మంచినీళ్లది ఏమతం?

“మీ కులపోళ్లింట్లో మేము నీళ్లు తాక్కూడదంట. మా మామ్మ ఊర్కోదు” అంది పుష్ప.

స్కూళ్లు మొదలయ్యాయి. కొత్త విద్యా సంవత్సరం. కొత్త యూనిఫారాలు, కొత్త క్లాసులు, కొత్త పాఠాలు. ఓహ్, పిల్లల సంబరం చెప్పనలవికాదు. కొత్తగా చేరే పిల్లలు. కొత్త స్నేహాలు. ప్రతి సంవత్సరం మొదట్లోనూ ఈ సంబరం చూస్తే మనసు చిన్ననాటి రోజుల్లోకి వెళ్లిపోతుంది.

సాయంకాలం క్లాసులకి ప్రభుత్వమో, ఒక సంస్థో నడిపేవే కాకుండా మతపరంగా నడుపుతున్న పాఠశాలలనుంచీ పిల్లలు వస్తుంటారు. వేర్వేరు పాఠశాలల్లో వేర్వేరు అంశాలకి ప్రాధాన్యం కనిపిస్తుంటుంది.

పిల్లలు తమకి అవగాహనకొచ్చిన విషయాలని నమ్ముతూ ఎదుగుతుంటారు. అవి తప్పో, ఒప్పో విడమరిచి చెబితేతప్ప వాళ్ల అభిప్రాయాలు అలాగే స్థిరపడిపోతుంటాయి.

సాయంకాలం క్లాసులకి రావటం మొదలెట్టిన కొత్తలో పుష్ప అడిగిన ప్రశ్న నాకు ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది.

“టీచర్, మీరు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు?”

నవ్వేసి, పాఠం చెప్పేందుకు ఉపక్రమిస్తుంటే రెట్టించింది.

“చెప్పండి టీచరుగారూ, మీరు దురగమ్మ కొండకి వెళ్తారా?”

పసితనపు అమాయకత్వంతో అడిగిన ప్రశ్ననుకోనా? అంతకుమించి పది, పదకొండేళ్ల పిల్లకి ఎలాటి ఆసక్తి, అవగాహన ఉంటాయి?

“నువ్వు వెళ్తావా?” యథాలాపంగానే అన్నాను.

“మేము ఎప్పుడూ వెళ్లం టీచర్” అంది గట్టిగా తన వ్యతిరేకతని మాటల్లోకి తర్జుమా చేస్తూ. ఉలిక్కిపడ్డాను ఆమె గొంతులో కాఠిన్యానికి.

“సరే, కూర్చో. మనం మళ్లీ మాట్లాడుకుందాం ఈ విషయాలన్నీ.”

చిత్రంగా పుష్ప ఆవిషయం మర్చిపోలేదు.

ప్రతిరోజూ నన్ను వీధి చివర రావటం చూస్తూనే పరుగెత్తుకు ఎదురొచ్చి “టీచర్, ఈరోజు మాట్లాడుకుందామా?” అనేది. పుష్ప లేతమనసు కులం, మతం తాలూకు నమ్మకాల గురించి గట్టి అభిప్రాయాలతోనే ఉందని తోచింది.

ఆరోజు క్లాసుకి ఒక తెల్లని మేఘంలాటి అమ్మాయి వచ్చింది. పిల్లలంతా చుట్టూచేరి వేస్తున్న ప్రశ్నలకి చిరునవ్వుతో సమాధానాలు చెబుతోంది. తనూ వాళ్ల వయసులోనే ఉన్నా ఒక పెద్దరికం ఏదో ఆమెలో కనిపించింది. పేరు ఆనందిట. పిల్లలందరికీ అది మరీ తమాషాగా అనిపించింది. ఒకటికి పదిసార్లు అందరూ ఆమె పేరును ఉచ్ఛరిస్తున్నారు.

కొత్తగా వచ్చారట. ఇంట్లోనే అమ్మా, నాన్న చదివిస్తారట. ఆనంది ఐదవ తరగతి చదువుతోంది. నేను వచ్చేసరికి తను చదువుకోవటమే కాకుండా తన చుట్టూ ఉన్న చిన్నపిల్లలకి పలకమీద అక్షరాలు రాసిచ్చి వాటిని పలకటం నేర్పుతుండేది.

పుష్ప, మిగిలిన పిల్లలు ఆనంది చేసే ప్రతిపని గమనిస్తూ కూర్చునేవారు. అంతకుముందులా గట్టిగా కబుర్లు, అల్లరి చెయ్యటం మరిచినట్టున్నారు. స్కూలుకి కూడా వెళ్లదుట అని ఆశ్చర్యం. ఆనంది అందరితో కలిసిపోయేది. పేరుకి తగినట్టు ఎప్పుడూ ఆనందంగా కనిపించేది, మిగిలిన పిల్లల్లా ఏగొడవ ల్లోనూ ఉండేదికాదు.

శనివారం మార్కెట్లో ఆనంది వాళ్ల అమ్మతో పాటు కనిపించి, పరిచయం చేసింది.

ఆమె చిరునవ్వుతో నన్ను పలకరించి, ఆనంది చదువు గురించి అడిగింది.

“మీరు ఇంట్లోనే చదివిస్తారటకదా.”

“అవునండీ, వాళ్ల నాన్నగారు, నేను ఎవరికి సమయముంటే వాళ్లం తనని చదివిస్తాం. స్కూల్లో కుల, మతాల ప్రస్తావన నచ్చక ఇంట్లో చదివిస్తున్నాం. రేపు పెద్దక్లాసులకొచ్చాకైనా పరీక్షలకి వెళ్లాలంటే వాటి ప్రస్తావన ఎటూ తప్పదు అప్లికేషన్ ఫారాల్లో. ఆయన వ్యవస్థతోనే పోరాడుతున్నారు తన స్థాయిలో.” ఆమె మాటలు నా మనసులో కదిలే భావాలకి అనుగుణంగానే ఉన్నాయి.

పిల్లలందరూ ఆనందితో స్నేహం కట్టేసారు. ఆనందికి కాగితంతో రకరకాల బొమ్మలు చెయ్యటం, రంగురంగుల బొమ్మలు గియ్యటం వచ్చని అందరూ ఆమెను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తున్నారు. అప్పుడప్పుడు పుష్పతో పాటు మరొక ఇద్దరు, ముగ్గురు మాత్రం ఆనంది ఎప్పుడూ చర్చికి రాదు అంటూ ఫిర్యాదు చేస్తుండేవాళ్లు నా దగ్గరకొచ్చి.

ఆనందికి సైకిలు తొక్కటం వచ్చని తెల్సి అందరూ అద్దె సైకిళ్లు తెచ్చుకుని నేర్చుకోవటం మొదలెట్టారు. ఇంట్లో అన్నకో, తమ్ముడికో సైకిలున్నా తమకు ఇవ్వరని ఫిర్యాదు. సైకిళ్లు నేర్చుకుంటూ, దెబ్బలు తగుల్చుకుంటూ, ఒక్కోసారి క్లాసులు కూడా మానేస్తున్నారు. వాళ్లు ఒక విద్య నేర్చుకునే ఆశతో ఉన్నారని నాకు సంతోషంగా ఉంది. భవిష్య జీవితాలకి సన్నద్ధం అయేందుకు చదువుతో పాటు ఇవన్నీ అవసరమే.

ఆరోజు సైకిలు మీంచి పడి మోకాలి చిప్పలు పగిలి ఏడుస్తూ వచ్చింది పుష్ప.

“అసలు ఈ ఆనంది వల్లే టీచర్, ఇంతంత దెబ్బలు తగిలాయి. తనేమో చిన్నప్పుడే చిన్న సైకిలు నేర్చుకుంది. ఇప్పుడు నేర్చుకుందామంటే మాకు రోజూ దెబ్బలు తగులుతున్నాయి. మా మామ్మ తిట్టింది, “మగరాయుడల్లే సైకిలు తొక్కుతానంటే మరి దెబ్బలు తగలవూ? మళ్లీ సైకిలన్నావంటే తిండి పెట్టేది లేదు.” అంది.

“అసలైనా ఒక్కరోజూ చర్చీకి రాదుకదా, ఆపిల్ల ఏం చెప్పినా మీరంతా చెయ్యాలా అని అరిచింది టీచర్”. దెబ్బల తాలూకు బాథ, ఇంట్లో ఎదురైన నిరశనలతో పుష్ప ఇవరకటిలాగా పెద్దగా అరుస్తూ మాట్లాడుతోంది.

“పుష్పా, ముందు దెబ్బలు కడుక్కుని రా. మనం ఈరోజు కబుర్లు చెప్పుకుందాం.” అన్నాను. పుష్ప కళ్లు తుడుచుకుని, స్నేహితురాళ్ల సాయంతో వెళ్లి కళ్లు, ముఖంతో పాటు దెబ్బలకు అంటిన మట్టి, రక్తం కడుక్కొచ్చింది. ఆనంది ఇంటికి పరుగున వెళ్లి చిన్న మెత్తని బట్టతో పాటు కొబ్బరినూనె సీసా తెచ్చింది.

పుష్పకి తగిలిన దెబ్బలమీద కొబ్బరినూనె రాసి, “రేపటికి తగ్గిపోతుంది” అని ధైర్యం చెప్పింది. పుష్ప అయిష్టంగానే సేవ చేయించుకుంది. మామ్మ తిట్లు మళ్లీ మళ్లీ ఆమె చెవుల్లో వినిపిస్తున్నాయి. ఇంట్లోంచి షైనీ మంచినీళ్లు పట్టుకొచ్చి ఇచ్చింది.

“మీ కులపోళ్లింట్లో మేము నీళ్లు తాక్కూడదంట. మా మామ్మ ఊర్కోదు” అంది పుష్ప. షైనీ కూడా సూటిగా అడిగేసింది, “నిన్న నేను కేకు తింటుంటే పెట్టించుకుని తిన్నావుగా”.

“అది షాపులోంచి తెచ్చేవుగా” అంది పుష్ప తడుముకోకుండా.

“మనం తాగే మంచినీళ్లది ఏకులం? ఏమతం? మీలో ఎవరికైనా తెలుసా?” అన్నాను వెంటనే.

అందరూ ఈసంగతి ఎప్పుడూ వినలేదే అని గుసగుసలాడుకున్నారు.

“మంచినీళ్లకి కులం, మతం ఉంటయ్యా?” పుష్పకి గెలవాలని ఉంది. అంతక్రితం షైనీతో అన్న మాటలు మరిచేపోయింది.

“ఎందుకుండదు? మనందరికీ కులం, మతం ఉన్నట్టే మనం తాగే నీళ్లక్కూడా ఉండాలిగా.”

పుష్ప తెల్లముఖం వేసింది.

“ఈరోజు మీకు ఒక కథ చెప్పనా?”

కథ అనేసరికి అందరూ సంతోషంగా ముందుకు జరిగి కూర్చున్నారు.

అనగనగా ఒక ఊళ్లో ఒకాయన ఉన్నాడు. ఆయనకి పిల్లిని చూస్తే నచ్చదు. అది ఎదురైతే తనకి చెడు జరుగుతుందని నమ్మేవాడు. రోజూ పనికి బయలుదేరేప్పుడు జాగ్రత్తగా చూసుకుని బయలుదేరేవాడు. ఒకరోజు ఆలస్యమైందన్న తొందరలో రెండు అడుగులు వేసేక్కానీ తన ఎదురుగా పిల్లి ఉందన్నది గమనించలేదు. ఇంక ఆరోజు తనకి ఏదో చెడు జరగబోతోందని దిగులుపడ్డాడు. పోనీ ఆరోజుకి పని మానేద్దామంటే యజమాని ఏమంటాడో?!

యజమాని ఇతనిని చూసి, “ఏమయ్యా, ఎప్పుడూ ముందుగానే వస్తావుకదా, ఈరోజు ఆరోగ్యం బావులేదా ఏం? కొద్దిసేపు పనిచేసి, త్వరగా ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో” అన్నాడు.

యజమాని మాటలకి ఆశ్చర్యపోయాడు. పిల్లిని గురించిన తన నమ్మకం అర్థంలేనిదని తెలుసుకుని, ఆ తర్వాత పిల్లిపట్ల ప్రేమగా ఉన్నాడు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా, నమ్మకాలనేవాటికి ఆధారాలుండవు. మన క్లాసులో ప్రశాంతి చూడండి, ఎప్పుడూ పరీక్షకి నీలం రంగు పెన్నే పట్టుకెళ్తానని చెబుతుంది కదా.” అనేసరికి ప్రశాంతి సిగ్గుపడిపోయింది.

పిల్లలంతా ఉత్సాహంగా “ఇంకా చెప్పండి టీచర్” అన్నారు.

“చేసే వృత్తిని బట్టి కులాలొచ్చాయని చదువుకున్నాం. అలాగే మనకంటూ కొన్ని ఇష్టాలు, నమ్మకాలు ఏర్పరచుకుంటాం. చర్చీకో, గుడికో, మరోచోటకో నమ్మకమున్నప్పుడు వెళ్తాం. లేకపోతే లేదు. ఎవరినీ ఇలాటి విషయాల గురించి మనం ప్రశ్నించకూడదు. వాళ్ల నమ్మకాల్ని ఆక్షేపించకూడదు. మనకి సంతోషం కలిగించేది, ఇష్టమైనది మనం చేసినట్టే, ఎదుటివాళ్లు కూడా అని అర్థం చేసుకోవాలి.

ఆనంది చర్చికి రాదని మీలో కొందరు కోపం తెచ్చుకున్నారు. కానీ మీరంతా వెళ్తున్నారని తను ఎప్పుడూ కోపం తెచ్చుకోలేదు. పుష్పా, మీ మామ్మకి ఈవిషయాలన్నీ నువ్వు చెప్పు. ఆవిడకి ఎవరూ ఇవన్నీ చెప్పలేదేమో.

అలాగే సైకిలు మగపిల్లలే కాదు, ఆడపిల్లలూ నేర్చుకోవాలి. మీరు చిన్న విషయాలకి ఎవరిమీదా ఆధారపడకుండా, స్వతంత్రంగా పెరగాలంటే ఇంకా చాలా నేర్చుకోవాలి. మీ అన్నయ్యలతో పాటు, తమ్ముళ్లతో పాటు మీరూ చదువుకుంటున్నారు. ఏకొత్త విషయం నేర్చుకున్నా అది చదువుతో సమానమే అవుతుంది.”

“పదండి, ఆలస్యమైంది. వెళ్దాం.” అన్నాను లేస్తూ.

“ఈ విషయాలన్నీ మా మామ్మకి చెబుతాలే టీచర్” అంటూనే, “ఆనందీ, నువ్వు మా ఇంటికి రా ఈరోజు. మామ్మకి నిన్ను చూబిస్తాను.” అంది పుష్ప.

“ఈరోజు కాదు, ఇంకోరోజొస్తాను.” అంది ఆనంది పుస్తకాల సంచీ భుజాన తగిలించుకుంటూ.

“ఏమ్మా? రావచ్చుగా” పుష్ప రెట్టిస్తుంటే మెట్లు దిగుతున్న ఆనంది చెబుతోంది,

“ఈరోజు పాస్టర్ మామయ్య ఇంట్లో పుస్తకాలు సర్దిపెడతానని చెప్పానుగా, వెళ్లాలి.”

“నీకు మా పాస్టర్ మామయ్య తెలుసా, చర్చికి రావుగా.” పుష్ప ఆశ్చర్యాన్ని గమనించి,

“ఓ, తెలుసు. లైబ్రరీలో మంచి మంచి పుస్తకాలు చదువుకుందుకు పాస్టర్ మామయ్య నాకు సాయం చేస్తారు” అంది ఆనంది నవ్వుతూ.

***

అనురాధ నాదెళ్ళ

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Really nice story on the castes, as of now in every corner of the country we are facing the issues with caste. As mentioned in story some parents are like that only they will say to their sons and daughters to do friendship with our caste guy or girl only. The stories of Anuradha Nadella garu was always inspire and represent the current situations. I am prouldy say she is my aunt and she always insipre me with her stories. Thank you Athaya for inspiring the people and me.

  • ఈ వ్యవస్థ మారాలంటే చాలా కాలం పడుతుంది . ఎవరి ప్రయత్నం వాళ్ళు చెయ్యాలి . కధ బాగుంది .

  • Nice and brief story. Sensitive issue is handled very sensitively. Though our country is declared as secular state, society is not changed. Prejudices are transmitted from parents to children.children are not born with prejudices.

  • Very beautiful short story. Such stories will definitely make a positive impact on children. Anuradha should write more and more such simple stories for school going children

  • Very nice story about teaching kids on caste system. I wish this issue is as simple as portrayed in this story! In my recent trip to Andhra I noticed bill board messages on christianity and Islam which was surprising. In this age and time I didn’t expect billboards on religion or religious activities. Do we need?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు