మనిషి పరిచయం – 5

మనిషి హృదయ స్పందనలనూ, అనుభూతులనూ, ఉద్వేగ పారవశ్యాలనూ దుఃఖ వివశతలనూ ఔషదాలేమైనా ప్రభావితం చేస్తాయా.?

ళ్ళీ అనిశ్చితి. పునః ఉద్యమ యాత్ర.

2009 లో వచ్చిన జనరల్ ఎన్నికల్లో మళ్ళీ పొత్తుల కుట్రలు. ‘ తెలంగాణ ‘ పదాన్ని ఉచ్చరించడానిక్కూడా ఇష్టపడని చంద్రబాబు అధికారంకోసం ‘ మహాకూటమి ‘ ని టీఅరెస్, సి పి ఐ, సిపిఎం లతో కలిసి ఏర్పాటు చేసి.. 2009 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ప్రజారాజ్యం , మహాకూటమిలోని అన్ని పార్టీలు ‘ తెలంగాణ రాష్ట్ర ‘ ఏర్పాటును తమతమ మానిఫెస్టోల్లో ప్రకటించారు.

‘ పొత్తు ‘ ధర్మాన్ని పాటించకపోవడంతో టి ఆర్ ఎస్ కేవలం 10 సీట్లను మాత్రమే సాధించుకోగలిగింది.

మళ్ళీ మోసం..దగా.

ఉద్యమాన్ని ఏండ్లకు ఏండ్లు ఉద్యమాగ్ని ఆరిపోకుండా, ప్రజల్లో ఆశలు సడలిపోకుండా, సచైతన్యంతో కాపాడుకుంటూ రావడం నాయకునికి కత్తిమీద సాము వంటిది. కేసీఅర్ ఆ సమయంలో ఎక్కడా జారిపోకుండా అదే స్ఫూర్తితో నిలబడగలగడం ఒక మహత్తరమైన విషయం.

తెలంగాణ ఉద్యోగుల నియామకాల్లో పెను నష్టం కలుగజేస్తూ హైదరాబాద్ ను ‘ ఫ్రీ జోన్ ‘ గా మార్చే సుప్రీం కోర్ట్ తీర్పు 9 అక్టోబర్ 2009 న వెలువడింది. దీనికి సంబందించిన 14 ఎఫ్ క్లాజ్ ను రద్దు చేయాలని టీఅరెస్ చరిత్రను మలుపు తిప్పిన ఒక మహోద్యమాన్ని చేపట్టి ఇక ‘ తెలంగాణ రాష్ట్ర ‘ ఏర్పాటు అనే ‘ గోల్ ‘ దిశగా అతి వేగంగా దూసుకుపోయింది ‘ తెలంగాన తెచ్చుడో.. కేసీఅర్ చచ్చుడో ‘ నినాదంతో.

21-10-2009 సిద్ధిపేటలో తెలంగాణ ఉద్యోగ గర్జన. 14 ఎఫ్ తొలగింపుపై రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్. ‘ తెలంగాణ తెచ్చుడో.. కేసీఅర్ చచ్చుడో ‘ అని మొదటిసారి ఈ సభలోనే అన్నారు చంద్రశేఖరరావు.

29-11-2009 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ప్రధాన డిమాండ్ గా సిద్ధిపేట దగ్గరి రంగధాంపల్లిలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైన కేసీఅర్. దీక్షాస్థలికి వెళ్తూంటే కరీం నగర్ అలుగునూర్ వద్ద పోలీసులు విపరీతమైన దమనకాండతో అందరినీ అరెస్ట్ చేసి తప్పుతోవ పట్టించి కెసీఅర్ ను ఖమ్మం జైలుకు తరలింపు. తెలంగాణ అంతటా ఉద్రిక్తత. ఎల్.బి నగర్ చౌరాస్తా వద్ద హైదరాబాద్ లో శ్రీకాంతాచారి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం.

30-11-2009 సాయంత్రం కేసీఅర్ ను ఖమ్మం జైలునుండి ఆసుపత్రికి తరలింపు.

01-12-2009 కేసీఅర్ అరెస్ట్ కు నిరసనగా తెలంగాణ అంతటా బంద్. అదేరోజు నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ కిష్టయ్య సెల్ టవర్ ఎక్కి రివాల్వర్ తో కాల్చుకుని మృతి.

03-12-2009 కేసీఅర్ ను హైదరాబాద్ నింస్ ఆస్పత్రికి తరలింపు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంతాచారి మృతి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత.

09-12-2009 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన. ప్రొఫెసర్      జయశంకర్ నిమ్మరసం ఇవ్వగా కేసీఅర్ దీక్ష విరమణ. తెలంగాణా అంతటా సంబరాల హోరు.

వెంటనే ప్రారంభమైన ఆంధ్రా పార్టీల రాజకీయ ఏకీకరణ, లాబీయింగ్, కుట్రలు.

12-12-2009 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభమైందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రకటన. ఆంధ్రాలో ఉధృతమైన లాబీయింగ్. అందరూ ఢిల్లీలో బైఠాయింపు. పార్టీలకతీతంగా పార్లమెంట్ సభ్యులందరూ రాజీనామా చేస్తామని బెదిరింపులు.

23-12-2009 తెలంగాణా ఏర్పాటు ప్రక్రియను నిలిపివేస్తూ ‘ అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ‘ నిర్ణయం తీసుకుంటామని హోం మంత్రి చిదంబరం ప్రకటన. చప్పున చల్లారిన తెలంగాణ వాసుల సంబురం. పెరిగిపోయిన యువకుల ఆత్మహత్యలు. కరీం నగర్ లో దండిగ పృథ్వీరాజ్, వరంగల్ లో భూక్యా ప్రవీణ్, దుద్దెడ గ్రామంకు చెందిన శ్రీకాంత్.. ఇట్లా ఎందరివో ప్రాణత్యాగాలు.

24-12-2009 హైదరాబాద్ కళింగ ఫంక్షన్ హాల్ లో సమావేశమై తెలంగాణాకు చెందిన అన్ని రాజకీయ పార్టీలు ‘ జాయింట్ యాక్షన్ కమిటీ ‘ జె ఎ సి ’ గా.. ప్రొఫెసర్ కోదండ రాం చైర్మన్ గా ఏర్పాటు.

03-02-2010 అన్ని ప్రాంతాల వారితో సంప్రదించాలని సుప్రీం కోర్ట్ రిటైర్డ్ న్యాయమూర్తి బి.ఎన్.శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ‘ కమిటి ‘ ప్రకటన. తెలంగాణా అంతటా అలుముకున్న విషాదచ్ఛాయలు.

ప్రతిరోజూ ఎక్కడో ఒక దగ్గర దుఃఖతప్త హృదయులైన యువకులు .. ఆటో వాళ్ళు, కూలీలు, విద్యార్థులు, గుమాస్తాలు, దుకాణాల్లో పనిచేసే అసంఘటిత కార్మికులు.. ఎవరో ఒకరు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు.

20-02-2010 ఉస్మానియా ఐక్య కార్యాచరణ సమితి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ప్రకటించింది, ఈ క్రమంలో యాదయ్య అనే ఇంటర్ విద్యార్థి క్యాంపస్ గేట్ దగ్గర ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మరణించాడు. ఈ ప్రాణ త్యాగాలు ఉధృతమౌతున్నాయి.

టీఅరెస్ ప్రతిరోజూ ఏదో ఒక ఉద్యమ ప్రతిఘటనతో ముందుకు పోతూనే ఉంది. కేసీఅర్ నిర్విరామంగా అన్ని జిల్లాల్లోనూ అలసట ఎరుగని పర్యటనలతో ప్రజలను చైతన్యపరుస్తూనే ఉన్నారు.

26-03-2010   తెలంగాణ ఉద్యమ భావజాల ప్రచారం కోసం ‘ రాజ్ న్యూస్ ‘ చానల్ ప్రారంభించింది.

17-05-2010   శ్రీకృష్ణ కమిటీని ప్రొఫెసర్ జయశంకర్, బి.వినోద్ వెళ్ళి కలిసి తమ వాదనలను వినిపించారు.

30-07-2010 నిజామాబాద్ ఉప ఎన్నికల్లో డి.శ్రీనివాస్ ఓడిపోవాలని మొక్కుకున్న ఉస్మానియా క్యాంపస్ విద్యార్థి ఇషాన్ రెడ్డి బలిదానం.

03-12-2010   అమరుడు శ్రీకాంతాచారి మొదటి వర్థంతి. హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఅర్.

16-12-2010   20 లక్షల మందితో దేశ చరిత్రలోనే అత్యంత భారీ బహిరంగ సభను వరంగల్ లో నిర్వహించి ఉద్యమానికి ఒక ఊపునూ, ఊపిరినీ అందించిన టీఅరెస్.

30-12-2010     కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై తమ నివేదికను సమర్పించిన శ్రీకృష్ణ కమిటీ .

బొమ్మలు: మిత్ర

01-03-2011 ‘ తెలంగాణ పల్లె పల్లే పట్టలపైకి ‘ నినాదంతో తెలంగాణా వ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమం. అంతటా స్థంభించిన రైళ్ళ రాకపోకలు.

10-03-2011     ట్యాంక్ బండ్ పై మిలియన్ మార్చ్. ఆంధ్ర నాయకుల విగ్రహాల కూల్చివేత.

19-06-2011   ‘ పట్నం రోడ్లపై పొయ్యి పెడదాం ‘ కార్యక్రమంలో భాగంగా ‘ రాజధానిలో వంట- ఢిల్లీలో మంట ‘ కార్యక్రమం విజయవంతం.

21-06-2011       తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ మృతి. కెసీఅర్ కంటతడి.

20-07-2011     ఉధృతమైన యువకుల ఆత్మహత్యలు. ఢిల్లీలో యాదిరెడ్డి , బెల్లంపల్లి శ్రీకాంత్ , డి.శ్రీకాంత్, ఇలా పదిమంది దాకా ఆత్మాహుతి ఒక్క నాల్గయిదు రోజుల్లోనే.

తర్వాత ఇక మొగిలి డైరీ లో ఏమీ రాసి లేదు.

బస్సు కుదుపులతో వెళ్తూనే ఉంది.

సుభద్ర తన సంచీలోంచి పెన్నును తీసుకుని రాసింది డైరీలో.

15-08-2011     తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం కోసం ఏండ్లకు ఏండ్లుగా పరితపిస్తున్న జనగాం కు చెందిన ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ మూడవ సవత్సరం విద్యార్థి ఆర్.మొగిలి జనగాం రైల్వే స్టేషన్ లో వేగంగా వస్తున్న రైలుకు ‘ జై తెలంగాణ ‘ నినాదాలతో ఎదురెళ్ళి దారుణంగా ప్రాణత్యాగం చేశాడు. అందువల్ల అతని తల్లి సుభద్రకు తీరని పుత్రశోకం. కడుపుకోత మిగిలింది.

12-09-2011       కరీం నగర్ లో టీఅరెస్ ‘ జన గర్జన సభ ‘

ఈ రోజే.

సుభద్ర వెళ్తున్నది అక్కడికే .

కళ్ళు మూసుకుని భారంగా నిట్టూర్చిందామె. అప్పుడు సుభద్ర కళ్ళలో నిండిన కన్నీళ్ళు ఎవరికీ కనిపించలేదు. హృదయమంతా నిప్పుల చెరువులా ఉంది.

కరీం నగర్ కు చేరేసరికి నాలుగయింది సరిగ్గా.

గ్రౌండ్ లక్షలాది మందితో నిండి క్రిక్కిరిసి ఉంది. వేదికపై ‘ ధూం ధాం ‘ పాటలు బిగ్గరగా వినబడ్తున్నాయి.

ఏ సమాజంలోనైనా ప్రజలే భవిష్యత్ నిర్మాతలూ .. భావి విధాతలూ కదా అనుకుంది సుభద్ర.

5

చాలాసేపటినుండి కళ్ళు మూసుకుని అంతర్ముఖురాలై ఎక్కడెక్కడో అంతరలోకాల్లో.. సుడిగుండం లో కాగితపు ముక్కలా తేలి తేలి .. పల్టీలు కొట్టి కొట్టి.. ఒకరకమైన అంతరాంతర బీభత్సానికి గురై.. చివికి చివికి.. దీర్ఘంగా నిట్టూర్చింది ముఫై ఏళ్ల ముక్త.

‘ పాత్ర పూర్తిగా నిండిన తర్వాత ఒలికిపోవడం సహజమే కదా ‘ అనుకుందామె.

నిండడమంటే ఇదివరకు తాను ఖాళీగా ఉన్నట్టేకదా.. అని కూడా అనుకుంది.

ఖాళీతనం.. నిండడం.. మళ్ళీ ఖాళీ కావడం.. మళ్ళీ నిండడం .. ఇదొక నిరంతర అనంత ప్రక్రియే కదా.. భౌతికమైనా.. అభౌతికమైనా.

పక్షి ఊర్కే అనంతాకాశంలో ఒంటరిగా రెక్కలు అలసిపోతున్నా లెక్కచేయకుండా తిరిగీ తిరిగీ.. దేన్ని అన్వేషిస్తున్నట్టు. పిడికెడి పక్షి .. ఆ అన్వేషణలో తనను తాను ఖాళీ చేసుకుంటున్నట్టా.. ఈ మహత్తర సృష్టిలోనుండి ఒక పరమార్థాన్ని అదృశ్య జీవశక్తిగా సంగ్రహిస్తూ.. తనను తాను నింపుకుంటున్నట్టా.

నదులు తమను తాము సముద్రాల్లో కుమ్మరించుకుంటూ.. సముద్రాన్ని నింపుతున్నట్టా.. లేక తమనుతాము ఖాళీ చేసుకుంటున్నట్టా.

యోగనిద్రలో వలె కళ్లను మూసుకున్న ప్రతిసారీ ఒక మహా చైతన్య తేజఃచక్రమై ఆత్మను ఆవరించే ఈ జ్ఞానశూన్యత.. ఆత్మాన్వేషణ పరితాపం.. ఏమిటి. ఏదో తెలియని శక్తి ఆవరిస్తున్నట్టూ.. ఏదో వెలుగు లోపలికి ప్రవేశిస్తున్నట్టూ.. ఇంకేదో తననుండి విముక్తమై నిష్క్రమిస్తున్నట్టూ.. ఈ నిశ్శబ్ద వినిమయచర్య ఏమిటి.

కళ్ళు మూస్తే మనిషిలోనే ఒక ప్రపంచం… కళ్ళు తెరిస్తే ప్రపంచంలో ఒక మనిషి.. ఈ ట్రాన్స్ పోర్టేషన్ ఏమిటి.

మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా టేబుల్ పై ఉన్న ‘ కవిత్రయ విరచిత శ్రీ మదాంధ్ర మహాభారతము ‘ .. వ్యాసుడు రాసినది, నన్నయభట్టారకుడు తెలుగులోకి అనువదించినది.. డాక్టర్ దివాకర్ల వేంకటావధాని ప్రభృతులచేత వ్యాఖ్యానించబడినది .. తిరుమల తిరుపతి దేవస్థానముల చేత పదిహేను సంపుటాలుగా ముద్రించబడినది.. ప్రపంచ జ్ఞాన సంపదై.. ఆధునికులచేత ఒక బృహత్, సమగ్ర , పరిపూర్ణ ‘ మేనేజ్ మెంట్ టూల్ ‘ గా, పరిపాలనాశాస్త్ర, నిర్వహణశాస్త్ర దర్పణంగా, రాజనీతి ఉద్గ్రంథంగా.. పరిగణించబడ్తున్న పుస్తకాల శ్రేణిలో .. మొదటి సంపుటము ఉంది పుటలు తెరువబడి.

ఉషోదయకాలంనుండీ చదువుతోందామె మహాభారతాన్ని. బి.ఆర్.చోప్రా డి డి లో ‘ మహాభారత్ ‘ ను సుదీర్ఘంగా తీసినా.. తర్వాత్తర్వాత కొన్ని వందల ఎపిసోడ్స్ గా టి.వి ల్లో ఎందరెందరో మళ్ళీ మళ్ళీ తీసినా.. వివిధ రచయితలు ఎన్నెన్ని రకాల వ్యాఖ్యానాలతోనో ఎన్నో మహాభారతాలను రాసినా వాటన్నింటినీ తను చూచింది.. చదివింది. కాని ఏ ఒక్కనాడు ఇక చాలు.. తన తనివి తీరింది, తృప్తి కలిగింది అన్న భావన కలుగలేదు. అంత మహత్తర కృతి అది. అది నిజంగా జరిగిందా.. ఆర్కియాలజిస్ట్ లు చెబుతున్న పలు ఆధారాలూ.. ఉత్తరభారతదేశంలో భారతంలో వర్ణించబడ్డ అవే వాస్తవ ప్రాంతాలు కళ్ళముందే కనబడ్తున్నపుడు .. కాని పరిశోధకుల తేదీల అన్వయింపులూ.. స్థలకాల పోలికలూ సరిపోవడం లేదని చేస్తున్న వాదనలూ.. వాటన్నింటినీ అటుంచితే.. అసలా చారిత్రాత్మక కథనం.. పాత్రల సృష్టి.. ఘటనల సృజన.. సజీవమైన అభివ్యక్తి.. అంతా న భూతో న భవిష్యతి.

ప్రపంచంలోనే అతి పురాతనమని భావించబడ్తున్న, హోమర్ రాసిన గ్రీకు ప్రాచీన వీరకావ్యాలు ‘ ఇలియడ్ ‘, ‘ఒడిస్సీ ‘ ల కంటే మహాభారతం అనేకరెట్లు పెద్దది.. ఈ పెద్దతనం కేవలం పరిమాణంలో మాత్రమేకాదు.. పాత్రల చిత్రణ, ( character delineation ) , భావ వైవిధ్యం ( range of emotions ), వ్యూహ ప్రతివ్యూహాల రచన వంటి పలు నైపుణ్యాల ఆవిష్కరణలో కూడా. అందుకే ఉగ్రశ్రవసుడు.. అంటే సూతుడు శౌనకాది మునులకు భారత కథనంతా చెప్పి చివరన ఇలా అన్నాడు.

‘ మహాభారతంలో ఉండేదే ఎక్కడైనా ఉంటుంది.. మహాభారతంలో లేనిది ఎక్కడా లేదు ‘ ( what is in Mahabhaarata is every where; what is not in Mahabharata is no where ) అని. అదే సత్యం.

అందుకే మహాభారతం ‘ పంచమ వేదం ‘ గా పరిగణింపబడ్తోంది.

ముక్త తలెత్తి ఎదుట ఉన్న కిటికీ గుండా.. ఊర్కే బయటికి చూచింది.. చూస్తూనే ఉండిపోయింది అలా కాస్సేపు అభావంగా. అప్పుడామె మనసు కాలుతున్న కాగితంలా ఉంది.

కాలుతున్నప్పుడు కాగితంపై ప్రచురితమైన ‘ అక్షరాలు ‘ కూడా కాలిపోతాయా. క్షరముకానిది.. అంటే.. నశించిపోనిది.. ఐన అక్షరము కాలిపోవడమేమిటి.. నాన్ సెన్స్. అనుకుంది.

కిటికీ అవతల.. అప్పుడే చిగురు వేసిన సన్నని జాజి తీగ లేలేత ఆకులతో కిటికీ ఊచలను పట్టుకుని ప్రాకుతోంది.

అప్పుడే ఉదయిస్తున్న స్వర్ణవర్ణ సూర్యుని పసిడి కిరణాలు పడి చిగురుటాకులు భాషకందని వింతకాంతితో మెరిసిపోతున్నాయి.

అప్పుడామె కొలంబియా దేశంలోని కుకుటా పట్టణపు లోతట్టు ప్రాంతమైన ఇక చిన్న గ్రామం కిర్క్ లో ఉంది.

గత రెండున్నర సంవత్సరాలుగా అక్కడే ఒక ప్రత్యేకమైన ప్రయోగాత్మకమైన శాస్త్రీయ కార్యంపై ఉందామె.

తమ బృందం గత ఐదేళ్లుగా చేస్తున్న సాహసోపేతమైన జీవప్రయోగం కు సంబంధించి ఆమె అవసరాన్నిబట్టి అనేకానేక దేశాలను సందర్శిస్తూ .. వివిధ దేశాల ప్రజలనూ.. ఆయా దేశాల లోతట్టు ప్రాంతాల జనజీవ వైవిధ్యాలనూ, సంప్రదాయాలనూ, జీవన విధానాలనూ, హృదయావిష్కరణలనూ గమమిస్తూ, వాళ్ళతో మమేకమై కలిసి ‘ ఒకే మనిషి పలు జన్మలు ‘ గా యాత్రిస్తూ ప్రపంచ పౌరురాలిగా పరవశించిపోతూ.,

మనిషి నిజంగా హృదయంతో జీవించ గలుగుతే .. సాటి మనుషులను స్వచ్ఛంగా ప్రేమించగలుగుతే ప్రతి జీవితానుభవమూ ఎంత మధురమో. . అనుకుంది. ముక్తకు ఏ దేశంలో ఉంటే ఆ దేశపు పౌరురాలిగా అక్కడివాళ్ల సభ్యతా సంస్కృతులతో జీవించడం, వాళ్లలో కలిసిపోవడం అలవాటైపోయింది.

ముక్తకు ఎందుకో చటుక్కున తన బాల్యపు పొరల్లో దాగి నిక్షిప్తమై పోయిన ఒక జ్ఞాపకం నీళ్ళలోనుండి బుడుబుంగ పక్షిలా పైకి తేలి.. మనసంతా ఆవరించింది.

తన ఊరు.,

ఆదిలాబాద్ జిల్లాలోని లోతట్టు అడవి గ్రామం ‘ వాంకిడి ‘. మొత్తం ఇరవై ఎనిమిది కుటుంబాలు. అంతా కలిపి నూటా ఇరవైరెండు మంది జనాభా. ఆరేళ్ల వయసులో తను ఉన్నపుడు.. ఒకసారి తను అయ్యను అడిగింది ” నాపేరు ఎందుకు ఇట్లున్నది.. ముక్త అని. మన గూడెంలో ఎవరికీ ఈ పేరు లేదుగదా ” అని.

నాయినన్నడు ” నీకు ఆ పేరును మేము పెట్టలే. అన్న రాములు నాయక్ పెట్టిండు ” అని.

” ఐనెవరు ”

” అయ్యో.. ఆయన మన దళ నాయకుడు.. పెద్దన్న ” అని జవాబు అవ్వ దగ్గరినుంచి.

ఆ రాత్రే తను బంగారు రంగు వెన్నెల్లో ఆడుకుంటూంటే వచ్చిండు దళ నాయకుడు.. బక్కగా .. సన్నగా.. ఖాకీ రంగు బట్టలు.. నడుముకు బెల్ట్.. భుజానికి తుపాకి .. భయమేసింది.

నాయిన దగ్గరికి ఉరుకుతాంటే చేతులు చాపి పట్టుకుని దగ్గర కూర్చుండబెట్టుకున్నడు. లాగు జేబులనుంచి ఇప్పపండ్లు, చాక్లెట్లు , బూరు మిఠాయి ముద్దలు ఇచ్చిండు.

ఎందుకో ఆయనను చూస్తాంటే కొద్దిసేపటికే భయం పారిపోయి ‘ మంచిగ ‘ అనిపించింది.

తనడిగింది ” ముక్త అంటె ఏంటిది ” అని.

“ ముక్త అంటే లిబరేటెడ్.. బంధనాలనుండి స్వేచ్ఛను పొందినది.. అని అర్థం.. నువ్వు ఈ గోండు గూడేలనుండి విముక్తి పొంది.. ఎగిరే పావురంలా స్వేచ్ఛా ప్రపంచంలోకి వెళ్ళిపోవాలె.. అనేక విజయాలను సాధించాలె.. ఐనా నీకిప్పుడివన్నీ అర్థం కావులే.. చిన్నదానివికదా.” అని జవాబు.

అప్పుడు నిద్రొచ్చింది కళ్ళపైకి కమ్ముకుని. తను అతనితో పాటే ఆ నుల్క మంచంల అట్లనే పండుకుని నిద్రబోయింది. మధ్యల తెలివొచ్చి చూస్తే.. రాములు నాయక్ పెద్దన్న అట్లనే పండుకొనున్నడు ప్రక్కనే. వెచ్చగా ఆయన స్పర్శ ఎంత బాగుందో.. తండ్రివలె.

పొద్దుగాల లేచి చూచేవరకు లేడు ఆయన. నాయిన నడుగుతే .. పొద్దున్నే ఏగిలవారంగ వెళ్ళిపోయిండన్నడు. అన్నలు గదా అడవిలుంటరు బిడ్డా గుట్టలల్ల.. అనికూడా అన్నడు.

ఆ రాములు నాయక్ స్పర్శ .. ఎన్ని రోజులు వెంటాడిందో తనను. దాన్ని ప్రేమ అంటరా.. వాత్సల్య మంటరా.. పావురమంటరా.

ఇప్పుడీ ప్రాతః వేళ సూర్యుని నును కిరణాల స్పర్శ ఆనాడు చిన్ననాటి రాములు నాయక్ స్పర్శను తలపించింది.

ముక్త తనున్న గదిలోనుండి బయటికొచ్చి.. విశాలమైన వరండాలో నిలబడి ఒకసారి చుట్టూ పరికించి చూచింది.

చుట్టూ కొండలు.. దట్టంగా అడవి.. ఎటు చూచినా వినీలాకాశపు నీడ నిర్మలంగా.. పరవశింపజేసే నిశ్శబ్ద ప్రశాంతత.

సౌత్ అమెరికాకు వాయవ్య దిశలో ఉన్న పసిఫిక్ సముద్ర తీరప్రాంత దేశం ‘ రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా ‘. దీనిని ఆవరించి పనామా, వెనిజులా, బ్రెజిల్, ఈక్వెడార్, పెరు, కోస్టారికా, నికరాగువా, హైతి దేశాలున్నై. దీని రాజధాని బొగొట. ఇక్కడ స్పానిష్ మాట్లాడ్తారు. స్పానిష్ మధురమైన భాష. ప్రపంచ అత్యుత్తమ కవిత్వం స్పానిష్ భాషలో ఉండడం మనకు తెలిసిందే. నోబెల్ పురస్కారం పొందిన గ్యాబ్రియల్ గార్సీ మార్క్వెజ్ కొలంబియా దేశస్థుడే. ఇక్కడి కరెన్సీ ‘ పెసో ‘.

ఇది కొండలు నిండుగా ఉన్న సుందరమైన చిన్న దేశం . ఐతే అత్యాధునికమైన జీవశాస్త్ర మరియు జన్యుమార్పిడికి సంబంధించిన ప్రయోగాలను నిర్వహించుకోడానికి ప్రతిబంధకమైన చట్టాలు పెద్దగా లేని అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి తమ బృందం జరుపుతున్న రహస్య ఔషద ప్రయోగాలకు కొలంబియాను తాము ఎన్నుకోవాల్సి వచ్చింది.

మనుషులు కారణాలేమైనా ప్రవాస జీవితంలోకి వెళ్ళి క్రమక్రమంగా ద్రిమ్మరిగా మారి దేశ దేశాల వెంట సంచార జీవితాన్ని గడపవలసి రావడం నిజంగా మనిషికి అర్థంకాని వింత విషయమే.

రాహుల్ సాంకృత్యాయన్ ‘ ఓల్గా టు గంగా ‘. ‘ ఋగ్వేదం నాటి ఆర్యులు ‘ , ‘ విస్మృత యాత్రికుడు ‘ వంటి గ్రంథాలను చదువుతున్నప్పుడు.. అదే అనిపిస్తుంది. మొన్న ఆన్ లైన్ లో అమెజాన్ నుండి తెప్పించుకుని చదివిన పరవస్తు లోకేశ్వర్ రాసిన ‘ స్కూటర్ పై చత్తీస్ గడ్ యాత్ర ‘ , ‘ సిల్క్ రూట్లో సాహస యాత్ర ‘, వంటి గ్రంథాలను చదువుతున్నప్పుడు కూడా అదే అనిపించింది. మనిషిలో గుప్తంగా దాక్కుని ఉన్న ఈ సంచార కాంక్ష అతన్ని ఎప్పుడూ స్థిమితంగా ఉండనివ్వదు. ఎప్పుడూ అనేకానేక ప్రాంతాలను సందర్శిస్తూ.. అనేక ప్రాంతాల , దేశాల , మనుష్య జాతుల భిన్నతను అధ్యయనం చేస్తూ.. వ్యక్తుల ప్రాకృతిక పరిణామాలనూ, సామాజిక పరివర్తనలనూ ఒక మేధోజ్ఞానంగా స్వీకరిస్తూ విస్తృతమై ఆత్మానందంతో వికసించడం.. అదొక వ్యక్తిగత అభిరుచితో కూడిన జిజ్ఞాస. తపన, దాహం.

‘ నీ కాళ్ళకు చక్రాలున్నయే.. అందుకే ఒక్కచోట ఉండవు.. ఎప్పుడూ తిరుగుడే.. ఇక్కడినుండి అక్కడికి, అక్కడినుండి మరెక్కడికో ‘ అని తన హాస్టల్ మేట్ శోభ అనడం జ్ఞప్తికొచ్చింది ముక్తకు.

నిజానికి మనిషి ‘ తిరుగుబోతు ‘ గా స్థిరపడ్డం.. వృత్తి రీత్యా కావచ్చు, విధికృతంగా కావచ్చు, అభిరుచి ప్రకారం ఎంచుకున్న జీవన మార్గంవల్ల కావచ్చు ఒక ‘ ట్రావెలర్ ‘ గా స్థిరపడ్డం మాత్రం గమ్మత్తైన పరిణామమే. కాళ్ళకు చక్రాలను పరిశీలించేందుకు.. ఒకసారి తను తెల్లగా శ్వేతపద్మాల్లా ఉండే తన అరికాళ్ళను శుభ్రంగా కడుక్కుని, థిన్నర్ తో తుడిచి పరిశీలనగా మొబైల్ మైక్రోస్కోప్ కింద చూచుకుంది. ప్రతి వ్రేలుకిందా.. అన్నీ చక్ర ముద్రలే. అప్పుడే చేతి వ్రేళ్ళను కూడా పరిశీలించింది. శంఖు ముద్ర ఒక్కటికూడా లేదు. అన్నీ చక్ర ముద్రలే. అసలు ఈ అంగుష్టముద్రల సంగతేమిటో తెలియదు స్పష్టంగా. ఒక బయో కెమిస్ట్ గా, బయో టెక్నాలజిస్ట్ గా, మనిషి యొక్క క్రయోనిక్స్ శాస్త్రం పై శోధన చేస్తున్న ఔత్సాహికురాలిగా కొంత అధ్యయనం చేసింది తను ఈ వ్రేలి ముద్రల శాస్త్రమైన ‘ డాక్టిలోస్కోపీ ‘ పై. ఇప్పటికీ మనిషి ఐడెంటిఫికేషన్ కోసం కేవలం బయోమెట్రిక్ పద్ధతుల్లో మనిషి వ్రేలి ముద్రలనే ఉపయోగిస్తూండడం తెలుసు మనకు. పోలీసులు కూడా నేర పరిశోధనలో ‘ బాబిలోనియన్ ఫింగర్ ప్రింటింగ్ ‘ విధానాన్నే వాడుతారు. చర్మం యొక్క ఎపిడర్మిస్ .. అంటే బాహ్య చర్మమూ.. డర్మిస్ అంటే అంతర చర్మమూ అని పిలువబడే అధ్యయనాలే ఒక పెద్ద ఉద్గ్రంథమౌతుంది. వ్రేలి ముద్రలు.. మూడు రకాలున్నాయి.. ఒకటి ఆర్చ్ (arch ).. వక్రశిఖరం లేదా వక్రతోరణం .. రెండు లూప్ (loop ) అంటే శంఖువు.. మూడు ఓర్ల్ (whorl ) అంటే చక్రం.

ఈ వ్రేలి ముద్రలపై భారతదేశంలో కూడా అనేక శాస్త్రీయ అధ్యయనాలు జరిగినై. ‘ ఇండియన్ సివిలిజేషన్ అండ్ సైన్స్ ఆఫ్ ఫింగర్ ప్రింటింగ్ ‘ బై జి.ఎస్. సోధి మరియు జస్జీత్ కౌర్ , ఎస్జిటిబి ఖాస్ల కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, అని ఒక పుస్తకముంది.

ఈ ముద్రలు మనిషి గమనాన్నీ, భావినీ, వృత్తిపరమైన సంకేతాలనూ ప్రతిబింబిస్తాయా.. అన్న ఊహలూ, అంచనాలూ ఉన్నాయిందులో.

మనిషికి సంబంధించి జ్ఞాతమూ, అజ్ఞాతమూ ఐన అనేక విషయాలు ఇంకా ఎంతో తెలువవలసే ఉన్నాయి.

జ్ఞాత, అజ్ఞాతాలతో పాటే దృష్ట అదృష్టాలకూ, దృశ్య అదృశ్యాలకు సంబంధించిన అనేక విషయాలు కూడా వర్తమాన శాస్త్రజ్ఞుల ప్రపంచాన్ని ఉద్విగ్నపరుస్తున్నాయి.

దృష్టి సారించాలె. ఇంతవరకు తాము.. జాస్ లూయిస్ కార్డిరో, డేవిడ్ వుడ్, ఫ్రాంక్ దిగో లతో పాటు తనూ కలిసి చేస్తున్న ‘ చావు లేని.. మరణాన్ని జయిస్తున్న మనిషి ‘ ని సృష్టిస్తున్న ప్రయత్నాలూ, ప్రయోగాల్లో .. జరుగుతున్న పురోగతే.. ఈ ఊహాతీతమైన హైపాథిసిస్.. మూల భావనలకు దారులను ఏర్పరుస్తూ ఆసక్తిని రేకిస్తున్నాయి.

ముక్త బయటికి వచ్చి నడుచుకుంటూ తన కుడివేపు ఉన్న వ్యక్తిగతమైన ప్రయోగశాలలోకి వెళ్ళింది.

గత పది సంవత్సరాలనుండీ తనదీ, లూయిస్ కార్డిరో దీ ఒకటే లోకమైపోయింది.. శోధన .. పరిశోధన. సర్చ్.. మరియు రీ సర్చ్. వెతకడం సర్చ్ ఐతే.. ఉన్నదాన్నే తిరిగి వెతకడమే రీ సర్చ్ ఔతుందికదా. రీ సర్చ్ చేస్తున్న వాళ్లందరూ ఇప్పటిదాకా లేనిదాన్ని వెతికి , శోధించి అనేక కొంగ్రొత్త విషయాలను ఆవిష్కరించి అద్భుతమైన సాధనాలను కనిపెట్టి రూపకల్పన చేసి ఈ మానవాళికి అందించారు. మనిషి నాగరిక జీవితాన్ని ఒక మలుపు తిప్పి స్వర్గ సుఖాలలో ఓలలాడిస్తున్న టి.వి.. విమానం.. చంద్రమండల యాత్ర.. స్మార్ట్ ఫోన్ .. ఆపరేటింగ్ సిస్టంస్ తో అనేక రకాల ఆప్స్.. ఇవన్నీ మనిషి కనుక్కున్న మహాద్భుతాలే. వాటిని మనుషులు ఎంతవరకు మానవ కళ్యాణానికి ఉపయోగించుకుంటున్నారన్న మీమాంస వేరే.

ఇదివరకు అసాధ్యాలనుకున్న ఎయిడ్స్, క్యాన్సర్ లకు మందులు కనిపెట్టబడ్డాయి. ఆ దిశలో ఇంకా ప్రభావవంతమైన వృద్ధి జరుగుతోంది. ఇప్పుడు అసాధ్యమనుకుంటున్న అంగారక గ్రహ జీవనం, గ్రహాంతర వాసుల పరిచయం , కాలంలోకి ప్రయాణం.. ఇవన్నీ మున్ముందు సాధ్యమయ్యే విషయాలుగానే స్పష్టంగా కనబడ్తున్నాయి. ఈ ప్రపంచంలో రెండు జాతులున్నాయి.. ఒకరకం .. కొంతమంది శాస్త్రవేత్తలు, శోధకులు, దశాబ్దాలకు దశాబ్దాల పర్యంతం ఒక ఉన్మాద స్థితిలో సకల వ్యక్తిగత సౌఖ్యాలను పణంగా పెట్టి మహత్తరమైన వ్యవస్థలనూ, ఔషదాలనూ, సుఖ సాధనాలనూ, ఎలక్ట్రానిక్ ఉపకరణాలనూ , యంత్రాలనూ కని పెట్టి మానవాళికి అందజేసి తాము ఈ మానవసేవలో తరించిపోయామని తృప్తులయ్యేవాళ్ళు. రెండవరకం.. ఎవరో కనిపెట్టి అందజేసిన సౌకర్యాలను అప్పనంగా అనుభవిస్తూ కనీసం వాళ్ళను తలుచుకోకుండా అలా బతికి బతికి చచ్చిపోయే రకం.

ఈ మొదటి రకం మనుషుల తెగకు చెంది ఒకానొక ఆత్మతృప్తితో జీవిస్తున్న కొద్దిమంది మనుషుల్లో తనొకతి.

కొద్ది కాలం క్రితం ‘ స్పెయిన్ ‘ దేశంలోని బార్సిలోనా లో జరిగిన అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల సదస్సులో జాస్ లూయిస్ కార్డిరో తను రాసిన అత్యాధునిక పుస్తకం ‘ డెత్ ఆఫ్ డెత్ ‘ ను ఆవిష్కరించి ప్రకటించిన మహాద్భుత విషయాన్ని విని ప్రపంచం విస్తుబోయి అవాక్కయిపోయింది. ఆ వేదిక ముందు వరుసలో ఆ క్షణాల్లో తనూ, మరో తమ బృందంలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ గణిత శస్త్రవేత్త డేవిడ్ వుడ్ కూడా ఉన్నారు.

కార్డిరో చెప్పిన సంగతేమిటంటే.. ‘ మనుషులు ఇక ముందు కేవలం ప్రమాదాలవల్ల తప్ప సహజ కారణాలతో, అనారోగ్యంతో చనిపోయే ప్రసక్తే లేదు. అలాగే ముసలితనాన్ని కూడా అనారోగ్యంగా, వ్యాధిగా పరిగణించగలిగితే దాని నివారణకు కూడా రిజువెనేషన్ తో, లాంగివిటీ తో పునర్ యవ్వనాన్ని పొందడం సాధ్యపరుస్తున్నాం ‘ అని. వందలమంది అంతర్జాతీయ మేధావులతో నిండిన ఆ హాల్ కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది ఆ క్షణం.

అంటే తాము మనిషిని మరణమెరుగని అమరుణ్ణీ అమర్త్యుణ్ణీ చేస్తున్నామా. మనిషిని నిత్య యవ్వనునిగా రూపొందిస్తూ భారతదేశ పురాణేతిహాసాల్లో నిర్వచించిన ‘ దేవతలను ‘ సృష్టిస్తున్నామా. ఇందుకుగాను తమ బృందం కనిపెట్టి ప్రస్తుతం ఈ కొలంబియాలో ఒకరిద్దరిపై జన్యు ప్రయోగాలు నిర్వహిస్తున్న ఈ ఔషదమే ‘ అమృతమా’ .

పెర్పెచ్యువల్ లైఫ్, రిజువెనేషన్ టెక్నాలజీస్, రివర్స్ ఏజింగ్, రెజువెనేషన్ మరియు క్రయో ప్రెసెర్వేషన్ వ్యవస్థ రూపకల్పన .. ఇవన్నీ ఆ దిశగా ‘ నానో ‘ సాంకేతికతవల్ల.. అంటే పదీ ఘాతం మైనస్ తొమ్మిది సాంకేతికత వల్ల సాధ్యమౌతున్న మహాద్భుతాలు. రేపు ‘ పికో ‘ అంటే పదీ ఘాతం మైనస్ పన్నెండు , ‘ ఫెంటో ‘ అంటే పదీ ఘాతం మైనస్ పదిహేను ఆధారమైన శాస్త్ర జ్ఞానంతో పరిశోధనలు గనుక కొనసాగితే ప్రపంచం ఇప్పుడున్న పురా స్థితినుండి ఊహాతీతమైన ఉన్నత స్థాయికి ఎదిగి సృష్టికే ప్రతి సృష్టి చేస్తూ.. అనేక సవాళ్ళను విసురుతుంది.

 

జన్యుమార్పిడి , క్రోమోజోన్స్, డి ఎన్ ఎ పునర్నిర్మాణం వల్ల 2045 నాటికి మనిషి మరణాన్నీ, ముసలితనాన్నీ జయిస్తాడని చాలా విశ్వాసంగా ప్రకటించిన జాస్ లూయిస్ కార్డిరో ప్రస్తుతం మసాచుట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో పని చేస్తున్నారు. వెనిజులా దేశంలో స్పెయిన్ దంపతులకు జన్మించిన కార్డిరో, యునైటెడ్ కింగ్ డం లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గణిత శాస్త్రజ్ఞుడు డేవిడ్ వుడ్ .. ఇతను ఇదివరకు ప్రసిద్ధమైన ‘ సింబియన్ ‘ ఆపరేటింగ్ సిస్టం ను కనిపెట్టాడు.. ఇద్దరు కలిసి రచించిన పుస్తకమే ‘ డెత్ ఆఫ్ డెత్ ‘ . ఇది వెంటనే స్పానిష్, ఇంగ్లిష్, పోర్చ్ గీస్, కొరియన్ భాషల్లో వెలువడి.. మిలియన్ల కాపీలు అమ్ముడయ్యింది.

అనూహ్యంగా ముక్త మొబైల్ ఫోన్ మ్రోగింది. అటువేపు నుండి ఈ ప్రాజెక్ట్ లో కీలక పాత్ర వహిస్తున్న ‘ ఏజింగ్ ప్రెజెర్వేషన్ ఫర్ ఆల్ ‘ అన్న పార్శ్వంలో తమతో సహకరిస్తున్న రష్యన్ సైంటిస్ట్ ఎలినా మిలోవా మాట్లాడుతోంది. తెలుసు ఆమెకేమికావాలో ముక్తకు.

” జస్ట్ ఓ పది నిముషాల్లో మీకు ఎలిజబెత్ మార్వినో రిపోర్ట్ పంపిస్తా ” అని రష్యన్ భాషలో చెప్పి గబ గబా బయటకు నడిచి ఓ వంద మీటర్ల దూరంలో ఉన్న ఎలిజబెత్ మార్వినో బిల్డింగ్ దిక్కు నడిచింది ముక్త.

ఎలిజబెత్ మార్వినో తాము ‘ వృద్ధాప్య నివారణ, పునర్యవ్వన సాధన , మరణంపై విజయం ‘ ను సాధించే దిశగా తయారు చేసిన ఔషదాన్ని చాలా ధైర్యంగా తాము చెప్పినట్టుగా పద్ధతిప్రకారం స్వీకరిస్తూ మా శాస్త్రజ్ఞుల బృందానికి పూర్తిగా సహకరిస్తున్న నలభై ఐదేండ్ల బ్రెజిల్ కు చెందిన స్త్రీ. ఆమె చేస్తున్న ఈ ప్రాణత్యాగ తుల్యమైన సహకారానికి తాము చెల్లిస్తున్న ఫీ ఇండియన్ కరెన్సీ లో ఎనిమిది కోట్ల రూపాయలు. ఇప్పటికే ఆమె ఒక సంవత్సర కాలం నుండి తామిస్తున్న ఔషదాన్ని వాడుతోంది. ఎలిజబెత్ లో వచ్చే దినసరి మార్పులను తాము అత్యంత సూక్ష్మంగా పరిశీలిస్తూంటాం ప్రతిరోజూ. ఆ క్రమంలో ఈ మిలోవా ఫోన్.

లోపలికి వెళ్లగానే ఎలిజబెత్ మార్వినో తయారై బయటికి రావడానికి సిద్ధంగా ఉంది.

టైం చూచుకుంటే ఎనిమిదిన్నర. అంటే రోజూ తనదగ్గరికి రెగ్యులర్ గా వచ్చే సమయానికి తయారై ఇక రాబోతోందని అర్థమైంది ముక్తకు. ” గుడ్మార్నింగ్ ” అంది మార్వినో స్పానిష్ భాషలో. ఆమె గొంతు బహు మధురమైంది. మనిషిని చూడకుండా ఒట్టి కంఠాన్నే వింటే ఆమె వయస్సు ఓ ఇరవై ఏళ్ళుంటాయనిపిస్తుంది. చాలా చురుకైన మనిషి. ఆమెకు తన శరీరాన్ని చాలా తాజాగా, చురుగ్గా, అందంగా , ఆకర్షణీయంగా ఉంచుకోవాలన్న ధ్యాస ఎక్కువ. అందుకు ఆహార నియంత్రణ, తగు శారీరక వ్యాయామం, యోగా చేయడం వంటి అన్ని ప్రయత్నాలనూ చేస్తుంది. మంచి పుస్తకాల చదవరి. అప్పటికే ఇద్దరు భర్తలకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటోంది బ్రెజిల్ లోని తీర ప్రాంతం సాల్వెడార్ లో . వృత్తి రీత్యా ఆమె ఒక యాడ్ ఆర్టిస్ట్. సౌందర్య స్పృహ ఎక్కువ.

” గుడ్మార్నింగ్.. నా దగ్గరికే వస్తున్నారా.. రండి వెళ్దాం ” అని స్పానిష్ భాషలోనే జవాబు చెప్తూ దగ్గరికి వెళ్ళి కరచాలనం చేసి ఇద్దరూ కలిసి వెనక్కి తిరిగి లాబొరేటరీ ఉన్న మెయిన్ బిల్డింగ్ వైపు నడవడం మొదలెట్టారు. అంతా చల్లని ప్రశాంతమైన వాతావరణం. పల్చని నీరెండ అంతటా పరుచుకుని, చుట్టూ కొండలతో ఆహ్లాదంగా ఉంది.

” ఎట్లా ఫీలౌతున్నారు.. ఆర్ యు కంఫర్టబుల్ ” ఏదో మాట్లాడాలికదా అని. దాదాపు ఏడాది సాంగత్యం.

” యా..ఈ మధ్య ఎందుకో చాలా ఉత్సాహంగా ఎనర్జిటిక్ గా అనిపిస్తోంది ” అంది చురుకుదనంతో.

మంచి డాక్టర్ తన పేషంట్స్ ను కబుర్లలో పెట్టి కీలకమైన సమాచారాన్ని సేకరిస్తాడు తెలివిగా. ముక్త కూడా అదే పని చేస్తోంది. కాగా దాదాపు ఒక ఏడాది నుండి ఔషదం వాడుతున్నందువల్ల గత మూడు నెలలనుండి ఎలిజబెత్ లో చాలా వేగంగా గుణాత్మకమైన మంచి మార్పులు కనిపిస్తున్నాయి. మొన్ననే ల్యాబ్ లో ఆమె యొక్క మూడు నెలల ‘ రెస్పాన్స్ సమ్మరీ ‘ ని క్రోడీకరిస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు కనబడ్డాయి.

వయసు దాదాపు పదేళ్లు తగ్గింది. అంటే ఆమె చేరినప్పుడు ఆమె 45 ఏండ్ల వయసుతో ఉంటే.. ఇప్పుడు 35 ఏండ్ల స్త్రీ లక్షణాలను కలిగి ఉత్సాహంగా ఉండి. ఎనర్జీ లెవెల్స్ కూడా 35 ఏండ్ల స్త్రీకి ఉండే స్థాయికి వచ్చాయి. మజిల్స్ దృఢత్వం , రిజిడిటీ, బోన్ డెన్సిటీ, మిగిలిన మెడికల్ పరామీటర్స్.. అన్నీ సరిగ్గా పునరాకృతి పొంది ఆమె అన్నిరకాలుగా 35 ఏండ్ల స్త్రీమూర్తిగా మారింది. చూడ్డానికి తగు మోతాదులో సడలి ముడుతలు పడ్డ చర్మం రింకిల్స్ ను కోల్పోయి.. బిగువును సంతరించుకుని వర్చస్సును పొందింది. అన్నింటికంటే ఆంతరికమైన మనస్సు యవ్వనోత్సాహంతో అప్పటి సుఖాలకోసం వెంపర్లాడే తత్వాన్ని రీగెయిన్ చేసుకుంటోంది. అనలిటికల్ రిపోర్ట్స్ ఈ విషయాలనే చెపుతున్నా.. పరిశీలన ద్వారా, ఎలిజబెత్ తన ఫీలింగ్స్ ను చెబుతున్నప్పుడు మామూలుగానే విని గ్రహించడం ద్వారా ముక్త ఆమెలో చాలా వేగవంతమైన ఆశించిన మంచి మార్పులు సంభవిస్తున్నాయని గ్రహించింది .

ఈ రోజు ఆమె రక్త నమూనాలను సేకరించి 35 సంవత్సరాల వయసులో ఉన్న స్త్రీ యొక్క రక్తంలో ఉండే పరామీటర్స్ ఉన్నాయా లేదా అని సూక్ష్మ అధ్యయనం చేయాలె.

” డు యు ఫైండ్ ఎనీ రాడికల్ చైంజ్ ఇన్ యువర్ ఆటిట్యూడ్ .. ఇన్ టర్మ్ స్ ఆఫ్ బిహేవియర్, డిజైర్స్, సెక్స్ వల్ థర్ స్టీ నెస్ ఎట్సెట్రా., ” అనడిగింది ముక్త సూటిగా ఇక ల్యాబ్ లోకి ప్రవేశిస్తూండగా. వెంటనే ఆమెనుండి ఏ జవాబూ రాకముందే ముక్త ఎలిజబెత్ ముఖంలోకీ, ఆమె దేహ భాషలోకీ చూచింది. ఆమె ఆశించినట్టుగానే ఎలిజెబెత్ సిగ్గుతో వయ్యారాలు పోయింది. మనసులో శృంగార కోరికలు ఉధృతమౌతున్నట్టు వ్యక్తీకరణలు ఆమెలో ప్రస్ఫుటపడ్డాయి. కొన్ని విషయాలను ముఖతః వినడంకంటె గమనించి తెలుసుకోవచ్చు వివరంగా. ముక్త ఆనందపడింది తాను ఊహించిన ప్రతిస్పందనే వచ్చినందుకు.

ఈ వయసుకు సాపేక్షమైన మానసిక పరిపక్వతకు సంబంధించిన మార్పులు మనిషిలో పునఃస్థాపన కావడం అనేది నిజంగా ఒక మహాద్భుతమే. ఇప్పుడైతే ఏవేవో మేకప్పులతో, మాదక ద్రవ్యాల ఉపయోగంతో, వయాగ్రా వంటి ఉద్దీపక ఔషదాలతో తాత్కాలిక ఉత్తేజాలను పొందవచ్చుగాని.. శాశ్వతమైన యవ్వన పునఃస్థాపన జరుగడం మనిషి అన్ని విధాలుగా మళ్ళీ యవ్వనుడు కావడం.. ఒక మహా విజయమే. ముక్త ఆ విజయంలో తనకూ భాగస్వామ్యం ఉన్నందుకు ఆనందంతో పొంగిపోయింది.

నిజానికి ఏ జీవి ప్రవర్తనైనా ఆ జీవియొక్క క్రోమోజోంస్, తద్వారా జీన్స్, వాటి సంఖ్య, అమరిక .. వీటి ద్వారానే సంక్రమిస్తుంది. వీటికి అతీతమైన విశేషాలేవీ ఉండవు. కాగా మానవ ప్రవర్తన, రూపురేఖలు, శారీరక దృఢత్వం , తత్వం తదితర లక్షణాలన్నీ కూడా ఈ క్రోమోజోంస్ యొక్క , జీన్స్ యొక్క అమరికను బట్టే ప్రవర్థమానమౌతాయి. ఒక్కోసారి మానవునిలో బయటికి కనిపించే బాహ్య పరామీటర్స్ అన్ని కూడా ఈ జెనెటికల్ నిర్మాణంతోనే నిర్దేశించబడ్తుందని తెలుస్తున్నపుడు మనిషిపై జాలి కలిగి అతీతత వైపు ఆలోచనలు పోటెత్తుతాయి.

సరే.. ఎలిజబెత్ ను పూర్తి నగ్నంగా తయారు చేసి ఒకదాని వెంట ఒకటి ముక్త తానొక్కతే , ఎవరి సహాయమూ తీసుకోకుండా రహస్యంగా పరీక్షలన్నింటినీ నిర్వహించి రీడింగ్స్ అన్నింటినీ జాగ్రత్తగా రికార్డ్ చేసి క్రోడీకరించింది. మొత్తం గంటన్నర సమయం పట్టింది కార్యక్రమమంతా పూర్తయ్యేసరికి. ఎలిజబెత్ కు ” కంగ్రాచ్యులేషన్స్ .. మీరు యవ్వనాన్నీ తిరిగి పొందుతూ క్రమంగా మరణాన్ని జయిస్తున్నారు ” అని చెప్పింది స్పానిష్ లో. అప్పటికింకా నగ్నంగానే ఉన్న ఎలిజబెత్ ఒక్కసారి తన నగ్న శరీరాన్ని మరోసారి ముక్త ముందు తనివిదీరా చూచుకుని మురిసిపోతూ ఆనందాతిరేకంతో పొంగిపోయింది.

” థాంక్యూ ” అంటూ సెలవు తీసుకుని వెళ్లిపోయింది ఎలిజబెత్ పది నిముషాల్లో. ఆమెకు ఇక ఆ రోజునుండి వాడవలసిన ఔషద .. అమృతమనాలేమో ఇక .. ఉపయోగించే పద్ధతిలో వచ్చిన మార్పుగురించి చెప్పి పంపింది

ముక్తకు చాలా ఉద్వేగంగా ఉంది.. ముందున్న ఎలిజబెత్ యొక్క క్రోడీకరించిన గత నెలరోజుల రీడింగ్స్ యొక్క తాత్పర్యాన్ని చూస్తూంటే. దాన్ని కార్డిరో తోనూ, డేవిడ్ వుడ్ తోనూ, ఎలెనా మిలోవా తోనూ పంచుకోవాలనీ.. తమ ప్రయోగం సత్ఫలితాలను ఈ రోజు నికరంగా పొందగలిగినందుకు అందరినీ అభినందించాలనీ, తనను తానుకూడా అభినందించుకోవాలనీ తొందారగా ఉండి.. ఐదు నిముషాల్లో రిపోర్ట్స్ అన్నింటినీ ముగ్గురికీ మెయిల్ చేసింది. ఆ కొలంబియా ప్రయోగశాల ఆవరణలోకి దాదాపు ఏడాది క్రితం 45 ఏండ్ల స్త్రీ గా వచ్చి ఇపుడు 35 ఏండ్ల స్త్రీగా వెళ్తున్న ఎలిజబెత్ ఇంకా నడిచిపోతూ కనిపిస్తూనే ఉంది.

ఏదో తృప్తి కెరటంలా పొంగింది ఆమెలో ఆ క్షణం.

మనిషికి విధేయంగా , హృదయపూర్తిగా చేసిన కృషి సాఫల్యమైనపుడు కలిగే సంతోషం అనిర్వచనంగా ఉంటుంది. ఆ మహదానుభూతినే పొందింది ముక్త ఆ క్షణం.

ఒక్క గంట తర్వాత కార్డిరో నుండీ అటు తర్వాత వుడ్ నుండీ .. మరో అరగంట తర్వాత మిలోవా నుండి కూడా టెలిఫోన్స్ వరుసగా వచ్చి వాళ్ళందరి గొంతుల్లో ప్రతిధ్వనించిన ఆనందోద్వేగాలు ఉక్కిరిబిక్కిచేసినై ఆమెను.

తామందరూ కొన్నేండ్లు కష్టపడి సాధించింది చిన్న విషయం కాదు. రేపు ఈ మహోజ్వల మానవ విజయం ప్రపంచ వేదికపై ఆవిషృతమై మనిషి మరణాన్నే జయించిన వార్త ఒక్కొక్కరిని సంబ్రమాశ్చర్యాలలో ముంచెత్తిననాడు.. తమ సమూహం విజయగర్వంతో పరవశించిపోతుంది.

కాని .. ఈ క్షణం భౌతికంగా ఎవ్వరూ లేరు తన వెంట ఈ ఆనందాన్ని పంచుకోడానికి. ఎటూ తోచక ముక్త ఒక షాంపేన్ బాటిల్ ను ఫ్రిజ్ నుండి తీసుకుని ఎలిజబెత్ క్వార్టర్ వైపు వెళ్ళింది ఒక సాహచర్యం కోసం.. తోడుకోసం.. అనుభూతిని పంచుకోవడంకోసం.

మనిషి యొక్క హృదయ స్పందనలనూ, అనుభూతులనూ, ఉద్వేగ పారవశ్యాలనూ దుఃఖ వివశతలనూ ఔషదాలేమైనా ప్రభావితం చేస్తాయా.?

( మిగతాది వచ్చే పక్షం )

 

రామాచంద్ర మౌళి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు