచి.. బ్లాక్ మెయిల్ తరహాలో ప్రవర్తిస్తున్న సంగతి ప్రజలకు తెలుసు.

ట్రాన్స్మిషన్ మొదలై .. సమయం గడుస్తూనే ఉంది.

దోషిలా రోహిత్ తలవంచుకుని కూర్చుని.. క్షోభిస్తున్నాడు. హోటల్ బయట టి వి ల్లో వస్తున్న వివరాలు వింటూ జనం గుమికూడడం ఎక్కువైంది. ఇన్స్ పెక్టర్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి అదనపు బలగాలను రప్పించాడు. విషయం పెద్దదై ఉధృతమౌతోంది

మనుషుల్లో ఒక అంతర్గత రాక్షస ప్రవృత్తి దాగి ఉంటుంది ఎప్పుడూ. ఆ తత్వమే బాత్ రూంపై పోలీసుల దాడి.. టి వి విలేఖరుల దబాయింపు ఎక్కువై.. లోపలి నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో.. అత్యుత్సాహంతో ఒక పోలీస్ ఆ సి క్లాస్ హోటల్ బాత్ రూం గది ప్లాస్టిక్ తలుపును ఈడ్చి ఒక తన్ను తన్నాడు. ఆ తలుపు సునాయాసంగానే విరిగి.. ఊడి.. భళ్ళున తెరుచుకుంది.

చూస్తే హృదయ విదారక దృశ్యం లోపల.

శ్వేత తన చున్నీతో కిటికీ ఊచలకు ఉరి వేసుకుని వ్రేలాడి.. చచ్చిపోయి ఉంది.

ఒక్క క్షణం అందరూ నివ్వెరపోయి.. ఏ ఒక్కరో ” అయ్యో పాపం .. ” అని వాపోతూ.,

ఈ దిక్కుమాలిన ప్రపంచ తత్వం ఏనాడూ ఎవ్వరికీ అర్థం కాలేదు.

 

 

బొమ్మలు: మిత్ర

చక చకా పోలీసులు ప్రవేశించారు రంగం లోకి.. టి వి వాళ్ళు మృతదేహాన్ని కూడా వదలకుందా బహుముఖ కోణాల్లో వీడియో తీస్తూ.., రాక్షస ఆనంద కృత్యాలు. అంతా ‘ రేటింగ్ ‘ మాయ.

బస్.. టి వి ప్రచారం..’ బ్రేకింగ్ న్యూస్ ‘ గాలిలో మొత్తం రాష్ట్రమంతా క్షణాల్లో వ్యాపించి.. పెద్ద సెన్సేషన్.

బహుశా వరంగల్ లో శ్వేత తల్లిదండ్రులూ.. రోహిత్ తల్లిదండ్రులూ చూస్తూనే ఉంటారు.

‘ తాత్కాలిక యవ్వన బలహీనతలు.. విశృంఖలత్వంగా మారిన స్వేచ్ఛ.. యువలోకాన్ని మాయాలోకంలో సమాధి చేస్తున్న అత్యాధునిక సాంకేతిక లభ్యతలు.. చేయి చాపగానే అందే సకల సౌఖ్యాలు.. ఇవీ ఈనాటి యువతకు సంక్రమించిన శాపాలు.’ అని వ్యాఖ్యానిస్తున్నారు ఒక టి వి చానల్ డిస్కషన్ లో.

“ పద పోలీస్ స్టేషన్ కు ” అని మెడబట్టి రోహిత్ ను ఇన్స్ పెక్టర్ బయటికి నెట్టుకుంటూ వచ్చి అందరు చూస్తూండగనే జీప్ ఎక్కించుకుని తీసుకునిపోయాడు. వెనుక శ్వేత శవాన్ని ఎక్కించుకుని అంబులెన్స్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ దిక్కు వెళ్ళిపోయింది. రోడ్ పై పెద్ద సంఖ్యలో గుమికూడిన జనం ‘ పాపం ‘ అని గొణుక్కుంటూ వెళ్ళిపోయారు ఎక్కడివాళ్ళక్కడ.

ఆ రాత్రి తొమ్మిది తర్వాత ఎవరో వచ్చి బీడీలు చేసుకుంటున్న శ్వేత తల్లి శంకరమ్మతో ” మీ కూతురు శ్వేత .. ” అని చెబుతే.. అప్పుడు చూచింది టి. వి ని.

ఆ క్షణం శ్వేత తండ్రి లేడు ఇంట్లో. ఆటోలో ఏదో సామాన్ వేసుకుని కూలీకి చిట్యాల అనే ఊరికి పోయిండు. ఇదంతా తెలియదు ఆయనకు.

టి. వి లో అంతా చూచి.. మౌనంగా కొయ్యబారిపోయిన శంకరమ్మ .. ఏ రాత్రి ఒంటి గంట వరకో మేల్కొని ఉండి .. భర్త ఆటోతో ఇంటికి వచ్చిన తర్వాత .. అన్నం వడ్డించి లోపలికి వెళ్ళి ఇంటెనుక ఉన్న వేప చెట్టుకు ఉరేసుకుంది.

పరువు.. ప్రతిష్ట.. ఏమిటివి.? విలువలూ.. వ్యక్తిత్వాలూ.. గౌరవనీయతలూ ఏమిటివి.?

వ్చ్.. ఏమో.!

శంకరమ్మ ఇల్లు సుభద్ర ఉంటున్న గాయత్రి నగర్ ప్రక్క వీధిలో.. శాంతి నగర్ లో.. ఒక రెండు గదుల పాత ఇల్లు.. దాంట్లో కిరాయికుంటారు వాళ్ళు. పొద్దున్నే ఆరు గంటలకే వచ్చిన కూరగాయల జయమ్మ చెప్పింది శంకరమ్మ ఉరి గురించి.. నిన్న రాత్రి నుంచి ఆమె బిడ్డ శ్వేత అనే ఇంజనీరింగ్ పిల్ల అట్ల హోటల్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి.. అంతా.

ఆమె చెప్పుతున్నప్పుడు.. ప్రక్కన రాజ్యలక్ష్మీ, చెన్నకేశవులు కూడా ఉండిరి.

చెన్నకేశవులు అన్నడు.. ” రాత్రి చూచిన టి వి ల.. ఈ టి వి ముండాకొడుకులకు ఇటువంటి విషయాలను చాలా చాలా ప్రముఖంగా చూపించాలంటే ఎంత మోజో. మొత్తం మీద చేయకూడని పని చేసి ఆ పోరి చచ్చింది.. ఈ టి వి వాళ్ళ అత్యుత్సాహపు ప్రదర్శన వల్ల దాని తల్లి చచ్చింది.. పరువు.. పరువు ”

సుభద్ర అప్పటికి చాలా అలసిపోయి ఉంది. హైదరాబాద్ నుండి వచ్చింది రాత్రి పార్టీ మనుషులతో.

ఈ రెండేళ్ళలో సుభద్ర తాను అనుకున్నట్టుగానే ‘ తెలంగాణ రాష్ట్ర సమితి ‘లో చాలా చురుకైన కార్యకర్త గా గుర్తించబడి.. ఒక కీలకమైన మహిళా నాయకురాలిగా ఎదిగింది. ‘ తెగబడి కొట్లాడుదాం.. ఈ నేలకోసం.. మన బంగారు బతుకులకోసం ‘ అన్న నినాదంతో దాదాపు ఐదు వందలమంది యువ మహిళలను ఒక కట్టు గా తయారుచేసి అధిష్టానం దృష్టిలో మంచి డైనమిక్ వ్యక్తిగా గుర్తింపును సంపాదించింది.

అగ్ర నాయకత్వంలో ఆమెకు వచ్చిన మంచి పేరు ఏమిటంటే ‘ ఈమె ఏ పదవినీ ఆశించదు.. ఒట్టి మామూలు కార్యకర్తగ ఉండుడే ఇష్టం సుభద్రకు ‘ అని. అందువల్ల ఆమె విలువ చాలా పెరిగింది. వరంగల్ జిల్లా అంటే.. మరీ ముఖ్యంగా మహిళా ఆర్గనైజేషన్ అంటే.. ఇక సుభద్రే అన్న గుర్తింపు వచ్చింది. అందులో ఉద్యమంలో అమరుడైన మొగిలి తల్లి కావడం.. అమెకు ఎవలేని గౌరవాన్ని సమకూర్చి పెట్టింది.

కూరగాయల జయమ్మ చెప్పిన తర్వాత శంకరమ్మ ఇంటికి ఊర్కే చూచిరావడానికి వెళ్ళినపుడు.. సుభద్ర వెంట చెన్నకేశవులుతో పాటు.. ఇంకో పది పదిహేను మంది టి ఆర్ ఎస్ మహిళా కార్యకర్తలున్నారు. బాగా జ్ఞాపకం.. ఆరోజు తేదీ 5 డెసెంబర్, 2013. ఉదయం పది గంటలు దాటితే.. పార్లమెంట్ శీతాకాలపు సమావేశాలు ప్రారంభమై ‘ ప్రత్యేక తెలంగాణ బిల్లు ‘ ప్రవేశ పెట్టబడాలె. కోటానుకోట్ల తెలంగాణ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సందర్భం. గీ పిల్ల శ్వేత.. పోరడు రోహిత్.. నిప్పుల కొలిమివలె ఉన్న తెలంగాణ చారిత్రాత్మక ఉద్యమంలో కనలిపోతున్న సందర్భంలో.. గీ ప్రేమ.. దోమ.. క్షణిక వాంఛకోసం.. ఒక అకృత్యం.. వ్చ్.. ఏమో.. దారి తప్పిన యువతరం.. నిజానికి ఈ రాష్ట్ర ఉద్యమంలో యువకులంతా ఏకమై .. మమేకమై పోరాడవలసిన తరుణం. సామాజిక బాధ్యతతో ప్రజలకోసం కార్యరంగంలో ఉండవలసిన యంగ్ పీపుల్. ఇదేమిటో. ప్రవర్తనా ఔచిత్యమే లేదు.

జాలి వేసింది.

ఈ రెండేళ్లలో.. అటు ఉద్యమంలో పూర్తిగా నిమగ్నమై పాల్గొంటూనే.. ఇటు ఎస్ డి ఎల్ సి ఇ ద్వారా బి.ఎ పూర్తి చేసి ఎమ్మే కూడా రాస్తున్న సుభద్ర లో గుణాత్మకంగా విపరీతమైన పరిపూర్ణతతో కూడిన ఉన్నతి వచ్చింది. నడుస్తున్న ఎన్ సైక్లోపీడియా వంటి, తండ్రి వంటి చెన్నకేశవులు సాంగత్యం కూడా ఆమెను ఒక సమతుల్యత గల ఆలోచనాపరురాలిని చేసింది.

చేసేది ఏమీ లేక.. శంకరమ్మ వాళ్ళ ఇంటినుండి వచ్చేసింది. పోలీస్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ గారితో మాట్లాడి పాపం ఆ విషాదంలో కూరుకుపోయిన కుటుంబాన్ని ఇంకా వేదించకుండా.. మానవతా దృష్టితో సహాయం చేయమని చెప్పింది సుభద్ర. ప్రజా జీవితంలో ఉంటూ.. ఉద్యమంలో కూడా కీలక వ్యక్తి కావడం వల్ల ఆమెకు పోలీసులతో, ఇతర జిల్లా స్థాయి అధికారులతో కొంత సాన్నిహిత్యం ఏర్పడ్డది.

అప్పుడామెకు.. ఈ సాధారణ విషయాలకన్నా.. ఎప్పుడు పదిగంటలై పార్లమెంట్ సమావేశాలు మొదలౌతాయో.. ఏం జరుగుతుందో.. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టబడ్తుందా తామందరూ ఆశిస్తున్నట్టు.. టీ ఆర్ ఎస్ ఉన్నత శ్రేణి నాయకత్వమంతా ఢిల్లీ లోనే తిష్ట వేసి పరిస్థితులను చాలా జాగ్రత్తగా , నిశితంగా గమనిస్తున్నారు. ఈనగాచిన పంటను నక్కలపాలు చేయకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.

వెళ్ళాలి ఇంటికి .. వెళ్ళి టి.వి ని ఆన్ చేసి ఇక అక్కడే తిష్ట వేయాలె ఈ రోజంతా. ఒకవేపు పార్టీల స్పృహను విడిచిపెట్టి ఆంధ్రా రాజకీయ లాబీ అంతా మూకుమ్మడి వ్యతిరేకతను విషపు జ్వాలలా కుమ్మరిస్తోంది. ఎక్కడ ఈ చివరి ఘట్టంలో హాని తలపెట్టి అంతా బూడిదలో పోసిన పన్నీరును చేస్తారోనని భయం.

సుభద్ర.. చక చకా తన వెంట ఉన్న మనుషులతో ఇంటికి వచ్చేసింది.

శ్వేత.. శంకరమ్మ.. రోహిత్.. అందరూ చిరు విషాదానుభూతులై కలచివేస్తున్నా.. వచ్చేసిందక్కడినుండి చేసేదేమీ లేక.

9

సంభావ్యత.. ప్రాప్తత.. ఆసన్నత.

అసలది జరుగుతుందా.. సంభవించడం సాధ్యమేనా.. సంభవించడానికి అవకాశాలున్నాయా.. అనే దృష్టితో చూస్తే వచ్చే జవాబు సంభావ్యత.

‘ తెలంగాణ ‘ ఏర్పడ్డం సంభవమేనా. ఇదివరకే నిజాం కాలంలో హైదరాబాద్ దక్కన్ గా ఉన్న తెలంగాణా రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేసి.. అప్పుడు 1955 లో కుట్ర పూరితంగా లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రను ధనిక రాష్ట్రమైన తెలంగాణ తో కలుపుతున్నప్పుడు చర్చలో దాన్ని ‘ ఆంధ్ర తెలంగాణ ‘ గా పిలువాలని ఇరుపక్షాల నాయకులు అంగీకరించి.. తీరా విశాలాంధ్ర కోసం పరితపిస్తున్న వ్యక్తుల ప్రోద్బలంపై పార్లమెంట్ లో అందరూ కుమ్మక్కై ‘ ఆంధ్రప్రదేశ్ ‘ అని నామకరణం చేశారు.. హిందీ భాష వాసనలతో. కాబట్టి అతుకుల బొంతలా బలవంతంగా రెండు వేర్వేరు బట్ట ముక్కలను కలిపి కృత్తిమంగా కలిపి కుట్టినట్టేర్పడిన ఈ కలయిక విడివడడం సాధ్యమే.. సంభవమే.

ప్రాప్తత.. ఇది పూర్యిగా తాత్వికతతో కూడిన భావన. భారతీయ చింతనలో భాగంగా.. ‘ ఎవరికి ఏది ప్రాప్తముంటే అదే దక్కుతుందని ఎవరికివారు సర్దుకుపోయి.. శాంతపడడానికీ, తృప్తిపడడానికీ కల్పించుకున్న ఒక రకమైన ప్రత్యామ్నాయ చింతన. పూర్తిగా తార్కికం కాని ఊహ. ‘ తెలంగాణా రాష్ట్రం ‘ ఏర్పడ్డం ప్రస్తుత పరిస్థితుల్లో సుదీర్ఘ కాలం అనేక త్యాగాలతో కూడిన పోరాటం చేస్తున్న ఈ వీరోచిత ప్రజలకు ప్రాప్తమున్నది.

ఇక.. ఆసన్నత.. అన్ని రకాలుగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డానికి సమయం ఆసన్నమైందనే అనిపిస్తోంది తనకు. అగ్నిపర్వతం బ్రద్దలు కావడానికి సమయం ఆసన్నమైందంటారే.. ఆ విధంగా ఇప్పుడిక సకలరకాలుగా రాష్ట్ర ఆవిర్భవానికి సమయం ఆసన్నమైంది . ‘ తెలంగాణ పుడమి తల్లి పురిటి నొప్పులు పడుతున్నది ‘ అనికదా కవి వాక్యం.

సుభద్రా, చెన్నకేశవులు, రాజ్యలక్ష్మి అన్నిరకాలుగా .. తయారై.. టిఫిన్ చేసి , మానసికంగా సిద్ధమై, ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠతో.. ఇదివరకు ఒకసారి మోసపోయిన అనుభవముంది కాబట్టి ఒకింత ఆందోళనతో.. ఉద్విగ్నంగా టి వి ముందు సోఫాలో, కుర్చీల్లో కూర్చున్నారు.

ఇదివరకు 9 డిసెంబర్, 2009 న తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్టూ, ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టూ ప్రకటించిన భారత ప్రభుత్వం మాట తప్పి పద్నాలుగు రోజుల్లోనే సీమాంధ్రుల కుట్రలకు తలొగ్గి 23 డిసెంబర్ న మాట తప్పింది కదా. ఇప్పుడు మూడేండ్లు తాత్సారం చేసి మళ్ళీ ఎగ్గొట్టదని నమ్మకమేమున్నది అనేది భయం.

సుభద్ర ప్రక్కన ఒక బృహత్ గ్రంథముంది. ‘ సనాతన ధర్మం ‘ అది. ఈ మధ్య చక్కని ఇంగ్లిష్ ను కూడా పట్టుపట్టి నేర్చుకున్న ఆమె తన భారతీయ మూలాలనూ, నేపథ్యాన్నీ, తన పూర్వీకుల సాంస్కృతిక పునాదులనూ తెలుసుకుంటున్నది. వెరసి జీవితాన్ని ఒక విశాల దృక్పథటో ‘ బ్రాడ్ స్పెక్ట్రం ‘ లో చూడ్డం నేర్చుకుంది.

రాజ్యాంగ నిర్మాణం, పౌర విధులు.. హక్కులు.. బాధ్యతలు, బుద్ధుని గురించిన సాధికారిక గ్రంథాలైన డాక్టర్ భీం రావ్ రాంజి అంబేడ్కర్ రాసిన ‘ ద బుద్ధా అండ్ హిజ్ ధమ్మ ‘ వాల్యూం 1 మరియు 2, విదేశీ పరిశోధకుడు రాహుల రాసిన ‘ వాట్ ద బుద్ధా టాట్ ‘ , ఉమా చక్రవర్తి రాసిన ‘ ద సోషియల్ డైమెన్షన్ ఆఫ్ ఎర్లీ బుద్ధిసం ‘, ఎ.ప్.డి జోయ్సా రాసిన ‘ ఇండియన్ కల్చర్ ఇన్ ద డేస్ ఆఫ్ బుద్ధా ‘ , ఆచార్య వై.బి.సత్యనారాయణ రాసిన ‘ బుద్ధిసం రేషనాలిటీ ‘ .. జిడ్డు కృష్ణమూర్తి మొత్తం పుస్తకాలు.. ఇవన్నీ చదివింది. ఇటువంటి పుస్తకాల పఠనంతో ఆమెలో కొత్త తలుపులు తెరుచుకున్నాయి.

టి.వి లో .. పార్లమెంట్ చానెల్.. కెమెరా ఆన్ అయ్యింది. సభ్యులందరూ తమ తమ సీట్లలో ఆసీనులై ఉండగా స్పీకర్ మీరా కుమార్.. లోకసభ కార్యక్రమం ప్రారంభమౌతున్నట్టు ప్రకటించి కూర్చుంది తన సీట్లో.

ఆ రోజు 5 డెసెంబర్ , 2013.

శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమౌతున్న రోజు.

అప్పటికి దాదాపు నెల రోజులకు ముందు అంటే 8 అక్టోబర్ న ఆశావహమైన ఒక చర్యను ప్రకటించింది యు పి ఎ ప్రభుత్వం. అదేమిటంటే కాంగ్రెస్ పార్టీ తరపున అప్పటీకే ఒక విభజన కమిటీ పని చేస్తూండగా.. దానికి సమాంతరంగా కేంద్ర ప్రభుత్వం పక్షాన కూడ విభజన కార్యాన్ని పర్యవేక్షించేందుకు ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ( జి.ఒ.ఎం ) ను నియమించింది. దాంట్లో అనివార్యంగా అందరూ కేంద్ర మంత్రులే ఉండాలె. దీనికి చైర్మన్ గా ఎ.కె.ఆంటోని నియమించబడ్డారు. హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, పి. చిదంబరం, వీరప్ప మొయిలీ, గులాం నబీ ఆజాద్, పి. నారాయణస్వామి లు సభ్యులుగా ఉన్నారు.

స్పీకర్ అనుమతిపై సుశీల్ కుమార్ షిండే కేంద్ర క్యాబినెట్ అప్పటికే ఆమోదించిన ,హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన ‘ తెలంగాణ ముసాయిదా బిఉల్లు – 2013 ‘ ను ప్రవేశ పెట్టాడు. ఆంధ్రా పార్లమెంట్ సభ్యుల విపరీతమైన గొడవ.. అరుపులు కేకలు, ప్రతిఘటనలు.. నానా గందరగోళం.. బీభత్సం అంతా. అంతా జరిగి జరిగి .. అనేకసార్లు సభ వాయిదా పడ్తూ.. మళ్ళీ ప్రారంభమౌతూ.. ఎట్టకేలకు సాయంత్రానికి మీరా కుమార్ డైనమిక్ నిర్వహణలో బిల్లు పాసై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంకోసం పంపించింది సభ.

సుభద్ర వెల్లువెత్తిన సంతోషంతో.. ఎగిరి గంతేసినంత పని చేస్తూ.. తన కొడుకు వీర మరణానికి ఆ రోజు సార్థకత ప్రాప్తించినట్టుగా పొంగిపోతూ.. గబగబా వంటగదిలోకి పరుగెత్తి చక్కెర డబ్బా తెచ్చి గబగబా ముప్పిరిగొంటున్న సంతోషంతో ” నాన్న గారూ.. ప్లీజ్.. అమ్మా నువ్వు కూడా ” అని నోళ్ళలో గుప్పెడు గుప్పెడు చక్కెర పోసింది.

అప్పుడామె హృదయం శతవసంతాలు విరిసిన పూదోటలా ఉంది.

‘ నా తెలంగాణ .. నా తల్లి తెలంగాణ ఏర్పడింది .. నా సుదీర్ఘ స్వప్నం తెలంగాణ సిద్దించింది.. ‘ అని మురిసిపోతూండగా.. చెన్నకేశవులన్నాడు.. ” తల్లీ నాకూ ఆనందంగా ఉంది.. కాని ఈ ఆంధ్రా లాబీయిస్ట్ లను నమ్మొద్దు. ఎంతకైనా తెగిస్తారు వాళ్ళు. ఎవరో అన్నట్టు ఇల్లలుకగానే పండుగ కాదు. కొస తాళ్ళెల్లాలె ‘ అని. కరక్టే అనిపించిందామెకు. సాలోచనగా నిశ్శబ్దయై మళ్ళీ టి. వి ని చూస్తూ ఉండిపోయింది.

ఏదేమైనా సుభద్ర ఆరోజు రాత్రి చాలా ప్రశాంతంగా.. తృప్తిగా.. గాఢంగా నిద్రపోయింది.

*                                                  *                                                 *

ఇక ప్రతిరోజూ పత్రికల్లో చూడ్డం.. టి ఆర్ ఎస్ ఆఫీస్ కూ, టి జె ఎ సి కార్యాలయానికీ వెళ్ళినప్పుడు ఢిల్లీ విశేషాలను కనుక్కోవడం.. తెలంగాణ బిల్లు పురోగతినీ .. అక్కడ ఆంధ్రా లాబీయిస్ట్ లు.. అంధ్రాలో చేస్తున్న వింత వింత ప్రదర్శనలనూ, టి వి ల్లో ఆంధ్రా చానళ్లన్నీ పోటీ పడి నిర్వహిస్తున్న చర్చలూ.. లగడపాటి వంటి జోకర్లూ, బంగి అనంతయ్య, శివప్రసాద్ వంటి పగటి వేషగాళ్ళు వేస్తున్న వింతవింత ఫ్యాన్సీ డ్రెస్ వేషాలూ చూస్తూ తెలంగాణా ప్రజలు కించిత్తు ప్రమాదాలను శంకిస్తూనే .. కాలక్షేపం చేస్తున్న తరుణంలో.,

సుభద్రకు ఒక వార్త వచ్చింది ఢిల్లీనుండి. పార్టీ బాధ్యురొకరు ఎస్సెమ్మెస్ చేసిండు. ‘ ఈరోజు ఒక శుభవార్త ఉండొచ్చు ‘ అని.

పొద్దటినుండీ ఎదురుచూస్తూ, టి వి ని గమనిస్తూ కూర్చుంది ముందుగది లైబ్రరీలో సుభద్ర.

చెన్నకేశవులూ, రాజ్యలక్ష్మి భోజనానంతరం విశ్రమిస్తున్నారు లోపల.

లైబ్రరీలోనుండి ఒక చిన్న, సన్న అతిపురాతన పుస్తికను తీసుకుంది చేతుల్లోకి.

43 వ సంవత్సరం బి సి నాడు రోమన్ దేశంలోని సిసిరో అనే సామాజిక పరిశీలకుడు, అన్వయకర్త రాశాడీ విధంగా. అది ఎంత నచ్చిందో ఆమెకు. వృత్తిపరమైన వ్యక్తులను అతిఖచ్చితంగా నిర్వచించిండు.

  1. ద పూర్ : పని చేస్తూ.. ఎల్లప్పుడూ పని మాత్రమే చేస్తూ ఉండేవాడు.
  2. ద రిచ్ : పై వాన్ని దోచుకునేవాడు.
  3. ద సోలియర్ : పై ఇద్దరినీ రక్షించేవాడు.
  4. ద టాక్స్ పేయర్ : పై ముగ్గురికోసం పన్నులు చెల్లించేవాడు.

5.ద బ్యాంకర్ : పై నలుగురినీ దోచుకునేవాడు.

  1. ద లాయర్ : పై ఐదుగురునీ తప్పుదోవ పట్టించేవాడు.
  2. ద డాక్టర్ : పై అందరికీ బిల్లులనిచ్చి సంపాదించేవాడు,
  3. ద గూన్ : పై అందరికీ భయపడేవాడు.
  4. ద పాలిటీషియన్ : పై అందరినీ మోసగిస్తూ హాయిగా జీవించేవాడు.

షరా: సమాజమంతా దాదాపు వీళ్ళతోనే నిండి ఉంది. అందుచేత వీళ్ళ గురించి పైన చెప్పినట్టు మనం గుర్తించగలుగుతే.. కౄర జంతువుల బారినుండి మనల్ని మనం రక్షించుకోవచ్చును.

ఇన్ని శతాబ్దాలు గడిచినా సిసిరో చెప్పిన నిర్వచనాల్లో మాత్రం ఏ మార్పూ రాలేదు.

 

ఆ రోజు 11 డెసెంబర్, 2013 :

టి. వి ని చూస్తూంటే ఢిల్లీనుండి వచ్చిన వార్త నిజమే అని తేలింది. వార్తల్లో చెబుతున్నారు ‘ ఈ రోజు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇదివరకు కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ ఆమోదించి పంపిన ‘ తెలంగాణ ముసాయిదా బిల్లు- 2013 ‘ ను ఆమోదించారు. దీన్ని రాజ్యాంగ నియమాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కోసం హైదరాబాద్ కు పంఫిస్తారు.’

సుభద్ర ఆ ఆనందకర వార్తను ఒంటరిగా కూర్చుని వింటూండగానే పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక కవర్ ను ఇచ్చి వెళ్ళాడు.

అది కాకతీయ విశ్వవిద్యాలయ ఎస్ డి ఎల్ సి ఇ నుండి వచ్చిన కవర్.

బి.ఎ పూర్తవగానే వెంటనే ఎం ఎ కు ఫీజు కట్టాలని స్వయంగా చెన్నకేశవులు మళ్ళీ తనను వెంట తీసుకుపోయి పరీక్ష ఫీ కట్టించిన తర్వాత.. ఇప్పుడు మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్. చదువుకు సంబంధించిన ఏ సహాయాన్నైనా చేయడమంటే చెన్నకేశవులు గారికి ఎంత ఇష్టమో.

‘ నిజంగా దైవ సమానుడాయన . అట్ల మనుషులుండడం అరుదు ‘ అనుకుంది కృతజ్ఞతాపూర్వకంగా.

ఇక పుస్తకాలను ముందేసుక్కూర్చోవాలె .. అనుకుని మొబైల్ మోగుతే ఎత్తింది.

” అక్కా కంగ్రాచ్యులేషన్స్ .. మన తెలంగాణ ఇక వస్తాంది.. ఔటర్ సిగ్నల్ దగ్గరే ఉంది. ” అని అటునుండి.. ఆ గొంతు స్వర్ణది.. టి ఆర్ ఎస్ మహిళా వింగ్ ‘ మీటింగ్స్ స్పెషలిస్ట్ ‘ . స్వర్ణకు చెబితే చాలు.. ఫలాన సభకు వేయి మంది రావాలంటే పట్టుకొస్తది. ఎన్నో ఊళ్ళలో ఉన్న అనేకమంది మహిళలతో చాలా ఆత్మీయమైన సంబంధమున్న మనిషి. ఉద్యమకర్త. చాలాసార్లు లాఠీ దెబ్బలు తిన్నది. జైలుకు పోయింది. బోలెడు పోలీస్ కేసులున్నై. అన్నింటినీ మించి అస్సలు భయమంటే ఎరుగదు. చక్కగా గొంతెత్తి ఉద్యమ గీతాలను ఆగకుండా గంటసేపు పాడ్తది. తెలంగాణ ధూం ధాం రసమయి బాలకిషన్ టీంలో ఉంటది. మెరుపు ఆమె.

ఫోన్ పెట్టేసి తన గదిలోకి వెళ్ళి ‘ సామాజిక శాస్త్రం ‘ గ్రంథాన్ని బయటికి తీసింది.

ఇక రేపటి నుండి డైరీ రాయాలె.. ఈ టీ వి చూడ్డం కుదరదు. పైగా పార్టీ నుండి కూడ పిలుపు వస్తుందేమో హైదరాబాద్ కు రమ్మని. కథ దగ్గరపడ్తాందిగదా.

 

( మిగతాది వచ్చే పక్షం )

రామాచంద్ర మౌళి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు